పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 401-- 443

(401) నాకును సఖ్యము పుణ్య¯ శ్లోకులతోఁగాని తత్త్వశూన్యులు సంసా¯ రైక విమోహులతోడం¯ గాకుండనొనర్పుమయ్య కంజదళాక్షా" (402) అని పలుకుచు. (403) హరిపై సర్వాత్ముపై నత్యగణితగుణుపై నంతరంగంబు పర్వన్¯ సరిమేనుప్పొంగఁ జావుంజయమును సరిగాసంతసంబందుచుం భీ¯ కరుఁడై కాలాగ్ని పోలెం గనులుచుఁ గవిసెన్ గర్వదుర్వారుఁడై దు¯ ర్భరలీలన్ భూమి గంపింపఁగ దిశల ద్రువన్ భండనోద్దండవృత్తిన్. (404) దొరఁకొని ప్రళయోదకమున¯ హరిపైఁ గైటభుఁడు గవియు హంకారమునన్¯ సురనాథు మీఁద వృత్రా¯ సురుఁడు మదోద్వృత్తి నడచె శూలాయుధుఁడై. (405) కల్పాంతాగ్నియుబోలె నుల్కలెగయంగాఁ ద్రిప్పుచున్ "దీన నో! ¯ యల్పా! చావు"మటంచు శూలము రయం బారంగఁ బైవైచినం¯ బోల్పం గోటిరవిప్రకాశత దివిం బోవంగ వీక్షించి యా¯ వేల్పుల్ పొంగఁగ వజ్రధారఁ దునిమెన్ విన్నాణ మొప్పారఁగన్. (406) శూల మప్పు డతఁడు స్రుక్కక ఖండించి¯ పూని తోన కదిసి భుజము ద్రుంచె; ¯ నసుర గనలి యేకహస్తుఁడై పరిఘంబు¯ గొని మహేంద్రుఁ గిట్టి హనువు లడిచె. (407) ఇట్లు ప్రళయకాల భీషణ పరివేష పోషంబుగా రోషంబునం బరిఘంబుఁ ద్రిప్పి కుప్పించి గజ కుంభస్థలంబు భగ్నంబు చేసి యింద్రు హనుప్రదేశంబును నిష్ఠురాహతి నొప్పించిన. (408) గజము మద ముడిగి తిరుగుచు¯ గుజగుజనై గీఁకపెట్టఁ గులిశము నేలన్¯ భజన చెడి విడిచె నింద్రుఁడు¯ గజిబిజితో బెగడె నసుర కడిమి జగంబుల్. (409) గరుడుఁడు పొదవిన నాగము¯ కరణిన్ వృత్రాసురేంద్రు కడిమికి లోనై¯ తిరుగుడు పడ్డ హరిం గని¯ పురపుర నాహా! యటంచుఁ బొగిలె జగంబుల్. (410) అప్పుడు. (411) గజముపాటు చూచి కడు దీనగతిఁ జూచి¯ పరికరంబు జాఱి పడుటఁ జూచి¯ యుద్ధధర్మ మెఱిఁగి యున్న శత్రునిఁ జూచి¯ సిగ్గుతోడ వజ్రి శిరము వాంచె. (412) ఇట్లు యుద్ధంబున శత్రు సన్నిధిం గరంబు జాఱిపడిన వజ్రంబుఁ బుచ్చికొనక నివ్వెఱపడి, లజ్జించి యున్న పాకశాసనుం జూచి వృత్రుం డిట్లనియె. (413) "దురమునఁ గైదువు వదలిన¯ శరణన్నను వైరిజనులఁ జంపరు వీరుల్¯ వెఱఁగంద నేల? కులిశము¯ కర మరుదుగఁ బుచ్చికొనుము కాచితి నింద్రా! (414) వజ్రంబుఁ గైకొని వైరి నిర్జింపు; మి¯ ట్లడలంగ వేళ గా దమరనాథ! ¯ యమర దేహాధీను లైన మూర్తుల కెల్ల¯ నీశు లక్ష్మీశు సర్వేశుఁ బాసి¯ కడతేఱ జయములు గల్గునె యెందైనఁ?¯ దలపోసి చూడుమా; తత్త్వబుద్ధి¯ నీ లోకపాలకు లెవ్వని వశగతి¯ వలఁ బడ్డ పక్షుల వర్తనమునఁ (414.1) జిక్కి చేష్టలు చేయుచుఁ జింతగాంతు¯ రట్టి మృత్యు బలంబుల నాత్మజయము¯ తమదిగాఁ గోరి యజ్ఞాన తంత్రు లగుచుఁ¯ గమలలోచను లీలా వికారములను. (415) మెఱయ యంత్రమయం బైన మృగము భంగి¯ దారునిర్మితమైనట్టి తరణిపోల్కి¯ శక్ర! యెఱుఁగుమ యీ భూతజాల మెల్ల¯ దళిత పంకేరుహాక్షు తంత్రంబు గాఁగ. (416) మఱియు; భూతంబులచేతను, నింద్రియంబులచేతను, నవశుండైన పురుషుండు ప్రకృతిచేత వేఱుచేయంబడిన యాత్మం బరమేశ్వరానుగ్రహంబు వాసి సుఖియించుచుండు; నవిద్వాంసుండైన వాఁ డనవరతంబుఁ దన్ను స్వతంత్రుంగాఁ దలంచుచుండు; భూతంబుల వలన భూతంబులు పుట్టుచుండును; నా భూతంబులు భూతంబులచేత భక్షింపబడుచుండు; పురుషున కాయువు, శ్రీయును, గీర్తియు, నైశ్వర్యంబును మొదలైనవి యనుభవింప నెంతగాలంబు ప్రాప్తం బంత గాలంబు నివసించు, ప్రాప్తంబు దీఱినఁ బురుషుండు జాలిం బొందిన నవి యుండక పోవుచుండును; కావున గుణంబును నవగుణంబును గీర్త్యప గీర్తులును, జయాపజయంబులును, సుఖదుఃఖంబులును, జావుబ్రతుకులును, సమంబులై కలుగుచుండు; నజ్ఞాని యైన వానికి సత్త్వరజస్తమో గుణంబులు గలిగి యుండు; నట్టివానికి గుణమయంబులైన యింద్రియాదులే యాత్మ యని తోఁచుచుండును; కావున వాఁ డా గుణంబులచేత బద్ధుం డగు; నా గుణంబులకు సాక్షి మాత్రంబగు శరీరంబు వేఱని యెవ్వఁ డెఱుంగనోపు, వాఁ డా గుణంబులచేత బద్ధుండు గాఁడు; కావున గుణంబులును, గుణియు, భోక్తయును, భోగ్యంబును, జయంబును, నపజయంబును, హర్తయును, హాన్యంబును, నుత్పత్తిస్థితిలయకర్తయై, సర్వోత్కృష్టుండైన యప్పరమేశ్వరుండె కాని యన్యంబు లే; దిప్పు డొక్క హస్తంబు నాయుధంబునుం బోయినను భవత్ప్రాణాహరణంబునకు సమర్ధుండ నగుచున్న నన్నుం జూడు"మని వృత్రాసురుండు మఱియు నిట్లనియె. (417) "వాహనంబులు సారెలు వాఁడిశరము¯ లూర్జి తాక్షము లసువులె యొడ్డణములు¯ గాఁగఁ బోరెఁడు నీ ద్యూతకర్మమందు¯ నెసఁగ జయమును నపజయ మెవ్వఁ డెఱుఁగు? " (418) అనవుడు వృత్రుమాటలకు నద్భుత మంది సురేంద్రుఁ డెంతయుం ¯ దన మదిఁ గుత్సితం బుడిగి దైవముగా నతనిన్ భజించి కై ¯ కొనియెఁ గరంబునన్ దిగువఁ గూలిన వజ్రము, నప్పు డాత్మలోఁ¯ దనరె జగంబు లన్నియు ముదంబునఁ బొందిరి ఖేచరావళుల్. (419) రాహుగ్రహ వక్త్ర గుహా¯ గేహాంతము వాసి వచ్చి కిరణావళి స¯ ద్భాహుళ్య మొప్ప వెలిఁగెడు¯ నా హరిదశ్వుండుఁ బోలె హరి యొప్పె నృపా! (420) ఇట్లు కరకలిత వజ్రాయుధ రుఙ్మండల మండిత దిఙ్మండలుం డైన జంభారి గంభీర వాక్యంబుల విస్మయ మందస్మిత ముఖారవిందుం డయి వృత్రున కిట్లనియె. (421) "ఓ! దానవేంద్ర! నీ మతి¯ వేదాంతముఁ బోలెఁ దత్త్వ విజ్ఞాన కళా¯ మోదము నీ వతిభక్తుఁడ¯ వాదిమ పురుషునకు హరికి నబ్జాక్షునకున్. (422) లోకములెల్ల నిండి తన లోనుగ సర్వముఁజేసి ప్రాణులన్¯ దీకులఁ బెట్టి యెల్లడలఁ దీప్తులు చూపెడి విష్ణుమాయ నేఁ¯ డేకమతిన్ దలంచి తిది యేల? మహాసురురూపు మాని సు¯ శ్లోకుఁ బురాణపూరుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్. (423) ఏ నియమంబు సల్పితివొ? యెట్టి మహాతప మాచరించితో¯ పూని రజోగుణాభిరతిఁ బొందిన నీ మతి శాంతి దాంతి స¯ మ్మానస మానసానుభవ మత్తమరాళుఁ డరోష భావ స¯ మ్మానుఁ డమేయుఁ డా దనుజమర్దను భక్తి పొసంగె నెంతయున్. (424) నారాయణ రూ పామృత¯ పారావారమునఁ దేలు భక్తుఁడు దా భూ¯ దారకరఖాత కోదక¯ పూరంబులు నేల తృప్తిఁ బొందు మహాత్మా!" (425) ఇట్లు పలుకుచున్న యింద్రు నుపలక్షించి, వృత్రాసురుం డా యోధన దుర్మర్షణ సంఘర్ష మానసుండై వైరిం బురికొల్పు కొని, వామహస్తంబునం బరిఘంబుఁ ద్రిప్పుచు నుప్పరంబునం గుప్పించుచు, బ్రహ్మాండ కర్పరంబు నిష్ఠుర భైరవారావంబునం బగిలించుచు, సముత్తుంగ మత్తమాతంగ పుంగవంబు వృషభంబుపైఁ గవియు భంగి సుర వృషభు పేరురంబుపలక్షించి, భీషణాశని నిపాత వేగంబునం గొట్టిన నింద్రుండు కులిశ ధార నప్పరిఘంబుఁ దునిమితోడన శేష ఫణా విశేష భాసురం బయిన బాహుదండంబు ఖండించె; నప్పుడు వృత్రుండు భిన్న బాహు ద్వయ మూలుండై రక్తధారలం దోఁగుచు వజ్రిచేతఁ బక్షహతం బై దివంబుననుండి జాఱుచున్న కులపర్వతంబునుం బోలెఁ జూపట్టి ప్రళయకాల సంహార నిటలచ్చటచ్ఫటార్భట కఠోర కీలా భీలాగ్ని సమాన క్రూర కుటిల నిరీక్ష దుర్నిరీక్షుండయి, భూనభో మండలంబులఁ గ్రింది మీఁది దౌడల హత్తించి, నభోమండలంబునుం బోలెఁ దుది మొద లెఱుంగ రాక, వికృతంబుగా వక్త్రంబు దెఱచి, మందర మథన మధ్యమాన విషధర విషమజిహ్వాభీలం బగు నాలుక నభంబు నాకుచుఁ గాలసంహారకారణుం డయిన కాలుని భుజదండ మండితంబగు దండంబునుం బోలిన దంష్ట్రలచేత జగత్త్రయంబును మ్రింగెడువాఁడునుం బోలె నతిమాత్ర మహాకాయుం డయి, పర్వతంబులం దలంగ మీటుచు నడగొండయుం బోలె నభోభాగ భూభాగంబుల నాక్రమించి; యప్పుడు. (426) కాలమునాటి మృత్యవుముఖంబునఁ బోలెను విస్ఫులింగముల్¯ గ్రాలఁగ దేవసంఘములు గంపమునొంద జగంబు లెల్ల నా¯ హా లుఠి తారవం బెసఁగ నభ్రగజంబును నాయుధంబుతో¯ నాలుకఁ జుట్టి పట్టి సురనాథుని మ్రింగె మహాద్భు తాకృతిన్. (427) లోక మెల్ల నపుడు చీఁకాకు పడెఁ దమం¯ బడరె నుడుగణంబు లవనిఁ బడియె; ¯ సోనవాన గురిసె సూర్యచంద్రాగ్నుల¯ రశ్ము లడఁగె దిశలు రభస మయ్యె. (428) అప్పుడు. (429) కందఁడు భీతి గుందఁడు ప్రకంపనమొందఁడు పెద్దనిద్దురం¯ జెందఁడు తత్తఱింపఁడు విశేషముఁ జొప్పఁడు వైష్ణవీ జయా¯ నందపరైక విద్యను మనంబునఁ దాల్చుచు నుండెఁ గాని సం¯ క్రందనుఁడా నిశాచరుని గర్భములో హరిరక్షితాంగుఁడై. (430) ఇట్లు కవచరూప శ్రీనారాయణ కృపాపాలితుండై యోగబలంబున బలభేది యతని యుదరంబు వజ్రాయుధంబున భేదించి యైరావణ సహితుండై వెడలి, యతని కంధరంబు తెగనడువ వజ్రంబుఁ బ్రయోగించిన, నతి నిష్ఠురవేగంబున వృత్రు హరణార్థంబుగం దిరుగుచు సూర్యాది గ్రహ నక్షత్రంబులకు దక్షిణోత్తర గతి రూపంబయిన సంవత్సర సంధియందు నహోరాత్ర మధ్యంబున వృత్రు శిరంబు పర్వత శిఖరంబునుం బోలెఁ ద్రుంచి కూలంద్రోచె; నప్పుడు. (431) మొరసెన్ దుందుభు లంబరంబునఁ గడున్ మోదించి గంధర్వులున్¯ సురలున్ సాధ్యులు సిద్ధులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్ను భీ ¯ కర తేజోవిభవప్రకాశకర విఖ్యాతైఁక మంత్రంబులం¯ దిర మొప్పం బఠియించుచుం గురిసి రెంతేఁ గ్రొత్త పూ సోనలన్. (432) ఏమి చెప్ప నప్పు డింద్రారి తనువున¯ నొక్క దివ్యతేజ ముబ్బి వెడలి¯ లోకమెల్లఁ జూడ లోకులు చూడని¯ లోక మరసి విష్ణులోను చొచ్చె. (433) ఇట్లు లోకభీకరుండై వృత్రాసురుండు గూలిన, నఖిల లోకంబులు బరితాపంబు లుడిగి సుస్థితిం బొందె; దేవర్షి పితృగణంబులు దానవుల తోడంగూడి, యింద్రునకు జెప్పక తమతమ స్థానంబులకుం జని;"రనిన విని, పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. (434) "ఏమి కారణమున నింద్రుతోఁ బలుకక¯ సురలు పోయి? రట్టి సురగణంబు¯ లెందుచేత సుఖముఁ జెందిరి? వజ్రికిఁ¯ జేటు గలుగు టెట్లు? చెప్పవయ్య! " (435) అనిన శుకుం డిట్లనియె "వృత్రపరాక్రమ చకితులయిన నిఖిల దేవతలును, మహర్షి గణంబులును, మున్ను వృత్రవధార్థం బింద్రునిం బ్రార్థించిన నతండు బ్రహ్మహత్యకుం జాలక, "తొల్లి విశ్వరూపునిం జంపిన పాపంబు స్త్రీలయందును, భూమియందును, జలంబులందును, ద్రుమంబులందును విభజించి పెట్టితిని; ఇప్పు డీ హత్య యేరీతిం బాపుకొనువాఁడ? నా కశక్యం"బనిన మహర్షు "లశ్వమేధ యజ్ఞంబు చేయించి, యజ్ఞపురుషుం డైన శ్రీ నారాయణదేవుని సంతుష్టునిం జేసి యీ హత్యం బాపంగలవారము; స్వభావంబున బ్రాహ్మణ పితృ గో మాతృ సజ్జన హంతలైనవార లే దేవునిం గీర్తించి శుద్ధాత్ము లగుదు; రద్దేవుని నశ్వమేధ మహామఖంబున శ్రద్ధాన్వితుండవై సేవించిన నీకు ఖలుండైన యిద్దురాత్ముని హింసించిన హత్య యేమి చేయంగల?"దని యొడంబఱచిన, నింద్రుండు వల్లె యని యివ్విధంబున మార్తునిం బరిమార్చి, బ్రహ్మహత్యం బొంది, యత్తాపంబు భరియింప నోపక దుర్దశం బొందె; నప్పుడు. (436) పాపంబుఁ జండాలరూపంబు గలదాని¯ ముదిమిచే నొడలెల్ల గదలుదాని ¯ క్షయకుష్ఠరోగ సంచయకృతం బగుదాని¯ నురురక్తపూరంబు దొరఁగుదాని¯ నరసిన వెండ్రుకల్ నెరసిన తలదాని¯ నటఁ బోకుపో కుండు మనెడుదానిఁ¯ గదరు కంపునఁ బ్రేవు లద రఁజేసెడుదానిఁ¯ దా నెందుఁ బాఱిన దఱుముదాని (436.1) "నా గుణంబు లెల్ల భోగింప కేరీతి¯ నరుగ నెంతవాఁడ"వనెడుదాని¯ బిట్టు దిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో¯ దేవనాయకుండు దెరలి పఱచె. (437) ఇట్లతి వికృతత్వంబుతో బ్రహ్మహత్య వెనుతగుల నింద్రుండు నభోభాగ భూభాగ దిగ్భాగంబు లెల్లం దిరిగి, చొరం దెరువులేక దీర్ఘ నిర్ఘాతాటోప నిశ్వాస దూషితుండై, యీశాన్య భాగంబునకుం బఱచె; యద్దెస నమేయపుణ్యగణ్యంబైన మానస సరస్సునం బ్రవేశించి, యం దొక్క కమలనాళంబు చొచ్చి తంతువులం గలసి రూపంబు లేక యలబ్ధభోగుం డై, బ్రహ్మహత్యా విమోచనంబుఁ జింతించికొనుచు, సహస్ర వర్షంబు లుండె నా చండాలియు నది పరమేశ్వర దిగ్భాగం బగుటం జేసి, యందు జొరరాక కాచియుండె, నంతకాలంబుఁ ద్రిదివంబున నహుషుండు విద్యాబల తపోబల యోగబలంబులం బాలించుచుండి, సంప దైశ్వర్య మదాంధుండై, యింద్ర పత్నిం గోరి, యింద్రుండు వచ్చునందాక నాకుం బత్నివి గమ్మనిన, నా శచీదేవి బృహస్పతి ప్రేరితయై, బ్రహ్మర్షి వాహ్యశిబిక నెక్కి వచ్చి, నన్ను భోగింపు మనిన నతం డట్ల చేసి, కుంభ సంభవ శాపహతుండై, యజగర యోనియందుఁ బుట్టె; నంత నింద్రుండు బ్రహ్మర్షి గణోపహూతుండై, త్రిదివంబునకు వచ్చె, నంత కాలంబు నారాయణ చరణారవింద ధ్యానపరుండై యుండుటం జేసియు, దిశాధినాథుం డైన శంకరుచేత రక్షింపఁబడ్డవాఁడై యుండుటం జేసియు, దద్దోష బలంబు దఱఁగి సహస్రాక్షుం బీడింప లే దయ్యె; నప్పు డింద్రుండు నిజైశ్వర్యంబునుం బొంది బ్రహ్మర్షి పరివృతుండై, మహాపురుషారాధనంబు చేసి, హయమేధాధ్వరంబునకు దీక్షఁ గైకొని, బ్రహ్మవాదులచేత నాదరింపఁ బడుచున్న వాఁడై, సర్వదేవతామయుండైన నారాయణుం బరితృప్తుం జేసి, మంచు విరయించు మార్తాండుని చందంబునఁ ద్వాష్ట్రవధరూప పాపంబు నాశంబు నొందించి, సకల దివిజ యక్ష గంధర్వ సిద్ధ మునిజన సంస్తూయ మానుండయి, త్రిభువనైశ్వర్య భోగభాగ్యంబులం గైకొనియె; నప్పుడు. (438) సతత మరీచిముఖ్య మునిసంఘముచేత యథోచితంబుగాఁ¯ గృత ఘన వాజిమేధమునఁ గేశవు నీశుఁ బురాణపూరుషున్¯ హితు జగదీశు యజ్ఞపతి నిష్టఫలప్రదు నంతరంగ సం¯ గతు భజియించి వజ్రి గతకల్మషుఁడై నెగడెన్ మహీశ్వరా! (439) మఱియుఁ బుట్టింపంగ మనసు పెట్టిన యట్టి¯ క్రూరకర్మాంబోధి కుంభజుండు¯ అంగారములు చేయ నాహుతిఁ గన నోపు¯ బహు పాపకానన పావకుండు¯ కందక దిగ మ్రింగి గఱ్ఱునఁద్రేపంగఁ¯ గల్మషగరళ గంగాధరుండు¯ ఘనగుహాంతరములఁ గాలూన నియ్యని¯ కలుష దుస్తర తమో గ్రహ విధుండు (439.1) సకల ముక్తిలోక సామ్రాజ్య సమధిక¯ సహజ భోగ భాగ్య సంగ్రహైక¯ కారణాప్రమేయ కంజాక్ష సర్వేశ¯ కేశవాది నామ కీర్తనంబు. (440) అఖిల దుఃఖైక సంహారాది కారణం¯ బఖిలార్థ సంచ యాహ్లాదకరము¯ విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం¯ బనుపమ భక్త వర్ణనరతంబు¯ విబుధహర్షానేక విజయ సంయుక్తంబు¯ గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు ¯ బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు¯ గమనీయ సజ్జన కాంక్షితంబు (440.1) నైన యీ యితిహాసంబు నధిక భక్తి¯ వినినఁ జదివిన వ్రాసిన ననుదినంబు¯ నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి¯ కర్మనాశము సుగతియుఁ గల్గు ననఘ! " (441) నావుడు "యోగీంద్ర! నామనం బీ వృత్రు¯ వివరంబు నీచేత విన్న మొదలు¯ కడు నద్భుతంబునఁ గళవళం బందెడుఁ¯ గోరి రజస్తమోగుణములందు¯ వర్తించు నీ పాపవర్తికి నే రీతి¯ మాధవ పదభక్తి మది వసించె? ¯ సత్త్వ స్వభావు లై సమబుద్ధు లై తపో¯ నియమ ప్రయత్ను లై నిష్ఠచేత (441.1) నిర్మలాత్మకు లై నట్టి ధర్మపరుల¯ కమరులకుఁ బుణ్యమునులకు నంబుజాక్షు¯ భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన¯ భక్తి వీనికిఁ బోలె నేర్పాటుగాదు. (442) భూస్థలిఁ గల రేణువులకన్న దట్టమై¯ కడు నొప్పు జీవసంఘములు గలవు; ¯ ఆ జీవములలో ననరయ ధర్మాయత¯ మతి వసించినవారు మనుజజాతి; ¯ ఆ మనుష్యులలోనఁ గామంబుఁ బెడఁబాసి¯ మోక్షార్థు లగువారు మొదల నరిది; ¯ మోక్షమార్గం బాత్మమూలంబుగా నుండు¯ వారిలో ముక్తులు లేరు తఱచు; (442.1) ముక్తు లై నట్టి వారిలో యుక్తిఁ దలఁపఁ¯ జాల దుర్లభుఁ డమిత ప్రశాంతి పరుఁడు¯ పరమ సుజ్ఞాన నిరతుండు భద్రగుణుఁడు¯ రమణ శ్రీవాసుదేవపరాయణుండు. (443) సకలలోకాపకారి దుస్సంగతుండు¯ వృత్రుఁ డే క్రియ సుజ్ఞాన వేది యయ్యె? ¯ సమరమునఁ బౌరుషంబుచే నమరవిభుని¯ నెట్లు మెప్పించె? దీని నాకెఱుఁగఁ జెపుమ."