పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : బాలరసాలసాల పద్యార్ధపర్యాలోకనము

“బాలరసాలసాల” పద్యార్ధపర్యాలోకనము

- శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్యశాస్రి

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

బమ్మెర పోతరాజు మహాకవి. ఈత డొనరించిన పద్య శిరోరత్నము ప్రతి మానవుని శిరోభాగము నలంకరించుచున్నది. అయ్యది యేదియన-

బారసాలసాల నవల్లవకోమల కావ్యకన్యకన్
గూల కిచ్చి యప్పడుపుఁ గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై

ఇందలి కథాసందర్భము బాగుగ గ్రహింపజాలక కొందరీ పద్యరత్నమును సరిగా సమన్వయింపలేకున్నారు. ఆ సమన్వయింప లేకుండుట పండితుల పాండిత్యలోపము వలన కలిగినది కాదు. పూర్వాపరకథా విశేషము బాగుగా గ్రహింపలేకపోవుటచే గలుగుచున్నది. కావున నా కథాసందర్భమెద్దియో యిచ్చట బాగుగ పర్యాలోకింతము.
పోతనార్యుని పూర్వచారిత్రము గొప్పదే కాని వైరాగ్యవంతము కాదు. మొదట ఆయన సరాగియే కాని విరాగి కాదు. భాగవతము రచించు నాటికి పరిపూర్ణ విరాగి యైనాడు. ఈతడు మొదట సరాగియై యున్నప్పుడు “భోగినీ దండకము” అను నొక చక్కని దండకమును రచించి, రావు సర్వజ్ఞ సింగభూపాలుని ఉంపుడుకత్తెకు కృతి యిచ్చెను. తరువాత భగవద్భక్తుడై విరాగియై తాను చేసిన పని మంచిది కాదని గ్రహించుకొని చప్పున మానసమును ద్రిప్పుకొని మంచిమార్గమును స్వీకరించెను. ఇదియే “బాలరసాలసాల” యను పద్యమునకు సరిగా సమన్వయము కుదుర్చునదై యున్నది. లేకుండిన ఈ పద్యమునందలి “కూళ” లెవరో “పడుపుకూ” డెద్దియో మనము తెలిసికొనలేక విహ్వలపడిపోదుము.
ఇప్పుడు “కూళ” సర్వజ్ఞ సింగభూపాలుని ఉంపుడుకత్తె యగు “భోగిని” యనియు, “పడుపుఁ గూడు” ఆమెవలన కలిగిన ఐశ్వర్య మనియు మన మూహించుకొన గలుగుదుము. అంతేకాని పద్యమందు దోష మెద్దియును లేదు.
కావున “బాలరసాలసాల నవపల్లవ కోమలకావ్యకన్యక” యా దండకమనియు, నందలి యా కూళ యా వేశ్య యనియు, ఆ పడుపుగూ డామె వలన వచ్చిన ఐశ్వర్యమనియు మనకు బాగుగా తెలియవచ్చి “బాలరసాలసాల” యను పద్యము హృద్యానవద్య భావభరిత మనియు నిది ప్రతి హృదయకుహరము నందును గనకాక్షరములతో ప్రకాశింప జేయ దగిన దనియు ఇంతటి మనోహర పద్యరాజము మరి యొకటి లే దనియు నిందు మూలమున గ్రహించుకొనవలయును.
“సత్కవుల్. హాలికులైన నేమి గహనాంతరసీమల కందమూలకౌద్దాలికు లైన నేమి” యని కదా పోతనార్యుడు చెప్పినాడు. ఈ మాటల భావమేమంటిరా- ”వడి గల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ!” యన్నట్లు నీచాశ్రయము మానుకొని-

మాతర్మేదిని! తాత మారుత! సఖే తేజ! స్సుబంధో జల!
భ్రాత ర్వ్యోమ! నిబద్ధ ఏష భవతా మంత్యః ప్రణమాంజలిః
యుష్మత్సంగవశోపజాత సుకృతస్ఫారస్థురన్నిర్మల
జ్ఞానా పాస్త సమస్త మోహమహిమా లీయే పరబ్రహ్మణి.

అని చెప్పినట్లుగా వైరాగ్యబోధ బాగుగా గలిగిన తర్వాత “కందమూల కౌద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై” అను నీతిని ఆ పద్యమునందలి చివర వాక్యములు స్పష్టము చేయుచున్నవి. మొత్తము మీద పద్యమంతయు భోగనిరోధకమై పరమార్ధ సాధకమై వైరాగ్య బోధకమై విరాజిల్లుచున్నది.

( ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, ప్రమాది- చైత్ర వైశాఖములు)