అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తస్వరాలు
(ద్వితీయస్కంధము – 188 పద్యము)
(అ)
షడ్జమము (స) నెమలి క్రేంకారం
ఋషభము (రి) ఎద్దు రంకె
గాంధారము (గ) మేక అరుపు
మధ్యమము (మ) క్రౌంచపక్షి కూత
పంచమము (ప) కోయిల కూత
ధైవతము (ద) గుర్రం సకిలింపు
నిషాదము (ని) ఏనుగు ఘీంకారం
(ఆ)
సప్త స్వరములు
{మంద్రస్థాయి - పంచస్థాయిలలో (2) రెండవది, త్రిస్థాయిలో (1) మొదటిది, మధ్య స్థాయికి క్రింద ఉండునది, దీనికి గుర్తుగా స్వరముల క్రింద చుక్క ఉంచుతారు. నాదము శరీరములో నుండి వెడలునపుడు హృదయమునందు ఉండునపుడు మంద్రము అని పేరు. (సంగీత శబ్దార్థ చంద్రిక)}
{మధ్యమస్థాయి - పంచస్థాయిలలో (3) మూడవది, త్రిస్థాయిలో (2) రెండవది, మంద్రస్థాయికి, తారా స్థాయికి మధ్యన ఉండునది, వీటికి గుర్తు ఏమీ ఉండదు నాదము కంఠమున ఉండునపుడు హృదమునందు ఉండునపుడు కంటె రెట్టింపుగా ఉండుటచే కలుగు పేరు. (సంగీత శబ్దార్థ చంద్రిక}}
{తారాస్థాయి - పంచస్థాయిలలో (4) నాలుగవది, త్రిస్థాయిలో (3) మూడవది అయిన హెచ్చు స్థాయి, దీనికి గుర్తుగా స్వరము పైన చుక్క ఉండును, మంద్రస్థాయికి పైన ఉండునది,. (సంగీత శబ్దార్థ చంద్రిక}}
త్రిస్థాయిలు - మంద్ర, మధ్యమ, తార అని మూడు.
పంచస్థాయిలు - అనుమంద్ర, మంద్ర, మధ్యమ, తార, అతితార అని అయిదు.
సప్తస్వరములు - "స, రి, గ, మ, ప, ద, ని" అని సంకేతములు గల షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాద అను ఏడు (7) స్వరములు.
1. షడ్జమము. - "స, రి, గ, మ, ప, ద, ని" అను సప్తస్వరములలో (1) మొదటి స్వరమునకు శాస్త్రరీత్యా ఇచ్చిన నామము. దీనికి సంకేత అక్షరము "స". సప్తస్వరములలో ఋషభాది (6) ఆరు స్వరములును షడ్జము ఆధారముగా జనించుటచే ఏర్పడిన పేరు. (షడ్జమ్ - షట్ + జమ్, షట్ నాసిక, కంఠము, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతములు (6) ఆరు స్థానుములందు జమ్ జనించు ధ్వనికి షడ్జమ్ అని పేరు కలిగెను.)
2. ఋషభము - సప్తస్వరములలో (2) రెండవ స్వరమునకు శాస్త్రరీత్యా ఇచ్చిన నామము. దీనికి సంకేత అక్షరము "రి". ఈ స్వరము యొక్క ధ్వని ఋషభము (ఎద్దు) యొక్క ధ్వని వలె గంభీరత్వము గలదై హదయమున ప్రవేశించునదిగా ఉండును. కనుకనే ఋషభ స్వరమని పేరు కలిగెను, వాడుకలో "రిషభము" అని చెప్పబడుతుంది.
3. గాంధారము - సప్తస్వరములలో (3) మూడవ స్వరము. దీనికి సంకేత అక్షరము "గ".
4. మధ్యమము - "స, రి, గ, మ, ప, ద, ని" అను సప్తస్వరములలో (4) నాలుగవ స్వరము. దీనికి సంకేత అక్షరము "మ". మధ్యమము ముఖ్యముగా రెండు విధములు అవి 1)శుద్ధ మధ్యమము, 2)ప్రతి మధ్యమ. సప్త స్వరముల సంకేతములు "స, రి, గ, మ, ప, ద, ని" అనునవి. (సంగీత శబ్దార్థ చంద్రిక)
5 పంచమము - సప్తస్వరములలో (5) అయిదవ స్వరము. దీనికి సంకేత అక్షరము "ప". ఇది ఏడింటిలోనూ అయిదవ స్థానమున ఉన్నది కనుక పంచమము అని చెప్పబడినది
6. ధైవతము - సప్తస్వరములలో (6) ఆరవ స్వరము దీనికి సంకేత అక్షరము "ద".
7. నిషాదము - "స, రి, గ, మ, ప, ద, ని" అను సప్తస్వరములలో (7) ఏడవ స్వరము దీనికి సంకేత అక్షరము "ని", షడ్జాది ధైవతము వరకు గల ఆరు (6) స్వరములను ముగించు స్థానమున ఉన్నది కనుక నిషాదమని చెప్పబడినది,
స్వరము - స్వయముగా రంజింపజేయు ధ్వనివిశేషమును స్వరము, సంగీతాక్షరము, సంగీతస్వరము అందురు. అనగా శృతికి వెంటనే కలుగు స్నిగ్ధమానదియును, అమరణాత్మకమైనదియును, శ్రోతృ చిత్త సుఖావహముగా నుండునదియుని అగుదానిని స్వరము అనబడును.
కళలు - కాల కాలపరిమాణ విశేషములు, {కళలు - తాళము యొక్క అక్షరములోని సమాంతర్భాగములకు కళలు అని పేరు.
కళ - లఘునకు గల విశేషనామములలో (4) నాలుగవది "కళ" అనబడును.
జాతులు - తాళ భేదములు {జాతి - తాళషడంగములలో లఘువునకు సంబంధించినట్టి పదమునకు జాతి అని పేరు. ఈ జాతులు అయిదు విధములు. అవి త్రిశ్ర 3, చతురశ్ర 4, ఖండ 5, మిశ్ర 7, సంకీర్ణము 9. ఈ అయిదు జాతులును ప్రక్కన ఉన్నన్ని అక్షర కాలములు కలిగినవి అయి ఉండును.}
మూర్చనలు - స్వర సమూహముల భేదములు {మూర్చనలు - షడ్జస్వరముతో ప్రారంభించి ఆరోహణ క్రమముతో దీర్ఘనిషాదము వరకు, రిషభముతో ప్రారంభించి దీర్ఘ షడ్జమము వరకు, గాంధారముతో ప్రారంభించి దీర్ఘ ఋషభము వరకు, ఈరీతిగా దీర్ఘ షడ్జమ వచ్చుటతో అంతమగునట్టి వానికి గల పేరు మూర్చనలు. ఉదా. సరిగమపదనీ - రిగమపదనిసా - గమపదనిసరీ - మపదనిసరిగా - పదనిసరిగమా అను విధముగా ఉండును. }
మూర్చన - సప్తస్వరముల ఆరోహణ, అవరోహణ క్రమములకు మూర్చన అని పేరు. ఇట్టివి గ్రామము ఒకటికి ఏడు (7) వంతున షడ్జగ్రామ, మధ్యమగ్రామ, గాంధార గ్రామములకు 7x3=21 మూర్చనలు కలవు. ఇప్పుడు వాడుకలో గల షడ్జమ గ్రామ, మధ్యమ గ్రామములకు గల మూర్చనలు (14) పద్నాలుగింటికి చతుర్దశ మూర్చనలు అని పేరు.
మూర్చన - త్వరితగతి గల సంచారమునకు గల పేరు, ఇది రాగవర్దని యందలి నాలుగవ (4) యొక్క విషిష్ట లక్షణము అగును.