పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : రామరాజ్య వర్ణనము

రామరాజ్యమునందు ప్రజలెట్లు సుఖించిరో రామాయణ యుద్ధకాండాంతమునందిట్లు చెప్పుచున్నాడు:-
నపర్యదేవన్ విధవానచ వ్యాలకృతం భయమ్
నవ్యాధిజం భయం చాసీద్రామేరాజ్యం ప్రశాసతి॥
నిర్ధస్యురభవల్లోకో నానర్ధం కశ్చిదస్పృశత్
నచస్మవృద్ధా బాలానాం ప్రేతకార్యాణికుర్వతే॥
సర్వంముదితమేవాసీత్ సర్వోధర్మపరోభవత్
రామమేవాను పశ్యంతోనాభ్యహింస స్పరస్పరమ్॥
ఆసన్ వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః
నిరామయా విశోకాశ్చరామేరాజ్యం ప్రశాసతి॥
నిత్యమూలా నిత్యఫలాస్తరవస్తత్ర పుష్పితాః
కామవర్షీ చపర్జన్యః సుఖస్పర్శశ్చమారుతః॥
స్వకర్మ సుప్రవర్తన్తే తుష్టాఃస్త్వైరేవకర్మభిః
ఆసన్ ప్రజాధర్మపరా రామేశాసతినానృతాః॥
సర్వే లక్షణసంపన్నాః సర్వేథర్మపరాయణాః

  శ్రీరామచంద్రుని కాలమునందు స్త్రీలు వైధవ్యము నందలేదు. ప్రజలకు సర్పభయ, రోగభయాదులు లేవు, దొంగల ఉపద్రవమేమియును లేదు. వృద్ధులగు తల్లితండ్రులు తాము జీవించియుండగానే తమ పుత్రులకు శ్రాద్దకర్మ నాచరింపవలసిన అవసరములేదు. ప్రజలందరును ఆనందపూర్ణులును, ధర్మ పరాయణులునై యుండిరి. శ్రీరామచంద్రుని ఆదర్శ ధార్మిక భావమును ఆదర్శముగా నుంచుకొని, ప్రజలు అన్యోన్య హింసా నిమగ్నులు కాకుండిరి. వేలకొలది పుత్రులతో వేలకొలది సంవత్సరముల వరకును మనుష్యులు జీవింపగలిగి యుండిరి. వృక్షము లెల్లప్పుడును ఫలపుష్పమూలములతో శోభిల్లుచుండెను. ఇచ్ఛామాత్రముననే మేఘము వర్షించుచుండెను. శీతలమందసుగంధవాయువు వీచుచుండెను. ప్రజలందరును స్వధర్మముతో తృప్తిని వహించి స్వధర్మనిరతులై యుండిరి. మిధ్యా వ్యవహార ప్రచారము లేకుండెను.

  ఆదర్శ నరపతియగు శ్రీరామచంద్రుని రాజ్యమునందిట్లు ప్రజలు సుఖించుచుండిరి. ప్రజాపాలనమును, ప్రజారంజనము నొనర్చుటకు అష్టలోకపాలకుల అంశములను సేకరించి రాజు జన్మించుచున్నాడు. ప్రజారంజన మొనర్చెడి రాజు నిజముగా దేవతయే! ప్రజాపీడన మొనర్చెడిరాజు అసురాంశవలన జన్మించెనని శాస్త్రములు చెప్పుచున్నవి! ప్రజలే రాజునకు ప్రాణము. ప్రజాభిమానమును చూరగొనజాలని రాజు జీవించుట వ్యర్థము. ఈ పరమధర్మము శ్రీరామచంద్రుని జీవితమునందు పరిపూర్ణత నందినది. అతడు ప్రజలను ప్రేమించెను. ప్రజారంజనమే అతని ఏకైకలక్ష్యమై యుండెను. ప్రజాసుఖమున కాతడేపనినైనను చేయుటకు సంసిద్ధుడై యుండెను. అతని సమస్త ప్రాణములును, సమస్త సుఖములును, ప్రజారంజనరూపమగు హోమాగ్నియందు ఘృతమువలె ఆహుతి యైపోయెను. కేవల ప్రజారంజనము కొరకు నిర్దోషియును, పరమ ప్రేమాస్పదయును, పతివ్రతయును, సహధర్మచారిణియునగు భార్యను సహితము పరిత్యజింపగల రాజు ప్రపంచమునందు మరిఎవ్వడైన ఉన్నాడా? ఆమె సంపూర్ణముగా నిర్దోషియని ఎరింగియును, ఆమె యందపూర్వానురాగ మున్నను, కేవల ప్రజారంజనము కొరకు ఆమెను వనవాసమునకంపెను. ఇదియే ఆదర్శక్షత్రియునకును, ఆదర్శనరపతికిని లక్షణమైయున్నది.

  నిజముగా, అట్టి ప్రజాపాలకుడు, అట్టి ప్రజాహితప్రాణి యగు రాజు, ఇప్పుడు భారతదేశమునకు లభించిన యెడల, ఈ భయంకర క్షామములు, ఈ అకాలమృత్యువులు, ఈ రోగములు, ఈ అశాంతి యంతయును ఒకసారిగా శాంతించి, భారతదేశమొక నందనకాననమై ప్రకాశింపగలదు. అప్పుడు భారతదేశమెల్ల ఆనందముతో నిండిపోవును. శాంతిరూపిణియగు మందాకిని ప్రవహించి ప్రజల దగ్ధహృదయములకు శాంతిని ప్రసాదించును. భారతీయుల భాగ్యాకాశమునందట్టి శుభనక్షత్ర మెప్పుడుదయించునోకదా?

  ఆదర్శ నరపతి యందుండవలసిన లక్షణములేకాక, ఆదర్శ మానవుని యందును, ఆదర్శ గృహస్థునందును, నుండవలసిన లక్షణములు అన్నియు నున్నవి. వాని పిత్రుభక్తి, మాతృభక్తి, భ్రాతృప్రేమ, జితేంద్రియత, ఏకపత్నీవ్రతము, సహనశీలత, ధైర్యము, భక్తవాత్సల్యము, శరణాగతరక్షణ, ఉదారత, సచ్ఛరిత్రత, నిష్కపటప్రేమ, సత్యవాక్యపరిపాలన మొదలగు గుణములన్నియు ప్రతిగృహస్థునకును ఆదర్శప్రాయములై యున్నవి. శ్రీరామచంద్రుడెంతటి వర్ణాశ్రమాచార తత్పరుడో తెల్పుటకొక్క నిదర్శనము చాలును. పరశురాముడు యుద్ధమొనర్చవలసినదిగా శ్రీరామచంద్రుని కోరినప్పుడు శ్రీరాముడిట్లనుచున్నాడు:-
బ్రాహ్మణోzసీతి పూజ్యోమే విశ్వామిత్ర కృతేనచ
తస్మాచ్ఛక్తో నతేరామ మోక్తుం ప్రాణహరంశరమ్

  నీవు బ్రాహ్మణుడవగుటచే నాకు పూజ్యుడవై యున్నావు. విశ్వామిత్రమహర్షియొక్క సంబంధముచేత సహితము నీవు నాకు పూజ్యుడవై యున్నావు. కావున నేను మీపై బాణమును విడువజాలను.

  శ్రీ రామచంద్రుని ఈ అపూర్వ ఆదర్శములను యథాశక్తి ననుష్ఠించిన యెడల ప్రపంచము ధన్యముకాగలదు.