పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : తల్లీ నిన్ను దలంచి

శార్దూల విక్రీడితము.
ల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షి !సరస్వతీ !భగవతీ !పూర్ణేందు బింబాననా!
- అజ్ఞాత రచయిత చాటువు.
అమ్మా సరస్వతీమాత! పుస్తకం పట్టుకోడానికి ముందు నిన్ను మనసున స్మరించి, పిమ్మట చదువు మొదలుపెడుతున్నాను తల్లీ! ఓ వికసించిన కలువల వంటి విజ్ఞానము ప్రసరించే కన్నులు కల తల్లీ! నిండు చంద్రుని వంటి మోము కల చల్లని తల్లీ! జగన్మోహిని! నా ఉల్లము (మనసు) నందు ఉండి, నా పలుకులలో జృంభణము (వికాసముతో కూడిన అతిశయము) కాన్ (కలుగునట్లు) ఇష్టపూర్తిగా నుతి (స్తోత్రము) లను పలికించు తల్లీ.
ఇది కొన్నిప్రచురణ సంస్థలు గ్రంథానికి ముందు చేర్చిన ప్రార్థన పద్యాలలో ఇవ్వడంతో; ఈ చాటువును పోతన ప్రణీతమనీ వారి భాగవతములోనిది అనీ పొరపాటున భావిస్తూ ఉంటారు. నిజానికి ఈ చాటువు వ్రాసినది ఎవరో తెలియదు.