పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : పోతన్నగారూ! మీరు ధన్యులండి!

పోతన్నగారూ! ధన్యులండీ మీరు!

- శ్రీ కరుణశ్రీ!

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

“ఎవరూ? పరమభక్తాగ్రణ్యులైన బమ్మెర పోతన్న గారా! నమస్కార మండీ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు కన్నుల విందుగా కనిపించారు! ఎప్పటినుంచో మిమ్మల్ని సందర్శించాలనీ, పరమపవిత్రమైన మీ పాద పద్మాలు భక్తితో సంస్పృశించాలనీ, ఆప్యాయంగా బుజ్జగించి కవితాసరస్వతి కన్నీళ్ళు తుడిచిన మీ చేతి వేళ్ళు ముద్దు పెట్టుకోవాలనీ, కమ్మని పద్యాలను గుమ్మరించిన మీ గంటాన్ని కన్నుల కద్దుకోవాలనీ ఎంతగానో ఉవ్విళ్ళూరాను. ఎన్నెన్నో కలలు గన్నాను, ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది, నా తపస్సు ఫలించింది. సహజ పాండిత్యులవారు సాక్షాత్కరించారు.
“మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్షిః” అన్న సుకవి సూక్తికి ఉజ్వలమైన ఉదాహరణం మీరు. ”కవిత్వ” మనే పాలల్లో “భక్తి” అనే పంచదార కలిపి భాగవత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృత హస్తం మీది. “బాల రసాల సాల నవపల్లవ కోమల” అయిన మీ కావ్యకన్యక తెలుగు గుండెల్లో “మందార మకరందా”లను చిందించింది. తెలుగు జాతిని ”నిర్మల మందాకినీ వీచికల్లో” ఓలలాడించింది.
”బాలరసాలసాల” అంటే గుర్తుకొచ్చింది. అన్నట్టు పోతన్న గారూ! మీ ఇంటి ముందు నవపల్లవాలతో నవనవలాడే బాలరసాలం ఉంది కదండీ! ఆ గున్నమామిడి క్రింద తిన్నెమీద కూర్చుండేగా మీరు భాగవతం వ్రాసింది! అవునంటారా?
పోతరాజు గారూ! మరొక్క చిన్న సందేహం. ఇదిగో ఇలా చూడండి, మీ అరచేతులు ఆలా కాయలు కాచాయే? హలం పట్టి పొలం సేద్యం చేయడం మూలానా? గంటం పట్టి పద్యం వ్రాయడం మూలానా? అసలు మీరు కవులా? కర్షకులా? లేకపోతే కవి కర్షకులా? కాకపోతే కర్షక కవులా? ఇంతకూ మీకు కలమంటే యిష్టమా? హలమంటే యిష్టమా? కొంచెం సెలవీయండి, ఇదేమిటి వీడు ఇలా అడుగుతున్నాడు అనుకోకండి, మీ అవిరళ కృషి ఆంధ్ర సారస్వత క్షేత్రాలను పదును చేసి కవితాబీజాలు చల్లి బంగారు పంటలు పండించింది గదండీ!
చూశారా మరి! మీరు ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉంటారనుకున్నాను గాని మీ ఫాలాన విభూతి రేఖలూ, కంఠాన తులసి పేరులూ ఉంటాయనుకోలేదండీ! అవునులెండి. హరిహరాద్వైత దృష్టి కదా మీది.
అయ్యా! మీ తండ్రి కేసన మంత్రిగారు శైవాచార సంపన్నులు. మీ తల్లి లక్కమాంబ గారు సదా శివపాదయుగార్చనాపరురాలు. మీ అన్న తిప్పన ఈశ్వర సేవాకాముడు. ఇక మీరో “పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుణ్ణి” అని స్వయంగా చెప్పుకొన్నారు. అటువంటి శైవకుటుంబంలో జన్మించిన మీరు శ్రీరామభక్తులై భాగవతం వ్రాయడం చిత్రంగా లేదండీ!
“అభ్రంకష సముత్తుంగ తరంగ” అయిన గంగలో స్నానము చేసి మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వరధ్యాన తత్పరులై మీరు కూర్వోడమేమిటి? సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు మీ కన్నులముందు సాక్షాత్కరించి ”మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుఁగు సేయు“ మని మీకు ఆనతీయడ మేమిటి? ఎంత చిత్రంగా ఉందండీ! శ్రీరాముడు తనకు అంకితం చేయమన్న భాగవతాన్ని మీరు “హారికి నందగోకుల విహారికి గోపనితందినీ మనోహారీకి” అని షష్ఠ్యంతాలు వ్రాసి శ్రీకృష్ణునికి అంకితం చేయడం అంతకంటే విచిత్రంగా లేదుటండీ! ఇదంతా శివుడికీ - శ్రీరాముడికీ; రాముడికీ - కృష్ణుడికీ భేదం లేదని ధ్వనింపచేయటానికి కాకపోతే మరేమిటంటారు? ఈ పరమార్థాన్నే భాగవత మహాగ్రంథాన్ని ప్రారంభిస్తూ మీరు –

చేతులారంగ శివుని పూజింపఁడేని 
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని 
యయు సత్యంబు లోనుగాఁ లఁపఁడేని 
లుగ నేటికి తల్లుల డుపుచేటు.

అన్న చిన్న గీతపద్యంలో ఎంత చక్కగా నిరూపించారు!
వేపల్లెలో నందులవారి గుమ్మం ముందు దుమ్ములో ఆడుకొంటున్న బాలకృష్ణుని వర్ణిస్తూ –

నువున నంటిన రణీపరాగంబు 
పూసిన నెఱిభూతి పూత గాగ 
ముందర వెలుగొందు ముక్తాలలామంబు 
తొగల సంగడికాని తునుక గాగ 
ఫాలభాగంబుపై రగు కావిరి బొట్టు
కాముని గెలిచిన న్ను గాగ 
కంఠమాలికలోని ననీల రత్నంబు 
మనీయమగు మెడప్పు గాగ 
హారవల్లు లురగహారవల్లులు గాగ 
బాలలీల ప్రౌడబాలకుండు 
శివుని భంగి నొప్పె శివునకు దనకును 
వేఱులేమి తెల్ప వెలయునట్లు,

అన్నారు. ఆ బాలకృష్ణుడికి ఆ భావం ఉందో లేదో కాని శివుడికీ, కృష్ణుడికీ వేఱులేదని తెల్పాలనే భావం మీకు ఉన్నదనడంలో సందేహం లేదండీ! కావాలని వర్ణించిన ఈ సీస పద్యం మీ ఆద్వైత భావానికి మచ్చలేని మచ్చుతునక.
పోతన్న గారూ! మీరెంత ముందు చూపు గలవారండీ! గ్రంథారంభంలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు మొదలైన సంస్కృత కవులకు నమస్క రించారు. బాగుంది. నన్నయ్య గారినీ, తిక్కన గారినీ, ఎఱ్ఱన గారినీ కైవారం చేశారు. ఇంకా బాగుంది, మిగిలిన పూర్వకవు లందరినీ సముచితంగా సంభావించారు. చాలా బాగుంది. చివరకు వర్తమాన కవులకు ప్రియం పలికారు. మరీ బాగుంది. అంతటితో ఊరుకున్నారా! ఎప్పుడో ముందు రాబోయే భావికవులను కూడా భావించి బహూకరించి శుభం పలికిన మీ విశాల హృదయానికి ఈ అయిదువందల ఏండ్లలో జన్మించిన కవులంతా చేతులెత్తి నమస్కరించక తప్పదు. ఏమంటారు?
కవిగారూ! మీరు మీ భాగవతానికి శ్రీకారం చుడుతూనే ”శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్” ఆని లోకరక్షైకారంభకుడూ, భకపాలన కళా సంరంభకుడూ, దానవోద్రేక స్తంభకుడూ, కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాతభవాండకుంభకుడూ అయిన మహానందాంగనా డింభకుణ్ణి సంస్మరిస్తూ వ్రాసిన మొదటి పద్యంలోనే భాగవత మహాగ్రంథంలోని ప్రధాన కథా ఘట్టాలన్నీ స్ఫురించేటట్లు చేశారు. అత్యంత సుందరమై అంత్యప్రాస విలాస విన్యాసాలను వెదజల్లే ఈ పద్యం అనవద్యం. హృద్యం, సహృదయ హృదయైక వేద్యం.
మహాకవీ! లలితస్కంధమూ, కృష్ణమూలమూ, శుకాలాపాభిరామమూ, మంజలతాశోభితమూ, సువర్ణసుమనస్సుజ్ఞేయమూ, సుందరోజ్జ్వల వృత్తమూ, మహాఫలమూ అయిన భాగవత కల్పవృక్షాన్ని తెలుగువారి సొంతం చేసిన మీ ప్రతిభ అప్రతిమానం.
“విద్యావతాం భాగవతే పరీక్షా” అని కొమ్ములు తిరిగిన పండితులకు కూడా “కొరకరాని కొయ్య” అయిన శ్రీమద్భాగవతం మీ అమృతహస్త స్పర్శతో ”బాలరసాలంగా” పరిణమించి పల్లవించి పుష్పించి ఫలించి ఆబాలగోపాలానికీ రసానందాన్ని అందించింది,
చూడండి పోతన్నగారూ! పురాణ గ్రంథాలను ఆంధ్రంలోకి అనువదిస్తూ నన్నయ తిక్కనలు భారత రామాయణాలను మాత్రమే గ్రహించి భాగవతాన్ని నిజంగా మీ కోసమే ఆట్టి పెట్టారండీ! అది కేవలం మీ పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు. ఆంధ్రులందరి అపూర్వ పూర్వ పుణ్య విశేషం. శ్రీమద్భాగవతాన్ని తెనిగించడం మూలాన మీకు మాత్రమే కాదు - ఆ భాగవతానికి కూడా పునర్జన్మ అన్నది లేకుండా పోయింది.

భాగవతము తెలిసి లుకుట చిత్రంబు 
శూలికైన తమ్మిచూలికైన 
విబుధవరుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరుతు, 

అన్న మీ వినయ వినమ్రతకు వేయి నమస్కారాలు. ఎంత చక్కగా పలికారండీ.

లికెడిది భాగవతమట; 
లికించు విభుండు రామద్రుండట; నే 
లికిన భవహర మగునట; 
లికెద వేఱొండు గాథ లుకగ నేలా! 

అవును. మీ పలుకు పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు. మీ దృఢసంకల్పం, మీ ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యాలండీ! పాఠకుల్ని ఉద్దేశించి మీరిలా అన్నారు –

కొంఱకు తెలుగు గుణమగు; 
కొంఱకును సంస్కృతంబు గుణమగు, రెండున్ 
గొంఱకు గుణములగు; నే 
నంఱ మెప్పింతు గృతుల య్యైయ్యెడలన్.

అవునులెండి. “ఉభయ కావ్యకరణ దక్షలు”గదా మీరు. మీకు సాధ్యం కాని దేముంటుంది? ఆక్షరాలా అన్నంత పనీ చేశారు.
భక్తకవీ! మహాభక్తులైన మీరు పొంగి పులకించిన హృదయంతో గజేంద్ర మోక్షంలో, వామన చరిత్రంలో, ప్రహ్లాద వృత్తాంతంలో, రుక్మిణీ కల్యాణంలో, నరకాసురవధలో, కృష్ణలీలల్లో, గోపికాగీతల్లో, కుచేలోపాఖ్యానంలో ప్రతిభాపాండిత్యాలను ప్రదర్శించి మూలాన్ని పెంచి సర్వాంగ సుందరంగా ఆ ఘట్టాలను దిద్ది తీర్చారు. కొన్ని చోట్ల మూలంలోని మూడు శ్లోకాలను ముప్పై మూడు పద్యాలుగా ప్రపంచీకరించారు.
చూడండీ! గజేంద్రమోక్షంలో ఒక చమత్కారం జరిగింది. ”ఆల వైకుంఠపురంబులో - ఆ మూల సౌధంబు దాపల” మందారవనంలోని అమృతసరోవరం ప్రక్కన ఉన్న చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పు మీద కూర్చుండి ఉన్న ఆపన్నప్రసన్నుడు గజేంద్రుడి మొర ఆలకించాడు. చెంతనున్న శ్రీదేవికి చెప్పకుండానే, శంఖ చక్రాలు ధరించకుండానే ఆయన కరిని కాపాడటానికి పరుగెత్తుకొంటూ వచ్చాడు. అవక్రమైన చక్రంతో నక్రం కంఠాన్ని ఖండించి కరిరాజును కాపాడాడు. అంతా సక్రమంగానే జరిగిపోయింది. ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. లక్ష్మీదేవి పైట చెరగు తన చేతిలో ఉన్న దని. శ్రీ హరి ”దరహసిత ముఖకమల” అయిన కమలతో ఇలా అన్నాడు –

బాలా! నా వెనువెంటను 
హేలన్ వినువీథి నుండి యేతెంచుచు నీ 
చేలాంచలంబు పట్టుట 
కాలో నే మంటి నన్ను నంభోజ ముఖీ!

అనగానే “అరవిందమందిరయైన యయ్యిందిరాదేవి మందస్మిత వదనారవింద” యై ముకుందునితో ఇలా పలికింది - “స్వామీ! ఏం చేసేది. మీ పాదాలు సేవించటమే నా కర్తవ్యం. మీరు ముందు పరుగెత్తుతుంటే మీ వెంట నేనూ వస్తున్నాను.” ఇలా పలికించి ఊరుకున్నారా మీరు. ఆ లక్ష్మీదేవిచేత దేవదేవుడికి ఒక యోగ్యతా పత్రం ఇప్పించారు.

దీనుల కుయ్యాలింపను 
దీనుల రక్షింప మేలు దీవన పొందన్ 
దీనావన! నీ కొప్పును 
దీపరాధీన! దేవదేవ! మహేశా!

ఈ విధంగా దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి ఆపద్బాంధవుడుగా భక్తరక్షణ పరతంత్రుడుగా చెప్పించారు. బాగానే ఉంది - కాని ఇక్కడ ఒక్క అనుమానం ఉందండీ. ”అల వైకుంఠపురంబులో” అని యెత్తుకున్నారు మత్తేభవృత్తంలో, ఆ తరువాత శ్రీమహావిష్ణువు పరుగెత్తుకు రావడంతో “సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడు” అని మత్తేభవృత్తాన్నే అనుసంధిందారు. ఆ తరువాత అప్పటి పరిస్థితిని అభివర్ణిస్తూ ”తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధవ్రాతమున్” అంటూ మళ్లీ మత్తేభాన్నే పరువెత్తించారు. అనంతరం ”తన వేంచేయు పథంబు పేర్కొన డనాథ స్త్రీ జనాలాపంబుల్ వినెనో” అంటూ మత్తేభంలోనే మీ భావాన్ని వెలిబుచ్చారు. ఆ పైన ”వినువీథిం జనుదేర గాంచి రమరుల్” అన్న పద్యం కూడా మత్తేభ విక్రీడితమే. అటు పిమ్మట ”చనుదెంచెన్ ఘను డల్లవాడె హరిపజ్జన్ గంటిరే లక్ష్మి” అంటూ మళ్లీ మత్తేభాన్నే నడిపించారు. చివరకు ”కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె” అన్న పద్యంలో కూడా మత్తేభాన్నే పైకెత్తారు. ఈ విధంగా వరుసగా ఈ ఘట్టమంతా మత్తేభమయంగా నడిచిందే. ఇందులో ఏమైనా రహస్యం ఉందా? అని సందేహం. అవునులెండి! మీరెందుకు చెబుతారు. మధురమధురంగా మందహాసం చేస్తున్నారు. పోనీలెండి. నేనిలా ఊహిస్తున్నాను-
మొదట్లో “మత్తేభయూధంబు మడుగు సొచ్చె” అన్నారు కదూ! ఆ మత్తాభాన్ని మకరం పట్టుకుంది కదూ! అప్పుడు మత్తేభం ”రావే యీశ్వర కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా;” అని భగవంతుణ్ణి ప్రార్థించింది. అప్పుడు “మత్తేభరక్షాణాయత్తచిత్తుడై” అడావుడిగా పరుగెత్తుకుంటూ వచ్చిన భగవంతుడి హృదయంలో అడుగడుగునా మత్తేభవృత్తాంతమే మెదులుతున్నది. ఆయన మనస్సు “మత్తేభమయ” మయింది. అటువంటి దేవుణ్ణి మీరు మనస్సులో భావించారు. మీకూ శ్రీహరికీ సాధారణీకరణం ఏర్పడింది. అందువల్ల గంటంలో అడుగడుగునా ఒకదానివెంట ఒకటిగా మత్తేభవృత్తాలే దొరలి దొరలి వచ్చాయి. ”పలికించెడు వాడు రామభద్రుడే” కదండీ. ఏమంటారు? లేకపోతే అనుకోకుండా అన్ని మత్తేభాలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
పోతన్నగారూ! మీరు సహజపాండిత్యులు. మీకు గోపాలుడంటే ఎంత ఆదరమో గోవులన్నా అంత అనురాగం. గోపాలకృష్ణుని చేత ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క అందమైన పేరుపెట్టి ఆప్యాయంగా పిలిపించడమంటే మీ కెంత సంతోషమో మాకు బాగా తెలుసు.

రా పూర్ణచంద్రికా! రా గౌతమీగంగ! 
మ్ము భగీరథరాజతనయ! 
రా సుధాజలరాశి! రా మేఘమాలిక! 
మ్ము చింతామణి! మ్ము సురభి! 
రా మనోహారిణి! రా సర్వమంగళ! 
రా భారతీదేవి! రా ధరిత్రి! 
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!
మ్ము మందాకిని! రా శుభాంగి! 

అబ్బ! ఎంత చక్కని పేర్లు పెట్టించారు. ఎంత చక్కగా పిలిపించారు. ఆ ఆవులకు కూడా ముద్దుల గోపాలుని మురళీగానమంటే ఎంత ఆనందమో! ”చతుర నటమూర్తి” అయిన ఆ ”గోపాల చక్రవర్తి” వేణువును మధురాధరం మీద చేర్చి ”బ్రహ్మగాంధర్వ గీతాన్ని” ఆలపించగా బృందావనం పులకించింది. కాళింది పొంగి పొరలింది. ప్రకృతి పరవశించింది, లేళ్లు మైమరచాయి. మోళ్ళు పల్లవిందాయి. రాళ్లు ద్రవించాయి. ఆవులన్నీ మేతలు మాని “మమతన్ మోములు మీదికెత్తుకుని, రోమంధంబు చాలించి” ఆనందబాష్పాలు కారుస్తూ నిశ్చలంగా నిలబడి ఆలకించాయి కదూ! ఇక గోవత్సలంటారా! ”తల్లుల చన్నుబాలు” త్రాగడం మానేసి కదలకుండా తదేకధ్యానంతో అదే పనిగా ఆ మురళీధరుడి ముద్దులమోము వంకే చూస్తున్నాయి కదూ!
అన్నా! పోతన్నా! ఆ మాధవుడి మధురమధుర వేణుగానంలో మైమరపించి పాప మా అమాయికలైన గోపికలను ఎన్ని తిప్పలు పెట్టించావయ్యా! చూస్తూ చూస్తూండగానే ఆదృశ్యమైపోయిన ఆ వంశీధరుడి కోసం –

 

”పున్నాగ కానవే పన్నాగవందితు.
తిలకంబ కానవే తిలకనిటల” ఆనీ.
“మానినీ మన్మథు మాధవు గానరే
సలలితోదార వత్సకములార!” అనీ
”ఆదె నందనందనుం డంతర్హితుండయె
పాటలీతరులార! పట్టరమ్మ!”అనీ

”ఓ మల్లియలార! మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే!” అనీ” బృందావనంలోని చెట్టు చెట్టుకూ గుట్ట గుట్టకూ తిరిగి తిరిగి విసిగిపోయారే ఆ కుసుమకోమలులు!
పోతన్నగారూ! మీ భాగవతంలోని పాత్రలు మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాయి. ”నీకున్ మ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ” అని కృష్ణుణ్ణి ప్రార్థించే కుంతీదేవీ, ”నా తోడన్ ప్రతిభాషలాడెదు! జగన్నాథుండ, నాకంటె నీ భూతశ్రేణికి రాజు లేడొకడు” అని ప్రహ్లాదుణ్ణి గద్దించే హిరణ్యకశిపుడూ, ”తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వేయేటికిన్” అని పలికే దానవీరుడు బలిచక్రవర్తీ, ”అమ్మా! మన్ను దినంగ నే శిశువునో ఆకొంటినో వెఱ్ఱినో” అని తల్లి దగ్గర ముద్దులు గురిసే బాలగోపాలుడూ, ”ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర యిమ్ము” అంటూ బలిచక్రవర్తిని చేజాచి యాచించే చిట్టిపొట్టి వామనుడూ, ”కలడు కలం డనెడి వాడు కలడో లేడో!” అని నక్రానికి చిక్కి ఆక్రోశించే గజేంద్రుడూ, ”చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!” అని కన్నతండ్రికి సమాధానం చెప్పే ప్రహ్లాదుడూ, ”నవనీతంబుల ముద్ద కాదు వినరా నా ముష్టి గోపార్భకా!” అని బారలు దాచే చాణూరమల్లుడూ, “తాటంకాచలనంబుతో భుజనటద్దమ్మిల్లబంధంబుతో” పతి వెంట పరువెత్తుకు వస్తున్న శ్రీదేవీ, “నా దయితు కట్టనేటికి శ్రీ దయితా చిత్తచోర! శ్రితమందారా!” అని శ్రీహరిని కన్నీళ్ళతో ప్రశ్నిస్తున్న బలిచక్రవర్తి భార్య వింధ్యావళీ, ”విచ్చేయుము తల్లికడుపు వెడలి ముకుందా!” అంటూ దేవకీగర్భస్థుడైన దేవదేవుణ్ణి చేతులు మోడ్చి ప్రార్థిస్తున్న ముక్కోటి దేవతలూ, ”గుఱ్ఱము గొనిపో ముద్దుల కుఱ్ఱడ!” అని సగర పౌతుడైన అంశుమంతుణ్ణి ఆప్యాయంగా అభినందిస్తున్న కపిల మహర్షి, ”అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి త్రావు మన్న” అంటూ తన ప్రాణాన్ని కూడా లెక్కించకుండా తన దగ్గర ఉన్న కాసిని నీళ్లూ అతిథికి ధారపోస్తున్న రంతిదేవుడూ, ”వీడటే రక్కసి విగతజీవగ చన్నుబాలు త్రాగిన మేటి బాలకుండు” అని మేడల మీద నుంచి కుతూహలంతో కృష్ణుణ్ణి చూస్తున్న మధురానగర నారీమణులూ, ”ముని నీరు సొచ్చి వెడలడు చనియెడు ద్వాదశియు” అని ద్వాదశీవ్రతభంగానికి ఆందోళనచెందే అంబరీషుడూ, ”మన సారథి మన సచివుడు... మనలను విడనాడి చనియె మనుజాధీశా!” అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నగారికి కృష్ణనిర్యాణం విన్నవిస్తున్న అర్జునుడూ, ”వీ రెవ్వరు శ్రీకృష్ణులు కారా! ఎన్నడును వెన్న గాన రటగదా!” అంటూ వెన్నదొంగను వెన్నాడి పట్టుకొని కట్టనుంకించే యశోదమ్మా, ”ఆసురకృత్యంబు ధర్మమగునే? తండ్రీ!” అని పుత్రఘాతి అయిన అశ్వత్థామను ప్రశ్నిస్తున్న పాంచాల రాజపుత్రీ, ”నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తాపసమందార! నాకు దయసేయగదే” అని గోపాలదేవుణ్ణి ప్రార్థించే సుదాముడూ, ”ఘనుడా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో” అని శ్రీ కృష్ణుడి రాక కోసం వేయి కన్నులతో నిరీక్షించే రుక్మిణీకన్యా, “అన్న! శమింపుమన్న! తగ దల్లుడు గాడిది మేనకోడలౌ” అని కంసుణ్ణి బతిమాలే దేవకీదేవీ, “వనితా! ఏమి తపంబు చేసెనాకొ ఈ వంశంబు వంశంబులోన్” అని మురళిని చూచి గ్రుక్కిళ్లు మింగుతున్న బృందావన గోపికా మా కన్నులముందు కలకాలం కదలాడుతూనే ఉంటారు.

పోతన్నగారూ! ధన్యులండీ మీరు!

భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో 
పాలకృష్ణుని కుండలాలకాంతి 
రిరాజు మొర వెట్ట రువెత్తు కరివేల్పు 
ముడివీడి మూపుపై బడిన జుట్టు 
మరంబుగావించు త్య కన్నులనుండి 
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు 
కొసరి చల్దులు మెక్కు గొల్లపిల్లవ్రేళ్ల 
సందు మాగాయ పచ్చడి పసందు 
పుడు కనుగొంటివయ్య? నీ కెవరు చెప్పి 
య్య! ఏ రాత్రి కలగంటియ్య! రంగు 
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు 
హజపాండితి కిది నిదర్శన మటయ్య!

మీ క్రాంత దర్శిత్వానికి కైమోడ్పులండీ!
అన్నగారూ! మీరన్నా మీ భాగవతమన్నా మాకెందుకండీ యింత యిష్టం! నిజంగా ఇది మా జన్మజన్మాల అదృష్టం! మీ కవిత చిరంజీవిని, లోకపావని. ఆ “జగన్మో హిని” కి ఆ “పుల్లాబ్జక్షి”కి ఆ ”సరస్వతి”కి ఆ “భగవతి”కి ఆ “పూర్ణేందుబింబానన”కు ఇవే మా శతసహస్ర ప్రణామాలు.
(ఆంధ్రజ్యోతి, 14. 3. 1982)