పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : భాగవతము - గాయత్రి

ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీమత్ పోతన తెలుగు భాగవతము – గాయత్రీ మహా మంత్రము.


1-35-వ.

ఇట్లు "సత్యంపరంధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.

పోతన తెలుగు భాగవత కథా ప్రారంభ ఇలా మొదలైంది. “సత్యం పరం ధీమహీ” అనే గాయత్రీ మహా మంత్రంతో ప్రారంభిపబడింది కనుక గాయత్రి ‘పరబ్రహ్మ స్వరూపం’ అయ్యింది; మత్స్యపురాణంలో “గాయత్రిని మించుతు ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు” అని ప్రమాణీకరించబడింది. ఇట్లే స్కాంధపురాణంలో “హయగ్రీవ బ్రహ్మ విద్య మరియు పారమహంస్యము కలది వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథం గాయత్రీ మంత్రంతో కూడినది భాగవతం” అని ప్రమాణీకరించబడింది. కాబట్టి శ్రీమద్భాగవతం తన సార్థక నామధేయంతో ప్రసిద్ధి చెందింది. పోతనామాత్యుల వారిచే తెలుగీకరింప బడుటచే యిమ్మహాగ్రంథం శ్రీమత్ “పోతన తెలుగు భాగవతం” అని లోకంలో తెలియబడుతు ఉన్నది.

శ్లో.
యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః|
వృత్రాసుర వధోపేతం తద్భాగవతమిష్యతే||
లిఖిత్వా తచ్ఛయో దద్యాద్ధేమసింహ సమన్వితమ్|
ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం స యాతి పరమం పదమ్||
అష్టాదశ సహస్రం తత్పురాణం పరికీర్తితమ్||  - మత్య పురాణం
శ్లో.
గ్రంథోష్టాదశ సాహస్రో ద్వాదశ స్కంధ సమ్మితః|
హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్ర వధాస్తథా|
గాయత్ర్యా చ సమారంభస్తద్వై భాగవతం విదుః|| - సాంధ పురాణం

    భాగవతము కలియుగమున మానవ కోటికి  ఏకైక ముక్తి సోపానము. అందుకే పెద్దలు అంటారు “చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం”. ఇంతటి  వరేణ్యానికి మూల కారణం, అది గాయత్రిని అధికరించిన మహా మంత్ర స్వరూపం కావటం. ఇక్కడ అధికరించిన అంటే అధికం చేయబడిన, వ్యాహృతి గావింపబడిన అని గ్రహించ వచ్చును. గాయత్రి మహా మంత్రం ఓంకార రూపం కనుక సాక్షాత్ శక్తి స్వరూపం. పర బ్రహ్మ తత్వం అని చెప్పబడుతుంది. ఓంకారం త్రైవర్ణాత్మకం. అకార, ఊ కార, పూర్ణానుస్వరములు అనే మూడు వర్ణాలు లేదా శబ్దాల సమన్వితం. అకారం ఆరంభానికి, సృష్టికి, సృష్టికర్తకు ప్రతీక అనవచ్చు. ఇది ద్వి మాత్ర పరిమితం. ద్వితీయ భావంతోనే సృజన ఆరంభం. పూర్ణం ఇది లయానికి, ప్రళయానికి, శివునికి ప్రతీక అనవచ్చు. ఇది కూడ ద్వి మాత్ర  పరిమితం. ద్వితీయ భావన ఏకంలో లయించటం పూర్ణత్వం. ఉన్నది అనుకున్నది ఖాళీ కావటం అదే అనంతంతో నిండిపోవటం. ఊ కారం స్థితికి, విశ్వానికి, సర్వ వ్యాపకానికి, విష్ణునికి ప్రతీక అనవచ్చు. ఇది త్రి మాత్ర పరిమితం. కార్య, కారణ, కర్తృత్వ ఆదుల సమన్వితం.


    ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు, సత్వరజస్తమములనే త్రిగుణాలకి, భూఃభువస్సువః అనే త్రిలోకాలకు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తలనే ఆశ్రమ త్రయానికి, బ్రహ్మణ, క్షత్రియ, శూద్ర అనే త్రైవర్ణికానికి, ఋగ్యజుస్సామములనే త్రయి రూప వేదానికి, త్రికోణాత్మకమైన శక్తి స్వరూపికి, జాగృతి నిద్రా సుషుప్తులనే అవస్థా త్రయానికి మున్నగు వానికి అధిదేవత. ఇవి గాయత్రీ మహా మంత్రానికి, భాగవత మహా పురాణానికి సంపూర్ణంగా అన్వయిస్తాయి.


    వీటికి అతీతమైనది తురీయం, నాలుగవది. గాయత్రీ మంత్రంలో మూడు పాదాలు వరకు సామాన్యులకు అర్హం. తురీయ పాదం, తురీయాశ్రమం సన్యాసంలో పరిణితి అందుకున్న వారికి అర్హం అయింది. ఆ తురీయావస్థ ముక్తి, మోక్షం, వైకుంఠం. . . అంటుంది భాగవతం. ఈ త్రయీ మార్గం దృష్టితో ఓంకారం, గాయత్రీ మహా మంత్రం, భాగవతం మధ్య సమత్వ ముంది.


ఇలా భాగవతం దేనితో సరిపోల్చ బడినదో అట్టి పరబ్రహ్మ స్వరూప మైన గాయత్రీ మంత్రం సాక్షాత్ పరదేవతా స్వరూపమే. గాయత్రీ అంతరార్థాన్ని మహాత్యాన్ని ఎంతటి వారైనా ఎంత కాలం ప్రయత్నించినా సంపూర్ణంగా వివరించ గలుగుట సాధ్యం కాదు. అంతటి గాయత్రి గురించి గాయత్రి మహాత్యం గురించి సహజంగానే మహా పురుషులు మహర్షులు అనేకులు అనేక విధాలగా ప్రవచించారు ప్రస్తుతించారు. శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి, గుంటూరు వారు గాయత్రీ మంత్రార్థ విచారాన్ని నిరూపించే వివరణ ఒక చక్కటి పట్టిక రూపంలో అనుగ్రహించారు. ఓంకార పూర్వకంగా అనుష్టించే గాయత్రీలోని నాలుగవపాదం పొందడానికి సర్వసంగ పరిత్యాగులకే అర్హత ఉంది. కనుక మూడు పాదాల నిరూపణ అనుగ్రహింప బడింది. ఆ పట్టిక వివరాన్ని గాయత్రీ యంత్ర పటాన్ని మీతో పంచుకొనే అదృష్టం అనుగ్రహించిన గురుదేవులకు, విశ్వగురువు శ్రీకృష్ణ భగవానులకు పాదాభివందానాలు తెలుపు కుంటు ఇక్కడ ఉంచుతున్నాను.


తరువాతి పుట చూడండి