పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పుంసవన వ్రతము

పుంసవన వ్రతము (6-521-వ.)

వ్రతం అంటే శ్రావణ మాస వ్రతం, పదహారు ఫలాల వ్రతం, సత్యన్నారాయణ వ్రతం లాంటివి. వ్రతాలు వ్రతఫలం కోసం చేస్తారు. వ్రతానికి అధిదేవత, నియమాలు, విధానం, సంకల్పం, ఉద్యాపన, ఫలం ఉంటాయి. రాక్షసుల తల్లి దితికి మరీ ప్రత్యేక లక్షణాలు గల కొడుకు కావాలిట. మరి ఇంద్రుడిని ఓడించ గలవాడు కావాలిట. అందుకు తగిన శక్తివంతమైన వ్రతాన్ని ఆ దితికి కశ్యపుడు ఉపదేశించాడు. ఈ వ్రతం చాలా కష్టసాధ్య మైంది. పుంసవనం అంటారు. దీని వివరాలు చూద్దామా.

కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం

వ్రతము పేరు –

పుంసవనం

అనుష్ఠాన కాలము –

ఒక్క సంవత్సరం.

 

వ్రత నియమాలు – 

1 ఏ జీవుల ఎడల హింసాభావముతో ఉండరాదు. 

2 గట్టిగా మాట్లాడరాదు. 

3 కోపం మానాలి. 

4 అబద్దం పలుకరాదు. 

5 గోళ్ళు, జుట్టు కత్తిరించరాదు. 

6 ఎముకలు, కపాలము మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు. 

7 నదిలో కాని చెరువులో కాని స్నానం చేయాలి. కుండలలోని, నూతులలోని నీటితో స్నానం చేయరాదు. 

8 దుర్జనులతో మాట్లాడరాదు. 

9 కట్టిన బట్టలు, ముడిచిన పూలు మళ్ళీ ధరించరాదు. 

10 పంచవిధ నిషిద్ధాన్నాలు తినరాదు. {పంచవిధ నిషిద్ధాన్నాలు – 1ఎంగిలి చేసిన పదార్థాలు, 2అమ్మవారికి నివేదించిన (బలి) అన్నం 3తలవెంట్రుక పడ్డ అన్నం, కుక్కు పిల్లి కాకి ముట్టిన అన్నం పురుగులు చీమలు పట్టిన అన్నం 4మాంసాహారము 5శూద్రులు తెచ్చినది.}

11 దోసిళ్ళతో నీళ్ళు తాగరాదు. 

12 ఉదయ సాయంకాల సంధ్యలలో జుట్టు విరబోసుకోరాదు. 

13 మితంగానే మాట్లాడాలి. 

14 అలంకరించుకోకుండ ఉండరాదు. 

15 బయట తిరుగరాదు. 

16 కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోరాదు. 

17 తడికాళ్ళతో పడుకోరాదు. 

18 పడమట దిక్కు తల పెట్టుకొని కాని, నగ్నంగా కాని, సంధ్యాసమయాలలో కాని నిద్రించరాదు. 

19 ఎప్పుడు శుభ్రమైన బట్టలు కట్టుకొనే ఉండాలి. 

20 ఎప్పుడు శుచిగా ఉండాలి. 

21 ఎప్పుడు సర్వ మంగళ చిహ్నాలతోటి ఉండాలి.

వ్రత విధానము – 

నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) పూజ చేసి. హోమం చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, గంధం, పుష్పం, అక్షతలతో ముత్తైదువలను పూజించి, పతిని సేవించాలి. కొడుకు కడుపులో ఉన్నట్లు భావించాలి.
ఈ విధంగా మార్గశిర శుద్ద పాడ్యమి సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక సంవత్సరం పూర్తిగా ఆచరించాలి. ఆఖరి రోజున పద్దతి ప్రకారం ఉద్యాపనము చేయాలి. వ్రతం చేస్తున్న ఏడాది కాలంలోను పొరపాటున కూడ నియమభంగం కలుగ రాదు.

ఈ పుంసవన వ్రతం వలన సంభవించిన మరుత్తుల విశేషాలు ఈ లింకును తట్టి చూడగలరు .