పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్టప్రమాణములు

అష్టప్రమాణములు

1 ప్రత్యక్షము, 2 అనుమానము, 3 ఉపమానము, 4 శబ్దము (లేదా ఆగమము), 5 అర్థాపత్తి, 6 అనుపలబ్ధి, 7 సంభవము, 8ఐతిహ్యము.

*ప్రమాణము ఇది సత్యము అని గ్రహించుటకు యోగ్యమైనది.*
1. ప్రత్యక్షము : : (1) చక్షురాది ఇంద్రియ గోచరమగునది. (2) స్వయంగా తెలుసుకొన్న అనుభవం. రూపరసగంధాదులను గుర్తించే ఇంద్రియాల ద్వారానే పదార్థ జ్ఞానం తెలుసుకొనే పద్ధతి ప్రత్యక్ష ప్రమాణం. ఇందులోనూ నాలుగు విధానాలు ఉన్నాయి,. అవి : ఘట ప్రత్యక్షం, ఘటత్వ ప్రత్యక్షం, ఘట రూప ప్రత్యక్షం, ఘటరూపత్వ ప్రత్యక్షం. ఘటాన్ని కంటితో చూడటం ఘట ప్రత్యక్షం. దీనినే సంయోగం అని కూడా అంటారు. ఒకప్పుడు ఘటాన్ని చూసిన అనుభవం వల్ల ఫలానా వస్తువు ఘటరూపమనుకోవడం ఘటత్వ ప్రత్యక్షం. దీనిని సమవేతం అని కూడా అంటారు. శంఖానికి వలె పైభాగం సన్నగా మెడవలె ఉంటుంది కనుక ఫలానా పాత్ర కూజా అనుకోవడం ఘట రూప ప్రత్యక్షం. దీనిని కూడా సంయోగం అంటారు. గతంలో ఘటరూపత్వ వివరం తెలిసిన అనుభవం చేత తెలియడం ఘటరూపత్వ ప్రత్యక్షం. దీనిని కూడా సమవేతం అంటారు. ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించేవారు పరబ్రహ్మాన్ని ఒప్పుకోరు.
2. అనుమానము : : అనుమాన ప్రమాణంలో పంచావయవ వాక్యాలు ఉన్నాయి. అవి: ప్రతిజ్ఞ, పక్షం, సాధ్యం, హేతువు, దృష్టాంతం. (కనుపర్తి విద్యానంద నాథులు రచించిన టీకా తాత్పర్యసహిత ‘‘కైవల్య నవనీతం’’ గ్రంథం ఆధారంగా).
3. ఉపమానము : : పదార్థ జ్ఞాన నిరూపణలో ఉపయోగించే పద్ధతి. ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం రెండూ ఇందులో కలుస్తాయి. అలాగే ఉపమానం ఉపమేయం రెండూ ఇందులో ఉపయోగపడతాయి. అందువల్ల దీనిని ‘ఉభయాత్మకం’ అని కూడా అంటారు. ‘‘గోసదృశో గవయ మృగః’’ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గోవు వంటిది గవయ మృగం అని అర్థం. గోవును తెలిసిన వారు గవయమృగం దానివలె ఉంటుందని అర్థం చేసుకొంటారు. ఇలాంటి ఉపమానాలు మూడు విధాలు. 1. గుణోపమం, 2. కర్మోపమం, 3. ప్రయో జనోపమం. (కై.న.)
4. శబ్దము (లేదా ఆగమము) : : వేదములలో చెప్పబడిన ప్రమాణము.
5. అర్థాపత్తి : : కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించ డమని సామాన్యార్థం. పదార్థ జ్ఞాన చర్చలో ఉపయోగించే ఒక పద్ధతి ఇది. ఇందులో శ్రుతార్థాపత్తి, దృష్టార్థాపత్తి అని రెండు పద్ధతులు ఉన్నాయి. శ్రుతార్థాపత్తి అంటే ఫలానా వస్తువు ఫలానా చోట ఉన్నదని విని తెలుసుకోవడం. తాను ఒకసారి వెళ్ళి ప్రయత్నించినప్పుడు అది లేకపోయినప్పటికీ ఎప్పటికైనా దొరుకుతుందని నమ్మకం ఉంటుంది. దృష్టార్థాపత్తి అంటే ఈ మహా విశ్వాన్ని స్వయంగా చూసినప్పుడు దీనికి ఎవరైనా సృష్టికర్త ఒకడు ఉండకపోతాడా అని అతడి ఉనికి పట్ల విశ్వాసాన్ని కలిగించు కోవడం.
6. అనుపలబ్ధి : : పదార్థ జ్ఞాన చర్చలో ఒకానొక ప్రక్రియ. అభావం (లేకపోవుట?).
7. సంభవము : : ఆధేయము ఆధారమును మీరకుండుట, దేనిపై ఆధారపడి ఇది (ఆధేయము) సంభవము అని చెప్పబడినదో ఆ ఆధారమును అతిక్రమించకుండా ఉండుట
8. ఐతిహ్యము : : పురాణాలు, ఇతిహాసాలు అందు చెప్పబడిన ప్రమాణము

1 నుండి 4 వరకు తార్కికులు అంగీకరించు ప్రమాణములు
1 నుండి 6 వరకు వేదాంతులు అంగీకరించు ప్రణాణములు
1 నుండి 8వరకు పౌరాణిక మతమునందు అంగీకరించి ప్రమాణము.
(http://www.andhrabharati.com/dictionary/index.php వారి నుండి కొన్ని గ్రహింపబడ్డాయి.)