పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత : ప్రళయములు

:ప్రళయములు రకములు:

ప్రళయములు అనేక రకములు కలవు వాటిలో కొన్నింటి వివరములు.

(అ) నైమిత్తిక ప్రళయములు – ఇవి నిమిత్త మాత్రమైనవి. ఆత్మలు లయం కావు కానీ, భౌతికాది దేహములు లయమగును కనుక నైమిత్తిక ప్రళయములు.

(1) నిత్యప్రళయము – స్థూల, సూక్ష్మ శరీరములు చైతన్యం మఱుగు పడి మరల చైతన్యం పొందువరకు ఉండునది నిత్య ప్రళయము. ఉదా. రాత్రి /సుషుప్తి / నిద్రలో జీవులు స్థూల, సూక్ష్మ శరీరములు పడి ఉండును. పగలు / జాగ్రదవస్థ / మెళకువలో చైతన్యము అవుతుంది. ఇలా చైతన్యము నశించిన వద్ద నుండి చైతన్యం పొందే వరకు ఉన్నది నిత్యప్రళయము.

(2) నైమిత్తిక, అవాంతర ప్రళయము – స్థూల శరీరము నశించి, సూక్ష్మశరీరం అలాగే ఉండి మర మరొక స్థూల శరీరము ధరించువరకు ఉండునది నైమిత్తిక / అవాంతర ప్రళయము. ఉదా. సహజంగానూ, వరదలు, కఱువులు, భూకంపాలు మున్నగు ప్రకృతి భీభత్సాలు వలన భౌతిక దేహం నశించి అనగా మరణం పొంది మరల మరొక జన్మ ఎత్తువరకు జరుగునది. ఇలాగ జీవయాత్రలో జీవుడు అదే సూక్ష్మ శరీరంతో అనేక భౌతిక శరీరాలలో మరణిస్తూ, పుడుతూ ఉంటాడు. ఆ మధ్యవి నైమిత్తిక ప్రళయములు.

(3) జలప్రళయము, నైమిత్తిక ప్రళయము – ప్రతి మన్వంతరము చివర, కృతయుగ ప్రమాణం ప్రకారం 17,28,000 ఏళ్ళు, సంధ్యాకాలము అగును. ఈ సంధ్య యందు భూమి జలమునందు మునిగి పోవును. మన్వంతర ఆరంభములో కూడా అంతే (కృతయుగ ప్రమాణం ప్రకారం 17,28,000 ఏళ్ళు) ప్రమాణము గల సంధ్యాకాలం ఉండును.

(4) దైనందిన ప్రళయము, నైమిత్తిక ప్రళయము – సకల జీవరాశులు స్థూల, సూక్ష్మ శరీరములు నశించి, కారణ శరీరములతో మాయయందు విలీనమై వ్యక్తము కాక యుండి. మరల వ్యక్తమై భౌతిక శరీరములను పొందుట ప్రారంభించువరకు దైనందిన ప్రళయము. బ్రహ్మకు పగలు అనగా జీవులకు కల్పము. కల్పాంతంలో బ్రహ్మకు రాత్రి మొదలుకాగా, జీవులు కారణ శరీరములతో కూడిన వాసనలతోపాటు మాయలో లీనమై అవ్యక్తముగా ఉండును. తరువాతి కల్పములో జీవులకు కారణ శరీరములతో కూడిన వాసనలతోపాటు వ్యక్తమై భౌతిక దేహములు పొందుతూ, కొల్పోతూ (నైమిత్తిక ప్రళయాలతో); సుషుప్తి, జాగ్రదవస్థలతో (నిత్య ప్రళయములతో) జీవయాత్రలు కొనసాగును. ఇది దైనందిన ప్రళయము.

(5) నిమిషప్రళయము – కనురెప్పపాటు కాలమున, కనురెప్పలు మూసి తెరచుటకు మధ్య కాలము.

(6) యుగసంధి – చతుర్యుగాలలో కలియుగాంతం కలియుగసంధి. ఆ సంధికాలంలో దుష్ట, పాపపు ప్రభులను విష్ణువు కల్క్యవతారం ధరించి నిర్మూలిస్తాడు. ఈ ప్రళయం యుగసంధి. మరల ధర్మస్థాపన జరుగుతుంది. సత్యయుగం ప్రారంభం అవుతుంది.


(ఆ) ప్రాకృతిక ప్రళయము - ఆత్మ సంపూర్ణంగా ప్రకృతి, పరమాత్మ యందు లీనమగుటు.

(1) బ్రహ్మప్రళయము లేదా ప్రాకృతిక ప్రళయము– బ్రహ్మకు జీవితకాలం అయిన పిమ్మట, బ్రహ్మ మరణము జరుగును. బ్రహ్మతో పాటు జీవులు (ముక్తిపొందని) సమస్తము, కారణ దేహములతో ప్రకృతి / మూలప్రకృతి యందు లయము పొందును. మరల క్రొత్త బ్రహ్మ పుట్టువరకు బ్రహ్మప్రళయము. బ్రహ్మ పుట్టిన పిమ్మట సృష్టి ఆరంభించాకా దైనందినాది ప్రళయాలుతో పాటు సృష్టి కొనసాగుతుంది.

(2) కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషు తలల్పంపై యోగనిద్రా ముద్రలో వసించి ఉండగా ఆ సమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి. ఆ అవస్థా విశేషములు తెలుపనది నిరోధము అంటారు. ఇదే అవాంతర ప్రళయము అని పేరుపడింది. (పోతన తెుగు భాగవతం ద్వితీయ స్కంధము, 265-సీసపద్యం)

(3) ఆత్యంతికప్రళయము, మహాప్రళయము లేదా ప్రాకృతిక కల్పము – మోక్షము దీని తరువాత జీవికి జననమరణాలుండవు జీవి పరమాత్మలో ఐక్యమగును కనుక, ఇది సమస్త జీవులకు ఒకేమారు లభించదు. జీవుని ఆవరించి ఉన్న కారణ శరీరము నశించి బ్రహ్మమునందు ఐక్యము చెందును. మిగిలిన జీవులు కారణదేహముతో ఉండును.

గమనిక : – సృష్టి జరుగు సమయమున కర్మానుసారం జీవునికి స్థూల, సూక్ష్మ శరీరాలు లభిస్తూ ఉంటాయి. (బ్రహ్మ సృష్టి ఆరంభించాక కారణదేహంతో వచ్చిన వాసనల ప్రకారం సూక్ష్మ స్థూల శరీరములు లభిస్తుంది. సామాన్య జీవులకు బ్రహ్మప్రళయ పర్యంతము సూక్ష్మశరీరము ఆవరించి ఉంటుంది)

(క) జీవునికి స్థూల, సూక్ష్మ, కారణ దేహములు ఉంటాయి.

(కా) జాగ్రదవస్థ – అహంవృత్తి, అవిద్యలలో లీనమై ఉండును

(కి) సుషుప్తి – అహంవృత్తి పడిపోయింది కానీ, అవిద్యలో లీనమయింది

(కు) తురీయము – అహం పడిపోయింది కానీ, బ్రహ్మమునందు విలీనమయింది.