పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : పోతన జన్మస్థలము

భాగవత జయంతిక

పోతన జన్మస్థలము - శ్రీ కందుకూరి వీరేశలింగమ

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

శ్రీ మద్భాగవతము నాంధ్రీకరించిన బమ్మెర పోతరాజు ఒంటిమిట్ట వాఁడని కొందఱును, ఓరుగంటి వాడని, కొందఱును కొంతకాలము నుండి పరస్పర విజయార్థులై పట్టుదలతో పోరాడుచున్నారు. నే నాంధ్రకవుల చరిత్రమును వ్రాసినప్పుడు తెలుఁగు భాగవతమును ముద్రించినవారు తమ పీఠికలో వ్రాసిన దానిని నమ్మి పోతన యొంటిమిట్టవాఁడనియే చెప్పితిని గాని యిటీవల బైలువెడలిన వాదానువాదములను బట్టి నా తొంటి యభిప్రాయమును మార్చుకొని యోరుగంటివాఁడని నే నీ నడుమ సంస్కరించి ప్రకటించిన కూర్పులోఁ బ్రచురించిన వాఁడనైతిని. అట్లు చేసినందులకై బ్రహ్మశ్రీ వావిలికొలను సుబ్బారావుగారు నన్ను బహువిధముల దూషించి పరిషత్పత్రికలో నొక వ్యాసమును వ్రాసి ప్రకటించిరి. దూషణము లెప్పుడును వాద దౌర్భల్యమునకు సూచనలగుట విచారించి వారి దూషణవచనముల నాశీర్వాదములుగా స్వీకరించి సత్యగ్రహణపరాయణులగువారి యుపయోగార్థముగా నా పూర్వాభిప్రాయమును మార్చుకొనుటకుఁ గల యాధారములను సంక్షేపించి వ్రాయుచున్నాను.
పోతనార్యుని భాగవతములో నొంటిమిట్ట యనిగాని, యోరుగల్లని గాని లేదు. “ఒక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకం గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి” అని యేకశిలానగర మని మాత్రము చెప్పఁబడినది. దీనినిబట్టి యిందుఁ బేర్కొనఁబడిన యేకశిలానగర మేది యని నిర్ణయింపవలసియున్నది. శిలా తామ్రశాసనములయందును, పూర్వగ్రంథముల యందును ఓరుగంటికే యేకశిలానగరనామము వ్యవహరింపఁబడి యుండుట నిర్వివాదాంశము. ఏకశిలానగర నామ మొంటిమిట్ట కే శాసనమునందును ఏ గ్రంధమునందును వాడఁబడలేదు. నూఱుసంవత్సరమువ క్రిందట మెకాంజీగారు గ్రామస్థుల వలన కైఫీయతులు మొదలైనవానిని సంగ్రహించి కూర్చిచేర్చిన స్థానికచరిత్రముల (Local Records ) లోని యొంటిమిట్ట కైఫీయతులలోను శాసనములలోను ఒంటిమిట్ట కొంటిమిట్ట యన్న పేరేకాని “యేకశిలానగర' మన్న పేరెక్కడను గానఁబడదు. అంతేకాక యొంటిమిట్ట యను పేరాగ్రామమున కొంటఁడు, మిట్టఁడు నను బోయలవలన వచ్చినదని కూడ చెప్పఁ బడినది. ఓరుగంటి ప్రతాపరుద్రుని కాలములో ననఁగా మన పోతన్నకు నూఱు సంవత్సరములు ముం దోరుగంటి యందే వాసము చేయుచుండిన విద్యానాథకవి తన ప్రతాపరుద్రీయములో “రాజ న్నేకశిలానగరాధీశ" యని యనేక స్థలములలో నోరుగంటి "నేకశిలానగర“ మని వాడియున్నాడు. ఒంటిమిట్టలో నున్న కవులలో నొక్కరును ఒంటిమిట్ట నేక శిలానగరమని చెప్పలేదు. ఒంటిమిట్ట కవులలో మొదటివాఁడగు తిప్పనామాత్యుఁడు తన శతకములో నొంటిమిట్ట రఘువీరుఁ డనియే చెప్పెనుగాని యేక శిలానగర నామ ముచ్చరించలేదు. ఒంటిమిట్ట రఘువీర శతకములో రెండు పద్యములనిం దుదహరించుచున్నాను

కారుణ్యోదయ! యొంటిమిట్టపురి నాథా! నీకు నేఁ బద్యముల్
నూఱుం జెప్పిన నూరుఁబేరు వెలయున్ నూత్నంబుగా; నంతనా
నోరుం బావనమౌను ;నీ కరుణఁ గాంతున్ భక్తి నన్నందఱున్
రా మ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా!

తులప్రౌఢిమ మీఱు రాయకవి యయ్యల్రాజు సత్పుత్రుఁ డం
చిభక్తిం ద్రిపురాంతకుండు రచియించెన్ దెన్గు పద్యంబులన్
కం బొక్కటి; దీని నీవు విని యాచంద్రార్కమై నిల్పు ప
ర్వకన్యానుత! యొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా!

ఈ కవికాలములో నొంటిమిట్ట యందున్న దేవుఁడు కోదండరామస్వామియే యై యుండిన యెడల శతకమకుటమునందు “గుణధామా! మహదొంటిమిట్టనగరీ కోదండరామా! ప్రభూ!“ అని వేసియుండును.
రెండవ కవియైన యయ్యలరాజు రామభద్రకవి తన రామాభ్యుదయాశ్వాసాంత గద్యమునందు సంస్కృత సమాసమున సహితము “శ్రీ మదొంటిమిట్ట రఘువీర శతక నిర్మాణకర్మఠ జగదేకఖ్యాతి ధుర్యాయ్యలరాజు తిప్పయ మనీషి పర్వతాభిధాన పౌత్ర “ యనియే చెప్పెనుగాని యేక శిలానగర మని చెప్పలేదు.
ఏక శిలానగర శబ్దార్థమును బట్టి విచారించినను “ఒక్క రాయి“ యని. యర్థ మిచ్చు నోరుగంటి కది చెల్లును గాని “యొక్క కొండ“ యని యర్ధమిచ్చు నొంటిమిట్టకుఁ జెల్లదు. శిల యనఁగా శైల మనియు శైల మనఁగా శిల. యనియు నర్థము చెప్పెడు బుద్ధిమంతుల యర్థమెంత యుక్తియుక్తమైనదో మతిమతు లూహించి తెలిసికోఁ గలరు. అట్టివారి మతమును బట్టి శ్రీశైలమునకు శ్రీపర్వతము శ్రీనగరము గాక శ్రీశిల యని చెప్పవచ్చును కాబోలును! అట్లనవచ్చినచో దన్మతానుసారిగా రుబ్బురాతిని రుబ్బుకొండ యనియు, రుబ్బుశైల మనియుగూడ చెప్పవచ్చును. ఒంటిమిట్ట కేకశిలానగరనామము సమర్థించుటకై గ్రామదేవాలయసమీపమున నొక మెట్ట యుండుటచేత నా పేరు వచ్చినదని యొక చోటను; దేవాలయములోని సీతారామలక్ష్మణ విగ్రహములు మూఁడును నొక్క రాతితోఁ జేయఁబడి యుండుట చే నా పేరు కలిగినదని వేఱొకచోటను చెప్పి యున్నారు. దేవాలయములోని విగ్రహములన్నియు, నతుకులు లేక యేక శిలతోనే చేయఁబడియుండును గాన గ్రామములన్నియు నేకశిలానగరములే కావచ్చును - ఇది యిట్లుండగా స్థల చరిత్ర మా పే రొంటఁ డు, మిట్టఁడు నను బోయల పేరును బట్టి కలిగినదని చెప్పుచుండుటచేత నీ రెండు వ్యుత్పతులును గూడ పొసఁగక పోవుటయేకాక యేక శిలానగరనామ మొంటిమిట్ట కసలే పనికిరాని దగును.
పేరులకై పెనఁగులాడెడి యీ శుష్క వాదము నింతటితో విడిచి పెట్టి యిఁక బమ్మెరపోతరాజకృత గ్రంథములవలన నీ విషయమేమైన తేలునేమో చూతము. పోతన చేసిన గ్రంథములు నాలుగు వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము, భాగవతము. ఈ నాలిగింటిలో ముందుగా నేకశిలానగర నామమును జెప్పిన భాగవతమును గూర్చి విచారింతము, ఓరుగ ల్లేకశిలానగర మగుట భాగవతరచనకు పూర్వమే సుప్రసిద్దము కావున భాగవతమునందు బేర్కొనఁబడిన యేక శిలానగర మోరుగల్లే యని విశేషవిచార మక్కఱలేక యే స్థూలబుద్ధికి సహితము గోచరమగును, అది యట్లుండగా భాగవతమును బట్టి యేకశిలా నగరము గంగకు కొన్ని దినముల ప్రయాణములో నన్నట్లు కనఁబడుచున్నది. గంగ యను పేరు గౌతమికిని భాగీరథికిని గూడనాంధ్రదేశమున సామాన్యముగా వ్యవహారమందున్నది. రాజమహేంద్రవర ప్రాంతమున గౌతమీనది సాధారణముగా గోదావరి యను నామముతో వ్యవహరింపఁబడు చున్నను ఓరుగల్లు ప్రాంతమున సామాన్యముగా గంగ యను పేరితోనే వ్యవహరింపఁబడుచున్నది. అందుచేత నేకశిలానగరమే యోరుగల్లయ్యెడు పక్షమున నక్కడకుఁ గొన్నిదినముల ప్రయాణములో నున్న గంగ భాగీరథికాక గౌతమియే యగును. ఈ గంగకు కొన్ని దినముల ప్రయాణములో నున్నదగుటచే నేకశిలానగరనామ మోరగల్లునకే చెల్లునుగాని యొంటిమిట్టకు గాని- తన్నామమును ధరించిన యే యితరపురమునకుఁగాని చెల్లదు.
ఒంటిమిట్టకు సమీపమునఁ గొన్నిదినములలోఁ జేరఁదగిన నది యేదియు లేదు, వ్యవహారములో లేకపోయినను నేదో స్థలమాహాత్మ్యములో గంగ యనఁబడిన పినాకినీనది యొంటిమిట్టకు సమీపములో నున్నను ఆ పెన్న యొంటిమిట్టకు భాగవతములోఁ జెప్పఁబడినట్లు కొన్ని దినముల ప్రయాణములో లేక కొన్ని గంటల ప్రయాణములోనే యున్నందున నందుఁ బేర్కొనఁబడిన గంగ పెన్న గాదనుట నిశ్చయము. సామాన్యముగా జలసామాన్యమును 'గంగ' యని జనులు వ్యవహరింతురు గాన నందుదాహరింపబడిన గంగ కొన్ని దినముల ప్రయాణములో నున్న యే చెఱువునీరో యే యేటినీరో యను విద్వాంసులకు సమాధానము చెప్పట నావంటి మితజ్ఞునకు సాధ్యము కాదు. కొన్ని దినము లనఁగా నెన్ని మాసములై నను కావచ్చునను పండితులను సమాధానపఱచుటయు నసాధ్యమే. పినాకిని యన్న పేర రెండు నదుల కున్నప్పు డుత్తర పినాకిని దక్షణ పినాకియని పిలుచుకున్నట్లుగానే గంగ యను పేరు రెండు నదులకు సామాన్యమై యుండుట చేత నుత్తరమున నున్న భాగీరథి నుత్తరగంగ యనియు దక్షిణమున నున్న గోదావరిని దక్షిణగంగ యనియు పిలుచుట వాడుకయై యున్నది. అయినను గోదావరిని దక్షిణ శబ్దప్రయోగము లేక కేవలము గంగయని పిలుచుటయు వాడకలోఁ గలదు.
పోతనతోడి సమకాలికుడైన శ్రీనాథ మహాకవి రాజమహేంద్రవరమును వర్ణించుచు - "ప్రవహించు నేవీటి పశ్చిమప్రాకార, మొరసి గంగమ్మ సాగరము కొమ్మ" అను సీసపాదమున గోదావరిని గంగ యని చెప్పియున్నాడు, గోదావరీ నామముతో గౌతమిని సాధారణముగా వ్యవహరించు రాజమహేంద్రవరములో నున్న శ్రీనాథుఁడే దక్షిణశబ్ధవిరహితముగా వాడినప్పుడు, గంగ యనెడి యేకనామముతోనే వ్యవహరించు దేశమునం దుండిన పోతనామాత్యుఁడు దక్షిణ గంగ కనక "యభ్రంకషశుభ్రసముత్తుంగభంగ యను గంగ" కని ప్రయోగించుటలో వింత యేమున్నది? దక్షిణపదాను పూర్వకముగా ప్రయోగించినను ప్రయోగింపవచ్చును, దక్షిణపదమును విడిచి ప్రయోగించినను ప్రయోగింపవచ్చును. "దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు" నని నన్నయ భట్టారకుఁడు దక్షిణశబ్దపూర్వకముగా ప్రయోగించెను.
భాగవత భాగములను రచించిన బమ్మెరపోతన్న యొక్కయు, వెలిగందల నారాయణకవి యొక్కయు, ఏర్చూరి సింగన్న యొక్కయు గృహనామములు గల యూ ళ్ళోరుగంటికి సమీపములో నుండుటచేత భాగవతోదాహృతమైన యేకశిలానగర మోరుగల్లే యని సిద్ధాంతమగుచున్నది. ఓరుగల్లు కాదని యొంటిమిట్టనే సిద్ధాంతము చేయు తలఁపుతో ఈ నామములకు ప్రతిగా ఏర్చూరున కేల్చూరును, వెలిగందలకు వెలిగండ్లయు మేనమామ పోలికగల రెండు గ్రామముల నొంటిమిట్టకు చేరువనుండు వాని నొంటిమిట్ట వారు కష్టపడి కనిపెట్టఁగలిగిరి గాని ప్రధానగ్రామమైన బమ్మెరతోడి సమానాక్షర సంబంధము గల గ్రామకల్పమును దేనిని తత్సమీపమునఁ గనిపెట్టఁజాలక. బొమ్మవరమును బమ్మెర యందుమనిరి. బొమ్మెర బమ్మెర కాదని వాదించెడి యీ ఘనులకు తక్కిన యక్షరముల మాట యటుంచినను"బొమ్మెరలో మొదటి నున్న బొకారముతో నారంభమయ్యెడు బొమ్మవరము నెట్లు చెప్ప సాహసము గలిగెనో! ఈ పే రొంటిమిట్టవాదులకే సరిపడక దానిని గప్పిపుచ్చుటకై బమ్మెర యూరిపేరే కాదనియు, పోతన పూర్వు లూరూరు తిరుగువా రగుటచే భ్రమణశబ్ధభవమైన బమ్మెర వారియింటిపే రయ్యె ననియు అపూర్వపాండిత్య ప్రభావులైన యొంటిమిట్టవాదులు తమ పాండిత్య విశేషముచేత విశేషారర్థకల్పనము చేసిరి. బమ్మెర గ్రామమగునో కాదో పూర్వకవి యైన పట్టమట్ట సరస్వతీ సోమయాజి కృతమైన "పృథుచరిత్రము" లోని యీ క్రింది పద్యమును జదివి వారు గ్రహింతురు గాక!

రుల కసాధ్యమై పరఁగు భాగవతంబు రహస్య మంతయున్
రి కృపచే నెఱింగి మృదులాంధ్రవచోరచనాచమత్క్రియా
ణమహాప్రబంధమునుగా రచియించిన భానుతేజు బ
మ్మెపుర పోతరాజ నసమీకృతభోజు నుతింతు నెంతయున్.

గ్రామనామము బొమ్మెర యని వాడుక లో నుండుటచే నది బమ్మెరకాదని వాదించుచున్నారు గదా, ఓరుగంటివైపు వారు బమ్మెరపోతరాజు నిప్పటికిని బొమ్మెర పోతరాజనియే చెప్పుచున్నారు. తొంబది సంవత్సరముల క్రిందట ననఁగా 1829 వ సంవత్సరమునం దింగ్లీషున దక్షిణహిందూస్థాన కవుల చరిత్రమును ప్రకటించిన కావలి వేంకటరామస్వామిగారు పోతరాజు గృహనామము బొమ్మెరవారని వ్రాసియుండుట మీరు చూచియుండలేదా? ఇంతకును మీ రేకశిలానగర మనెడిది వంటిమిట్టా? ఒంటిమిట్టా? "వంటిమిట్టలోను వసతిగాను" అని స్థలపురాణములో వకారాదిగా నున్నప్పుడు బమ్మెర బొమ్మెర కాదని వాదించెడు మీరు వంటిమిట్టయే యొంటిమిట్ట యని యెట్లు చెప్పుదురు? గ్రామము వంటిమిట్టయే యైన పక్షమున దాని కేకశిలార్ధమే రాక మీ వాదము నిర్మూలమగును గదా!
భాగవతములో కవి వ్రాసిన రెండు ముక్కలను బట్టియే యేకశిలానగర మోరుగల్లనుటయే సంభావ్యముగా నున్నది. ద్వాదశ స్కంధములలో దేనిలోను కృతిపతియగు రాముని సంబోధించుటలో నొకచోటనైనను ‘నొంటిమిట్ట కోదండరామా’ యని కాని తుదకు కోదండరామా! యని కాని లేకపోవుటచేతనే పోతనార్యుని యిష్టదైవతము సాక్షాద్రామమూర్తియే కాని యొంటిమిట్టలోఁగాని మఱి యే గ్రామములోఁ గాని యుండిన యర్చావిగ్రహము కాదని స్పష్టపడుచున్నది. పోతరాజు తనకు ప్రత్యక్షమైనట్లు చెప్పిన రాజముఖ్యుని వర్ణనను బట్టియైనను పూర్వచరణములోని- "వల్లీయుత తమాలవసుమతీజము భంగి, బలువిల్లు మూఁపున బరఁగువాఁడు" అను దానిని బట్టి కోదండరాముఁడని యూహించుట కంటె ప్రథమ చరణములోని "మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి, నువిద చెంగట నుండ నొప్పువాని" అను దానిని బట్టి సీతారాముఁడని యూహించుట యధికవిశ్వాసయోగ్యము కాదా! పోతన విరచిత నారాయణ శతకములోని యీ క్రింది పద్యము వలనఁగూడ భాగవతమునఁ బేర్కొనబడిన యేకశిలానగర మోరుగల్లే యని యూహింపఁబడఁగి యుండలేదా?

రాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్
విరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్
టం బింతయు లేక దండధరుకుం ట్టీక రక్షింపుమీ
కృకుం బాత్రుఁడనయ్య ధర్మపురి లక్మీనాథ! నారాయణా!

ఇందలి ధర్మపురి నైజాము రాజ్యములో మంథెన సమీపమున గోదావరి తీరమునం దున్నది. పోతన భాగవతమునఁ జెప్పఁబడినట్లు చంద్రగ్రహణ పుణ్యకాలమున గంగాస్నానార్ధము పోయిన దీ పట్టణమునకే యైయుండును. మహేశ్వరధ్యానంబు చేసి కించి దున్మీలితలోచనుండై యుండినప్పుడు రామభద్రుఁడు కవికిఁ గన్నుఁగవ కెదుటఁ గానఁబడుట యిచ్చటనే యైయుండును. అందుచేత నావఱకు శివభక్తుఁడై యుండిన పోతనార్యుఁ డాకస్మికముగా విష్ణుభక్తుఁడుగా మాఱి యాయూరి నారాయణునిపై నక్కడనే నారాయణ శతకమును జెప్పియుండును. ఆక్కడనుండి మరలి కొన్ని దినములలో నేకశిలానగరమునకు వచ్చి శ్రీకృష్ణస్తుతితో భాగవతపురాణాంధ్రీకరణము నారంభించియుండును. ధర్మపురీశ్వరునిఁ బేర్కొనుటచే బమ్మెరపోతరాజు స్నానమునకుఁ బోయినది యా పురముకడ నున్న గౌతమీగంగకే యనియు, గోదావరి నుండి కొన్ని దినములలో వచ్చిన యేకశిలానగర మోరుగల్లే యనియు సులభముగాఁ దెలిసికోవచ్చును. ఈ పుస్తకద్వయమునకు ముందుగా రచియింపఁబడిన భోగినీ దండకమునఁ బేర్కొనఁబడిన సింగమనాయుడు గోలుకొండ రాజ్యములోని రాచకొండ, మెతుకు సంస్థానాధీశ్వరుఁడగుట కూడ బమ్మెర పోతరా జొంటిమిట్ట నివాసి కాఁడనియు, నోరుగల్లనబరఁగిన యేకశిలానగర వాసియే యనియు ఘోషించుచున్నది.
పోతనార్యుఁడు ప్రప్రథమమున రచించిన శైవగ్రంథమగు వీరభద్ర విజయము గూడ కొంతవఱ కాతఁ డోరుగల్లు పుర వాసియని స్థాపించుచున్నది. ఈ గ్రంథము కవి మిక్కిలి చిన్నవాడై శైవమత పక్షపాత మధికముగా కలిగి యుండిన కాలములో చేయబడినది. మతగురువైన యివ్వటూరి సోమనారాధ్యుఁడు కవి నుద్దేశించి చెప్పినట్లున్న వీరభద్రయములోని యీ క్రింది పద్యము గ్రంథరచనారంభకాలము నాటికి పోతనార్యుఁడు పిన్నవాఁడని స్పష్టపఱచుచున్నది.

పిన్నఁవాడ ననియుఁ బెక్కు సత్కృతులను
విననివాఁడ ననియు వెఱపు మాను
త్ప్రసాదదివ్యహిమచే నెంతైనఁ
విత చెప్ప లావు లుగు నీకు.
పోతన కులగురువైన సోమనారాధ్యుని యింటి పేరు ఇవ్వటూరి వారు. ఇది గ్రామనామ మగుటకు సందేహము లేదు. ఇవ్వటూ రోరుగల్లు పట్టణమునకు ముప్పది మైళ్ళ దూరములో నున్నది. అందుచేత-

"అనఘుఁ డివ్వటూరి యారాధ్యచంద్రుండు
సోమనాథసముఁడు సోమవిభుఁడు"

అని కవి వర్ణించిన సోమనారాధగురుఁడును, ఆ గురువుచే వీరభద్ర విజయ విరచనమునకు నియమింపఁబడిన తచ్చిష్యుఁడగు పోతనయును ఓరుగల్లు ప్రాంతమువారని యేర్పడునుగాన భాగవతము నందుఁ జెప్పఁబడిన యేకశిలానగర మోరుగల్లేయని నిశ్చయమగుచున్నది.
(ఆంధ్రవత్రిక సంవత్సరాది సంచిక, 1919 )

*

శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్
లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాతభవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.

క్షోణితలంబు నెన్నుదురు సోఁకగ మ్రొక్కి నుతింరు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.