పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ - 60 - 160

అజామిళోపాఖ్యానము

(60) నరనాథ! వినుము కన్యాకుబ్జపురమునఁ¯ గలఁడు బ్రాహ్మణుఁ డజామిళుఁ డనంగఁ¯ బాతకుం డతుల నిర్భాగ్యుం డవజ్ఞుండు¯ నష్టసదాచారి కష్టరతుఁడు¯ జూదంబులందు దుర్వాదంబు లందును¯ జౌర్యంబునందు మచ్చరము గలిగి¯ తొత్తాత్మ పత్నిగా మత్తుఁడై వరియించి¯ కొడుకులఁ బదుగురఁ బడసి చాల (60.1) మోహజలధిలోన మునిఁగి ముచ్చట దీఱ¯ బాల లాలనాది లీలఁ దగిలి¯ పెద్దకాల మతఁడు పెంపార సుఖియించి¯ ఫలిత మెల్ల వదిలి పతితుఁడయ్యె. (61) నిర్మలం బనఁ జాలనెఱయు చిత్తం బన¯ నల్లని వెండ్రుకల్ తెల్లనయ్యెఁ; ¯ దగు మోహపాశ బంధంబు జాఱినమాడ్కిఁ¯ బొదలిన యంగముల్ వదలి వ్రేలె; ¯ నింద్రియంబుల కోర్కులిఁక నొల్ల నను భంగి¯ నుడుగక తల చాల వడఁక జొచ్చెఁ; ¯ దమకంబు ప్రాయంబుఁ దగిలిపోయిన మాడ్కి¯ లోచనంబుల చూడ్కి నీచమయ్యె; (61.1) వగరు పుట్టె; నంతఁ బెగలె దంతంబులు; ¯ నుక్కిసయును దగ్గుఁ బిక్కటిల్లె; ¯ శిరసు నొవ్వఁ దొడఁగెఁ; జెదరె మనం; బంతఁ¯ గడిఁది యైన ముప్పు కాలమునను. (62) ఎనయ నతని కెనుబ దెనిమిది వర్షంబు¯ లంత నరుగుటయును భ్రాంతుఁ డగుచుఁ¯ గోరి పిన్నకొడుకు నారాయణాఖ్యుండు¯ బాలుఁ డగుట మిగుల భక్తిఁ జేసి. (63) తన సతియుఁ దాను గూరిమి¯ మనమునఁ బెనఁగొనఁగ నక్కుమారుని ననిశం¯ బును ముద్దు జేయుచుండెను¯ జనవర! వాత్సల్య మాత్మ సందడిఁ గొనఁగన్. (64) బాలుని ముగ్ధ వచో ఋజు¯ ఫాలుని నిజ జనక బంధు పరిణామ కళా¯ శీలుని లోలతఁ గనుఁగొని¯ యాలరి బ్రాహ్మణుఁడు నందితాత్ముం డగుచున్. (65) అత్యంత పాన భోజన¯ కృత్యంబులఁ బొత్తు గలిగి క్రీడలఁ దత్సాం¯ గత్యంబు వదల కాగత¯ మృత్యువుఁ గన నేరఁ డయ్యె మిక్కిలి జడుఁడై. (66) తెలియ కీ రీతి నతఁడు వర్తించుచుండ¯ భయద మగు మృత్యుకాలంబు ప్రాప్తమైన¯ భూరి వాత్సల్యవృత్తి న ప్పుత్రుఁ దలఁచి¯ యాత్మఁ బ్రలపించె నారాయణా యటంచు. (67) అప్పుడు. (68) కింకరుల ధర్మరాజ వ¯ శంకరుల దురంత దురిత సమధిక జన నా¯ శంకరుల సకలలోక భ¯ యంకరులం గనియె నింద్రియాకులుఁ డగుచున్. (69) ఘాతుకుల దండ దండిత¯ పాతకుల మహోగ్ర కర్మ భర నిష్కరుణా¯ జాతకులఁ బ్రేతనాయక¯ దూతక సంతతుల నతఁడు దూరమునందున్. (70) కనియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీఁకన్ రోషనిష్ఠ్యూతులన్¯ ఘనపీనోష్ఠ వికారవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్¯ జన సంత్రాస కరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులన్¯ హననవ్యాప్తి విభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్. (71) ఇట్లతి వికృత తుండ గండాభోగ విభాగ విషమ వివృత్త నేత్రులు, నతి పుష్ట నిష్ఠుర తనుయష్ఠి సంవేష్ఠిత మహోర్ధ్వరోములు, నభ్యస్త సమస్త జీవాపహరణ కరణ ప్రశస్త హస్త విన్యస్త పాశధారులు నగు యమభటుల మువ్వురం గనుంగొని యజామిళుండు వికలేంద్రియుండును, వికంపిత ప్రాణుండును, వికృత లోచనుండును, విహ్వలాత్మకుండునై. (72) దూరమున నాడు బాలుఁడు¯ బోరనఁ దన చిత్తసీమఁ బొడగట్టిన నో! ¯ నారాయణ! నారాయణ! ¯ నారాయణ! యనుచు నాత్మనందను నొడివెన్. (73) మరణపువేళ నద్దనుజమర్దను సంస్మరణంబు జేయఁ ద¯ త్పరిసరవర్తు లాత్మపరిపాలకు నామము నాలకించి ని¯ ష్ఠురగతి నేగుదెంచి పొడచూపి యదల్చిరి కాలుదాసులన్¯ ఖరతరభాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘరోషులన్. (74) దాసీభర్త నజామిళ¯ భూసురుఁ దత్తనువువలన బోరన వెలికిం¯ దీసిన యమభటులఁ దొలఁగఁ ¯ ద్రోసిరి శ్రీవరుని కూర్మిదూతలు కడిమిన్. (75) ఇట్లు విష్ణుదూతల వలన నిర్ధూత ప్రయత్నులై యమదూత లిట్లనిరి. (76) "ఎవ్వనివారలు? మాతోఁ¯ జివ్వకుఁ గత మేమి? యిట్లు చిక్కినవానిం¯ గ్రొవ్వున విడిపించితి; రిఁక¯ నవ్వులకో? జముని శాసనంబులు జగతిన్. (77) అదియునుం గాక. (78) ఎవ్వరు మీ రయ్య? యీ భవ్యరూపముల్¯ గన్నుల కద్భుతక్రమ మొనర్చె; ¯ దివిజులో? భువిజులో? దేవతాప్రవరులో?¯ సిద్ధులో? సాధ్యులో? చెప్పరయ్య; ¯ దళిత పాండుర పద్మదళ దీర్ఘ నేత్రులు, ¯ వర పీత కౌశేయ వాసు లరయ¯ గండమండల నట త్కుండల ద్వయులును, ¯ బటు కిరీటప్రభా భాసితులును, (78.1) భూరి పుష్కర మాలికా చారువక్షు, ¯ లమిత కోమల నవయౌవ నాధికులును, ¯ బాహు కేయూర మణిగణ భ్రాజమాన¯ ఘన చతుర్భుజు, లభ్రసంకాశ రుచులు. (79) ధనువులు, నిషంగచయములుఁ, ¯ గన దంబుజ, శంఖ, చక్ర, ఖడ్గ, గదా, సా¯ ధనములు ధరియించిన మీ¯ తనువులు లోకముల కద్భుతం బొనరించెన్. (80) శాంతంబు లయిన మీ తను¯ కాంతులు జగములను దిశలఁ గలిగిన బహుళ¯ ధ్వాంతములఁ బాఱఁదోలుచు¯ సంతస మొనరించె నిపుడు సర్వంకషమై. (81) ఇ ట్లఖిల లోకానందకర కమ్రాకారులు, నఖిల విభ్రాజమాన తేజో దుర్నిరీక్ష్యమాణులును, నిఖిలధర్మపాలురును నగు మీరు ధర్మ పరిపాలుర మమ్ము నడ్డపెట్టం గతం బేమి?"యనిన మందస్మిత కందళిత ముఖారవిందులయి గోవిం దుని కందువ మందిరంబు కావలివారలు వారివాహ గంభీర నిర్ఘోష పరిపోషణంబు లైన విశేషభాషణంబుల ని ట్లనిరి. (82) "మీరు పరేతనాయకుని మేలిమి దూత లఁటేనిఁ బల్కుఁ డా¯ తోరపుఁ బుణ్యలక్షణము, దుష్కృతభావము, దండకృత్యమున్¯ బీరముతోడ నీతని కభీష్టనివాసముఁ, బోలి దండ్యు లె¯ వ్వారలొ? సర్వభూతములొ? వారొక కొందఱు పాపకర్ములో?" (83) అనిన యమభటు లిట్లనిరి. (84) "వేదప్రణిహితమే యను¯ మోదంబుగ ధర్మ మయ్యె మున్ను; త దన్యం¯ బేది యగునది యధర్మం¯ బాదియు హరిరూపు వేద మని విను కతనన్. (85) ఎవ్వనిచేఁ దన యిరవొందు త్రిగుణ స్వ¯ భావమైనట్టి యీ ప్రాణిచయము¯ లనుగుణ నామక్రియారూపములచేత¯ నేర్పడుగతిఁ దాన యెఱుఁగఁబడును¯ నర్యముం డనలంబు నాకాశమును బ్రభం¯ జనుఁడు గోచయమును శశధరుండు¯ సంధ్యలు దినములు శర్వరీచయములుఁ¯ గాలంబు వసుమతీ జాలములును (85.1) దేహధారికి సాక్షులై తెలుపుచుండు¯ దండనస్థాన విధము సద్ధర్మగతియుఁ¯ దగులు మీరీ క్రమానురోధనముఁ జేసి¯ యఖిల కర్ములు దండార్హు లరయ నెపుడు. (86) కోరి కర్మంబు నడపెడు వారి కెల్ల¯ గలిత శుభములు నశుభము ల్గలుగుచుండు; ¯ నరయఁగా దేహి గుణసంగి యైన యపుడె¯ పూని కర్మంబు జేయక మానరాదు. (87) ప్రకృతమునఁ దా నొనర్చిన¯ సుకృతము దుష్కృతము నెంత చూడఁగ నంతే¯ వికృతిఁ గని యనుభవించు¯ న్నకృతమతిం దత్ఫలంబు నతి నిపుణుండై. (88) మఱియు వినుండు, జన్మంబు శాంత ఘోర మూఢ గుణంబులచేత నైనను, సుఖదుఃఖ గుణంబులచేత నైనను, ధార్మికాది గుణంబులచేత నైనను, సకల భూతంబులుఁ ద్రైవిధ్యంబు నే ప్రకారంబునం బొందు, నా ప్రకారంబున జన్మాంతరంబునం బొందుచుండు; దేవుండైన యముండు సర్వ జీవాంతర్యామియై ధర్మాధర్మయుక్తం బయిన పూర్వ రూపంబుల మనస్సుచే విశేషంబుగఁ జూచుచుండి, వాని కనురూపంబులఁ జింతించుచుండు; నవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుం డై ప్రాచీన కర్మంబులచేత నేర్పడిన వర్తమాన దేహంబు, నే నని తలంచుచుండి, నష్ట జన్మ స్మృతి గలవాడై పూర్వాపరంబు లెఱుంగం జాలకుండు; మఱియుఁ గర్మేంద్రియంబులచేతఁ గర్మంబులం జేయుచుండి, జ్ఞానేంద్రియముల చేతఁ దమోవిషయంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధంబుల నెఱుంగుచుండి, పదియాఱవది యైన మనంబుతోఁ గూడి, పదియేడవవాఁ డగుచుండి, షోడశోపాధ్యంతర్గతుం డై యొక్కరుం డైన జీవుండు, సర్వేంద్రియ విషయ ప్రతిసంధానంబు కొఱకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయంబులఁ బొందుచుండి, షోడశ కళలు గలిగి, లింగ శరీరం బనం బరఁగి గుణత్రయకార్యం బను నిమిత్తంబున హర్ష శోక భయంబుల నిచ్చుచున్న సంసారంబు ధరియించుచుండు; విజితషడ్వర్గు డైన దేహి కర్మంబు లొల్లని బుద్ధి నెఱింగియు, వినియుఁ, గర్మంబులు జేయుచుండి, తన సంచార కర్మంబునం జుట్టుకొన్న పసిడికాయ పురువునుం బోలె నిర్గమోపాయం బెఱుంగక నాశంబు నొందుచుండు, వర్తమాన వసంతాది కాలంబు, భూత భావి వసంతాది కాలయోగ్యం బైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లు జేయు, నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు జేయుచుం; డొక్క నరుండు నొక క్షణంబును గర్మంబు జేయకుండువాఁడు లేఁడు; పూర్వసంస్కారంబులం గల గుణంబులచేతఁ బురుషుం డవశుండు గావున బలిమిఁ గర్మంబులు చేయింపంబడుచుం; డవ్యక్తనిమిత్తంబు నొంది తదనురూపంబు లయిన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితృ సదృశంబు లగుచుండు; నిట్టి విపర్యయంబు పురుషునికిఁ బ్రకృతి సంగమంబునం గలుగుచుండు; నా ప్రకృతి పురాణపురుషుం డయిన యప్పరమేశ్వరుని సేవించినం దలంగుచుండు. (89) కావున నితఁడు సత్కర్మ వర్తనమున¯ భూదేవకులమునఁ బుట్టినాడు; ¯ దాంతుఁడై శాంతుఁడై ధర్మసంశీలుఁడై¯ సకల వేదంబులఁ జదివినాఁడు; ¯ అనయంబు గురువుల నతిథులఁ బెద్దలఁ¯ జేరి శుశ్రూషలఁ జేసినాఁడు; ¯ సర్వభూతములకు సమబుద్ధియై చాల¯ బహు మంత్ర సిద్ధులఁ బడసినాఁడు; (89.1) సత్యభాషణ నియమంబుఁ జరపినాఁడు; ¯ నిత్యనైమిత్తికాదుల నెఱపినాఁడు; ¯ దండి లోభాది గుణములఁ దరపినాఁడు; ¯ మంచిగుణములు దనయందు మరపినాఁడు. (90) సతతాచార సమంచిత¯ మతియై సుజ్ఞానమునకు మరగెడు తఱి నా¯ యతగతి నాతని కంగజ¯ మతమై నవయౌవనాగమం బెడ జొచ్చెన్. (91) కడకంట యౌవనగర్వంబు పొడగట్టె¯ మదిలోన నుద్రేక మదము దొట్టెఁ; ¯ గడుమేనఁ గామ వికారంబు దలచూపె¯ ముఖమునఁ జిరునవ్వు మొలక లెత్తె; ¯ నతి పుష్ఠి నిష్ఠురం బయ్యె; దేహం బెల్లఁ¯ గచ భారమున నెఱికప్పు మెఱసెఁ; ¯ గటిభారమున నూరు కాండముల్ జిగి మీఱె¯ బాహుశాఖలు దీర్ఘ భంగిఁ దోఁచె; (91.1) నురము విపుల మయ్యె; నుల్లస ద్వర కాంతి¯ పూర మంగళమునఁ బొందు పడియె; ¯ భూరితేజుఁ డయిన భూసురాన్వయునకు¯ నభినవైక యౌవనాగమమున. (92) హృదయమునఁ బొడము యౌవన¯ మదము వెలిం దోచు భంగి మానిత రుచిఁ ద¯ ద్వదనమున నూగుమీసలు¯ పొదలుచుఁ గప్పడరి చూడఁ బొంకం బయ్యెన్. (93) మఱియును. (94) తమ్మివిరి మీఁద వ్రాలిన¯ తుమ్మెద పంక్తియును బోలెఁ దోరపు లీలం¯ గ్రమ్ముకొని విప్రతనయుని¯ నెమ్మొగమునఁ గానబడియె నెఱిమీసంబుల్. (95) అంత ననంగబ్రహ్మ తంత్రమునకు వసంతు డొనర్చు నంకురార్ప ణారంభంబునుం బోలె లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహు పాదపాది పురోపవన పవన జనన ప్రభావ పరికంపిత విటవిటీ జన హృదయ ప్రఫుల్ల పల్లవ భల్లంబును, ననూన ప్రసూన నిర్భర గర్భావిర్భూత సురభి పరాగపటల పటఘటిత నభోమంలంబును, నమంద నిష్యంద మరంద బిందు సందోహ కందళిత చిత్త మత్త మధుప సంకుల ఝంకార ముఖరిత సకల దిశావలయంబును, నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభావ సమ్మోదవాద శుక ప్రముఖ పతంగ కోలాహలంబునునై, మధుమాసంబు సర్వ జన మనోహరంబునునై, నిఖిల వనపాదపంబుల నలంకరించె; నయ్యవసరంబున నజామిళుండు పితృనిర్దేశంబునం గుశ సమిత్పుష్ప ఫలార్థంబు వనంబున కరిగి, తిరిగి వచ్చు సమయంబున, నొక్క లతాభవనంబున. (96) బద్ధానురాగయై స్మర¯ యుద్ధంబున కలరు బుద్ధి నురు కామకళా¯ సిద్ధి యగు వృషలితోఁ బ్రియ¯ వృద్ధిం దగఁ గూడియున్న విటు నొరుఁ గాంచెన్. (97) భటునిన్ రతిశాస్త్ర కళా¯ ర్భటునిన్ వర యౌవనానుభవ మదవిభవో¯ ద్భటునిన్ సురతేచ్ఛా సం¯ ఘటునిన్ విగతాంబరోరుకటునిన్ విటునిన్. (98) హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో¯ ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో¯ హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ¯ గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై. (99) కలికి వరు మదన కదనపుఁ¯ బలుకుల కలకలము బెడఁగు పడు మేఖల ము¯ వ్వల రవళిఁ దగిలి గతిగొనఁ¯ గలకంఠి రతంబు సలుపు గమకముఁ గనియెన్. (100) కవకవనై పదనూపుర¯ రవరవ లాగుబ్బుకొన్న రతిపతి గతులం¯ జివచివనై విటు చెవులకు¯ రవళిన్ రతిసల్పు రతుల రవరవ గనియెన్. (101) కురు లళికంబుపై నెగయఁ గ్రొమ్ముడి వీడఁగ గుబ్బదోయిపై¯ సరములు చౌకళింపఁ గటిసంగతి మేఖల తాళగింప స¯ త్కర వర కంకణావళులు గర్జిలఁ గౌ నసియాడ మీఁదుగా¯ మరుని వినోదముల్ సలిపె మానిని యౌవ్వన గర్వరేఖతోన్. (102) మవ్వపు సుకుమారాంగిని¯ జవ్వని నుపగూహనాది సముచిత రతులన్¯ నివ్వటిలుదానిఁ గని మది¯ నువ్విళ్లూరంగ మన్మథోద్దీపనుఁడై. (103) బహుళ దృక్పరిపాక మోహ నిబద్ధుఁ డౌచు మనంబులో¯ సహజ కర్మము వేదశాస్త్రము సాత్త్వికంబుఁ దలంచి త¯ న్నిహిత చిత్తము పట్టి పట్టఁగ నేరఁ డయ్యె సదా మనో¯ గహనమందు మరుండు పావకు కైవడిం జరియింపగాన్. (104) ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబు పై¯ నాలోలాలక పంక్తి పై నళికపై నాకర్ణ దృగ్భూతి పై¯ హేలాపాది కుచద్వ యోరు కటిపై నిచ్చల్ పిసాళింపఁగా¯ జాలిం బొందుచు నాత్మఁ గుందుచు మనోజాతానలోపేతుఁడై. (105) మఱి కులాచార వర్తన మాటు చేసి¯ పరఁగు పిత్రర్థములు దాని పాలు చేసి¯ సాధు లక్షణ గుణవృత్తిఁ జాలు చేసి¯ లోలలోచన పసఁ జెంది లోలుఁ డయ్యె. (106) శ్యామను సుమాస్త్ర ఖేలన¯ కామను సుగుణాభిరామఁ గమనీయగుణ¯ స్తోమ నిజభామ నొల్లక¯ ధామమున నటించెఁ గ్రించుఁ దనమున జడుఁడై. (107) బంధులఁ దిట్టి సజ్జనులఁ బాధలఁ బెట్టి యనాథకోటిఁ బెం¯ బందెలు చుట్టి యీరములు పట్టి పథంబులు గొట్టి దిట్టయై¯ నిందల కోర్చి సాధులకు నిందితుఁడై గడియించు విత్త మా¯ సుందరి కిచ్చి మచ్చికలు సొంపెదఁ గూర్చి వసించెఁ దత్కృపన్. (108) సముచిత శ్రుతిచర్చఁ జర్చింప నొల్లక¯ సతి కుచద్వయచర్చఁ జర్చ జేయు; ¯ దర్క కర్కశ పాఠ తర్కంబు గాదని¯ కలికితోఁ బ్రణయ తర్కంబు జేయు; ¯ స్మృతి పదవాక్య సంగతి గాక తత్సతి¯ పదవాక్య సంగతి పరఁగ జేయు; ¯ నాటకాలంకార నైపుణం బుడిగి త¯ న్నాటకాలంకార పాటిఁ దిరుగుఁ; (108.1) బరఁగఁ జిరకాల మీ రీతిఁ బాపనియతి¯ రమణ దాసీ కుటుంబ భారము వహించి¯ యది కుటుంబి నిగాఁగఁ బాపాత్ముఁ డగుచు¯ నశుచియును దుష్టవర్తనుఁ డై మెలంగె. (109) అటు గాన పాపకర్మునిఁ¯ గుటిలుని సుజనార్తు ధూర్తుఁ గ్రూరుని నే మా¯ రటమునఁ గొని యేగెద మం¯ తట దండమువలన నితఁడు ధన్యత నొందున్. " (110) ఇట్లు పలుకుచున్న యమదూతల వారించి, నయకోవిదు లైన భగవద్దూత లిట్లనిరి. (111) "అవురా! ధర్మవివేక¯ ప్రవరుల పస గానఁబడియెఁ బాపము పుణ్యో¯ ద్భవుల యదండ్యుల దండన¯ వివరం బొనరింపఁ బడియె విధి యెఱుఁగమిచేన్. (112) సములును సాధులున్ విహితశాసనులున్సుదయాళురున్ శుభో¯ త్తమగుణులైన యట్టి తలిదండ్రులు బిడ్డల కెగ్గు జేయుచోఁ¯ గ్రమమున వార లెవ్వరికిఁ గైకొని కుయ్యిడఁజాలువారు సం¯ భ్రమమున మీ మనంబులఁ దిరంబుగఁ జర్చయొనర్చి చూడుఁడా; (113) ఎఱుక గలుగు నాతఁ డేది యొనర్చిన¯ నది యొనర్తు రితరు లైన వార¯ లతఁడు సత్య మిట్టి దనె నేని లోకంబు¯ దత్ప్రవర్తనమునఁ దగిలి యుండు. (114) నెమ్మిఁ దొడలమీఁద నిద్రించు చెలికాని¯ నమ్మఁదగినవాఁడు నయము విడిచి ¯ ద్రోహబుద్ధిఁ జంప దొడరునే? యెందైనఁ ¯ బ్రీతి లేక ధర్మదూతలార! (115) చిత్తమెల్ల నిచ్చి చెలితనంబున వచ్చి¯ నచ్చి కలయ మెచ్చి నమ్మువానిఁ¯ గరుణ గలుగువాఁడు కడుసౌమ్యుఁ డగువాఁడు¯ చింతజేయ కెట్లు చెఱుప నేర్చు? (116) అదియునుం గాక (117) ఈతఁడు కోటిసంఖ్యలకు నెక్కుడు పుట్టువులందుఁ జెంది యా¯ యాతము లైన పాప నివహంబుల నన్నిటిఁ బాఱఁ దోలెఁ బ్ర¯ ఖ్యాతమతిన్ మహా మరణ కాలమునన్ హరిపుణ్యనామ సం¯ భూత సుధామయాద్భుత విభూతిక రాక్షర సంగ్రహంబునన్. (118) బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని¯ కీలలు హరినామ కీర్తనములు; ¯ గురుతల్ప కల్మష క్రూరసర్పములకుఁ¯ గేకులు హరినామ కీర్తనములు; ¯ తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య¯ కిరణముల్ హరినామ కీర్తనములు; ¯ మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ¯ గేసరుల్ హరినామ కీర్తనములు; (118.1) మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల¯ నలరు బ్రహ్మాది సురలకు నందరాని¯ భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య¯ ఖేలనంబులు హరినామ కీర్తనములు; (119) ముక్తికాం తైకాంత మోహన కృత్యముల్¯ కేలిమై హరినామ కీర్తనములు; ¯ సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్¯ కేలిమై హరినామ కీర్తనములు; ¯ మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్¯ కేలిమై హరినామ కీర్తనములు; ¯ బహుకాల జనిత తపఃఫల సారముల్¯ కేలిమై హరినామ కీర్తనములు; (119.1) పుణ్యమూలంబు లనపాయ పోషకంబు¯ లభిమతార్థంబు లజ్ఞాన హరణ కరము¯ లాగమాం తోపలబ్ధంబు లమృతసేవ¯ లార్తశుభములు హరినామ కీర్తనములు; (120) కామంబు పుణ్యమార్గ¯ స్థేమంబు మునీంద్ర సాంద్రచే తస్సరసీ¯ ధామంబు విష్ణు నిర్మల¯ నామంబుఁ దలంచువాఁడు నాథుఁడు గాడే? (121) డెందంబు పుత్రు వలనం¯ జెందిన దని తలఁప వలదు శ్రీపతి పే రే¯ చందమున నైనఁ బలికిన¯ నందకధరుఁ డందుఁ గలఁడు నాథుం డగుచున్. (122) బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ¯ కేళి నైన మిగులఁ గేలి నయినఁ¯ బద్య గద్య గీత భావార్థముల నైనఁ¯ గమలనయనుఁ దలఁపఁ గలుషహరము. (123) కూలినచోటఁ గొట్టుపడి కుందినచోట మహాజ్వరాదులం¯ బ్రేలినచోట సర్పముఖ పీడల నందినచోట నార్తులై¯ తూలినచోట విష్ణు భవదూరునిఁ బేర్కొనిరేని మీఁద న¯ క్కాలుని యాతనావితతిఁ గానరు పూనరు దుఃఖభావముల్. (124) అతిపాపములకుఁ బ్రయత్న పూర్వకముగఁ¯ దనుపాపముల కమితంబు గాఁగ¯ సన్ముని వరులచే సంప్రోక్తమై యుండు¯ నిర్మలం బగు పాప నిష్కృతములు ¯ గ్రమరూపమున నుపశమనంబులగుఁ గాని¯ తత్పాపచయములు దరువ లేవు; ¯ సర్వకర్మంబుల సంహార మొనరించి¯ చిత్తంబునకుఁ దత్త్వసిద్ధి నొసఁగు (124.1) నొనర నీశు సేవ, యోగిమానస సరో¯ వాసు సేవ, హేమవాసు సేవ, ¯ వేదవేద్యు సేవ, వేదాంత విభు సేవ, ¯ పరమపురుష పాదపద్మ సేవ. (125) హరి నెఱుగని యా బాలుఁడు¯ హరిభక్తులతోడఁ గూడి హరి యను వాఁడున్¯ సరియై దోషము లడఁచును¯ గరువలితో నగ్ని దృణముఁ గాల్చిన భంగిన్. (126) ఆరయ వీర్యవంత మగు నౌషధమెట్లు యదృచ్ఛఁ గొన్న ద¯ చ్చారు గుణంబు రోగములఁ జయ్యనఁ బాపెడు మాడ్కిఁ బుణ్య వి¯ స్పారుని నంబుజోదరునిఁ బామరుఁ డజ్ఞుఁ డవజ్ఞఁ బల్కినన్¯ వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే? (127) ధృతి దప్పిన తఱినిఁ బురా¯ కృతమునఁ గాకెట్లు దోఁచుఁ గేశవుఁడు మదిన్¯ మితి లేని జగముఁ దాల్చిన¯ యతఁ డొక్కని మనములోన నడఁగెడు వాఁడే? (128) నిరతంబై నిరవద్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై¯ నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీ¯ హరి నామస్మర ణామృతం బితఁడు ప్రత్యక్షంబు సేవించెఁ దా¯ మరణాంతంబున నిట్టి సజ్జనుని ధర్మంబేల వ్యర్థం బగున్." (129) అని యిట్లు భగవద్దూతలు భాగవతధర్మంబు నిర్ణయించి, యియ్యర్థంబున మీకు సంశయంబు గలదేని మీ రాజు నడుఁగుడు; పొం"డని పలికి బ్రాహ్మణుని నతిఘోరం బైన యామ్యపాశబంధ నిర్ముక్తునిం గావించి, యమభటుల వలని యుదుటు వాపి; రంత నా యమదూత లా భగవద్దూతల సంభాషణ ప్రభావంబునఁ దమ మనంబుల శాంతి నొంది భగవత్తత్త్వ జిజ్ఞాసులై చేయునది లేక నిరాకృతులై, యమలోకంబునకుం జని, పితృపతికి సర్వంబును నెఱింగించి; రంత. (130) అతఁడును బాశచ్యుతుఁడై¯ గతభయుఁడై ప్రకృతినొంది కడునుత్సవ సం¯ గతిఁ జూచి మ్రొక్కి మదిలో¯ నతులిత ముద మొదవి పొదలి హరిదాసులకున్. (131) నిలిచి కేలు మొగిచి పలుక నుద్యోగించి¯ చెలఁగుచున్న లోనితలఁపు దెలిసి¯ చక్రధరుని కూర్మి సహచరు లరిగి ర¯ దృశ్యు లగుచు దేవదేవు కడకు. (132) వేదత్రయ సంపాద్యము¯ మోదంబు గుణాశ్రయంబు మొగి భగవద్ధ¯ ర్మాదేశంబగు తద్భట¯ వాదంబు నజామిళుండు వదలక వినుచున్. (133) శ్రీమన్నారాయణ పద¯ తామరసధ్యానసలిల ధౌత మహాఘ¯ స్తోముండై సద్భక్తికి¯ ధామం బగుచుండెఁ దెలిసి తత్క్షణమాత్రన్. (134) బరవసమున నరికట్టిన¯ దురితంబులఁ దలఁచి దలఁచి తుదిఁ దాపమునన్¯ హరి నీశు నాశ్రయించుచుఁ¯ బరితాపము నొంది పలికె బ్రాహ్మణుఁ డంతన్. (135) "వృషలియం దనురాగ వృద్ధిఁ బిడ్డలఁ గని¯ కులము గోదావరిఁ గూలఁ ద్రోచి¯ రచ్చల కెక్కి పెన్ రజ్జుచేఁతల సరి¯ వారిలోపలఁ దలవంపు చేసి¯ కట్టఁడిముదుక నై కర్మబంధంబుల¯ పుట్టనై నిందల ప్రోవ నగుచుఁ¯ దరుణుల రోఁతలఁ దవిలి భోగించిన¯ కడిఁది నా జన్మంబు గాలిపోయె; (135.1) చదువు చట్టుబడియె; శాస్త్రంబు మన్నయ్యె; ¯ బుద్ధి పురువు మేసెఁ బుణ్య మడఁగె; ¯ నీతి మట్టుబడియె నిర్మలజ్ఞానంబు¯ మొదలి కుడిగె బోధ మూరిఁ బోయె. (136) చిక్కని చక్కని చన్నుల¯ మక్కువ యిల్లాలి విడిచి మాయలుగల యీ¯ వెక్కసపు మద్యపానపు¯ డొక్కపసం దగిలి దుర్విటుఁడనై చెడితిన్. (137) అక్కట! ఘోర దుష్కృత మహానలకీలలు నన్ను ముట్టి పే¯ రుక్కడఁగింప కిట్లు ధృతి నుండఁగ నిచ్చెనహో! దురాత్మునిం¯ గ్రక్కునఁ దల్లిదండ్రుల నకల్మషచిత్తులఁ బెద్దలన్ మఱే¯ దిక్కును లేనివారిఁ బలు త్రిక్కులఁ బెట్టుచుఁ బాఱఁ దోలితిన్. (138) అకృతజ్ఞుఁడ నై విడిచితిఁ ¯ బ్రకృతిం గల బంధువులను బాల్యమున ననున్¯ వికృతిఁ జనకుండఁ బెంచిన¯ సుకృతుల మజ్జనకవరుల శోభనకరులన్. (139) అప్పుడు. (140) పెక్కు పాతకముల భృశదారుణం బైన¯ దొడ్డ నరకమందుఁ బడ్డ నున్న¯ నాపదలకుఁ బాపి యరికట్టి రక్షించి¯ రిట్టి ధర్మపురుషు లెందు వారొ? (141) చోద్యంబై కలవోలె నీ క్షణమునం జూడంగఁ బ్రత్యక్షమై¯ వేద్యం బయ్యెను నన్ను నీడ్చిన మహావీరుల్ భృశోదగ్రు లా¯ యుద్యోగంబులవారు పాశధరు లీ యుత్సాహముల్ మాని సం¯ పాద్యానేక వికారరూప కుటిలప్రఖ్యాతు లెందేగిరో? (142) దారుణ పాశబంధన విధానములన్ నరకార్ణవంబులోఁ¯ గూరిన నన్ను నేఁడు చెడకుండ నొనర్చిన పుణ్యమూర్తు లం¯ భోరుహనేత్రు లుజ్జ్వల నభోమణితేజులు లోచనోత్సవుల్¯ చారుదయా సమంచిత విచారులు నల్వురు నెందు నేఁగిరో? (143) నను రక్షించిన పుణ్యవంతులు కనన్నాళీకపత్రాక్షు లం¯ జనసంకాశులు శంఖచక్రధరు లాజానూరుబాహుల్ స్మితా¯ నను లాలంబిత కర్ణవేష్టన సువర్ణచ్ఛాయ దివ్యాంబరుల్¯ ఘన కారుణ్య రసైకపూర్ణులు సమగ్రస్ఫూర్తి నెం దేఁగిరో? (144) పాతకుండ నగు నాకు నవ్విబుధోత్తమ దర్శనంబు పురాకృతంబగు మదీయ పుణ్య విశేషంబునం గాని పొంద శక్యంబు గాదు; తత్సందర్శనం బాత్మకు నతిసుప్రసన్నంబయి యొప్పె; నట్లు గాకుండెనేనిఁ గలుషవర్తనంబున వృషలీభర్తనై యుండి మృతిఁ బొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణనామ గ్రహణంబు సంభవింప నేరదు; మఱియును. (145) పాతకుండ జడుఁడ బ్రహ్మఘాతుకుఁడను¯ మాన లోభ మోహ మత్సరుండ¯ నాకు నెట్లు దొరకు? నారాయణుని దివ్య¯ నామ విమల కీర్తనంబు మదికి. (146) దారుణ మోహాంధకార పూరితుఁడను¯ హరి విస్మయస్మరణార్హ మతినె? ¯ పంచ మహాతీవ్ర పాతకోపేతుఁడ¯ హరి విస్మయస్మరణార్హ మతినె? ¯ కౌటిల్య కితవ వికార పారీణుండ¯ హరి విస్మయస్మరణార్హ మతినె? ¯ యఖిల దుఃఖైక ఘోరార్ణవ మగ్నుండ¯ హరి విస్మయస్మరణార్హ మతినె? (146.1) నిందలకు నెల్ల నెలవైన నిర్గుణుండ¯ మందభాగ్యుండ నే నేఁడ? మధువిదారి¯ దివ్య గుణనామ కీర్తన తెఱఁ గదేడఁ? ¯ బూర్వ సుకృతంబు లే కెట్లు పొందఁ గలుగు?" (147) అని వితర్కించి. (148) "యత చిత్తేంద్రియమారుతుండ నగుచున్ యత్నం బొనర్తున్ హరి¯ వ్రత సంపత్తికిఁ బుణ్యవృత్తికిఁ జిదావాసోన్ము ఖాసక్తికిన్¯ యుత నిర్వాణ పదానురక్తికి సుఖోద్యోగక్రియాశక్తికిన్¯ ధృతి లబ్ధోత్తమ ముక్తికిన్ సకల ధాత్రీధుర్య సద్భక్తికిన్. (149) విడిచితి భవబంధంబుల¯ నడఁచితి మాయావిమోహ మైన తమంబు¯ న్నొడిచితి నరివర్గంబులఁ¯ గడచితి నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్. (150) యోషిద్రూపంబున నను¯ నేషణ ముఖగహ్వరమున నెగ మ్రింగి కడున్¯ ద్వేషమున గోతి నేసిన¯ దోషద యగు నాత్మ మాయఁ దొలఁగం గంటిన్. " (151) అని యిట్లు వైష్ణవజ్ఞానదీపం బాత్మస్నేహంబునం దోఁచిన నా బ్రాహ్మణుండు. (152) భగవద్ధర్మపరాయ ణోత్తముల సంభాషైక మంత్రంబులన్¯ మిగులన్ జ్ఞానము పుట్ట మోహ భవ సమ్మిశ్రాత్మ బంధంబులన్¯ తెగ ఖండించి సబంధు మిత్ర సుత పత్నీ మోహ విశ్రాంతుఁడై¯ జగతీనాథు రమేశు కృష్ణుని దయైశ్వర్యంబులం గోరుచున్. (153) హరిభక్తులతో మాటలు¯ ధర నెన్నఁడుఁ జెడని పుణ్యధనముల మూటల్¯ వర ముక్తికాంత తేటలు¯ నరిషడ్వర్గంబు చొరని యరుదగు కోటల్. (154) అనుచు నా బ్రాహ్మణుం డతి తత్త్వవేదియై¯ భవబంధముల నెల్లఁ బాఱఁ దోలి¯ మొనసి గంగాద్వారమున కేగి యచ్చటఁ¯ బ్రబ్బిన దేవతాభవనమందు¯ నాసీనుఁడై యోగ మాశ్రయించి చెలంగు¯ దేహేంద్రియాదుల తెరువువలన¯ దనుఁ బాపుకొని పరతత్త్వంబుతోఁ గూర్చి¯ మానుగా నాత్మసమాధిచేత (154.1) గుణగణంబుఁ బాసి కొమ రొప్పిన భగవ¯ దనుభవాత్మయందు నాత్మఁ గలిపి¯ రమణఁ దన్ను మొదల రక్షించినట్టి యా¯ పురుషవరులఁ గాంచి పొసఁగ మ్రొక్కె. (155) అట్లజామిళుండు యోగమార్గంబున దేహంబు విడిచి పుణ్య శరీరుండై యగ్రభాగంబునం బ్రాగుపలబ్ధులైన మహాపురుష కింకరులం గాంచి, సమంచిత రోమాంచిత చలచ్ఛటాపింజరిత స్వేదబిందుసందోహ మిష నిష్యంద మహానందవల్లీకామతల్లికాంకుర సంకుల పరిశోభిత తనుండును, హర్ష నికర్షమాణ మానసోద్యోగ యోగప్రభావోత్సాహ విస్మయ మందస్మిత కందళిత ముఖారవిందుండును, నిఖిల జగజ్జేగీయమానాఖండ శుభప్రద శుభాకార సందర్శన సమాసాదిత కుతూహల మానసుండును నై, ప్రణామంబు లాచరించుచు భాగీరథీ తీరంబునఁ గళేబరంబు విడిచి, తత్క్షణంబ హరిపార్శ్వవర్తు లైన దాసవరుల స్వరూపంబుఁ దాల్చి, యా విష్ణుసేవకులతోడం గూడి దివ్య మణిగణఖచితంబై సువర్ణమయంబైన యసమాన విమానం బెక్కి, నిఖిలానంద భోగభాగ్యానుభ వాకుంఠితం బైన వైకుంఠనగరంబునకు శ్రీమన్నారాయణ పదారవింద సేవాచరణ పరిమాణ స్థితికిం జనియెను; నిట్లు విప్లావిత సర్వధర్ముండైన దాసీపతి, గర్హిత కర్మంబులచేతఁ బతితుండును, హతవ్రతుండును నై నరకంబునం గూలుచుండి భగవన్నామ గ్రహణంబున సద్యోముక్తుం డయ్యెఁ; గావున. (156) కర్మంబు లెల్లఁ బాయను¯ మర్మము దెలుపంగ లేదు మధురిపు పేరే¯ పేర్మిని నొడువుటకంటెను¯ దుర్మదమునఁ జిత్త మెన్ని త్రోవలఁ జన్నన్. (157) పాండవవంశపావన! నృపాలక! యీ యితిహాస మెవ్వఁడే¯ నొండొక భక్తి లేక విను నోర్పుమెయిం బఠియించు నాతఁ డు¯ ద్దండత ముక్తికామినికిఁ దానకమై దనుజారిలోకమం¯ దుండు మహావిభూతి యమదూతల చూడ్కికగోచరాకృతిన్. (158) అరయఁ బుత్రోపచారిత మైన విష్ణు¯ నామ మవసానకాలంబునను భజించి¯ శార్ఙ్గి నిలయంబుఁ జేరె నజామిళుండు¯ నిట్లు సద్భక్తిఁ దలఁచిన నేమిజెప్ప? (159) కోరినవారల కెల్లను¯ జేరువ కైవల్యపదము శ్రీవరుని మదిం¯ గోరనివారల కెల్లను¯ దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్." (160) అనినం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె "మునీంద్రా! యాజ్ఞాభ్రష్టుం డై యమధర్మరాజు శ్రీవిష్ణు నిర్దేశకులచే విహతులైన భటులచేత వర్ణింపం బడిన నారాయణుని నామప్రభావం బాకర్ణించి, వారల కేమనియె? మఱియు, నెన్నఁడేని యమదండంబు విఫలం బై పోయిన తెఱంగు గలదేని వినవలయు; నీ సందేహంబుఁ బాప మహాత్మా! నీవు దక్కఁ దక్కిన వారలు సమర్థులు గారని తలంచుచున్నవాఁడ; చిత్తంబును బ్రసాదాయత్తంబుగా భవదీయ వచన సుధాధారలం బ్రసాదింపవలయు;"ననిన శుకుం డిట్లనియె.

అజామిళోపాఖ్యానం మిగతా భాగం తరువాతి పుటలో