పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అమర పురి వర్ణనలు

బలి చక్రవర్తి ఆక్రమిస్తున్న అమరపుర వర్ణనలు వచనాల పటుత్వానికి పెట్టింది పేరు పోతనామాత్యుల వారి రచనా శైలి. అలాంటి మహాకవి "16 అణాల స్వచ్ఛమైన సురేంద్రపురి పైకి దోషాచార చక్రవర్తి ఆక్రమిస్తున్నాడు" అని చమత్కారంగా సూచించిన తీరూ, ఒక్కొక్క వర్ణనకూ రెండేసి అర్థాలను ఆపాదిస్తూ అలంకరించిన తీరు అత్యద్భుతం. .

1 || ఆ అమరావతీ పట్టణం సముద్రం మాదిరిగా అనిమిషకౌశిక వాహిని విశ్రుతమైఉన్నది. || చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది. || దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది
2 || ఆ పట్టణం వేదవాక్యం వలె అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది. || పవిత్రమైన అక్షరాలతో నిండినది. || నిర్మలమైన బంగారంతో అతిశయించినది.
3 || ఆ పట్టణం శివుని కంఠం మాదిరిగా భోగిరాజ కాంతమై ఉన్నది. || సర్పరాజులతో ప్రకాశించుచున్నది. || ధనవంతులైన ప్రభువులతో ఒప్పుచున్నది.
4 || ఆ పట్టణం జవరాలి వక్షోజంవలె సువ్రతమై ఉన్నది. || గుండ్రంగా ఉన్నది. || మంచి చరిత్ర కలది.
5 || ఆ పట్టణం వృత్తసమూహంవలె సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది. || గురువులతోనూ లఘువులతోనూ యతులతోనూ ఒప్పుతున్నది || బృహస్పతి నీతి నియమాలతో కూడినది.
6 || ఆ పట్టణం శ్రీ రామచంద్రుని తేజస్సువలె ఖర దూషణాది దోషాచరులకు చేరారనిదై ఉన్నది. || ఖరుడూ దూషణుడు మొదలైన రాక్షసులకు చేరశక్యం కానిది. || కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించు వారికి పొందశక్యం కానిది.
7 || ఆ పట్టణం విద్వాంసుని చరిత్రవలె అమలాంతరంగ ద్యోతమైనది. || స్వచ్ఛమైన హృదయాలకు స్పురించేది. || నిర్మలమనస్కులైన పుణ్యాత్ములతో ప్రకాశించేది.
8 || ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తనంవలె సన్మార్గభాతి సుందరమైనది. || మంచి మార్గములో మిక్కిలి చక్కగా ప్రకాశంచునది || ఆకాశమార్గమందలి చుక్కలతో మిక్కిలి చక్కనైనది.
9 || ఆ పట్టణం అందమైన ఉద్యానవనంవలె రంభాంచితాశోకపున్నాగమైనది. || అరటి చెట్లతో కూడిన అశోకవృక్షాలు పున్నాగవృక్షాలు కలది || రంభతో కూడిన ఆనందంగా ఉన్న పురుష శ్రేష్టులు కలది.
10 || ఆ పట్టణం సురపొన్న వృక్షంవలె సురభి సుమనో విశేషమైనది || సుగంధంతో కూడిన పుష్పాలతో అతిశయించినది. || కామధేనువులతోనూ దేవతలతోనూ నిండినది.
11 || ఆ పట్టణం ఆదిశేషుని శిరస్సు వలె ఉన్నత క్షమా విశారదమైనది. || మహోన్నతమైన భూమండలంకలది. || విశేషమైన క్షమాగుణంతో ఒప్పుతున్నది
12 || ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళ జీమూత ప్రకాశితమైనది || తెల్లని మేఘాలతో విరాజిల్లుతున్నది || తెల్లని కొండలతో ప్రకాశించునది
13 || ఆ పట్టణం కృష్ణాజిన దానంవలె సరస తిలోత్తమమైనది. || మంచి నవ్వులతో ఒప్పిదమైనది. || సరసురాలైన తిలోత్తమతో కూడినది
14 || అ పట్టణం ఉత్తమ పురుషుని వాక్కువలె అనేక సుధారస ప్రవర్షమైనది. || అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది. || అఖండమైన అమృతవర్షాన్ని కురిపించేది.
15 || ఆ పట్టణం వర్షఋతువు ప్రారంభంవలె ఉల్లసదింద్ర గోపమైనది. || ప్రకాశించే ఆరుద్ర పురుగులుకలది. || ప్రకాశించే ఇంద్రునిచేత రక్షింపబడేది
16 || ఆ పట్టణం నందీశ్వరుని మూపురంవలె విచక్షురార్యాంలంకృతమైనది. || శివపార్వతులతో అలంకరింపబడినది || వేల్పుపెద్దలతో విరాజిల్లుతున్నది.