పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ 73-172

శుకుడు భాగవతంబు జెప్పుట

(73) పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు¯బ్రహ్మతుల్యంబైన భాగవతము¯సకలపురాణరాజము దొల్లి లోకభ¯ద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి¯భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి¯శుకుఁ డనియెడుఁ తన సుతునిచేతఁ¯జదివించె నింతయు సకలవేదేతిహా¯సములలోపల నెల్ల సారమైన (73.1) యీ పురాణమెల్ల, నెలమి నా శుకయోగి¯గంగ నడుమ నిల్చి ఘన విరక్తి¯యొదవి మునులతోడ నుపవిష్టుఁ డగు పరీ¯క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు. (74) కృష్ణుండు ధర్మజ్ఞానాదులతోడం దన లోకంబునకుం జనిన పిమ్మట గలికాల దోషాంధకారంబున నష్టదర్శను లైన జనులకు నిప్పు డిప్పురాణంబు కమలబంధుని భంగి నున్నది; నాఁ డందు భూరి తేజుండయి కీర్తించుచున్న విప్రర్షివలన నేఁ బఠించిన క్రమంబున నామదికి గోచరించి నంతయ వినిపించెద"ననిన సూతునకు ముని వరుండయిన శౌనకుం డిట్లనియె. (75) "సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే¯శ్రోతల్ గోరిరి? యేమి హేతువునకై, శోధించి లోకైక వి¯ఖ్యాతిన్ వ్యాసుడుఁ మున్ను భాగవతముం గల్పించెఁ? దత్పుత్త్రుఁడే¯ప్రీతిన్ రాజునకీ పురాణకథఁ జెప్పెం? జెప్పవే యంతయున్. (76) బుధేంద్రా! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం, డేకాంతమతి, మాయాశయనంబువలనం దెలిసిన వాఁడు, గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక. (77) శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల¯జ్జకుఁ జలింపక చీర లొల్లక చల్లులాడెడి దేవక¯న్యకలు హా! శుక! యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం¯శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ! (78) మఱియు నగ్నుండుఁ దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవరమణులం గని వ్యాసుండు కారణం బడిగిన వారలు, నీ పుత్రుండు”స్త్రీ పురుషు లనెడు భేదదృష్టి లేక యుండు; మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల"దని రట్టి శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె? మఱియు నున్మత్తుని క్రియ మూగ తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లుసిద్ధించె? బహుకాలకథనీయం బయిన శ్రీభాగవతనిగమ వ్యాఖ్యానం బేరీతి సాగె? నయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవునుఁ బిదికిన యంత దడవు గాని నిలువంబడం; డతండు గోదోహనమాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబు లగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముం డైన జనపాలుని జన్మ కర్మంబు లే ప్రకారంబు? వివరింపుము. (79) పాండవ వంశంబు బలము మానంబును¯వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ; ¯బరిపంథిరాజులు భర్మాది ధనముల¯నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ; ¯గుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు¯సొచ్చి చెండాడెనే శూరు తండ్రి; ¯గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు¯విడిపించి తెచ్చె నే వీరుతాత; (79.1) యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా¯రాజు విడువరాని రాజ్యలక్ష్మిఁ¯బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై¯యసువు లుండ, నేల యడఁగి యుండె? (80) ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడుం¯జిత్తములందుఁ గోరరు హసించియు, లోకుల కెల్ల నర్థ సం¯పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా¯త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో? (81) సారముల నెల్ల నెఱుగుదు¯పారగుఁడవు భాషలందు బహువిధ కథనో¯దారుఁడవు మాకు సర్వముఁ¯బారము ముట్టంగఁ దెలియఁబలుకు మహాత్మా!"

వ్యాసచింత

(82) అని యడిగిన, శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుం డిట్లనియెఁ”దృతీయం బైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచరవసువు వీర్యంబున జన్మించి, వాసవి నాఁ దగు సత్యవతి యందుఁ బరాశరునికి హరికళం జేసి, విజ్ఞాని యయిన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీనదీ జలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై, పరులు లేని చోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయవేళ నతీతానాగతవర్తమానజ్ఞుం డయిన యా ఋషి వ్యక్తంబు గాని వేగంబుగల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు; యుగయుగంబుల భౌతిక శరీరంబు లకు శక్తి సన్నంబగుఁ బురుషులు నిస్సత్త్వులు, ధైర్యశూన్యులు, మందప్రజ్ఞు, లల్పాయువులు, దుర్బలులు, నయ్యెద రని, తన దివ్యదృష్టిం జూచి, సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయం దలంచి, నలుగురు హోతలచేత ననుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబు లైన వైదిక కర్మంబు లగు, యజ్ఞంబు లెడతెగకుండుకొఱకు నేకం బయిన వేదంబు, ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి, యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదం బని పల్కె నందు. (83) పైలుండు ఋగ్వేద పఠనంబు దొరఁకొనె, ¯సామంబు జైమిని సదువుచుండె, ¯యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ, ¯దుది నధర్వము సుమంతుఁడు పఠించె, ¯నఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి¯రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ, ¯దమతమ వేద మా తపసులు భాగించి¯శిష్యసంఘములకుఁ జెప్పి రంత (83.1) శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల¯కంత బహుమార్గములు సెప్పి యనుమతింపఁ;¯బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన¯నిగమ మొప్పారె భూసుర నివహమందు. (84) ఇట్లు మేధావిహీను లయిన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడు చున్నవి; మఱియు దీనవత్సలుం డయిన వ్యాసుండు స్త్రీ శూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులుగావు గావున మూఢుల కెల్ల మేలగు నని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితంబు నందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటి యుండి, హేతువు వితర్కించుచుఁ దనలో నిట్లనియె. (85) "వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి¯మన్నింతు, విహితకర్మములఁ గొఱఁత¯పడకుండ నడుపుదు, భారతమిషమునఁ¯బలికితి వేదార్థభావ మెల్ల, ¯మునుకొని స్త్రీశూద్రముఖ్యధర్మము లందుఁ¯దెలిపితి నేఁజెల్ల, దీనఁ జేసి¯యాత్మ సంతస మంద, దాత్మలో నీశుండు¯సంతసింపక యున్న జాడ దోఁచె, (85.1) హరికి యోగివరుల కభిలషితంబైన¯భాగవత విధంబుఁ బలుకనైతి¯మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి"¯ననుచు వగచుచున్న యవసరమున.

నారదాగమనంబు

(86) తన చేతి వల్లకీతంత్రీ స్వనంబున¯సతత నారాయణశబ్ద మొప్ప, ¯నానన సంభూత హరిగీతరవ సుధా¯ధారల యోగీంద్రతతులు సొక్కఁ, ¯గపిల జటాభార కాంతిపుంజంబుల¯దిశలు ప్రభాత దీధితి వహింపఁ, ¯దనులగ్న తులసికా దామగంధంబులు¯గగనాంతరాళంబు గప్పికొనఁగ, (86.1) వచ్చె మింటనుండి వాసవీనందను¯కడకు మాటలాడఁ గడఁకతోడ, ¯భద్రవిమలకీర్తిపారగుఁ, డారూఢ¯నయవిశారదుండు, నారదుండు. (87) కనియెన్ నారదుఁ డంతన్ ¯వినయైక విలాసు, నిగమ విభజన విద్యా¯జనితోల్లాసున్, భవదుః¯ఖనిరాసున్, గురుమనోవికాసున్, వ్యాసున్. (88) ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌ క్రమంబునం బూజించిన, నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేల మీటుచు నిట్లనియె. (89) "ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి¯జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని¯ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!¯కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!" (90) అనినఁ బారాశర్యుం డిట్లనియె. (91) "పుట్టితి వజు తనువునఁ, జే¯పట్టితివి పురాణపురుషు భజనము, పదముల్¯మెట్టితివి దిక్కులం, దుది¯ముట్టితివి మహాప్రబోధమున మునినాథా! (92) అదియునుం గాక, నీవు సూర్యునిభంగి మూఁడు లోకములం జరింతువు; వాయువు పగిది నఖిలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞుండ వగుటం జేసి. (93) నీ కెఱుఁగరాని ధర్మము¯లోకములను లేదు, బహువిలోకివి నీవున్, ¯నా కొఱఁత యెట్టి దంతయు¯నాకున్ వివరింపవయ్య నారద! కరుణన్." (94) అనిన నారదుం డిట్లనియె. (95) "అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం¯చించుక గాని విష్ణు కథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్ ప్రపం¯చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక; నీకు నీ¯కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా! (96) హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ¯సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు; శ్రీ¯హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు, శ్రీ¯కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్. (97) అపశబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా¯ప పరిత్యాగము సేయుఁ; గావున హరిన్ భావించుచుం, బాడుచున్, ¯జపముల్ సేయుచు, వీనులన్ వినుచు, నశ్రాంతంబు గీర్తించుచుం, ¯దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్త్వజ్ఞ! చింతింపుమా. (98) మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికం బైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థంబులు; గావున,మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకల దిగంత ధవళకీర్తివి, సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబుకొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులంజేసి పృథగ్దర్శనుం డైనవాని మతి పెనుగాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను నావ చందంబున నెలవు సేర నేరదు; కామ్యకర్మంబు లందు రాగంబు గల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండ వగు నీవు వగచుట తగ; దది యెట్టు లనిన, వార లదియే ధర్మం బని జుగుప్సితంబు లగు కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు; గావున, బుద్ధి మోహంబు జనియింపక తత్వజ్ఞుండవై వ్యధా వియోగంబు సేయు"మని మఱియు నిట్లనియె. (99) "ఎఱిఁగెడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్¯నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు; గుణానురక్తుఁడై¯తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై¯యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగ చెప్పవే. (100) తన కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్¯పనివడి సేవసేసి పరిపాకముఁ వొందక యెవ్వఁడేనిఁ జ¯చ్చిన, మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా¯సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్. (101) అదిగావున నెఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయం దగుఁ; గాలక్రమంబున సుఖదుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు; దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ దిరుగుచున్న జీవులకు నెయ్యది వొందరా దట్టి మేలు సిద్ధించుకొఱకు హరిసేవ సేయవలయు; హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కండు; క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తి రసవశీకృతుం డయి విడువ నిచ్చగింపఁడు; మఱియును. (102) విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను¯వేఱేమియును లేదు విశ్వమునకు¯భవవృద్ధిలయము లా పరమేశుచే నగు¯నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున¯నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ¯భువన భద్రమునకై పుట్టినట్టి¯హరికళాజాతుండ వని విచారింపుము, ¯రమణతో హరిపరాక్రమము లెల్ల (102.1) వినుతిసేయు మీవు; వినికియుఁ, జదువును, ¯దాన, మతుల నయముఁ, దపము, ధృతియుఁ, ¯గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ¯గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారదుని పూర్వకల్పము

(103) మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటిదాసికిం బుట్టి, పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి, యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు. (104) ఓటమితో నెల్లప్పుడుఁ ¯బాటవమునఁ బనులు సేసి, బాలురతో నే¯యాటలకుఁ బోక, యొక జం¯జాటంబును లేక, భక్తి సలుపుదు ననఘా! (105) మంగళమనుచును వారల¯యెంగిలి భక్షింతు, వాన కెండకు నోడన్, ¯ముంగల నిలుతును నియతిని, ¯వెంగలి క్రియఁ జనుదు నురు వివేకముతోడన్. (106) ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నా యందుఁ గృపసేసి రంత. (107) వారల్ కృష్ణు చరిత్రముల్ చదువఁగా, వర్ణింపఁగాఁ, బాడఁగా, ¯నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం¯దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం¯బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై. (108) ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండ నై, బ్రహ్మరూపకుండ నయిన నా యందు స్థూలసూక్ష్మం బయిన యీ శరీరంబు నిజ మాయాకల్పితం బని యెఱింగితి; యమ్మహాత్ము లగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార లై; రివ్విధంబున. (109) అపచారంబులు లేక, నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై, ¯చపలత్వంబును మాని, నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని¯ష్కపటత్వంబున, దీనవత్సలతతోఁ, గారుణ్య సంయుక్తులై¯యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్. (110) ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి; నీశ్వరుని యందు సమర్పితం బయిన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధం బగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు; ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు; నివ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబు లై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపి యుండు; నీశ్వరుని యందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకం బై, యీశ్వర సంతోషణంబును, భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణ గుణనామ వర్ణనస్మరణంబులు సేయుదురు; ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్నసంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి, నమస్కారంబు సేసి, మంత్రమూర్తియు మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుం డగు. (111) ఏ నవ్విధమునఁ జేయఁగ, ¯దానవకులవైరి నాకుఁ దనయందలి వి¯జ్ఞానము నిచ్చెను, మదను¯ష్ఠానము నతఁ డెఱుఁగు, నీవు సలుపుము దీనిన్. (112) మునికులములోన మిక్కిలి¯వినుకులు గలవాఁడ వీవు, విభుకీర్తులు నీ¯వనుదినముఁ బొగడ వినియెడి¯జనములకున్ దుఃఖమెల్ల శాంతిం బొందున్." (113) ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె. (114) "విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో¯యిన, బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్¯సనె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద¯త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్." (115) అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె "దాసీపుత్త్రుండ నయిన యేను భిక్షులవలన హరిజ్ఞానంబు గలిగి యున్నంత. (116) మమ్ము నేలినవారి మందిరంబునఁ గల¯పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి¯తన పరాధీనతఁ దలఁపదు; సొలసితి¯నలసితి నాఁకొంటి ననుచు వచ్చి¯మాపును రేపును మా తల్లి మోహంబు¯సొంపార ముద్దాఁడు, చుంచు దువ్వు, ¯దేహంబు నివురు, మోదించుఁ, గౌఁగిటఁ జేర్చు, ¯నర్మిలి నన్నిట్టు లరసి మనుప, (116.1) నేను విడిచి పోక యింట నుండితినయ్య, ¯మోహిఁగాక, యెఱుక మోసపోక, ¯మాఱు చింత లేక, మౌనినై యేనేండ్ల¯వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు. (117) అంత. (118) సదనము వెలువడి తెరువునఁ¯జెదరక మాతల్లి రాత్రిఁ జీఁకటివేళన్¯మొదవుం బిదుఁకగ, నొకఫణి¯పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా! (119) నీలాయతభోగఫణా¯వ్యాళానలవిష మహోగ్రవహ్నిజ్వాలా¯మాలావినిపాతితయై¯వ్రాలెన్ ననుఁ గన్నతల్లి వసుమతి మీఁదన్. (120) తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుఁ జెంది చిత్తముం¯బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి, కలంగ కేను నా¯యుల్లములోన మోహరుచి నొందక, సంగము వాసె మేలు రా¯జిల్లె, నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధిఁ జేర్చుచున్. (121) ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులుఁ, బురంబులుఁ, బట్టణంబులు, గ్రామంబులుఁ, బల్లెలు, మందలుఁ, గిరాత పుళిందనివాసంబులు, నుపవనంబులుఁ, జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబు లైన సరోవరంబులు దాఁటి చనుచు; క్షుత్పిపాసాసమేతుండ నై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై, నీరుద్రావి గతశ్రముండనై. (122) సాలావృక, కపి, భల్లుక, ¯కోలేభ, లులాయ, శల్య, ఘూక, శరభ, శా¯ర్దూల, శశ, గవయ, ఖడ్గ, ¯వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్ (123) దుస్తరంబులైన నీలవేణు, కీచక, గుల్మ, లతాగహ్వరంబుల పొంత నొక్క రావిమ్రాని డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.

నారదునికి దేవుడు దోచుట

(124) ఆనందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద¯ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే¯నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్, ¯నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్. (125) లేచి నిలుచుండి, క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు, హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గానలేక, నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె. (126) "ఏల కుమార! శోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ¯జాలవు నీవు, కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని¯ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని, కుయోగిఁ గానఁగాఁ¯జాలఁడు, నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్. (127) నావలని కోర్కి యూరక¯పోవదు, విడిపించు దోషపుంజములను, మ¯త్సేవం బుట్టును వైళమ¯భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే. (128) నాయందుఁ గలుగు నీ మది¯వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ¯కాయంబు విడిచి మీఁదట¯మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. (129) విను; మీ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యా¯మినియైపోయెడిఁ బోవఁగాఁ, గలుగుఁజూమీఁదం బునఃసృష్టి, యం¯దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్, ¯ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!" (130) అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న; నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు, మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠించుచుఁ, బరమ భద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండ నై, కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం, బంచభూతమయం బయి కర్మస్వరూపం బైన పూర్వ దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త్వమయం బైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరంబులు దమ యంతన మ్రోయుచున్న, యీ వీణాలాపన రతింజేసి నారాయణకథాగానంబు సేయుచుఁ జరియించు చుందు. (131) తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు¯తన చరిత్ర మేను దవిలి పాడఁ, ¯జీరఁబడ్డవాని చెలువున నేతెంచి¯ఘనుఁడు నామనమునఁ గానవచ్చు. (132) విను మీ సంసారంబను¯వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే¯దనఁ బొందెడువానికి వి¯ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా! (133) యమనియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ, గామరో¯షములఁ బ్రచోదితంబ యగు, శాంతి వహింపదు, విష్ణుసేవచేఁ¯గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి; నాదు శరీర జన్మ క¯ర్మముల రహస్య మెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్." (134) అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని, వీణ వాయించుచు, యదృచ్ఛామార్గంబునం జనియె"నని,,సూతుం డిట్లనియె. (135) "వాయించు వీణ నెప్పుడు, ¯మ్రోయించు ముకుందగీతములు, జగములకుం¯జేయించుఁ జెవుల పండువు, ¯మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే" (136) అని నారదుం గొనియాడిన సూతునిం జూచి ”నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె?"నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె ”బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటితీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీ తరుషండ మండితం బయి ”శమ్యాప్రాసం"బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గల; దందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మదిం దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబుఁ గని, జీవుండు మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని యభిమానించుచుఁ ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు; నయ్యనర్థంబునకు నారాయణభక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి. (137) అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా¯ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ¯క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా¯గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పగన్. (138) ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె"నని చెప్పిన విని శౌనకుండు ”నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?"ననవుడు; సూతుం డిట్లనియె. (139) "ధీరులు, నిరపేక్షులు, నా¯త్మారాములునైన మునులు హరిభజనము ని¯ష్కారణమ చేయుచుందురు;¯నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా! (140) హరిగుణవర్ణన రతుఁడై¯హరితత్పరుఁడైన బాదరాయణి శుభత¯త్పరతంబఠించెఁ ద్రిజగ¯ద్వరమంగళమైన భాగవత నిగమంబున్. (141) నిగమములు వేయుఁ జదివిన¯సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్.¯సుగమంబు భాగవత మను¯నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

ద్రౌపది పుత్రశోకం

(142) అని పలికి ”రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులునుఁ, బాండవుల మహాప్రస్థానంబునుఁ, గృష్ణకథోదయంబునుఁ జెప్పెదం; గౌరవ ధృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుం జనిన వెనుక, భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన, నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయు వాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె; నది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. (143) బాలుర చావు కర్ణములఁ బడ్డఁ గలంగి, యలంగి, యోరువం¯జాలక, బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం¯చాలతనూజ నేలఁబడి జాలిఁ బడం గని, యెత్తి, మంజువా¯చాలతఁ జూపుచుం, జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్. (144) "ధరణీశాత్మజ వీవు, నీకు వగవన్ ధర్మంబె? యా ద్రౌణి ని¯ష్కరుణుండై విదళించె బాలకుల, మద్గాండీవ నిర్ముక్త భీ¯కరబాణంబుల నేఁడు వానిశిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ, ద¯చ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా!" (145) అని యి ట్లొడంబఱచి, తనకు మిత్రుండును, సారథియు నైన హరి మేలనుచుండం, గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, గురుసుతుని వెంట రథంబు దోలించిన. (146) తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి, తద్ద్రౌణి యా¯పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్, ¯మున్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప, నా¯సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియభ్రాంతితోన్. (147) ఇట్లోపినంత దూరంబు బరువిడి వెనుకఁ జూచి రథతురంగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండై ప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ, బ్రాణసంరక్షణార్థంబు పార్థునిమీద బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన, నది ప్రచండతేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోఁచిన, హరికి నర్జునుం డిట్లనియె. (148) "పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! ¯వినుము, సంసారాగ్నివేఁగుచున్న¯జనుల సంసారంబు సంహరింపఁగ నీవు¯దక్క నన్యులు లేరు తలఁచి చూడ, ¯సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ¯ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ, వాద్య¯పురుషుండ వగు నీవు బోధముచే మాయ¯నడఁతువు నిశ్శ్రేయసాత్మ యందు (148.1) మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప¯సేసి ధర్మముఖ్యచిహ్నమయిన¯శుభము సేయు దీవు, సుజనుల నవనిలోఁ¯గావఁ బుట్టుదువు, జగన్నివాస! (149) ఇది యొక తేజము, భూమియుఁ¯జదలును దిక్కులును నిండి, సర్వంకషమై¯యెదురై వచ్చుచు నున్నది, ¯విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా!" (150) అనిన హరి యిట్లనియె. (151) "జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై¯బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్ని, బీభత్స! నీ¯బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు, సంహార మీ¯బ్రహ్మాపత్య మెఱుంగఁ, డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై." (152) అనిన నర్జునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన. (153) అవనివ్యోమము లందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్¯రవివహ్నిద్యుతిఁ బోరుచుం, ద్రిభువనత్రాసంబుఁ గావింపగా, ¯వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా¯ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్. (154) ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని, రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుఁ గట్టిన చందంబున బంధించి, శిబిరంబు కడకుం గొనిచని, హింసింతు నని తిగిచినం జూచి, హరి యిట్లనియె. (155) "మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం¯దేఱని పిన్న పాఁపల వధించె నిశీథము నందుఁ గ్రూరుఁడై, ¯పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం¯బాఱెడి వీని గావుము కృపామతి నర్జున! పాపవర్జనా! (156) వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై¯మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై¯పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా¯చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా! (157) స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ, గరుణాసంగంబు సాలించి య¯న్యప్రాణంబులచేత రక్షణము సేయన్ వాఁ, డధోలోక దుః¯ఖప్రాప్తుండగురాజదండమున సత్కల్యాణుఁ డౌ, నైన నీ¯విప్రున్ దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్?" (158) అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన, బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక, ద్రుపదరాజపుత్త్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి, బద్ధుండైన గురునందనుందోడ్కొని, కృష్ణుండు సారథ్యంబు సేయ, శిబిరంబుకడకు వచ్చి.

అశ్వత్థామని తెచ్చుట

(159) సురరాజసుతుఁడు చూపెను¯దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకుం¯బరిచలితాంగశ్రేణిం¯బరుష మహాపాశ బద్ధపాణిన్ ద్రౌణిన్. (160) ఇట్లర్జునుండు దెచ్చి చూపిన, బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుం డైన కృపి కొడుకుం జూచి మ్రొక్కి, సుస్వభావ యగు ద్రౌపది యిట్లనియె. (161) "పరఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం¯హరణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం¯చిరి; పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం¯గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే? (162) భూసురుఁడవు, బుద్ధిదయా¯భాసురుఁడవు, శుద్ధవీరభటసందోహా¯గ్రేసరుఁడవు, శిశుమారణ, ¯మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ! (163) ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం¯చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్¯భద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్, ¯నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో? (164) అక్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై¯పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ¯డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ¯డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?" (165) అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. (166) "ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్న దింట, న¯క్షీణతనూజ శోకవివశీకృతనై విలపించుభంగి నీ¯ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో? ¯ప్రాణవియుక్తుఁడైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే. (167) భూపాలకులకు విప్రుల¯గోపింపం జేయఁ దగదు కోపించినఁ, ద¯త్కోపానలంబు మొదలికి¯భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్." (168) అని యిట్లు ధర్మ్యంబును, సకరుణంబును, నిర్వ్యళీకంబును, సమంజసమును, శ్లాఘ్యంబునుంగాఁ బలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె; నకుల, సహదేవ, సాత్యకి, ధనంజయ, కృష్ణులు, సమ్మతించిరి; సమ్మతింపక భీముం డిట్లనియె. (169) "కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్¯విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే? ¯విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా¯పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్." (170) అని పలికిన, నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి, హరి చతుర్భుజుం డయి, రెండు చేతుల భీముని వారించి, కడమ రెంటను ద్రుపద పుత్రికను దలంగించి, నగుచు భీముని కిట్లనియె (171) "అవ్యుఁడు గాఁడు వీఁడు, శిశుహంత, దురాత్మకుఁ, డాతతాయి, హం¯తవ్యుఁడు, బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము ”బ్రాహ్మణో నహ¯న్తవ్య" యటంచు వేదవిదితం బగుఁ గావున, ధర్మ దృష్టిఁ గ¯ర్తవ్యము వీనిఁ గాచుట; యథాస్థితిఁ జూడుము, పాండవోత్తమా!" (172) అని సరసాలాపంబులాడి, పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి ”ద్రౌపదికి, నాకు, భీమసేనునకు సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు, నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు నారాయణానుమతంబున.