పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : నృసింహావతారము

  నాల్గవతారము నృసింహావతారము బ్రహ్మవలన అనేక వరములను పొంది గర్వించి ప్రపంచమును అల్లకల్లోలమొనర్చుచు, పరులచేతను పశువులచేతను మరణము లేదనెడి అహంకారముతోనున్న హిరణ్యకశిపుని సంహరించుటకే నృసింహావతార మవతరించెను.

  హిరణ్య కశిపునకు ప్రహ్లాదుడనెడి కుమారుడుండెను. ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి పాఠమును ఒప్పగించమని కోరగా ప్రహ్లాదుడిట్లు జవాబిచ్చెను.
తత్సాధుమన్యేzసురవర్యదేహినాం
సదాసముద్విగ్న థియామసద్గ్రహాత్
హిత్వాత్మపాతం గృహమంధకూపం
వనంగతో యద్ధరిమాశ్రయేయం॥

  “ఓ రాక్షసరాజా। ఆత్మనాశన మొనర్చెడి అంధకూపతుల్యమగు గృహమును పరిత్యజించి అరణ్యములకు పోయి భగవానుని ధ్యానించుటయే శ్రేష్ఠమైన కార్యమని నేను భావింపుచున్నాను.”

  ఈ మాటలను విని హిరణ్యకశిపుడు కోపించి, విష్ణుభక్తిని వదలవలసినదిగా ప్రహ్లాదుని అనేకవిధముల బాధించెను. కడకు కత్తిని తీసికొని “దేవుడున్న యెడల ఈ స్తంభమునందు చూపు”మని స్తంభముపై దెబ్బకొట్టెను. అపుడు భయంకరమగు శబ్దము కలిగెను. అప్పుడు:-
సత్యంవిధాతుంనిజ భృత్యభాషితమ్
వ్యాప్తించభూతే ష్యఖిలేచాత్మనః
అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్
స్తంభేసభాయం నమృగంనమానుషం॥

  తన భృత్యుడగు ప్రహ్లాదుని వాక్యమును సత్యమొనర్చుట కొరకు భగవానుడు నరసింహావతారమెత్తి ఉద్భవించి హిరణ్యకశిపుని తన గోరులతో చీల్చి చంపివైచెను.