పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 508 - సంపూర్ణం

మరుద్గణంబుల జన్మంబు

(508) "ఏమి కారణమున నింద్రునికిని మరు¯ చ్చయము లాప్తు లగుచు శాంతి నొంది? ¯ రరయఁ దత్సమాను లగుచు వర్తించిరి? ¯ దీని వినఁగవలయుఁ దెలుపవయ్య! "(509) అనిన శుకుం డిట్లనియె.(510) "నరనాథ! విను తన నందను లందఱు¯ నమరేంద్రుచే హతు లగుచు నుండఁ¯ గోపశోకంబులఁ గ్రుళ్ళుచుఁ దనలోన¯ మండుచు దితి చాల మఱుఁగఁ దొడఁగె; ¯ భ్రాత్రు హంతకుఁ డతి పాతకుం డీ యింద్రుఁ¯ జంపక నా కేల సొంపు గలుగు? ¯ వీని భస్మము చేయువానిఁగా నొక సుతుఁ¯ బడసెద నని చాల భర్తఁ గోరి(510.1) ప్రియము చేయఁదొడఁగెఁ బెక్కు భావంబుల¯ భాషణముల నధికపోషణముల¯ భక్తియుక్తిచేతఁ బరిచర్యగతిచేత¯ నుతులచేత నతుల రతులచేత.(511) కలికి కటాక్షవీక్షణ వికారములన్ హృదయానురాగ సం¯ కలిత విశేషవాఙ్మధుర గర్జనలన్ లలితాననేందు మం¯ డల పరిశోభితామృత విడంబిత సుస్మిత సుప్రసన్నతా¯ ఫల రుచిరప్రదానముల భామిని భర్తమనంబు లోఁగొనెన్.(512) అఖిల మెఱిఁగిన కశ్యపు నంతవాని¯ హితవు తలకెక్కు రతుల సంగతులచేత¯ నవశుఁ గావించె వ్రేల్మిడి నబ్జవదన¯ పతుల భ్రమియింప నేరని సతులు గలరె?(513) ఏ తలఁ పెఱుఁగక నిలిచెడు¯ భూతంబులఁ జూచి ధాత పురుషుల మనముల్¯ భీతి గొలుపంగ యువతి¯ వ్రాతంబు సృజించెఁ; బతులు వారల కరుదే?(514) ఇట్లు నిజసతిచేత నుపలాలితుండై కశ్యపప్రజాపతి యా సతికిం బరమప్రీతుం డై యిట్లనియె "నో తన్వీ! నీకుఁ బ్రసన్నుండ నైతి; వరంబు గోరు మిచ్చెద; నాథుండు ప్రసన్నుండైన స్త్రీలకుం గోరిక సంభవించుట కేమి గొఱంత? సతికిం బతియె దైవంబు సర్వభూతంబుల మానసంబులకు వాసుదేవుండె భర్త; నామరూప కల్పితులైన సకల దేవతామూర్తులచేతను ఋషులచేతను భర్తృరూపధరుం డయిన భగవంతుండు సేవింపబడుచుండు; స్త్రీలచేతఁ బతిరూపంబున భజియింపంబడుఁ; గావునం బతివ్రత లైన సుందరులు శ్రేయస్కామలై యేక చిత్తంబున నాత్మేశ్వరుం డయిన యప్పరమేశ్వరుని భర్తృభావంబున సేవించుచుండుదురు; నేనును నీదు భావంబున వరదుండ నైతి; దుశ్శీల లయిన వనితలకుం బొందరాని వరంబు నీ కిచ్చెద; వేఁడు"మనిన నా కశ్యపునకు దితి యిట్లనియె.(515) "వరము గోర నాకు వరదుండ వేనిని¯ నింద్రుఁ ద్రుంచునట్టి యిద్ధబలుని¯ నమిత తేజుఁ దనయు నమరత్వసంప్రాప్తు¯ నెందుఁ జెడనివాని నిమ్ము నాథ!"(516) అనవుడు(517) ఉట్టిపడునట్టి వర మీ¯ కట్టఁడి నన్నెట్టు వేఁడెఁ? గటకట! యనుచున్¯ మిట్టిపడి యతఁడు మదిలోఁ¯ బుట్టిన తల్లడముతోడఁ బొక్కుచు నుండెన్.(518) ప్రకృతిని గర్మపాశముల బద్ధుఁడ నైతిఁ గదయ్య! నేఁడు నే¯ వికటసతీ స్వరూపమున వేఁదుఱు గొల్పిన మాయ నింద్రియా¯ ధికమతి యైనవాఁడు దన తెంపునఁ జిత్తము వెచ్చపెట్టి పా¯ తకములఁ గూలకున్నె? నను దైవము నవ్వదె లోలితాత్మునిన్?(519) ఖండ శర్కరతోడఁ గలహించు పలుకులుఁ¯ బద్మవిలాస మేర్పఱచు మోముఁ, ¯ దుహినాంశు కళలతోఁ దులఁదూఁగు చెయ్వుఱుఁ¯ జెమటఁ గ్రొన్నెత్తురు చేయు మేను, ¯ నిలువెల్లఁ గరఁగించు నేర్పుల యింపులుఁ¯ బువ్వుల కరుదైన ప్రోది చేఁత, ¯ తమకంబు రెట్టించు తరితీపు తలఁపులు¯ నెనసిన మదిలోని యిచ్చగింత,(519.1) గలిగి కఱవనున్న కాలాహిపోలికిఁ¯ జెలఁగుచున్న సతుల చిత్తవృత్తిఁ¯ దెలియవశమె? యెంత ధృతి గలవారికి¯ నాక కాదు నిఖిలలోకములకు.(520) కోరి సతుల కెల్లఁ గూర్చువా రెవ్వరు? ¯ పతులనైన సుతుల హితులనైన¯ బలిమిఁ జెలిమి నైనఁ బరహస్తముననైన¯ హింసబఱతు రాత్మ హితము కొఱకు.(521) అని చింతించి; "దీనికి నేమని ప్రతివాక్యం బిచ్చువాఁడ? మద్వచనం బెందు నమోఘంబు; త్రిలోకపరిపాలనశీలుం డయిన భిదురపాణి వధార్హుండె? యేను దీనికి నైనది యొకటి గల్పించెద"నని దితిం జూచి, "యో! తనుమధ్య! నీకు నట్ల దేవబాంధవుండయిన యింద్రహంత యగు పుత్రుండు గలిగెడు; నొక్క సంవత్సరంబు వ్రతంబునం జరియింపుము; దాని ప్రకారంబెల్ల నేను జెప్పెద, విను; మెల్ల జీవులవలన హింసాభావంబు లేక, యతిధ్వనివాక్యంబు లుడిగి, కోపంబు మాని, యనృతంబులు పలుకక, నఖరోమచ్ఛేదనంబు చేయక, యస్థికపాలాదు లయిన యమంగళంబుల నంటక, నదీతటాకాదులన కాని ఘటోదక కూపోదకంబుల స్నానంబు చేయక, దుర్జన సంభాషణంబు వర్జించి, కట్టిన కోకను ముడిచిన పువ్వులను గ్రమ్మఱ ధరియింపక, భోజనంబుల యందు నుచ్ఛిష్టాన్నంబును జండికా నివేదితాన్నంబును కేశ శునక మార్జార కంక క్రిమి పిపీలికాది విదూషితాన్నంబును నామిషాన్నంబును వృషలాహితాన్నంబును నను నీ పంచవిధ నిషిద్ధాన్నంబులు వర్జించి, దోయిట నీళ్ళు ద్రావక, సంధ్యాకాలంబుల ముక్తకేశిగాక, మితభాషిణియై, యలంకారవిహీనగాక, వెలుపలం దిరుగక, పాదప్రక్షాళనంబు చేసికొని కాని శయనింపక, యార్ద్రపాదయై పవ్వళింపక, పశ్చిమ శిరస్కయయ్యును నగ్నయయ్యును సంధ్యాకాలంబులను నిద్రింపక, నిత్యంబును ధౌతవస్త్రంబులుగట్టి, శుచియై, సర్వమంగళ సంయుక్తయై, ప్రాతఃకాలంబున లక్ష్మీనారాయణల నారాధించి, యావాహనార్ఘ్యపాద్యోపస్పర్శన సుస్నాన వాసోపవీత భూషణ పుష్ప ధూప దీపోపహారాద్యుపచారంబుల నర్చించి, హవిశ్శేషంబు ద్వాదశాహుతుల వేల్చి దండప్రణామంబు లాచరించి, భగవన్మంత్రంబును దశవారంబు లనుసంధించి స్తోత్రంబు చేసి, గంధ పుష్పాక్షతంబుల ముత్తైదువలం బూజించి, పతిని సేవించి, పుత్రుం గుక్షిగతుంగా భావించి యివ్విధంబున మార్గశీర్ష శుద్ధ ప్రతిపదారంభంబుగా నొక్క సంవత్సరంబు సలిపి, యా ద్వాదశ మాసాంత్యదివసంబున విధ్యుక్తంబుగా నుద్యాపనంబు చేయవలయును; నీ వీ పుంసవనం బనియెడి వ్రతంబు ద్వాదశమాస పర్యంతం బేమఱక సల్పిన, నీవు గోరిన కుమారుండు గలిగెడు"ననిన దితి యా వ్రతంబుతోడనె గర్భంబు ధరియించి వ్రతంబు సలుపుచునుండ నింద్రుండు మాత్రభిప్రాయం బెఱింగి, యా యమ్మ నహరహంబును రహస్యంబున సేవించుచు; వ్రతంబునకుం దగిన పుష్ప ఫల సమిత్కుశ పత్రాంకురంబులు మొదలయిన వస్తు వితతిం ద్రికాలంబులం దెచ్చి యిచ్చుచుఁ, బుండరీకంబు హరిణికిం బొంచి యున్న భంగి నా యమ్మ వ్రత భంగంబునకై కాచి శుశ్రూష చేయుచు నా యమ్మ ధరియించిన తేజో విశేషంబునకు బెగ్గలించుచుఁ గృశించుచు నుండె; నంత నొక్కనాడు. (522) వామాక్షి యనుదిన వ్రతధార ణోన్నత¯ పరిచర్య విధులచే బడలి యలసి¯ యొంటి సంధ్యావేళ నుచ్ఛిష్ట యై పద¯ ప్రక్షాళ నాదులఁ బాసి మఱచి¯ తనకర్మ మోహంబు దవిలి నిద్రింపంగ¯ నింద్రుండు సయ్యన నెడరు గాంచి¯ యోగమాయా బలోద్యుక్తుఁడై యా యింతి¯ యుదరంబుఁ జొరఁబడి యుగ్రుఁ డగుచుఁ(522.1) దివిరి దేదీప్యమానమై తేజరిల్లు¯ నర్భకుని వజ్రధారల నడిచె నేడు¯ దునుకలుగ వాఁడు దునిసియుఁ దునుక దునుక¯ చెడక యొక్కక్క బాలుఁడై చెలఁగుచున్న.(523) వా డేర్వు రగుచుఁ గుయ్యిడ¯ నోరి యఱవ కనుచుఁ ద్రుంచె నొక్కక్కని నా¯ శూరుం డేడ్గురఁ దునుకలు¯ గా రయమున వారు చెడక ఖండితు లయ్యున్.(524) ఖండము లన్నియు నందఱుఁ¯ జండాంశు సమప్రకాశ శాశ్వతు లగుచున్¯ మెండుకొని నిల్చి యని రా¯ ఖండలునకుఁ గరుణ పుట్టుగతి మతిఁ దోపఁన్.(525) అందఱు ముకుళిత కరకమలులై "నీకుం దోడుబుట్టువులము; మమ్ము హింసింపంబనిలేదు; నీకుం బారిషదులమై మరుద్గణములమై నిన్ను సేవించెదము; మమ్ము రక్షింపు"మనిన నారాయణ ప్రసాదంబునం జెడని మరుద్గణంబుల పలుకులం గృపాళుండై, యింద్రుండు వారల సహోదరులంగాఁ గైకొని మఱి హింసింపక మానె; అశ్వత్థామశరాగ్నివలన నారాయణ రక్షితుండ వయిన నీవునుం బోలెఁ గులిశధారల శకలంబు లయిన కుమారుం డన్నిరూపంబులై సంవత్సరంబునకు నొక్కింత కడమగా హరి బూజించినవారు గావున, నింద్రుతోడం గూఁడ బంచాశద్దేవత లయిన మరుద్గణంబులు దితి గర్భంబు వెలువడి; రంత దితి మేల్కాంచి యనలప్రకాశులై యింద్రు తోడం గూడి వెలుంగుచున్న కుమారులం జూచి, సంతోషింపక యింద్రుంజూచి నీకు "మృత్యురూపంబయిన పుత్రుం గోరి దుస్తరంబయిన వ్రతంబు సలిపితి; సంకల్పించిన పుత్రుం డొక్కరుం డీ సప్త సంఖ్య గల కుమారు లగుట కేమి కతంబు? నీ వెఱింగిన భంగిన తథ్యంబు పలుకు"మనిన నింద్రుం డిట్లనియె "తల్లీ భవద్వ్రతంబుఁ జింతించి సమయ విచ్చేదనంబున గర్భంబుఁ జొచ్చి పాప చిత్తుండనై వజ్రధారల గర్భంబు విదళనంబు చేసిన నా శకలంబులు చెడక మహాశ్చర్యంబుగా నివ్విధంబునం గుమారు లైరి; మహాపురుష పూజాసంసిద్ధి కార్యానుషంగి కాకుండునే? భగవదారాధనంబు గోరికలఁ బాపి యెవ్వరు గావింతురు; వారిహపరంబుల సర్వార్థకుశలు లగుదు; రమ్మహాపురుష వ్రతసముత్పన్న తేజంబు నడంప నెవ్వం డోపుఁ? గావున దుర్మదంబున బాలిశ స్వభావుండనై దోషంబు చేసిన నా దౌర్జన్య కర్మంబు సహింపఁ దల్లికన్న నెవ్వరు సమర్థులు? పాపాత్ముండ నగు నన్నుం గావుము; నేను వీరలతోడివాఁడ నని నిష్కపటంబుగాఁ బ్రార్థించిన నద్దేవి "యట్టకాక"యని శాంతచిత్త యయ్యె; నింద్రుండును వారలం గూడి త్రిదివంబునకుం బోయి సోమపాన హవిర్భాగంబులు వారలకుం బంచిపెట్టి సుఖంబుండె"నని చెప్పి పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వెండియు నిట్లనియె.(526) "హరి వరదుఁ డయిన వ్రతమట; ¯ హరి యంశజు లగుచు నెగడు నమరుల జన్మ¯ స్ఫురణం బఁట; పఠియించిన¯ నరయఁగ నురుదీర్ఘపాప హరమగు టరుదే."(527) అని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకుఁ జెప్పె" నని విష్ణుకథాశ్రవణ కుతూహలాయమాన మానసులైన శౌనకాది మహామునులకు సూతుండు చెప్పె ననుటయు.

పూర్ణి

(528) రాజీవరాజపూజ్య¯ శ్రీజిత గోపీకటాక్ష సేవాంతర వి¯ భ్రాజితమూర్తి! మదోద్ధత¯ రాజకులోత్సాద రామరాజాఖ్యనిధీ!(529) మురవిదారణ ముఖ్యకారణ! మూలతత్త్వవిచారణా! ¯ దురితతారణ దుఃఖవారణ! దుర్మదాసురమారణా! ¯ గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయమహారణా! ¯ ధరణిధారణ! ధర్మతారణ తాపసస్తుతిపారణా!(530) కరుణాకర! శ్రీకర! కంబుకరా! ¯ శరణాగతసంగతజాడ్యహరా! ¯ పరిరక్షితశిక్షితభక్తమురా! ¯ కరిరాజశుభప్రద! కాంతిధరా!(531) ఇది సకల సుకవి జనమిత్ర శ్రీవత్సగోత్ర పవిత్ర కసువయామాత్య పుత్ర బుధజనప్రసంగానుషంగ సింగయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు నజామిళోపాఖ్యానంబును, బ్రచేతసులఁ జంద్రు డామంత్రణంబు చేయుటయు, దక్షోత్పత్తియు, ప్రజాసర్గంబును, దక్షుండు శ్రీహరింగూర్చి తపంబు చేయుటయు, నతనికి నప్పరమేశ్వరుండు ప్రత్యక్షం బగుటయు, హర్యశ్వ శబళాశ్వుల జన్మంబును, వారలకు నారదుండు బోధించుటయు, నారదు వచన ప్రకారంబునవారు మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబు నారదు వలన విని దక్షుండు దుఃఖాక్రాంతుం డగుటయుఁ, దదనంతరంబ బ్రహ్మవరంబున దక్షుండు శబళాశ్వసంజ్ఞల సహస్ర సంఖ్యాకు లగు పుత్రులం గాంచుటయును, సృష్టినిర్మాణేచ్ఛా నిమిత్తంబున దక్షు పంపున వార లగ్రజన్ములు సిద్ధింబొందిన తీర్థరాజంబైన నారాయణ సరస్సునకుం జనుటయు, వారికి నారదభగవంతుండు బ్రహ్మజ్ఞానంబు నుపదేశించుటయు, వారు పూర్వజు లేగిన ప్రకారంబున మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబును దక్షుండు దివ్యజ్ఞానంబున నెఱింగి నారదోపదిష్టం బని తెలిసి నారదుని శపించుటయు, నారదుండు దక్షుశాపంబు ప్రతిగ్రహించుటయు, దక్షునకు బ్రహ్మవరంబున సృష్టివిస్తారంబు కొఱకుఁ గూతులఱువండ్రు జనియించుటయు, నందు గశ్యపునకు నిచ్చిన పదమువ్వురు వలన సకల లోకంబులు నిండుటయు, దేవాసుర నర తిర్యఙ్మృగ ఖగాదుల జన్మంబులును, దేవేంద్ర తిరస్కారంబున బృహస్పతి యధ్యాత్మమాయచేతం గాన రాకుండుటయుఁ, దద్వృత్తాంతంబు రాక్షసులు విని శుక్రోపదిష్టులై దేవతలపై నెత్తివచ్చుటయు, దేవాసుర యుద్ధంబును, నాచార్యతిరస్కారంబున దివిజరాజపలాయనంబును, బలాయమానులైన దేవతలు బ్రహ్మసన్నిధికిం జనుటయును, బ్రహ్మవాక్యంబునఁ ద్వష్ట కుమారుండయిన విశ్వరూపు నాచార్యునింగా దేవతలు వరించుటయును, విశ్వరూపు ప్రసాదంబున నింద్రుండు నారాయణ వర్మం బను మంత్రకవచంబు ధరియించి రాక్షసుల జయించుటయుఁ, బరోక్షంబున రాక్షసులకు ననుకూలుం డయిన విశ్వరూపు నింద్రుండు వధియించుటయు, విశ్వరూపు వధానంతరంబున నింద్రునకు బ్రహ్మ హత్య సంప్రాప్తం బయిన నింద్రుండు స్త్రీ భూ జల ద్రుమంబుల యందుఁ బంచిపెట్టుటయు, విశ్వరూపుండు హతుండగుటకుఁ ద్వష్ట గోపించి యింద్రవదార్థంబు మారణహోమంబు చేయ వృత్రాసురుండు జనించుటయు, వృత్రాసుర యుద్ధంబునఁ బరాజితులై యింద్ర సహితు లయిన దేవతలు శ్వేతద్వీపంబునకుం జనుటయు, నందు శ్రీహరి ప్రసన్నుండయి దధీచి వలన భిదురంబు గైకొన; నుపదేశించుటయు, నింద్రుండు వజ్రాయుధంబున వృత్రుని సంహరించుటయు, నింద్రుండు బ్రహ్మహత్యా పీడితుండయి మానససరస్సు ప్రవేశించుటయును, నహుషుండు శతాశ్వమేధంబులం జేసి యింద్రాధిపత్యంబు బడయుటయు, నహుషుండు డగస్త్యశాపంబున సురరాజ్యచ్యుతుండై యజగర యోనిం బుట్టుటయు, యింద్రాగమనంబును, యశ్వమేధంబును, యింద్రుండు మరలఁ ద్రిలోకాధిపత్యంబు బడయుటయును, జిత్రకేతూపాఖ్యానంబును, మరుద్గణంబుల జన్మప్రకారంబును నను కథలు గల షష్ఠస్కంధము సమాప్తము.