పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ స్కంధము 1 - 72


పోతన తెలుగు భాగవతం
ప్రథమ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర¯క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో¯ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా¯నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.(2) వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా¯శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్, ¯బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో¯న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.(3) ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి¯జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని¯ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత¯త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.(4) అని, నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి.(5) ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం¯పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా¯చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్, ¯మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.(6) క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత¯శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర¯శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్, ¯వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.(7) పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్¯నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ¯దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్¯పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!(8) శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా¯హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం¯దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా¯కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!(9) అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా¯డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా¯చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా¯వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!(10) అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె¯ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో¯నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా¯యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.(11) హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం¯దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా¯మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా¯సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.(12) అని యిష్టదేవతలం జింతించి, దినకర కుమార ప్రముఖులం దలంచి, ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి, హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కథాసుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి, మృదు మధురవచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి, మహాకావ్యకరణ కళావిలాసుం గాళిదాసుం గొనియాడి, కవి కమల రవిన్ భారవిన్ బొగడి, విదళితాఘు మాఘు వినుతించి, యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణారవిందవందనాభిలాషిం దిక్కమనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు వలికి, భావి కవుల బహూకరించి, యుభయకావ్యకరణ దక్షుండనై.

కృతిపతి నిర్ణయము

(13) ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్¯సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే¯సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ¯బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.(14) చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, ¯నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని, ¯దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, ¯గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.(15) అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, యొక్క రాకా నిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని, సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, క్రుంకులిడి వెడలి, మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ, గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ.(16) మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి ¯నువిద చెంగట నుండ నొప్పువాఁడు, ¯చంద్రమండల సుధాసారంబు పోలిక ¯ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు, ¯వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ ¯బలువిల్లు మూఁపునఁబరఁగువాఁడు, ¯నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ¯ఘన కిరీటము దలఁ గలుగువాఁడు,(16.1) పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు, ¯వెడఁద యురమువాఁడు, విపులభద్ర¯మూర్తివాఁడు, రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా¯కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.(17) ఏను నా రాజశేఖరుం దేఱి చూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా,”రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు"నని, యానతిచ్చి తిరోహితుం డయిన, సమున్మీలిత నయనుండనై వెఱఁగుపడి చిత్తంబున.(18) పలికెడిది భాగవత మఁట, ¯పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ¯బలికిన భవహర మగునఁట, ¯పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?(19) భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, ¯శూలికైనఁ దమ్మిచూలికైన, ¯విబుధజనుల వలన విన్నంత, కన్నంత, ¯దెలియ వచ్చినంత, దేటపఱతు.(20) కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ, ¯గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం¯గొందఱికి గుణములగు, నే ¯నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.(21) ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్¯తెనుఁగుం జేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో, ¯తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్, దీనిం దెనింగించి, నా¯జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.(22) లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం¯జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో¯జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై¯వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.(23) ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాత పాదపసమాశ్రయంబునను, హరికరుణావిశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె నని, బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి; యందు గురు, వృద్ధ, బుధ, బంధుజనానుజ్ఞాతుండనై.

గ్రంథకర్త వంశ వర్ణనము

(24) కౌండిన్యగోత్ర సంకలితుఁ, డాపస్తంబ ¯సూత్రుండు, పుణ్యుండు, సుభగుఁడైన¯భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, ¯కలకంఠి తద్భార్య గౌరమాంబ, ¯కమలాప్తు వరమునఁ గనియె సోమన మంత్రి, ¯వల్లభ మల్లమ, వారి తనయుఁ¯డెల్లన, యతనికి నిల్లాలు మాచమ, ¯వారి పుత్త్రుఁడు, వంశవర్ధనుండు(24.1) లలిత మూర్తి, బహుకళానిధి, కేసన;¯దాన మాన నీతి ధనుఁడు, ఘనుఁడు, ¯దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ¯మనియె; శైవశాస్త్రమతముఁ గనియె.(25) నడవదు నిలయము వెలువడి, ¯తడవదు పరపురుషు గుణముఁ, దనపతి నుడువుం¯గడవదు, వితరణ కరుణలు¯విడువదు, లక్కాంబ; విబుధ విసరము వొగడన్.(26) మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస¯గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా¯స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం¯పానయవాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్.(27) ఆ మానినికిం బుట్టితి¯మే మిరువుర, మగ్రజాతుఁ డీశ్వరసేవా¯కాముఁడు తిప్పన, పోతన¯నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్.(28) అయిన నేను, నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని.

షష్ఠ్యంతములు

(29) హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం¯హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో¯హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా¯హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.(30) శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని¯ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా¯పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం¯చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.(31) క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా¯రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ¯హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ¯మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.(32) న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన¯స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం¯ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని¯ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.(33) సమర్పితంబుగా, నే నాంధ్రంబున రచియింపం బూనిన శ్రీమహా భాగవతపురాణంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన.

కథా ప్రారంభము

(34) విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని¯వలన నేర్పడు, ననువర్తనమున ¯వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై¯తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి¯వేదంబు లజునకు విదితముల్ గావించె¯నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ¯నికి, నెండమావుల నీటఁ గాచాదుల¯నన్యోన్యబుద్ధి దా నడరునట్లు(34.1) త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము¯భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త¯కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద, ¯ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.(35) ఇట్లు "సత్యంపరంధీమహి"యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.(36) శ్రీమంతమై, మునిశ్రేష్ఠకృతంబైన ¯భాగవతంబు సద్భక్తితోడ¯వినఁ గోరువారల విమలచిత్తంబులఁ ¯జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక¯యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే, ¯మంచివారలకు నిర్మత్సరులకుఁ¯గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును ¯దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ,(36.1) బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు¯నడఁచి, పరమార్థభూతమై, యధిక సుఖద¯మై, సమస్తంబుఁ గాకయు, నయ్యు నుండు¯వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.(37) వేదకల్పవృక్షవిగళితమై, శుక¯ముఖసుధాద్రవమున మొనసి యున్న, ¯భాగవతపురాణఫలరసాస్వాదన¯పదవిఁ గనుఁడు రసికభావవిదులు.

నైమిశారణ్య వర్ణనము

(38) పుణ్యంబై, మునివల్లభ¯గణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా¯ద్గుణ్యమయి, నైమిశాఖ్యా¯రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్. (39) మఱియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై; బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనంబునుం బోలె వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, రంభా గణికాభిరామంబై; మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై; ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరంబై; రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై; దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపింతంబై; భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖా ఫలితంబై; మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలెఁ గేసరకరజకాంతంబై; నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; శైలజానిటలంబునుం బోలెఁ జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై; మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై; వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై; యమరావతీపురంబునుం బోలె సుమనోలలితంబై; కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై; పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై; వైకుంఠపురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితంబై; నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె రామమహిషీవంచక సమంచితంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, శరభ శోభితంబై; నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై; సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి; రం దొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి.

శౌనకాదుల ప్రశ్నంబు

(40) ఆ తాపసు లిట్లనిరి, వి¯నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ¯వ్రాతున్, నుత హరి గుణ సం¯ఘాతున్, సూతున్, నితాంత కరుణోపేతున్.(41) "సమతం దొల్లి పురాణపంక్తు, లితిహాసశ్రేణులున్, ధర్మ శా¯స్త్రములుం, నీవ యుపన్యసింపుదువు, వేదవ్యాసముఖ్యుల్మునుల్¯సుమతుల్, సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం దత్ప్రసా¯దమునం జేసి యెఱుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!(42) గురువులు ప్రియశిష్యులకుం¯బరమ రహస్యములు దెలియఁ బలుకుదు, రచల¯స్థిర కల్యాణం బెయ్యది ¯పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.(43) మన్నాఁడవు చిరకాలము, ¯గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, ¯విన్నాఁడవు వినఁదగినవి, ¯యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.(44) అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం¯కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ¯కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై¯యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.(45) ఎవ్వని యవతార మెల్ల భూతములకు¯సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు; ¯నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ¯సంసార బంధంబు సమసిపోవు; ¯నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ¯భయమొంది మృత్యువు పరువువెట్టు; ¯నెవ్వని పదనది నేపాఱు జలముల¯సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;(45.1) దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి¯తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు¯నెవ్వఁ డుదయించెఁ; దత్కథలెల్ల వినఁగ¯నిచ్చ పుట్టెడు; నెఱిఁగింపు మిద్ధచరిత!(46) భూషణములు వాణికి, నఘ¯పేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృ¯త్తోషణములు, కల్యాణ వి¯శేషణములు, హరి గుణోపచితభాషణముల్.(47) కలిదోషనివారకమై¯యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని¯ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు¯వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా!(48) అనఘ! విను, రసజ్ఞులై వినువారికి¯మాటమాట కధిక మధురమైన¯యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ ¯దలఁపు గలదు, మాకుఁ దనివి లేదు.(49) వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం¯పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి¯స్తర, దుర్దాంత, దురంత, దుస్సహ, జనుస్సంభావితానేక దు¯స్తర, గంభీర, కఠోర, కల్మష కనద్దావానలం బాఱునే?(50) హరినామ కథన దావానలజ్వాలచేఁ¯గాలవే ఘోరాఘ కాననములు; ¯వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ¯దొలఁగవే భవదుఃఖ తోయదములు; ¯కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ¯గూలవే సంతాప కుంజరములు; ¯నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ¯దీఱవే షడ్వర్గ తిమిర తతులు;(50.1) నలిన నయన భక్తినావచేఁ గాక సం¯సారజలధి దాఁటి చనఁగ రాదు; ¯వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ¯దెలుపవయ్య సూత! ధీసమేత!(51) మఱియుఁ, గపటమానవుండును, గూఢుండు నైన మాధవుండు రామ సహితుం డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నఁట; వాని వివరింపుము; కలియుగంబు రాఁగల దని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున.(52) జలరాశి దాఁటఁ గోరెడి¯కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం.¯గలి దోష హరణ వాంఛా¯కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!(53) చారుతర ధర్మరాశికి¯భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్, ¯భారకుఁడు లేక యెవ్వనిఁ¯జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!

కథా సూచనంబు

(54) అని యిట్లు మహనీయగుణగరిష్ఠు లయిన, శౌనకాది మునిశ్రేష్ఠు లడిగిన, రోమహర్షణపుత్త్రుం డయి, యుగ్రశ్రవసుం డను పేర నొప్పి, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డైన సూతుండు.(55) "సముఁడై, యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై, సన్న్యాసియై యొంటిఁ బో¯వ మహాభీతి నొహోకుమార! యనుచున్ వ్యాసుండు చీరంగ, వృ¯క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె, మున్నట్టి భూ¯తమయున్, మ్రొక్కెద బాదరాయణిఁ, దపోధన్యాగ్రణిన్, ధీమణిన్.(56) కార్యవర్గంబును, గారణ సంఘంబు¯నధికరించి చరించు నాత్మతత్త్వ¯మధ్యాత్మ మనఁబడు, నట్టి యధ్యాత్మముఁ¯దెలియఁ జేఁయఁగఁ జాలు దీప మగుచు, ¯సకలవేదములకు సారాంశమై, యేక¯మై, యసాధారణమగు ప్రభావ¯రాజకంబైన పురాణ మర్మంబును, ¯గాఢ సంసారాంధకార పటలి(56.1) దాఁటఁ గోరెడివారికి దయ దలిర్ప¯నే తపోనిధి వివరించె నేర్పడంగ, ¯నట్టి శుకనామధేయు, మహాత్మగేయు, ¯విమల విజ్ఞాన రమణీయు, వేడ్కఁ గొలుతు.H63(57) నారాయణునకు, నరునకు, ¯భారతికిని మ్రొక్కి; వ్యాసు పదములకు నమ¯స్కారము సేసి, వచింతు ను¯దారగ్రంథంబు, దళిత తను బంధంబున్."(58) అని యిట్లు దేవతాగురు నమస్కారంబుసేసి యిట్లనియె ”మునీంద్రులారా! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి; ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు? నెవ్విధంబున నాత్మ ప్రసన్నంబగు? నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి యే రూపంబునం గలుగు? నది పురుషులకుఁ బరమ ధర్మం బగు, వాసుదేవుని యందుఁ బ్రయోగింపఁ బడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు; నారాయణ కథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబు; లపవర్గపర్యంతం బయిన పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు; ధర్మంబు నందవ్యభిచారి యైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు; విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబు గాదు; నెంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు; తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు; తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస యగుటఁ గొందఱు ధర్మంబె తత్త్వం బని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానం బనుపేర నద్వయం బైన యది తత్త్వ మని యెఱుంగుదు; రా తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మ మనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు, సాత్వతులచేత భగవంతుం డనియును బలుకంబడు; వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి, జ్ఞాన వైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడగందురు; ధర్మంబునకు భక్తి ఫలంబు; పురుషులు వర్ణాశ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి; ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపనుం వర్ణింపనుం దగుఁ; జక్రాయుధ ధ్యానం బను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు; భగవంతుని యందలి శ్రద్ధయు; నపవర్గదం బగు తత్కథాశ్రవణాదుల యం దత్యంతాసక్తియుఁ; బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మనిర్మూలన హేతువు లైన కమలలోచను కథలం దెవ్వండు రతిసేయు విననిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు; పుణ్యశ్రవణకీర్తనుం డైన కృష్ణుండు తనకథలు వినువారి హృదయంబు లందు నిలిచి, శుభంబు లాచరించు; నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన భాగవతశాస్త్రసేవా విశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబు లైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నం బగుఁ; ప్రసన్నమనస్కుం డైన ముక్తసంగుం డగు; ముక్తసంగుం డైన నీశ్వరతత్త్వజ్ఞానంబు సిద్ధించు; నీశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథనరూపం బైన యహంకారంబు భిన్నం బగు; నహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబు లగు సంశయంబులు విచ్ఛిన్నంబు లగు; సంశయవిచ్ఛేదం బైన ననారబ్ధఫలంబు లైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం గావున.(59) గురుమతులు తపసు లంతః¯కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్¯హరియందు సమర్పింతురు¯పరమానందమున భిన్నభవబంధనులై.(60) పరమపూరుషుఁ, డొక్కఁ, డాఢ్యుఁడు, పాలనోద్భవ నాశముల్¯సొరిదిఁ జేయు; ముకుంద, పద్మజ, శూలి సంజ్ఞలఁ బ్రాకృత¯స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు; నందు శుభస్థితుల్¯హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.(61) మఱియు నొక్క విశేషంబు గలదు; కాష్ఠంబుకంటె ధూమంబు, ధూమంబుకంటెఁ ద్రయీమయం బయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకం బగు సత్త్వగుణంబు విశిష్టం బగు; తొల్లి మునులు సత్త్వమయుం డని భగవంతు, హరి, నధోక్షజుం, గొలిచిరి; కొందఱు సంసార మందలి మేలుకొఱకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయిన వారలు ఘోరరూపు లైన భూతపతుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతులయి నారాయణ కథల యందే ప్రవర్తింతురు; కొందఱు రాజస తామసులయి సిరియు, నైశ్వర్యంబునుఁ, బ్రజలనుం గోరి పితృభూత ప్రజేశాదుల నారాధింతురు; మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద, యాగ, యోగక్రియా, జ్ఞాన, తపోగతి, ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబు లయిన గుణంబులలోఁ బ్రవేశించి, విజ్ఞానవిజృంభితుండై వెలుఁగు; నగ్ని యొక్కరుం డయ్యుఁ, బెక్కు మ్రాఁకు లందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున; విశ్వాత్మకుం డైన పురుషుం డొక్కండ, తనవలనం గలిగిన నిఖిల భూతంబు లందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం గూడి, గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబు లైన భూతంబు లందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు, లోకకర్త యైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతు లందు లీల నవతరించి లోకంబుల రక్షించు"నని, మఱియు సూతుఁ డిట్లనియె.(62) మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై¯చారు షోడశ కళాసహితుఁ డగుచుఁ, ¯బంచమహాభూత భాసితుండై శుద్ధ¯సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ, ¯జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి¯రములు నానాసహస్రములు వెలుఁగ, ¯నంబర కేయూర హార కుండల కిరీ¯టాదులు పెక్కువేలమరుచుండఁ,(62.1) బురుషరూపంబు ధరియించి పరుఁ, డనంతుఁ, ¯డఖిల భువనైకవర్తన యత్నమమర¯మానితోదార జలరాశి మధ్యమునను¯యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు."

ఏకవింశత్యవతారములు

(63) అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పరమేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవస్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబునఁ జరియించె; రెండవ మాఱు జగజ్జననంబుకొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుండయి వరాహదేహంబుఁ దాల్చె; మూడవ తోయంబున నారదుం డను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సెప్పె; నాలవ పరి ధర్మభార్యా సర్గంబు నందు నరనారాయణాభిధానుం డై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వ గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞుం డనఁ ప్రకాశమానుండై యామాది దేవతల తోడం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి; తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమం బైన మీనావతారంబు నొంది మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోధి మధ్య భాగంబున నమృత కలశ హస్తుండై వెడలెఁ; బదమూఁడవది యయిన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించెఁ; బదునాలుగవది యైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవది యైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడులోకంబుల నాక్రమించెఁ; బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రంబున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబు నందు సంభవించి; విశ్వంభరా భారంబు నివారించె; నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు; యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుం డను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపంగలం"డని; యిట్లనియె.(64) "సరసిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ¯కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్¯సురలున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్¯హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.(65) భగవంతుం డగు విష్ణుఁడు¯జగముల కెవ్వేళ రాక్షసవ్యధ గలుగుం¯దగ నవ్వేళలఁ దడయక¯యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.(66) అతిరహస్యమైన హరిజన్మ కథనంబు¯మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ¯జాల భక్తితోడఁ జదివిన సంసార¯దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.(67) వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు; నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు"రని సూతుం డిట్లనియె.(68) "జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ¯ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్¯వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ¯చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.(69) భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం¯తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం¯త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్¯దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.(70) జగదధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్¯దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్¯మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే? ¯యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?(71) ఇంచుక మాయలేక మది నెప్పుడుఁ బాయని భక్తితోడ వ¯ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే¯వించు, నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో¯దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.(72) హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే¯తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్¯ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్¯హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్