పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెఱ పోతన చరిత్రము : బమ్మెఱ పోతన చరిత్రము - 2

భాగవత విమర్శనము
పోతన భాగవతము వ్రాయుచు నొక్కనాడు దన్నుజూచుట కరుదెంచిన శ్రీనాథున కద్దానినిచూపెను.ఆ శ్రీనాథుడు గ్రంథమక్కడక్కడ దిలకించి అందు అష్టమస్కంధములోని గజేంద్రమోక్షసందర్భమున జెప్పిన యీ క్రిందిపద్యమును ముమ్మారు చదివెను.

మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

అట్లు చదివి చెంతనేయున్న పోతన్నను గనుంగొని “బావా! యిదే మిట్లు వ్రాసితివి. ఆయుధములు లేకుండ గజరాజును విడిపింపనేగుటలో నాతని యభిప్రాయమేమి మకరమును చేతులతో గ్రుద్ది జంపదలచెనా? లేక మరేమి చేయదలంచెను?” పోతన యప్పటికేమియు సమాధానమొసంగక నవ్వుచు యూరకుండెను. తదనంతరము శ్రీనాధుడు తనపంక్తిని గూర్చుండి భోజనము చేయుచుండగా తనకేదియో పనియున్న దని చెప్పి వడివడిగా భోజనమంతరించి లేచిపోయెను. వీధిలో నాడుకొనుచున్న శ్రీనాథుని కుమారుని లాలించుచు నెత్తుకొని దీసుకొనిపోయి సమీపమున నున్న మరియొకరి ఇంటిలో నాబాలుని దాచి నూతిపెరటిలోని కరుదెంచి, యొక పెనురాతిని గభాలున నూతిలో నెత్తివైచెను. అంతట పోతన యెలుగెత్తి “బావా! శ్రీనాధా ! రమ్ము రమ్ము” నీ కొమరుఁడు నూతపడినాడు”. అని యఱచెను. శ్రీనాధుడింకను భోజనము జేయుచుండెను. ఆమాట వినబడినంతనే విస్తరినుండి గభాలున లేచి చేయి కడుగుకొనకుండా నతివేగమున నూతిపెరటిలోని కరుదెంచి “అయ్యో!” యని రోదనము చేయుచు, “హా! కుమారా!” యని నూతిచుట్టూ ప్రదక్షిణము చేయుచు, గుండెలు బాదుకొనుచు బేలవలె వాపోవదొడగె. లేకలేక చిరకాలమునకు గలిగిన కుమారుడగుటచే యెవరి కట్టి బాధయుండదు? “అకటా! నా నోములపంట ! నీవేమో వంశోద్ధారకుడ వనియు, చిరాయుష్మంతుండవనియు, సుగుణఖనివనియు, దైవజ్ఞులెందరో పేర్కొనియుండిరే. అన్నా ! యెంతకష్ట మెంతకష్టము. ఇక నా కీజన్మమేల? నేనుకూడ నీ బావి జొచ్చెద”నని, నూతిలోపడుటకు యత్నించుచుండ , నంత పోతన “ఏదీ, బావా ! ఆపదలందు ధైర్యమువహింపవలయును గాదా! ఇది యేనా నీ ధైర్యము.’ అని యాక్షేపించుచు శ్రీ నాధునిగాంచి నవ్వుచు వెండియు నిట్లనెను. “నా వెన్నియో యిట్టి యిక్కట్టులపట్ల ధైర్యము వహింపవలెనని చెప్పిన యుపన్యాసము లన్నియు నేమైపోయినవి? ఇంతియేనా నీ ధైర్యసాహసములు. ఆడుదానివలె వాపోవుచు నూతిలో నురకజొచ్చెదవా? చాలులెమ్ము, నూతిలోబడ్డబిడ్డను దీయుటకై యత్నపడుము. అవును. నిచ్చెనయేది? త్రాళ్ళేవి? తట్టలేవి? తగిన యుపకరణముల సంపాదించి బిడ్డను పైకి దీయునుపాయ మాలోచింపవలెనుగాని. యూరకవాపోవుట పురుషలక్షణమా” అని యనుచుండ పోతన మాటలయొక్క భావమును కనిపెట్టి నాబిడ్డ కేవిధమయిన తొందరయు గలుగలేదు. ఇదంతయు పోతన గావించిన కపటనాటక విశేషమే. నాడు భాగవతములో “ సిరికింజెప్పడు” అను పద్యమును తాను చదివినప్పుడు నే నేదియో యాక్షేపణలొనరించితిని. ఇప్పుడీ పన్నాగమంతయు పన్ని యుండెనని తెలిసికొనియెను. అప్పుడు శ్రీ నాధుఁడు పోతనను కుమారుని జూపవలసినదని ప్రార్థించెను. పోతన యిట్లనియెను. “బావా! నీ కుమారునిపై నీ కెంతటి వాత్సల్యమో భక్తునియెడల పరాత్పరునకు కూడా నంతటి వాత్సల్యమే గలదు. ఆ వాత్సల్యము చేతనే గజేంద్రుని యాలాపము వినవచ్చినంతనే యున్నపాటునేలేచి భగవంతుడు పరువిడి వచ్చుచుండెను. ఆతఁ డాయుధము లేకున్న మాత్రమున మకరిని ద్రుంప లేడా! మనము నూతులలోబడిన వానిని పైకి సాధనములుపయోగింప వలయునేగాని యా మహానుభావునకు ఆయుధములతో పనియేమి? నాడు శిశుపాలుని వధించునాడు ధర్మరాజు పూజాద్రవ్యములతో నొసంగిన పళ్ళెరమేగదా చక్రమయ్యెను. అని వివరించి యాతని యాక్షేపణకు సోదాహరణంగా ప్రత్యుత్తర మొసంగెను.

భాగవతమును లక్షణగ్రంథముగా గొనకుండుట
భాగవతమున గొన్ని చోట్ల రేఫఱకారమనలకు ప్రాస స్థానములందును విశ్రమ స్థానములందును మైత్రియుండుట గాన్పించుటచేత అప్పకవి తన యప్పకవీయములో నిట్లు వ్రాసియున్నాడు.

ఉ.
బమ్మెరపోతరాజకృత । భాగవతమ్ము సలక్షణమ్ముగా
కిమ్మహినేమిటంగొదవ । యెంతయునారసిచూడగానురే
ఫమ్ములు ఱాలునుంగలసి । ప్రాసములైనకతంబునంగదా
యిమ్ములనాదిలాక్షిణికు। లెల్లరు మానిరుదాహరింపగాన్.

కాని పరికింపగా నీరేఫఱకారసాంకర్యము పోతనకృతములగు భాగము లందంతగా గనబడదు. నారయ, సింగన, గంగన మున్నగువారు రచించిన భాగములలో మాత్రమే గనబడుచున్నది. ఈవిషయమును చర్చించి కూచిమంచి తిమ్మకవి తన “సర్వలక్షణసార సంగ్రహమున” నిట్లు వ్రాసినాడు.

ఆ.
కాకునూరియప్ప । కవి యహోబలపతి
ముద్దరాజు రామ । ముఖ్యులెల్ల
బోతరాజు కబ్బ. । ముననఱాలు రేఫలు ।
గదిసెవంచు జెప్పి । రది హుళక్కి

సీ.
ఘనుడు పోతన మంత్రి । యును భాగవతము ర
చించి చక్రికి సమ । ర్పించు నెడల
సర్వజ్ఞసింగమ । క్ష్మావరుడదితన
కిమ్మనివేడగా । నీయకున్న
నలిగియా పుస్తకం । బవని బాతించిన
జివికియందొకకొంత । శిధిలమయ్యె
గ్రమ్మఱ నది వెలి. । గండల నారప్ప
రాజును మరిబొప్ప । రాజు గంగ
రాజు మొదలగు కవివరుల్ । తేజమొస
గజెప్పిరాగ్రంథములయందె । తప్పులొదనె
గానిపోతకవీంద్రుని కవితయందు
లక్షణంబెందుదప్పునా । దక్షహరణ

కూచిమంచి తిమ్మకవి రేఫఱకారసాంకర్యములేని పద్యములను గొన్నిటిని నిరూపించి యున్నాడు. ఆ పద్యములను మరికొన్నింటినిగూడ నిందుదాహరించుచున్నాడను.

ఉ.
మాఱువడంగలేని యస । మర్ధులసుప్తుల వస్త్రవిద్యలం
దేఱనిపిన్నపాపలవ । ధించెనిషద్ధపుఁ గ్రూరకర్ముఁడై
పాఱుఁ డె వీఁడుపాతకుఁడు ప్రాణభయంబున వెచ్చమార్చుచుం
బాఱెడివీనిఁ గావుముకృ । పా మతి నర్జున సాపవర్జనా.

చ.
వెఱచినవాని దైన్యమున । నేఁదుఱునొందినవాని నిద్రమై
మఱచినవాని సౌఖ్యముగ । మద్యముఁ ద్రావినవానిభగ్నుఁ డై
పఱచినవానిసాధుజడ । భావము వానిని గావుమంచునా
చఱచినవానిఁ గామినుల । జంపుటధర్మముగాదు ఫల్గునా.
- ప్రధమస్కంధము.

క.
ఎఱుఁ గుదుఁ దెఱవాయిప్పుడు
మఱువనుసకలంబు నన్ను । మఱచినయెడలన్
మఱుతునని యెఱిఁగి యెఱుఁగక
మఱవక మొఱయిడిరయేని । మఱియన్యములన్.

క.
ఒఱపగునురమును బిరుదును
నెఱిదోఁ కయు ముఖముసిరియు । నిర్మలఖురముల్
కుఱుచచెవులుఁ దెలిగన్నులు,
దఱుచగుకంఠంబుఁజూప । దగునాహరికిన్.

ప్రాసయతి
ఆ,
చావులేనిమందు । చక్కనమనకబ్బె
ననుచుఁ గడవయసురు । లడచికొనిన
వెఱచి సురలుహరికి మొఱలువెట్టిరిసుధా
పూర్ణఘటముపోయెఁ । బోయెననుచు.

ఆ.
వాలుగంటివాఁడి । వాలారుచూపుఁ
శూలిధైర్యమెల్లఁ. । గోలుపోయి
తఱలియెఱుకలేక । మఱచెగుణంబుల
నాలి మఱచె నిజగ । ణాళిమఱచె.

- ప్రాసము.
క.
వెఱచుచు వంగుచువ్రాలుచు
నఱమఱిగుబురులకు జనుచు । హరిహరియనుచున్
మఱుగుచు నులుకుచు దిరదిరఁ
గుఱుమట్టపుఁ బొట్టివడుగు । కొంతనటించెన్.

క.
కుఱుగఱులు వలుదనీసలుఁ
జిఱుదోఁకయు బసిఁడి యొడలు సిరిగలపొడలున్
నెఱమొగము నొక్కకొమ్మును
మిఱుచూపులు గలిగివిభుఁడు మీనంబయ్యెన్.

క.
పెఱవాఁడు గురుడటంచును
గొఱగానిపదంబుసూపఁ । గుజనుండును ని
నెఱిత్రోవనడవనేర్చిన
నఱమఱలేనట్టిపదము । నందుదయాబ్ధీ.

ఉఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచుఁ; బాదంబులం
నెఱయం గంఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం
జఱచుం; నుగ్గుగఁ దాఁకు; ముంచు; మునుగుం; శల్యంబులుం దంతముల్
విఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూధోత్తమున్

ఉఱ కంభోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మెఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.

మఱియును దనుజుఁడు రామునిఁ
గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం
జుఱచుఱఁ జూచుచు శౌర్యము
పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్

కఱచి పిఱుతివక మఱియును
వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెఱయఁ దన నిడుద యొడలిని
నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్.

అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!

ఇట్టివి పోతనకవిత్వమున గనబడుటజేసి యాతఁడు రేఫఱకారముల భేదము గుర్తించినవాడనియును, రేఫఱకారములసాంకర్యమును అంగీకరింపని వాడనియును స్పష్టమగుచున్నది. పోతన రచించిన భాగవతములో నొకటి రెండు స్థలములయందు మాత్రమే యీ దోషము గానబడుచున్నది. దానినీ క్రింద యుదాహరించుచున్నాను.

ఉ.
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు;"ఘోరకృత్య" మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు;"కావరే" యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.
సప్తమస్కంథము.

క.
పోరుదురు గికురు పొడుచుచు;
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్;
జాఱుదురు ఘనశిలాతటి;
మీఱుదు రెన్నంగరాని మెఁలకువల నృపా!

చ.
వెఱ మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ
జఱచి ఖగేంద్రుచందమునఁ జక్కన దౌడలు పట్టి కన్నులం
జొఱజొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో
జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్.

చ.
మఱి యొకనాటి రాత్రి బలమాధవు లుజ్జ్వల వస్త్రమాలికా
ధరులును లేపనాభరణ ధారులునై చని మల్లికాది పు
ష్పరస నిమగ్నమైన మధుపంబుల గీతము వించుఁ దద్వనాం
తరమున వెన్నెలన్ వ్రజనితంబిను లుండగఁ బాడి రింపుగన్.

ఈ ప్రయోగములు ప్రమాదజనితములుగా గాని మతబేధమునగాని లేక యితర కారణమునగాని ప్రయోగింపబడినవేగాని పోతన యుభయమైత్రి పాటించినాఁడుకాడనుట తగదు. వెలిగందల నారపరాజు మున్నగువారు రచించిన భాగములందు రేఫఱకార సాంకర్యము గనబడుచున్నది. వాని నీక్రింద నొసంగుచున్నాడను.

క.
మఱియును ఋష్యాశ్రమ వన
సరి దుపవన నద పుళింద జనపద గిరి గ
హ్వర గోష్ట యజ్ఞశాలా
పుర దేవాయతన పుణ్యభూముల యందున్.

చ.
హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు
స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము
ల్మఱచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం
బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్?

క.
ధర శునకభోగ్యమును నిహ
పరదూరము నైన తనువు పాథేయముగా
నెఱి నమ్మి వస్త్ర మాల్యా
భరణంబు లలంకరించు పామర జనులన్

మ.
తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా!

క.
పరగగ దర్భోద్ధతులి
ద్దఱు కొడుకులు నీకు బుట్టి। ధరణికివ్రేగై
నిరతము బుధజనపీడా
పరులై వర్తింతు రాత్మ । బలగర్వమునన్.

క.
వరుణుని బలములు దనుజే
శ్వరు తేజము దేరిజూడ । జాలక శౌర్య
స్ఫురణముచెడి యెందేనియు
బఱచెన్ దజ్జలధిమధ్య । భాగమునందున్.

క.
వినుము ఫలారంభుడు కృప
ణుని నడిగిన దన యశంబు । నుం దనమానం
బును జెడుగావున దగనీ
వెనయ వివాహేచ్ఛ దగు । లుటెఱిగెనిటకున్.

క.
ధరణీసురోత్తముడు తా
నరుదుగ దనువారు సెప్పి । నవియెల్లను నే
మఱకందు బ్రీతిసేయ
నిరతము గృహకర్మమట్లు । నెఱపుచు నుండెన్.

చ.
కరువలిబాయ వస్త్రమును । గట్టనెఱుంగవు చూడ్కి దిక్కులన్
బఱచుచు జంచరీకముల । భాతి జెలంగెడు కంధరంబునన్
బొరలెడు ముక్తకేశభర. । ముందుఱుమంగదలంప విప్పుడి
ట్లరుదుగ రత్నకందుక వి । హారముసల్పెడు సంభ్రమునన్.

క.
ధరణీవల్లభనిన్నును
నిరతంబును బుద్ధదేవు । నింగొలచిన యా
తెఱగున గొలిచెదమని భా
సురమతి బోధించిరపుడు । సుమతిం బ్రీతిన్

క.
పరిపూర్ణంబగు భక్తిని
గరమనిశము సంశయాత్మ । కంబయిచాలన్
వఱలిన హృదయగ్రంధిని
నిరసించు విరక్తియుతను । నీషజనించెన్.

చ.
హరిభజనియ మార్గనియ । తాత్మకులై భవదీయమూర్తిపై
వఱలిన భక్తియుక్తులగు । వారలసంగతి గల్గజేయు స
త్పురుషసుసంగతిన్ వ్యస । నదుర్భరసాగరమప్రయత్నతన్
సరసభవత్కధామృత ర. । మా హృదయేశ । మకుంద! మాధవా.

భాగవతము — ఆంధ్రీకరణము.
వేదవ్యాసవిరచితమగు భాగవతమననుసరించి పోతనామాత్యుడొక స్థలమున కొంతవరకు కల్పితమనలను జేర్చుచు, వేరొకయెడకొలదిగా సంకుచితము గావించుచు గ్రంథమును చక్కగాపోషించియాంధ్రీకరించినాఁ డు . ఈతఁడు భాగవతమంతయు నద్వైతపరముగానే రచించి యుండెనని విస్పష్టమగుచున్నది. ఈతఁడు తనయాంధ్రీకరణమునకు శ్రీధరుల వ్యాఖ్యానము నూతగా గొనియున్నాఁడు. ఈ విషయమును ఈ క్రింది నొసంగబడిన వ్యాఖ్యానము రూఢిసేయగలదు.

శ్లో.
నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే.

ఈ శ్లోకమునకు శ్రీధరులవా రిట్లువ్యాఖ్యానము గావించియున్నారు.

నమిఇతి. అనంతాయ, అహంకారాపరిచ్ఛేదాత్ అతః సూక్ష్మాయ,
అదృశ్యత్వాత్ అతఏవకూటస్థాయ, ఉపాధికృత వికారాభావాత్ అత
ఏవవిపశ్చితే సర్వజ్ఞాయ॥ నానేతి॥ నానావాదానురోధాయ అస్తి, నాస్తి
సర్వజ్ఞః కించిదజ్ఞః బద్ధః, ముక్తః ఏకః, అనేకః , ఇత్యాదీనానావాదాన్
అనురుణద్ధి మాయయానువర్తతే యస్తస్మైవాచ్యవాచకశక్తయే అభిధానా
భిధేయ శక్తిబేదాదపి నానాత్వేప్రతీయమానాయ;కుత;శాస్త్రయోనయో
వేదాత్మకనిశ్వాసాయ.

పైవ్యాఖ్యానముననుసరించి పోతనరచించిన యాంధ్రీకరణము.

గీ. మూడహుకృతులచే । ముసుగుపడక
నెఱిననంతుడవై దర్శ । సేయరుచివి
గాక సూక్ష్ముడవై నిర్వి । కారమహిమ
దనరికూటస్థుఁడనైన సమ । స్తంబునెఱుగు
నీకు మ్రొక్కెద మాలింపు । నిర్మలాత్మ.

వ.
మరియుఁ గలండులేఁడు,సర్వంబు నెఱుంగునించుక యెఱుంగు బద్ధుండుముక్తుండు, నొకండనేకుండు ననునివి మొదలగుగాఁగల వాదంబుల మాయవలన ననురోధింతువు కావున నానావాదానురోధకుం డవయ్యు నభిధానాభిధేయ శక్తిభేదంబువలన బహుభావప్రతీతుండ వయ్యును, జక్షుషాదిరూపంబువలన బ్రమాణమూలకుండవయ్యు వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోనివయ్యు కొన్నియెడల కావ్యసరణికి సరసముగా నుండని దత్త్వఘట్టములనుగూడ నత్యంతమధురిమ మొలుకునట్లు రచించుటయందు పోతన మిక్కిలి నిపుణుడు.
- సప్తమస్కంథము

శ్లో
మతిర్నకృష్ణేపరతస్స్వతో వామిధోభిపజ్యతగృహవ్రతానాం।
అదాంతగోభిర్విశతాంతమిస్రంపును పునశ్చర్వితచర్వణానామ్॥

ఈశ్లోకమునకు పోతనామాత్యుని తెనుగు.

ఉ.
అచ్చపుఁజీకటింబడి గృ । హవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁబుట్టుచున్ మరల ।జర్వితచర్వణులైనవారికిన్
జెచ్చెరఁబుట్టునే పరులు । సెప్పిననైననిజచ్ఛనైన నే
మిచ్చిననైనఁ గానలకు । నేగిననైన హరిప్రబోధముల్.

మూలము
శ్లో
నతేవిదుస్స్వార్ధగతిం హి విష్ణుం
దురాశయాయేబహిరర్ధమానినః
అంధాయుధాంధైరుపనీయామానా
వాచిస్వతంత్ర్యామురుదామ్నిబద్ధా॥

శ్లో
నైషాంమతిన్తావదురు క్రమాంఘ్రీం
స్సృశత్యనర్ధాపగమోయదర్ధః
మహియనార పాదరజోభిషేకం
నిష్కించనానాం నవృణీతయావత్.

ఉ.
కావనివాని నూతగొని. । కాననివాడు విశిష్టవస్తువుల్
గాననిభంగిఁ గర్మములు । గైకొనికొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుని కొందరట్ల । గందురకించన వైష్ణనాంఘ్రిసం
స్థానరజోభిషిక్తులగు. । సంహృతకర్ములు దానవేశ్వరా.

మరియు పోతనరసోద్దీపకములు కానిపట్లను గూడ దనరచనా చమత్కృుతిచే నత్యంతమనోహరములై యుండునట్లుగా వర్ణించి యుండెను. ఈక్రిందిశ్లోకమును దానికి తెనుగుసేతయు గమనించిన నీ విషయము తెల్లమగును.

సప్తమస్కంధము— పంచమాధ్యాయము.
శ్లో
ఏకదాసుపరాట్పుత్రమంకమారోప్య పాండవ?
ప ప్రచ్ఛకథ్యతాం వత్స । మన్యతే సాధుయద్భవాన్.

దీనికి పోతన్న గారి తెలుగు.
శా.
అంతం గొన్నిదినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుండై "నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో
భ్రాంతుం డేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ" డని మహాసౌధాంతరాసీనుఁడై.

ఉ.
మోదముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాదకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా
స్వాద కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్.

వ.
ఇట్లు చారులచేత నాహుూయమానుండై ప్రహ్లాదుండు నరుదెంచిన,

శా.
ఉత్సాహ ప్రభుమంత్రశక్తి యుతమే యుద్యోగ? మారూఢ సం
విత్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్?
వత్సా! ర" మ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్.

క.
అనుదిన సంతోషణములు,
జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
తనయుల సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్."

వ.
అని మరియుఁ బుత్రా! నీకెయ్యది భద్రంబైయున్నది చెప్పుమనిన గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.

అష్టమస్కంధము — తృతీయాశ్వాసము.
శ్లో
తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య
దివిజైః సహ సంస్తువద్భిః ఛన్దోమయేన గరుడేనస ఊ
హ్యమానశ్చక్రాయుధోభ్యగమదాశు యతో గజేంద్రః ॥

శ్లో
సొంతస్సరస్యుడుబలేనగృహీత ఆర్తోదృష్టోగరుత్మతిహ
రింఖఉపాత్తచక్రం। ఉతి ప్యసాంబుజకరంగిరిమా
హకృచ్ఛాన్నాలాయరాఖిలగురోభగవన్నమస్తే.

శ్లో
తం వీక్ష్యపీడితమజస్సహసావతీర్య సగ్రాహమాశు
సరసఃకృపయోజ్జహార। గ్రాహాద్విపాటితముఖాదరి
ణాగజేంద్రం సంపశ్యతాం హరిరమాముచదుస్రియాణం.

ఈ మూడుశ్లోకములకు.

మ.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

అను నీ పద్యము మొదలుకొని

శా.
పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్,
దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.

అను పద్యమువఱకును గల ఇరువదిపద్య గద్యములును రచించి యున్నాడు.

నవమస్కంథము — నవమాధ్యాయము.
శ్లో
వ్యవాయకాలేదదృశేవనౌకోదంపతీ ద్విశౌ
క్షుధార్తోజగృహేవిప్రంతత్పత్న్యాహ కృతార్ధవత్
నభవాన్ రాక్షసస్సాక్షాదుక్ష్వాకూణాం మహారధః
మదయంత్యాః పతిర్వీరనాధర్మంకర్తుమర్హసి
సోయంబ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్విభో
కధమర్హ తిధర్మజ్ఞ ! వధంపితురివాత్మజః
తస్యసాధోరపాపస్యభ్రూణస్యబ్రహ్మవాదినః.
కథంవధంయధాబభ్రోర్మన్యతే సన్మతోభవాన్
యద్యయంక్రియతే భిక్షస్తర్హిమాంఖాదపూర్వతః.
నజీవిష్యేవినాయేనక్షణంచ మృతకంయథా
ఏనంకరుణభాషిణ్య విలపంత్యా అనాధవత్
వ్యాఘ్రః పశుమివాఖాదత్సౌదాసశ్శాపమోహితః

తెనుగు
క.
ఆఁకట మలమల మాఁడుచు
వీఁక నతం డడవి నున్న విప్ర మిథునముం
దాఁకి తటాలున విప్రునిఁ
గూఁకటి చేఁబట్టి మ్రింగఁ గొనిపోవుతఱిన్.

వ.
అంత నాబ్రాహ్మణునిభార్యపతికి నడ్డంబు వచ్చి యేడ్చుచు నా రాచరక్కసున కిట్లనియె.

మ.
రవి వంశాగ్రణివై సమస్తధరణీరాజ్యాను సంధాయివై
భువనస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై
వివరంబేమియు లేక నా పెనిమిటిన్ విప్రుం దపశ్శీలు స
త్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ భక్షింపఁగాఁ బాడియే?.

మ.
తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం
డండ్రా మాటలు లేవె? భూమిసుర గోహత్యాభిలాషంబు గై
కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ
తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ధర్మంబునుం బోఁగదే.

శా.
అన్నా! చెల్లెల నయ్యెదన్; విడువు నీకన్నంబు బెట్టింతు; నా
హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱి నకటా! హింసింప నేలయ్య? నీ
వెన్నం డింతులతోడఁ బుట్టవె? నిజం బిట్టైన మున్ముట్ట నా
పన్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే.

క.
అని కరుణ పుట్ట నాడుచు
వనితామణి పలవరింప వసుధాదేవుం
దినియె నతఁడు పులి పశువుం
దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై.

పోతనామాత్యుఁడు నాచనసోముని హరివంశమును దిలకించి యందు గల పోకడల గొన్నింటిని దనభాగవతమన పొందుపరచియున్నాడనుట క్రిందిపద్యములు నిదర్శనములై యున్నవి.