పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 444 - 507

చిత్రకేతోపాఖ్యానము

(444) అని పరీక్షన్నరేంద్రుండు శుకయోగీంద్రు నడిగె"నని సూతుండు శౌనకాది మునులకుం జెప్పి, మఱియు "నిట్లనియె నట్టు గజపుర వల్ల భుండు సంప్రశ్నంబు చేసిన, బాదరాయణి హరిస్మరణ శ్రద్ధాపరుం డయి "తొల్లి కృష్ణద్వైపాయన నారద దేవల మహర్షులు నా కెఱింగించిన యితిహాసంబు గలదు; దాని నెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు"మని యిట్లనియె. (445) అమిత విభూతిఁ జాల నమరాధిపుఁ బోలుచు శూరసేన దే¯ శములకు భర్తయై ప్రజలు సంతస మందఁగ సార్వభౌముఁడై¯ క్షమ దమ కెల్ల కాలమును గామ దుహంబుగఁ జిత్రకేతు నా¯ మమునఁ బ్రసిద్ధి కెక్కె గుణమండనుఁ డంచిత కీర్తికాముఁడై. (446) మానిత తారుణ్య మదనతురంగులు¯ కందర్ప విజయైక ఖడ్గలతలు¯ మదన సమ్మోహన మంత్రాధి దేవతల్¯ పంచశిలీముఖు బందెకత్తె¯ లసమాస్త్రుఁ డఖిలంబు నడకించు బొమ్మలు¯ నాత్మసంభవుని కట్టాయితములు¯ పుండ్రేక్షుకోదండు భూరితేజంబులు¯ శంబర విద్వేషి సాయకములు (446.1) నాగఁ బొలుపారు నొకకోటి నలినముఖులు¯ దనకుఁ బత్నులు గాఁగ నత్యంత విమల¯ కీర్తి వైభవ సన్మార్గవర్తి యగుచు¯ జగతిఁ బాలించుచుండె నా జనవిభుండు. (447) కలిమి వేవేలు భార్యలు గలిగియుండఁ¯ బరఁగ సంతతి యొక్కండుఁ బడయ లేక¯ చిత్తమునఁ జాల బాయని చింత పొడమి¯ బడలఁ జొచ్చెను వేసవి మడువుఁ బోలె. (448) రూపము సత్ప్రతాపము మరుత్పతిభోగము యౌవనంబు సం¯ దీపిత చారువర్తనము దిగ్విజయంబును సత్యమున్ జగ¯ ద్వ్యాపిత కీర్తియున్ సతులు వైభవముఖ్యములెల్ల మాన్పగా¯ నోపక యుండె నా నృపతి నొందిన సంతతిలేని దుఃఖమున్. (449) ఇట్లు, సంతతి లేక అతి దుఃఖమానసుండయిన యా నరేంద్రుని మందిరంబున కంగిరస మహాముని వచ్చి, యతనిచేత నతిధి సత్కారంబులు బడసి, కుశలం బడిగి "రాజ్యంబు భవద ధీనంబ కదా! పృథి వ్యప్తేజో వాయ్వాకాశ మహదహంకారంబు లనియెడి యేడింటిచేత రక్షింపంబడ్డ జీవుండునుం బోలె నమాత్య జనపద దుర్గ ద్రవిణ సంచయ దండ మిత్రంబు లనెడి సప్తప్రకృతులచేత రక్షితుండ వై, ప్రకృతి పురుషుల యందు భారంబు పెట్టి, రాజ్యసుఖంబు లనుభవింతువు గదా? మఱియు దార ప్రజా మాత్య భృత్య మంత్రి పౌర జానపద భూపాలురు నీకు వశవర్తులుగదా? సర్వంబునుం గలిఁగి సార్వభౌముండ వైన నీ వదనంబున విన్నఁదనంబు గలిగి యున్నయది; కతంబేమి?"యనిన నా మునిప్రవరునకు నతం డిట్లనియె; “మీ తపోబలంబున మీకు నెఱుంగరాని యదియుం గలదే?” యని తలవంచి యూరకున్న, నతని యభిప్రాయం బెఱింగి యా భగవంతుం డైన యంగిరసుండు దయాళుండై, పుత్రకామేష్టి వ్రేల్చి యజ్ఞశేషం బతని యగ్ర మహిషి యయిన కృతద్యుతి కిచ్చి "నీకుం బుత్రుండు గలిగెడి, నతని వలన సుఖదుఃఖంబు లనుభవింపగల"వని చెప్పి యమ్మహాత్ముండు చనియె; నా కృతద్యుతి యనుదేవి గర్భంబు ధరియించి, నవమాసంబులు నిండినం గుమారునిం గనియె; నా కాలంబున రాజును, సమస్త భృత్యామాత్య జనంబులుఁ బరమానందంబుఁ బొంది; రపుడు చిత్రకేతుండు కృతస్నానుండై, సకల భూషణ భూషితుండై, సుతునకు జాతకర్మంబు నిర్వర్తించి, బ్రాహ్మణులకు నపరిమిత హిరణ్య రజత దానంబులును, వస్త్రాభరణంబులును, గ్రామంబులును, గజంబులును, వాహనంబులును, ధేనువులును నాఱేసి యర్బుదంబుల ద్రవ్యంబును దానంబు చేసి, ప్రాణిసముదాయంబునకుం బర్జన్యుండునుం బోలెఁ దక్కిన వారలకు నిష్ఠకామంబులు వర్షించి, పరమానంద హృదయుండై యుండెఁ; గుమారుండును మాతృపితృ జనంబులకు సంతోషము చేయుచు, దినదినప్రవర్ధమానుండై పెరుగుచుండె; నంతం బుత్రమోహంబునం గృతద్యుతి యందు బద్ధానురాగుండై మహీధవుండు వర్తించుచుండం; దక్కిన భార్యలు సంతాన సంతోష వికలలై, యీ మోహంబునకుం గారణంబు పుత్రుండ యని యీర్ష్యం జేసి, దారుణ చిత్తలై, కుమారునకు విషం బిడిన సుఖనిద్రితుండునుం బోలె బాలుండు మృతి బొందె; నప్పుడు వేగుటయు దాది బోధింపం జని యా కుమారుని వికృతాకారంబుఁ జూచి, విస్మయ శోకభయార్త యై పుడమింబడి యాక్రందించె; నప్పుడు. (450) పుడమి నిట్టక నిల్వునం బడి పొక్కుచుం గడు దీన యై¯ యడఁకు వేమియు లేని వాక్కుల నావు రంచు విలాపమం¯ దెడరు దోఁప భృశాతురోన్నతి నేడ్చినన్ విని భీతితోఁ¯ గడుపు బిట్టవియంగ భూపతి కాంత గ్రక్కున నేగుచున్. (451) బాలుఁ డొక్కరుండు పరిణామశీలుండు¯ వంశకర్త తపసి వరము వలనఁ¯ బుట్టి మిన్న కట్లు పొలిసి యున్నట్టి యా¯ కొడుకుఁ జూచి తల్లి యడలఁ జొచ్చె (452) కుంకుమరాగ రమ్య కుచకుంభములం గడుఁ గజ్జలంబుతోఁ¯ బంకిలమైన బాష్పముల పాల్పడ మజ్జన మాచరించుచుం¯ గంకణపాణి పల్లవయుగంబున వక్షము మోఁదికొంచు నా¯ పంకరుహాక్షి యేడ్చెఁ బరిభావిత పంచమ సుస్వరంబునన్. (453) ఆ యార్తరవమునకు భూ¯ నాయకుఁడు భయంబు నొంది నయ ముడిగి సుతున్¯ డాయఁగ వేగంబునఁ జని¯ పాయని మోహంబు తోడ బాలుని మీఁదన్. (454) "వ్రాలి యో పుత్ర! నీ వార్త దంభోళియై¯ కూలఁగా వ్రేయ కీ కొల్ది నన్నేటికిన్¯ జాలి నొందించె? నా జాడ యింకెట్టిదో? ¯ తూలు మీ తల్లికిన్ దుఃఖ మెట్లాఱునో?" (455) అని తలమొల యెఱుంగక పలవించుచు, భృత్యామాత్య బంధుజనంబులం గూడి యడలుచు నున్న యా రాజు దుఃఖం బెఱింగి, యంగిరసుండు నారదునితోడం గూడి చనుదెంచి, మృతుండైన పుత్రుని పదతలంబున మృతుండునుం బోలెఁ బడియున్న యా రాజుం గనుంగొని, యిట్లనియె (456) "నీకు వీఁ డెవ్వడు? నీ వెవ్వనికి శోక¯ సంతాప మందెదు? సార్వభౌమ! ¯ పుత్ర మిత్రాదులు పూర్వజన్మంబున¯ నెవ్వని వారలో యెఱుఁగఁ గలవె? ¯ మొదల నదీవేగమున నాడ కాడకు¯ సికతంబు గూడుచుఁ జెదరుచుండు; ¯ నారీతిఁ బ్రాణుల కతికాల గతిచేతఁ¯ బుట్టుట చచ్చుట పొసగుచుండుఁ; (456.1) గాన భూతములకుఁ గలుగు భూతంబులు¯ మమత తోడ విష్ణుమాయఁ జేసి¯ దీని కడల నేల? ధృతిఁ దూలఁగా నేల? ¯ బుద్ధిఁ దలఁప వలదె? భూత సృష్టి. (457) మఱియు నేము, నీవును దక్కినవారలును బ్రవర్తమాన కాలంబునం గలిగిన జన్మంబు నొంది, మృత్యువువలన విరామంబు నొందంగల వారమై యిపుడ లేకపోవుదము; చావు పుట్టువులకు నిక్కువంబు లేదు; ఈశ్వరుండు దన మాయచేత భూతజాలంబుల వలన భూతంబులం బుట్టించు, వాని నా భూతంబులచేతన రక్షించు; వాని నా భూతంబులచేతన హరించు; స్వతంత్రంబు లేని తన సృష్టిచేత బాలుండునుం బోలె నపేక్షలేక యుండు; దేహి యైన పితృదేహంబు చేత దేహి యైన పుత్రదేహంబు మాతృదేహంబు వలనం గలుగుచుండు నా ప్రకారంబున బీజంబు వలన బీజంబు పుట్టుచుండు; దేహికి నివి శాశ్వతంబై జరుగుచు నుండు; పూర్వకాలంబున సామాన్య విశేషంబులు సన్మాత్రంబైన వస్తువులం దే విధంబునం గల్పింపంబడియె నా ప్రకారాంబున దేహంబునకు జీవునకు నన్యోన్య విభాగంబు పూర్వకాలంబున నజ్ఞాన కల్పితం బయ్యె; జన్మఫలంబులను జూచుచున్నవారికి దహనక్రియల నగ్ని పెక్కురూపంబులం గానంబడు భంగి, నొక్కండైన జీవుండు పెక్కు భంగుల వెలుంగుచుండు; నివి యన్నియు నాత్మజ్ఞానంబు చాలక దేహిదేహ సంయోగంబున స్వప్నంబునందు భయావహం బైన ప్రయోజనంబు నడుపుచుండి, మేల్కాంచి, యా స్వప్నార్థంబైన ప్రయోజనంబు తనదిగాదని యెఱుంగు భంగి, జీవుండే తానని జ్ఞానగోచరుండైన వాఁడెఱుంగుం గావున; నన్నియును మనోమాత్రం బని తెలిసి, మోహతమంబు వాసి, భగవంతుండైన వాసుదేవుని యందుఁ జిత్తంబు పెట్టి, నిర్మలాత్మకుండ వగు"మని బోధించినఁ జిత్రకేతుండు లేచి వారల కిట్లనియె. (458) "యతివేషములు పూని యతి గూఢగతి నిందు¯ నేతెంచినట్టి మీ రెవ్వరయ్య? ¯ కడఁగి నన్ బోలిన గ్రామ్యబుద్ధుల నెల్ల¯ బోధింప వచ్చిన పుణ్యమతులొ? ¯ రమణఁ గుమార నారద ఋషభాదులొ?¯ దేవ లాసితు లను ధీరమతులొ? ¯ వ్యాస వసిష్ఠ దూర్వాస మార్కండేయ¯ గౌతమ శుక రామ కపిల మునులొ? (458.1) యాజ్ఞవల్క్యుండుఁ దరణియు నారుణియును ¯ చ్యవన రోమశు లాసురి జాతుకర్ణ¯ దత్త మైత్రేయ వర భరద్వాజ బోధ్య¯ పంచశిఖులొ? పరాశర ప్రభృతి మునులొ? (459) వీరలలో నెవ్వరు? సుర¯ చారణ గంధర్వ సిద్ధ సంఘంబులలో¯ వారలొ? యీ సుజ్ఞానము¯ కారణమై యెవరి యందు గలదు తలంపన్? (460) పొందుగ గ్రామ్య పశుత్వముఁ¯ బొంది మహాశోకతమముఁ బొందిన నాకున్¯ ముందఱ దివ్యజ్ఞానముఁ¯ జెందించినవారి మిమ్ముఁ జెప్పుడు తెలియన్. " (461) అనిన నంగిరసుం డిట్లనియె "నేను బుత్రకాంక్షివైన నీకుఁ బుత్రుం బ్రసాదించిన యంగిరసుండ; నితండు బ్రహ్మపుత్రుం డైన నారదభగవంతుండు; దుస్తరంబైన పుత్రశోకంబున మగ్నుండ వైన నిను ననుగ్రహించి, పరమజ్ఞానం బుపదేశింప వచ్చితిమి; నీ దుఃఖం బెఱింగి, పుత్రు నిచ్చితిమేనిఁ బుత్రవంతులైన వారి తాపంబు నీ చేత ననుభవింపం బడు; నీ ప్రకారంబున లోకంబున సతులును, గృహంబులును, సంపదలును, శబ్దాదులైన విషయంబులును, రాజ్యవైభవంబును జంచలంబులు; మఱియు రాజ్యంబును, భూమియును, బలంబును ధనంబును, భృత్యామాత్య సుహృజ్జనంబులును మొదలైనవి శోక మోహ భయ పీడలం జేయుచుండుఁ; గాని సుఖంబుల నీ నేరవు గంధర్వ నగరంబునుం బోలె స్వప్నలబ్ధ మనోరథంబునుం బోని యర్థంబుఁ బాసి కానంబడుచు, మనోభవంబులయిన యర్థంబులం గూడి, స్వార్థంబులై కానంబడ నేరవు; కర్మంబులచేత ధ్యానంబులు చేయుచుండు మనంబులు నానాకర్మంబు లగుచు నుండు నీ దేహి దేహంబు ద్రవ్యజ్ఞానక్రియాత్మకంబై దేహికి వివిధ క్లేశసంతాపంబులం జేయుచుండు; గావున నీవు నిర్మలంబైన మనంబు చేత నాత్మగతి వెదకి ధ్రువం బయిన పదవి నొందు"మనియె; అప్పుడు నారదుం డిట్లనియె "ఉపనిషద్గోప్యంబగు నే నిచ్చుమంత్రం బెవ్వడేని సప్తరాత్రంబులు పఠియించు, నతండు సంకర్షణుండైన భగవంతునిం జూచును; ఎవ్వని పాదమూలంబు సర్వాశ్రయంబై యుండు నట్టి శ్రీమన్నారాయణుని పాదంబులు సేవించి, యీ మోహంబు వదలి యతి శ్రీఘ్రంబున నుత్తమ పదంబు నొందు; మిప్పు డిక్కుమారునకు నీకును బ్రయోజనంబు గలదేనిం జూడు"మని నారదుండు మృతబాలకుని కళేబరంబుఁ జూచి "యో జీవుండ! నీకు శుభం బయ్యెడు; నిందుఁ బ్రవేశించి మీ తల్లిదండ్రుల బంధుజనులం జూచి వీరల దుఃఖంబు లార్చి యీ కళేబరంబునందుఁ బ్రవేశించి యాయుశ్శేషంబు ననుభవించి పిత్రధీనం బైన రాజ్యాసనంబునఁ గూర్చుండు"మనిన నబ్బాలుం డిట్లనియె. (462) "కర్మవశమున నెందు సుఖంబు లేక¯ దేవతిర్యఙ్నృ యోనులఁ దిరుగు నాకు¯ వెలయ నే జన్మమందునొ వీరు తల్లి¯ దండ్రు లయినారు చెప్పవే తాపసేంద్ర! (463) బాంధవజ్ఞాతిసుతులును బగతు రాత్మ¯ వరు లుదాసీన మధ్యస్థ వర్గములును¯ సరవిఁ గనుచుందు రొక్కక్క జన్మమునను¯ నెఱయఁ బ్రాణికి నొక వావి నిజము గలదె? (464) రత్నములు హేమములు ననురాగలీల¯ నమ్మకంబుల నీవల నావల నగు¯ భంగి నరులందు జీవుండు ప్రాప్తుఁ డగుచు¯ నెలమిఁ దిరుగుచు నుండుఁ; దా నెందుఁ జెడఁడు. (465) ఒక్కఁడై నిత్యుఁడై యెక్కడఁ గడలేక¯ సొరిది జన్మాదుల శూన్యుఁ డగుచు¯ సర్వంబు నందుండి సర్వంబుఁ దనయందు¯ నుండంగ సర్వాశ్రయుం డనంగ¯ సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు¯ సామ్యమై స్వప్రకాశమున వెలిగి¯ యఖిలంబుఁ జూచుచు నఖిల ప్రభావుఁడై¯ యఖిలంబుఁ దనయందు నడఁచి కొనుచు (465.1) నాత్మమాయాగుణంబుల నాత్మమయము¯ గాఁగ విశ్వంబుఁ దనసృష్టి ఘనతఁ జెందఁ¯ జేయుచుండును సర్వసంజీవనుండు¯ రమణ విశ్వాత్ముఁ డయిన నారాయణుండు. (466) సతు లెవ్వరు? సుతు లెవ్వరు? ¯ పతు లెవ్వరు? మిత్రశత్రు బంధుప్రియ సం¯ గతు లెవ్వరు? సర్వాత్మక¯ గతుఁడై గుణసాక్షి యైన ఘనుఁ డొక్కనికిన్. (467) మఱియు సుఖదుఃఖంబులం బొందక సర్వోదాసీనుండై పరమాత్మ యై యుండు న ప్పరమేశ్వర రూపుండు నయిన, నాకును మీకు నెక్కడి సంబంధంబు? మీకు దుఃఖంబునకుం బని లే"దని పలికి యా జీవుండు పోయినం జిత్రకేతుండును బంధువులు నతి విస్మిత చిత్తులై శోకంబులు విడిచి మోహంబులం బాసి యమునా నది యందు న క్కుమారునకు నుత్తరకర్మంబులు నిర్వర్తించిరి చిత్రకేతుండు గాఢ పంకంబునంబడిన యెనుంగునుం బోలె గృహాంధకూపంబు నం దుండి వెడలి కాళిందీనదికిం బోయి యందు విధిపూర్వకంబుగఁ గృతస్నానుండై, మౌనంబుతోడ నారదునకు నమస్కరించిన, నతండు ప్రసన్నుండై భగవన్మంత్రంబు విధిపూర్వకంబుగా నతనికిం నుపదేశించి యంగిరసుతోడం గూడి బ్రహ్మలోకంబునకుం జనియె; చిత్రకేతుండును నార దోపదేశ మార్గంబున నిరాహారుండై సమాధినియతుండై నారాయణ రూపంబయిన యా విద్య నారాధించి సప్తరాత్రంబున నప్రతిహతం బయిన విద్యాధరాధిపత్యంబును భాస్వద్రత్న దివ్య విమానంబునుం బడసి, నారాయణానుగ్రహంబునుం బొంది, మనోగమనంబునం ద్రిజగంబులం జరియించుచుండఁ గొన్ని దినంబులకు నొక్కచోట. (468) తార హార పటీర ధవళ దేహమువాని¯ రమణీయ నీలాంబరంబువాని; ¯ మణికిరీటస్ఫురన్మస్తకంబులవానిఁ¯ గంకణ కేయూర కరమువానిఁ; ¯ గర్బురమయదీప్త కటిసూత్రములవానిఁ¯ దరళ యజ్ఞోపవీతములవాని; ¯ నతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవానిఁ¯ దరుణవివృత్త నేత్రములవాని; (468.1) సిద్ధమండలంబు సేవింపఁ బుణ్యప్ర¯ సిద్ధి వెలసినట్టి యిద్ధచరితుఁ; ¯ బద్మలోచనునకుఁ బాదపీఠంబైన¯ ఘనునిఁ, బన్నగేంద్రుఁ గాంచె నతఁడు. (469) కన్నమాత్ర నతఁడు కల్మషంబులఁ బాసి¯ విమలచిత్తుఁ డగుచు విశదభక్తి¯ నిట్టరోమములకుఁ బట్టగు చానంద¯ బాష్పనేత్రుఁ డగుచుఁ బ్రణుతి చేసె (470) సంతోషాశ్రులచేత న¯ నంతునిఁ బరిషిక్తుఁ జేసి యతఁడు ప్రమోదం¯ బెంతయు నరికట్టిన నొక¯ కొంతయుఁ బలుకంగలేక కొండొక వడికిన్. (471) మదినొక యింతమాత్రన సమంబుగఁ జేయుచు బాహ్యవర్తనం¯ గదిసిన యింద్రియంబుల నొకంతకుఁ దెచ్చి మనంబు వాక్కునుం¯ గుదురుగఁ ద్రోచి తత్వమునఁ గూర్చుచు శాశ్వత విగ్రహంబు నా¯ సదయుఁ బ్రశాంతు లోకగురు సన్నుతి చేయఁ దొడంగె నిమ్ములన్. (472) "అజితుఁడవై భక్తులచే¯ విజితుం డైనాఁడ విపుడు వేడుక వారున్¯ విజితులు నీచేఁ గోర్కులు¯ భజియింపనివారు నిన్నుఁ బడయుదురె? హరీ! (473) నీ విభవంబు లీ జగము నిండుట యుండుట నాశ మొందుటల్¯ నీ విమలాంశజాతములు నెమ్మి జగంబు సృజించువార, లో¯ దేవ! భవద్గుణాంబుధుల తీరముఁ గానక యీశ! బుద్ధితో¯ వావిరిఁ జర్చ చేయుదురు వారికి వారలు దొడ్డవారలై. (474) పరమాణువు మొదలుగఁ గొని¯ పరమము దుదిగాఁగ మధ్యపరికీర్తనచే¯ స్థిరుఁడవు త్రయీవిదుఁడవై¯ సరి సత్వాద్యంత మధ్య సదృశగతుఁడవై. (475) ఉర్వి మొదలైన యేడు నొండొకటికంటె¯ దశగుణాధికమై యుండు; దాని నండ¯ కోశమందురు; నా యండకోటి యెవ్వఁ¯ డందు నణుమాత్రమగున నంతాఖ్యుఁ డతఁడు. (476) మఱియు, నొక్కచోట విషయతృష్ణాపరులైన నరపశువులు పరతత్త్వంబవైన నిన్ను మాని యైశ్వర్యకాములై తక్కిన దేవతల భజియింపుదురు; వారిచ్చు సంపదలు రాజకులంబునుంబోలె వారలంగూడి నాశంబునం బొందుచుండు; విషయకామములేని నిన్ను సేవించినవారు వేఁచిన విత్తనంబునుంబోలె దేహాంతరోత్పత్తి నొందకుండుదురు; నిర్గుణుండవై జ్ఞానవిజ్ఞాన రూపంబు నొందియున్న నిన్ను గుణసమేతునింగా జ్ఞానులు భావింపుదురు; నీ భజనం బే రూపున నయిన మోక్షంబు ప్రసాదించు; జితమతివైన నీవు భాగవత ధర్మం బే ప్రకారంబున నిర్ణయించితి; వా ప్రకారంబున సర్వోత్కృష్టుండ వైన నిన్ను సనత్కుమారాదులు మోక్షంబు కొఱకు సేవించుచున్నా; రీ భాగవత ధర్మంబునందు జ్ఞానహీనుం డొక్కండును లేఁ; డన్య కామ్యధర్మంబులందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు నని వచియించుచున్నవాఁ డధర్మనిరతుండై క్షయించుచుండు; స్థావర జంగమ ప్రాణిసమూహంబునందు సమంబైన భాగవతధర్మంబుల వర్తించుచున్న మనుజునికి భవద్దర్శనంబువలనఁ బాపంబు క్షయించుట యేమి చిత్రం; బిపుడు భవత్పాదావలోకనంబున నిరస్తాశుండ నైతి; మూఢుండ నయిన నాకుఁ బూర్వ కాలంబున నారదుం డనుగ్రహించి, భగవద్ధర్మంబు దయచేసె; నది నేఁడు నాకు వరదుండ వయిన నీ కతంబున దృష్టంబయ్యె; ఖద్యోతంబులచేత సూర్యుండు గోచరుండు గానిమాడ్కి జగదాత్మకుండవయిన నీ మహత్త్వంబు మనుజులచేత నాచరింపబడి ప్రసిద్ధంబైనది గాదు; అం దుత్పత్తి స్థితి లయ కారణుండవై భగవంతుండ వైన నీకు నమస్కరించెద; నని మఱియును. (477) అరయ బ్రహ్మాదు లెవ్వని ననునయించి¯ భక్తియుక్తుల మనమునఁ బ్రస్తుతింతు? ¯ రవని యెవ్వని తలమీఁద నావగింజఁ¯ బోలు? నా వేయుశిరముల భోగిఁ గొల్తు." (478) ఈ విధమున వినుతింపఁగ¯ నా విద్యాధరుల భర్త కనియె ననంతుం¯ "డో! విమలబుద్ధి! నీ దగు¯ ధీవిభవంబునకు మెచ్చితిం బ్రియమారన్. (479) అరయ నారదుండు నంగిరసుండును¯ దత్త్వ మొసఁగినారు; దాని కతన¯ నన్నుఁ జూడఁగల్గె నా భక్తి మదిఁ గల్గె¯ నా పథంబు నీకు నమ్మఁ గలిగె. (480) పూని నా రూపంబు భూతజాలంబులు¯ భూతభావనుఁడ నేఁ బొందుపడఁగ; ¯ బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వ¯ తంబైన తనువులు దగిలె నాకు; ¯ నఖిలలోకంబులు ననుగతంబై యుండు¯ లోకంబు నాయందు జోకఁ జెందు; ¯ నుభయంబు నా యందు నభిగతంబై యుండు¯ యభిలీనమయ్యె న య్యుభయమందు; (480.1) వెలయ నిద్రించువాఁ డాత్మ విశ్వమెల్ల¯ జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ¯ గా వివేకించు మాడ్కినీ జీవితేశ¯ మాయ దిగనాడి పరమధర్మంబుఁదెలియు. (481) నిద్రపోవు వేళ నిరతుఁడై దేహిదా¯ నెట్టి గుణముచేత నింద్రియములఁ¯ గడచినట్టి సుఖముఁ గను నట్టి బ్రహ్మంబుఁ¯ గడిమి మెఱయ నన్నుఁగా నెఱుంగు. (482) స్వప్న మందు నెట్లు సంచార మొనరించు¯ మేలుకాంచి దృష్ట మోలి నెఱఁగు¯ నుభయ మెఱుఁగునట్టి యుత్తమ జ్ఞానంబు¯ తత్త్వ; మట్టిదైన తలఁపు నేను (483) అరయంగ నెవ్వని కలవిగానట్టి యీ¯ సలలిత మానుషజాతిఁ బుట్టి¯ యాత్మతత్త్వజ్ఞాన హతుఁడైన వానికిఁ¯ గలుగునె యెందు సుఖం బొకింత? ¯ వెలయఁ బ్రవృత్తి నివృత్తి మార్గంబుల¯ సుఖదుఃఖచయముల సొరిదిఁ దెలిసి¯ పనిచెడి సంకల్పఫలమూలమునఁ బాఱు¯ కడు సుఖదుఃఖ మోక్షములకొఱకు (483.1) దంపతిక్రియామతంబు వర్తింతురు¯ దాన మోక్ష మేల దక్కి యుండు? ¯ నఖిల దుఃఖహేతు వయిన యీ కర్మంబు¯ నెఱిఁగి నన్నుఁ దలఁప రిచ్చలోన. (484) మఱియు విజ్ఞానాభిమాను లైన మనుష్యులకు నతిసూక్ష్మం బైన యాత్మగతి నిజస్థానత్రయలక్షణంబునఁ జతుర్థాంశంబు నెఱింగి యైహికాముష్మిక విషయంబులచేతను వివేకబలంబులచేతను నియుక్తుండై జ్ఞానవిజ్ఞాన సంతృప్తుండైన పురుషుండు నాకు భక్తుం డగు; నీ విధంబులు గలవారలు యోగనైపుణ్యబుద్ధిగలవారలునై స్వార్థంబయిన యాత్మచేతం బరమాత్మను దెలియుచుందురు; నీవు నీ క్రమంబున మద్భక్తిశ్రద్ధాపరుండవై విజ్ఞాన సంపన్నంబులైన వాక్కులచేత నన్ను స్తోత్రంబు చేసి ముక్తుండ వైతి"వని యా శేషభగవంతుండు విద్యాధరపతి యైన చిత్రకేతుం బలికి యతని కదృశ్యుం డైపోయె; నే దిక్కున సర్వాత్మకుండైన యనంతుం డంతర్ధానంబు నొందె. నా దిక్కునకు విద్యాధర భర్త నమస్కరించి గగనచరుండై చని లక్షలసంఖ్య లైన దివ్యవర్షంబు లవ్యాహత బలేంద్రియుండై పరమయోగిపురుషులును, దివ్యమునీంద్రులును, సిద్ధ చారణ గంధర్వులును, వినుతి చేయం గులద్రోణాదిశైలంబులను రమ్యప్రదేశంబులను సంకల్పసిద్ధ ప్రదేశంబులను వినోదించుచు, శ్రీనారాయణదత్తంబగు దివ్యవిమానంబునందుఁ జరియించుచునుండి. (485) ఆడించున్ హరి దివ్యనాటక గుణవ్యాపార నృత్యంబులం; ¯ బాడించున్ జలజాతనేత్ర బిరుదప్రఖ్యాత గీతంబులం; ¯ గూడించున్ సతతంబు జిహ్వలతుదిన్ గోవిందనామావళుల్¯ క్రీడం గిన్నర యక్ష కామినులచేఁ గృష్ణార్పితస్వాంతుఁడై. (486) వాసించు నాత్మఁ బో వైష్ణవజ్ఞానంబు¯ నాశించు భాగవతార్చనంబు; ¯ భూషించు నే ప్రొద్దుఁ బుండరీకాక్షుని¯ భాషించు హరికథాప్రౌఢి మెఱసి; ¯ ఘోషించు హరినామగుణనికాయంబులు¯ పోషించుఁ బరతత్త్వ బోధ మరసి; ¯ సేవించు శ్రీకృష్ణ సేవక నికరంబు¯ సుఖమునఁ జేయు నీశునకు బలులు; (486.1) పాడుఁ బాడించు వైకుంఠభర్త నటన¯ రూప వర్తన గుణ నామ దీపి తోరు¯ గీతజాత ప్రబంధ సంగీత విధుల¯ గేశవప్రీతిగాఁ జిత్రకేతుఁ డపుడు. (487) హరిఁ గీర్తించుచు నల్లనల్ల మదిలో నబ్జాక్షు సేవించుచుం¯ బరమానందము నొందుచున్ జగములం బ్రఖ్యాతి వర్తించుచున్¯ సురరాజోపమమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరా¯ ప్సరసల్ గొల్వఁగఁ బాడఁగా సితగిరిప్రాంతంబునన్నేగుచున్. (488) ఆ విద్యాధరభర్త గాంచె హరనీహా రామృతాహాసమున్¯ శ్రీవిభ్రాజితమున్ నిరస్త గిరిజా సేవాగతాయాసమున్¯ దేవానీక వికాసమున్ శుభమహాదేవాంఘ్రి సంవాసమున్¯ భూవిఖ్యాత విలాసముం ద్రిభువనీ పూతంబుఁ గైలాసమున్. (489) ఆ రజత భూధరంబున¯ నీరేజభవామరాది నికరము గొల్వం¯ బేరోలగమున నుండిన¯ గౌరీయుతుఁ డయిన హరునిఁ గనియె నరేంద్రా! (490) తన దగు రూప మింతయు నేని దెలియక¯ వాదంబు చేసెడు వేదరవముఁ¯ గరుణావలోకనాకాంక్షితులై యున్న¯ బ్రహ్మాది సనకసంప్రణుతిరవము¯ సారశివానందసల్లాపముల నొప్పు¯ ప్రమథగణాళి యార్భటరవంబు¯ డమరుమృదంగాది ఢమఢమధ్వనితోడి¯ పటుభృంగి నాట్య విస్ఫారరవము (490.1) మానుగాఁ జామరులు వీచు మాతృకాది¯ కామినీజన మహిత కంకణరవంబు¯ మెండుఁ జెలఁగంగఁ గన్నుల పండు వయ్యెఁ¯ గొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు. (491) ఇట్లు బ్రహ్మాది సురనికర సేవితుండై యూరుపీఠంబుననున్న భవానిం గౌగిటం జేర్చుకొని యొడ్డోలగంబున నున్న పరమేశ్వరుం జూచి చిత్రకేతుండు పకపక నగి యద్దేవి వినుచుండ నిట్లనియె. (492) "కొమరొప్పఁగా లోకగురుఁడును గడలేని¯ ధర్మస్వరూపంబుఁ దాన యగుచు¯ జడలు ధరించియు సరిలేని తపమునఁ¯ బొడవైన యీ యోగిపుంగవులును ¯ బ్రహ్మవాదులుఁ గొల్వ భాసిల్లు కొల్వులో¯ మిథునరూపంబున మెలఁతతోడఁ ¯ బ్రాకృతుండునుబోలె బద్ధానురాగుఁడై ¯ లాలితుం డయ్యె నిర్లజ్జత నిట; (492.1) నకట! ప్రకృతిపురుషుఁ డైనఁ దా నేకాంత¯ మందు సతులతోడ నలరుఁగాని¯ యిట్లు ధర్మసభల నింతులతోఁగూడి¯ పరిఢవింపలేఁడు భ్రాంతి నొంది. " (493) అన విని సర్వేశ్వరుఁ డా¯ తని నేమియు ననక నవ్వెఁ దత్సభవారుం¯ గనుగొని యూరక యుండిరి¯ మనుజేశ్వర! యీశుధైర్య మది యెట్టిదియో? (494) ఇట్లు దన పూర్వకర్మశేషంబున నింద్రియ జయుండ నని పుట్టిన యహంకారంబున, జగద్గురువుం బెక్కు ప్రల్లదంబు లాడుచున్న చిత్రకేతుం జూచి భవాని యిట్లనియె. (495) "మముబోఁటి లజ్జ లుడిగిన¯ కుమతులకుం గర్త యగుచుఁ గోపింపంగా¯ నమితాజ్ఞానిపుణుం డగు¯ శమనుండా నేఁడు వీఁడు జగముల కెల్లన్? (496) భృగు నారద కపిలాదులు¯ నిగమాంతజ్ఞులును యోగనిర్ణయ నిపుణుల్¯ త్రిగుణాతీతు మహేశ్వరు¯ నగ రెన్నఁడు వారు ధర్మనయ మెఱుఁగరొకో? (497) ఎవ్వని పదపద్మ మింద్రాది విబుధుల¯ చూడాగ్రపంక్తుల నీడఁ జూచు, ¯ నెవ్వని తత్త్వంబ దెనయంగ బ్రహ్మాది¯ యోగిమానసపంక్తి నోలలాడు, ¯ నెవ్వని రూపంబు నేర్పాటు గానక¯ వేదంబు లందంద వాద మడఁచు, ¯ నెవ్వని కారుణ్య మీ లోకముల నెల్లఁ¯ దనిపి యెంతయు ధన్యతములఁ జేయు, (497.1) నట్టి సర్వేశుఁ బాపసంహారు ధీరు¯ శాశ్వతైశ్వర్యు నాత్మసంసారు నీశు¯ నెగ్గు పల్కిన పాపాత్ముఁ డెల్ల భంగి¯ దండనార్హుండు గాకెట్లు దలఁగఁ గలడు? (498) నిఖిలలోకాశ్రయంబు సన్నిహితసుఖము¯ సకలభద్రైక మూలంబు సాధుసేవ్య¯ మైన కంజాక్షుపాదపద్మార్చనంబు¯ ననుసరింపంగ ఖలుఁడు వీఁ డర్హుఁ డగునె? (499) కావున, నోరి! దురాత్మక! యీ పాపంబునం బాపస్వరూపంబైన రాక్షసయోనిం బుట్టు"మని శపియించి "యింతనుండి మహాత్ములకు నవజ్ఞ చేయకుండు"మని పలికినఁ జిత్రకేతుండు విమానంబు డిగ్గి వచ్చి, యద్దేవికి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు దోయిలించి యిట్లనియె "నో జగన్మాతా! భవచ్ఛాప వాక్యంబు లట్ల కైకొంటి ప్రాచీన కర్మంబులం బ్రాప్తం బైన సంసార చక్రంబు చేత నజ్ఞాన మోహితులై తిరుగుచున్న జంతువులకు సుఖదుఃఖంబులు నైజంబులై ప్రవర్తిల్లుచుండు; నిందులకుఁ బరతంత్రులైనట్టి వా రాత్మ సుఖదుఃఖంబులకు నెవ్వరు కర్త; లీ గుణంబుల నిమిత్తమై శాపానుగ్రహంబులును స్వర్గ నరకంబులును, సుఖదుఃఖంబులును సమంబులు; భగవంతుం డొక్కండ తన మాయ చేత జగంబులు సృజియించుచు వారి వారికి బద్ధానురాగంబులు గలుగం జేయుచుఁ దాను వానికి లోను గాక నిష్కళుండై యుండు; నీ విధంబునం బుట్టుచున్న నరునకుం బత్ని బంధు శత్రు మిత్రోదాసీనత్వంబు లెక్కడివి? వారివారి కర్మ వశంబునం బరమేశ్వరుండు కల్పించుచు సర్వసముండై యుండు; నప్పరమేశ్వరునకు సుఖదుఃఖంబుల చేత రాగంబు లేదు రాగానుబంధంబైన రోషంబును లే; దతని మాయా గుణవిసర్గంబు జంతువులకు సుఖదుఃఖంబులను, బంధమోక్షంబులను గల్పించుచుండును; కావున, నీకు నమస్కరించుచున్న నన్ను ననుగ్రహింపుము; శాపభయశంకితుండంగాను; జగన్మాతవైన నిన్నుఁ బలికిన దోషంబునకు శంకించుచున్నవాఁడ"నని దండప్రణామంబు లాచరించి పార్వతీ పరమేశ్వరులం బ్రసన్నులం జేసి తన విమానం బెక్కి చనియె; నప్పుడు పరమేశ్వరుండు బ్రహ్మాది దేవర్షి దైత్య దానవ ప్రమథ గణంబులు వినుచుండఁ బార్వతికి నిట్లనియె "నీకు నిప్పుడు దృష్టం బయ్యెఁ గదా నారాయణదాసానుచరుల నిస్పృహభావంబు; హరి తుల్యార్థదర్శనులై నిస్పృహులైన భాగవతులకు స్వర్గాపవర్గ నరక భేదభావంబులు లేవు; ప్రాణులకు దేహసంయోగంబు వలన నారాయణలీలం జేసి యుండి ద్వంద్వాది సుఖదుఃఖంబు లాత్మ యందు నజ్ఞానంబున భేదంబు చేయం బడియె; నట్టి విపర్యయంబులు భగవంతుండైన వాసుదేవునిభక్తి గలవారిం జెందవు; మఱియును. (500) నేనుఁ, గుమారనారదులు, నీరజగర్భుఁడు, దేవసంఘమున్, ¯ మానిత యోగివర్య ముని మండల, మిట్లగు వార మందఱున్¯ దానవవిద్విడంశ జనితంబులమయ్యుఁ దదీయ తత్త్వముం¯ గానఁగ నేర; మీశు ఘనగర్వమునం దలపోసి చూచుచున్. (501) ఆతనికింబ్రియుఁ డప్రియుఁ¯ డే తెఱఁగున లేడు నిఖిల మెల్లను దానై¯ భూతముల కాత్మ యగుటయు¯ భూతప్రియుఁ డొక్కఁ డాదిపురుషుఁడు తన్వీ! (502) అరయఁ జిత్రకేతుఁ డతిశాంతుఁ డతిలోక¯ సముఁడు విష్ణుభక్తి సంగతుండు¯ నితని నేమిచెప్ప? నీశుండ నగు నేను¯ నువిద! యచ్యుతప్రియుండఁ జుమ్మి. (503) కావున భగవద్భక్తుల¯ భావమునకు విస్మయంబు పనిలేదు మహా¯ ధీ విభవశాంత చిత్తులు¯ పావన పరతత్త్వనిపుణ భవ్యులు వారల్." (504) అనిన విని యద్రితనయ విస్మయంబు మాని శాంతచిత్త యయ్యె; నట్లు పరమభాగవతుండయిన చిత్రకేతుం డద్దేవికిం బ్రతిశాపం బియ్య సమర్థుం డయ్యును, మరల శపింపక యతి శాంతరూపంబున శాపంబు శిరంబున ధరియించె; నిట్టి సాధులక్షణంబులు నారాయణ పరాయణులైన వారలకుం గాక యొరులకుం గలుగ నేర్చునే? యట్లు శాపహతుండైన చిత్రకేతుండు త్వష్ట చేయు యజ్ఞంబున దక్షిణాగ్ని యందు దానవ యోనిం బుట్టి వృత్రాసురుం డన విఖ్యాతుం డయి భగవద్జ్ఞాన పరిణతుం డయ్యెం; గావున. (505) నరనాథ! యీ వృత్రునకు రాక్షసాకృతి¯ గలిగిన యీ పూర్వకారణంబు¯ చిరపుణ్యుఁ డయినట్టి చిత్రకేతు మహాను¯ భావంబు భక్తితోఁ బరఁగ విన్న¯ చదివినవారికి సకల దుష్కర్మముల్¯ శిథిలంబులై కడుఁ జెదరిపోవు¯ సకలవైభవములు సమకూరుఁ దనయంతఁ¯ దొల్కాడు కోర్కులతోడఁ గూడి (505.1) నిర్మలాత్ము లగుచు నిత్యసత్యజ్ఞాన¯ నిరతు లగుచు విగత దురితు లగుచు¯ బంధు మిత్ర పుత్ర పౌత్రాదులను గూడి¯ యనుభవించుచుందు రధిక సుఖము.

సవితృవంశ ప్రవచనాది కథ

(506) "వినవయ్య! నరనాథ! విశదంబుగాఁ ద్వష్టృ¯ వంశంబు చెప్పితి; వాని వెనుక¯ సవితృండు పృశ్నియు సావిత్రి వ్యాహృతి¯ యను భార్యలందు నింపారు వేడ్క¯ నగ్ని హోత్రంబుల నరయంగఁ బశుసోమ¯ పంచయజ్ఞంబులఁ బరఁగఁ గనియె; ¯ భగుఁడు సిద్ధిక యను భార్యకు మహిమాను¯ భవుల విభవులఁ దాఁ బడసె మువురఁ; (506.1) దనయ నొకతెఁ గాంచెఁ ద దనంతరమున నా¯ తరళనేత్ర సద్వ్రతస్వధామ¯ పుణ్యశీల సుగుణ పూరిత చారిత్ర¯ యఖిలలోకపూజ్య యాశిషాఖ్య. (507) మఱియు, ధాతకుఁ గల కుహూ సినీవాలీ రాకానుమతు లనియెడు నలువురు భార్యలలోఁ గుహూదేవి సాయమను సుతునిం గాంచె; సినీవాలి దర్శాఖ్యునిం బడసె; రాక ప్రాతరాఖ్యునిఁ గాంచె; ననుమతి పూర్ణిమాఖ్యునిఁ బడసె; విధాత క్రియ యను భార్యయందు నగ్నిపురీష్యాదులం గనియె; వరుణునకుఁ జర్షిణి యను భార్యయందుఁ బూర్వకాలంబున బ్రహ్మపుత్రుం డయిన భృగువును వల్మీకంబునం జనియించిన వాల్మీకియు నుదయించిరి; మిత్రావరుణులకు నూర్వశి యందు రేతోద్గమంబైన, దానిఁ గుంభంబునం బ్రవేశింప జేయ నందు నగస్త్యుండును, వసిష్ఠుండును జనియించిరి; ప్రత్యేకంబ మిత్రునకు రేవతియందు నుత్సర్గ సంభవులైన యరిష్టయుఁ, బిప్పలుండును నను వారలు జనియించిరి; శక్రునకుఁ బౌలోమి యందు జయంత ఋషభ విదుషులన ముగ్గురు పుట్టిరి; వామనుం డయిన యురుక్రమ దేవునకుఁ గీర్తి యను భార్యయందు బృహశ్లోకుండు పుట్టె; నా బృహశ్లోకునకు సౌభగాదులు పుట్టిరి; మఱియు, మహానుభావుం డయిన కశ్యపప్రజాపతికి నదితి యందు శ్రీమన్నారాయణుం డవతరించిన ప్రకారంబు వెనుక వివరించెద; దితిసుతులైన దైతేయుల వంశంబు చెప్పెదను; ఏ దైతేయ వంశంబు నందు బ్రహ్లాద బలులు పరమ భాగవతులై దైత్యదానవవందితులై వెలసిరి; దితి కొడుకులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులనఁ బ్రసిద్ధి నొంది; రందు హిరణ్యకశిపునకుఁ జంభాసుర తనయ యైన దత్తకుఁ బ్రహ్లాదానుహ్లాద సంహ్లాద హ్లాదులను నలుగురు గొడుకులును సింహిక యను కన్యకయు జన్మించి; రా సింహికకు రాహువు జనియించె; నా రాహువు శిరం బమృతపానంబు చేయ, హరి దన చక్రంబునం ద్రుంచె; సంహ్లాదునకు గతి యను భార్య యందుఁ బంచజనుండు పుట్టె; హ్లాదునకు దమని యను భార్య యందు వాతాపీల్వలులు పుట్టిరి; వారల నగస్త్యుండు భక్షించె; ననుహ్లాదునకు సూర్మి యను భార్యయందు బాష్కల మహిషులు గలిగిరి; ప్రహ్లాదునకు దేవి యను భార్యయందు విరోచనుండు పుట్టె; నతనికి బలి జన్మించె; నా బలికి నశన యను భార్య యందు బాణుండు జ్యేష్ఠుండుగా నూర్వురు గొడుకులు పుట్టి; రా బలి ప్రభావంబు వెనుక వివరించెద; బాణాసురుండు పరమేశ్వరు నారాధించి ప్రమథగణంబులకు ముఖ్యుం డయ్యెను; మఱియు, నా దితి సంతానంబులగు మరుత్తు లేకోనపంచదశకంబులు గలవార లందఱు ననపత్యులై యింద్రుతోఁ గూడి దేవత్వంబు నొంది"రనిన విని పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.