పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (12) పంచాంగ గణన - విశేష పదాలు

పంచాంగగణన : - సూర్యచంద్రనక్షత్ర గమనాలను అనుసరించి గణన చేయు విధానాన్ని హిందువులు పంచాంగగణన అంటారు. ఈ పంచాంగ గణనలో వచ్చే విశేప సాంకేతిక పదాలు కొన్నిటి వివరాలు. : -
మాసములకు విశేష సంజ్ఞలు :-
అధికమాసము : - పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు. ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది.
శూన్యమాసము :- మన ప్రాచీనులు పన్నెండు నెలల కాలంలో నాలుగు నెలలకి "శూన్యమాసం" అని పేరు పెట్టి ఆయా మాసాల్లో శుభముహూర్తాలు ఉండరాదని చెప్పారు..అవి వరుసగా. మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్యా భాద్రపదం, ధనుః పౌష్యం అని నాలుగు. అయితే విథున ఆషాఢం (మిథున రాశిలోకి సూర్య సంక్రమణం). ‘‘ఆషాఢ మాసం'గా. పరిగణిస్తూ ‘శూన్యమాసం’గా చెప్తారు. (మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్య. భాద్రపదం, ధనుః పౌష్యం - నాలుగూ కూడా శూన్య మాసాలే).
తిథులకు విశేష సంజ్ఞలు :- మొదటి నుండి మూడేసి (3) తిథులకు ఒక్కొక్కటిగా అయిదు పేర్లు ఉన్నాయి. వాటి వివరము. : -
1) నంద - పాడ్యమి, షష్ఠి, ఏకాదశి,
2) భద్ర - విదియ, సప్తమి, ద్వాదశి
3) జయ - తదియ, అష్టమి, త్రయోదశి
4) రిక్త - చవితి, నవమి, చతుర్దశి
5) పూర్ణ - పంచమి, దశమి, పూర్ణిమ లేక అమావాస్య.

తిథిద్వయము : - ఒకే దినమున సూర్యోదయ సమయం ఒక తిథి ఉండి తరువాత మరియొక తిథి వచ్చుట. సూర్యోదయానికి ఉన్నది దినతిథి, తరువాత వచ్చెడిది తత్కాల తిథి (ఉదా. తత్కాల పంచమీ) అంటారు.
తిథిత్రయము : - ఒకే దినమున సూర్యోదయ సమయం ఒక తిథి ఉండి తరువాత మఱియొక తిథి వచ్చి మరల తరువాతి సూర్యోదయం లోపలనే మఱింకొక తిథి రావడం. దానితో ఒక నాడు ఒక తిథి వచ్చి, మరునాడు ఒక తిథి క్షయం అయిపోయి (విడిచి) మూడవ తిథి వస్తుంది.
తిథిక్షయము : - అమావాస్య
రాక - పౌర్ణమిభేదము. సంపూర్ణ కళలు గల చంద్రునితో కూడిన పున్నమ;
అనుమతి - పూర్ణిమా భేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి
సినీవాలి - చంద్రకళ కానవచ్చెడి అమావాస్య, అమావాస్యాభేదము, అంతకుముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య.
కుహువు - చంద్రకళ కానరాని అమావాస్య, అమావాస్యాభేదము, అంతకుముందు తెల్లవారుఝామున కూడ చంద్రరేఖ కనబడని అమావాస్య.