పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : ప్రథమ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

భాగవతం – పురాణం

శ్రీమద్భాగవత మహాపురాణం అష్టాదశ పురాణాల లోనిది. అంతే కాదు కావ్యత్రయం లోనిది కూడ. ముందు పురాణం గురించి చూద్దాము. “పురా అపి నవ ఇతి పురాణః ”. ఎంతో పురాతన మైనది అయ్యి ఉండి; ఎప్పటి కప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు కొందరు. సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతులు, మన్వంతర, ఈశానుకథా, నిరోధ, ముక్తి, ఆశ్రయాలు అని పురాణానికి దశలక్షణాలు అంటారు కొందరు. వాటిలో ప్రధానమైనవి మహాపురాణాలు. వీటిలో ప్రసిద్ధమైనవి మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని పద్దెనిమిదింటిని (18) అష్టాదశ పురాణాలు అంటారు. శ్లో. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం. అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథకి. ఇంకా ఉశన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌర్వాస, నందీయ, నారసింహ, నారదీయ, పారశర, అంగీరస సంహి, భృగు సంహిత, మారీచ, మానవ, వాశిష్ఠ, లింగ, వాయు పురాణములు – యని పద్దెనిమిదింటిని (18) అష్టాదశ ఉపపురాణాలు అంటారు. సమస్త పురాణాలను సంస్కృతంలో మూలరచన గావించిన వారు, వేదాలను విభాగించిన వారు వ్యాస భగవానులు. అన్నిటిలోకి ఉత్తమమైన శ్రీమద్భాగవతంలో భగవంతుని గురించి భాగవతుల గురించి చెప్పబడింది. అందుకే సద్యోముక్తి సాధనమిది.

భాగవతం - కావ్యం

హైందవ సాహిత్యంలో ముఖ్యమైనవి మూడు రామాయణ భారత భాగవతాలు. వేదాలు పునాదిరాళ్ళు అయితే, ఈ కావ్య త్రయం స్తంభాలు లాంటివి. రామాయణం మూల రచయిత వాల్మీకి మహర్షి. భారత భాగవతాలకు మూల రచయత వ్యాస భగవానులు. ప్రధానంగా రామాయణం సూర్య వంశ రాజుల చరిత్ర. భారతం చంద్రవంశస్థులది. భాగవతం భగవంతుని, భక్తుల గురించినది అని అనుకోవచ్చు. రామాయణంలో జీవన విలువలకు ప్రాధాన్యం, భారతంలో ఫలవంతమైన జీవనానికి ప్రాధాన్యం. భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే అన్నారు.

1-1-శా.
శ్రీ కైవల్యపదంబుఁజేరుటకునై చింతించెదన్, లోకర
క్షైకారంభకు, భక్తపాలనకళాసంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁగేళిలోలవిలసదృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు, మహానందాంగనాడింభకున్.

భాగవతంలో రామాయణ భారత కథలు కూడ చెప్పబడతాయి. ప్రబంధ లక్షణ సమాలంకృతం, బహు కథారత్నాల సమాహారం భాగవతం. వీటిలో చాలా వాటికి వైయక్తిక సంపూర్ణత కూడ గోచరిస్తుంది. ఈ సమాహారానికి సూత్రంగా శుక మహర్షి పరీక్షిన్మహారాజు లనే స్వర్ణ రజత దారాలతో చక్కగ పేన బడ్డాయి. మధుర శృంగారము మధుర వైరాగ్యము కలగలసిన పురాణమిది. అందుకే మధురాధిపతే రఖిలం మథురం శ్రీకృష్ణుల వారికి ప్రథమపీఠం వేసారు.

వ్యాస భట్టారకుడు

మహాపురాణాన్ని వ్యాసమహర్షులవారు సంస్కృతంలో రచించారు. వేదాలను విభాగించటం, మహాభారతాన్ని రచించిన పిమ్మట సమస్తమైన పురాణాలు ఆ మహానుభావుడే రచించారు. వాటిలో ఉత్కృష్టమైనది శ్రీమద్భాగవతం. ఈ మూల భాగవత రచనా కాలాన్ని నిర్ణయించడం కష్టం. ఇది 5000 సంవత్సరాల కంటె అతి పురాతనమైనది అన్నది నిర్వివాదాంశం. ఈ మూల భాగవతం పన్నెండు స్కంధాలలో పద్దెనిమిదివేల శ్లోకాల బృహద్గ్రంధం.

పోతన

ట్టి మహాభాగవతానికి తెలుగుసేత బమ్మెర పోతన చేయుట తెలుగజాతి అదృష్టం. పోతన గారి ప్రణీతము అంటే ప్రహితమే, ప్రాణిహితమే, పరహితమే. వీరు హలం కలం రెంటికి పదును యున్న కవికుల తిలకులు. కావ్యకన్యకను రాజులకీయని ఆత్మాభిమానంగల హాలికులు. తెలుగుసేతలో ఎనిమిది స్కంధాలు (1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10 స్కంధాలు) వీరి కృతి అని మిగిలిన 5, 6 స్కంధాలు గంగన, సింగనల కృతి అని, 11 మరియు 12 స్కంధాలు నారయ కృతి అని స్థూలముగా అనుకోవచ్చు. తెలుగు సేతలో పన్నెండు స్కంధాలలో ఐదు, పది స్కంధాలు రెండేసి భాగాలుగా ఇవ్వబడ్డాయి. దీని రచనా శైలి పద్యగద్యాల మేలుకలయికతో పండిత పామరుల నిద్దరిని అలరారిస్తుంటుంది. 31 రకాల పద్యగద్య రీతులను ప్రయోగిస్తు మొత్తం 9014పద్యగద్యలలో సాగింది యీ మనోహర కావ్యం. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీ శ 1378 నుండి 1460 అని పలువురు పండితోత్తములచే నిర్ణయింపడినది. శైవమతానుయాయులైన ఆరువేల నియోగి బ్రాహ్మణ బమ్మెర వంశంలో పుట్టాడు. తన వంశాన్నేకాదు తన జాతిని దేశాన్ని కూడ ఉద్దరించాడు. సంస్కృత మహాభాగవతాన్ని ప్రాంతీయ భాషాంతీకరణ చేసినవాటిలో వీరిదే ప్రప్రథమమైనది అంటారు. వీరి ఇతర కృతులు వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగినీ దండకము. వీటిలో వీరభద్ర విజయం శైవమతానుసార గ్రంధం. భాగవతమంత ప్రసిద్ధం కాకపోయినా

జగదీశాయ! నమో నమో నవసుధాసంకాశి తాంగాయ! శ్రీ;
నగనాథాయ! నమో నమో శుభకరానందాయ! వేదార్ధపా;
రగ వంద్యాయ! నమో నమో సురనదీరంగత్తరంగావళీ;
మకుటాగ్రాయ! నమో నమో మునిమనోమందార! సర్వేశ్వరా!

లాంటి చోట్ల వారి కవితా పటుత్వం ప్రస్పుటం గానే పలుకుతుంది. నారాయణ మకుటంతో సాగింది నారాయణ శతకం. భోగినీ దండకం వీరి తొలి రచనే కాదు అందుబాటులో ఉన్న దండకాలలో ఇదే తొట్టతొలిది అంటారు. వీరు సహజ కవులు. వీరి భాగవత రచనాశైలి చక్కెరపాకం ఆపాతమథురమని మహాపండితులు పేర్కొంటారు. పండిత పామరుల నిరువురను మెప్పిస్తుంది. అలా చెప్పకోదగ్గ పద్యాలలో ఒకటి. మందార మకరందమునఁ దేలు. ఇష్టమైన పద్యం లేదా ఇష్టమైన కథనం లేదా మొత్తం గ్రంధం ఏదైనా సరే విడిగా చదువుకోవచ్చు రసపూర్ణంగా స్వసంపూర్ణంగా ఉంటాయి. ఉదా. అల వైకుంఠ పురంబులో పద్యం, రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం ఘట్టాలు. ఇందుకు భాగవతంలోని ఒక పద్యమైనా రానివాడు తెలుగువాడేకాదనెడి నానుడే నిదర్శనము. భాగవతంలో కథలు, శృంగారాలు, వైరాగ్యాలు, పద్యాలే కాదు వివిధ విషయాల వివరాలు, సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. వీటిలో పోతన గారి విశిష్ఠత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీరిది పంచదార పాకం పరమాద్భుతం. అందకే అన్నారు కవులు:

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీసిన తాటియాకులో
పద్దెములందు ఈ మధురభావము లెచ్చటనుండి వచ్చురా!

క్కడ ఒక ముఖ్య విషయం మనవిచేస్తాను. భాగవతం చదువుకొనే టప్పుడు ప్రపంచ గురువులు ఎక్కిరాల కృష్ణమాచార్యులు చెప్పిన మాటలు అవశ్యము జ్ఞప్తి యుంచుకొన వలసినవి, “ఆనందానుభూతి జీవునకు పరమాత్మ యందలి తన్మయ రూపమున పరిపూర్తి చెందుటయే శృంగారము. దానికి మనస్సు నందు, యింద్రియముల యందు స్వీకరింపబడు ప్రతిబింబమే లౌకిక కావ్యాదు లలో వర్ణింపబడుచు, సంసార జీవులలో ననుభవింపబడు శృంగార మనబడు అభాసము.”

ప్రథమ స్కందము

ప్రధమ స్కంధం నిజానికి భాగవతానికి ఉపోద్ఘాతం లాంటిది. పైన చెప్పుకొన్న “శ్రీకైవల్య పదంబు . . . .” పద్యం ఈ స్కంధారంభంలో మొట్టమొదటిది. అలా కైవల్య ప్రాప్తికి ఈ గ్రంధం అంటూనే భాగవతం అంతటిని సూచించారు మన బమ్మెరవారు. ఈ స్కంధాన్ని ఉపోద్ఘాత / పరిచయాలకు వాడినట్లుంటుంది. ఉపోద్ఘాతంలో దేవతా స్తుతులు, పాత రచయితలను గౌరవించిన తీరు, సమకాలీనులను మన్నించిన తీరు, భావికవుల ఆశ్శీస్సులు అందించిన తీరు పోతన వ్యక్తిత్వ విశిష్ఠతను చెప్పక చెప్తున్నాయి. “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి..” మానవులకు అంకిత మివ్వను అనే దృఢనిర్ణయం వ్యక్తపరచి నిజ జీవితంలో దానిని అమలుచేసిన మహానుభావుడు కనిపిస్తాడు. “భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు..” అంటు ఆవిష్కరించిన సవినయ ఆత్మవిశ్వాసం బహుళ ప్రశంసనీయమైనది.

భాగవతం అంటే భగవంతునికి భక్తులకు చెందిన విషయాలు చెప్పేది. “శ్రీ కృష్ణా యదుభూషణా..” అనే అద్భుతమైన పద్యం ఉన్న కుంతిస్తుతి. “ కుప్పించి యెగసినఁ....” పద్యమాణిక్యం ఉన్న భీష్మస్తుతి. “గురుభీష్మాదులు గూడి..” ఉన్న నరుడు నారాయణుని స్మరిస్తు కృష్ణనిర్వాణ చెప్పటం. భాగవతం అంటేనే పారీక్షితం అని పేరుపడ్డానికి కారణమైన పరీక్షిత్తుని పుట్టుక శాపం పొందుట మున్నగు ఎత్తుగడలుతో విరాజిల్లుతోంది యీ స్కంధం.

వృత్తాల వారీ పద్యాల లెక్క

మొత్తం పద్యగద్యలు = 530 + సీసం కింది తేటగీతులు 22 + సీసం కింది ఆటవెలదులు 25; మొత్తం = 577.

పద్యం ఛందోప్రక్రియ = ప్రథమ స్కంధ సంఖ్యమొత్తం = 577వచనము = 147కంద పద్యము = 148సీస పద్యము = 47తేటగీతి సీసంతో. = 22మత్తేభము = 56చంపకమాల = 16ఉత్పలమాల = 50ఆటవెలది = 22తేటగీతి = 4శార్దూలము = 29


సంకలన కర్త

మా తల్లితండ్రులు ఇద్దరు పుట్టి బుద్దెరిగి పిల్లలను దండించి ఎరుగని సాత్వికులు. తల్లి వెంకటరత్నంగారు మహా పతివ్రత, పరమ ఉత్తమురాలు. తండ్రి అచ్యుత రామయ్య గారు రాష్ట్ర రివెన్యూ శాఖలో తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసారు. గణితంలో ఉద్దండులు. అన్నగారు లక్ష్మీనారాయణదేవ్ సివిల్ ఇంజనీరు. వారి సోదరప్రేమ బహు దొడ్డది. మార్గదర్శకత్వం చేయుటలోను ఎన్నదగినవారు. చెల్లెళ్ళు శేష కుమారి, లక్ష్మి యిద్దరు యిరువంశాల పేరు నిలబెట్టారు అని మంచి పేరు తెచ్చుకున్నారు. మా పూర్వీకులది కరిణీకపు వంశము. పితామహులు చిట్టిరాజు గారు మాతామహులు సాంబశివరావు గారు కరణాలే. మామమగారు ఇవటూరి భాస్కర రావు, ఛార్టెడు ఎక్కౌంటెంటు. మాకు ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అని ఇద్దరు చక్కటి పుత్రులు. నేను గణనాధ్యాయం అని భావగ్రహణం (conceptualisation) చేసికొని, సంకల్పించి,ఈ సంకలనం (compile) చేసాను. స్వభావ రీత్యా బహు గ్రంధ పాఠకుడను. పౌగండ వయస్సులోనే పూజారి తాతగారి చలవ వలన అనేకమైన ఆధ్యాత్మికాది పుస్తకాలతో పరిచయం కలిగినవాడిని. వృత్తి రీత్యా రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఇంజనీరుగా జీవించి. తల్లిలాంటి ఆ సంస్థ చల్లని చూపుల వలన కుటుంబ బరువు బాధ్యతలు తీర్చి 2007లో పదవీ విరమణ అనంతరం, ఈ పరిశోధాత్మక చిరు యత్నానికి ధైర్యం చేసాను. నాటి నుండి అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయిస్తు ఈ సంకలనం కాగితం కలం వాడకుండ, కంప్యూటరు పై యూనికోడ్ ఖతులు వాడి చేసాను. ప్రథమంగా 2008 – 2010 లలో అంతర్జాలంలో స్త్రిబ్డ్ అనే జాలగూడు (ఇంటర్నెట్ సైటు) నందు ప్రచురించాను. రెండవ ప్రతి తెలుగు భాగవతం అని ప్రత్యేకంగా సొంత జాలగూడు ఏర్పరచుకొని 2011-2013 లలో ప్రచురించాను. ఇది మూడవ ముద్రణ. షిరిడి సాయి అనుగ్రహం వలన వలసిన కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తారన్న ధైర్యం చేసాను. భాగవత గణనాధ్యాయిని యని చెప్పుకుంటు ఈ ప్రయత్నంలో భాగంగా ఈ తెలుగు భాగవతం సంకలనం చేసా.

కృతఙ్ఞతలు

కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలు, ప్రచురణకర్తలకు మరియు ఈ కృషిని సాధ్యము చేసిన కంప్యూటరులు చేసిన హెచ్ సి ఎల్, డెల్, వ్యూసోనిక్ కంపెనీలకు మరియు సహకరించి ప్రోత్సాహించిన మిత్రులు, ఇతర వ్యక్తులు, అంతర్జాల సంస్థలకు అందరికి కృతఙ్ఞతలు. మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుటలలో తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందించి సాకారం చేసారు. చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు అమూల్య అనంత సహకార సహాయాలు అందించారు. ఇంచుమించు అందరూ స్వచ్ఛందంగా ఉచితంగా సాయంచేసారు. ఇట్టి సాయాలు లేకుండా ఇలా నేను అందించగలుగుట సాధ్యం కాదు. ఇలా సహాయ సహకారాలు అందించిన అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -