పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 317 - 400

వృత్రాసుర వృత్తాంతము

(317) హతపుత్రం డగు విశ్వరూపజనకుం డా త్వష్ట దుఃఖాయతో¯ ద్ధత రోషానల దహ్యమానుఁ డగుచుం దా నింద్రుపై మారణ¯ క్రతు హోమం బొనరింప నందుఁ బొడమెం గల్పాంతకాకార వి¯ శ్రుత కీలానల నిష్ఠురేక్షణగుణక్షుభ్యత్త్రిలోకోగ్రుఁడై. (318) యుగము ద్రుంగెడునాఁడు జగములు పొలియించు¯ నంతకుమూర్తిపై నింత యగుచుఁ; ¯ బఱపును బొడువును బ్రతిదినంబును నొక్క¯ శరపాత మంగంబు విరివిగొనుచుఁ, ¯ గడు దగ్ధ శైల సంకాశ దేహము నందుఁ¯ గరము సంధ్యారాగకాంతి బెరయ; ¯ మును గాఁక రాగిచేఁ గనుమించు మించులఁ¯ గఱకుమీసలు కచాగ్రములు మెఱయఁ; (318.1) జండ మధ్యాహ్న మార్తాండ మండ లోగ్ర¯ చటుల నిష్ఠుర లోచనాంచల విధూత¯ దశ దిశాభాగుఁ డుజ్జ్వలతర కరాళ¯ భిదుర సునిశిత దంష్ట్రోరు వదనగుహుఁడు. (319) నింగికి నేలకుం బొడవు నిచ్చలమై శిఖలందుఁ బర్వు ను¯ త్తుంగత రాగ్నిజాలములఁ దొట్రిలుచున్ గ్రహపంక్తి జాఱ ని¯ స్సంగ కరాళ శాత ఘన సద్ఘృణి మండల చండ శూలము¯ ప్పొంగుచుఁ గేల లీలఁ గొని భూమిచలింపఁగ సోలియాడుచున్. (320) వదలక విరివిగా వదనంబుఁ దెఱచుచు¯ నాకాశమంతయు నప్పళించుఁ; ¯ గడనాల్క నిగిడించి గ్రహతారకంబుల¯ నయ మెల్ల దిగజాఱ నాకి విడుచు; ¯ నలవోకయునుబోలె నట్టహాసము చేసి¯ మెఱసి లోకములెల్ల మ్రింగఁ జూచుఁ; ¯ దనరు దిగ్దంతి దంతములు చెక్కలువాఱ¯ నుగ్రదంష్ట్రలు ద్రిప్పు నుక్కుమిగిలి; (320.1) త్వష్ట బలితంపుఁ దపమునఁ బుష్టినొంది¯ యఖిల లోకంబు లెల్లఁ దా నాక్రమించి¯ వృత్రనాముండు దేవతాశత్రుఁ డగుచు¯ దారుణాకారుఁ డఖిల దుర్దముఁడు మెఱసె. (321) అట్టి వృత్రునిమీఁద దేవత లల్కతోఁ బెనుమూఁక లై¯ చుట్టిముట్టి మహాస్త్రవిద్యలు చూపి యేపున నేయ నా¯ గొట్టువీరుఁడు వార లేసిన క్రూరశస్త్రము లన్నియుం¯ జుట్టి పట్టుక మ్రింగి శూరత జోక నార్చె మహోగ్రుఁడై. (322) భక్షితదివ్యాస్త్రుం డగు¯ రక్షోనాయకుని నమరరాజప్రముఖుల్¯ వీక్షింప వెఱచి పఱచిరి¯ రక్షకుఁ జింతించు కొనుచు రయ మొప్పారన్. (323) ఇట్లు సర్వసాధనంబులతోడ సాధుజనంబుల వృత్రాసురుండు మ్రింగిన, నచ్చరుపడి చేయునది లేక త త్తేజోవిశేష విభవంబునకు భయంబు నొంది, కందిన డెందంబునం గుందుచుం, బురందర ప్రముఖు లార్తరక్షకుండగు పుండరీకాక్షునకుం గుయ్యిడు వారలై. (324) "వీఁడు కడు దుర్దముఁడు వాఁడి మన కైదువులు;¯ పోఁడి చెడఁగా మెసఁగి యీడు గనకున్నాఁ; ¯ డేడ బ్రతుకింకఁ? బెనుకీడు పొడమెన్ మనకుఁ;¯ దోడుపడ నొక్కరుఁడు లేఁడు హరి దక్కన్; ¯ వేఁడుదము శ్రీధరునిఁ; గూడుదము సద్భటులఁ;¯ బాడుదము గీతముల; జాడఁపడు నంతన్¯ వీఁడు చెడు త్రోవ దయతోడ నెఱిగించు ఘనుఁ;¯ డోడక సురాలయము పాడుపడ దింకన్. " (325) అని తలపోయుచుఁ దమలో¯ మునుకుచుఁ దికమకలు గొనుచు మురరిపు కడకున్¯ గునుకుచుఁ దినుకుచుఁ నేగిరి¯ ఘనరాక్షసుఁ గన్న కన్నుఁగవ బెగ్గిలఁగన్. (326) ఇట్లు భయార్తులై యమర్త్యవ్రాతంబు చనిచని ముందట నభంగ భంగ రంగ దుత్తుంగ డిండీర మండల సముద్దండాడంబర విడంబిత నారాయణ నిరంతర కీర్తిలతా కుసుమగుచ్ఛ స్వచ్ఛంబును, అనవరత గోవింద చరణారవింద సేవా సమాకుల కలకలఫలిత మహాపుణ్య ఫలాయమాన సముద్దీపితావర్తవర్తిత దక్షిణావర్త రుచిర శంఖమండల మండితంబును, నతినిష్ఠుర కఠిన పాఠీన పృథురోమ రాజిసంకుల తిమి తిమింగిల కర్కట కమఠ కచ్ఛప మకర నక్ర వక్రగ్రహ గ్రహణ ఘుమఘుమారావ దారుణగమన విషమిత విషమ తరంగఘట్టన ఘట్టిత సముద్ధూత శీకర నికర నీరంధ్ర తారకిత తారాపథంబును, మహోచ్ఛ్రయ శిలోచ్చయ శిఖరాగ్ర ప్రవహిత దుగ్ధనిర్ఝర సమ్మార్జిత పురాణపురుష విశుద్ధ శుద్ధాంత విహరణధురీణ నవవసుధాధౌత ధావళ్య ధగద్ధగాయమాన రమ్య హర్మ్య నిర్మాణ కర్మంబును, నతి పవిత్రగుణ విచిత్ర నిజకళత్ర ప్రేమానంద సందర్శిత ముకుంద పరిస్రవదంతరంగ కరుణారస పరిమిళిత భావబంధుర విద్రుమ వల్లీమతల్లి కాంకుర శోభితంబును, ప్రసిద్ధ సిద్ధరసాంబువాహ సంగమ సముత్థిత గంభీర ఘోష పరిదూషిత సకల రోదోంతరాళంబును, సముద్రమేఖలాఖిల ప్రదేశ విలసిత నవీన దుకూలాయమానంబును, హరిహర ప్రముఖ దేవతానిచయ పరిలబ్ధామృత మహైశ్వర్య దానధౌరేయ మహానిధానంబును, వైకుంఠపుర పౌరవర కామ్యఫలఫలిత మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందన ఘన వనానుకూలంబు నునై యొప్పుచుఁ గుబేరు భాండాగారంబును బోలెఁ బద్మ, మహా పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర సమగ్రంబై, విష్ణు కరకమలంబునుం బోలె సుదర్శనావర్త ప్రగల్భంబై, కైలాస మహీధరంబునుం బోలె, నమృతకళాస్థాన శేఖరపదార్పణంబై, యింద్ర వైభవంబునుం బోలెఁ గల్పవృక్ష, కామధేను, చింతామణి జనితంబై, సుగ్రీవసైన్యంబునుం బోలె నపరిమిత నిబిడ హరిసంచారంబై, నారా యణోదరంబునుం బోలె నఖిల భువన భారభరణ సమర్థంబై, శంకరు జటాజూటంబును బోలె గంగాతరంగిణీ సమాశ్రయం బై, బ్రహ్మలోకంబునుం బోలె బరమహంసకుల సేవ్యంబై, పాతాళ లోకంబునుం బోలె ననంత భోగి భోగయోగ్యంబై, నందనవనంబునుం బోలె నైరావత మాధవీ రంభాది సంజననకారణంబై, సౌదామినీ నికరంబునుం బోలె నభ్రంకషంబై, విష్ణునామకీర్తనంబునుం బోలె నిర్మలస్వభావంబై, క్రతు శతగతుండునుం బోలె హరిపదభాజనంబై యొప్పుచున్న దుగ్థవారాశి డాసి, శ్వేతద్వీపంబున వసియించి, యందు సకల దిక్పాలకాది దేవతలు దేవదేవు నాశ్రయించి యిట్లని స్తుతియించి; రంత. (327) "పంచమహాభూత పరినిర్మితంబైన¯ ముజ్జగంబుల కెల్ల నొజ్జ యైన ¯ బ్రహ్మయు నేమును బరఁగ నందఱుఁ గూడి¯ యెవ్వనికై పూజలిత్తు మెపుడు¯ నట్టి సర్వేశ్వరుం డాగమ వినుతుండు¯ సర్వాత్మకుఁడు మాకు శరణ మగును¯ అతిపూర్ణకాము నహంకారదూరుని¯ సముని శాంతునిఁ గృపాస్పదుని గురుని (327.1) మాని యన్యుని సేవింపఁ బూనునట్టి¯ కపటశీలుని నతి పాపకర్మబుద్ధి¯ శునక వాలంబు పట్టుక ఘనతరాబ్ధి¯ దరియఁ జూచుట గాదె? తాఁ దామసమున. (328) ఉదకమయంబునన్ వసుధ నోడగఁ జేసి తనర్చు కొమ్మునన్¯ వదలక యంటఁగట్టి మనువల్లభుఁ గాచిన మత్స్యమూర్తి స¯ మ్మదమున మమ్ము బ్రోచు ననుమానము మానఁగ వృత్రుచేతి యా¯ పద దొలగించి నేఁడు సురపాలుర పాలిటి భాగ్య దైవమై. (329) రంతు చేయుచు వాతధూత కరాళ భంగుర భంగ దు¯ ర్దాంత సంతత సాగరోదక తల్ప మొంది వసించు బ¯ మ్మంతవానిని బొడ్డుఁదమ్మిని నాఁచి కాచిన నేర్పరిం ¯ తంతవాఁ డనరాని యొంటరి యాదరించు మముం గృపన్. (330) దేవతలమైన మే మిట్టి దేవదేవు¯ సర్వలోక శరణ్యుని శరణు చొచ్చి¯ బలితమైనట్టి వీని యాపదలఁ బాసి¯ మీఱి శుభములఁ జేకొనువార మిపుడు." (331) ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుం డయ్యె నప్పుడు. (332) తగు శంఖ చక్ర గదా ధరుం డగువానిఁ¯ శ్రీవత్స కౌస్తుభ శ్రీల వానిఁ¯ గమనీయ మాణిక్య ఘన కిరీటమువాని¯ దివ్యవిభూషణ దీప్తివాని¯ మండిత కేయూర కుండలంబులవాని¯ సిరి యురస్థలమునఁ జెలఁగు వానిఁ¯ దనుఁబోలు సేవకతండంబు గలవానిఁ¯ జిలుగైన పచ్చని వలువవాని (332.1) దెల్ల దమ్మివిరులఁ దెగడు కన్నులవాని¯ నవసుధాద్రవంపు నవ్వువానిఁ¯ గనియె వేల్పుపిండు కప్పరపాటుతోఁ¯ గన్నులందు నున్న కఱవు దీఱ. (333) తన సేవకులలోనఁ దడఁబడు రూపంబు¯ శ్రీవత్స కౌస్తుభ శ్రీలఁ దెలుప¯ వికచాబ్జములతోడ వీడ్వడు కన్నుల¯ కడలు దైవాఱెడు కరుణఁ దెలుప¯ నెల్ల లోకములకు నిల్లైన భాగ్యంబుఁ¯ గాపురం బుండెడు కమల దెలుప¯ మూఁడుమూర్తులకును మొదలైన తేజంబు¯ ధాతఁ బుట్టించిన తమ్మి దెలుప (333.1) బుద్ధిఁ బోల్పరాని పుణ్యంబుఁ దత్పాద¯ కమల జనిత యైన గంగ దెలుప¯ నప్రమేయుఁ డభవు డవ్యక్తుఁ డవ్యయు¯ డాదిపురుషుఁ డఖిలమోది యొప్పె. (334) ఇట్లు జగన్మోహనాకారుండయిన నారాయణుని కృపావలోక నాహ్లాద చకిత స్వభావ చరితులై సాష్టాంగదండప్రణామంబు లాచరించి ఫాలభాగ పరికీలిత కరకమలులై యిట్లనిరి. (335) "దుర్గమంబు లయిన స్వర్గాది ఫలములఁ¯ బుట్టఁజేయఁ జాలునట్టి గుణము¯ గలిగి మెలఁగుచున్న ఘనుఁడ వై నట్టి నీ ¯ కరయ మ్రొక్కువార మాదిపురుష! (336) దండంబు యోగీంద్రమండల నుతునకు¯ దండంబు శార్ఙ్ఘ కోదండునకును; ¯ దండంబు మండిత కుండల ద్వయునకు¯ దండంబు నిష్ఠుర భండనునకు; ¯ దండంబు మత్తవేదండ రక్షకునకు¯ దండంబు రాక్షసఖండనునకు; ¯ దండంబు పూర్ణేందు మండల ముఖునకు¯ దండంబు తేజః ప్రచండునకును; (336.1) దండ మద్భుత పుణ్యప్రధానునకును; ¯ దండ ముత్తమ వైకుంఠధామునకును; ¯ దండ మాశ్రిత రక్షణ తత్పరునకు; ¯ దండ మురు భోగినాయక తల్పునకును. (337) చిక్కిరి దేవతావరులు చిందఱ వందఱలైరి ఖేచరుల్; ¯ స్రుక్కిరి సాధ్యసంఘములు; సోలిరి పన్నగు లాజి భూమిలో; ¯ మ్రక్కిరి దివ్యకోటి; గడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ¯ చిక్కినవారి నైన దయచేయుము నొవ్వకయండ నో! హరీ! (338) మొదలాఱిన రక్కసులకు¯ మొదలై మా కాపదలకు మూలం బగుచుం¯ దుద మొదలు లేని రక్కసు¯ తుది చూపఁ గదయ్య! తుదకుఁ దుది యైన హరీ! (339) అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు¯ నొక్క దిక్కును లేదు కాలూనఁ నైన; ¯ దిక్కుగావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి¯ దిక్కు లేకున్నవారల దిక్కు నీవ. (340) నీ దిక్కు గానివారికి¯ నే దిక్కును లేదు వెదక యిహపరములకున్¯ మోదింపఁ దలఁచువారికి¯ నీ దిక్కే దిక్కు సుమ్ము; నీరజనాభా! (341) అరయ మాతేజములతోడ నాయుధములు ¯ మ్రింగి భువన త్రయంబును మ్రింగుచున్న¯ భీకరాకారు వృత్రునిఁ బీచ మడఁచి¯ యెల్ల భంగుల మా భంగ మీఁగు మభవ! (342) పరమపురుష! దుఃఖభంజన! పరమేశ! ¯ భక్తవరద! కృష్ణ! భవవిదూర! ¯ జలరుహాక్ష! నిన్ను శరణంబు వేఁడెద¯ మభయ మిచ్చి కావవయ్య! మమ్ము. (343) నమస్తే భగవన్నారాయణ! వాసుదేవ! యాదిపురుష! మహానుభావ! పరమమంగళ! పరమకళ్యాణ! దేవ! పరమకారుణికు లయిన పరమహంస లగు పరివ్రాజకులచేత నాచరితంబు లగు పరమసమాధి భేదంబులఁ బరిస్ఫుటం బయిన పరమహంస ధర్మంబుచేత నుద్ఘాటితం బగు తమః కవాటద్వారంబున రసావృతంబయిన యాత్మలోకంబున నుపలబ్ధమాతృండవై, నిజ సుఖానుభవుండ వై యున్న నీ వాత్మ సమవేతంబు లై యపేక్షింపఁ బడని శరీరంబులకు నుత్పత్తి స్థితి లయ కారణుండ వై యుండుదువు; గుణసర్గ భావితుండవై యపరిమిత గుణగణంబులుగల నీవు, దేవదత్తుని మాడ్కిఁ బారతంత్ర్యంబున నబ్బిన కుశల ఫలంబుల ననుభవించి చింతింతువు; షడ్గుణైశ్వర్యసంపన్నుండవైన నీ వాత్మారాముండ వయి యుండుదువు; గుణసర్గ భావితుండవయి యపరిమిత గుణగణంబు లర్వాచీన వితర్క విచార ప్రమాణభావంబులగు తర్కశాస్త్రంబులఁ గర్కశంబు లయిన ప్రజ్ఞలు గలిగి, దురవగ్రహవాదు లయిన విద్వాంసుల వివాదానుసరణంబుల యందు నుపరతంబులగు నస్తినాస్తీత్యాది వాక్యంబుల సమస్త మాయామయుండ వై నిజ మాయచేతఁ గానంబడక యుక్తిగోచరుండవై, సమస్త విషమ రూపంబులఁ బ్రవర్తింతువు; దేవా! రజ్జువు నందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మం బయిన నీ యందుఁ బ్రపంచ భ్రాంతి గలుగుచుండు సర్వేశ్వరా! సర్వజగత్కారణరూపం బైన నీవు సర్వభూత ప్రత్యగాత్మ వగుటంజేసి సర్వగుణాభావభాసోపలక్షితుడవై కానంబడుదువు, లోకేశ్వరా! భవన్మహిమ మహామృతసముద్ర విప్రుట్సకృత్పాన మాత్రంబున సంతుష్టచిత్తులై, నిరంతర సుఖంబున విస్పారిత దృష్ట శ్రుత విషయ సుఖ లేశాభాసులైన పరమభాగవతులు భవచ్చరణకమల సేవాధర్మంబు విడువరు; త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపమక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నర మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు; భక్తవత్సలా! భవన్ముఖ కమల నిర్గత మధుర వచనామృత కళావిశేషంబుల, నిజ దాసులమైన మా హృదయతాపం బడంగింపుము; జగదుత్పత్తి స్థితి లయకారణ ప్రధాన దివ్య మాయా వినోదవర్తివై సర్వజీవనికాయంబులకు బాహ్యభ్యంతరంబుల యందు బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూప ప్రధానరూపంబుల దేశకాల దేహావస్థాన విశేషంబులఁ, దదుపాదాను భవంబులు గలిగి, సర్వప్రత్యయసాక్షివై, సాక్షాత్పరబ్రహ్మస్వరూపుండవై యుండెడి నీకు నేమని విన్నవించువారము? జగదాశ్రయంబై, వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనం బైన భవదీయ దివ్యచరణ శతపలాశచ్ఛాయ నాశ్రయించెద;"మని పెక్కువిధంబుల వినుతించి యిట్లనిరి. (344) "తేజంబు నాయువును వి¯ భ్రాజిత దివ్యాయుధములుఁ బరువడి వృత్రుం¯ డాజి ముఖంబున మ్రింగెను¯ మా జయ మింకెందుఁ? జెప్పుమా; జగదీశా! " (345) అని యి ట్లతిమనోహర చతుర వచనంబుల భక్తిపరవశులయి వినుతి చేయుచున్న దేవతలం జూచి, య ప్పరమేశ్వరుండమృత ప్రాయంబు లగు గంభీరభాషణంబుల ని ట్లనియె. (346) "మ దుపస్థానం బగు మీ¯ సదమల సుజ్ఞానమునకు సంతోషమునం¯ బొదలె మదిఁ బ్రీతి నొందితి¯ వదలక నా భక్తి పొడమి వ్యర్థం బగునే? (347) మఱియును, బ్రీతుండనైన నాయందు భక్తులకుం బొందరాని యర్థంబు లేదు, విశేషించి నాయందునేకాంతమతి యైన తత్త్వవిదుం డన్యంబులం గోరకుండు; గుణంబుల యందుఁ దత్త్వజ్ఞానగోచరుం డైన వాఁడు విషయనివృత్తచిత్తుండై సంసార మార్గంబు నిచ్ఛింపడు; కావున మీకు శుభం బయ్యెడు; దధీచియను ఋషి సత్తముండు గలం డతని శరీరంబు మద్విద్యాతిశయ మహత్త్వంబునను దేజోవిశేషంబు నను సారవంతంబై యున్నయది; నతని నడిగి, తచ్ఛరీరంబుఁ బుచ్చికొనుం; డతండు పూర్వకాలంబున యశ్వినీదేవతలకు నశ్వశిరోనామం బను బ్రహ్మస్వరూపం బగు నిష్కళంకం బయిన విద్య యుపదేశించిన; వారలు జీవన్ముక్తిత్త్వంబు నొందిరి మఱియు త్వష్టృ పుత్రుండయిన విశ్వరూపునకు మదాత్మకం బయిన యభేద్య కవచంబు నిచ్చెఁ; గావున నతం డతివదాన్యుండు; దేహంబు వంచింపక మీకిచ్చు; నతని శల్యంబులు విశ్వకర్మ నిర్మితంబు లై, శతధారలు గల యాయుధ శ్రేష్ఠంబయి, మత్తేజోపబృంహితం బయి వృత్రాసురశిరోహరణ కారణం బయి యుండు; దానం జేసి మీరు పునర్లబ్ధ తేజోస్త్రాయుధ సంపదలు గలిగి వెలింగెదరు; విశేషించియు మద్భక్తవరులైన వార లే లోకంబుల నెవ్వరికి నజయ్యులు; కావున మీకు భద్రం బయ్యెడు"మని భూతభావనుం డైన భగవంతుం డదృశ్యుం డయ్యె; నప్పుడు దేవతలు దధీచిముని కడకుం జని; ర త్తఱి నింద్రుం డిట్లనియె. (348) "దేహి సుఖము గోరి దేహంబు ఘటియించి¯ దేహి విడువ లేఁడు దేహ మెపుడు; ¯ దేహి! యస్మదీయ దేహంబుకొఱకునై¯ దేహ మీఁగదయ్య! దేవతలకు. (349) ఎక్కడ నెల్ల లోకముల నెవ్వరు గోరని కోర్కి, నేఁడు మా¯ తెక్కలిపాటునన్ దివిరి దేహము వేఁడగ వచ్చినార; మే¯ మెక్కడ? తీవ్ర కర్మగతి యెక్కడ? దైవకృతంబు గాక; యీ¯ రొక్కపు దాన మీ వరుస రోయక వేఁడుదురే జగంబులన్? (350) నీచగతి యెల్లభంగుల¯ యాచన యని తెలిసి తగని దడుగుదు రేనిన్¯ యాచక వర్గము లోపల¯ నీచకులనఁ బడరె? యెంత నేర్పరులైనన్. (351) అడుగంగరాని వస్తువు¯ లడుగరు బతిమాలి యెట్టి యర్థులు నిను నే¯ మడిగితిమి దేహమెల్లను¯ గడు నడిగెడు వారికేడ కరుణ? మహాత్మా! " (352) నావుడునా దధీచియు మనంబున సంతసమంది నవ్వి సం¯ భావిత వాక్య పద్ధతులఁ బల్కుచు నిట్లనెఁ బేర్మితోడ "నో! ¯ దేవతలార! ప్రాణులకుఁ దెక్కలి మృత్యుభయంబు పూనుటే¯ భావములం దలంపరు కృపామతి నెన్నఁడు మీ మనంబులన్. (353) ఎలమి బ్రదుక నిచ్ఛయించిన వారికి¯ దేహ మెల్లభంగిఁ దీపు గాదె? ¯ యచ్యుతుండు వచ్చి యర్థించె నేనిని¯ దన్ను నిచ్చునట్టి దాత గలఁడె? (354) అదియునుం గాక (355) అర్థంబు వేఁడెడు నర్థులు గలరు గా¯ కంగంబు వేఁడెడి యర్థి గలఁడె? ¯ తగు కోరికల నిచ్చు దానశీలుఁడు గల్గుఁ¯ దన దేహ మీ నేర్చు దాత గలఁడె? ¯ యీ నేర్చువాఁడు దన్నిచ్చిన రోయక¯ చంపెడునట్టి యాచకుఁడు గలఁడె? ¯ చంపియుఁ బోవక శల్యంబు లన్నియు¯ నేఱి పంచుక పోవువారు గలరె? (355.1) రమణ లోకమెల్ల రక్షించు వారికి¯ హింస చేయుబుద్ధి యెట్టు పొడమె? ¯ భ్రాతి యైనయట్టి ప్రాణంబుపైఁ దీపు¯ తమకుఁ బోలె నెదిరిఁ దలఁప వలదె?" (356) అనిన నింద్రుం డిట్లనియె. (357) "సర్వ భూతదయాపర స్వాంతులకును¯ బుణ్యవర్తను లగు మిమ్ముబోఁటి వారి¯ కమిత సత్కీర్తి కాముల కలఘుమతుల¯ కియ్యరాని పదార్థంబు లెవ్వి గలవు? (358) అడుగరాని సొమ్ము నడుగ రాదని మానఁ¯ డడుగువాని మాట లడుగ నేల? ¯ భ్రాంతి నడుగుచోటఁ బ్రాణంబు లేనియు¯ నిచ్చువాఁడు దాఁపఁ డిచ్చుఁ గాని." (359) అని పరసంకటంబు దలంపక నిలింపులు గార్యపరతన్ సవినయ వాక్యపరంపరలఁ బ్రార్థించిన, నతండు దరహసితవదనుండై, యఖిల లోకధర్మం బెఱింగియు నొక్కింత కాలంబు ప్రతివాక్యం బిచ్చితి; దీని సహింపదగుదురు; మీయట్టి వారలకుం బ్రియం బగునేని నెప్పుడైన విడువందగిన శరీరంబు విడుచుట యేమి దుర్లభంబు? నధ్రువం బైన యీ దేహంబుచేతం గీర్తి సుకృతంబుల నెవ్వం డార్జింపకుండు నతండు పాషాణాదులకంటె నతి కఠినుండు; మీయట్టి పుణ్యశ్లోకులచేతఁ గాంక్షింపబడిన శరీరం బప్రమేయ ధర్మార్జితం; బే దేహంబుచేత సకలభూతంబులు శోకానుభవంబున శోకించు; హర్షానుభవంబున హర్షించునట్టి మహాకష్ట దైన్యాకరం బైన శరీరంబు కాక శునకసృగాలాదుల పాలు గాకుండ మేలయ్యె; నని నిశ్చితాత్ముం డయి దధీచి దత్త్వాలోకనంబుచేత నిరసిత బంధనుండై, బుద్ధీంద్రియ మానసంబు లతోఁ గూడిన క్షేత్రజ్ఞునిఁ బరబ్రహ్మస్వరూపంబైన భగవంతు నందు నేకీభూతంబు చేసి, యోగజ్ఞానంబున శరీరంబు విడిచె; నప్పుడింద్రుం డతని శల్యంబుల విశ్వకర్మ నిర్మితం బైన, నిశిత శతధారా సమావృతంబై వెలుంగు వజ్రాయుధంబుఁ గైకొని, భగవత్తేజోపబృంహితుం డై, యైరావతారూఢుండై, సకలదేవోత్తమ గరుడ గంధర్వ ఖచర కిన్నర కింపురుష సిద్ధ విద్యాధర పరిసేవితు డై సకల ముని జనంబులు వినుతింపఁ ద్రిలోక హర్షకారియై, భగవదనుగ్రహ సంప్రాప్త మహోత్సాహ వికసిత వదనారవిందుండై వృత్రాసురుపై నడచె; నప్పుడు. (360) వృత్రుఁడు దాన వాన్వయ పవిత్రుఁడు లోకజిఘాంసకక్రియా¯ సూత్రుఁడు నిగ్రహాగ్రహణ సుస్థిర వాక్య వివేక మాన చా¯ రిత్రుఁడు దేవతోరగ దరీకృత వక్త్రుఁడు రోష దూషితా¯ మిత్రుఁడు శత్రురాకఁ గని మిక్కలియైన యుగాంతకాకృతిన్. (361) మెండు గల దనుజ నాయక¯ మండలములు గొల్వ నడచె మహితోద్ధతి వే¯ దండముల నడుమ జను నడ¯ గొండయునుం బోలె నిబిడ గోపోద్ధతుఁడై. (362) కాలగళుఁ డడిరి కడువడిఁ¯ గాలునిపైఁ గవయు మాడ్కి ఖరతర రవ సం¯ చాలిత పూర్వ దిగంతరుఁ¯ డై లీల మహేంద్రుమీఁద నతఁ డరిగె నృపా! (363) ఇట్లు రుద్రగణంబులు, మరుద్గణంబులు, నాదిత్యగణంబులు, నశ్వినీదేవతలుఁ, బితృదేవతలు, విశ్వేదేవులు, వహ్ని, యమ, నైరృతి, వరుణ వాయు, కుబే, రేశా నాదులు, సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, ఖేచరప్రముఖంబు లగు నింద్ర సైన్యంబులతోడ నముచియు, శంబరుండును, ననుర్వుండును, ద్విమూర్ధండును, వృషభుండును, నంబరుండును, హయగ్రీవుండును, శంకుశిరుండును, విప్రచిత్తియు, నయోముఖుండును, బులోముండును, వృషపర్వుండును, హేతియుఁ, బ్రహేతియు, నుత్కటుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, గపిలుండును, విభావసుండును, నిల్వలుండును, బల్వలుండును, దందశూకుండును, వృషధ్వజుండును, గాలనాభుండును, మహానాభుండును, భూతసంతాపనుండును, వృకుండును, సుమాలియు, మాలియు మున్నగు దైతేయ దానవ యక్ష రాక్షసాద్యసంఖ్యంబు లగు వృత్రాసురు బలంబు లంతం దలపడి, సమరంబు చేసి; రప్పుడు. (364) అసురులకున్ సురావళికి నయ్యె మహారణ మప్పు డొండొరుల్ ¯ ముసల గదాసి కుంత శర ముద్గర తోమర భిందిపాల ప¯ ట్టిస పటుశూల చక్రముల ఠేవలు చూపి యదల్చి యార్చుచున్ ¯ మసలక కప్పి రస్త్రముల మార్కొని మంటలు మింట నంటగన్. (365) ఒండొరులఁ గడవ నేసిన¯ కాండము లాకాశపథముఁ గప్పి మహోల్కా¯ దండంబు లొలసి నిష్ఠుర¯ భండన ముఖ మొప్పెఁ జూడఁ బ్రళయోచితమై. (366) సురవరు లేయు బాణములు చూడ్కి కగోచరమై నభస్థలం¯ బఱిముఱి గప్పి రేసి దివసాంతముఁ జేసిన లీల నా సురే¯ శ్వర బలయూధ వీరులను సాయక పంక్తుల చేత వాని రూ¯ పఱ శతధూళిఁ జేసి పఱపైన తమం బొనరించి రార్చుచున్. (367) సమరమదాంధు లై సుర నిశాచర వీరులు సైనికాంఘ్రి సం¯ క్రమిత మహీపరాగములు గ్రమ్మిన నుమ్మలికంపుఁ జీకటుల్¯ తమ కనుదోయి కడ్డముగఁ దార్కొనినం జల మేది పోరి రా¯ క్రమిత నిజాంతరంగ పరిఘట్టిత రోష మహాగ్ని పెంపునన్. (368) అతిగళిత రక్తధారా¯ క్షతములతోఁ గానఁబడిరి సైనికులు మహో¯ ద్ధత రోషవహ్ని కీలలు¯ వితతం బై పెల్లగిల్లి వెడలెడి భంగిన్. (369) ఠవణించు శింజినీ టంకార రవములు¯ భట సింహనాదంబుఁ బరిఢవింప¯ భీషణోత్తమ హయ హేషావిఘోషంబు¯ కరి బృంహితస్ఫూర్తిఁ గ్రందుకొలుప¯ సమర నిశ్శంకాంశ శంఖ నినాదంబు¯ నేమి స్వనంబుల నిహ్నవింపఁ¯ దుములమై చెలఁగెడు దుందుభి ధ్వానంబు¯ లట్టహాసంబుల నాక్రమింప (369.1) ఘటిత శస్త్రాస్త్ర నిష్ఠుర ఘట్టనోత్థ¯ ఖర కఠో రోరు విస్ఫులింగంబు లడరి¯ దివ్య కోటీర మణిఘృణి ధిక్కరింప¯ సమర మొనరించి రసురులు నమరవరులు. (370) ఇట్లు ప్రళయసంరంభ విజృంభిత సముత్తుంగ రంగత్తరంగిత భైరవారావ నిష్ఠ్యూత నిష్ఠుర మహార్ణవంబునుం బోలె యుగాంత సంక్రాంత ఝంఝాపవన పరికంపిత దీర్ఘ నిర్ఘాత నిబిడ నిష్ఠుర నీరదంబులుం బోలె, నుభయ సైన్యంబులు గలసి సంకుల సమరంబు సలుపు సమయంబున, యుగాంత కృతాంత సకలప్రాణి సంహార కారణలీలయుం బోలెఁ, బదాతిరాతి మావంత రథిక మహారథిక వీరు లొండురులు చండగతిం గాండంబులు పఱపుచు, గదలం జదుపుచుఁ, గత్తులఁ గత్తళంబులఁ జినుఁగం బొడుచుచు, నడిదంబుల నఱకుచుఁ, గుంతలంబులం గ్రుచ్చుచు, గుఠారంబుల వ్రచ్చుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులం బాఁదుచుఁ, జక్రంబులం ద్రుంచుచు, సబళంబుల నొంచుచు, చురియల మెఱుముచు, శూలంబులఁ దుఱుముచు, వాజుల కుఱికియు, వాలంబుల నఱికియుఁ, దొడలు తుండించియుఁ, దొండంబులు ఖండించియు, మెడ లెడయించియు, మెదళ్ళు గెడయించియు, నములు ద్రుంచియు, నాసికలు ద్రెంచియుఁ, బదంబుల విఱిచియుఁ, బార్శంబులం జఱచియు, గజంబులఁ బఱపియు, గాత్రంబుల మఱపియుఁ, గుంభంబులఁ బగిలించియుఁ, గొమ్ములఁ బెకలించియు, హస్తంబులఁ దుండించియు, నంగంబులఁ జించియు, రథంబుల చలియించియు, రథికుల బొలియించియు, సారథుల జంపియు, సైంధవంబులఁ దంపియు, శిరంబు నొగిలించియు, సీసకంబు లగిలించియు, ఛత్రంబుల నుఱుమాడియుఁ, జామరంబులం దునుమాడియు, సైన్యంబులఁ జిదిపియు, సాహసుల మెదిపియు, నడుములు ద్రుంచియు, మఱియును బరస్పర గుణవిచ్ఛేదనంబున, నన్యోన్య కోదండ ఖండన పటుత్వంబు నుభయ సైంధవ ధ్వజ సారథి రథిక రథ వికలనంబును, నొండొరుల పాద జాను జంఘా హస్త మస్తక నిర్దళనంబును, రక్త మాంస మేదః పంకసంకలిత సమరాంగణంబునునై యతి ఘోర భంగిం బెనంగి; రప్పుడు. (371) సమజయమున్ సమాపజయ సామ్య పరిశ్రమమున్ సమోరు వి¯ క్రమము సమాస్త్రశస్త్రబల గర్వము నై కడు ఘోర భంగి నా¯ నముచి విరోధి సైన్య గణనాథులతోడ నిశాచరేశ్వ రో¯ త్తములు దురంబుజేసి రొగిఁ దార్కొని వృత్రుబలంబు ప్రాపునన్. (372) అప్పుడు. (373) మొత్తముగఁ బాఱు పెనునెత్తురు మహానదులఁ;¯ దత్తరముతో నుఱికి కుత్తుకలు మోవం¯ జిత్తముల నుబ్బి వెస నెత్తుకొను భూతముల;¯ నత్తుకొని శాకినులు జొత్తిలుచు మాంసం¯ బుత్తలముతో మెసఁగి నృత్తములు జేయు మద;¯ మత్తఘన ఢాకినులు వృత్తగతిఁ బ్రేవుల్¯ బిత్తరములం దిగిచి మెత్తమెదడుల్ మొనసి;¯ గుత్తగొనుచుండ భయవృత్తిఁ గల నొప్పెన్. (374) ఇట్లు దేవదానవులు నర్మదాతీరంబునఁ గృతయుగంబునం దలపడి త్రేతాయుగంబు చొచ్చునంత కాలంబుఁ బోరు దారుణంబుగాఁ జేయు చుండ; నంత వృత్రాసురు భుజబలంబు పెంపునఁ దెంపుచేసి కంపిం పక నిలింపులపై రక్కసులు గుంపులై పెంపు చూపి మహా వృక్ష పాషాణ గిరిశిఖరంబులు వర్షించిన. (375) గిరి పాషాణ మహీజముల్ గుఱియఁగా గీర్వాణులన్నింటి ని¯ ష్ఠుర నారాచపరంపరల్ పఱపుచున్ జూర్ణంబుఁ గావింప ని¯ ర్భర లీలం దమచేయు సత్త్వములు దోర్భంగంబు లై పోవఁగాఁ¯ దెరలన్ రాక్షస యోధవీరుల మదోద్రేకంబు సంఛిన్నమై. (376) ప్రచురముగ రాక్షసావళి¯ ఖచరులపై నేయు నిబిడకాండావళి దు¯ ర్వచనుఁ డెడ నాడు మాటలు¯ సుచరిత్రుని యందుఁ బోలెఁ జొరవయ్యె నృపా! (377) అప్పుడు. (378) అంత సురలేయు నిబిడాస్త్రములపాలై¯ పంతములు దక్కి హత పౌరుషముతో ని¯ శ్చింతగతి రక్కసులు సిగ్గుడిగి భూమిం¯ గంతుగొని పాఱి రపకారపరు లార్వన్. (379) కొండలఁ బోలెడు రక్కసు¯ లొండొరులం గడవఁ బాఱి రుక్కఱి పటు కో¯ దండముఖ సాధనంబులు¯ భండనమున వైచి దివిజపతు లార్వంగన్. (380) ఇట్లు సమరతలంబువాసి తన ప్రాపుమాసి, తీసిపఱచుచుండు దండనాయకులం జూచి, యకుటిలమతిం బకపక నగి వృత్రాసురుం, డిట్లనియె (381) "క్షుల్లకవృత్తి మీ కగునె? శూరుల కిమ్మెయిఁ గీర్తి భోగముల్¯ గొల్లగఁ జేయు చావు మదిఁ గోరినవారల కైనఁ గల్గునే? ¯ తల్లడ మంది యీ సమరధర్మము మాని తలంగఁ బాడియే? ¯ మల్లుఁడు దుర్దమప్రథనమత్తుఁడు వృత్రుని పాటెఱుంగరే? (382) చావు ధ్రువమైన ప్రాణికిఁ¯ జావులు రెం డరసికొనుఁడు సమరమునందున్¯ భావింప యోగమందును¯ జావంగా లేని చెడుగుచావుం జావే? " (383) అని వాసుదేవ తేజోవిశేష విశేషితులై దవానలకీలలం బోలె వెలుంగుచు వెఱచి వెన్నిచ్చి పాఱెడు నసురుల వెనుకొని తఱుము సురవీరులం జూచి హుంకరించి స్వర్గానుభవంబున నిచ్చలేకుండె నేని మదవలోకన స్పర్శన మాత్రంబు ముందర నిలుతురు గాక; యని యేచి కల్పాంతానల్ప ఘనఘనాటోపంబునుం బోలెఁ గఠోరకంఠ హుంకార తర్జనంబులన్ గర్జిల్లుచుఁ, బ్రళయకాల పవన పరిభావిత మహాశిఖిశిఖావళులఁ దృణీకరించు కుటిలావలోకనంబుల నాలోకించుచుం, గాల పరిపక్వ లీలాలోలుండయిన శూలి పోలిక నాభీలమూర్తి యై సకల జీవభార భరణ దుర్భర భగ్న బ్రహ్మాండ మహాధ్వానంబు భంగి నాస్పోటించిన. (384) కూడె జగంబు లన్నియును; గ్రుంకిరి సూర్య సుధాంశు; లద్రు లూ¯ టాడె; నభస్థ్సలం బగిలె; నంబుధు లింకె; నుడుగ్రహాళి ప¯ ట్టూడె; వడిం దిశల్ పగిలె; నుర్వర క్రుంగె; నజాండభాండ మ¯ ల్లాడె; విధాత బెగ్గడిలె; నార్చుచు వృత్రుఁడు బొబ్బపెట్టినన్. (385) కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు;¯ వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్; ¯ ప్రేలిరి మరుత్తు; లెద జాలిగొని రాశ్వినులు;¯ కాలుడిగి రుద్రు లవలీల బడి రార్తిన్; ¯ వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సుర;¯ జాలములు పెన్నిదుర పాలగుచు ధారా¯ భీల గతితోడఁ దమ కేలిధనువుల్ విడిచి;¯ నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా! (386) ఇట్లు కఠోర కంఠనాదం బొనర్చిన నశనిపాతంబునం గూలు ప్రాణిచయంబు భంగి నంగంబు లెఱుంగక రణరంగంబునం బడి బిట్టు మూర్ఛిల్లిన, దివిజరాజసైన్యంబుల వృత్రాసురుండు సంగరరంగ దుర్దముండై మహీవలయంబు పదాహతంబుల గడగడ వడంక, నిశితశూలంబు గేల నంకించుచు, మదించిన భద్రమాతంగంబు కమల వనంబు చొచ్చి, మట్టిమల్లాడు విధంబున నిమీలితాక్షుండయి, తన పదతలంబుల రూపంబులు మాయం జమురుచు, వెక్కసంబుగఁ గ్రీడించు వానింగని వజ్రి వజ్రశతోపమ నిష్ఠుర గదాదండం బాభీల భంగిఁ బ్రళయకాల మార్తాండ చండపరివేష ప్రేరితంబుగాఁ ద్రిప్పి వైచిన. (387) అది మింటం బెనుమంట లంటఁ బఱపై యాభీల వేగంబునం¯ గదియన్ వచ్చిన లీల వామకర సంక్రాంతంబు గావించి, బె¯ ట్టిదుఁడై చేరి సురారి దానిఁ గొని కాఠిన్యోరు పాతంబులం¯ జదియన్ మోఁదె గజేంద్ర మస్తకము నుత్సాహైక సాహాయ్యుఁడై. (388) అగ్గజంబు గులిశహతిఁ గూలు కులమహీ¯ ధ్రంబుఁ బోలె రక్తధార లురల¯ మస్తకంబు పగిలి మదమఱి జిరజిరఁ¯ దిరిగి భీతితోడఁ దెరలి పఱచె. (389) గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా¯ భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్¯ నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్¯ ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్. (390) ఇవ్విధంబున నైరావతంబును సేదదేర్చుచు, నెదురనిలుచున్న భిదురపాణింగని, తోఁబుట్టువుఁ జంపిన తెంపుఁ దలంచి, మోహశోకంబున విపర్యాసంబుగా నవ్వుచు నాహవకామ్యార్థి యై వృత్రుం డిట్లనియె. (391) "నాకుం బెద్దయు నీకు సద్గురువు దీనవ్రాత రక్షున్ శుభా¯ లోకుం జంపితి విట్లు పాపమతివై లోభంబుతో నియ్యెడన్¯ లోకుల్ నవ్వఁగ మద్భుజాపటిమకున్ లోనైతి వీ శూలమం¯ దాకంపింపఁగ నిన్ను గ్రుచ్చి ఋణముక్తాత్ముండనై పేర్చెదన్. (392) ఎట్టి తులు వయినఁ గానీ¯ నెట్టన తన బ్రదుకుకొఱకు నీవలె గురువుం¯ జుట్టమును బుణ్యు బ్రాహ్మణుఁ¯ బట్టి వధింపంగఁ గలఁడె? పశువుం బోలెన్. (393) దయయును సత్యమున్ విడిచి ధర్మముమాని యశంబుఁబాసి శ్రీ ¯ జయములఁ బాఱఁదోలి పురుషత్వము గానక లోకనిందితా¯ హ్వయుఁ డగువాని చావునకు నార్యులు గుందుదురే? సృగాలముల్¯ ప్రియమున నంటునే శవముఁ? బ్రేలక చేరునె? కంకగృధ్రముల్. (394) నిక్కమగు పాపములచేఁ¯ జిక్కితివి నిశాత శూల శిఖరాగ్రమునన్¯ మక్కించి నీదు మాంసము¯ నక్కలుఁ గుక్కలును జేరి నమల నొనర్తున్. (395) దీకొని నీకు నేఁ డిచట దిక్కని వచ్చినవారు గల్గిరే? ¯ నేకమతిం బిశాచముల కెల్లను దృప్తిగ మన్నిశాత శూ¯ లైక మహాగ్ని కీలల ననేకవిధంబుల సోమయాజి నై¯ మేఁకల జేసి వ్రేల్చెద నమేయ మదోద్ధతి వ్రాలి యియ్యనిన్. (396) కాక ననుఁ గులిశధారల¯ దీకొని నిర్జింపఁ గలిగి తేనిఁ బ్రభూతో¯ ద్రేకంబు చేసి శూరుల ¯ ప్రాకట పదపద్మ ధూళి భాగంగగుదున్. (397) సందేహ మేటికి జంభారి వేవేగ¯ భిదురంబు వ్రేయు మాభీల భంగి¯ నతిలోభి నడిగిన యర్థరాశియుఁ బోలె¯ గడపకు మిది వృథ గాదు సుమ్ము;¯ మురమర్దనుని తేజమున నా దధీచి వీ¯ ర్యాతిశయంబున నధికమయిన¯ యదిగాన హరిచే నియంత్రి తోన్నతుఁడ వై¯ గెలువుము శత్రుల గీ టడంచి¯ (397.1) యెందుఁ గలఁడు విష్ణు డందు జయశ్రీలు¯ పొందు గాఁగ వచ్చి పొందుచుండు; ¯ గాన భక్తవరదుఁ గమలాక్షు సర్వేశు¯ పదములందు మనముఁ బదిలపఱతు. (398) ఇప్పుడు వజ్రధారలం ద్రెంపబడిన విషయ భోగంబులు గలవాఁడ నయి, శరీరంబు విడిచి, భగవద్ధామంబు నొందెద; నారాయణుని దాసుండ నైన నాకు స్వర్గమర్త్యపాతాళంబులం గల సంపద్భోగంబులు నిచ్చగింపంబడవు; త్రైవర్గికాయాస రహితంబైన మహైశ్వర్యంబు ప్రసాదించుం గావున ననుపమేయం బైన భగవత్ప్రసాదం బన్యుల కగోచరం; బద్దేవుని పాదైక మూలంబుగా నుండు దాసులకు దాసానుదాసుండ నగుచున్నవాఁడ"నని యప్పరమేశ్వరు నుద్దేశించి. (399) "అరయఁగ భక్తపాలనము లైన భవద్గుణజాల మాత్మ సం¯ స్మరణము చేయ వాక్కు నిను సన్నుతి చేయ శరీరమెల్లఁ గిం¯ కర పరివృత్తి చేయ మదిఁ గాంక్ష యొనర్చెదఁ గాని యొల్ల నే¯ నరిది ధ్రువోన్నతస్థలము నబ్జజు పట్టణ మింద్ర భోగమున్. (400) ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్¯ దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ¯ వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో! ¯ శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.