అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షోడశసంస్కారములు
గర్భాదానాది షోడశసంస్కారములు
షోడశసంస్కారాలు అంటే వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే పదహారు సంస్కారాలు ఆయా దశలు చక్కగా జరుగుటకు చేయు ఆధ్యాత్మిక క్రియలు. అవి:
1) గర్భాదానం - స్త్రీ పురుష సంగమంద్వారా జరిగే గర్భధారణకైన శుభముహూర్తాన జరుపు క్రియ.
2) పుంసవనం - పుంస్ (వృద్ధి పొందించుట) చేయుటకైన అవన (రక్ష)
3) సీమంతం - చూలింత (గర్భిణి స్త్రీ)లకు చేయు ఒక శుభకర్మము
4) జాతకర్మ - పురిటి బిడ్డకు రక్ష కోసం చేయు క్రియ
5) నామకరణం - పుట్టినబిడ్డకు శుభకరమైన, శోభనకరమైన పేరు పెట్టు క్రియ. తద్వారా బాలగ్రహాది దోషాల నివారణ, దీర్ఘాయుస్సు కొరకైన రక్ష
6) నిష్క్రమణ - బాలింత, చంటిబిడ్డలు ఇంటినుండి వెలువడుట ఆరంభించుట శుభముహూర్తము. బయట ప్రపంచంలో ఎట్టి ఒడుదుడుకులు కలుగకుండుటకైన క్రియ
7) అన్నప్రాశన - శిశువునకు అన్నం (మామూలు ఆహారం) పెట్టుటకు శుభారంభం.
8) చూడాకరణ - శిశువుకు పుట్టు వెంట్రుకలు తీయించుటకు. కేశసంస్కరాలకు శుభారంభ క్రియ
9) కర్ణవేధ - చెవులు కుట్టించు కర్మ.
10) అక్షరాభ్యాసం - విద్యా సంస్కారలు నేర్పుటకైన శుభారంభ కర్మము.
11) ఉపనయనం - వేదశాస్త్రములు అధ్యయనమునకు విఘ్నాది దోషాలు కలుగకుండుగాక అని రక్షాకరంగా చేయు క్రియ. ఈ కర్మ పొందినవానిని ధ్విజుడు అంటారు. ఇది తల్లిదండ్రులు నిర్వహించి పిమ్మట గురువు వద్దకు పంపే సంప్రదాయం ఉండేది. ఇకనుండి బ్రహ్మచార్యాశ్రమం ప్రారంభం.
12) వేదారంభం - గురుముఖంగా జరుగు కర్మ. వేదం చదువుటకు శుభారంభంగా చేయు క్రియ
13) కేశాంత - గురువు శిష్యునికి పిలక ఉంచి కేశములు తొలగింపజేయు కార్యక్రమం, బ్రహ్మచర్యదీక్షకు సిద్ధం చేయుట
14) సమావర్తన - పెళ్ళికి పూర్వాంగంగా జరిగే స్నాతకం, వేదాధ్యయనం ముగించుకొని, గృహస్థాశ్రమ స్వీకారం కోసం తిరిగి వెళ్లేటప్పుడు గురువు సమక్షంలో జరిపే క్రతువు. బ్రహ్మచర్యాశ్రమం నుండి తరువాతి ఆశ్రమానికి అర్హతాప్రదాన క్రియ
15) వివాహం - గృహస్థాశ్రమం స్వీకరణ. తత్సంబంధమైన రక్షాది క్రతువుల సమాహారం. మరికొందరు జీవుల శుభ ప్రస్థానం ఆరంభం కావడానికి మూలకారణ శుభారంభం
16) అంత్యేష్టి - జీవుని మరణానంతరం చేయు ఉత్తరక్రియ. ఆత్మకు ఉన్నత లోకాలు లభింపజేయుటకైన రక్షాక్రియ.