- పోతన చాటువు
నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!
ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. ఆ పైన వత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు. పోతరాజు నలిగిపోతున్నాడు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకిత మివ్వను అంటున్నాడు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నాడు. అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి కూర్చున్నాడు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్ష మైంది. చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితే నేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.
కాటుక = కంటికి పెట్టుకొనెడి నల్లని అంజనము; కంటినీరు = కన్నీరు; చనుకట్టు = రవిక {చనుకట్టు - స్తనములపై కట్టుకొను బట్ట, రవిక}; పయిన్ = మీద; పడన్ = పడునట్లు; ఏలన్ = ఎందుకు, ఏడ్చెదో = ఏడుస్తున్నావు; కైటభదైత్యమర్దనుని = విష్ణుమూర్తికి {కైటభాసురుని చంపిన వాడు, విష్ణువు}; గాదిలి = ప్రియమైన; కోడల = కొడుకు పెండ్లామా {విష్ణువు కొడుకు బ్రహ్మ ఆయన భార్య వాణి}; ఓ = ఓ; మత్ = నా యొక్క; అంబ = తల్లి; ఓ = ఓ, హాటకగర్భురాణి = సరస్వతీదేవి {హాటకగర్భురాణి = హాటకగర్భు (హాటకము (బంగారము / హిరణ్యం) గర్భ (గర్భముగ కలవాడు), బ్రహ్మ} రాణి (భార్య), వాణి; నినున్ = నిన్ను; ఆకటికిన్ = ఆకలికి; కొనిపోయి = తీసుకెళ్ళి; ఆల్ల = ఆ; కర్ణాట కిరాట కీచకులు = కర్ణాట కిరాట కీచకులు; కున్ = కు; అమ్మన్ = అమ్ముకొనను; త్రిశుద్ధిగన్ = ఒట్టు {మనోవాక్కాయకర్మల శుద్ధ}; నమ్ము = సందేహించవద్దు; భారతీ = సరస్వతీదేవి {భారతి = ఈ లోకమునకు భరతముని చేత తేబడినది, సరస్వతి}.
తెలుగుభాగవతం.ఆర్గ్ © [www.teluguBhagavatam.org] జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. ఇది ఎట్టి కాపీరైటు అతిక్రమణలు అంగీకరించదు, ప్రోత్సహించదు. అంతర్జాలంలోని కొన్ని బొమ్మలు, చిత్రాలు కాపీరైటు అభ్యంతరాలు లేనివి అన్న సదభిప్రాయంతో ఈ జాలికలో వాడుకొనటం జరిగింది. కాపీ రైటు అతిక్రమణలు ఏవైనా అనుకోకుండా జేరిపోతే, మా దృష్టిలోకి తీసుకు రండి. వాటిని తొలగిస్తాం.
www.telugubhagavatam.org © site is run on non-profit oriented principles and it won’t infringe any copy rights nor it encourages any such activities. Some pictures, photos from internet were used with good intention that they are not having any copy right restrictions. If any copy right infringements crept up inadvertently, please bring to our notice. They will be deleted.