పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ద్వితీయ స్కంధము 1 - 79

పోతన తెలుగు భాగవతం
ద్వితీయ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీమద్భక్త చకోరక¯ సోమ! వివేకాభిరామ! సురవినుత గుణ¯ స్తోమ! నిరలంకృతాసుర¯ రామా సీమంతసీమ! రాఘవరామా! (2) మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; "నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

శుకుని సంభాషణ

(3) "క్షితిపతి! నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ¯ యాత్మవేత్తలు మెత్తు రఖిలశుభద¯ మాకర్ణనీయంబు, లయుతసంఖ్యలు గల¯ వందు. ముఖ్యం బిది యఖిల వరము, ¯ గృహములలోపల గృహమేధులగు నరు¯ లాత్మతత్త్వము లేశమైన నెఱుఁగ, ¯ రంగనారతుల నిద్రాసక్తిఁ జను రాత్రి¯ పోవుఁ గుటుంబార్థబుద్ధి నహము, (3.1) పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది¯ సంఘ మెల్లఁ దమకు సత్య మనుచుఁ¯ గాఁపురములు సేసి కడపటఁ జత్తురు, ¯ కనియుఁ గాన రంత్యకాలసరణి. (4) కావున, సర్వాత్మకుఁడు, మ¯ హావిభవుఁడు, విష్ణుఁ, డీశుఁ డాకర్ణింపన్, ¯ సేవింపను, వర్ణింపను, ¯ భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా! (5) జనుల కెల్ల శుభము సాంఖ్య యోగము; దాని¯ వలన ధర్మనిష్ఠవలన నయిన¯ నంత్యకాలమందు హరిచింత సేయుట¯ పుట్టువులకు ఫలము భూవరేంద్ర! (6) అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి¯ విధినిషేధ నివృత్తి సద్విమలమతులు¯ సేయుచుందురు హరిగుణచింతనములు¯ మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!

భాగవతపురాణ వైభవంబు

(7) ద్వైపాయనుఁడు నాదు తండ్రి, ద్వాపరవేళ¯ బ్రహ్మసమ్మితమైన భాగవతముఁ¯ బఠనంబు జేయించె; బ్రహ్మతత్పరుఁడనై¯ యుత్తమ శ్లోకలీలోత్సవమున¯ నాకృష్ట చిత్తుండనై పఠించితి; నీవు¯ హరి పాద భక్తుఁడ వగుటఁ జేసి¯ యెఱిఁగింతు వినవయ్య; యీ భాగవతమున¯ విష్ణుసేవాబుద్ధి విస్తరిల్లు; (7.1) మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు;¯ భవభయంబు లెల్లఁ బాసిపోవు; ¯ యోగిసంఘమునకు నుత్తమవ్రతములు¯ వాసుదేవనామవర్ణనములు. (8) హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై¯ పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవనేర్చునె? వాఁడు సం¯ సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం¯ స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!

ఖట్వాంగు మోక్ష ప్రకారంబు

(9) కౌరవేశ్వర! తొల్లి ఖట్వాంగుఁడను విభుం¯ డిలనేడు దీవులనేలుచుండి, ¯ శక్రాది దివిజులు సంగ్రామభూముల¯ నుగ్రదానవులకు నోడి వచ్చి¯ తమకుఁ దో డడిగిన, ధరనుండి దివి కేఁగి¯ దానవవిభుల నందఱ వధింప, ¯ 'వర మిత్తు' మనుచు దేవతలు సంభాషింప, ¯ 'జీవితకాలంబు సెప్పుఁ డిదియ (9.1) వరము నాకు నొండు వరమొల్ల' ననవుడు, ¯ నాయు వొక ముహూర్తమంత తడవు¯ గల దటంచుఁ బలుక, గగనయానమున న¯ మ్మానవేశ్వరుండు మహికి వచ్చి. (10) గిరులంబోలెడి కరులను, ¯ హరులం, దన ప్రాణదయితలై మనియెడి సుం¯ దరులను, హితవరులను, బుధ¯ వరులను వర్జించి గాఢవైరాగ్యమునన్. (11) గోవిందనామకీర్తనఁ¯ గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి¯ త్రీవిభుఁడు సూర గొనియెనుఁ¯ గైవల్యముఁ దొల్లి రెండు గడియలలోనన్.

ధారణా యోగ విషయంబు

(12) వినుము; నీకు నేడు దివసంబులకుం గాని జీవితాంతంబు గాదు; తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతం బగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు, నంత్యకాలంబు డగ్గఱినన్ బెగ్గడిలక దేహి దేహ, పుత్ర, కళత్రాది సందోహంబువలని మోహసాలంబు నిష్కామకరవాలంబున నిర్మూలనంబు సేసి, గేహంబు వెడలి పుణ్య తీర్థజలావగాహంబు సేయుచు, నేకాంత శుచిప్రదేశంబున విధివత్ప్రకారంబునం గుశాజిన చేలంబులతోడం గల్పితాసనుండై, మానసంబున నిఖిల జగత్పవిత్రీకరణ సమర్థం బై, యకారాది త్రివర్ణ కలితంబై, బ్రహ్మబీజంబయిన ప్రణవంబు సంస్మరించుచు, వాయువుల జయించి, విషయంబుల వెంటనంటి పాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథి యై మనోనామకంబు లైన పగ్గంబుల బిగ్గఁబట్టి మ్రొగ్గం దిగిచి, దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టు మెట్టెడి మనంబును శేముషీ బలంబున నిరోధించి, భగవదాకారంబు తోడ బంధించి, నిర్విషయంబైన మనంబున భగవత్పాదా ద్యవయవంబులం గ్రమంబున ధ్యానంబు సేయుచు, రజస్తమోగుణంబులచేత నాక్షిప్తంబును విమూఢంబునగు చిత్తంబునం దద్గుణంబులవలన నయ్యెడి మలంబుల ధారణావశంబునం బోనడిచి, నిర్మలచిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను ధారణానియమంబు గలుగ సుఖాత్మకం బగు విషయంబు నవలోకించు యోగికి భక్తిలక్షణంబైన యోగాశ్రయంబున వేగంబ మోక్షంబు సిద్ధించు"ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. (13) "ధారణ యే క్రియ నిలుచును? ¯ ధారణకే రూప? మెద్ది ధారణ యనఁగా? ¯ ధారణ పురుషు మనోమల¯ మేరీతి హరించు? నాకునెఱిఁగింపఁగదే." (14) అనిన విని రాజునకు నవధూత విభుం డిట్లనియె. (15) "పవనములు జయించి పరిహృతసంగుఁడై¯ యింద్రియముల గర్వమెల్ల మాపి¯ హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి¯ నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు.

విరాట్స్వరూపము తెలుపుట

(16) వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీ, సలిల, తేజస్సమీరణ, గగనాహంకార, మహత్తత్వంబు లనియెడి సప్తావరణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మహాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాతలంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదండంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రియంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రియంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబు లనంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతి; వృషణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహంబులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారంబులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్తత్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వతర్యుష్ట్ర గజంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ, విద్యాధర, చారణాప్సర, స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు న మ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరులు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభిధానంబులును; ద్రవ్యంబులు హవిర్భాగంబులునుఁ; గర్మంబులు యజ్ఞప్రయోగంబులును నగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయు"నని వక్కాణించి వెండియు నిట్లనియె. (17) "హరిమయము విశ్వ మంతయు, ¯ హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా¯ హరిమయము గాని ద్రవ్యము¯ పరమాణువు లేదు వంశపావన; వింటే. (18) కలలోన జీవుండు కౌతూహలంబునఁ¯ బెక్కు దేహంబులఁ బేరువడసి, ¯ యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు¯ నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి, ¯ నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ¯ డఖిల జీవుల హృదయముల నుండి¯ బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధ యై వీక్షించు¯ బద్ధుండు గాఁడు ప్రాభవము వలన, (18.1) సత్యుఁ డానంద బహుళ విజ్ఞానమూర్తి¯ యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ¯ గలుగనేరవు కైవల్య గౌరవములు¯ పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! (19) బహు వర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా¯ క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమోఘోల్లస¯ న్మహనీయోజ్వల బుద్ధియై భువననిర్మాణప్రభావంబుతో¯ విహరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై.

తాపసుని జీవయాత్ర

(20) విను; మూఁఢుండు శబ్దమయవేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్చగించుచు, మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాఁడు గలలుగను తెఱంగునం బరిభ్రమించుచు, నిరవద్య సుఖలాభంబుం జెందఁడు; తన్నిమిత్తంబున విద్వాంసుండు నామ మాత్రసారంబు లగు భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు, నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖం బని నిశ్చయింపక, యొండు మార్గంబున సిద్ధి గల దని చూచి పరిభ్రమణంబు సేయుచుండు. (21) కమనీయభూమిభాగములు లేకున్నవే¯ పడియుండుటకు దూదిపఱుపు లేల?¯ సహజంబులగు కరాంజలులు లేకున్నవే¯ భోజనభాజనపుంజ మేల? ¯ వల్కలాజినకుశావళులు లేకున్నవే¯ కట్ట దుకూల సంఘంబు లేల? ¯ కొనకొని వసియింప గుహలు లేకున్నవే¯ ప్రాసాదసౌధాది పటల మేల? (21.1) ఫలరసాదులు గురియవే పాదపములు; ¯ స్వాదుజలముల నుండవే సకల నదులు; ¯ పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు; ¯ ధనమదాంధుల కొలువేల తాపసులకు? (22) రక్షకులు లేనివారల¯ రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్¯ రక్షింపు మనుచు నొక నరు¯ నక్షముఁ బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్? (23) అని యిట్లు స్వతస్సిద్ధుండును, నాత్మయుఁ, బ్రియుండును, నిత్యుండును, సత్యుండును, భగవంతుండును నైన వాసుదేవుని భజించి తదీయ సేవానుభ వానందంబున సంసార హేతువగు నవిద్యవలన బుద్ధిమంతుండు విడువబడుం గావున. (24) హరిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై చిక్కి వా¯ సరముల్ ద్రోసెడువాఁడు; కింకరగదాసంతాడితోరస్కుఁడై¯ ధరణీశోత్తమ! దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వై¯ తరణీవహ్నిశిఖాపరంపరలచే దగ్ధుండు గాకుండునే? (25) మొత్తుదురు గదల, మంటల¯ కెత్తుదు రడ్డంబు, దేహమింతింతలుగా¯ నొత్తుదు, రసిపత్రికలను¯ హత్తుదురు కృతాంతభటులు హరివిరహితులన్. (26) మఱియు, హరి చరణ కమలగంధ రసాస్వాదనం బెఱుంగని వారలు నిజకర్మబంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జాజ్వాల్యమాన వైతరణీ తరంగిణీ దహనదారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖిశిఖావగాహంబుల నొందుచుండుదురు; మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రసన్నులు మాయాపన్నులు గాక విన్నాణంబునం దమతమ హృదయాంతరాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజశుండాదండ సంకాశ దీర్ఘ చతుర్భాహుండును, కందర్పకోటి సమాన సుందరుండును, ధృతమందరుండును, రాకావిరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య సదనుండునుఁ, బ్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతిమానవిరాజిత పద్మరాగరత్నరాజీ విరాజమాన కిరీట కుండలుండును, శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును, రమణీయ కౌస్తుభరత్నఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతరపరిమళమిళిత వనమాలికాబంధురుండును నానావిధ గంభీర హార, కేయూర, కటక, కంకణ, మేఖలాంగుళీయక, విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబమాన విమలస్నిగ్ధ నీలకుంచితకుంతలుండును, తరుణచంద్ర చంద్రికాధవళ మందహాసుండునుఁ, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలావిలాసుండును, మహాయోగిరాజ వికసిత హృదయకమలకర్ణికామధ్య సంస్థాపిత విలసిత చరణకిసలయుండును, సంతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాతసన్నిభుండును, విభుండునునైన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలిపికొని తదీయ గుల్ఫ, చరణ, జాను, జంఘాద్యవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతిక్షణంబును ధ్యానంబు సేయు,చు నెంతకాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చలభక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతా తత్పరులై యుందు"రని మఱియు నిట్లనియె. (27) "ఆసన్నమరణార్థి యైన యతీశుండు¯ కాల దేశములను గాచికొనఁడు, ¯ తనువు విసర్జించు తలఁపు జనించిన, ¯ భద్రాసనస్థుఁడై, ప్రాణపవను¯ మనసుచేత జయించి, మానసవేగంబు¯ బుద్ధిచే భంగించి, బుద్ధిఁ దెచ్చి ¯ క్షేత్రజ్ఞుతోఁ గూర్చి, క్షేత్రజ్ఞునాత్మలో¯ పలఁ జేర్చి, యాత్మను బ్రహ్మ మందుఁ (27.1) గలిపి యొక్కటి గావించి, గారవమున¯ శాంతితోడ నిరూఢుఁడై, సకలకార్య¯ నివహ మెల్లను దిగనాడి, నిత్యసుఖము¯ వలయు నని చూచు నటఁమీఁద వసుమతీశ!

సత్పురుష వృత్తి

(28) వినుము; పరమాత్మ యైన బ్రహ్మంబునకుఁ దక్క కాల దేవ సత్త్వ రజస్తమోగుణాహంకార మహత్తత్త్వ ప్రధానంబులకుఁ బ్రభుత్వంబు లేదు; కావునం బరమాత్మ వ్యతిరిక్తంబు లేదు; దేహాదుల యం దాత్మత్వంబు విసర్జించి యన్య సౌహృదంబు మాని, పూజ్యంబైన హరిపదంబుం బ్రతిక్షణంబును హృదయంబున నాలింగనంబు సేసి, వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమం బని సత్పురుషులు దెలియుదు; రివ్విధంబున విజ్ఞానదృగ్వీర్యజ్వలనంబున నిర్దగ్ధవిషయవాసనుండయి; క్రమంబున నిరపేక్షత్వంబున. (29) అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ¯ బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి, ¯ నాభితలముఁ జేర్చి, నయముతో మెల్లన¯ హృత్సరోజము మీఁది కెగయఁ బట్టి, ¯ యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ¯ దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి, ¯ మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి దృ¯ క్కర్ణ నాసాస్య మార్గములు మూసి, (29.1) యిచ్చలేని యోగి యెలమి ముహర్తార్థ¯ మింద్రి యానుషంగ మింత లేక, ¯ ప్రాణములను వంచి, బ్రహ్మరంధ్రము చించి, ¯ బ్రహ్మ మందుఁ గలయుఁ బౌరవేంద్ర! (30) మఱియు, దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగమంబు విడువని వాఁడు వానితోడన గుణసముదాయ రూపంబగు బ్రహ్మాండంబు నందు ఖేచర, సిద్ధ, విహార, యోగ్యంబును, నణిమాదిక సకలైశ్వర్య సమేతంబును నైన పరమేష్ఠి పదంబుఁ జేరు; విద్యాతపోయోగ సమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పుదురు; రేరికిం గర్మంబుల నట్టి గతిఁబొంద శక్యంబుగాదు; యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశ పథంబునం బోవుచు, సుషుమ్నానాడివెంట నగ్ని యను దేవతం జేరి, జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై యెందునుం దగులువడక, తారామండలంబుమీఁద సూర్యాది ధ్రువాంత పదంబులఁ గ్రమక్రమంబున నతిక్రమించి, హరిసంబంధం బయిన శింశుమారచక్రంబుఁ జేరి, యొంటరి యగుచుఁ బరమాణుభూతం బైన లింగశరీరంబుతోడ బ్రహ్మవిదులకు నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి, మహాకల్పకాలంబు క్రీడించుఁ గల్పాంతంబైన ననంతముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచుఁ, దన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపజాలక. (31) ఇలమీఁద మనువు లీరేడ్వురుఁ జనువేళ¯ దివసమై యెచ్చోటఁ దిరుగుచుండు, ¯ మహనీయ సిద్ధవిమాన సంఘము లెందు¯ దినకరప్రభములై తేజరిల్లు, ¯ శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ¯ నివహంబు లెందు జనింపకుండు ¯ విష్ణుపదధ్యాన విజ్ఞాన రహితుల¯ శోకంబు లెందుండి చూడవచ్చు, (31.1) పరమసిద్ధయోగి భాషణామృత మెందు ¯ శ్రవణ పర్వమగుచు జరుగుచుండు, ¯ నట్టి బ్రహ్మలోకమందు వసించును¯ రాజవర్య! మరల రాఁడు వాఁడు.

సృష్టి క్రమంబు

(32) మఱియునొక్క విశేషంబు గలదు; పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరంబున బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు; బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారు బ్రహ్మజీవిత కాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు; నారాయణచరణకమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి, వైష్ణవ పదారోహణంబు సేయువాఁడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబునఁ బృథివ్యాత్మకత్వంబు నొంది, యట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును, నతిక్రమించి భూతసూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుం డై, యందు మనోమయంబును, దేవమయంబును నైన సాత్వికాహంకార గమనంబున మహత్తత్త్వంబు సొచ్చి, గుణత్రయంబున లయించి, ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబును, నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాసి యానందమయుండై, యానందంబునం బరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందుఁ గలయు"నని చెప్పి వెండియు నిట్లనియె. (33) "పరమ భాగవతులు పాటించు పథ మిది¯ యీ పథమున యోగి యేఁగెనేని¯ మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు¯ కల్పశతము లైనఁ గౌరవేంద్ర! (34) వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుం డైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు. (35) విను, మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు ద¯ ర్శన యజ్ఞత్వముతోడ నెంతయుఁ బరామర్శించి, మోక్షంబు ద¯ క్కిన మార్గంబుల వెంట లే దనుచు భక్తిం జింత సేసెన్ జనా¯ ర్దను నాత్మాకృతి నిర్వికారుఁ డగుచుం దన్మార్గ నిర్ణేతయై. (36) అఖిల భూతములందు నాత్మరూపంబున¯ నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు, ¯ బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును, మ¯ హత్సేవనీయుఁ డహర్నిశంబు¯ వందనీయుఁడు, భక్త వత్సలుం, డత్యంత¯ నియతుఁడై సతతంబు నియతబుద్ధి¯ నాత్మరూపకుఁడగు హరికథామృతమును¯ గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ (36.1) గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ¯ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి, ¯ విష్ణుదేవుని చరణారవింద యుగము¯ కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర! (37) మానుషజన్మము నొందిన¯ మానవులకు, లభ్యమాన మరణులకు, మహా¯ జ్ఞానులకుఁ, జేయవలయు వి¯ ధానము నిగదింపఁ బడియె ధరణీనాథా!

అన్యదేవభజన ఫలంబు

(38) వినుము; బ్రహ్మవర్చసకాముడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవకామునకు నింద్రుండునుఁ, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యాదులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజాసాధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయుఁ, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వనీదేవతలునుఁ, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్టాకామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులునుఁ, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు, ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును, సంతానకామునకుఁ బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూపదేవతలును, శత్రుమరణకామునకుఁ గోణపాలకుం డైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును, భజనీయు లగుదురు; మఱియును.

మోక్షప్రదుండు శ్రీహరి

(39) కామింపకయును సర్వముఁ¯ గామించియునైన ముక్తిఁ గామించి తగన్¯ లో మించి పరమపురుషుని¯ నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా! (40) అమరేంద్రాదులఁ గొల్చుభంగి జనుఁడా యభ్జాక్షు సేవింపఁగా¯ విమలజ్ఞాన విరక్తి ముక్తు లొదవున్, వేయేల భూనాథ! త¯ త్కమలాధీశ కథాసుధారస నదీకల్లోలమాలా పరి¯ భ్రమ మెవ్వారికినైనఁ గర్ణయుగళీపర్వంబు గాకుండునే?" (41) అని యిట్లు రాజునకు శుకుండు సెప్పె"ననిన విని శౌనకుండు సూతున కిట్లనియె. (42) "వర తాత్పర్యముతో నిటు¯ భరతాన్వయవిభుఁడు శుకుని పలుకులు విని స¯ త్వరతాయుతుఁడై శ్రేయ¯ స్కరతామతి నేమి యడిగె? గణుతింపఁ గదే; (43) ఒప్పెడి హరికథ లెయ్యవి¯ సెప్పెడినో యనుచు మాకుఁ జిత్తోత్కంఠల్¯ గుప్పలుగొనుచున్నవి; రుచు¯ లుప్పతిలన్ నీ మనోహరోక్తులు వినగన్." (44) అనిన విని సూతుం డిట్లనియె. (45) "తూలెడి కూఁకటితోడను¯ బాలురతో నాడుచుండి బాల్యమున మహీ¯ పాలుఁడు హరిచరణార్చన¯ హేలాలసుఁ డగుచు నుండె నెంతయు నియతిన్. (46) అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుం డిట్లనియె.

హరిభక్తిరహితుల హేయత

(47) "వాసుదేవశ్లోకవార్త లాలించుచుఁ¯ గాల మే పుణ్యుండు గడుపుచుండు¯ నతని యాయువుఁ దక్క నన్యుల యాయువు¯ నుదయాస్తమయముల నుగ్రకరుఁడు¯ వంచించి గొనిపోవు; వాఁడది యెఱుఁగక¯ జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు¯ నంగనా, పుత్ర, గేహారామ, విత్తాది¯ సంసారహేతుక సంగ సుఖముఁ (47.1) దగిలి వర్తింపఁ గాలంబు తఱి యెఱింగి¯ దండధరకింకరులు వచ్చి తాడనములు¯ సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ¯ బాపరతి నైతి నని బిట్టు పలవరించు. (48) అదిగావున. (49) అలరు జొంపములతో నభ్రంకషంబులై¯ బ్రదుకవే వనములఁ బాదపములు? ¯ ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు¯ జీవింపవే గ్రామసీమలందు? ¯ నియతిమై నుచ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్¯ ప్రాప్తింపవే చర్మభస్త్రికలును? ¯ గ్రామసూకరశునకశ్రేణు లింటింటఁ¯ దిరుగవే దుర్యోగదీనవృత్తి? (49.1) నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ?¯ బుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు¯ లడవులందు, నివాసములందుఁ బ్రాణ¯ విషయభరయుక్తితో నుంట విఫల మధిప! (50) విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు¯ కొండల బిలములు కువలయేశ! ¯ చక్రిపద్యంబులఁ జదువని జిహ్వలు¯ గప్పల జిహ్వలు కౌరవేంద్ర! ¯ శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు¯ కేకిపింఛాక్షులు కీర్తిదయిత! ¯ కమలాక్షు పూజకుఁ గాని హస్తంబులు¯ శవము హస్తంబులు సత్యవచన! (50.1) హరిపద తులసీ దళామోద రతి లేని¯ ముక్కు పందిముక్కు మునిచరిత్ర! ¯ గరుడగమను భజనగతి లేని పదములు¯ పాదపముల పాదపటల మనఘ! (51) నారాయణుని దివ్యనామాక్షరములపైఁ¯ గరఁగని మనములు కఠినశిలలు¯ మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ¯ మిళితమై యుండని మేను మొద్దు¯ చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న¯ కనక కిరీటంబు గట్టెమోపు¯ మాధవార్పితముగా మనని మానవు సిరి¯ వనదుర్గ చంద్రికా వైభవంబు (51.1) కైటభారిభజన గలిగి యుండని వాఁడు¯ గాలిలోన నుండి కదలు శవము, ¯ కమలనాభుపదముఁ గనని వాని బ్రతుకు¯ పసిఁడికాయలోని ప్రాణి బ్రతుకు." (52) అని యిట్లు పలికిన వైయాసి వచనంబుల కౌత్తరేయుండు కందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున. (53) సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి, యి¯ ల్లాలి విడిచి, బహు బలాళి విడిచి¯ రాజు హృదయ మిడియె రాజీవనయనుపై¯ ధనము విడిచి, జడ్డుఁదనము విడిచి.

రాజ ప్రశ్నంబు

(54) ఇట్లు మృత్యుభయంబు నిరసించి, ధర్మార్థకామంబులు సన్యసించి, పురుషోత్తము నందుఁ జిత్తంబు విన్యసించి, హరిలీలా లక్షణంబు లుపన్యసింపు మను తలంపున నరేంద్రుం డిట్లనియె. (55) "సర్వాత్ము వాసుదేవుని¯ సర్వజ్ఞుఁడవైన నీవు సంస్తుతి సేయన్¯ సర్వభ్రాంతులు వదలె మ¯ హోర్వీసురవర్య! మానసోత్సవ మగుచున్. (56) ఈశుండు హరి విష్ణుఁడీ విశ్వమే రీతిఁ¯ బుట్టించుఁ రక్షించుఁ బొలియఁ జూచు?¯ బహు శక్తి యుతుఁడగు భగవంతుఁ డవ్యయుఁ¯ డాది నే శక్తుల నాశ్రయించి ¯ బ్రహ్మ శక్రాది రూపముల వినోదించెఁ?¯ గ్రమముననో యేక కాలముననొ ¯ ప్రకృతి గుణంబులఁబట్టి గ్రహించుట?¯ నేకత్వముననుండు నీశ్వరుండు (56.1) భిన్నమూర్తి యగుచుఁ బెక్కు విధంబుల¯ నేల యుండు? నతని కేమి వచ్చె¯ నుండకున్నఁ? దాపసోత్తమ! తెలుపవే; ¯ వేడ్క నాకు సర్వవేది వీవు."

శుకుడు స్తోత్రంబు సేయుట

(57) అనిన నయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు గాక సదుత్తరప్రదాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు దన చిత్తంబున. (58) "పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం¯ హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై, ¯ పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు¯ స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్. (59) మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండునుఁ, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్ఠుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్ఠుండునుఁ, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద. (60) ఏ విభువందనార్చనములే, విభుచింతయు, నామకీర్తనం, ¯ బే విభులీల, లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో¯ షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు; నే¯ నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. (61) ఏ పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్¯ లోపలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁ బాసి, యే¯ తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే¯ నా పరమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. (62) తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే¯ జపములఁ జేసియైన, ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే¯ యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు; న¯ య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. (63) యవన, వ్యాధ, పుళింద, హూణ, శక, కంకాభీర, చండాల సం¯ భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి, భా¯ గవతశ్రేష్ఠులఁ డాసి, శుద్ధతనులై కళ్యాణులై యుందు; రా¯ యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (64) తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో, ¯ జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల¯ బ్ధపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని; న¯ య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్. (65) శ్రీపతియు, యజ్ఞపతియుఁ, బ్ర¯ జాపతియున్, బుద్ధిపతియు, జగదధిపతియున్, ¯ భూపతియు, యాదవశ్రే¯ ణీపతియున్, గతియునైన నిపుణు భజింతున్. (66) అణువో? గాక కడున్ మహావిభవుఁడో? యచ్ఛిన్నుఁడో? ఛిన్నుఁడో? ¯ గుణియో? నిర్గుణుఁడో? యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా¯ ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ¯ క్షణముం జేసెద; రట్టి విష్ణుఁ, బరమున్, సర్వాత్ము సేవించెదన్. (67) జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే¯ భగవంతుండు సరస్వతిం బనుప, నా పద్మాస్య దా నవ్విభున్¯ మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా¯ రగుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్. (68) పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ¯ మున మేనులను పురములు సృజించి;¯ పురములలోనుండి పురుషభావంబున¯ దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ?¯ బంచభూతములను పదునొకం డింద్రయ¯ ములఁ బ్రకాశింపించి భూరిమహిమ¯ షోడశాత్మకుఁడన శోభిల్లు, జీవత్వ¯ నృత్త వినోదంబు నెఱపుచుండు? (68.1) నట్టి భగవంతుఁ, డవ్యయుం, డచ్యుతుండు¯ మానసోదిత వాక్పుష్ప మాలికలను¯ మంజు నవరస మకరంద మహిమ లుట్ట¯ శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత. (69) మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ¯ ధ్యాన మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి, ముక్తులై¯ లూనత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్, విశంక టా¯ జ్ఞానతమోనభోమణికి, సాధుజనాగ్రణి, కేను మ్రొక్కెదన్." (70) అని యిట్లు హరిగురువందనంబు సేసి, శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. (71) "అవిరోధంబున నీవు నన్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా¯ ధవుచేతన్ విని నారదుం డడిగినం దథ్యంబుగాఁ జెప్పె; మా¯ నవలోకేశ్వర! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె; సం¯ శ్రవణీయంబు, మహాద్భుతంబు వినుమా, సందేహవిచ్ఛేదివై. (72) నారదుండు బ్రహ్మ కిట్లనియె. (73) "చతురాస్యుండవు; వేల్పు బెద్దవు; జగత్సర్గానుసంధాయి; వీ¯ శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం¯ యుతమై, సర్వము నీకరామలకమై యుండుంగదా; భారతీ¯ సతి యిల్లాలఁట నీకు; నో జనక నా సందేహముం బాపవే.

నారదుని పరిప్రశ్నంబు

(74) ప్రారంభాది వివేక మెవ్వఁ డొసగుం? బ్రారంభ సంపత్తి కా¯ ధారం బెయ్యది? యేమి హేతువు? యదర్థం బే స్వరూపంబు? సం¯ సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడుం¯ భారం బెన్నఁడు లేదు; నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా! (75) నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్¯ నీకంటెన్ ఘనుఁ డొక్క రాజు గలఁడో? నీ వంతకున్ రాజవో? ¯ నీకే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె? దీ చేతనా ¯ నీకం బెందు జనించు నుండు నడఁగున్? నిక్కంబు భాషింపుమా. (76) సదసత్సంగతి నామ, రూప, గుణ, దృశ్యంబైన విశ్వంబు నీ¯ హృదధీనంబుగదా; ఘనుల్ సములు నీ కెవ్వారలున్ లేరు; నీ¯ పదమత్యున్నత; మిట్టి నీవు తపముం బ్రావీణ్య యుక్తుండవై¯ మది నే యీశ్వరుఁ గోరి చేసితివి? తన్మార్గంబు సూచింపవే. (77) అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ; దత్పక్షమం¯ దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంయుక్తి చే¯ సంభూతం బగు; వర్తమాన మగు; సంఛన్నం బగుం; దద్విభున్¯ సంభాషింపఁగ వచ్చు?నేఁ దలఁప నే చందంబువాఁ డాకృతిన్? (78) తోయజసంభవ నా కీ¯ తోయము వివరింపు, చాలఁ దోఁచిన నే నా¯ తోయము వారికి నన్యుల¯ తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. (79) దేవా భూతభవిష్యద్వర్తమానంబు లగు వ్యవహారంబులకు నీవ వల్లభుండవు; నీ యెఱుంగని యర్థం బొండెద్దియు లేదు; విశ్వప్రకారంబు వినిపింపు"మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె