పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ 454-సంపూర్ణం

పరీక్షిత్తు వేటాడుట

(454) వేదండపురాధీశుఁడు, ¯ గోదండము సేతఁ బట్టికొని గహనములో¯ వేదండాదుల నొకనాఁ¯ డే దండలఁ బోవనీక యెగచెన్ బలిమిన్. (455) ఒగ్గములు ద్రవ్వి పడు మని¯ యొగ్గెడు పెనుదెరల, వలల, నురలు మృగములన్¯ డగ్గఱి చంపెడు వేడుక¯ వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్. (456) కోలముల గవయ, వృక, శా¯ ర్దూలములఁ, దరక్షు, ఖడ్గ, రోహిత, హరి, శుం¯ డాలముల, శరభ, చమర, ¯ వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్, (457) మృగయులు మెచ్చ నరేంద్రుఁడు¯ మృగరాజ పరాక్రమమున మెఱసి హరించెన్¯ మృగధరమండలమునఁ గల¯ మృగ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్. (458) ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి, ధరణీకాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతోఁ జని, యొక్క తపోవనంబు గని; యందు. (459) మెలఁగుట చాలించి, మీలితనేత్రుఁడై, ¯ శాంతుఁడై కూర్చుండి, జడత లేక, ¯ ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల¯ బహిరంగవీథులఁ బాఱనీక, ¯ జాగరణాధిక స్థానత్రయము దాఁటి, ¯ పరమమై యుండెడి పదముఁ దెలిసి, ¯ బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుఁ డయి, ¯ యతిదీర్ఘజటలుఁ ద న్నావరింప, (459.1) నలఘు రురు చర్మధారియై యలరుచున్న¯ తపసిఁ బొడగని, శోషితతాలుఁ డగుచు, ¯ నెండి తడిలేక కుత్తుక నెలుఁగు డింద, ¯ మందభాషల నిట్లను మనుజవిభుఁడు. (460) “తోయములు, దెమ్ము మా కీ¯ తోయము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ ¯ తోయము క్రియ జలదాహము, ¯ తోయమువారలును లేరు, దుస్సహ మనఘా!” (461) అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠానిమీలితనేత్రుండును విస్మృతబాహ్యాంతరింద్రియకృతసంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక. (462) "కన్నులు మూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్నవాఁడు, చే¯ సన్నలనైన రమ్మనఁడు, సారజలంబులు దెచ్చి పోయఁ, డే¯ మన్నన లైనఁ జేయఁడు, సమగ్రఫలంబులు వెట్టఁ, డింత సం¯ పన్నత నొందెనే? తన తపశ్చరణాప్రతిమప్రభావముల్. (463) వారిఁ గోరుచున్నవారికి శీతల¯ వారి యిడుట యెట్టివారికయిన ¯ వారితంబుగాని వలసిన ధర్మంబు;¯ వారి యిడఁడు దాహవారి గాఁడు." (464) అని మనుజేశ్వరుండు మృగయాపరిఖేదనితాంతదాహసం¯ జనిత దురంతరోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ¯ జనములుసేయఁడంచు మృతసర్పమునొక్కటి వింటికోపునం¯ బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్. (465) "ఇట్లతండు ప్రత్యాహృతబాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచనుండు గా నోపునో? యట్లుగాక గతాగతులగు క్షత్రబంధులచే నేమియని మృషాసమాధి నిష్ఠుండుగా నోపునో?"యని వితర్కించుచు, వృథారోషదర్పంబున ముని మూఁపున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దన పురంబునకుం జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి శమీకనందనుం డైన శృంగి కడకుం జని. (466) "నరగంధ గజస్యందన¯ తురంగములనేలు రాజు తోయాతురుఁడై¯ పరఁగన్ నీజనకునిమెడ¯ నురగముఁదగిలించిపోయెనోడక తండ్రీ!" (467) అని పలికిన, సమానవయోరూప మునికుమారలీలాసంగి యయిన శృంగి శృంగంబుల తోడి మూర్తి ధరించినట్లు విజృంభించి రోష సంరంభంబున నదిరిపడి, ”బల్యన్నంబుల భుజించి పుష్టంబు లగు నరిష్టంబులుం బోలె బలిసియు ద్వారంబుల గాచికొని యుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్రియాభాసు లెట్లు బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులయిరి? అట్టివార లెట్లు తద్గృహంబుల భాండసంగతంబగు నన్నంబు భుజింప నర్హు లగుదురు? తత్కృతంబు లయిన ద్రోహంబు లెట్లు నిజ స్వామిం జెందు?"నని మఱియు నిట్లనియె. (468) "ఆడడు తన్ను దూషణము, లాశ్రమవాసులఁ గాని వైరులం¯ గూడఁడు, కందమూలములు గూడుగఁ దించు సమాధినిష్ఠుఁడై¯ వీడఁడు లోనిచూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం¯ జూడఁడు, మద్గురుండు, ఫణిఁ జుట్టఁగ నేటికి రాచవానికిన్? (469) పోము హిరణ్యదానములఁ బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం¯ దేము, స వంచనంబులుగ దీవనలిచ్చుచు వేసరింపఁగా¯ రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ; జెల్లరే!¯ పామును వైవఁగాఁ దగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్. (470) పుడమిఁగల జనులు వొగడఁగఁ¯ గుడుతురు గట్టుదురుఁ గాక కువలయపతులై¯ యడవుల నిడుమలఁ బడియెడి¯ బడుగులమెడఁ నిడఁగ దగునె పన్నగశవమున్? (471) భగవంతుఁడు గోవిందుఁడు¯ జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ¯ దగువారు లేమి దుర్జను¯ లెగసి మహాసాధుజనుల నేఁచెద రకటా! (472) “బాలకులారా! ధాత్రీ¯ పాలకు శపియింతు"ననుచుఁ బలువడిని విలో¯ లాలకుఁడగు మునికుంజర¯ బాలకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్.

శృంగి శాపంబు

(473) ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి. (474) "ఓడక వింటికోపున మృతోరగముం గొని వచ్చి మాఱు మా¯ టాడకయున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద¯ క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డినఁ నైనఁ జచ్చుఁ బో¯ యేడవ నాఁడు తక్షకఫణీంద్ర విషానల హేతి సంహతిన్." (475) అని శమీకమహామునికుమారుం డయిన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుం జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి. (476) "ఇయ్యెడ నీ కంఠమునను¯ నియ్యురగ కళేబరంబు నిటు వైచిన యా¯ యయ్య నిఁక నేమి సేయుదు¯ నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకుఁ దండ్రీ! (477) ప్రారంభంబున వేఁట వచ్చి ధరణీపాలుండు, మా తండ్రిపై¯ నేరం బేమియు లేక సర్పశవమున్ నేఁ డుగ్రుఁడై వైచినాఁ¯ డీరీతిన్ ఫణి గ్రమ్మఱన్ బ్రతుకునో? హింసించునో కోఱలన్? ¯ రారే తాపసులార! దీనిఁ దివరే, రక్షింపరే, మ్రొక్కెదన్." (478) అని వెఱపున సర్పంబుఁ దిగుచు నేర్పు లేక యెలుంగెత్తి యేడ్చుచున్న కుమారకు రోదనధ్వని విని, యాంగిరసుం డయిన శమీకుండు సమాధి సాలించి, మెల్లన కన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు నీక్షించి, తీసి పాఱవైచి; కుమారకుం జూచి. (479) "ఏ కీడు నాచరింపము¯ లోకులకున్ మనము సర్వలోక సములమున్¯ శోకింప నేల పుత్రక¯ కాకోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్." (480) అని యడిగినఁ దండ్రికిఁ గొడుకు, రాజు వచ్చి సర్పంబు వైచుటయుం దాను శపించుటయును వినిపించిన, నమ్ముని తన దివ్యజ్ఞానంబున నమ్మానవేంద్రుండు పరీక్షిన్నరేంద్రుం డని యెఱింగి, కొడుకువలన సంతసింపక యిట్లనియె. (481) "బెట్టిదమగు శాపమునకు¯ దట్టపు ద్రోహంబు గాదు, ధరణీకాంతుం¯ గట్టా! యేల శపించితి¯ పట్టీ! తక్షకవిషాగ్ని పాలగు మనుచున్. (482) తల్లి కడుపులోన ధగ్ధుడై క్రమ్మఱఁ¯ గమలనాభు కరుణఁ గలిగినాఁడు; ¯ బలిమి గలిగి ప్రజలఁ బాలించుచున్నాడు;¯ దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె? (483) కాపరి లేని గొఱ్ఱియల కైవడిఁ గంటక చోర కోటిచే¯ నేపఱి యున్నదీ భువన మీశుఁడు గృష్ణుఁడు లేమి నిట్టిచో, ¯ భూపరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ, జెల్లరే! ¯ యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల? బాలకా! (484) పాపంబు నీచేత ప్రాపించె మన; కింక¯ రాజు నశించిన రాజ్యమందు¯ బలవంతుఁ డగువాఁడు బలహీను పశు, దార, ¯ హయ, సువర్ణాదుల నపహరించు; ¯ జార చోరాదులు సంచరింతురు; ప్రజ¯ కన్యోన్య కలహంబు లతిశయిల్లు; ¯ వైదికంబై యున్న వర్ణాశ్రమాచార¯ ధర్మ మించుక లేక తప్పిపోవు; (484.1) నంతమీఁద లోకు లర్థకామంబులఁ¯ దగిలి సంచరింప, ధరణి నెల్ల¯ వర్ణసంకరములు వచ్చును మర్కట¯ సారమేయ కులము మేరఁ బుత్ర! (485) భారతవంశజుం, బరమభాగవతున్, హయమేధయాజి, నా¯ చారపరున్, మహానయవిశారదు, రాజకులైకభూషణున్, ¯ నీరము గోరి నేఁడు మన నేలకు వచ్చిన;యర్థి భక్తి స¯ త్కారము సేసి పంపఁ జనుఁ గాక శపింపఁగ నీకు ధర్మమే? (486) భూపతికి నిరపరాధమ¯ శాపము దా నిచ్చె బుద్ధి చాపలమున మా¯ పాపఁడు; వీఁ డొనరించిన¯ పాపము దొలఁగింపు కృష్ణ! పరమేశ! హరీ! (487) పొడిచినఁ, దిట్టినఁ, గొట్టినఁ, ¯ బడుచుందురు గాని పరమభాగవతులు; దా¯ రొడఁబడరు మాఱు సేయఁగఁ¯ గొడుకా! విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్. (488) చెలఁగరు కలఁగరు సాధులు¯ మిళితములయి పరులవలన మేలుం గీడున్¯ నెలకొనిన నైన నాత్మకు¯ నొలయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్." (489) అని యిట్లు శమీకమహామునీంద్రుండు గ్రమ్మఱింప శక్తి లేని కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొంది, తన శిష్యు నొక మునికుమారునిం బిలిచి, యేతద్వృత్తాంతం బంతయు రాజున కెఱింగించి రమ్మని పంచె; నంత నా యభిమన్యుపుత్రుండు శమీకముని శిష్యునివలన శాపవృత్తాంతంబు విని కామక్రోధాది విషయాసక్తుండగు తనకుం దక్షకవిషాగ్ని విరక్తి బీజం బగు; ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున. (490) "ఏటికి వేఁట వోయితి మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా¯ నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి? నేఁ¯ డేటికిఁ బాపసాహసము లీ క్రియఁ జేసితి? దైవయోగమున్¯ దాఁటఁగ రాదు, వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. (491) పాము విషాగ్నికీలలనుఁ బ్రాణము లేగిఁన నేఁగుఁగాక, యీ¯ భూమియు రాజ్యభోగములుఁ బోయిన నిప్పుడ పోవుఁగాక, సౌ¯ దామనిఁ బోలు జీవనము దథ్యముగాఁ దలపోసి యింక నే¯ నేమని మాఱు దిట్టుదు మునీంద్రకుమారకు దుర్నివారకున్. (492) రాజ ననుచుఁ బోయి రాజ్యగర్వంబున¯ వనముకొఱకు వారి వనము సొచ్చి¯ దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ¯ బొలియఁ దిట్ట కేల పోవు సుతుఁడు? (493) గోవులకును, బ్రాహ్మణులకు, ¯ దేవతలకు నెల్ల ప్రొద్దుఁ దెంపునఁ గీడుం¯ గావించు పాపమానస¯ మే విధమునఁ బుట్టకుండ, నే వారింతున్," (494) అని వితర్కించె. (495) దామోదరపదభక్తిం¯ గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్¯ భూమీశుఁ డలుగఁ డయ్యెను¯ సామర్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్. (496) అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబు దక్షకుండు విని యెడరు వేచి యుండె; నిటఁ దక్షకవ్యాళవిషానలజ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున మరణం బని యెఱింగిన వాఁడు గావున, భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించుకొని.

పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

(497) తులసీసంయుతదైత్యజిత్పదరజస్తోమంబుకంటెన్ మహో¯ జ్జ్వలమై, దిక్పతిసంఘసంయుతజగత్సౌభాగ్యసంధాయియై, ¯ కలిదోషావళి నెల్లఁ బాపు, దివిషద్గంగాప్రవాహంబు లో¯ పలికిం బోయి, మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్. (498) చిత్తము గోవిందపదా¯ యత్తముఁ గావించి, మౌనియై తనలో నే¯ తత్తఱము లేక, భూవర¯ సత్తముఁడు వసించె ముక్తసంగత్వమునన్. (499) ఇట్లు పాండవపౌత్రుండు ముకుంద చరణారవింద వందనానందకందాయమాన మానసుండై విష్ణుపదీతీరంబునఁ బ్రాయోపవేశంబున నుండుట విని, సకలలోక పావనమూర్తులు మహానుభావులు నగుచుఁ దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులైన యత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వసిష్ఠ, పరాశర, చ్యవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కవష, కణ్వ, కలశసంభవ, వ్యాస, పర్వత, నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షిపుంగవులునుఁ; గాండర్షులయిన యరుణాదులును; మఱియు నానాగోత్రసంజాతులైన మునులును; శిష్య ప్రశిష్య సమేతులై చనుదెంచిన, వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి, పూజించి, దండప్రణామంబు లాచరించి, కూర్చుండ నియోగించి. (500) క్రమ్మఱ నమ్మునివిభులకు¯ నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్¯ గ్రమ్మఁగ ముకుళితకరుఁడై¯ సమ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్. (501) "ఓపిక లేక చచ్చిన మహోరగముం గొని వచ్చి కోపినై¯ తాపసు మూపుఁపై నిడిన దారుణచిత్తుఁడ; మత్తుఁడన్; మహా¯ పాపుఁడ; మీరు పాపతృణపావకు; లుత్తము లయ్యలార! నా¯ పాపము వాయు మార్గముఁ గృపావరులార! విధించి చెప్పరే. (502) భూసురపాదరేణువులు పుణ్యులఁజేయు నరేంద్రులన్ ధరి¯ త్రీసురులార! మీచరణరేణుకణంబులు మేను సోఁక నా¯ చేసిన పాపమంతయు నశించెఁ; గృతార్థుఁడ నైతి; నెద్ది యేఁ ¯ జేసిన ముక్తి పద్ధతికిఁజెచ్చెరఁ బోవఁగఁ వచ్చుఁ జెప్పరే. (503) భీకరతర సంసార¯ వ్యాకులతన్ విసిగి దేహ వర్జన గతి నా¯ లోకించు నాకుఁ దక్షక¯ కాకోదరవిషము ముక్తికారణ మయ్యెన్. (504) ఏపారు నహంకార¯ వ్యాపారము లందు మునిఁగి వర్తింపంగా¯ నాపాలిటి హరి భూసుర¯ శాపవ్యాజమున ముక్తసంగుం జేసెన్. (505) ఉరుగాధీశువిషానలంబునకు మే నొప్పింతు శంకింప; నీ¯ శ్వరసంకల్పము నేఁడు మానదు; భవిష్యజ్జన్మజన్మంబులన్¯ హరి చింతారతియున్, హరిప్రణుతి, భాషాకర్ణ నాసక్తియున్, ¯ హరిపాదాంబుజ సేవయుం గలుగ మీ రర్థిం బ్రసాదింపరే? (506) చూడుఁడు నా కల్యాణము;¯ పాడుఁడు గోవిందుమీఁది పాటలు దయతో;¯ నాడుఁడు హరిభక్తులకథ;¯ లే డహముల లోన ముక్తి కేఁగఁగ నిచటన్. (507) అమ్మా! నినుఁ జూచిన నరుఁ¯ బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్¯ లెమ్మా నీ రూపముతో¯ రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!" (508) అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరంబు లందును హరిపాదభక్తి సౌజన్యంబులు సంధిల్లుం గాత మని, గంగాతరంగిణీ దక్షిణకూలంబునం బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి, రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసార బంధంబునకుం దప్పించి, చిత్తంబు హరికి నొప్పించి, పరమ భాగవతుండైన పాండవపౌత్రుండు ప్రాయోపవిష్టుండై యున్న సమయంబున. (509) ఒత్తిలి పొగడుచు సురలు వి¯ యత్తలముననుండి మెచ్చి యలరుల వానల్¯ మొత్తములై కురిసిరి నృప ¯ సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్. (510) ఆ సమయంబున సభాసీనులయిన ఋషు లిట్లనిరి. (511) "క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు; మీ తాత లు¯ గ్ర తపోధన్యులు; విష్ణుపార్శ్వపదవిం గామించి రాజన్యశో¯ భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు¯ న్నతులై; నీవు మహోన్నతుండవు గదా నారాయణధ్యాయివై. (512) వసుధాధీశ్వర! నీవు మర్త్య తనువున్ వర్జించి; నిశ్శోకమై, ¯ వ్యసనచ్ఛేదకమై, రజోరహితమై వర్తించు లోకంబు స¯ ర్వసమత్వంబునఁ జేరునంతకు; భవద్వాక్యంబులన్ వించు నే ¯ దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్." (513) అని యిట్లు పక్షపాత శూన్యంబులును; మహనీయ, మాధుర్య, గాంభీర్య, సౌజన్య, ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు; మూఁడులోకంబులకు నవ్వలిదైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునం దేజరిల్లుచున్నఋషులం జూచి, భూవరుండు నారాయణకథాశ్రవణ కుతూహలుం డయి నమస్కరించి యిట్లనియె. (514) "ఏడు దినంబుల ముక్తిం¯ గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార¯ క్రీడన మే క్రియ నెడతెగుఁ, ¯ జూడుఁడు మాతండ్రులార! శ్రుతివచనములన్. (515) ప్రాప్తానందులు, బ్రహ్మబోధన కళాపారీణు, లాత్మప్రభా¯ లుప్తాజ్ఞానులు, మీర, లార్యులు, దయాళుత్వాభిరాముల్, మనో¯ గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా! ¯ సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం జర్చించి భాషింపరే." (516) అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ బ్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున.

శుకముని యాగమనంబు

(517) ప్రతినిమేషము పరబ్రహ్మంబు నీక్షించి¯ మదిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు; ¯ కమలంబుమీఁది భృంగముల కైవడి మోము¯ పై నెఱపిన కేశపటలివాఁడు; ¯ గిఱి వ్రాసి మాయ నంగీకరించని భంగి¯ వసనంబుఁ గట్టక వచ్చువాఁడు; ¯ సంగిగాఁ డని వెంటఁ జాటు భూతములు నా¯ బాలుర హాస శబ్దములవాఁడు; (517.1) మహిత పద, జాను, జంఘోరు, మధ్య, హస్త, ¯ బాహు, వక్షోగళానన, ఫాల, కర్ణ, ¯ నాసికా, గండ, మస్తక, నయన యుగళుఁ ¯ డైన యవధూతమూర్తి వాఁ డరుగుదెంచె. (518) ఈరని లోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు, గోరికల్¯ గోరనివాఁడు, గూటువలఁ గూడనివాఁడు, వృథా ప్రపంచముం¯ జేరనివాఁడు, దైవగతిఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై ¯ నేరనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు, వెండియున్. (519) అమ్మహాత్ము షోడశాబ్ద వయోరూప, ¯ గమన, గుణ, విలాస, కౌశలములు, ¯ ముక్తికాంత సూచి మోహిత యగునన¯ నితర కాంత లెల్ల నేమి సెప్ప. (520) వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై¯ బ్రహ్మభావముననుఁ బర్యటింప, ¯ వెఱ్ఱి యంచు శుకుని వెంట నేతెంతురు¯ వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు. (521) ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లమ్మహానుభావుని ప్రభావంబు లెఱుంగుదురు కావున నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్థానంబు సేసిరి; పాండవపౌత్రుండు నా యోగిజనశిఖామణికి నతిథి సత్కారంబులు గావించి దండప్రణామంబుసేసి పూజించె; మఱియు గ్రహ నక్షత్ర తారకా మధ్యంబునం దేజరిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబున గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగొని. (522) ఫాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి, భూ¯ పాలకులోత్తముండు గరపద్మములన్ ముకుళించి, ”నేఁడు నా¯ పాలిటి భాగ్య మెట్టిదియొ పావనమూర్తివి పుణ్యకీర్తి వీ¯ వేళకు నీవు వచ్చితి వివేకవిభూషణ! దివ్యభాషణా! (523) అవధూతోత్తమ! మంటి, నేఁడు నిను డాయం గంటి, నీవంటి వి¯ ప్రవరుం బేర్కొను నంతటన్ భసిత మౌఁ బాపంబు నా బోటికిన్, ¯ భవదాలోకన, భాషణార్చన, పదప్రక్షాళన, స్పర్శనా¯ ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే? (524) హరిచేతను దనుజేంద్రులు¯ ధరఁ ద్రుంగెడు భంగి నీ పదస్పర్శముచే¯ గురుపాతకసంఘంబులు¯ పొరిమాలుఁ గదయ్య యోగిభూషణ! వింటే. (525) ఎలమిన్ మేనమఱందియై, సచివుఁడై, యే మేటి మాతాతలన్¯ బలిమిం గాచి సముద్ర ముద్రిత ధరం బట్టంబుఁ గట్టించె, న¯ య్యలఘుం, డీశుఁడు, చక్రి, రక్షకుఁడు గాకన్యుల్ విపద్రక్షకుల్¯ గలరే? వేఁడెద భక్తి నా గుణనిధిం, గారుణ్యవారాన్నిధిన్.

శుకుని మోక్షోపాయం బడుగట

(526) అవ్యక్తమార్గుండవైన నీ దర్శన¯ మాఱడి పోనేర; దభిమతార్థ¯ సిద్ధి గావించుట సిద్ధంబు; నే డెల్లి¯ దేహంబు వర్జించు దేహధారి¯ కేమి చింతించిన? నేమి జపించిన?¯ నేమి గావించిన? నేమి వినిన?¯ నేమి సేవించిన? నెన్నఁడు సంసార¯ పద్ధతిఁ బాసిన పదవి గలుగు, (526.1) నుండు మనరాదు; గురుఁడవు, యోగివిభుఁడ, ¯ వావుఁ బిదికిన తడ వెంత యంత సేపు¯ గాని యొక దెస నుండవు, కరుణతోడఁ¯ జెప్పవే తండ్రి! ముక్తికిఁ జేరు తెరువు." (527) అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె"నని చెప్పి.

పూర్ణి

(528) రాజీవపత్రలోచన! ¯ రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి¯ భ్రాజితపాదాంభోరుహ! ¯ భూజనమందార! నిత్యపుణ్యవిచారా! (529) అనుపమగుణహారా! హన్యమా నారివీరా! ¯ జన వినుతవిహారా! జానకీ చిత్త చోరా! ¯ దనుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా! ¯ ఘన కలుష కఠోరా! కంధి గర్వాపహారా! (530) ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు నైమిశారణ్య వర్ణనంబును, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణకథా సూచనంబు సేయుటయు, వ్యాస చింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబునుఁ, బుత్రశోకాతురయైన ద్రుపదరాజనందన కర్జునుం డశ్వత్థామం దెచ్చి యొప్పగించి గర్వపరిహారంబు సేయించి విడిపించుటయు, భీష్మనిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబు వలనం బాపి విష్ణుండు రక్షించుటయుఁ, బరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిర్గమంబును, నారదుండు ధర్మజునకుఁ గాలసూచనంబు సేయుటయుఁ, గృష్ణ నిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, నభిమన్యుపుత్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుం డై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకసందర్శనంబు సేసి మోక్షోపాయం బడుగటయు నను కథలు గల ప్రథమ స్కంధము సంపూర్ణము.