పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ద్వాదశాదిత్యుల వంశాలు

కశ్యపునికి అదితి యందు పుట్టిన వారు ఆదిత్యులు. వీరు పన్నెండుమంది (12). వారి వంశ వర్ణన:-

1) వివస్వంతునికి సంజ్ఞాదేవి అనే భార్య వల్ల శ్రాద్ధదేవుడు జన్మించాడు. ఇంకా వారికి యముడు, యమి అనే కవలలు జన్మించారు. ఆ సంజ్ఞాదేవి ఆడుగుఱ్ఱం రూపాన్ని ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవి అనే భార్య వల్ల శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే కన్య జన్మించారు. ఆ తపతిని సంవరణుడు వరించాడు.

2) అర్యమునికి మాతృక అనే భార్య వల్ల చర్షణులు జన్మించారు. వారివల్ల మానవ జాతి ఈలోకంలో స్థిరంగా ఉండేవిధంగా బ్రహ్మ ఏర్పాటు చేశాడు.

3) పూషుడు దక్షయజ్ఞంలో శివుణ్ణి చూసి వికృతంగా పళ్ళు బయటపెట్టి వెక్కిరించాడు. శివుడు కోపించి వాని దంతాలను ఊడదన్నాడు. అప్పటినుండి పళ్ళు లేనివాడై, సంతానం లేనివాడై పిండిముద్దలే తినసాగాడు.

4) త్వష్ట భార్య రాక్షసుల సోదరి అయిన రచన. వారిద్దరికి మిక్కిలి బలవంతుడైన విశ్వరూపుడు పుట్టాడు. ఒకసారి దేవతలపై బృహస్పతికి కోపం రాగా అతడు దేవగురువుగా ఉండక తప్పుకున్నాడు. అప్పుడు దేవతలు ఆ విశ్వరూపుని తమ గురువుగా స్వీకరించారు

5) అయిదవవాడైన సవితృడు పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలందు అగ్నిహోత్రాలను, పశుయాగం, సోమయాగం, పంచమహా యజ్ఞాలు అనే కుమారులను కన్నాడు.

6) ఆరవవాడైన భగుడు సిద్ధిక అనే భార్య వల్ల మహిముడు, అనుభావుడు, విభవుడు అనే ముగ్గురు కుమారులను, ఆశిష అనే కుమార్తెను కన్నాడు.

7) ఏడవవాడైన ధాతకు కుహువు (చంద్రకళ కనిపించని అమావాస్య), సినీవాలి (చంద్రకళ కనిపించే అమావాస్య), రాక (పౌర్ణమి), అనుమతి (ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి) అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయం(కాలం), సినీవాలికి దర్శ (అమావాస్య), రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు.

8) ఎనిమిదవవాడైన విధాత క్రియ అనే భార్య వల్ల పురీషాదులైన అగ్నులను కన్నాడు.

9) తొమ్మిదవవాడైన వరుణుడు చర్షిణి అనే భార్య వల్ల పూర్వం బ్రహ్మ కుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు.

9) & 10) పదవవాడు మిత్రుడు. తొమ్మిదవ వాడు వరుణిని కలిపి మిత్రావరుణు లంటారు. ఈ మిత్రావరుణులకు ఊర్వశి వల్ల రేతస్సు స్ఖలనం కాగా దానిని ఒక కుండలో ఉంచగా అందులోనుండి అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించారు.

10) పదవవాడు మిత్రునకు రేవతి అనే భార్య వల్ల శుక్రస్ఖలనం జరిగి అరిష్ట, పిప్పలుడు అనేవారు జన్మించారు.

11) పదకొండవవాడైన ఇంద్రునికి శచీదేవి వల్ల జయంతుడు, ఋషభుడు, విదుషుడు అనే కుమారులు కలిగారు.

12) పన్నెండవవాడైన వామనావతారుడైన త్రివిక్రమునికి కీర్తి అనే భార్యవల్ల బృహశ్లోకుడు పుట్టాడు. ఆ బృహశ్లోకునికి సౌభగుడు మొదలైనవారు జన్మించారు.