పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : మరుత్తులు

సప్తసప్త సంఖ్యు లగు వేల్పులు, ఏడు గణములలో ఏడుగురు చొప్పున 49 మంది వాయువులు. దితికి కశ్యపమహర్షివలన వాయవేల్పులు కలిగిరి. (శబ్దకల్పద్రుమము నందు ఈ ఏకోనపంచాశత్‌-అనిలులుపేర్లు క్రింద విధంగా ఇవ్వబడినవి)
1. ఏకజ్యోతి, 2. ద్విజ్యోతి, 3. త్రిజ్యోతి, 4. జ్యోతి, 5. ఏకశక్రుడు, 6. ద్విశక్రుడు, 7. త్రిశక్రుడు, 8. మహాబలుడు, 9. ఇంద్రుడు, 10. గత్యదృశ్యుడు, 11. పతిసకృత్పతురుడు, 12. మిత్రుడు, 13. సమ్మితుడు, 14. సుమితుడు, 15. మహాబలుడు, 16. ఋతజిత్తు, 17. సత్యజిత్తు, 18. సుషేణుడు, 19. పేనజిత్తు, 20. అంతిమిత్రుడు, 21. ఆనమిత్రుడు, 22. పురుమిత్రుడు, 23. అపరాజితుడు, 24. ఋతుడు, 25. ఋతవాహుడు, 26. ధర్త, 27. ధరుణుడు, 28. ధ్రువుడు, 29. విధారణుడు, 30. దేవదేవుడు, 31. ఈదృక్షుడు, 32. అదృక్షుడు, 33. ప్రతిసుడు, 34. ప్రసదృక్షుడు, 35. సభరుడు, 36. మహాయశస్కుడు, 37. ధాత, 38. దుర్గోధితి, 39. భీముడు, 40. అభియుక్తుడు, 41. అపాత్తు, 42. సహుడు, 43. ఘుతి, 44. ఘపువు, 45. అనాయ్యుడు, 46. వాసుడు, 47. కాముడు, 48. జయుడు, 49. విరాట్టు. [శబ్దకల్పద్రుమము 1-పే. 166]
దానికి గల ఒక భాగవత కథ
దితి ఇంద్రుని చంపునట్టి కొడుకు కావలయును అని తన చేష్టలతో వశపరచుకొని భర్త కశ్యపమునిని ప్రార్థించింది. అనుగ్రహించిన కశ్యపుడు పుంసవనం అని ఒక వ్రతం కల్పించి సంవత్సరం పాటు శ్రద్దగా అవిఘ్నంగా చేయాలని ఆ వ్రతంనియమాలు (ఈ లింకు మీత తట్టి చూడగలరు) చెప్పాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వ్రతభంగానికి ఎదురు చూస్తూ ఆమెకు శుశ్రూష మిషమీద కాచుకుని ఉన్నాడు. ఏడాది పూర్తి కాబోతుండగా కొద్దిరోజుల ముందు ఒకనాడు. సంధ్యాసమయంలో ఉచ్ఛిష్టం భుజించి, కాళ్ళు కడుగుకొనకుండా మరచిపోయి, కర్మ వశాత్తు నిద్రపోయింది. ఆ విధంగా నియమోల్లంఘనం జరగడంతో ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. గర్భస్త పిండాన్ని వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా ఖండించాడు. ఆ శిశువు ముక్కలై కూడా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుడై ప్రకాశిస్తుండగా, ఇంద్రుడు మరల ఒక్కొక్కడిని ఏడేసి ముక్కలుగ నరికాడు. వారు ఏడు ఏడులు నలభైతొమ్మిది (49) బాలురుగా ప్రకాశిస్తూ “మేమంతా మరుద్గణాలమై, నిన్ను సేవిస్తాము. మమ్మల్ని రక్షించు” అని వేడుకున్నారు. ఇంద్రుడు అంగీకరించాడు. పిమ్మట ఆ నలభైతొమ్మిది మంది మరుద్గణాలు దితి గర్భం నుండి బయటకు వచ్చారు. అది కారణముగ దితి పుత్రులయ్యు మరుత్తులును, దేవతలని కూడా అందురు.