పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : అచ్చపు జుంటితేనియల

ప్రజాకవి పోతన్న కవిత మాధుర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన కరుణశ్రీ పద్యమిది.


ఉత్పలమాల

చ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్
చ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!


పోతన వంటి మహాకవిని గురించి చెప్పటానికి టిటిడి వారి పోతన భాగవతానికి ప్రధాన సంపాదకత్వం వహించిన కవి శ్రేష్ఠులు అయిన కరుణశ్రీ కన్నా ఎవరు తగిన వారు.
పోతనామాత్యుల వారు మూలానికి మక్కికిమక్కీ అనువాదం చేయకుండా, పురాణ రాజం భాగవతాన్ని అనుభవించి ఆంధ్రీకరించారు. ఆంధ్ర మహా భాగవతంలో ఎక్కడా భేషజాలకు పోకుండా తను నమ్మిన భక్తి ప్రపత్తులను వివరించారు. అదీ అతి రమ్యంగా పండిత పామరులను రంజిల్ల జేస్తూ. అందుకు “సుకవి” అన్నారేమో. అలతి పొలతి పదాలతోనే అనంతార్థాలను కూడా అందించిన మహానుభావుడు; పంచదార పాకంలో పరమ ఆధ్యాత్మిక తత్వాన్ని, విజ్ఞాన సర్వస్వాన్ని పండించిన హాలికుడు; పండిత శ్రేష్ఠుడు, కవి చంద్రుడు కనుక “సుకుమారకళా కళానిధి” అన్నారేమో. అయ్యుండవచ్చు. అందుకే, అలాంటి వస్తువులతోనే పోల్చి చెప్పారు మన కరుణశ్రీ. అవి స్వచ్ఛమైన పట్టు తేనె (అచ్చపు జుంటితేనియలు), చంద్రబింబం నుండి స్రవించే అమృత రసం (ఐందవబింబ సుధారసాలు), గోరు వెచ్చని పాల మీగడ (గోర్వెచ్చని పాలమీగడలు), అప్పుడే విచ్చుకున్న గులాబీ మొగ్గలు (విచ్చిన కన్నెగులాబి మొగ్గలు). ఇలాంటి ముగ్ధ మంజుల మనోజ్ఞమైన వాటికి కూడ మాత్సర్యం కలిగిస్తుందిట (మచ్చరకించు) పోతన కవిత్వం. పోతన కవితా మాధుర్యం అనుభవైక వేద్యం. దానిని మాటల్లో చెప్పాలనే తాపత్రయమే గాని, అదేమైనా ఉపమానాలకి అందేదా,కాదు. అందుకే, “అంతటి మంజుల మనోహర ముగ్ధ శైలి ఎక్కడ నుంచి వచ్చిందయ్యా!” అని ఆయననే అడుగుతున్నారు కవీంద్రులు.

: : చదువుకుందా భాగవతం: బాగుపడదాం: మనం అందరం : :