పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : పార్వతి చెలులు హిమవంతునకు జరిగిన వృత్తాంతంబు చెప్పుట

3-5-వ.
అని పలుమాఱుఁ గుమారిని గీర్తించుచు "గౌరీదేవీ! నీకు పరమేశ్వరుండు ప్రత్యక్షమైన తెఱంగు తేటపడ వినం గుతూహలం బై యున్నది; వినిపింపు" మని యడిగిన దుహినాచలేంద్రునకుఁ బార్వతీదేవిచెలు లగు జయవిజయ లిట్లనిరి.

టీక :-
తెఱగు = విధము; తేటపడు = విశదమగు; తుహినము = హిమము.
భావము :-
అంటూ కుమార్తెను అనేకమార్లు పొగుడుతూ “దేవీ! నీకు పరమేశ్వరుడు ప్రత్యక్షమైన విధము విశదముగా తెలుసుకోవలెనని కుతూహలముగా నున్నది. వినిపించ” మని యడుగగా ఆ హిమవంతునకు కుమార్తయైన పార్వతీదేవి చెలికత్తెలైన జయ, విజయ అనువారు ఈ విధముగా చెప్పారు.

3-6-చ.
వినుము, గిరీంద్ర! నీ తనయ వేగ తపోవనభూమిలోనికిన్
నివిమలాత్మ యై తగిలి సంతతమున్ హృదయంబులోన శం
భునిపదపూజనల్ సలిపి భూరివిచిత్రతపంబు చేసె నీ
జదళాక్షి మంచుకును వానకు నెండకు నోర్చి ధీరతన్.

టీక :-
తగిలించు = లగ్నము చేయు; సంతతము = ఎల్లప్పుడు; భూరి = గొప్ప; వనజదళాక్షి = కలువరేకులవంటి కన్నులు కలది, సతీదేవి; ధీరత = ధైర్యము.
భావము :-
“హిమనగేంద్రా! వినండి. మీ కుమార్తె ఈ కమలజాదళనేత్రి, సతీదేవి శీఘ్రమే తపోభూమికి చేరి నిర్మలహృదయముతో నిరంతరం మదిలో శివుని పాదములను నిలుపుకొని పూజిస్తూ మంచుకు, వానకు, ఎండకు ధైర్యముగా ఓర్చుకొని గొప్ప విచిత్రమైన తపస్సు చేసింది.

3-7-వ.
ఇవ్విధంబున నశ్రాంతంబును నత్యంతఘోరంబును నగు తపంబు సేయుచుండ, నొక్కనాఁడు, గిరీంద్రా! నీ కేమి చెప్ప నప్పరమేశ్వరుండు లీలావినోదంబున బాలుండై వటువేషంబుదాల్చికొని, యేము చరించుచున్న వనంబునకుఁ జనుదెంచి, మమ్ము డగ్గరి “యీ బాలయెవ్వరిబాల?” యని యడిగిన; నేమును సముచితభాషణంబుల “మునీంద్రా! యీ కన్నెయ హిమనగేంద్రుని కన్నియ” యని పలికిన నతండును మాతో మఱియు ని ట్లనియె.

టీక :-
డగ్గరు = సమీపించు.
భావము :-
సతీదేవి ఈ విధముగా ఎడతెగకుండా మిగుల ఘోరతప మాచరించుతున్నది. గిరీంద్రా! ఏమని చెప్పము? ఒకనాడు పరమేశ్వరుడు విలాసంగా బ్రహ్మచారి వేషములో మేమున్న వనానికి వచ్చాడు. మమ్మల్ని సమీపించి “ఈ బాలెవరు” యని యడుగగా మేము “ఈ కన్య హిమవంతుని కుమార్తె” యని చెప్పగా అతను మాతో ఇలా అన్నాడు.

3-8-క.
“ముదితలు మీరందఱు స
మ్మమున సేవింప రాజమందిరములలోఁ
లక వర్తింపఁగ సతి
యిదియేలా సేయఁ దొడఁగె నీ తప” మనియెన్.

టీక :-
సమ్మదము = సంతోషము; వర్తించు = మసలు.
భావము :-
“చెలులైన మీరంతా సంతోషంగా సేవిస్తుంటే రాజమందిరములలో మసలే ఈ సతి, ఇలా ఎందుకోసం ఈ తపస్సు చేస్తోంది?” అని అడిగాడు.

3-9-క.
నిపలుక నంత నెఱుఁగక
మునినాయకుఁ డొక్కఁ డనుచు “ముక్కంటి శివున్
జాక్షి కోరి చేసెడి
తప” మని పలఁకుటయును గాంతామణియున్.

టీక :-
ముక్కంటి = మూడు కన్నులు కలవాడు, శివుడు.
భావము :-
అలా అడుగగా అతను ఏవరో తెలియక ఒక మునిశ్రష్ఠుడని అనుకుని “ఈ పద్మాక్షి, ముక్కంటియైన శివుడిని కోరి తపస్సు చేస్తోంది.” అని చెలులు సమాధానం చెప్పగా.

3-10-వ.
నగేంద్రా! యా వటుకకుమారుఁ డైన శివుండు దాని కి ట్లనియె.

టీక :-
నగము = కొండ.
భావము :-
హివంత కొండలరాజా! ఆ బ్రహ్మచారిగా నున్న శివుడు దానికిలా అన్నాడు.

3-11-సీ.
చెల్లరే! యీజాడ శివుఁడు నీ సాటియే
దేశంబు దిరిగెడు తిరిపె కాఁడె!
హారవాంఛమై డుగ నింటింటికి
సొరిది భిక్షముఁ దెచ్చు జోగి గాఁడె!
క్కగుఱ్ఱము లేక యెద్దునెక్కుచునుండు
తొలుత నెంతయు దరిద్రుండుగాఁడె!
ట్టఁజీరెలు లేక నగజచర్మంబు
ట్టిన పెద్దజంగంబు గాఁడె! చెల్లరే!

3-11.1-ఆ.
ఒంటిగాఁడు గాఁడె! యొలుకులలో భూత
తియుఁ దాను నుండు పసిగాఁడె!
యేల కోరె దతని? నెత్తి కొంపోయెద
న్నుఁ దగిలి రమ్ము; లిననేత్ర!”

టీక :-
చెల్లరే = అయ్యో; జాడ = దారి; తిరిపెగాడు = భిక్షకుడు; సొరిది = వరుస; జోగి = భిక్షకుడు; తొలుత = మొదట; ఒలుకులు; = శ్మశానభూమి; తతి = సమూహము; తగిలు = మోహించు.
భావము :-
“అయ్యయ్యో! శివుడు నీకు సాటా? దేశమంతా తిరిగే బిచ్చగాడు. ఆహారం అడగడానికి ఇల్లిల్లూ తిరిగి భిక్షము తెచ్చుకునే బిచ్చగాడు. ఎక్కడానికి గుఱ్ఱము లేక ఎద్దునెక్కి తిరుగుతుంటాడంటే ముందసలు ఎంత దరిద్రుడో కదా! కట్టుకోవడానికి చీరలు లేక గొప్పగా ఏనుగు చర్మం కట్టుకొన్న పెద్ద జంగము యతడు. ఒంటిగాడు. శ్మశానంలో భూత సమూహములతో పాటు యుంటాడు. అలాంటివానిని ఎందుకు కోరుకుంటావు? నళిననేత్రా! నాతో జతకట్టు, నేను నిన్ను తీసుకువెళ్తాను. నాతో రా.”

3-12-వ.
అని మఱియు నతండు తన నిజ గుణంబులు చెప్పుటయును బార్వతీదేవికి నింద్యంబు లై తోఁచిన నక్కపటతాపసిం జూచి “వీని వనంబు వెడలఁ ద్రోయుం” డని పంచిన, నేమునుం గదసి పెనంగెడు సమయంబున; నంతర్హితుం డై ప్రసన్నత్వంబు నొంది యీశ్వరుండు నిజదివ్యాకారశోభితుం డై నిలిచి తరుణియుం దానును కైలాసంబునకుం బోవ గమకించిన భవదీయ భక్తివశంబున మావిన్నపం బవధరించినవాఁ డై గౌరీదేవి నుపలాలించి నిజమందిరంబునకుం దానే చనియె మేమును జనుదెంచితిమి. కతిపయ దివసంబుల లోపల మన యింటికి నీ కుమారీతిలకంబు నడుగ దగువారలం బుత్తేరంగలవాఁ” డని యేర్పడఁ జెప్పిన.

టీక :-
నింద్యము = నిందావాక్యము; పెనగెడు = పెనుగులాడు; అంతర్హితుడు = మాయమైనవాడు; గమకించు = పూని; భవదీయ = మీయొక్క; అవధరించు = విను; ఉపలాలించు = బుజ్జగించు; కతిపయ = కొన్ని; దివసంబులు = దినములు; పుత్తెంచు = పంపు.
భావము :-
అని ఇంకా తన నిజగుణములను చెప్పగా పార్వతీదేవికవి నిందావాక్యములుగా తోచెను. ఆ కపట తాపసిని గురించి ”వీనిని వనము బయటకు పంపుడు.” అని ఆజ్ఞాపించగా మేము అతనితో పెనుగులాడు సమయములో మాయమయ్యాడు. పిమ్మట, ప్రసన్నత్వముతో ఈశ్వరుడు తన నిజ స్వరూపంతో ప్రత్యక్షమయ్యెను.. గౌరీదేవి, తాను కలిసి కైలాసానికి పోవుటకు సిద్దపడుతుండగా మీ భక్తి వలన మా విన్నపము వినెను. గౌరీదేవిని బుజ్జగించి తాను కైలాసానికి వెళ్ళెను. మేము ఇక్కడకు వచ్చితిమి. కొద్ది దినములలో మన ఇంటికి మీ కుమారిని అడుగుటకు తగు వారలను పంపించగలడు” అని చెప్పగా.

3-13-క.
“త్రిభువనపతికిని శివునకు
భినవకీర్తులను మామ య్యెద” ననుచున్
వివంబున సంతతమును
సంబున శైలవిభుఁడు రంజిలుచుండెన్.

టీక :-
త్రిభువనపతి = భూ, ఊర్ధ్వ, అధో లోకాలకు అధిపతి; అభినవ = కొత్త; విభవము = వైభవము; సంతతము = నిరంతరం; రభసము = ఆతురము, సంతోషము; రంజిలు = ఒప్పారు.
భావము :-
“త్రిభువనాలకు పాలకుడైన శివునకు మామ అవటం నాకు గొప్ప కీర్తి” అనుకుంటూ శైలవిభుడు నిరంతరం వైభవంతో సంభ్రమముతో ఒప్పుచుండెను.

3-14-క.
“తనుమధ్య నిమిత్తంబున
కీర్తులు గలిగె” ననుచు గౌరీకాంతన్
నుఁజేర దిగిచి గారవ
మునలకలు దువ్వి శిరము మూర్కొని ప్రీతిన్.

టీక :-
తనుమధ్య = సన్నని నడుము గల స్త్రీ, సతీదేవి; నిమిత్తము = కారణము; అలకలు = ముంగురులు; మూర్కొను = వాసనచూచు.
భావము :-
“సతీదేవి వలన గొప్పకీర్తి కలిగిన” దనుచు సతీదేవిని తన వద్దకు రమ్మని పిలిచి గారాబముగా ముంగురులు దువ్వి తలను వాసన చూసెను.

3-15-త.
జలోచనతోడ నా హిమవంతు డిట్లనె బాలికా!
నిమిషుల్ నుతియింపఁ గంటి ననంతరాజ్యముఁ గంటి శం
భునికి మామ హిమాచలుం డను పుణ్యకీర్తులుగంటి నా
య వై నను గారవించిన దానఁజేసి తలోదరీ!”

టీక :-
వనజలోచన = పద్మములవంటి కన్నులు కలయామె, పార్వతీదేవి; అనిమిషులు = రెప్ప వాల్చని వారైన దేవతలు; తనయ = కుమార్తె; తలోదరి = పలుచని ఉదరము కలది.
భావము :-
పద్మనేత్రి పార్వతీదేవితో ఆ హిమవంతుడిలా అన్నాడు.” బాలికా! దేవతల పొగడ్తలను పొందాను. అనంత సామ్రాజ్యాన్ని పొందాను. శంభునికి మామ హిమవంతుడని పుణ్యకీర్తిని పొందాను. తలోదరీ! నా కుమార్తెవై నన్ను గారవింపనాకు గొప్పదనము కలుగజేశావు.”

3-16-క.
నిపలుమాఱును బొగడుచు
వియంబున సతియుఁ దాను విమలేందుముఖిన్
ని యని సేవ సేయుచు
నురాగముఁ బొందె శీతలాచలపతియున్

టీక :-
విమలేందుముఖి = నిర్మలమైన చంద్రుని వంటి ముఖము కలయామె, విశాలాక్షి; జనని = తల్లి.
భావము :-
అని హిమవంతుడు భార్య మేనక యిద్దరూ పదేపదే పొగుడుతూ వినయముతో ”తల్లీ” అంటూ సేవ చేస్తూ ప్రీతిని పొందిరి.