పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ 173-261

అశ్వత్థామ గర్వ పరిహారంబు

(173) విశ్వస్తుత్యుఁడు, శక్రసూనుఁడు, మహావీరుండు ఘోరాసిచే¯నశ్వత్థామ శిరోజముల్దఱిఁగి, చూడాంతర్మహారత్నమున్¯శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని, పాశవ్రాతబంధంబులన్¯విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్. (174) నిబ్బరపు బాలహంతయు¯గొబ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై¯ప్రబ్బిన వగచే విప్రుఁడు¯సిబ్బితితో నొడలి గబ్బుసెడి వడిఁ జనియెన్. (175) ధనముఁ గొనుట యొండె, దలఁ గొఱుగుట యొండె, ¯నాలయంబు వెడల నడచు టొండె, ¯గాని చంపఁ దగిన కర్మంబు సేసినఁ¯జంపఁ దగదు విప్రజాతిఁ బతికి. (176) ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి, పాండవులు పాంచాలీ సహితులై పుత్త్రులకు శోకించి, మృతులైన బంధువుల కెల్ల దహనాది కృత్యంబులు సేసి యుదక ప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని, తిలోదకంబులు సేసి, క్రమ్మఱ విలపించి, హరి పాదపద్మజాత పవిత్రంబు లయిన భాగీరథీ జలంబుల స్నాతులయి యున్న యెడం, బుత్త్రశోకాతురు లయిన గాంధారీ ధృతరాష్ట్రులనుఁ గుంతీ ద్రౌపదులనుఁ జూచి మాధవుండు మునీంద్రులుం దానును బంధుమరణశోకాతురు లయిన వారల వగపు మానిచి మన్నించె; నివ్విధంబున. (177) పాంచాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్కులం, ¯జంచద్గర్వుల, ధార్తరాష్ట్రుల ననిం జంపించి, గోవిందుఁ డి¯ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ, గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే¯యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్. (178) అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుం డయి,యుద్ధవ సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునం, దత్తఱపడుచు నుత్తర సనుదెంచి కల్యాణగుణోత్తరుం డైన హరి కిట్లనియె. (179) "ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ¯డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు¯న్నది, దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు, నీ¯పదపద్మంబులె కాని యొండెఱుఁగ, నీ బాణాగ్ని వారింపవే. (180) దుర్భరబాణానలమున¯గర్భములో నున్న శిశువు ఘనసంతాపా¯విర్భావంబునుఁ బొందెడి¯నిర్భరకృపఁ గావుమయ్య, నిఖిలస్తుత్యా! (181) చెల్లెలికోడల, నీ మే¯నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం¯ఫుల్లారవిందలోచన! ¯భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపఁగదే. (182) గర్భ మందుఁ గమలగర్భాండశతములు¯నిముడుకొన వహించు నీశ్వరేశ! ¯నీకు నొక్క మానినీగర్భరక్షణ¯మెంత బరువు నిర్వహింతు గాక." (183) అనిన నాశ్రితవత్సలుం డగు నప్పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు లాలించి, యిది ద్రోణనందనుండు లోక మంతయు నపాండవం బయ్యెడు మని యేసిన దివ్యాస్త్రం బని యెఱింగె; నంతఁ బాండవుల కభిముఖం బయి ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబులు డగ్గఱిన బెగ్గడిలక వారును బ్రత్యస్త్రంబు లందికొని పెనంగు సమయంబున. (184) తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స¯జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం¯దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా¯ధన నిర్వక్రము, రక్షితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్. (185) సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ¯క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ¯స్తకుఁడై, వైష్ణవమాయఁ గప్పి, కురు సంతానార్థియై యడ్డమై¯ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్. (186) ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయావిలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె.

కుంతి స్తుతించుట

(187) "పురుషుం, డాఢ్యుఁడు, ప్రకృతికిఁ¯బరుఁ, డవ్యయుఁ, డఖిలభూత బహిరంతర్భా¯సురుఁడును, లోకనియంతయుఁ, ¯బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ! (188) మఱియు, జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు, నివృత్తరాగద్వేషులు, నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి పరిచ్ఛిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుఁ, గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు; శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద, నవధరింపుము. (189) తనయులతోడ నే దహ్యమానంబగు¯జతుగృహంబందునుఁ జావకుండఁ, ¯గురురాజు వెట్టించు ఘోరవిషంబుల¯మారుతపుత్త్రుండు మడియకుండ, ¯ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ¯ద్రౌపదిమానంబు దలఁగకుండ, ¯గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే¯నా బిడ్డ లనిలోన నలఁగకుండ, (189.1) విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలు ¯ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ, ¯మఱియు రక్షించితివి పెక్కుమార్గములను, ¯నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష! (190) బల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ¯తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ¯దల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం¯బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన, జగత్పతీ! (191) జననము, నైశ్వర్యంబును, ¯ధనమును, విద్యయునుఁ, గల మదచ్ఛన్ను లకిం¯చనగోచరుఁడగు నిన్నున్ ¯వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా! (192) మఱియు, భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముండును, రాగాదిరహితుండునుఁ, గైవల్యదాన సమర్థుండునుఁ, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద, నవధరింపుము; మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు; నీకుం బ్రియాప్రియులు లేరు; జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను, మనుష్యు లందు రామాది రూపంబులను, ఋషుల యందు వామనాది రూపంబులను, జలచరంబుల యందు మత్స్యాది రూపంబులను, నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం డవగుటం గాదు. (193) కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో¯గోపిక ద్రాటఁ గట్టిన, వికుంచిత సాంజన బాష్పతోయ ధా¯రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు, వెచ్చనూర్చుచుం, ¯బాపఁడవై నటించుట కృపాపర! నా మదిఁ జోద్య మయ్యెడిన్. (194) మలయమునఁ జందనము క్రియ¯వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై¯యిలపై నభవుఁడు హరి యదు¯కులమున నుదయించె నండ్రు గొంద, ఱనంతా! (195) వసుదేవదేవకులు తా¯పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం¯తసమునఁ బుత్త్రత నొందితి¯వసురుల మృతి కంచుఁ గొంద ఱండ్రు, మహాత్మా! (196) జలరాశి నడుమ మునిగెఁడు¯కలము క్రియన్ భూరిభారకర్శితయగు నీ¯యిలఁ గావ నజుఁడు గోరినఁ¯గలిగితి వని కొంద ఱండ్రు, గణనాతీతా! (197) మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు¯వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ ¯శ్రవణ, చింతన, వందనార్చనము లిచ్చు¯కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ! (198) నినుఁ జింతించుచుఁ, బాడుచుం, బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్¯వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే¯ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా¯గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా! (199) దేవా! నిరాశ్రయులమై, భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ సకరుణావలోకనంబుల నిత్యంబునుఁ జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబుగాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫలభరితంబులై యోషధి, తరు, లతా, గుల్మ, నద, నదీ, సమేతంబులై యుండు. (200) యాదవు లందుఁ, బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి¯చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ¯పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న¯త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా! (201) శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! ¯లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా¯నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! ¯నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!" (202) అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి, రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీసుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ, వ్యాస, ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై, నిర్వివేకం బగు చిత్తంబున నిట్లనియె. (203) "తనదేహంబునకై యనేకమృగసంతానంబుఁ జంపించు దు¯ర్జనుభంగిం గురు, బాలక, ద్విజ, తనూజ, భ్రాతృ సంఘంబు ని¯ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా¯యన లక్షావధి నైన ఘోరనరకవ్యాసంగముల్ మానునే? (204) మఱియుఁ, బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధియించినం బాపంబు లేదని, శాస్త్రవచనంబు గల; దయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధు లయిన సతుల కేనుఁ జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు; గృహస్థాశ్రమధర్మంబు లైన తురంగమేధాది యాగంబులచేతఁ బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుం డగు నని, నిగమంబులు నిగమించు; పంకంబునఁ బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద."

ధర్మజుడు భీష్ముని కడ కేగుట

(205) అని యిట్లు ధర్మసూనుఁడు ¯మొనసి నిరాహారభావమున దేవనదీ¯తనయుఁడు గూలిన చోటికిఁ¯జనియెఁ బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. (206) "అయ్యవసరంబునం దక్కిన పాండవులును, ఫల్గున సహితుం డైన పద్మలోచనుండును గాంచన సమంచితంబు లయిన రథంబు లెక్కి ధర్మజుం గూడి చనిన, నతండు గుహ్యక సహితుం డయిన కుబేరుని భంగి నొప్పె; నిట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభసహితులై కురుక్షేత్రంబున కేఁగి, దివంబున నుండి నేలం గూలిన దేవతతెఱంగున సంగ్రామ రంగపతితుం డైన గంగానందనునకు నమస్కరించి; రంత బృహదశ్వ, భరద్వాజ, పరశురామ, పర్వత, నారద, బాదరాయణ, కశ్యపాంగిరస, కౌశిక, ధౌమ్య, సుదర్శన, శుక, వసిష్ఠాద్యనేక రాజర్షి, బ్రహ్మర్షులు, శిష్య సమేతులై చనుదెంచినం జూచి సంతసించి, దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి. (207) మాయాంగీకృతదేహుం¯డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాఁ డని ప్ర¯జ్ఞాయత్తచిత్తమున గాం¯గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్. (208) మఱియు గంగానందనుండు వినయప్రేమ సుందరు లయిన పాండునందనులం గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె. (209) "ధరణిసురులు, హరియు, ధర్మంబు దిక్కుగా¯బ్రదుకఁ దలఁచి మీరు బహువిధముల¯నన్నలార! పడితి రాపత్పరంపర ¯లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదు? (210) సంతస మింత లేదు మృగశాపవశంబునఁ బాండు భూవిభుం¯డంతము నొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి, కాంక్షతో¯నింతలవారిఁగాఁ బెనిచె, నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ¯గొంతి; యనేక దుఃఖములఁ గుందుచు నుండును భాగ్య మెట్టిదో? (211) వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం¯బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై¯పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు, కాల మన్నియుం¯జేయుచుఁ నుండుఁ, గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్. (212) రాజఁట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో¯ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం¯యోజకుఁడైన చక్రియఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁడ¯య్యాజికిఁదోడు వచ్చునఁట, యాపద గల్గు టిదేమి చోద్యమో. (213) ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని¯కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు¯నతనిమాయలకు మహాత్ములు విద్వాంసు¯లడఁగి మెలగుచుందు రంధు లగుచు. (214) కావున దైవతంత్రంబైన పనికి వగవం బని లేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు, తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు; నతని రహస్యప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుం డెఱుంగు; మఱియు దేవర్షి యగు నారదుండును, భగవంతుం డగు కపిలమునియు, నెఱుంగుదురు; మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుం డగు మాతులేయుం డని తలంచి దూత, సచివ, సారథి, బంధు, మిత్ర, ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొఱంత లేదు; రాగాదిశూన్యుండు, నిరహంకారుండు, నద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు, నయిన యీశ్వరునకు నతోన్నతభావ, మతివైషమ్యంబు లెక్కడివి, లే; వయిన భక్తవత్సలుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు. (215) అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి¯యెవ్వని నామ మూహించి పొగడి¯కాయంబు విడుచుచుఁ గామ కర్మాది ని¯ర్మూలనుండై యోగి ముక్తి నొందు¯నట్టి సర్వేశ్వరుం డఖిలదేవోత్తంసుఁ¯డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు¯నందాఁక నిదె మహాహర్షుఁడై వికసిత¯వదనారవిందుఁడై వచ్చె నేఁడు (215.1) నాల్గుభుజములుఁ గమలాభ నయనయుగము¯నొప్పఁ గన్నుల ముంగట నున్నవాఁడు¯మానవేశ్వర! నా భాగ్యమహిమఁ జూడు¯మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి." (216) అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుం డయిన కురుకుంజరుని వచనంబు లాకర్ణించి, మును లందఱు వినుచుండ, ధర్మనందనుడు మందాకినీనందనువలన నరజాతిసాధారణంబు లగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును, రాగవైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దానధర్మంబులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థకామ మోక్షంబులును, నానావిధోపాఖ్యానేతిహాసంబులును, సంక్షేపవిస్తార రూపంబుల నెఱింగె; నంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణు లైన యోగీశ్వరులచేత వాంఛితంబగు నుత్తరాయణంబు సనుదెంచిన, నది దనకు మరణోచితకాలం బని నిశ్చయించి. (217) ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ¯గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని¯ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం¯శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్.

భీష్మనిర్యాణంబు

(218) ఇట్లు పీతాంబరధారియుఁ, జతుర్భుజుండు, నాదిపూరుషుండు, బరమేశ్వరుండు, నగు హరియందు నిష్కాముండై, విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుఁ డగుచు, ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె. (219) "త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ¯రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక¯వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా¯విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. (220) హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై, ¯రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో, ¯జయముం బార్థున కిచ్చువేడ్క, నని నాశస్త్రాహతిం జాల నొ¯చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. (221) నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో¯బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం¯బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ¯పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై. (222) తనవారిఁ జంపఁజాలక¯వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్¯ఘన యోగవిద్యఁ బాపిన¯మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్. (223) కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి¯గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; ¯నుఱికిన నోర్వక యుదరంబులో నున్న¯జగముల వ్రేఁగున జగతి గదలఁ; ¯జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ¯బైనున్న పచ్చనిపటము జాఱ; ¯నమ్మితి నాలావు నగుఁబాటు సేయక¯మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ; (223.1) గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి ¯"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు¯విడువు మర్జున!" యనుచు మద్విశిఖ వృష్టిఁ¯దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. (224) తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న¯ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్¯మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్¯జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్. (225) పలుకుల నగవుల నడపుల¯నలుకల నవలోకనముల నాభీరవధూ¯కులముల మనముల తాలిమి¯కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. (226) మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా¯మందిరమున యాగమండపమునఁ¯జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది¯దేవుఁ డమరు నాదు దృష్టియందు. (227) ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో¯లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ¯న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ¯పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై." (228) అని యిట్లు మనోవాగ్దర్శనంబులం బరమాత్ముం డగు కృష్ణుని హృదయంబున నిలిపికొని, నిశ్వాసంబులు మాని, నిరుపాధికం బయిన వాసుదేవ బ్రహ్మంబు నందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి; దేవ మానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసె; సాధుజన కీర్తనంబులు మెఱసెఁ; గుసుమ వర్షంబులు గురిసె; మృతుం డయిన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్త మాత్రంబు దుఃఖితుం డయ్యె; నంత నచ్చటి మునులు కృష్ణునిఁ తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగు లగుచుం దదీయ దివ్యావతార నామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుం జనిరి; పిదప నయ్యుధిష్ఠిరుండు కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుం డయిన ధృతరాష్ట్రు నొడంబఱచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బ్రజాపాలనంబు సేయుచుండె"నని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె. (229) "ధనము లపహరించి తనతోడఁ జెనకెడు¯నాతతాయి జనుల నని వధించి¯బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁ¯డెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించె?" (230) అనిన సూతుం డిట్లనియె.

ధర్మనందన రాజ్యాభిషేకంబు

(231) "కురుసంతతికిఁ బరీక్షి¯న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ¯ధరణీరాజ్యమునకు నీ¯శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. (232) ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబులం గృష్ణుని సంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంకా కళంకుండునునై నారాయణాశ్రయుం డైన యింద్రుండునుం బోలెఁ జతుస్సాగరవేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె. (233) సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు, ¯నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు, ¯గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు, ¯ఫలవంతములు లతాపాదపములు, ¯పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల, ¯ధర్మ మెల్లెడలనుఁ దనరి యుండు, ¯దైవభూతాత్మ తంత్రము లగు రోగాది¯భయములు సెందవు ప్రజల కెందుఁ, (233.1) గురుకులోత్తముండు గుంతీతనూజుండు¯దాన మానఘనుఁడు ధర్మజుండు¯సత్యవాక్యధనుఁడు సకలమహీరాజ్య¯విభవభాజి యయిన వేళ యందు (234) అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుఁ బ్రియంబు సేయు కొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయం దలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుం డగుచు నతనిచే నాలింగితుండై, యామంత్రణంబు వడసి, కొందఱు దనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు, రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ, గుంతియు, నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును, నకుల, సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్తదుస్సంగుం డగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరం బగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం డట్టి హరి తోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తు లయి లోచనంబుల బాష్పంబు లొలుక నంత నిలువంబడి రయ్యవసరంబున. (235) కనకసౌధములపైఁ గౌరవకాంతలు¯గుసుమవర్షంబులు గోరి కురియ, ¯మౌక్తికదామ సమంచితధవళాత¯పత్త్రంబు విజయుండు పట్టుచుండ, ¯నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై¯రత్నభూషితచామరములు వీవ, ¯గగనాంతరాళంబు గప్పి కాహళభేరి¯పటహశంఖాదిశబ్దములు మొరయ, (235.1) సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప¯భద్రభాషణములు పలుకుచుండ, ¯భువనమోహనుండు పుండరీకాక్షుండు¯పుణ్యరాశి హస్తిపురము వెడలె. (236) తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబు రెండు దెసల గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లి గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు బ్రవర్తింపని సమయంబున నొంటి దీపించు పురాణపురుషుం డితం డనువారును; జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యెట్లనువారును; జీవనోపాధి భూతంబు లయిన సత్త్వాదిశక్తుల లయంబు జీవుల లయం బనువారునుఁ; గ్రమ్మఱ సృష్టికర్త యైన యప్పరమేశ్వరుండు నిజవీర్యప్రేరితయై నిజాంశ భూతంబు లైన జీవులకు మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామ రూపంబులు లేని జీవు లందు నామరూపంబులు గల్పించుకొఱకు వర్తిల్లు స్వమాయ నంగీకరించు ననువారును; నిర్మలభక్తి సముత్కంఠావిశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రను వారును; యోగమార్గంబునం గాని దర్శింపరాదను వారునునై; మఱియును. (237) "రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్ రాదింక వీక్షింప, నీ¯కమలాక్షుం బొడఁగానలేని దినముల్ గల్పంబులై తోఁచు, గే¯హము లం దుండఁగ నేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం¯దము రమ్మా" యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై. (238) "తరుణీ! యాదవరాజు గాఁ డితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై¯వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు¯స్తరలీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్యభా¯సుర నే" నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్. (239) "తామసగుణు లగు రాజులు¯భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స¯త్త్వామలతనుఁడై యీతఁడు¯భామిని! వారల వధించుఁ బ్రతికల్పమునన్. (240) ఇదియునుం గాక. (241) ఈ యుత్తమశ్లోకుఁ డెలమి జన్మింపంగ¯యాదవకుల మెల్ల ననఘ మయ్యె, ¯నీ పుణ్యవర్తనుం డే ప్రొద్దు నుండంగ¯మథురాపురము దొడ్డ మహిమఁ గనియె, ¯నీ పూరుషశ్రేష్ఠు నీక్షింప భక్తితో¯ద్వారకావాసులు ధన్యులైరి, ¯యీ మహాబలశాలి యెఱిఁగి శిక్షింపంగ¯నిష్కంటకం బయ్యె నిఖిలభువన, (241.1) మీ జగన్మోహనాకృతి నిచ్చగించి¯పంచశర భల్ల జాల విభజ్యమాన¯వివశమానసమై వల్లవీసమూహ¯మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు. (242) ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ¯జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడు రుక్మిణీముఖా¯నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా¯స్తోకవిశేషతీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో." (243) అని యిట్లు నానావిధంబులుగాఁ బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి నడువం జతురంగ బలంబులం బంచినఁ దత్సేనా సమేతులై దనతోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి; కురుజాంగల, పాంచాల దేశంబులు దాటి; శూరసేన యామున భూములం గడచి; బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర, సైంధవ, విషయంబు లతిక్రమించి’ తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్తమండలంబు సొచ్చి, పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుం డయిన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చనిచని

గోవిందుని ద్వారకాగమనంబు

(244) జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం, ¯ గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా¯ వళిసంఛాదితతారకం, దరులతావర్గానువేలోదయ¯ త్ఫలపుష్పాంకుర కోరకన్, మణిమయప్రాకారకన్, ద్వారకన్. (245) ఇట్లు దన ప్రియపురంబు డగ్గఱి. (246) అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్¯ ధన్యులై వినఁ బాంచజన్యము, దారితాఖిలజంతు చై¯ తన్యమున్, భువనైకమాన్యము, దారుణధ్వని భీతరా¯ జన్యముం, బరిమూర్చితాఖిలశత్రుదానవసైన్యమున్. (247) శంఖారావము వీనులన్ విని జనుల్ స్వర్ణాంబరద్రవ్యముల్¯ శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన¯ ప్రేంఖద్భక్తులు వంశ, కాహళ, మహాభేరీ, గజాశ్వావళీ¯ రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై. (248) బంధులుఁ బౌరులుఁ దెచ్చిన¯ గంధేభ హయాదులైన కానుకలు దయా¯ సింధుఁడు గైకొనె నంబుజ¯ బంధుఁడు గొను దత్త దీప పంక్తులభంగిన్. (249) ఇట్లాత్మారాముండునుఁ బూర్ణకాముండును నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు లిచ్చుచు నాగరులు వికసితముఖు లయి గద్గద భాషణంబుల తోడ డయ్యకుండ నడపునయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డల చందంబున మ్రొక్కి యిట్లనిరి. (250) "నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం¯ తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో¯ నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని¯ ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్. (251) ఉన్నారము సౌఖ్యంబున, ¯ విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్, ¯ మన్నారము ధనికులమై, ¯ కన్నారము తావకాంఘ్రికమలములు హరీ! (252) ఆరాటము మది నెఱుఁగము, ¯ పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ, ¯ జోరాటన మెగయదు నీ, ¯ దూరాటన మోర్వలేము తోయజనేత్రా! (253) తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా ¯ తండ్రివిఁ, దల్లివిం, బతివి, దైవమవున్, సఖివిన్, గురుండ; వే¯ తండ్రులు నీ క్రియం బ్రజల ధన్యులఁ జేసిరి, వేల్పు లైన నో¯ తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబునన్. (254) చెచ్చెరఁ గరినగరికి నీ¯ విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ¯ వెచ్చోటికి విచ్చేయక¯ మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్. (255) అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ¯ జనిన నంధమయిన జగముభంగి¯ నిన్నుఁ గానకున్న నీరజలోచన! ¯ యంధతమస మతుల మగుదు మయ్య." (256) అని యిట్లు ప్రజలాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణ కలాపంబులుగా నవధరించి, కరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుఁ, దన రాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జనభోజనశయనాది కృత్యంబు లొల్లక యుగ్రసే, నాక్రూర, వసుదేవ, బలభద్ర, ప్రధ్యుమ్న, సాంబ, చారుధేష్ణ, గద ప్రముఖ యదు కుంజరులు కుంజర, తురగ, రథారూఢు లై దిక్కుంజరసన్నిభం బయిన యొక్క కుంజరంబు ముందట నిడుకొని; సూత, మాగధ, నట, నర్తక, వంది సందోహంబుల మంగళ భాషణంబులును; భూసురాశీర్వాద వేదఘోషంబులును; వీణా, వేణు, భేరీ, పటహ, శంఖ, కాహళ ధ్వానంబులును; రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులును; నసమానంబులై చెలంగ నెదురుకొని యథోచిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం దానును భుజగేంద్రపాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వసమాన బల యదు, భోజ, దశార్హ, కుకురాంధక, వృష్ణి, వీరపాలితంబును; సకల కాలసంపద్యమానాంకుర పల్లవ, కోరక, కుట్మల, కుసుమ, ఫల, మంజరీపుంజ భార వినమిత లతా పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును; వనాంతరాళ రసాల, సాల, శాఖాంకురఖాదనక్షుణ్ణకషాయ కంఠ కలకంఠ మిథున కోలాహల ఫలరసాస్వాదపరిపూర్ణ శారికా, కీర, కుల, కలకల, కల్హార, పుష్ప మకరంద పాన పరవశ భృంగ భృంగీ కదంబ ఝంకార సరోవర కనక కమల మృదులకాండ ఖండ స్వీకార మత్త వరటాయత్త కలహంస నివహ క్రేంకారసహితంబును; మహోన్నత సౌధజాల రంధ్రనిర్గత కర్పూర ధూపధూమపటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంతి సముద్ధూత పింఛ నర్తన ప్రవర్తమాన మత్తమయూర కేకారవ మహితంబును; నానారూప తోరణ ధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధ తారకాగ్రహ ప్రకాశంబును; ముక్తాఫలవిరచితరంగవల్లి కాలంకృత మందిర ద్వారదేహళీ వేదికా ప్రదేశంబును; ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగ్గేహ గేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారా సంసిక్త విపణి మార్గంబునుఁ; బ్రతినివాస బహిరంగణ సమర్పిత రసాలదండ, ఫల, కుసుమ, గంధాక్షత, ధూప, దీప, రత్నాంబరాది. వివిధోపహారవర్గంబునుఁ; బ్రవాళ, నీల, మరకత, వజ్ర, వైఢూర్య, నిర్మితగోపురాట్టాలకంబును, విభవ నిర్జిత మహేంద్రనగరాలకంబును నైన పురవరంబుం బ్రవేశించి; రాజమార్గంబున వచ్చు సమయంబున. (257) కన్నులారగ నిత్యమున్ హరిఁ గాంచుచున్ మనువార ల¯ య్యున్నవీన కుతూహలోత్సవయుక్తి నాగరకాంత ల¯ త్యున్నతోన్నతహర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే¯ సన్నలం దమలోనఁ దద్విభు సౌకుమార్యము సూపుచున్. (258) కలుముల నీనెడు కలకంఠి యెలనాఁగ¯ వర్తించు నెవ్వాని వక్షమందు; ¯ జనదృక్చకోరకసంఘంబునకు సుధా¯ పానీయపాత్ర మే భవ్యుముఖము; ¯ సకలదిక్పాలకసమితికి నెవ్వాని¯ బాహుదండంబులు పట్టుఁగొమ్మ; ¯ లాశ్రితశ్రేణి కే యధిపుని పాదరా¯ జీవయుగ్మంబులు చేరుగడలు; (258.1) భువనమోహనుండు పురుషభూషణుఁ డెవ్వఁ¯ డట్టి కృష్ణుఁ డరిగె హర్మ్యశిఖర¯ రాజమాన లగుచు రాజమార్గంబున¯ రాజముఖులు గుసుమరాజిఁ గురియ. (259) జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ, జామరం¯ బులతోఁ, బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతుఁ డై¯ నలినీభాంధవుతో, శశిధ్వజముతో, నక్షత్రసంఘంబుతో, ¯ బలభిచ్ఛాపముతోఁ, దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్. (260) ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబు సొచ్ఛి దేవకీ ప్రముఖు లయిన తల్లుల కేడ్వురకు మ్రొక్కిన. (261) బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు¯ జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బా¯ లొడ్డగిలఁ బ్రేమభరమున¯ జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా!