పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ వామన చరిత్ర : దానవులు వామనుపై కెళ్ళుట

175
అంత నొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని "పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీ మండలంబు నాక్రమించె కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుఁడు సత్యసంధుండు గావున మాటఁ దిరుగక యిచ్చె నతని వలన నేరంబు లేదు ఈ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకట్టుగా నిజ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుటఁ గర్జం" బని తర్జనంబులును గర్జనంబులునుఁ జేయుచు, వజ్రాయుధాది మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి కసిమెసంగి ముసరికొని దశదిశలఁ బ్రసరించినఁ జూచి హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండ బలులుఁ దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులం బరలోకంబున కనుచువారలై వారల నెదుర్కొని కదనంబునకున్ బరవసంబు చేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁ దలంచి దనుజ వల్లభుం డిట్లనియె.
అంతన్ = అంతట; ఒయ్యన్ = మెల్లగ; పూర్వ = ఇంతకుముందు; ప్రకారంబునన్ = వలెనె; వామన = వామనుని; ఆకారంబున్ = రూపును; వహించి = ధరించి; ఉన్నన్ = ఉండగా; వామనునిన్ = వామనుని; కని = చూసి; పదత్రయంబు = మూడడుగులు; వ్యాజంబునన్ = నెపంతో; ఇతండు = ఇతడు; సకల = సమస్తమైన; మహీ = భూ; మండలంబున్ = మండలమును; ఆక్రమించెన్ = ఆక్రమించెను; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; రూప = రూపమున; తిరోహితుండు = మారువేషమున నున్నవాడు; అగు = అయిన; విష్ణుండు = విష్ణువు; అని = అని; ఎఱుంగక = తెలియక; మన = మనయొక్క; దానవేంద్రుడు = రాక్షసరాజు; సత్యసంధుండు = సత్యవాది; కావున = కనుక; మాట = ఇచ్చినమాట; తిరుగక = వెనుతిరుగక; ఇచ్చెన్ = దానమిచ్చెను; అతని = అతని; వలన = వలన; నేరంబు = తప్పు; లేదు = లేదు; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; అప్రతిహత = తిరుగులేని; తేజస్ = మహిమయొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; సజ్జకట్టుగాన్ = సిద్ధముగ; ఈ = ఈ; జగంబులన్ = లోకములను; పరిగ్రహించి = తీసుకొని; పర్జన్య = ఇంద్రుడు {పర్జన్యుడు - పృషు - వర్షణే - పృష + అన్య - జః అంతాదేశః, కృ.ప్ర., 1. వాన కురిపించువాడు, 2. భక్తుల కోరికలను వర్షించు వాడు., ఇంద్రుడు}; ఆదుల్ = మున్నగువారల; కిన్ = కు; విసర్జనంబు = ఇచ్చివేయుట; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఈ = ఈ; పాఱునిన్ = బ్రాహ్మణుని; తూఱి = తప్పించుకొని; పాఱనీక = పారిపోనీయక; నిర్జించుట = సంహరించుట; కర్జంబు = చేయవలసినపని; అని = అని; తర్జనంబులునున్ = వేలెత్తిబెదిరించుటలు; గర్జనంబులును = కేకలేయుటలు; చేయుచున్ = చేయుచు; వజ్రాయుధ = ఇంద్రుడు; ఆది = మున్నగు; మరుత్ = దేవతలను {మరుత్తులు - సప్తసప్త సంఖ్యు లగు వేల్పులు}; జేతలు = జయించినవారు; అగు = అయిన; హేతి = హేతి; ప్రహేతి = ప్రహేతి; విప్రచిత్తి = విప్రచిత్తి; ముఖ్యులు = మున్నగువారు; అయిన = ఐన; రక్కసులున్ = రాక్షసులు; పెక్కండ్రు = అనేకమంది; ఉక్కుమిగిలి = పరాక్రమించి; యుద్ధంబున్ = యుద్ధముచేయుట; కున్ = కు; సన్నధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; పరశు = గండ్రగొడ్డలి; పట్టిస = అడ్డకత్తులు; భల్ల = బల్లెములు; ఆది = మున్నగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; కసిమెసంగి = చెలరేగి; ముసురికొని = మూగి; దశదిశలన్ = అన్నివైపులనుండి; ప్రసరించినన్ = వ్యాపించుచుండగ; చూచి = చూచి; హరి = విష్ణుని; పరిచరులు = దూతలు; సునంద = సునందుడు; నంద = నందుడు; జయ = జయుడు; జయంత = జయంతుడు; విజయ = విజయుడు; ప్రబల = ప్రబలుడు; ఉద్బల = ఉద్బలుడు; కుముద = కుముదుడు; కుముదాక్ష = కుముదాక్షుడు; తార్క్ష్యు = తార్క్ష్యుడు; పుష్పదంత = పుష్పదంతుడు; విష్వక్శేన = విష్వక్సేనుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; సాత్వత = సాత్వతుడు; ప్రముఖులు = మొదలైనవారు; అగు = అయిన; దండనాథులు = సేనానాయకులు; అయుత = పదివేల; వేదండ = ఏనుగులతో; సమ = సమానమైన; ఉద్దండ = అధికమైన; బలులు = బలములు కలవారు; తమతమ = వారివారి; యూథంబులన్ = సేనలను; ఆయుధంబుల్ = ఆయుధములు; తోడన్ = తోపాటు; కూర్చుకొని = కూడగొట్టుకొని; దానవ = దానవుల; అనీకంబుల్ = సైన్యములను; అంబర = పై; లోకంబుల్ = లోకముల; కున్ = కు; అనుచు = పంపెడి; వారలు = వారు; ఐ = అయ్యి; వారల్ = వారిని; ఎదుర్కొని = ఎదుర్కొని; కదనంబున్ = యుద్ధమున; కున్ = కు; పరవసంబున్ = ఉత్సహించుట; చేయుచున్న = చేయుచుండగా; కనుంగొని = చూసి; శుక్రు = శుక్రుని; శాపంబున్ = శాపమును; తలంచి = గుర్తుచేసుకొని; దనుజ = రాక్షస; వల్లభుండు = చక్రవర్తి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
అటు పిమ్మట విష్ణువు మరల తన వామనరూపాన్ని ధరించాడు. హేతి ప్రహేతి విప్రచిత్తీ మొదలైన రాక్షసులు ఇంద్రుడు మొదలగు దేవతలను గెలిచిన వీరులు. అంతటి ఆ రాక్షస వీరులు "ఇతడు మూడడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడినమాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగువారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి." అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. గండ్రగొడ్డళ్ళూ, అడ్డకత్తులూ, ఈటెలూ మొదలైన ఆయుధాలు ధరించి, చెలరేగి అన్నివైపులా మూగారు. అదంతా చూసి విష్ణుసేవకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన సేనాపతులు పదివేల ఏనుగుల బలంతోచొప్పున గల తమతమ సైన్యాలనూ ఆయుధాలనూ సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు.

176
"రాక్షసోత్తములార! రండు పోరాడక;
కాలంబు గాదిది లహమునకు;
ర్వభూతములకు సంపదాపదలకు;
బ్రభువైన దైవంబుఁ రిభవింప
న మోపుదుమె? తొల్లి నకు రాజ్యంబును;
సురలకు నాశంబు సొరిది నిచ్చి
విపరీతముగఁ జేయు వేల్పు నే మందము;
నపాలి భాగ్యంబు హిమ గాక;

176.1
వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు
మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె?
నకు నెప్పుడు దైవంబు మంచిదగును
నాఁడుగెలుతుము పగవారి నేఁడువలదు.
రాక్షస = రాక్షసులలో; ఉత్తములారా = ఉత్తములు; రండు = వెనుకకి వచ్చేయండి; పోరాడక = యుద్ధముచేయకుండ; కాలంబు = తగుసమయము; కాదు = కాదు; ఇది = ఇది; కలహమున్ = యుద్ధమున; కున్ = కు; సర్వ = సమస్తమైన; భూతముల్ = జీవుల; కున్ = కు; సంపద = కలిసివచ్చుటకు; ఆపదలకు = దుఃఖముల; కున్ = కు; ప్రభువు = అధిదేవత; ఐన = అయిన; దైవంబున్ = దేవుని; పరిభవింపన్ = ఓడించుటకు; మనము = మనము; ఓపుదుమె = సరిపోగలమా, సరిపోము; తొల్లి = ఇంతకుముందు; మన = మన; కున్ = కు; రాజ్యంబునున్ = రాజ్యమును; సురల్ = దేవతల; కున్ = కు; నాశంబున్ = చేటును; సొరిదిన్ = క్రమముగా; ఇచ్చి = ఇచ్చి; విపరీతముగన్ = దానికి వ్యతిరేకముగా; చేయు = చేసెడి; వేల్పున్ = దేవుని; ఏమందము = ఏమనగలము; మన = మన; పాలి = పాలిటి; భాగ్యంబు = యొక్క; మహిమ = ఫలమును; కాక = తప్పించి.
వెఱచి = భయపడి; పలుమాఱు = అనేకసార్లు; పాఱెడి = పారిపోయెడి; విష్ణు = నారాయణుని; భటులు = సైనికులు; మిమ్మున్ = మిమ్ములను; ఎగచుట = ఎదిరించుట; దైవంబు = దేవునియొక్క; మేర = ఏర్పాటు ప్రకారము; కాదె = కాదా, అవును; మన = మన; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడు; దైవంబు = అదృష్టము; మంచిది = అనుకూలము; అగును = అగునో; నాడు = అప్పుడు; గెలుతుము = నెగ్గెదము; పగవారి = శత్రువును; నేడున్ = ఈరోజు; వలదు = వద్దు.
"ఓ రాక్షసవీరులారా! ఆగండి! యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలకూ దుఃఖాలకూ అధికారియైన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు. దేవతలకు చేటు కలిగించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేసాడు. అటువంటి దేవుని ఏమనగలము. ఇదే మన అదృష్టఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణుసేవకులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవనిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము. ఇప్పుడు వద్దు.

177
అదియునుం గాక.
అదియునున్ = అంతే; కాక = కాకుండ.
అంతేకాక . . .

178
లుదుర్గంబులు సచివులు
ములు మంత్రౌషధములు హు శేముషియుం
లిగియు సామోపాయం
బులఁగాల మెఱింగి నృపుడు పోరుట యొప్పున్.
పలు = అనేక; దుర్గంబులు = కోటలు; సచివులు = మంత్రులు; బలములు = సేనలు; మంత్ర = మంత్రాంగములు; ఔషధములు = ఔషధములు; బహు = మిక్కిలి; శేముషియున్ = యశస్సు; కలిగియున్ = ఉండికూడ; సామోపాయంబులన్ = అనుకూలవర్తనలద్వారా {సామోపాయము - అనుకూలప్రవర్తన, పంచతంత్రములలోనిది, ఇది అయిదు విధములు 1పరస్పరోపాకారము కనిపింపజేయుట 2మంచితనము 3గుణములను కొనియాడుట 4సంబంధములునెరపుట 5నేను నీవాడనని మంచిమాటలాడుట}; కాలమున్ = సమయము; ఎఱింగి = తెలిసికొని; నృపుండు = రాజు; పోరుట = యుద్ధముచేయుట; ఒప్పున్ = సరియైనపని.
రాజైనవాడు ఎంతటి కోటలూ, మంత్రులూ, సైన్యాలూ, మంత్రాలూ, ఔషధాలూ, తెలివితేటలూ ఉన్నప్పటికీ కాలాన్ని గమనించి ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయడమే సరైన పని.