పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ప్రథమ 262-358

కృష్ణుడు భామల జూడబోవుట

(262) తదనంతరంబ యష్టోత్తర శత షోడశసహస్ర సౌవర్ణసౌధకాంతం బయిన శుద్ధాంతభవనంబు సొచ్చి హరి తన మనంబున. (263) ఒక భామాభవనంబు మున్నుసొర వేఱొక్కర్తు లోఁగుందునో¯ సుకరాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో¯ వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్¯ ప్రకటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూపవ్యక్తుఁడై భార్గవా! (264) ఆ సమయంబున. (265) శిశువులఁ జంకలనిడి తను¯ కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్¯ రశనలు జాఱఁగ సిగ్గున¯ శశిముఖు లెదురేఁగి రపుడు జలజాక్షునకున్. (266) "పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా¯ గతుఁడయ్యెన్ మును సేరెఁ బో తొలుత మత్కాంతుండు నా శాలకే¯ నితరాలభ్య సుఖంబు గంటి" నని తారింటింట నర్చించి ర¯ య్యతివల్ నూఱుఁబదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్. (267) వారలం జూచి హరి యిట్లనియె. (268) "కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్¯ గడవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా? ¯ తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా? ¯ కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే? (269) తిలక మేటికి లేదు తిలకనీతిలకమ!¯ పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి! ¯ కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి!¯ తొడవులు దొడవవా తొడవుతొడవ! ¯ కలహంసఁ బెంపుదే కలహంసగామిని!¯ కీరముఁ జదివింతె కీరవాణి! ¯ లతలఁ బోషింతువా లతికాలలిత దేహ!¯ సరసి నోలాడుదే సరసిజాక్షి! (269.1) మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన! ¯ గురుల నాదరింతె గురువివేక! ¯ బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి! ¯ యనుచు సతులనడిగెనచ్యుతుండు." (270) అని యడిగిన వారలు హరిం బాసిన దినంబు లందు శరీరసంస్కార కేళీవిహార హాస వనమందిరగమన మహోత్సవదర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున. (271) సిరి చాంచల్యముతోడిదయ్యుఁ దనకున్ జీవేశ్వరుం డంచు నే¯ పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులం¯ గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్ గల్యాణబాష్పంబు లా¯ భరణశ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తానురాగంబులన్. (272) పంచబాణుని నీఱు సేసిన భర్గునిం దన విల్లు వ¯ ర్జించి మూర్ఛిలఁ జేయఁ జాలు విశేష హాస విలోక నో¯ దంచి దాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవున్¯ సంచలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా! (273) ఇవ్విధంబున సంగవిరహితుం డైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన విలోకులయిన లోకులు లోక సామాన్య మనుష్యుం డని తలంతు; రాత్మాశ్రయయైన బుద్ధి యాత్మ యందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందక యుండుఁ; బరస్పర సంఘర్షణంబులచే వేణువులవలన వహ్నిఁ బుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజులగు రాజుల కన్యోన్యవైరంబులు గల్పించి నిరాయుధుండై సంహారంబు సేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ బ్రాకృతమనుష్యుండునుం బోలె సంచరించుచుండె నా సమయంబున. (274) యతు లీశ్వరుని మహత్త్వము¯ మిత మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి¯ స్థితి నెఱుఁగక కాముకుఁ డని¯ రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! (275) "ఎల్లప్పుడు మా యిండ్లను¯ వల్లభుఁడు వసించు; నేమ వల్లభలము శ్రీ¯ వల్లభున" కనుచు గోపీ¯ వల్లభుచే సతులు మమతవలఁ బడి రనఘా!" (276) అని చెప్పిన విని శౌనకుండు సూతున కిట్లనియె. (277) "గురునందనుండు సక్రోధుఁడై యేసిన¯ బ్రహ్మశిరోనామబాణవహ్నిఁ¯ గంపించు నుత్తరగర్భంబు గ్రమ్మఱఁ¯ బద్మలోచనుచేతఁ బ్రతికె నండ్రు; ¯ గర్భస్తుఁ డగు బాలుఁ గంసారి యే రీతి¯ బ్రతికించె? మృత్యువు భయము వాపి¯ జనియించి యతఁడెన్ని సంవత్సరములుండె?¯ నెబ్భంగి వర్తించె? నేమిసేసె? (277.1) వినుము, శుకుఁడు వచ్చి విజ్ఞానపద్ధతి¯ నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ¯ దన శరీర మే విధంబున వర్జించె ¯ విప్రముఖ్య! నాకు విస్తరింపు." (278) అనిన సూతుం డిట్లనియె; "ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రి తాఖిల జంబూద్వీప రాజ్యంబు నార్జించియు; మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు; నంగనా, తురంగ, మాతంగ, సుభట, కాంచ నాది దివ్యసంపదలు సంపాదించియు; వీరసోదర, విప్ర, విద్వజ్జన వినోదంబులఁ బ్రమోదించియు, వైభవంబు లలవరించియుఁ; గ్రతువు లాచరించియు; దుష్టశిక్షణ శిష్టరక్షణంబు లొనరించియు; ముకుందచరణారవింద సేవారతుండై సమస్త సంగంబు లందు నభిలాషంబు వర్జించి యరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు. (279) చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు¯ దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు¯ సంపదలు పెక్కుఁ గలిగియుఁ జక్రిపాద¯ సేవనంబులఁ బరిపూర్తి సెందకుండె. (280) అంతం గొన్ని దినంబులకు నభిమన్యుకాంతాగర్భంబు నందున్నడింభకుండు దశమమాసపరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు.

గర్భస్థకుని విష్ణువు రక్షించుట

(281) "కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది¯ క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే¯ డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే¯ యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! (282) చిచ్చఱకోలవశంబునఁ¯ జచ్చి బహిర్గతుఁడఁ గాని సమయమునను దా¯ నుచ్చలిత గర్భవేదనఁ¯ జచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్. (283) చెచ్చెర బాణజ్వాలలు¯ వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచుఁ దా¯ ముచ్చటలు సెప్పు సతులకు¯ నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో. (284) రాఁడా చూడ సమస్తభూతములలో రాజిల్లు వాఁ డిచ్చటన్¯ లేఁడా? పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా¯ కీఁడా? నేఁ డభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత ముం¯ గాఁడా? యెందఱిఁ గావఁ డీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో?" (285) అని గతాగతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున. (286) మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని¯ పై నున్న పచ్చని పటమువాఁడు; ¯ గండభాగంబులఁ గాంచన మణి మయ¯ మకరకుండలకాంతి మలయువాఁడు; ¯ శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి¯ కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు; ¯ బాలార్కమండల ప్రతిమాన రత్న హా¯ టక విరాజిత కిరీటంబువాఁడు; (286.1) కంకణాంగద వనమాలికా విరాజ¯ మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ¯ డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ¯ విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు. (287) ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁజెఱచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన. (288) "గదఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ¯ ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ¯ సదయుం డెవ్వఁడొకో?" యటంచు మదిలోఁ జర్చించుచున్ శాబకుం¯ డెదురై చూడ నదృశ్యుఁ డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!

పరీక్షి జ్జన్మంబు

(289) అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకంబును నైన శుభలగ్నంబునం బాండవ వంశోద్ధారకుం డయిన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి జాతకర్మంబులు సేయించి కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచిసంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్తులై ధర్మపుత్రున కిట్లనిరి. (290) "ప్రకటిత దైవయోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా¯ వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా¯ బకుఁ బ్రతికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం¯ తకుఁ డగు; విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై" (291) అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. (292) "ఓ పుణ్యాత్మకులార! నాపలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్¯ మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై, ¯ యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా యెల్లప్పుడున్? మాధవ¯ శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే." (293) అనిన విని ”నరేంద్రా! భవదీయపౌత్రుండు మనుపుత్రుం డయిన యిక్ష్వాకుని చందంబునఁ బ్రజల రక్షించు; శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండు నగు; డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుఁ గాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణఖనియు నగు; దుష్యంతసూనుం డైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి విస్తరించు; ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుం డగుఁ; గీలి పోలిక దుర్ధర్షుం డగు; సముద్రుని తెఱంగున దుస్తరుం డగు; మృగేంద్రంబు కైవడి విక్రమశాలి యగు; వసుమతివోలె నక్షయక్షాంతియుక్తుం డగు; భానుని లాగునఁ బ్రతాపవంతుం డగు; వాసుదేవు వడువున సర్వభూతహితుం డగుఁ; దల్లిదండ్రులమాడ్కి సహిష్ణుం డగు; మఱియును. (294) సమదర్శనంబున జలజాతభవుఁడనఁ¯ బరమప్రసన్నత భర్గుఁ డనగ¯ నెల్లగుణంబుల నిందిరావిభుఁడన¯ నధికధర్మమున యయాతి యనఁగ¯ ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁడన¯ నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ¯ రాజితోదారత రంతిదేవుండన¯ నాశ్రితమహిమ హేమాద్రి యనఁగ (294.1) యశము నార్జించుఁ, బెద్దల నాదరించు, ¯ నశ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల¯ ఘనులఁ బుట్టించు, దండించు ఖలులఁ బట్టి, ¯ మానధనుడు నీ మనుమఁడు మానవేంద్ర! (295) హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్, ¯ భరించున్ ధరన్ రామభద్రుండుఁ బోలెన్, ¯ జరించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్, ¯ వరించున్ విశేషించి వైకుంఠుభక్తిన్. (296) ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితం బయిన తక్షకసర్ప విషానలంబునం దనకు మరణం బని యెఱింగి, సంగవర్జితుం డయి, ముకుంద పదారవింద భజనంబు సేయుచు, శుకయోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుం డై, గంగాతటంబున శరీరంబు విడిచి, నిర్గత భయశోకం బయిన లోకంబుఁ బ్రవేశించు"నని, జాతకఫలంబు సెప్పి లబ్ధకాము లయి భూసురులు సని రంత. (297) తన తల్లి కడుపులోపల¯ మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం¯ డనుచుఁ బరీక్షింపఁగ జను¯ లనఘుఁ బరీక్షన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా! (298) కళలచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణు¯ డయిన భంగిఁ దాత లనుదినంబుఁ¯ బోషణంబు సేయఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ¯ పటలపాలకుండు బాలకుండు (299) మఱియు ధర్మనందనుండు బంధు సంహారదోషంబు వాయుకొఱకు నశ్వమేధయాగంబు సేయం దలఁచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్జితం బయిన విత్తంబు సాలక చిత్తంబునఁ జింతించు నెడ; నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరుత్తుండను రాజు మఖంబు సేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తం బుత్తరదిగ్భాగంబువలన బలవంతులై తెచ్చిన; నా రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకలబంధు సమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు సేసి, పురుషోత్తము నుద్దేశించి మూడు జన్నంబులు గావించెఁ; దదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొఱకుఁ గరి నగరంబునఁ గొన్ని నెల లుండి ధర్మపుత్రాదులచే నామంత్రణంబు పడసి యాదవ సమేతుం డయి ధనుంజయుడు దోడరా నిజనగరంబునకుం జనియె; నంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయు ముందటఁ గర్మయోగవ్రతాది విషయంబు లయిన ప్రశ్నంబులఁ కొన్నింటిం జేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలిసి, కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన.

విదురాగమనంబు

(300) బంధుఁడు వచ్చె నటంచును¯ గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం¯ బంధములు నెఱపి ప్రీతిం¯ బంధురగతిఁ జేసి రపుడు మన్నన లనఘా! (301) అంత ధర్మనందనుండు విదురునికి మజ్జనభోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవార లందఱు విన నిట్లనియె. (302) "ఏ వర్తనంబున నింత కాలము మీరు¯ సంచరించితి రయ్య జగతిలోన?¯ నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి?¯ భావింప మీవంటి భాగవతులు¯ తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా¯ మీయందు విష్ణుండు మెఱయు కతన, ¯ మీరు తీర్థంబులు, మీకంటె మిక్కిలి¯ తీర్థంబు లున్నవే తెలిసి చూడ? (302.1) వేఱు తీర్థంబు లవనిపై వెదక నేల?¯ మిమ్ముఁ బొడగని భాషించు మేల చాలు, ¯ వార్త లేమండ్రు లోకులు వసుధలోన?¯ మీకు సర్వంబు నెఱిఁగెడి మేధ గలదు. (303) తండ్రి సచ్చినమీఁద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె¯ క్కండ్రు సర్పవిషాగ్నిబాధల గాసిఁ బెట్టఁగ మమ్ము ని¯ ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా¯ తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? (304) పక్షులు తమఱెక్కలలోఁ¯ బక్షంబులు రాని పిల్లపదువుల మమతన్¯ రక్షించిన క్రియ మీరలు¯ పక్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే! (305) మన్నారా? ద్వారకలో¯ నున్నారా? యదువు లంబుజోదరు కరుణం¯ గన్నారా? లోకులచే¯ విన్నారా? మీరు వారి విధ మెట్టిదియో?" (306) అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్తలోక వ¯ ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి యదుక్షయంబు సె¯ ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్¯ విను మని చెప్పఁ డయ్యె; యదువీరుల నాశము భార్గవోత్తమా! (307) మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు, ¯ చేటు చెప్పెనేని చెట్టయండ్రు, ¯ నంతమీఁద శూద్రుఁ డైన కతంబున¯ శిష్టమరణ మతడు సెప్పఁడయ్యె. (308) అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్ర యోని యందు విదురుండై జన్మించి యున్న నూఱు వత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె; నిట యుధిష్ఠిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాలసంకాశు లయిన తమ్ములుం దానును గులదీపకుం డైన మనుమని ముద్దు సేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె నంత. (309) బాలాజన శాలా ధన¯ లీలావన ముఖ్య విభవ లీన మనీషా¯ లాలసు లగు మానవులనుఁ ¯ గాలము వంచించు దురవగాహము సుమతీ! (310) అది నిమిత్తంబుగాఁ గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె. (311) "కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం¯ గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై¯ యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ¯ చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా! (312) పుట్టంధుండవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ¯ పట్టెల్లం జెడిపోయె, దుస్సహ జరాభారంబు పైఁగప్పె, నీ¯ చుట్టా లెల్లనుఁ బోయి; రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై¯ కట్టా! దాయలపంచ నుండఁదగవే? కౌరవ్యవంశాగ్రణీ! (313) పెట్టితిరి చిచ్చు గృహమునఁ¯ బట్టితిరి దదీయభార్యఁ, బాడడవులకుం¯ గొట్టితిరి, వారు మనుపఁగ¯ నెట్టన భరియింపవలెనె? యీ ప్రాణములన్. (314) "బిడ్డలకు బుద్ధి సెప్పని ¯ గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ¯ బడ్డాఁ" డని భీముం డొఱ¯ గొడ్డెము లాడంగఁ గూడు గుడిచెద వధిపా! (315) కనియెదవో బిడ్డల నిఁక, ¯ మనియెదవో, తొంటికంటె మనుమల మాటల్¯ వినియెదవో, యిచ్చెద ర¯ మ్మనియెదవో దానములకునవనీసురులన్. (316) దేహము నిత్యము గా దని¯ మోహముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుఁడై¯ గేహము వెలువడు నరుఁడు¯ త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా!"

ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

(317) అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన, నతండు ప్రజ్ఞాచక్షుండై, సంసారంబు దిగనాడి, మోహపాశంబు వలన నూడి విజ్ఞానమార్గంబునం గూడి దుర్గమం బగు హిమవన్నగంబునకు నిర్గమించిన. (318) అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ¯ బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త¯ ద్గాంధారక్షితినాథుకూఁతురును యోగప్రీతి చిత్తంబులో¯ సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై. (319) వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం¯ బునకు భయంబు లేక వడిఁ బోయెడి ధీరుని భంగి, నప్పు డా¯ వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంతభూమికిం¯ బెనిమిటితోడ నించుకయు భీతి వహింపక యేగెఁ బ్రీతితోన్. (320) ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు సేసి, నిత్యహోమంబు గావించి, బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు సేసి నమస్కరించి, గురువందనము గొఱకుఁ పూర్వ బ్రకారంబునం దండ్రి మందిరమునకుఁ జని యందు విదురసహితు లయిన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునఁ గూర్చున్నసంజయున కిట్లనియె. (321) "మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు¯ సంజయ! వా రెందుఁ జనిరి నేఁడు¯ ముందఱ గానఁడు ముదుసలి మా తండ్రి¯ పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి¯ సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి¯ మందబుద్ధులమైన మమ్ము విడిచి¯ యెటఁ బోయిరో మువ్వు రెఱిఁగింపు గంగలోఁ¯ దన యపరాధంబుఁ దడవి కొనుచు (321.1) భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ, ¯ గపట మింత లేదు కరుణ గలదు, ¯ పాండుభూవిభుండు పరలోకగతుఁడైన¯ మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు." (322) అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుం డగుచు దన ప్రభువు వోయిన తెఱం గెఱుంగక, కొంత దడ వూరకుండి తద్వియోగ దుఃఖంబునఁ గన్నీరు దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి, తన భర్తృ పాదంబుల మనంబుల నెన్నుచు ధర్మజున కిట్లనియె. (323) "అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు¯ నడుగఁ డీ రేయి మీ తండ్రి యవనినాథ! ¯ మందిరములోన విదురుతో మంతనంబు¯ నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు. (324) విదురగాంధారీధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో వారల నిశ్చయంబు లెట్టివో యెఱుంగ"నని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురు సహితుండై నారదుండు వచ్చిన; లేచి నమస్కరించి తమ్ములుం దానును నారదుం బూజించి కౌంతేయాగ్రజుం డిట్లనియె. (325) "అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ ¯ డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ¯ బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్¯ నిక్కము కర్ణధారుఁడవు నీవు జగజ్జనపారదర్శనా!" (326) అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె ”నీశ్వరవశంబు విశ్వంబు ఈశ్వరుండ భూతముల నొకటితో నొకటిఁ జేర్చు నెడఁబాపు, సూచీ భిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టబడిఁన బలీవర్ధంబులంబోలెఁ గర్తవ్యాకర్తవ్యవిధాయక వేదలక్షణ యగు వాక్తంత్రి యందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాలసహితంబు లై, లోకం బీశ్వరాదేశంబు వహించు క్రీడాసాధనంబు లగు నక్షకందుకాదుల కెట్లు సంయోగ వియోగంబు లట్లు క్రీడించు నీశ్వరుని క్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబు లగుచుండు, సమస్త జనంబును జీవరూపంబున ధ్రువంబును, దేహరూపంబున నధ్రువంబునై యుండు;మఱియు నొక్క పక్షంబున ధ్రువంబు నధ్రువంబునుం గాక యుండు, శుద్ధబ్రహ్మస్వరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు, అజగరంబుచేత మ్రింగంబడిన పురుషుం డన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూత మయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు గాదు, కరంబులు గల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదంబు లాహారంబు లగుఁ; జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబు లగు; నధిక జన్మంబుగల వ్యాఘ్రాదులకు నల్పజన్మంబులుగల మృగాదులు భోజ్యంబులగు; సకలదేహి దేహంబు లందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు; అహస్త సహస్తాది రూపంబైన విశ్వ మంతయు నీశ్వరుండు గాఁ దెలియుము;అతనికి వేఱు లేదు; నిజమాయా విశేషంబున మాయావి యై జాతిభేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగిభోగ్యరూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించు, గాన యనాథులు దీనులు నగు నాదు తల్లిదండ్రులు ననుం బాసి యేమయ్యెదరో యెట్లు వర్తింతురో యని వగవం బని లేదు, అజ్ఞాన మూలం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు"మని మఱియు నిట్లనియె. (327) అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ¯ డసురనాశమునకు నవతరించి¯ దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కిన పని¯ కెదురుసూచుచుండు నిప్పు డధిప!

నారదుని గాలసూచనంబు

(328) ఎంత కాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు మీ¯ రంత కాలము నుండుఁ డందఱుఁ నవ్వలం బనిలేదు, వి¯ భ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ¯ చింత యేల నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్. (329) ధృతరాష్ట్రుండు గాంధారీ విదుర సహితుండై హిమవత్పర్వత దక్షిణ భాగంబున నొక్క ముని వనంబునకుం జని, తొల్లి సప్తర్షులకు సంతోషంబు సేయుకొఱకు నాకాశగంగ యేడు ప్రవాహంబులయి, పాఱిన పుణ్యతీర్థంబునం గృతస్నానుం డై యథావిధి హోమం బొనరించి, జలభక్షణంబు గావించి, సకల కర్మంబులు విసర్జించి విఘ్నంబులం జెందక నిరాహారుండయి, యుపశాంతాత్ముండయి పుత్రార్థదారైషణంబులు వర్జించి, విన్య స్తాసనుండై ప్రాణంబుల నియమించి, మనస్సహితంబు లైన చక్షురాదీంద్రియంబుల నాఱింటిని విషయంబులం బ్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపం బగు ధారణాయోగంబుచే రజస్సత్త్వతమో రూపంబు లగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకారాస్పదం బైన స్థూలదేహంబువలనం బాపి బుద్ధి యందు నేకీకరణంబు సేసి, యట్టి విజ్ఞా నాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందించి దృష్టం బైన యీశ్వరునివలన క్షేత్రజ్ఞునిం బాపి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మ మందుఁ గలిపి, లోపలి గుణక్షోభంబును వెలుపలి యింద్రియ విక్షోపంబును లేక నిర్మూలిత మాయా గుణ వాసనుం డగుచు, నిరుద్ధంబు లగు మన శ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలాహారంబులను వర్జించి, కొఱడు చందంబున. (330) ఉటజాంతస్థ్సలవేదికిన్ నియతుఁడై యున్నాఁడు నే డాదిగా¯ నిటపై నేనవనాఁడు మేన్ విడువఁగా నిత్యాగ్ని యోగాగ్ని త¯ త్పటుదేహంబు దహింపఁ జూచి, నియమప్రఖ్యాత గాంధారి యి¯ ట్టటు వో నొల్లక ప్రాణవల్లభునితో నగ్నిం బడున్ భూవరా! (331) అంతట వారల మరణము¯ వింత యగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా¯ సంతాప మొదవఁ బ్రీత¯ స్వాంతుండై తీర్థములకుఁ జనియెడు నధిపా!” (332) అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనుని కెఱిగించి తుంబుర సహితుం డయిన నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు భీమునిం జూచి యిట్లనియె. (333) "ఒక కాలమునఁ బండు నోషధిచయము వే¯ ఱొక కాలమునఁ బండకుండు నండ్రు; ¯ క్రోధంబు లోభంబుఁ గ్రూరత బొంకును¯ దీపింప నరులు వర్తింతు రండ్రు; ¯ వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు¯ సఖ్యంబు వంచనా సహిత మండ్రు; ¯ మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు¯ సుతులు దండ్రులఁ దెగఁ జూతు రండ్రు; (333.1) గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు; ¯ శాస్త్రమార్గము లెవ్వియుఁ జరుగ వండ్రు; ¯ న్యాయపద్ధతి బుధులైన నడవ రండ్రు; ¯ కాలగతి నింతయై వచ్చెఁ గంటె నేఁడు. (334) హరిఁ జూడన్ నరుఁ డేగినాడు నెల లే డయ్యెం గదా రారు కా¯ లరు లెవ్వారును; యాదవుల్ సమద లోలస్వాంతు లీవేళ సు¯ స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా? ¯ యెరవై యున్నది చిత్త మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ! (335) మానసము గలఁగుచున్నది¯ మానవు బహుదుర్నిమిత్త మర్యాదలు; స¯ న్మానవదేహక్రీడలు¯ మాన విచారింప నోపు మాధవుఁ డనుజా! (336) మనవులు సెప్పక ముందఱ¯ మన దార ప్రాణ రాజ్య మానశ్రీలన్¯ మనుపుదు నని మాధవుఁ డిట¯ మనమునఁ దలపోసి మనిచె మనలం గరుణన్. (337) నారదుఁ డాడిన కైవడిఁ, ¯ గ్రూరపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్¯ ఘోరములగు నుత్పాతము¯ లారభటిం జూడఁబడియె ననిలజ! కంటే. (338) ఓడక ముందట నొక సారమేయంబు¯ మొఱగుచు నున్నది మోర యెత్తి; ¯ యాదిత్యుఁ డుదయింప నభిముఖంబై నక్క¯ వాపోయె మంటలు వాతఁ గలుగ; ¯ మిక్కిలుచున్నవి మెఱసి గృధ్రాదులు¯ గర్దభాదులు దీర్చి క్రందుకొనియె; ¯ నుత్తమాశ్వంబుల కుదయించెఁ గన్నీరు¯ మత్తగజంబుల మదము లుడిగె; (338.1) గాలు దూతభంగిఁ గదిసెఁ గపోతము; ¯ మండ దగ్ని హోమ మందిరములఁ; ¯ జుట్టుఁ బొగలు దిశల సొరిది నాచ్ఛాదించెఁ; ¯ దరణి మాసెఁ; జూడు ధరణి గదలె. (339) వాతములు విసరె; రేణు¯ వ్రాతము లాకసముఁ గప్పె; వడి సుడిగొని ని¯ ర్ఘాతములు వడియె; ఘన సం¯ ఘాతంబులు రక్తవర్ష కలితము లయ్యెన్. (340) గ్రహములు పోరాడెడి నా¯ గ్రహముల వినఁ బడియె; భూత కలకలములు దు¯ స్సహములగుచు శిఖికీలా¯ వహముల క్రియఁ దోచె; గగన వసుధాంతరముల్. (341) దూడలు గుడువవు చన్నులు; ¯ దూడలకున్ గోవు లీవు దుగ్ధము; లొడలం¯ బీడలు మానవు; పశువులఁ¯ గూడవు వృషభములు తఱపి కుఱ్ఱల నెక్కున్. (342) కదలెడు వేల్పుల రూపులు, ¯ వదలెడుఁ గన్నీరు, వానివలనం జెమటల్¯ వొదలెడిఁ, బ్రతిమలు వెలిఁ జని¯ మెదలెడి నొక్కక్క గుడిని మేదిని యందున్. (343) కాకంబులు వాపోయెడి; ¯ ఘూకంబులు నగరఁ బగలు గుండ్రలు గొలిపెన్; ¯ లోకంబులు విభ్రష్ట¯ శ్రీకంబుల గతి నశించి శిథలము లయ్యెన్. (344) యవ, పద్మాంకుశ, చాప, చక్ర, ఝష రేఖాలంకృతంబైన మా¯ ధవు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా¯ నవనీకాంతకు లేదు పో? మఱి మదీయాంగంబు వామాక్షి బా¯ హువు లాకంపము నొందుచుండు నిల కే యుగ్రస్థితుల్ వచ్చునో? (345) మఱియు మహోత్పాదంబులు పెక్కులు పుట్టుచున్నయవి; మురాంతకుని వృత్తాంతంబు వినరా"దని, కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున.

యాదవుల కుశలం బడుగుట

(346) ఖేదమున నింద్రసూనుఁడు¯ యాదవపురినుండి వచ్చి యగ్రజుఁ గని త¯ త్పాదముల నయనసలిలో¯ త్పాదకుఁడై పడియె దీనుభంగి నరేంద్రా! (347) పల్లటిలిన యుల్లముతోఁ¯ దల్లడపడుచున్న పిన్నతమ్మునిఁ గని వె¯ ల్వెల్లనగు మొగముతో జను¯ లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్. (348) "మాతామహుండైన మనశూరుఁ డున్నాడె?¯ మంగళమే మనమాతులునకు? ¯ మోదమే నలుగురు ముగురు మేనత్తల?¯ కానందమే వారి యాత్మజులకు? ¯ నక్రూర కృతవర్మ లాయు స్సమేతులే?¯ జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు? ¯ కల్యాణయుక్తులే గద సారణాదులు¯ మాధవుతమ్ములు మానధనులు? (348.1) నందమే మనసత్యకనందనునకు? ¯ భద్రమే శంబరాసురభంజనునకుఁ? ¯ గుశలమే బాణదనుజేంద్రకూఁతుపతికి? ¯ హర్షమే పార్థ! ముసలికి హలికి బలికి? (349) మఱియు నంధక, యదు, భోజ, దశార్హ, వృష్ణి, సాత్వతులు మొదలయిన యదువంశ వీరులును, హరికుమారులైన సాంబ సుషేణప్రముఖులును, నారాయణానుచరులైన యుద్ధవాదులును, గృష్ణసహచరులైన సునంద నందాదులును, సుఖానందులే?"యని, యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె. (350) "వైకుంఠవాసుల వడువున నెవ్వని¯ బలమున నానందభరితు లగుచు¯ వెఱవక యాదవ వీరులు వర్తింతు?¯ రమరులు గొలువుండు నట్టి కొలువు¯ చవికె నాకర్షించి చరణసేవకులైన¯ బంధుమిత్రాదుల పాదయుగము¯ నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీఁద?¯ వజ్రంబు జళిపించి వ్రాలువాని (350.1) ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి¯ యమృతజలములఁ బోషింప నలరు పారి¯ జాత మెవ్వఁడు గొనివచ్చి సత్యభామ¯ కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె? (351) అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా¯ పన్నానీకశరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ¯ మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్యపీఠంబునం¯ దున్నాఁడా బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్? (352) ఆ రామకేశవులకును¯ సారామలభక్తి నీవు సలుపుదువు గదా;¯ గారాములు సేయుదురా¯ పోరాముల బంధు లెల్ల ప్రొద్దు? జితారీ ! (353) మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో, ¯ సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ, బ్రాభవ¯ స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ, ¯ గన్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా కల్యాణమే చక్రికిన్? (354) అదియునుం గాక. (355) ఓడితివో శత్రువులకు, ¯ నాడితివో సాధు దూషణాలాపములం; ¯ గూడితివో పరసతులను, ¯ వీడితివో మానధనము వీరుల నడుమన్; (356) తప్పితివో యిచ్చెదనని; ¯ చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్¯ దెప్పితివో; శరణార్థుల¯ రొప్పితివో ద్విజులఁ, బసుల, రోగుల, సతులన్; (357) అడిచితివో భూసురులనుఁ; ¯ గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా; ¯ విడిచితివో యాశ్రితులను; ¯ ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;" (358) అని పలికినం గన్నీరు కరతలంబునం దుడిచికొనుచు గద్గదస్వరంబున మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగిడించుచు నర్జునుం డన్న కిట్లనియె.