పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : పుట్టం బుట్ట పద్యార్థ పరామర్శము

“పుట్టం బుట్ట” పద్యార్థ పరామర్శము

- శ్రీ నల్లాన్ చక్రవర్తుల వరదాచార్యులు

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

కడచిన నెల భారతిలో పై శీర్షికలోని పద్యానికి “కుమారదేవ” అనే సాంకేతిక నామంతో ఎవరో అర్థాన్ని వారికి తోచినట్లు పాఠం మార్చి వ్రాశారు. దాన్ని చూసి పోతన మహాకవి నిశ్శరీరాత్మ కొంచెం బాధపడి ఉంటుందని నేనెంతో కటకట పడ్డాను. ఉన్నదానిని మార్చకుండా తెలిసికోగలిగితే మంచిది. లేదా ఎవరివల్లనైనా తెలుసుకోవాలి. అంతేగాని పాఠం మార్చడం చాలా అన్యాయం. దాన్నే పెద్దలు-

సుకవి వచసి పాఠా నన్యథా కృత్య మోహత్
రసగతి మవధూయ ప్రౌఢ మర్థం విహాయ
విబుధవరసమాజే వ్యాక్రియా కాముకానాం
కవికుల విముఖానాం ధృష్టతాయై నమోzస్తు.

అని కోప్పడ్డారు. అంచేత మనం పాఠం మార్చకుండా అర్థం చెప్పుకోవాలి. కాబట్టి నాకుతోచిన విధానాన్ని బట్టి దానికి “మనలో నించుమించందరు జెప్పు కొనెడి యర్థము” ను సమర్థిస్తున్నాను. “శరంబునన్ మొలవ = శరవణభవుడనుగాను” అని “కుమారదేవ” గారు సూచించిన పై యర్థమే చెప్పవలె. ఇప్పుడు “శరవణభవుడు కవి యని గాని పురాణకర్త యని గాని ప్రసిద్ధి యెచ్చటను గనపడక” అనే సంశయం యెదుర్కొంటూంది. దానికి సమాధానం మనవి చేస్తున్నాను.
రాజశేఖరకవి కావ్యమీమాంసలో కావ్యపురుషోత్పత్తిని తెలిపే తృతీయాధ్యాయంలో “పిమ్మట ఆ కావ్యపురుషుడు రోషముతో వెనుకకు మరలి వచ్చెను. ఇతనికి ప్రియమిత్రమగు కుమారస్వామి కావ్యపురుషుని ఈ స్థితిని జూచి సహింపజాలక పెద్దపెట్టున నేడ్చుచుండ సవతితల్లియగు గౌరిచే నిట్లని చెప్పబడినాడు - ”బాబూ! నీ ఊరకుండుము. ఇదిగో నేను నీ మిత్రుని మరల్చి రప్పించెదను.” అని చెప్పి***” అని కావ్యపురుషుడికి, కుమారస్వామికి గాఢమైన మైత్రి ఉన్నట్లు వ్రాసియున్నాడు. కావ్యపురుషుని ఎడబాయజాలనంతమైత్రి కలవాడంటే అతడు గొప్ప కావ్యరసికుడని అర్థం. ఎంచేత అలాంటి అర్థం చెప్పుకోవాలంటే ఆ ప్రకరణంలో వర్ణించిన సందర్భం అంతా విచిత్రమైన అంతరార్థం కలదిగా కనిపిస్తుంది. కావ్య పురుషుడూ, సాహిత్య విద్యావధువూ ఏయేదేశాల్లో ఏయే వేషాలతో ఏయే విధాలైన గీతవాద్యాదులతో విహరించారో ఆయాదేశాల వాళ్ళకు అటువంటి వేషభాషలూ, కవిత్వమూ అబ్బినట్లు వర్ణించినట్లు తేలుతూంది. వైదర్భి, గౌడి, పాంచాలి అనేవి అవే. కాగా ఈ మిథునం విహరించిన దేశాలవాళ్లకే యింత గొప్పతనం రాగా, కావ్యపురుషుని ప్రియమిత్రమని వర్ణించబడిన కుమారస్వామి యెంతటి కావ్యరసికుడై ఉంటాడో ఊహించండి.
ఇంతేకాకుండా షణ్ముఖుని గొప్పపండితునిగా కూడా ఉదహరిస్తున్నారు. రత్నఖేట దీక్షితుణ్ణి గూర్చి చెప్పే చాటువులో—

విపశ్చితా మపశ్చిమే వివాద కేళి నిశ్చలే
*** ఆనమ్ముఖశ్చ ష ణ్ముఖ శ్చతుర్మఖశ్చ దుర్ముఖః

అని షణ్ముఖునికి బ్రహ్మతో పాటు స్థానం యిచ్చారు. అతణ్ణి పండితుడని, కవి యనండి మీ ఇష్టం.
ఆత్రేయ వెంకటాధ్వరి తన లక్ష్మీసహస్రం ప్రారంభ స్తబకంలో మన పోతన మహాకవి చెప్పుకున్న లాంటి సందర్భంలోనే-

చక్షుష్మంత శ్చరణకమలే చక్షుషా శ్రోత్రవంతః
శ్రోత్రే భూమే ర్జనని జగతాం జన్మవంతోzపి నన్మః
వక్త్రాణ్యానన్ భగవతి! న షట్పంచ చత్వారి వా నః
కస్మా దస్మా న్నహసతు జనస్తోష్యత స్త్వద్గుణౌఘమ్

అని వ్రాసాడు. ఇందులో వాల్మీకినీ, షణ్ముఖుణ్ణీ కూడా స్మరించాడు. అంచేత కుమారస్వామియే గ్రంథాన్నీ రచించకపోయినా (ఏమైనా రచించాడో లేదో నేను వెతికి చూడలేదు) కవుల మర్యాదనుబట్టి అతణ్ణీ ఈ వర్గంలో వర్ణించటానికి ఏమీ అభ్యంతరం లేదు.

- (భారతి, డిసెంబరు 1935)