పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ గజేంద్ర మోక్షణము : పూర్ణి

121
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భునభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ళబహుళకీర్తీ! ర్మనిత్యానువర్తీ!
టీక:- దివిజరిపువిదారీ = శ్రీరామా {దివిజరిపువిదారుడు - దివిజరిపు (రాక్షసు)లను విదారుడు (సంహరించినవాడు), శ్రీరాముడు}; దేవలోకోపకారీ = శ్రీరామా {దేవలోకోపకారుడు - దేవలోక (దేవతందరికి) ఉపకారుడు (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; భువనభరనివారీ = శ్రీరామా {భువనభరనివారుడు - భూభారమును నివారించెడివాడు, శ్రీరాముడు}; పుణ్యరక్షానుసారీ = శ్రీరామా {పుణ్యరక్షానుసారుడు - పుణ్యాత్ములను కాపాడెడివాడు, శ్రీరాముడు}; ప్రవిమలశుభమూర్తీ = శ్రీరామా {ప్రవిమలశుభమూర్తి - మిక్కిలి నిర్మలమైన శుభకరమైన రూపము కలవాడు, శ్రీరాముడు}; బంధుపోషప్రవర్తీ = శ్రీరామా {బంధుపోషప్రవర్తి - ఆత్మీయులను పోషించెడి వాడు, శ్రీరాముడు}; ధవళబహుళకీర్తీ = శ్రీరామా {ధవళబహుళకీర్తి - స్వచ్ఛమైన గొప్ప కీర్తి కలవాడు, శ్రీరాముడు}; ధర్మనిత్యానువర్తీ = శ్రీరామా {ధర్మనిత్యానువర్తి - ధర్మమును ఎల్లప్పుడు ఆచరించు వాడు, శ్రీరాముడు}.
భావము:- దేవతల శత్రువులు అయిన రాక్షసులను తెగతార్చినవాడా! దేవతలకు మేలుచేసినవాడా! భూభారమును నివారించినవాడా! పుణ్యాత్ములను రక్షించేవాడా! నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్ఛమైన గొప్పకీర్తి కలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా! శ్రీరామా!

122
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవత పురాణం బను మహాప్రబంధంబు నందు గజేంద్రమోక్షణ కథా ప్రారంభము, త్రికూటపర్వత వర్ణన, త్రికూట మందలి గజములు, గజేంద్రుని వర్ణన, గజేంద్రుని కొలను ప్రవేశము, కరి మకరుల యుద్ధము, గజేంద్రుని దీనాలాపములు, విష్ణువు ఆగమనము, గజేంద్ర రక్షణము, గజేంద్రుని పూర్వజన్మ కథ, లక్ష్మీ నారాయణ సంభాషణ, గజేంద్రమోక్షణ కథా ఫలసృతి యను కథలుఁ గల గజేంద్రమోక్షణోపాఖ్యానము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శుభకరుడైన; పరమేశ్వర = పరమశివుని; కరుణా = దయవలన; కలిత = జన్మించిన; కవితా = కవిత్వముచెప్పుటలో; విచిత్ర = అద్భుతమైనవాడు; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = కుమారుడు; సహజ = స్వభావ సిద్ధముగా; పాండిత్య = పాండిత్యము కలవాడు; పోతన = పోతన యనెడి; అమాత్య = ప్రెగ్గడచేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; అయిన = ఐన; శ్రీ = శుకరమైన; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; ప్రబంధంబున్ = గొప్ప గ్రంథము; అందున్ = లోని; గజేంద్ర = ఏనుగుల రాజు; మోక్షణ = ముక్తి పొందుట అను; కథా = ఉపాఖ్యానము; ప్రారంభము = మొదలు; త్రికూటపర్వత = త్రికూటము అనెడి పెద్ద కొండను; వర్ణన = వర్ణించుట; త్రికూట = త్రికటపర్వతము; అందలి = లోని; గజములు = ఏనుగులు; గజేంద్రుని = ఏనుగుల రాజును; వర్ణన = వర్ణించుట; గజేంద్రుని = ఏనుగుల రాజు; కొలను = చెరువు లోనికి; ప్రవేశము = దిగుట; కరి = ఏనుగు; మకరుల = మొసలి యొక్క; యుద్ధము = పోరు; గజేంద్రుని = ఏనుగుల పాజు; దీనాలాపములు = మొరపెట్టుకొనుటలు; విష్ణువు = హరి; ఆగమనము = వచ్చుట; గజేంద్ర = ఏనుగుల రాజును; రక్షణము = రక్షించుట; గజేంద్రుని = ఏనుగుల రాజు యొక్క; పూర్వజన్మ = ముందటి పుట్టుక; కథ = వృత్తాంతము; లక్ష్మీ = లక్ష్మీదేవి; నారాయణ = విష్ణువు యొక్క; సంభాషణ = సంభాషణలు; గజేంద్ర = ఏనుగుల రాజుకు; మోక్షణ = ముక్తి లభించుట అను; కథా = వృత్తాంతము యొక్క; ఫలసృతి = నిర్ణయించిన ఫలితము; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; శ్రీ = శ్రీమంతమైన; గజేంద్ర = గజేంద్రునికి; మోక్షణ = ముక్తి లభించుట అను; ఉపాఖ్యానము = వృత్తాంతము.
భావము:- ఇది పరమశివుని దయవల్ల కలిగిన కవితాసౌందర్యం కలవాడూ కేశనమంత్రి పుత్రుడూ సహజపాండిత్యుడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవత పురాణం అనే మహాకావ్యంలోని అష్టమస్కంధంలోని గజేంద్రునికి ముక్తి లభించుట అను ఉపాఖ్యానము ప్రవేశిక, త్రికూటపర్వతము యొక్క వర్ణన, త్రికూటపర్వతము లోని ఏనుగులు, గజేంద్రుని వర్ణించుట, గజేంద్రుడు చెరువులోనికి దిగుట, ఏనుగు మొసలి పోరాటము, గజేంద్రుడు పెట్టుకున్న మొరలు, విష్ణుమూర్తి విచ్చేయుట, గజేంద్రుని రక్షించుట, గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతము, లక్ష్మీ నారాయణుల సంభాషణ, గజేంద్రునికి ముక్తి లభించుట అని కథ వలని లభించు ఫలితము అనే కధలు గల శ్రీ గజేంద్ర మోక్షణము అను ఉపాఖ్యానము సమాప్తము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు