శ్రీ రుక్మిణీ కల్యాణము : పూర్ణి
109
కువలయరక్షాతత్పర!
కువలయదళ నీలవర్ణ కోమలదేహా!
కువలయనాథ శిరోమణి!
కువలయజన వినుత విమలగుణ సంఘాతా!
భావము:-
భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఈ శ్రీరాముని ప్రార్థనలోని చమత్కర మాధుర్యం తొణికిసలాడుతోంది. కువలయ అని నాలుగు పాదాలు ఆరంభిస్తు లోకం, కలువలు, రాజులు, మానవులు అని నాలుగు రకాల అర్థబేధంతో యమకం పండించిన తీరు అద్భుతం. రెండు గాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు, అర్థభేదం కలిగి, మరల మరల వస్తూ ఉంటే యమకాలంకారం.
110
సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
పరహృదయ విదారీ! భక్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!
భావము:-
పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.
111
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ రుక్మిణీ కల్యాణం బను కథ సమాప్తము.
భావము:-
ఇది సంపత్కరమైన భగవంతుని దయతో జనించిన అద్భుత కవితా నిపుణుడు, కేసనమంత్రి పుత్రుడు, సహజ సిద్ధ పాండిత్య ప్రావీణుడు అయిన పోతనామాత్యునిచేత చెప్పబడిన శ్రీ రుక్మణీదేవి కల్యాణము అనెడి కథ సమాప్తము అగుట.
సర్వే జనాః సుఖినో భవంతు