పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నవవిధ భక్తి

నవవిధభక్తి 10.2-249-మ,

మూల సంస్కృత భాగవతంలో నవవిధ భక్తులను ఈ శ్లోకంలో వర్ణించారు

శ్లో.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

బమ్మెర పోతనామాత్యుల వారు ఈ నవవిధ భక్తులను ఇలా మత్తేభంలో ఎంతో చక్కగా వర్ణించారు.

7-167-మ..

నుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
నునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ త్యంబు దైత్యోత్తమా!

భావము:
రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణసుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.
వీటి వివరం చూడండి:-

1. భగవంతుని లీలలను వినడం . శ్రవణము
2. ఆయన లీలలను పొగడడం. కీర్తనము
3. నిరంతరం భగవంతుని నామం తలస్తూ ఉండడం. స్మరణము
4. స్వామివారి పాదములు ఒత్తుట మున్నగు సేవలు చేయడం . పాదసేవనము
5. స్వామిని నిత్యం పూజించడం. అర్చించడము
6. భక్తి తో నమస్కారములు చేయడం. వందనము
7. దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావముతో సేవించడం . దాస్యము
8. స్వామి నా చెలికాడు అనే భావనతో మెలగుట. సఖ్యము
9. స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  ఆత్మార్పణం చేయడం. ఆత్మ నివేదనము

ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు. 

ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల  గూర్చి  మనం తెలుసుకుందాం...

1. శ్రవణము . పరీక్షిన్మహారాజు . (భాగవతాన్ని (భగవంతుని భక్తుల కధలను) విని తరించాడు )
2. కీర్తనము . శుక బ్రహ్మ . (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు)
3. స్మరణము .   ప్రహ్లాదుడు . (ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)
4. పాదసేవనము . లక్ష్మీదేవి . (అమ్మ గూర్చి ఏమని చెప్పేది, అమ్మ భక్తి తెలియనిదెవరికి )
5. అర్చనము . పృథు మహారాజు . (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది)
6. వందనము . అక్రూరుడు . (భాగవతం లో దశమస్కంధంలో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుడు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి)
7. దాస్యము . ఆంజనేయ స్వామి . (స్వామి హనుమ యొక్క దాస భక్తి, వారు శ్రీ రామచంద్రమూర్తిని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)
8. సఖ్యం . అర్జునుడు . (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)
9. ఆత్మనివేదనము . బలిచక్రవర్తి . (వామనావతరములో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు)