పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ 359-453

కృష్ణనిర్యాణంబు వినుట

(359) "మన సారథి, మన సచివుడు, ¯ మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుఁడున్, ¯ మన విభుడు, గురుడు, దేవర, ¯ మనలను దిగనాడి చనియె మనుజాధీశా! (360) కంటకులు నృపులుసూడఁగ, ¯ మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్¯ గెంటించి మనము వాలుం¯ గంటిం జేకొంటి మతని కరుణన కాదే? (361) దండిననేకులతో నా¯ ఖండలుఁ డెదు రయిన గెలిచి ఖాండవవనముం¯ జండార్చికి నర్పించిన¯ గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుట నధిపా! (362) దిక్కుల రాజుల నెల్లను¯ మక్కించి ధనంబు గొనుట, మయకృతసభ ము¯ న్నెక్కుట, జన్నము సేయుట, ¯ నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే? (363) ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్¯ సభలో శాత్రవు లీడ్చినన్, ముడువకా చంద్రాస్య దుఃఖింపఁగా, ¯ నభయం బిచ్చి, ప్రతిజ్ఞ సేసి భవదీయారాతికాంతా శిరో¯ జభరశ్రీల హరింపఁడే విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్? (364) వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా, వారింప నా వల్లభుల్¯ రారీవేళ, నుపేక్ష సేయఁ దగవే, రావే, నివారింపవే? ¯ లే రే త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగి యై కుయ్యిడం¯ గారుణ్యంబున భూరివస్త్రకలితంగాఁ జేయఁడే ద్రౌపదిన్? (365) దుర్వాసుఁ డొకనాడు దుర్యోధనుఁడు వంపఁ¯ బదివేల శిష్యులు భక్తిఁ గొలువఁ¯ జనుదెంచి, మనముఁ బాంచాలియుఁ గుడిచిన¯ వెనుక నాహారంబు వేఁడికొనినఁ, ¯ బెట్టెద ననవుడుఁ బెట్టకున్న శపింతు, ¯ ననుచుఁ దోయావగాహమున కేఁగఁ, ¯ గడవల నన్న శాకములు దీఱుటఁ జూచి, ¯ పాంచాలపుత్రిక పర్ణశాల (365.1) లోనఁ దలఁచిన విచ్చేసి లోవిలోని¯ శిష్టశాకాన్నలవముఁ బ్రాశించి, తపసి¯ కోప ముడిగించి, పరిపూర్ణకుక్షిఁ జేసె, ¯ నిట్టి త్రైలోక్య సంతర్పి యెందుఁ గలఁడు? (366) పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని¯ బలమున నా కిచ్చెఁ బాశుపతము? ¯ నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు¯ పీఠార్ధమున నుండ బెంపుఁ గంటిఁ? ¯ గాలకేయ నివాతకవచాది దైత్యులఁ¯ జంపితి నెవ్వని సంస్మరించి? ¯ గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ¯ గడచితి నెవ్వని కరుణఁ జేసి? (366.1) కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల¯ తలలపాగ లెల్లఁ దడవి తెచ్చి¯ యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని¯ పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు? (367) గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో, ¯ గురుశక్తిన్ రథయంత యై, నొగలపైఁ గూర్చుండి, యా మేటి నా¯ శరముల్ వాఱక మున్న, వారల బలోత్సాహాయు రుద్యోగ త¯ త్పరతల్ చూడ్కుల సంహరించె, నమితోత్సాహంబు నా కిచ్చుచున్. (368) అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె¯ ల్వ సమర్థంబులు గాని కైవడిఁ; గృపాశ్వత్థామ, గాంగేయ, సూ¯ ర్యసుత, ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్రప్రపంచంబు నా¯ దెసకున్ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా! (369) వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా¯ రసములు మాటుగాఁ బఱపి రథ్యములన్ రిపు లెల్లఁ జూడ సా¯ హసమున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు, నా¯ కసురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె? భూవరా! (370) చెలికాఁడ రమ్మని చీరు న న్నొకవేళ, ¯ మన్నించు నొకవేళ మఱఁది యనుచు, ¯ బంధుభావంబునఁ బాటించు నొకవేళ, ¯ దాతయై యొకవేళ ధనము లిచ్చు, ¯ మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు, ¯ బోధియై యొకవేళ బుద్ధి సెప్పు, ¯ సారథ్య మొనరించుఁ జనవిచ్చి యొకవేళఁ, ¯ గ్రీడించు నొకవేళ గేలి సేయు, (370.1) నొక్క శయ్యాసనంబున నుండుఁ, గన్న¯ తండ్రి కైవడిఁ జేసిన తప్పుఁ గాచు, ¯ హస్తములు వట్టి పొత్తున నారగించు, ¯ మనుజవల్లభ! మాధవు మఱవ రాదు. (371) విజయ, ధనంజయ, హనుమ¯ ద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేం¯ ద్రజ, మిత్రార్జున, యంచును¯ భుజములు తలకడవ రాకపోకలఁ జీరున్. (372) వారిజగంధులు దమలో¯ వారింపఁగరాని ప్రేమ వాదము సేయన్, ¯ వారిజనేత్రుఁడు ననుఁ దగ¯ వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా! (373) నిచ్చలు లోపలికాంతలు¯ మచ్చికఁ దనతోడ నాడు మాటలు నాకున్¯ ముచ్చటలు సెప్పు మెల్లన¯ విచ్చలవిడిఁ దొడలమీఁద విచ్చేసి నృపా! (374) అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా¯ యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం¯ బటుతర దేహలోభమునఁ బ్రాణములున్నవి వెంటఁబోక, నేఁ¯ గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో? (375) కాంతారంబున నొంటి దోడుకొని రాఁగాఁ జూచి గోవిందు శు¯ ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల, మదరాగాయత్తులై తాఁకి నా¯ చెంతన్ బోయలు మూఁగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్¯ భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక; ధాత్రీశ్వరా! (376) ఆ తే, రా రథికుండు, నా హయము, లా యస్త్రాసనం, బా శర¯ వ్రాతం, బన్యులఁ దొల్లి జంపును, దుదిన్ వ్యర్థంబు లైపోయె; మ¯ చ్చేతోధీశుఁడు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా¯ యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్. (377) యదువీరుల్ మునినాథుశాపమునఁ గాలాధీనులై, యందఱున్¯ మదిరాపాన వివర్ధమాన మదసమ్మర్దోగ్ర రోషాంధులై¯ కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి న¯ ష్టదశం జిక్కిరి నల్వు రేవు రచటన్ సర్వంసహావల్లభా! (378) భూతములవలన నెప్పుడు¯ భూతములకు జన్మ మరణ పోషణములు ని¯ ర్ణీతములు సేయుచుండును¯ భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా! (379) బలములు గల మీనంబులు¯ బలవిరహితమీనములను భక్షించు క్రియన్¯ బలవంతు లయిన యదువులు¯ బలరహితులఁ జంపి రహితభావముల నృపా! (380) బలహీనాంగులకున్ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం¯ బులు గల్పించి, వినాశమున్ నెఱపి, యీ భూభారముం బాపి, ని¯ శ్చలబుద్ధిం గృతకార్యుఁడై చనియె; నా సర్వేశ్వరుం, డచ్యుతుం, ¯ డలఘుం, డేమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వరా!

పాండవుల మహాప్రస్థానంబు

(381) మఱియు దేశకాలార్థయుక్తంబులు, నంతఃకరణ సంతాప శమనంబులునయిన హరివచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబయియున్నది;"అని యన్నకుం జెప్పి నిరుత్తరుండై, నిరంతర హరిచరణారవిందచింతామలబుధియై, శోకంబు వర్జించి, సదా ధ్యాన భక్తివిశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి తన కుభయసేనా మధ్యంబున నచ్యుతుం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబులచేత నావృతంబయిన విజ్ఞానంబుఁ గ్రమ్మఱ నధిగమించి,హేతుమద్భావంబున శోకహేతు వహంకార మమకారాత్మకంబయిన ద్వైతభ్రమం బనియును, ద్వైతభ్రమంబునకుఁ గారణంబుదేహం బనియును, దేహంబునకు బీజంబు లింగంబనియును,లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతియనియును, ”బ్రహ్మాహ"మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబువలనఁ గార్యలింగ నాశం బనియును, గార్యలింగనాశంబున నసంభవంబగు ప్రకృతింబాసి, క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును నిశ్చయించి యర్జునుండు విరక్తుండై యూరకుండె; ధర్మజుండు భగవదీయమార్గంబు దెలిసి యాదవుల నాశంబు విని నారదువచనంబులం దలంచి నిశ్చలచిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయుచుండె; నా సమయంబున. (382) యదువుల నాశము మాధవు¯ పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ¯ త్పదచింతాతత్పరయై¯ ముదమున సంసారమార్గమునకుం బాసెన్. (383) ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిపరిహరించు విన్నాణి తెఱంగున యాదవ రూప శరీరంబునం జేసి యీశ్వరుండు లోకకంటకశరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె; సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున మెలంగుచు రూపాంతరంబులు ధరియించి క్రమ్మఱ నంతర్ధానంబు నొందు నటుని కైవడి లీలా పరాయణుండైన నారాయణుండు, మీన కూర్మాది రూపంబులు ధరియించుఁ బరిహరించు"నని చెప్పి, మఱియు నిట్లనియె. (384) "ఏ దినమున వైకుంఠుఁడు¯ మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ¯ డా దినమున నశుభప్రతి¯ పాదక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్. (385) కలివర్తనంబునఁ గ్రౌర్యహింసాసత్య¯ దంభకౌటిల్యాద్యధర్మ చయము¯ పురముల గృహముల భూములఁ దమలోనఁ¯ గలుగుట దలపోసి కరిపురమున¯ మనుమని రాజవై మను మని దీవించి¯ సింధుతోయకణాభిషిక్తుఁ జేసి¯ యనిరుద్ధనందనుండైన వజ్రునిఁ దెచ్చి¯ మధురఁ బట్టము గట్టి మమతఁ బాసి (385.1) కరుల హరుల భటులఁ గంకణాదికముల¯ మంత్రిజనుల బుధుల మానవతుల¯ నఖిల మయిన ధనము నభిమన్యుసుతునకు¯ నప్పగించి బుద్ధి నాశ్రయించి. (386) విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టిఁ గావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండును నై సక లేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీనవృత్తి యగు మానసంబునుఁ బ్రాణమందునుఁ, బ్రాణము నపానమందును, నుత్సర్గసహితం బయిన యపానము మృత్యువునందును, మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబు నందును, దేహము గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోపహేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండయిన తన్ను నవ్యయం బయిన బ్రహ్మ మందును, లయింపంజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు, నిరాహారుండును, ముక్తకేశుండునునై; యున్మత్త, పిశాచ, బధిర, జడుల చందంబున నిరపేక్షకత్వంబున. (387) చిత్తంబున బ్రహ్మము నా¯ వృత్తముఁ గావించుకొనుచు విజ్ఞానధనా¯ యత్తులు దొల్లి వెలింగెడి ¯ యుత్తరదిశ కేఁగె నిర్మలోద్యోగమునన్. (388) అంత నాతని తమ్ము లనిలపుత్త్రాదులు¯ గలిరాకచేఁ బాపకర్ము లగుచుఁ¯ జరియించు ప్రజల సంచారంబు లీక్షించి¯ యఖిల ధర్మంబుల నాచరించి¯ వైకుంఠ చరణాబ్జ వర్తిత హృదయులై¯ తద్భక్తినిర్మలత్వమునుఁ జెంది¯ విషయయుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక¯ నిర్ధూతకల్మష నిపుణమతులు (388.1) బహుళవిజ్ఞానదావాగ్ని భసితకర్ము¯ లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు¯ ముఖ్యనారాయణస్థానమునకుఁ జనిరి¯ విగతరజమైన యాత్మల విప్రముఖ్య! (389) అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోడ దండధరుం డగుటం జేసి నిజాధికారస్థానంబునకుం జనియె; ద్రుపదరాజపుత్రియుఁ బతులవలన నుపేక్షితయై జగత్పతియైన వాసుదేవు నందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె; నిట్లు. (390) పాండవకృష్ణుల యానము, ¯ పాండురమతి నెవ్వఁడైనఁ బలికిన విన్నన్¯ ఖండితభవుఁడై హరిదా¯ సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!

పరీక్షిత్తు దిగ్విజయయాత్ర

(391) అంత నటం బరీక్షిత్కుమారుండు జాతకర్మవిదులైన కోవిదులు సెప్పిన చందంబున భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవత శేఖరుండై ధరణీపాలనంబు సేయుచు నుత్తరుని పుత్రిక నిరావతి యను మత్తకాశినిం బెండ్లి యయి, జనమేజయ ప్రముఖులైన నలువురు గొడుకుల నుత్పాదించి, గంగాపులినతలంబునఁ గృపాచార్యుండు గురుత్వంబు సేయ యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షించుచు భూరిదక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయ కాలంబున గోమిథునంబుఁ దన్ను శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండును నగు కలిం బట్టి నిగ్రహించె"నని చెప్పిన, శౌనకుండు పౌరాణికున కిట్లనియె. (392) "భూవరరూపుఁడు శూద్రుఁడు¯ గోవుం దా నేల తన్నెఁ, గోరి పరీక్షి¯ ద్భూవరుఁడు దిశల గెలుచుచు¯ నే విధిఁ గలి నిగ్రహించె, నెఱిఁగింపఁ గదే. (393) అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స¯ త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్దిన్ విలంఘించి, దు¯ ర్నరవార్తాకథనప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి, వా¯ సరముల్ వ్యర్థతఁ దోచుచుండఁ జన దీ సంసారమోహంబునన్. (394) మనుట నిత్యము గాదు మరణంబు నిజ మని¯ యెఱిఁగి మోక్షస్థితి నిచ్చగించు¯ నల్పాయువు లగు మా కన్యదుర్జన చరి¯ త్రములోలిఁ గర్ణరంధ్రములఁ బెట్టి¯ బంగారు వంటి యీ బ్రతికెడు కాలంబుఁ¯ బోనాడఁ గానేల పుణ్యచరిత! ¯ మాధవపదపద్మ మకరందపానంబు¯ సేయింపవే యేము సేయునట్టి (394.1) సత్రయాగమునకు సన్మునీంద్రులు సీర¯ వాఁడె దండధరుఁడు వచ్చెఁ జూడు¯ చంపఁ డొకనినైన జన్న మయ్యెడుదాక, ¯ వినుచు నుండుఁ దగిలి విష్ణుకథలు. (395) మందునకు, మందబుద్ధికి, ¯ మందాయువునకు, నిరర్థమార్గునకును, గో¯ విందచరణారవింద మ¯ రందము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్." (396) అని శౌనకుండు వలికిన సూతుం డిట్లనియెఁ ”బరీక్షిన్నరేంద్రుండు నిజవాహినీసందోహ సురక్షితంబగు కురుజాంగలదేశంబునం గలి ప్రవేశంబు నాకర్ణించి, యుద్ధకుతూహలత నంగీకరించి, యొక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని, నీల నీరద నిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబును నైన రథంబు నారోహణంబు సేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుఁగ రథ, కరి, తురంగమ, సుభట, సంఘటితంబగు వాహినీచక్రంబు నిర్వక్రంబుగం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబు లయిన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారతవర్షంబులు, నుత్తరకురు దేశంబులును, జయించి, పుష్కల ధన ప్రదానపూర్వికలగు సపర్యల నభ్యర్చితుండై తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు, మంగళ పాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణించుచుఁ, బాఠకపఠిత పద్యంబుల వలనం బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య, సఖ్య, సాచివ్య, సభాపతిత్వ, వీరాసనత్వ, దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్ర తేజంబు వలనఁ దన్ను రక్షించుటయు, యాదవ పాండవు లందలి స్నేహానుబంధంబును, వారలకుఁ గలిగిన భగవద్భక్తి విశేషంబును విని, విశ్వంభరుని భక్త వాత్సల్యంబునకు నాశ్చర్యంబు నొందుచు, వందిబృందంబులకు న్మహార్ఘంబులగు హారాంబరాభరణాది సందోహంబుల నొసంగుచుఁ, బద్మనాభ పాద పద్మభజనపరతంత్ర పవిత్ర మానసుండై యుండె; నయ్యెడ వృషభరూపంబున నేక పాదంబున సంచరించు ధర్మదేవుండు దన సమీపంబున లేఁగలేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు గోరూపయై యున్న ధాత్రి కిట్లనియె.

గోవృషభ సంవాదం

(397) "నయనాంభఃకణజాల మేల విడువన్ నా తల్లి నీ మేను సా¯ మయమై యున్నది; మోము వాడినది; నీ మన్నించు చుట్టాలకున్¯ భయదుఃఖంబులు నెందు వొందవు గదా? బంధించి శూద్రుల్ పద¯ త్రయహీనన్ ననుఁ బట్టవత్తురనియో, తాపంబు నీ కేటికిన్. (398) మఖములు లేమి నమర్త్యుల కిటమీఁద¯ మఖభాగములు లేక మాను ననియొ? ¯ రమణులు రమణుల రక్షింప రనియొ? పు¯ త్త్రులఁ దల్లిదండ్రులు ప్రోవరనియొ? ¯ భారతి గుజనులఁ బ్రాపించుననియొ? స¯ ద్విప్రులు నృపుల సేవింతు రనియొ? ¯ కులిశహస్తుఁడు వాన గురియింపకుండఁగఁ¯ బ్రజలు దుఃఖంబులఁ బడుదురనియొ? (398.1) హీనవంశ జాతు లేలెదరనియొ? రా¯ జ్యములు పాడిగలిగి జరుగవనియొ? ¯ మనుజు లన్న, పాన, మైథున, శయ, నాస¯ నాది కర్మసక్తు లగుదు రనియొ? (399) జననీ! నీ భరమెల్ల డించుటకునై చక్రాయుధుం డిన్ని హా¯ యనముల్ దాను నరాకృతిన్ మెలఁగి నిత్యానందముం జేసి పో¯ యిన నే నింక ననాథ నైతిఁ గుజనుం డెవ్వాఁడు శాసించునో? ¯ పెను దుఃఖంబులఁ నేమి పొందు ననియో? భీతిల్లి చింతించుటల్. (400) దెప్పర మగు కాలముచే¯ నెప్పుడు దేవతల కెల్ల నిష్టం బగు నీ¯ యొప్పిదము కృష్ణుఁ డరిగినఁ¯ దప్పెఁ గదా! తల్లి! నీవు తల్లడపడఁగన్." (401) అనిన భూదేవి యిట్లనియె. (402) "ఈ లోకంబునఁ బూర్వము¯ నాలుగు పాదముల నీవు నడతుఁవు నేఁ డా¯ శ్రీలలనేశుఁడు లేమినిఁ¯ గాలముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే! " (403) మఱియు సత్య, శౌచ, దయా, క్షాంతులునుఁ, ద్యాగ, సంతోషార్జవంబులును, శమ, దమ, తపంబులును, సమత్వంబును, పరాపరాధ సహనంబును, లాభంబు గల యెడ నుదాశీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, జ్ఞాన, విరక్తులును, నైశ్వర్య, శౌర్య, ప్రభా, దక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్ర్యంబునుఁ, గౌశల, కాంతి, ధైర్య, మార్దవ, ప్రతిభాతిశయ, ప్రశ్రయ, శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ,మనోబలంబులును, సౌభాగ్య, గాంభీర్య, స్థైర్యంబులును, శ్రద్దా, కీర్తి,,మానగర్వాభావంబులును, ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుం గాక బ్రహ్మణ్యతా, శరణ్యతాది, మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లుం గావున. (404) గణనాతీతము లగు స¯ ద్గుణములు గల చక్రి సనిన ఘోరకలిప్రే¯ రణమునఁ బాప సమూహ¯ వ్రణ యుతు లగు జనులఁ జూచి వగచెదఁ దండ్రీ! (405) దేవతలకు, ఋషులకుఁ, బితృ¯ దేవతలకు, నాకు, నీకు, ధీరులకును, నా¯ నావర్ణాశ్రమములకును¯ గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా! (406) బ్రహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీ¯ క్షణము వాంఛింతురు సత్తపములఁ?¯ గమలాలయము మాని కమల యెవ్వని పాద¯ కమలంబు సేవించుఁ గౌతుకమునఁ?¯ బరమ యోగీంద్రులు భవ్యచిత్తములందు¯ నిలుపుదు రెవ్వని నియతితోడ?¯ వేదంబులెవ్వని విమలచారిత్రముల్¯ వినుతింపఁగా లేక వెగడువడియె? (406.1) నట్టి వాసుదేవు నబ్జ, వజ్రాంకుశ, ¯ చక్ర, మీన, శంఖ, చాప, కేతు¯ చిహ్నితంబులైన శ్రీచరణము లింక¯ సోఁక వనుచు వగపు సోఁకెనయ్య! (407) హరిపాదంబులు సోఁకెడి¯ సిరికతమున నఖిల భువన సేవ్యత్వముతో¯ స్థిర నైతి నిన్ని దినములు¯ హరి నా గర్వంబు మాన్చి యరిగె మహాత్మా! (408) లీలాకారము దాల్చెను ¯ శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో¯ న్మూలనము సేయుకొఱకును¯ నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్ (409) ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం¯ బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర¯ ప్రేమకరావలోకనము ప్రీతిఁ గనుంగొనలేమి మాధవుం¯ గామినులేల? నిర్దళితకర్ములు యోగులుఁ బాయనేర్తురే? (410) మెల్లన నాపై యాదవ¯ వల్లభుఁ డడుగిడఁగ మోహవశనై నేరం¯ జిల్లగ రోమాంచము క్రియ¯ మొల్లములై మొలచు సస్యములు మార్గములన్." (411) అని యిట్లు పూర్వవాహినియైన సరస్వతీతీరంబున ధర్మదేవుండును, భూమియు; వృషభ, ధేనురూపంబుల భాషింప రాజర్షి యైన పరీక్షిద్భూవరుండు డగ్గఱియె; నా సమయంబున. (412) కైలాసాచలసన్నిభంబగు మహాగంభీరగోరాజముం¯ గాలక్రోధుఁడు, దండహస్తుఁడు, నృపాకారుండు, క్రూరుండు, జం¯ ఘాలుం డొక్కఁడు, శూద్రుఁ డాసురగతిం గారుణ్యనిర్ముక్తుఁడై¯ నేలం గూలఁగఁ దన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్. (413) మఱియును. (414) ఆలోలాంగక నశ్రు తోయ కణ జాలాక్షిన్, మహాంభారవన్, ¯ బాలారూఢ తృణావళీకబళలోభవ్యాప్త జిహ్వాగ్ర, నాం¯ దోళస్వాంతనజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్, ఘర్మకీ¯ లాలాపూర్ణశరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్ వడిన్.

కలి నిగ్రహంబు

(415) ఇట్లాధేను వృషభంబుల రెంటిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండయిన శూద్రునిం జూచి, సువర్ణ పరికరస్యందనారూఢుం డగు నభిమన్యునందనుండు గోదండంబు సగుణంబు సేసి, మేఘగంభీరరవంబు లగు వచనంబుల నిట్లనియె. (416) "నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం¯ దన్నం గారణ మేమి? మద్భుజసనాథక్షోణి నే వేళలం¯ దున్నేరంబులు సేయ రా; దెఱుఁగవా? ధూర్తత్వమున్ భూమిభృ¯ త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు? నిన్ శాసించెదన్ దుర్మతీ! (417) గాండీవియుఁ జక్రియు భూ¯ మండలిఁ బెడఁబాసి చనిన మదమత్తుఁడవై¯ దండింపఁ దగనివారల¯ దండించెదు నీవ తగుదు దండనమునకున్." (418) అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె. (419) "కురుధాత్రీశ్వర బాహు వప్ర యుగళీ గుప్తక్షమా మండలిం¯ బరికింపన్ భవదీయ నేత్ర జనితాంభశ్శ్రేణిఁ దక్కన్, జనుల్¯ దొరఁగం జేయ రధర్మ సంజనిత జంతుశ్రేణిబాష్పంబులన్, ¯ గురుశక్తిన్ విదళింతుఁ జూడు మితనిన్ గోమూర్తిదేవోత్తమా! (420) జాలిఁ బడ నేల? నా శర¯ జాలంబుల పాలు సేసి చంపెద వీనిన్¯ భూలోకంబున నిపుడే¯ నాలుగు పాదముల నిన్ను నడిపింతుఁ జుమీ. (421) వాచవియైన గడ్డిఁ దిని, వాహిను లందు జలంబు ద్రావఁగా, ¯ నీ చరణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁ జేసె? వాఁడు దా¯ ఖేచరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్¯ వేచని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్." (422) అని మఱియు గోరూప యయిన భూదేవితో నిట్లనియె. (423) "అగణితవైభవుం డగు మురాంతకుఁ డక్కట పోయె నంచు నె¯ వ్వగలఁ గృశించి నేత్రముల వారికణంబులు దేకు మమ్మ! లో¯ బెగడకు మమ్మ! మద్విశిఖబృందములన్ వృషలున్ వధింతు నా ¯ మగఁటిమిఁ జూడ వమ్మ! వెఱ మానఁ గదమ్మ! శుభప్రదాయినీ! (424) సాధువులగు జంతువులకు¯ బాధలు గావించు ఖలుల భంజింపని రా¯ జాధము నాయుస్స్వర్గ¯ శ్రీధనములు వీటిఁబోవు సిద్ధము తల్లీ! (425) దుష్టజననిగ్రహంబును¯ శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్¯ స్రష్ట విధించెఁ, బురాణ¯ ద్రష్టలు సెప్పుదురు పరమధర్మము సాధ్వీ!" (426) అనిన ధర్మనందనపౌత్రునకు వృషభమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె. (427) "క్రూరులఁ జంపి సాధువులకున్ విజయం బొనరించు నట్టి యా¯ పౌరవవంశజాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ¯ వా రిటువంటివా రగుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్యసం¯ చారము సేసెఁ గాదె నృపసత్తమ! భక్తిలతానిబద్ధుఁడై. (428) నరేంద్రా! యేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము; మా వలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేడు; వాది వాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబు నాచ్ఛాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభు వని చెప్పుదురు; దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబుం బ్రకటింతురు; లోకాయతికులు స్వభావంబునకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; ఇందెవ్వరికిని సుఖదుఃఖ ప్రదానంబు సేయ విభుత్వంబు లేదు; పరుల వలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు సేసి రని విచారింప వలదు; తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు నగుచుండు"ననిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుం డిట్లనియె. (429) "ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ! వృషరూప! ¯ పరమధర్మ మీవు పలుకు త్రోవ, ¯ పాపకర్ము చేయు పాపంబు సూచింపఁ¯ బాపకర్ముఁ డేఁగు పథము వచ్చు. (430) మఱియు దేవమాయవలన భూతంబుల వాఙ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణం బగు వృత్తి సులభంబునం దెలియ రాదు; నీవుధర్మదేవతవు; కృతయుగంబునం దపశ్శౌచదయాసత్యంబు లనునాలుగు నీకు బాదంబు లని చెప్పుదురు; త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబు నం దొక్క పాదంబు క్షీణం బయ్యె; ద్వాపరంబునం పాద ద్వయంబు నశించెం గలియుగం బందు నివ్వడువుననిప్పుడు నీకుఁ బాదత్రయంబు భగ్నం బయ్యె నవశిష్టంబగు, భవదీయ చతుర్థ పాదంబున ధర్మంబు గల్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది విను మదియునుం గాక. (431) భరముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం దొక్కఁగా¯ స్థిరయై వేడుక నింతకాలము సుఖశ్రీ నొందె భూదేవి; త¯ చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచున్ నిరం¯ తరశోకంబున నీరు గన్నుల నిడెన్ ధర్మజ్ఞ! వీక్షించితే." (432) అని యిటు ధరణీధర్మదేవతల బుజ్జగించి, మహారథుండయిన విజయపౌత్రుండు క్రొక్కారు మెఱుంగు చక్కదనంబుఁ ధిక్కరించి దిక్కులకు వెక్కసంబయిన యడిదంబు బెడిదంబుగ జడిపించి పాపహేతు వయిన కలిని రూపుమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపంబు విడనాడి, వాడిన మొగంబుతోడ, భయవిహ్వలుండై హస్తంబులు సాఁచి, తత్పాదమూల విన్యస్తమస్తకుండై, ప్రణామంబు సేసి. (433) "కంపించె దేహ మెల్లం, ¯ జంపకు మో! రాజతిలక! శరణాగతు ర¯ క్షింపు" మని, తనకు మ్రొక్కినఁ¯ జంపక కలిఁ జూచి నగచు జనపతి పలుకున్. (434) "అర్జునకీర్తిసమేతుం, ¯ డర్జునపౌత్రుండు, భయర సావృత జనులన్¯ నిర్జితులఁ జంప నొల్లడు;¯ దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా! (435) నీవు పాపబంధుండవు, మదీయబాహుపాలితం బయిన మహీమండలంబున నిలువ వలవదు; రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య, లోభ, చౌర్య, దౌర్జన్య, దురాచార, మాయాకలహ, కపట, కలుషాలక్ష్మ్యాది, ధర్మేతర సమూహంబు లాశ్రయించు; సత్యధర్మంబులకు నివాసం బగు బ్రహ్మావర్త దేశంబున యజ్ఞ విస్తార నిపుణు లయినవారు యజ్ఞేశ్వరుండయిన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు, యజించు వారలకు సుఖప్రదాయనంబు సేయుచు, సకలభూతాంతర్యామి యై భగవంతుడయిన హరి జంగమ స్థావరంబులకు నంతరంగ బహిరంగముల సంచరించు వాయువు చందంబున నాత్మరూపంబున మనోరథంబుల నిచ్చుం; గావున, నీ విందుండ వలవ"దనుచు దండహస్తుం డయిన జముని కైవడి మండలాగ్రంబు సాఁచిన రాజవర్యునకుం గలి యిట్లనియె. (436) "జగదీశ్వర! నీ యడిదము¯ ధగధగితప్రభలతోడఁ దఱచుగ మెఱయన్¯ బెగడెం జిత్తము గుండెలు¯ వగిలెడి నిఁక నెందుఁ జొత్తు భావింపఁ గదే.

ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

(437) "నరేంద్రా! నిన్ను నారోపితశరశరాసను సర్వప్రదేశంబు లందును విలోకించుచున్నవాడ; నే నెక్కడ నుండుదు నానతిమ్మ"నిన, రాజన్యశేఖరుండు ప్రాణవధ, స్త్రీ, ద్యూత, పానంబు, లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చి, మఱియు నడిగిన సువర్ణ మూలం బగు నసత్య, మద, కామ, హింసా, వైరంబు, లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె; నిట్లు కలినిగ్రహంబుసేసి; హీనంబు లయిన తప, శ్శౌచ, దయ లనియెడి మూఁడుపాదంబులు వృషభమూర్తి యయిన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరం బయిన సంతోషంబు సంపాదించి. (438) గజనామధేయపురమున¯ గజరిపుపీఠమున ఘనుఁడు గలిదమనుం డున్¯ గజవైరిపరాక్రముఁ డే¯ గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్. (439) ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబు వలన బ్రతికి; వృషభమూర్తి యయిన ధర్మదేవతకు నభయం బిచ్చిన పరీక్షిన్నరేంద్రుండు బ్రాహ్మణశాపప్రాప్త తక్షకాహిభయంబు వలనఁ బ్రాణంబులు వోవు నని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి, గంగాతరంగిణీ తీరంబునం గళేబరంబువిడిచె వినుఁడు. (440) హరివార్త లెఱుఁగువారికి¯ హరిపదములు దలఁచువారి కనవరతంబున్¯ హరికథలు వినెడివారికి¯ మరణాగతమోహసంభ్రమము లే దనఘా! (441) శుభచరితుఁడు హరి యరిగినఁ ¯ బ్రభవించి ధరిత్రి నెల్లఁ బ్రబ్బియుఁ గలి దా¯ నభిమన్యుసుతుని వేళను ¯ బ్రభవింపక యడఁగి యుండె భార్గవముఖ్యా! (442) ఇవ్విధంబునఁ జతుస్సముద్రముద్రితాఖిలమహీమండలప్రాజ్య సామ్రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయుచు నా యభిమన్యుసంభవుండు (443) చేసినఁ గాని పాపములు సెందవు; చేయఁ దలంచి నంతటం¯ జేసెద నన్నమాత్రమునఁ జెందుఁ గదా కలివేళఁ బుణ్యముల్ ¯ మోసము లే దటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము¯ ల్లాసముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్. (444) మఱియుం బ్రమత్తులై యధీరులగు నరులయందు వృకంబు చందంబున నొదిఁగి కాచుకొని యుండి చేష్టించుం గాని, ధీరులైనవారికిం గలివలని భయంబు లేదని కలి నంతంబు నొందింప డయ్యె"ననిన విని ఋషులు సూతున కిట్లనిరి. (445) "పౌరాణికోత్తమ! బ్రతుకుము పెక్కేండ్లు¯ తామరసాక్షుని ధవళయశము¯ మరణశీలురమైన మా కెఱింగించితి¯ కల్పితంబగు క్రతుకర్మమందుఁ¯ బొగలచేఁ బొగిలి యబుద్దచిత్తులమైన¯ మము హరి పదపద్మ మధుర రసమున్ ¯ ద్రావించితివి నీవు ధన్యులమైతిమి¯ స్వర్గమేనియు నపవర్గమేని (445.1) భాగవత సంగ లవ భాగ్యఫలము కీడె? ¯ ప్రకృతిగుణహీనుఁడగు చక్రి భద్రగుణము¯ లీశ కమలాసనాదులు నెఱుగఁ లేరు¯ వినియు వినఁజాల ననియెడి వెఱ్ఱి గలఁడె? (446) శ్రీపంబులు, ఖండిత సం¯ తాపంబులు, గల్మషాంధతమస మహోద్య¯ ద్దీపంబులు, పాషండ దు¯ రాపంబులు, విష్ణు వందనాలాపంబుల్. (447) పావనములు, దురితలతా¯ లావనములు, నిత్యమంగళప్రాభవ సం¯ జీవనములు, లక్ష్మీ సం¯ భావనములు, వాసుదేవు పదసేవనముల్. (448) పరమ భాగవతుఁడు పాండవపౌత్రుండు¯ శుకుని భాషణముల శుద్ధబుద్ధి¯ యై విరాజమానుఁడై ముక్తి యగు విష్ణు¯ పాదమూల మెట్లు వడసె ననఘ! (449) మహాత్మా! విచిత్రయోగనిష్ఠాకలితంబును, విష్ణుచరితలలితంబునుఁ, బరమ పుణ్యంబును, సకలకల్యాణగుణగణ్యంబును, భాగవతజనాపేక్షితంబునునైన పారీక్షితభాగవతాఖ్యానంబు వినిపింపు"మనినసూతుం డిట్లనియె. (450) "మిముబోఁటి పెద్దవారలు¯ కమలాక్షుని చరిత మడుగఁగాఁ జెప్పెడి భా¯ గ్యము గలిగె నేఁడు నా జ¯ న్మము సఫలం బయ్యె వృద్ధమాన్యుఁడ నగుటన్ (451) కులహీనుఁడు నారాయణ¯ విలసత్కథనములు గడఁక వినిపించినఁ ద¯ త్కులహీనతఁ బాసి మహో¯ జ్జ్వల కులజత్వమును బొందు సన్మునులారా! (452) ఎవ్వని గుణజాల మెన్న జిహ్వలు లేక¯ నలినగర్భాదు లనంతుఁ డండ్రు?¯ కోరెడు విబుధేంద్రకోటి నొల్లక లక్ష్మి¯ ప్రార్థించె నెవ్వని పాద రజము? ¯ బ్రహ్మ యెవ్వని పాదపద్మంబుగడిగిన¯ జలము ధన్యత నిచ్చె జనుల కెల్ల?¯ భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు¯ నెవ్వఁ డర్థాకృతి నేపు మిగులు? (452.1) నే మహాత్ము నాశ్రయించి శరీరాది ¯ సంగకోటి నెల్ల సంహరించి ¯ ప్రాభవమున మునులు పారమ హంస్యంబు¯ నొంది తిరిగి రాక యుందు రెలమి. (453) క్రమమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా¯ రము గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స¯ ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁడౌ? మునులార! నాదు చి¯ త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్.