పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలరూపుడు విష్ణువు అవతారాల వైభవం

శ్రీమహావిష్ణువు అవతారాల వైభవం

శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణలకోసం ఎత్తు అవతారాలు అసంఖ్యాకాలు. వీనిలో కొన్ని అవతారాల వైభవం ఇక్కడ చవిచూద్దాం ...

(అ) దశావతారాలు

1) వరాహావతారం

పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దొంగిలించి భూమండలాన్ని చాపచుట్టినట్లు చుట్టి సముద్రంలోకి తీసుకుపోయాడు. అప్పుడు, శ్రీహరి యజ్ఞవరహరూపం ధరించి, బ్రహ్మదేవుని తుమ్ము ద్వారా చిన్ని రూపంతో బయటపడ్డాడు. వెంటనే కొండంత పెద్దరూపు పొందాడు. సముద్రం నడుమకు పోయి, తన కొమ్ముపై భూమిని ధరించి, నీటిపైకి తెచ్చి నిలబెట్టాడు. కోరలతో క్రుమ్మి వానిని సంహరించాడు. విశ్వసృష్టిని నిలబెట్టాడు.

2) మత్స్యావతారం

మనువు సంధ్యవారుస్తుంటే అతని దోసిలిలోనికి చిన్న చేప పిల్లగా అవతరించిన విష్ణువు చేరాడు. అతివేగంగా పెరిగిపోతుంటి, క్రమంగా పెద్ద గంగాళం, చెరువు, సముద్రంలో వేస్తాడు. ప్రళయకాలంరాగా, ఆయన ఆజ్ఞానుసారం వచ్చిన పడవపై రాజు సకల విత్తనాలు సప్తర్షులతో ఎక్కి కూర్చున్నాడు. అటు, బ్రహ్మదేవుడు నిద్రలోకి జారుకున్నాడు. హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించి, సముద్రంలో దాచాడు. మత్స్యావతారుడు వానిని సంహరించి, ప్రళయాంతం పిమ్మట లేచిన బ్రహ్మదేవునికి వేదాలు మరల అందజేశాడు; సత్యవ్రతాదుల నావ మునిగిపోకుండా ప్రళయాంతం వరకు కాపాడాడు.

3) కూర్మావతారం

అమృతం మథన యత్నంలో కవ్వపుకొండ మందరగిరి సముద్రంలోకి మునిగిపోసాగింది. విష్ణువు కూర్మావతారం ఎత్తి, గిరగిర తిరుగుతున్న గిరిని తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు వీపుమీద ధరించి, మునిగిపోకుండా కాపాడాడు.

4) నృసింహావతారం

రాక్షసుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని కవల సోదరుడు. సోదరుని చంపాడని విష్ణువుమీద కక్షపెంచుకున్నాడు. తపస్సుచేసి బ్రహ్మవరం పొంది గర్వంతో దేవతలను బాధించసాగాడు. కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తి వదలుటలేదని కోపించి విపరీతంగా బాధించాడు. ఉద్రేకంతో అతను కొట్టిన సభాస్తంభంలోంచి విష్ణువు నరసింహావతారం ఎత్తి ఆవిర్భవించి, వాడి గోళ్లతో వాని వక్షం చీల్చి సంహరించాడు. అతనికి ఉన్న బ్రహ్మవరాలకు భంగం కలుగకుండా జంతువుకాని, మానవుడుకాని నరసింహారూపం ధరించి, గర్భంనుండి కాని, అండంనుండికాని, స్వేదంనుండికాని కాకుండా స్తంభంనుండి పుట్టి, రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో, లోపలా బయటకాని గడపమీద, భూమ్మీద, గాలిలోనూ కాకుండా తొడలమీద, జీవం ఉన్న, జీవం లేని. అస్త్రశస్త్రాలుకాని గోళ్ళతో సంహరించాడు

5) వామనావతారం

విష్ణువు వామనాకారం ఎత్తి, బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేల అతణ్ణి యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించి వంచించి అపహరించాడు. ఇంద్రుడికి ముట్టజెప్పాడు. మహాదాత బలిచక్రవర్తి అంతాతెలిసి, శుక్రాచార్యుడు చెప్పినా వినకుండా, మూడులోకాలను నారాయణుడికి ధానం చేసి శాశ్వత యశస్సు పొందాడు. రాబోయే కాలంలో సూర్యసావర్ణిమన్వంతరంలో ఇంద్రుడు అవుతాడు.

6) పరశురామావతారం

శ్రీహరి జమదగ్నికి పరశురాముడుగా అవతరించాడు. తండ్రిని చంపిన కక్షతీర్చుకోవడానిక అనే మిషతో, రణరంగంలో ఇరవై యొక్కసార్లు దుర్మార్గులైన రాజులను గండ్రగొడ్డలితో నరికాడు. అలా తనకు దక్కిన భూమండల మంతా బ్రాహ్మణులకు దానం చేసాడు.

7) శ్రీరామావతారం

సూర్యవంశంలో దశరథమహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర కైక. పుత్రకామేష్ఠి యాగం చేయగా, భార్య కౌసల్యాదేవి యందు విష్ణువు శ్రీరాముడుగా అవతరించాడు. సుమిత్రకు శత్రుఘ్ను, కైకకు భరత, లక్ష్మణులు జన్మించారు. వశిష్ఠునితో రామ లక్ష్మణులు అడవికి వెళ్ళారు. అనేక శస్త్రాస్త్రాలు నేర్చారు. రాముడు తాటకి, సుబాహువు మున్నగు రాక్షసులను సంహరించి యాగరక్షణ చేసాడు. శివ ధనుర్భంగం చేసి, సీతాదేవిని చేపట్టాడు. దశరథుడు కైకకు ఇచ్చిన మాట మాట నిలబెట్టడానికి రాముడు లక్ష్మణుడు, సీత వెంట రాగా అడవికి వెళ్ళాడు. బంగారు లేడిరూపంలో వచ్చిన మారీచుని చంపాడు. రావణాసురుడు సీతను అపరించుకుపోయాడు. రాముడు లక్ష్మణునితో సీతకై వెదకసాగారు.. సుగ్రీవుడి స్నేహం చేసాడు. అతని అన్న వాలిని నేలగూల్చి, సుగ్రీవునికి కిష్కింధ రాజ్యం ఇచ్చాడు. హనుమంతుడు జానకి జాడ కనిపెట్టి వచ్చాడు. రాముడు సముద్రానికి వంచెన కట్టి, వానర సేనలతో లంకకు వెళ్ళి, రావణుని హతమార్చాడు. విభీషణుణ్ణి రాజుగా చేసాడు. సీతను గ్రహించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై ఏలాడు.

8) కృష్ణావతారం

విష్ణువు యదువంశంలో వాసుదేవునకు రోహిణికి బలరాముడుగా, దేవకికి కృష్ణుడుగా అవతరించాడు. ద్వారకలో కారాగారంలో దేవకి అష్టమ గర్భంలో అష్టమినాడు కృష్ణుడు పుట్టాడు. వెంటనే వెళ్ళి యశోదా నందుల బిడ్డడుగా గోపకులంలో పెరిగాడు. కృష్ణుడు చిన్నప్పుడే పూతన, శకటాసురల సంహరించుట, జంట మద్దులను గూల్చుట. తల్లికి తననోట విశ్వరూపం చూపుట. కాళీయమర్థనం చేయుట. గోవర్థనగిరి ధారణ చేసి, ఇంద్రుని రాళ్ళవాననుండి గోకులాన్నికాపడుట.... ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో బాల్యంలోనే చేసాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడు, మురాసురుడు, మొదలైన పెక్కుమంది రక్కసులను రూపుమాపాడు. అసంఖ్యాకులైన రాజులను సైన్యాలను రణరంగంలో హతమార్చి, సమస్త భూభారాన్నిబాపాడు. సజ్జనులను రక్షించాడు

9) బుద్ధావారము

లోకంలో పాషండమతం పేట్రేగిపోతుంటే. విష్ణువు బుద్ధుడుగా అవతరించి, మధ్యగయా ప్రాంతంలో విలసిల్లి ధర్మం పునరుద్దరించాడు.

10) కల్క్యవతారము

కలియుగంలో పాపాలు పెచ్చుమీరతాయి. అప్పుడు భగవంతుడు విష్ణుయశునికి కల్కిగా అవతరిస్తాడు. కత్తి (ఆయుధం) ధరించి గుఱ్ఱం ఎక్కి వస్తాడు. అధర్మం తొలగిస్తాడు. ధర్మం సంస్థాపిస్తాడు.


(ఆ) మరికొన్ని అవతారాలు

11) ఆదినారాయణ అవతారం.

విశ్వరూపమే ఆదిపురుషుని రూపము. మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని ఆ అవతార స్వరూపం ఒకదానినుండి తరువాతది చొప్పున కాలము, స్వభావము, ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, ఇంద్రియ అధిదేవతలు, తన్మాత్రలు (శబ్దం. స్పర్శం, రూపం, రసం, గంధం), పంచభూతాలు (ఆకాశం. వాయువు, అగ్ని, జలం, భూమి), ఇంద్రియాలూ (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) మనస్సూ పుట్టాయి. వీటన్నిటి చేరికవల్ల విరాట్పురుషుడు, అతని నుండి స్వరాట్టు, అతనిలో నించి జగత్తు పుట్టింది.

12) సుయజ్ఞావతారం

పూర్వం రుచి అనే ప్రజాపతికి, స్వాయంభువ మనువు కూతురైన ఆకూతికి విష్ణువు సుయజ్ఞుడుగా అవతరించాడు. అతనికి భార్య దక్షిణయందు సుయములు అను పేరుగల దేవతలు పుట్టారు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహించాడు. సమస్తలోకాల దుఃఖాన్నీ పరిహరింప జేశాడు.

13) కపిలావతారం

దేవహూతి కర్దమ ప్రజాపతి దంపతులకు తొమ్మండుగురు ఆడుబిడ్డలు తరువాత శ్రీహరి కపిలుడుగా అవతరించాడు. ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వ నిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. ఆ సాంఖ్యయోగాన్ని తల్లికి బోధించి మోక్షాన్ని ప్రసాదించాడు.

14) దత్తాత్రేయావతారం

అనసూయ అత్రి దంపతులకు విష్ణుని అంశతో దత్తాత్రేయుడు, బ్రహ్మదేవుని అంశతో అగస్త్యుడు, శివుని అంశతో విశ్వామిత్రుడు జన్మించారు. దత్తాత్రేయుడు హైహయ, యదువంశాలను ఉద్దరించాడు. అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.

15) సనకాదుల అవతారం

బ్రహ్మదేవుడు, కల్పారంభంలో విశ్వసృష్టికై తపస్సు చేస్తూ సన అని పలికెను . అందువల్ల సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగుర పుట్టారు. వాళ్లు బ్రహ్మమానసపుత్రులుగా ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మ తత్త్వాన్ని వాళ్లు మళ్లీ లోకంలో ప్రవర్తిల్లజేశారు. వాళ్లు నలుగురైన నిజానికి వారి అవతారం ఒక్కటే. ఒకమారు విష్ణువును దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళారు. అప్పుడు ఐదేళ్ళ బాలురుగా వెళ్ళారు. జయవిజయులను ద్వారపాలకులు ఇద్దరు అడ్డగించగా వారివి శపించారు. వారే మూడు జన్మలలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాలదంతవక్తృలుగా పుట్టి వైరభక్తితో వరాహా నృసింహావతారుల, రామావాతరుని, కృష్ణావతారుని చేతిలో మరణించి మరల వైకుంఠం చేరారు

16) నరనారాయణుల అవతారం

విష్ణువు నరనారాయణులుగా ధర్ముడు, మూర్తి లకు అవతరించాడు. మహా జ్ఞానులు ఐన వారు బదరికావనంలో గొప్ప తపస్సు చేయసాగారు. ఇంద్రుడు పంపగా నరనారాయణుల రంభాది అప్సరసలు వచ్చారు. కాని, నరనారాయణులు చలించలేదు. నారాయణుడు తన తొడ గీరగా ఊర్వశి మొదలైన అప్సరస స్ర్తీలు పుట్టారు. అప్సరసలు వారి అందచందాలకు ఓడి, ఊర్వశిని తీసుకొని వచ్చనదారినే వెళ్ళిపోయారు.

17) ధ్రువావతారం

ఉత్తానపాదునికు సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు.అతనికి సునీతి యందు విష్ణువు ధ్రువుడుగా అవతరించాడు, 5 ఏళ్ళ చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఒకనాడు తండ్రి ఒడిలో సురుచి కొడుకు ఉత్తముని చూసి తాను ఎక్కుతా అన్నాడు. తండ్రి పట్టించుకోలేదు.ఆ సవతితల్లి అతణ్ణి నిందించింది. దుఃఖితుడైన ధ్రువుడు అడవికి వెళ్ళి గొప్ప తపస్సు చేసాడు. ఆకాశంలో ధ్రువతార అయ్యాడు.. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువతారగా వున్నాడు.

18) పృథుచక్రవర్తి అవతారం

వేనుడు పుత్రులు లేకుండా మరణించాడు. భార్య సునీథ అనుమతితో, అతని శరీరాన్ని మథించగా విష్ణుమూర్తి పృథుడుగా, లక్ష్మీదేవి అర్చి గా కలిగారు. గోరూపంలో ఉన్న భూదేవిని శిక్షించబోతే, ఆమె, ‘రాజా అనుకూల మైన దూడను (ఉత్ప్రేరకం), అనుకూలమైన పాత్రను (సాధనం), అనుకూలమైన పిండేవాడిని (సాధకుడు) ప్రయోగించు, వలసిన పాలు (సరైన ఫలితం) అందిస్తాను’ అని కర్తవ్యం బోధిస్తుంది. అంత, భూమిని ధేనువుగా జేసి, అమూల్యమైన అనేక వస్తువులను పితికాడు. భూమిని సమతలంగా చేసి ప్రజల్ని పోషించడంతో అనేక కొత్త పల్లెలు, వాడాలు వెలిశాయి. ప్రథమ చక్రవర్తిగా పేరుపొందాడు. ఇతని పేరుమీదనే భూమికి పృథ్వి అని పేరు వచ్చింది.

19) వృషభావతారం

అగ్నీధ్రునికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. అమెకు మేరుదేవి అని మరో పేరు ఉంది. ఆమెకు హరి వృషభావతారుడై అవతరించాడు. మహారజై రాజ్యాన్ని గొప్పగా ఏలాడు. భరతమహారాజు ఇతని పెద్దకొడుకు. కొడుకులకు రాజ్యం ఇచ్చేసి మహా యోగి అయ్యాడు. పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.

20) హయగ్రీవాతారం

విష్ణువు హయగ్రీవునిగా బ్రహ్మదేవుని యజ్ఞంలో నుండి అవతరించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువుల నుండి వేదాలు ప్రాదుర్భవించాయి.

21) ఆదిమూలావతారము

గజేంద్రుడు మొసలిచేత పట్టువడి దుఃఖించసాగాడు. వేయి సంవత్సరాలు దానితో పెనగులాడుతు రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకొన్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేసాడు. వెంటనే శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు.

22) నారదావతారం

బ్రహ్మదేవుని మానసపుత్రుడుగా విష్ణువు నారదావతారం ఎత్తాడు. సతత నారాయణ స్మరణతో బృహతీ వీణను వాయిస్తూ ముల్లోకాలూ సంచరిస్తూ ఉంటాడు. వ్యాసుడు, వాల్మీకి మున్నగువారికి మార్గదర్శనం చూపిన గొప్ప దేవర్షి.

23) హంసావతారం

విష్ణువు హంసావతార మెత్తాడు. భక్తియోగమార్గం అనుసరించాడు. నారదునికి ఆత్మతత్త్వం తెలియపరచే భాగవత మహాపురాణం ఉపదేశించాడు.

24) మనువు అవతారం

మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు.

25) ధన్వంతరి అవతారం

హరి క్షీరసాగరమథనం సమయంలో చేతిలో అమృత పాత్రతో ధన్వంతరిగా అవతారించాడు. తన నామస్మరణతోనే భూమిమీది జనానికి రోగాలన్నీ పోగొట్టుతూ, ఆయుర్వేదం కల్పించాడు.

26) మోహినీ అవతారం

విష్ణువు మోహినీ అవతారమెత్తి సాగరమథనంలో ఆవిర్భవించిన అమృతాన్ని రాక్షసులను వంచించి దేవతలకు పంచి పెట్టాడు. రాహువు, కేతువుల దేవతలలో ప్రచ్ఛనంగా చేరి అమృతం తాగబోయారు. విష్ణువు వారి తలలు చక్రంతో త్రుంచాడు. ఆ రాహు కేతువులు గ్రహాలు అయ్యారు.

27) వ్యాసావతారం

శ్రీహరి పరాశర మహర్షి పుత్రుడై వ్యాసుడుగా అవతరించి ఏకమై ఉండే వేదాన్ని అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, అయిన మానవుల అధ్యయానికి అనుకూలం చేయడంకోసం, నాలుగు శాఖలు శాఖలుగా విభజించాడు.