పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : వచన వైభవాలు - 2


భాగవత వచనవైభవాలు-2

పద్య సూచిక;-
అది మఱియును మాతులుంగ, లవంగ, ;
ఇట్లు విష్ణుండు గుణత్రయా ;
ఇట్లమ్మహానదీప్రవాహంబు, ;

up-arrow (4) 8-24-వ.

అది మఱియును మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుల, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముక, కదంబ, కరవీర, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశు పాశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వీరున్నివహాలంకృతంబును; మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును; కనకమయ సలిల కాసార కాంచన, కుముద, కల్హార, కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; తుహినకరకాంత, మరకత, కమలరాగ, వజ్ర, వైఢూర్య, నీల, గోమేధి,క పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతట దరీ విహరమాణ విద్యాధర, విబుధ, సిద్ధ, చారణ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును; గంధగజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావృక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపము నందు.
భావము:- ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడు మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడిమామిడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, మఱ్ఱి, కొండమల్లి, కుంద, ఎఱ్ఱ గోరింట, పచ్చ గోరింట, కాంచనం, ఖర్జూరం, కొబ్బరి, వావిలి, చందనం, వేప, మందారం, నేరేడు, నిమ్మ, గురివింద, ఇప్ప, తాడి, తక్కోలం, చీకటి మాను, గిరికతాడి, తియ్యమామిడి, మద్ది, మోరటి, మారేడు, ఉసిరి, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోక, మోదుగ, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువక, మంచి మల్లె మొదలైనవి వసంత కాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు పొదలు అన్ని ఎప్పుడు చక్కగా చిగుర్లు చిగురిస్తు, రెమ్మలు పల్లవిస్తు, మొగ్గలు తొడగుతు, పూలు పూస్తు, పండ్లు కాస్తు ఉంటాయి. ఎఱ్ఱమన్ను ఇసుకలు కలిగిన అనేకమైన చక్కటి ఇసుకతిన్నెలు కల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాలనుండి రసాలు కారి కాలువ కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలో బంగారంలాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు, తెల్లకలువలు, ఎఱ్ఱ కలువలు, పద్మములు ఉన్నాయి, వాటి సువాసనల మధువు ఎడతెగకుండ తాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్ళతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంతపక్షులు, కలహంసలు, కారండవాలు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు మొదలైన నీటిపక్షుల గగ్గోలుతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. చలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు నీలాలు, గోమేధికాలు పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు వెండి శిఖరాలు చరియలు ఉన్నాయి. అక్కడ విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు, కింపురుషులు తమ ప్రియురాళ్ళతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వతమైన అలవాలంగా ఉంది. అందులో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గ మృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవిపందులు, అడవిదున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి ఎప్పుడు పోరాటాలు చేస్తుంటే చూసిన, యమ భటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు.
రహస్యార్థం: వసంత సమయ సౌభాగ్య సంపద అనగా ఈశ్వర ధ్యానం అంకురిస్తున్న, సంసారం అనే అరణ్యంలో రాగాది పల్లవములు, విషయ పుష్పములు మొదలుగా గల వృక్షాలతో శోభాయుక్తం అయి, మోహాన్ని కలిగిస్తున్నది. ఆ సంసృతి అనే పాదపములకు బీజము అజ్ఞానం. దేహమే ఆత్మ అనెడి భావన అంకురం. లేచిగురు అనే రాగం. కర్మం అను దోహజం (జలం), కలిగిన చెట్ల వేళ్ళకు కొమ్మలకు మధ్య ఉండే కాండం స్థూలోపాధి. చివరి కొమ్మలు ఇంద్రియాలు. పుష్పములు శబ్దాది విషయములు. ఫలములు అనేక జన్మల నుండి వస్తున్న కర్మ వాసనలచే జనించు ప్రారబ్దానుభవాలైన దుఃఖాదులు. ఆ ఫలాల్ని అనుభవించేవి అయిన పక్షులు అను జీవులు. కలిగి ఉన్నాయి ఆ పాదపాలు. మణివాలుకానేక విమల పులినతలములు అనే రాబోవు దుఃఖాదులను మరగు పరచి తాత్కాలిక ఫలాలు అను ఆభాససుఖాలను కలిగిస్తున్నాయి. ఆయా సౌఖ్యా లను దుఃఖాలుగా గ్రహించి భక్తి జ్ఞాన ప్రవాహాలు తీరస్థ జ్ఞాన ఫల రంధ్ర స్రావకములు అనే ఆనంద రసాసావాదకములు శుక, పికాది పక్షులు కలిగి ఉన్నవి అగు ఆ వనాలు. భక్తి లతలు గుబురులు పుట్టి ప్రాకినవి. పుణ్యాలు అనే చివుర్లు చిగురించాయి. సచ్చిదానందం అను పుష్ప రస స్రావంతో కూడిన బ్రహ్మజ్ఞానం అనే ఫలం ఫలించింది. కనకమయ అనగా హిరణ్మయ మండలం. దాని యందలి హృత్పద్మాలు అందు నివసించే తృష్ణ సంబంధి మధుపాలు సంచరిస్తున్నాయి. మధుపాలు కనుక పైకి కిందకి అసంతుష్టిచే వ్యభిచరిస్తూ సంచరిస్తూ ఉంటాయి. సమీప సంచార నభోంతరాళ కల హంస పాలునీరు వేరు చేసి గ్రహించగల పక్షిరాజు అను పరమహంస. నామరూపాత్మక మాయాకల్పిత జగత్తు అనే నీరు వదలి. సచ్చిదానందరూప బ్రహ్మము అనే పాలు వేరు చేసి గ్రహిస్తాడు. అట్టి ద్విజ(పక్షి) శ్రేష్ఠులు పరమ హంసలు ఉన్నారు. ఇంకా లింగ శరీరాణ్యంలో ఉండే, క్రోధం అన్ పెద్దపులి, లోభం అనే శరభం (సింహాలను చంపే క్రూర మృగం). మోహం అనే పంచాననం (సివంగి), కామం అనే భల్లూకం (ఎలుగుబంటు), మదం అను జంబుకం (నక్క), మత్సరం అను కోక (తోడేలు, అడవి కుక్క) కలిసి చిత్తం అనే హరిణం (లేడిని) బాధిస్తున్నాయి. అట్టి త్రికూటమునందు

up-arrow (5) 8-624-వ.

ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబు లును, సముద్రంబులునుఁ, జలదచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లో కంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్ర ములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబు లును, జానువులఁ బతత్త్ఱ్ఱిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును, హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురంద రాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరో జంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయ నంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళం బున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటం బునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామం బును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణం బుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశం బుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణం బుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘం బులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖ డ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కే యూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి.
భావము:- ఈవిధంగా విష్ణువు సత్త్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశమూ, స్వర్గమూ, దిక్కులూ, దిక్కుల మధ్య ప్రదేశాలూ, సముద్రాలూ, చరాచరములైన సమస్త ప్రాణులూ తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకమూ, సువర్లోకమూ, మహార్లోకమూ, జనోలోకమూ, తపోలోకమూ, దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్నిచోట్ల మూలమూలలూ సందుసందులూ నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమినీ, పిక్కలలో పర్వతాలనూ, మోకాళ్ళలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ, రహస్యాంగంలో ప్రజాపతులనూ, పిరుదులలో రాక్షసులనూ, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలనూ, వక్షంలో నక్షత్రసమూహాన్నీ, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మి దేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులూ, తలలో స్వర్గలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలనూ, ముక్కుపుటాలలో వాయువునూ, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సునూ, నాలుకలో వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలనూ, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్నీ, క్రింది పెదవిలో లోభాన్నీ, స్పర్సలో కామాన్ని, రేతస్సులో జలాన్నీ, వీపులో అధర్మాన్నీ, అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ, నవ్వులో మాయావిశేషాలనూ, రోమాలలో సస్యాలనూ, నరాలలో నదులనూ, గోళ్ళలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మనూ, ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచర సకలప్రాణులనూ, ఇమిడించికొన్నాడు. ఆయన మేఘంవలే మ్రొగే పాంచజన్యమనే శంఖంతో, శార్జ్గమనే ధనస్సుతో, సుదర్సనమనే చక్రముతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంపపొదులతో ప్రకాశించుచున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలుతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాలమొల మొలనూలుతో, పీతాంబరంతో, వైజయంతీమాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడూ, జయుడూ, విజయుడూ మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలిముసుగుగా ఒప్పుతున్నది.

up-arrow (6) 9-230-వ.

ఇట్లమ్మహానదీప్రవాహంబు, పురారాతిజటాజూటరంధ్రంబుల వలన వెలువడి, నిరర్గళాయమానంబై, నేలకుఁ జల్లించి, నెఱసి నిండి పెల్లు వెల్లిగొని, పెచ్చు పెరిగి విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపుఁ గామధేనువు చందంబున ముందఱికి నిగుడు ముద్దుఁ జందురు తోడి నెయ్యంబునఁ గ్రయ్య నడరి చొప్పుదప్పక సాఁగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిఁ బెంపుఁ గలిగి మహేశ్వరు వదనగహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబై య మ్మహీపాల తిలకంబు తెరువు వెంటనంటి వచ్చు వెలియేనుఁగు తొండంబుల ననుకరించి పఱచు వఱదమొగంబులును, వఱదమొగంబుల పిఱుందనందంద క్రందుకొని పొడచూపి తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలం బైన బుగ్గలును, బుగ్గలసంగడంబునం బారిజాతకుసుమ స్తబకంబుల చెలువంబులం దెగడు వెలినురువులును, వెలినురువుల చెంగట నర్థోన్మీలిత కర్పూరతరుకిసలయంబులఁ చక్కందనముఁ గేలిగొను సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవళజలధరరేఖాకారంబుల బాగు మెచ్చని నిడుద యేఱులును, నేఱులం గలసి వాయువశంబున నొండొంటిం దాఁకి బిట్టు మిట్టించి, మీఁది కెగయు దురితభంగంబులైన భంగంబులును, భంగంబులకొనల ఛిన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం బెగసి, ముత్తియంపు సరుల వడుపున, మల్లికాదామంబుల తెఱంగునఁ గర్పూరఖండకదంబంబుల చెలువంబున నిందుశకలంబుల తేజంబునఁ, దారకానికరంబుల పొలుపున మెఱయుచు, ముక్తి కన్యా వశీకరంబులైన శీకరంబులునుం గలిగి, మధ్యమలోక శ్రీకరంబై, శ్రీకరంబు తెఱంగున విష్ణుపదంబు ముట్టి, విష్ణుపదంబు భాతి నుల్లసితహంసరుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభితకువలయంబై, కువలయంబు చెన్నున బహుజీవనంబై, జీవనంబులాగున సుమనోవికాసప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రారామంబై, రామచిత్తంబు మెలఁపువం దనవారిలోఁజొచ్చిన దోషాచరుల కభయప్రదాన చణంబై, ప్రదానచణ వర్తనంబు భాతి సముపాసిత మృత్యుంజయంబై, మృత్యంజయురూపంబుపోలిక విభూతి సుకుమారంబై, కుమారచరిత్రంబుఠేవను గ్రౌంచప్రముఖవిజయంబై, విజయ రథంబుభాతి హరిహయామంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామగిరివనప్రవేశకామంబై, కామకేతనంబు పెల్లున నుద్దీపిత మకరంబై మకరకేతను బాణంబు కైవడి విలీనపరవాహినీకలిత శంబరంబై, శంబరారాతి చిగురు గొంతంబుసూటి నధ్వగవేదనాశమనంబై, శమనదండంబు జాడ నిమ్నోన్నత సమవృత్తంబై, వృత్తశాస్త్రంబు విధంబున వడిగలిగి సదా గురులఘువాక్యచ్ఛటా పరిగణితంబై, గణితశాస్త్రంబు కొలఁదిని ఘనఘనమూల వర్గమూల సంకలిత భిన్నమిశ్ర ప్రకీర్ణఖాతభీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవద్గీతంబై, గీతశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానాశబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువడి హల్లు గలిగి, మహాభాష్యరూపావతారవృత్తి వృద్ధిగుణసమర్థంబై, యర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంబై, దృష్టాంతంబు తెఱంగున సర్వసామాన్య గుణవిశేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణతత్పరంబై, పరబ్రహ్మంబుగరిమ నతిక్రాంతానేక నిగమంబై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణపదక్రమసంగ్రహంబై, గ్రహశాస్త్రంబు పరిపాటిని గర్కట మీన మిథున మకరరాశి సుందరంబై, సుందరి ముఖంబు పోఁడిమిని నిర్మల చంద్రకాంతంబై, కాంతాధరంబు రుచిని శోణచ్ఛాయావిలాసంబై, విలాసవతి కొప్పునొప్పునఁ గృష్ణనాగాధికంబై, యధికమతిశాస్త్రసంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయ విభ్రమంబై, విభ్రమవతిచనుదోయి పగిది నిరంతర పయో వ్యాప్తాఖిలలోక జీవనప్రద తుంగభద్రాతిరేఖా సలలితంబై, లలితవతి నగవు మించున నపహసిత చంద్రభాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖలకన్యకావిస్తారంబై, తారకెంగేలి యొడికంబున నాక్రాంత సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోపవారణంబై, వారణంబు పరుసునం బుష్కరోన్నత సంరంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయ దశం బై, దశరథ తనయు బొమముడి చాడ్పున సింధుగర్వ ప్రభంజనం బై, ప్రభంజతనయు గదపెట్టు మాడ్కిని సమీపగత దుశ్సాసన దుర్మద నివారకరంబై, వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహరుచ్చలిత కంకణాలంకృతంబై, కృతయుగంబు నోజ నపంకంబై, పంకజాసనుముఖంబు నొఱపునఁ బ్రభూతముఖ్యవర్ణంబై, వర్ణగుణితంబు తెఱకువను బహుదీర్ఘబిందు విసర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావమధురంబై, మథురాపురంబు సొబగున మహానందనందనంబై, నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై, కౌశికహయంబు రీతి సుదశధ్రువంబై, ధ్రువు తలంపు క్రియం గ్రియాబరిశీలిత విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునఁ బ్రముదిత నరంబై, నరసింహు నఖరంబుల భాతి నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్రదానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభివనంబై, నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనికను సంభృత మకర పద్మ మహాపద్మ కచ్ఛపంబై, కచ్ఛప కర్పరంబు బలిమిని బతితశైలసముద్ధరణంబై, ధరణీధరంబు సాటి నుత్తుంగ తటముఖ్యంబై, ముఖ్యవరాహంబు గరిమ నున్నత క్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనోరామం బై, రామచంద్రుని బాణంబుకడింది నభాగ్యత ఖరదూషణ మదాపహరణ ముఖరంబై, ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూలచ్ఛే దన ప్రబలంబై, బలరామహలంబుభాతిని బ్రతికూలసన్నికర్షణ ప్రబుద్ధంబై, బుద్ధదేవునిమేని యొఱపున నభియాతి రక్షోదార మనోహరం బై, హరతాండవంబు మేర నుల్లసితానిమిషంబై, యనిమిషావతారంబు కీర్తిని శ్రుతి మంగళప్రదంబై, ప్రదాత యీగి సూటినర్థ పరంపరా వామనంబై, వామనచరణరేఖను బలివంశవ్యపనయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామభేదమాయోపాయ చతురంబై, చతురాన నాండంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్యమానం బై, మానినియన లోఁతు చూపక, గరితయన చడిచప్పుడు చేయక, ముగుద యన బయలు పడక, ప్రమద యన గ్రయ్యంబాఱుచుఁ, బతివ్రత యన నిట్టట్టుఁ జనక, తల్లియన నెవ్వియైన లోఁగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, నంతకంతకు విస్తరించి గుఱిగడచి, యవాఙ్మానస గోచరంబై ప్రవహించి.
భావము:- ఆ ప్రకారం అవతరించిన ఆ మహానది పరమశివుని జటాజూటాల రంధ్రాలనుండి దూకి, నేలపైచేరింది. అడ్డూ ఆపు లేకుండ ఉరికి, వ్యాపించి, మిక్కిలి వడిగా ప్రవహించసాగింది. ఇష్టం వచ్చినట్టు గంతులేసే దూడ వెంట పరుగులు తీసే ప్రాయంలో ఉన్న కామధేనువులా, చంద్రుడి స్నేహముతో ఉప్పొంగినా దారి తప్పకుండగ ఉప్పొంగే పాలసముద్రంలా, పరమశివుడు పలికే ఓంకారాన్ని అనుసరించి వెలువడే శబ్దబ్రహ్మములా ఆ గంగాదేవి పొంగిపొరలుతూ ముందుకు ప్రవహిస్తూ అతివిస్తార విలాసాలతో ఆ రాజశ్రేష్ఠుని అనుసరించి రాసాగింది. అలా తెల్లని ఐరావతం తొండాల వలె కనబడుతూ పరుగెట్టె ప్రవాహాల ముందు భాగపు వరదపోటుల వెంట అక్కడక్కడ కన్నెపిల్లలకి కొత్తగా పుట్టే స్తనాల వలె నీటిపొంగులు కమ్ముకుంటున్నాయి. ఆ నీటిపొంగులతో పారిజాత పూల గుత్తుల చక్కదనాన్ని మించిన తెల్లని నురగలు. ఆ తెల్లని నురగల పక్కన అరవిరిసిన కర్పూర చిగుళ్ళ సోయగాలను మించే సుడిగుండాలు. ఆ సుడుల పక్కల తెల్లని మేఘాల కన్నా అందమైన పొడవైన ప్రవాహాలు. ఆ ప్రవాహలలో కలిసిపోయి గాలివేగానికి పైకి లేచే పాపనాశకరాలైన అలలు. ఆ అలల చివర్లు విరిగి పైకి ఎగిరిపడే తుంపరలు. మోక్ష ప్రదాయాలు అయిన ఆ తుంపరలు ముత్యాల దండల వలె, మల్లెమాలల వలె. కర్పూబిళ్ళల పేర్లు వలె చంద్రకళలో ప్రకాశించే చుక్కల వలె మెరుస్తూ ఉన్నాయి. ఆ తుంపరలతో భూలోకానికి మంగళప్రదం అయిన లక్ష్మీదేవి చేయి వలె ప్రకాశిస్తోంది. పరమహంసలతో, హంసలతో ప్రకాశించే వైకుంఠంలా శుక్లపక్షములో శోభిల్లే కలువలు కలిగి విలసిల్లుతోంది. భూమండలం వలె అనేకమైన జీవికలు, నీరు కలగి, జీవితాల వలె మంచి మనసులు కలిగి వికసిస్తోంది.
అనేక సేనలు, బకుడు, భీముడు, సుభద్ర, అర్జునుడు, కథలతో శోభించే భారతపర్వంలా, పెక్కు చక్రవాకాలు, కొంగలు, మంచికాటుకపిట్టలు, భయంకరమైన అఘాతాలు, అలలుతో మనోఙ్ఞంగా ప్రవహిస్తోంది. శ్రీరాముని హృదయంలా, తన నీటిలో మునిగిన పాపులకు మెత్తగా శరణం ఇస్తూ భగీరథుని అనుసరిస్తోంది. మృత్యువును జయించిన మహాదాత ప్రవర్తనలా, శివుడిని పూజిస్తూ, విభూతితో కూడిన అందమైన శివుడిలా గొప్ప నడకలతో సుకుమారంగా ప్రవహిస్తోంది. క్రౌంచపర్వతాదులను గెలిచిన కుమారస్వామి చరిత్రలలాగ, కొంగలు మున్నగువానితో జయకరమై వెళ్తోంది. అర్జునుని రథంలా, సూర్యుని గుఱ్రాల వేగంతో, శ్రీరామునికి వనవాసం కలిగించిన మంథర ఆలోచనలలా గొప్ప వడిగా పెద్ద పెద్ద తోటలు, కొండలు, అడవులలో ప్రవహిస్తోంది. మన్మథుని జండా వంటి మొసళ్లతో విలసిల్లుతోంది. మన్మథబాణం వలె తనలో కలిసిన ఇతర ప్రవాహాలతో పోటీపడి సాగుతోంది. మన్మథుని చిగురుటాకు బాకు వలె, బాటసారుల తాపాన్ని తొలగిస్తోంది. అల్పుల అధికుల పట్ల సమత్వం కల యమదండంవలె, ఎత్తుపల్లాలు లేకుండ సమానంగా ప్రవహిస్తోంది. ఛందోశాస్త్రంలా ఎల్లప్పుడు పెద్ద అలల శబ్దాలు అనే గురువులు, చిన్న అలల శబ్దాలనె లఘువులుతో, మంచి బిగువు, వేగములతో నడుస్తోంది. గణితశాస్త్రంలా ఘనములకు ఉన్నట్లు పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి, ఘనమూలంతో దట్టమైన వేర్లు కలిగి, వర్గమూలాలుతో సజాతి వేర్లు కలిగి. మిశ్రమ భిన్నాల వలె, వేరు జాతులు కలగలిసి విరాజిల్లుతోంది. పరస్పరం రాసుకునే పొదరిండ్లతో, విడిపడ్డ లోయలుతో భయంకరంగా ప్రవహిస్తోంది. చక్కటి స్తుతులు కల భగవద్గీతా సహితమైన భీష్మపర్వంలా సుఖకరమైన శబ్దాలతో సాగుతోంది. గువ్వగుత్తికచెట్ల శబ్దం మున్నగు అనేక రవములు రకరకాల వాయిద్యాల శబ్దాలవలె శోభిల్లగా గొప్ప లయతో ప్రవాహాలు కట్టి నడుస్తోంది, అచ్చులు, హల్లులు కలిగిన వ్యాకరణం వలె అచ్చమైన బిగువు, వడి కలిగి నడుస్తోంది. మహాభాష్య వృత్తిలా వృద్ధిగుణాల సామర్థ్యంతో ప్రవహిస్తోంది. పెక్కు ప్రయోజనాలు, ప్రమాణాలతో, ఉదాహరణలతో కూడిన అర్థశాస్త్రంలా అనేక యోజనాల నిడివిగా ప్రవహిస్తోంది. సామాన్య గుణాల విశేషంతో విలసిల్లే ఉదాహరణలువలె, అందరికి అందుబాటులో ఉండే గుణాల ప్రత్యేకతలతో నడుస్తోంది. భూమిని భరించడంలో నిమగ్నమైన ఆదిశేషుని కార్యంలాగ సుస్థిరమైన గొప్ప యత్నంతో భగీరథుని వెంట ముందుకు సాగుతోంది. వేదాలకు సైతం అతీతమైన పరబ్రహ్మను మించి, అనేకమైన దారులను అతిక్రమిస్తోంది. పెక్కు వర్ణపదక్రమాలతో అతిశయించే వేదాల వలె అనేక రకాల ధ్వనులుతో సాగుతోంది. కర్కాట, మీన, మిథున, మకరాలతో ఒప్పి ఉండే ఖగోళ నియతి వలె పీతలు, చేపల జంటలు, మొసళ్ళ గుంపులతో ఉరకలేస్తోంది. నిర్మలమైన చంద్ర కాంతితో వెలిగిపోయే అందగత్తె మోము వలె స్వచ్ఛమైన చంద్రకాంతిలో మెరుస్తోంది. ఇంపైన పల్చటి సుందరి పెదవి వలె కెంపు రంగుతో విలసిల్లుతోంది. నాగరం ధరించిన శృంగారవతి జుట్టులాగ నల్లదనంతో, పాములతో అతిశయిల్లుతోంది. శారదాదేవి గెలుపుతో కూడిన బుద్ధిమంతుని విస్తారమైన శాస్త్రీయ చర్చ వలె విస్తారమైన సరస్వతీనది సంగమముతో విల్లసిల్లుతోంది. అఖిల సంతానానికి బ్రతుకుతెరువై, శుభకరమైన ఆకారంతో కూడిన సుందరాంగి చనుదోయి సొగసుతో ప్రవహిస్తోంది. సుందరాంగి మందహాసంలా చంద్రభాగ సౌభాగ్యాన్ని అతిశయించి నడుస్తోంది. గొప్ప ఒడ్ఢాణాలు ధరించిన కన్యలతో విహరించే అదృష్టవంతుని వివాహంలా భూమినిండా విస్తరించిన ప్రవాహంతో పరుగెడుతోంది. తార తన చేతితో సుగ్రీవుని తాకినట్లు, యమునానదిని సుందరంగా ఆప్యాయంగా స్పర్శించి భగీరథుని కూడా కొనసాగుతోంది. భీమునిరథం విజృంభణాన్ని అడ్డుకుంటున్న కర్ణుని బాణవర్షం వలె, భీమరథీనది వడిని అడ్డుకొంటూ సాగుతోంది. నీటిని చిమ్మే ఏనుగుతొండము చివర వలె, పైకెత్తబడిన తామరతో అతిశయించి విజృంభిస్తోంది. మంచి సరసం తెలిసిన రంభ నిండు ముఖం వలె, మంచినీటితో అతిశయించి ప్రవహిస్తోంది. సముద్రుని గర్వం సర్వం భంగపరచిన శ్రీరామచంద్రుని బొమముడి వలె సింధునది గర్వాన్ని భంగపరస్తూ ప్రవహిస్తోంది. దరిచేరిన దుశ్శాసనుని దుర్మదాన్ని విరగగొట్టే భీముని గదాఘాతంలా, తనలో మునిగినవారి మహాపాపాలను తొలగిస్తూ పారుతోంది. మాటిమాటికి కదలాడె కంకణాలు అలంకరించిన వేశ్య మణికట్టు వలె, మళ్ళీమళ్ళీ పారె నీటి బిందువులతో నిండి ప్రవహిస్తోంది. కల్మషరహితమైన కృతయుగంలా, కల్మషాలు లేని నిర్మల జలాలతో ప్రవహిస్తోంది. గొప్ప తెలుపుతో ప్రకాశించే బ్రహ్మదేవుని మోముల వలె గొప్ప బ్రాహ్మణజాతిచే ఆశ్రయింపబడుతూ కొనసాగుతోంది. అనేక దీర్ఘాలతో బిందువులతో, విసర్గలతో విలసిల్లే అక్షరాల గుణింతాలలాగ, అధికమైన నీటిబిందువులు వెదజల్లుతు ప్రయాణిస్తోంది. గంభీరమైన భావాలతో మధురమైన అధ్యాయాలతో కూర్చబడిన కావ్యంలా, లోతైన స్వభావంతో, తియ్యని నీటితో విరాజిల్లుతోంది. నందనందనుడు కల మధురానగరంల గొప్ప ఆనందానికి నందనవనంగా అలరారుతోంది. ఇంద్రుడు విహరించే నందనవనం వలె, కౌశకీనదితో విహరిస్తూ ఉంది. ఇంద్రుడి గుఱ్ఱం ఉచ్ఛైశ్రవం వలె, ధ్రువమైన మంచి దశతో ఎడతెగని ప్రవాహాలతో ప్రవహిస్తోంది. విష్ణుచింత కల ధ్రువుని భావాల వలె, లోకపరిశీలన కలిగి నడుస్తోంది, ప్రశస్తమైన విష్ణుమూర్తి దక్షిణావర్త శంఖం వలె, కుడివైపుకి మరలుటలు కలిగి సాగుతోంది. ఉత్తర వివాహం వలె మిక్కిలి నరానందం కలిగి పాఱుతోంది. ఆశ్రయించిన భక్తుడు ప్రహ్లాదునికి గొప్ప వైభవాలను ప్రసాదించిన నరసింహుని గోళ్ళ వలె, ఆశ్రయులకు మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగిస్తూ సాగుతోంది. కామధేనువు కల్పవృక్షాలలాగ, దానాల సమూహంతో కూడి కదుల్తూ ఉంటుంది. పాలు పొంగుతుండే బాలింతరాలి స్తనం వలె, ఎల్లప్పుడు పాఱే నీటితో పొంగుతూ ఉంటుంది. మకరం, పద్యం, మహాపద్మం, కచ్ఛపం అనే నిధులతో తులతూగే కుబేరుని నివాసము వలె, మొసళ్ళతో, తామరలతో, మెట్టతామరలతో, తాబేళ్ళతో నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. కూలిన మథర పర్వతాన్ని పైకెత్తే ఆదికూర్మం యొక్క బలమైన డిప్ప వలె, కొండ గట్లను కదిలించే వడితో ప్రవహిస్తోంది. ఎత్తైన చరియలతో నిండిన కొండల వంటి, ఎత్తైన గట్లతో కాపాడబడుతూ అతిశయిస్తుంటుంది. భూమిని పైకెత్తే ఆదివరాహం వలె గొప్ప ఓర్పు కలిగి పాఱుతుంటుంది, పుణ్యకరమైన దర్భలు కల బ్రాహ్మణుని చేతి వలె, మంచి పవిత్రమైన ఇంపుతో పెంపారుతూ ఉంటుంది. ఎదిరించి వచ్చే ఖరదూషణాదుల గర్వం సర్వం హరించే రామబాణం వలె, చేరవచ్చు పాపుల అహంకారాన్ని అపహరిస్తూ ప్రవహిస్తోంది. రాజ సమూహాన్ని సమూలంగా సంహరించే పరశురాముని గొడ్డలి వలె, పర్వతాలను పెల్లగించేంత బలంగా ప్రవహిస్తోంది. శత్రువులను ఉన్మీలించు బలరాముని నాగలి వలె, ఇరుపక్కల గట్లను ఒరసుకుంటూ ప్రవహిస్తోంది. చేరవచ్చు రాక్షస కాంతలకు మనోహరమైన బుద్దుని నెమ్మేను వలె, ఆశ్రయించిన సర్వులను రక్షించు ఉదారతతో మనోహరంగా పాఱుతోంది. దేవతలను సంతోషింపజేసే శివతాండవం వలె, ఉత్సాహవంతమైన తుళ్ళిపడే చేపలకు అలవాలమైంది. వేదాలకు శుభాలను సమకూర్చే మత్స్యావతారంలా, చెవులకు ఇంపు కలిగిస్తూ ప్రవహిస్తోంది. ధన, వస్తు సమదాయాలతో సుముఖంగా ఉన్న గొప్పదాత వలె, విస్తారమై పాఱుతోంది. బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుడి పాదంలాగ, బలమైన వెదురుపొదలను సైతం కదిలించే టంత వడిగా ప్రవహిస్తోంది. సామభేదమాయోపాయలతో కూడిన నీతిశాస్త్రం వలె, చాతుర్యంతో ఒప్పుతోంది. అపరిమితమైన లోకాలతో జంతుకోటితో నిండి ఉండే బ్రహ్మాండం వలె, లెక్కలేనన్ని జలచరాలతో కొలవబడుతూ ఉంది. గుట్టు తెలియనీని మానవతి లాగ, తెలియలేనంత లోతు కలిగి ప్రవహిస్తోంది. ఎన్ని పనులున్నా హడావిడిపడని ఇల్లాలి లాగ, ప్రశాంతంగా పాఱుతోంది. బయటికిపోని ముద్దరాలి లాగ, గట్లు దాటకుండా పోతోంది. శీఘ్రగమనంగల జవరాలు లాగ, వడిగా ప్రవహిస్తోంది. అటునిటు పోని పతివ్రత లాగ, భగీరథుడు చూపిన దారినే ప్రవహిస్తోంది. అన్నిటిని కడుపులో దాచుకొనే కన్నతల్లిలా, అన్నిటిని తన కడుపులో దాచుకుంటూ పోతోంది. భక్తుల కోరికలు తీర్చు దేవత లాగ, తనను ఆశ్రయించిన వారి కోరికలు తీర్చుచు ప్రవహిస్తోంది. అలా క్రమక్రమంగా పరిమితులను దాటి మాటకు, మనసుకు అందకుండా భాగీరథుని వెంట ప్రవహిస్తోంది.