పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 246 - 316

శబళాశ్వులకు బోధించుట

(246) ఇట్లతి భయంకరంబైన తపంబు చేయుచు, నెడతెగక భగవన్మంత్రంబులు నుడువుచుఁ బ్రజాసర్గ కాములై యున్న య చ్చిన్ని బాలుర కడకు నారదుండు చనుదెంచి, పూర్వవిధంబునం బలుకుచు నిట్లనియె; భ్రాతృవత్సలులై యున్న మీరలు వేదాంతసారం బొలుకు చున్న నా వచనంబు లాదరించి, తోఁబుట్టువులు చనిన మార్గంబునఁ జనుండు; ఎవ్వరేనిం దమ యగ్రజులు చనిన మార్గంబునం దామునుం దప్పక వర్తింతు రేని నట్టివారిని విశేషధర్మం బెఱింగిన వారండ్రు; సతతంబును బుణ్యబంధువు లైన దేవతలం గూడి సుఖంబుండుం"డని బల్కి, నారదుండు చనియె; వారలును సర్వకర్మంబుల యందు నిర్మోహితులై పరమపదంబునకు నాస్పంబు లైన దేవర్షి వాక్యంబుల నాశ్రయించి.(247) అప్పుడు లజ్జతోడ శబళాశ్వులు పూర్వజు లేగినట్టి యా¯ చొప్పున నెన్నఁడుం దిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిం¯ దప్పక పోయిరయ్య! గుణధాములు; నేఁడును మళ్ళరేమి నేఁ¯ జెప్పెదఁ గాక రాక కడ చేరిన రాత్రులఁ బోలి భూవరా!(248) దక్షున కా కాలంబున¯ లక్షితమై యుండెఁ బెక్కు లాగుల నుత్పా¯ తక్షోభంబులు వానికి¯ రూక్షవ్యధ నొంది యా పురుష నాశంబున్.(249) నారదకృత మని యెఱిఁగి మ¯ హారోషముతోడ నేగి యాతనిఁ గని దుః¯ ఖారూఢ చిత్తుఁడై మది¯ నూఱడిలం దెరువు లేక యుగ్రుం డగుచున్.(250) మోము జేవుఱింప ముడిపడ బొమదోయి¯ చూపు వెంట మంట సుడిగొనంగఁ¯ బెదవు లడరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు¯ దక్షుఁ డాగ్రహించి తపసిఁ బలికె.(251) "నెఱయఁగ సాధురూపమున నీ వతిబాలుర కాత్మజాళికిం¯ గఱుకున భిక్షుమార్గ మగు కందువ చెప్పితి వేల? ధూర్తవై¯ మఱుఁగక యుండవచ్చునె? కుమారుల నీ దురితంబు పొంద; ని¯ న్నొఱఁలగఁ ద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవహ్నులన్.(252) అది యెట్లంటేని, దేవర్షి పితృ ఋణంబులు దీర్పక కర్మవిచారంబు చేయని బాలుర మనంబులకు నైహికేచ్ఛలయందు నైరాశ్యంబు గలుగంజేసి నివృత్తిమార్గం బుపదేశించి, వారలకు నుభయలోకముల యందుఁ జెందఁ గల శ్రేయోహాని నొనర్చితి; విట్టి పాతకంబున భాగవతోత్తములలో లజ్జాహీనుండవై యశోహానిం బొంది చరింపుదు గాక; నిరపరాధులై వైరంబులేని నా పుత్రుల పట్ల ద్రోహకృత్యం బొనర్చిన నీవు దప్పఁ దక్కిన భాగవతోత్తములు సకల భూతానుగ్రహ పరవశులు; అతి కుతూహలంబున నీచేత స్నేహపాశ నికృంతనంబైన మిత్రభేదంబె కాని తదుపశమనంబు గాకుండెడు; ఇంతనుండియుఁ బురుషుండు విషయ తీక్ష్ణత్వంబు లనుభవింపక కాని తెలియకుండెడు; జ్ఞానంబు తనంతటనె కాని యొరులచే బోధింపఁబడి తెలియరాకుండెడి; నిరంతరంబును లోకసంచారియైన నీకు నే లోకంబునను నునికిపట్టు లేకుండుం గాక"యని నిర్దయుండై శాపం బిచ్చె; నంత నారదుండు తత్క్రోధవాక్యంబుల కలుగక "యట్ల కాని"మ్మని సమ్మతించి చనియె; నిట్టి శాంతభావం బెవ్వనివలనం గలుగు, నతండు సర్వాతీతుండయిన సర్వేశ్వరుం డనంబడు; మఱియు దక్షుండు దన మనోరథంబు విఫలంబగుటం జేసి యతి దుఃఖిత మనస్కుడై పొగలుచున్నఁ, బితామహుండు చనుదెంచి, మఱియుఁ బ్రజాసర్గోపాయం బుపదేశించిన నా ప్రజాపతి ప్రియభామయైన యసిక్ని యందుఁ బిత్రువత్సల లైన పుత్రికల నఱువదుండ్రం బుట్టించి; వారిలో ధర్మునకుం బదువురను, కశ్యపునకుం బదమువ్వురను, జంద్రునకు నిఱువదేడ్వురను, భూతునకు నాంగిరసునకుఁ గృశాశ్వునకు నిద్దఱేసిచొప్పున నార్వురను, తార్క్షుండను నామాంతరంబుఁ దాల్చిన కశ్యపునకు మరలఁ గడమ నలువురను నీ క్రమంబున నిచ్చె వారి నామంబు లాకర్ణింపుము.(253) ఎట్టి పుణ్యవతులొ? యీ చేడియలు చెప్ప¯ సవతు లేనియట్టి సవతులయ్యుఁ¯ గడుప పడసి రెట్టి కడుపునఁ బుట్టిరో¯ కడిఁది త్రిజగ మెల్లఁ గడుపు గాఁగ.(254) వార లెవ్వ రనిన భానువు, లంబయుఁ, గకుప్పు, జామియు, విశ్వయు, సాధ్యయు, మరుత్వతియు, వసువు, ముహూర్తయు, సంకల్పయు, ననం బదుగురు ధర్మునకుఁ బత్నులై కొడుకులం బడసిరి; వార లెవ్వ రంటేని భానువునకు వేదఋషభుండు పుట్టె; నతనికి నింద్ర సేనుం డుదయించె; లంబకు విద్యోతుండు గలిగె; నతనికి స్తనయిత్నువు లనువారు పుట్టిరి; కకుబ్దేవికి సంకుటుండు పుట్టె; సంకుటునకుం గీటకుండు పుట్టె; కీటకునకు దుర్గాభిమానిను లయిన దేవతలు జన్మించిరి; జామిదేవికి దుర్గ భూముల కధిష్ఠాన దేవతలు జనియించిరి; వారికి స్వర్గుండును, నందియు జన్మించిరి; విశ్వ యను దానికి విశ్వేదేవగణంబు జనియించె; వార లపుత్రుకులనం బరఁగిరి; సాధ్య యనుదానికి సాధ్యగణంబులు పుట్టె; వానికి నర్థసిద్ధి యను వాఁడు పుట్టె; మరుత్వతి యనుదానికి మరుత్వంతుఁడు, జయంతుం డను వార లుదయించి; రందు జయంతుండు వాసుదేవాంశజుం డైన యుపేంద్రుం డనంబడి వినుతి నొందె; ముహూర్త యనుదానికి సకల భూతంబులకు నాయాకాలంబులం గలిగెడు నాయా ఫలాఫలంబుల నిచ్చు మౌహర్తికు లనియెడు దేవగణంబులు పుట్టిరి; సంకల్ప యనుదానికి సంకల్పుం డుదయించె; నా సంకల్పునకుఁ గాముండు జనియించె; వసు వనుదానికి ద్రోణుండును, బ్రాణుండును, ధ్రువుండును, నర్కుండును, నగ్నియు, దోషుండును, వస్తువును, విభావసువును నన నెనమండ్రు వసువు లుదయంబు నొంది; రందు ద్రోణునకు నభిమతి యను భార్య యందు హర్ష శోక భయాదులు పుట్టిరి; ప్రాణునకు భార్య యైన యూర్జస్వతి యందు సహుఁడును, నాయువును, బురోజవుండును ననువారలు గలిగిరి; ధ్రువునకు భార్య యగు ధరణి యందు వివిధంబులగు పురంబులు పుట్టె; నర్కునకు భార్య యగు వాసన యందుఁ దర్షాదు లుదయించి; రగ్నికి భార్యయైన వసోర్ధార యందు ద్రవిణకాదులు పుట్టిరి; మఱియుఁ గృత్తికలకు స్కందుండు గలిగె; నా స్కందునకు విశాఖాదు లుదయించిరి; దోషునకు శర్వరి యను భార్య యందు హరికళ యగు శింశుమారుం డుదయించె వస్తువునకు నాంగిరస యందు విశ్వకర్మ యను శిల్పాచార్యుం డుదయంబందె; నా విశ్వకర్మకు నాకృతి యను సతియందుఁ జాక్షుషుం డను మనువు జనియించె; నా మనువు వలన విశ్వులు సాధ్యు లనువారలు పుట్టిరి; విభావసునకు నుష యను భార్య యందు వ్యుష్టియు, రోచియు, నాతపుండును జనించి; రందు నాతపునికిఁ బంచయాముం డను దివసాభిమాన దేవత జనియించె; శంకరాంశజుం డయిన భూతునకు సురూప యను భార్య యందుఁ గోట్ల సంఖ్యలైన రుద్రగణంబు లుదయించిరి; మఱియు రైవతుండు, నజుండు, భవుండు, భీముండు, వాముండు, నుగ్రుండు, వృషాకపియు నజైకపాత్తు, నహిర్బుధ్న్యుండు, బహురూపుండు, మహాంతుండు ననువారలును, రుద్రపారిషదులును నతిభయంకరు లయిన ప్రేతులును వినాయకులును బుట్టి; రంగిరసుం డను ప్రజాపతికి స్వధ యను భార్యయందుఁ బిత్రుగణంబులు పుట్టిరి; సతి యను భార్యకు నధ్వర వేదాభిమాన దేవతలు పుట్టరి; కృశాశ్వునకు నర్చి యను భార్యయందు ధూమ్రకేశుం డను పుత్రుం డుదయించె; వేదశిరునకు ధిషణ యను భార్య యందు దేవలుఁడును, వయనుండును, మనువునుం బుట్టిరి; తార్క్షునకు వినత కద్రువ పతంగి యామిని యన నలువురు భార్య లందుఁ బతంగికిఁ బక్షులు పుట్టె; యామినికి శలభంబులు పుట్టె; వినతకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనం బయిన గరుడుండును, సూర్యునకు సారధి యైన యనూరుండును జనియించిరి; కద్రువకుఁ బెక్కు తెఱంగు లగు భుజంగమంబులు పుట్టె; చంద్రునకుఁ గృత్తికాది నక్షత్రంబులు భార్యలయినను వారల యందుఁ జంద్రుండు రోహిణి యందు మాత్రము మోహితుం డగుటంజేసి దక్షశాపంబున క్షయరోగగ్రస్తుండై సంతానంబు పడయనేరఁ డయ్యె; నంత దక్ష ప్రసాదంబున క్షయపీడితంబు లగు షోడశకళల మరలం బొందె; మఱియును. (255) కామితప్రదుఁ డైన కశ్యపు కౌగిఁట¯ ముచ్చట దీర్తు రే ముద్దరాండ్రు; ¯ అఖిల లోకములకు నవ్వలై జగ మెల్లఁ¯ బూజింప నుందు రే పువ్వుఁబోండ్లు; ¯ బలియు రై పుత్రులు పౌత్రులు త్రిజగంబు¯ లేలంగఁ జూతు రే యిందుముఖులు; ¯ ముంగొంగు పసిడి యై మూల్గు పుణ్యంబుల¯ విఱ్ఱవీఁగుదు రెట్టి వింతరాండ్రు;(255.1) వారి కలగంప కడుపుల నేరుపఱప¯ నరిది బిడ్డలఁ బడసిన బిరుదు సతుల¯ నామములు నన్వయంబులు నీ మనంబు¯ పూనఁ జెప్పుదు వినవయ్య! మానవేంద్ర!(256) అదితియున్ దితి గాష్ఠయున్ దను వయ్యరిష్టయుఁ దామ్రయు¯ న్నదనఁ గ్రోధవశాఖ్యయున్ సురసాఖ్యయున్ సురభిన్ మునిన్ ¯ మొదలుగాఁ దిమియున్నిళాఖ్య సుముఖ్య యా సరమాదిగా ¯ ముదిత లెన్నఁగఁ గన్న సంతతి ముజ్జగంబుల భూవరా! (257) చాలంగఁ దిమికిని జలచరంబులు పుట్టె¯ శ్వాపదంబులు పుట్టె సరమ యందు; ¯ సురభికి మహిషాది సురభులు జనియించెఁ¯ దామ్రకు శ్యేన గృధ్రములు గలిగె; ¯ మునికి నప్సరసల మూఁకలు జనియించె¯ నిళ గనె భూరుహములను; గ్రోధ¯ వశ కుద్భవిల్లె దుర్వార సర్పంబులు; ¯ సరి యాతుధానులు సురస కరయ(257.1) నుప్పతిల్లిరి; గంధర్వు లొక్క మొగి న¯ రిష్టకు సుతు; ల్దనువునకుఁ ద్రిదశ రిపులు¯ పదియునెనమండ్రు నై నట్టి విదితబలులు¯ వారి నామాన్వయంబులఁ గోరి వినుము.(258) ద్విమూర్ధుండును, శంబరుండును, నరిష్టుండును, హయగ్రీవుండును, విభావసుండును, నయోముఖుండును, శంకుశిరుండును, స్వర్భానుండును, గపిలుండును, నరుణియుఁ, బులోముండును, వృషపర్వుండును, నేకచక్రుండును, ననుతాపకుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, దుర్జయుండును, విప్రచిత్తియు ననువారలు వీరలలోన స్వర్భానునకు సుభద్ర యను కన్యక పుట్టె; దాని నముచి వివాహం బయ్యె; వృషపర్వునకు శర్మిష్ఠ యను కూఁతురు పుట్టె; దాని నహుష పుత్రుండైన యయాతి పెండ్లియయ్యె; వైశ్వానరునకు నుపదానవి, హయశిరస, పులోమ, కాలక యను నలువురు పుత్రిక లుదయించి; రందు నుపదానవి హిరణ్యాక్షునకుం బత్ని యయ్యె; హయశిరసను గ్రతువు వివాహంబయ్యె; పులోమ కాలకలను నిరువురను గశ్యపప్రజాపతి చతుర్ముఖుని వాక్యంబునఁ గైకొనియె; నా యిరువురకును సమరకోవిదు లయిన దానవులు పౌలోమ కాలకేయు లనం బుట్టిరి; మఱియు నా యిరువురకును నఱువదివేల రాక్షసులు జన్మించిరి; వారు యజ్ఞకర్మంబులకు విఘాతకులై వర్తింప వారి నింద్రునకుం బ్రియంబుగా నీ పితామహుం డగు నర్జునుండు వధించె మఱియు విప్రచిత్తి సింహిక యనుదాని యందు రాహు ప్రముఖంబుగాఁ గల కేతు శతంబును బడసె; వారలు గ్రహత్వంబుఁ గైకొనిరి; మఱియుం బురాణపురుషుండైన శ్రీమన్నారాయణుండు దన యంశంబునఁ బరమభాగ్యవతి యయిన యదితి గర్భంబున నుదయించె; నా యదితి వంశంబును విదితంబుగా వినిపించెద సావధానుండవై వినుము; వివస్వంతుడును, నర్యముండును, బూషుండును, ద్వష్టయు, సవితయు, భగుండును, ధాతయు, విధాతయు, వరుణుండును, మిత్రుండును, శక్రుండును, నురుక్రముండును నను ద్వాదశాదిత్యులు జన్మించి రందు వివస్వంతునకు శ్రాద్ధదేవుం డను మనువు సంజ్ఞాదేవి యందు నుదయించె; మఱియు యముండు యమియు నను నిరువురు మిథునంబుగా నుదయంబు నొందిరి. వెండియు నా సంజ్ఞాదేవి బడబా స్వరూపంబు నొంది యశ్వనీదేవతలం గనియె; ఛాయాదేవి యందు శనైశ్చరుండును, సావర్ణి యను మనువును దపతి యను కన్యకయుం బుట్టిరి; యా తపతిని సంవరణుండు వరియించె; నర్యమునకు మాతృక యను పత్నియందుఁ జర్షణు లుదయించిరి; వారి మూలంబున మనుష్యజాతి యీలోకంబున స్థిరంబుగా నుండు నట్లు బ్రహ్మదేవునిచేఁ గల్పింపంబడె; పూషుండు భర్గునిఁ జూచి దంతంబులు వివృతంబులుగా నగిన, నతండు క్రోధించి దంతంబు లూడనడచిన నాఁటనుండియు, భగ్నదంతు డయి యనపత్యుండయి పిష్టాదులు భక్షించుచుండె; ద్వష్టకు దైత్యానుజ యైన రచన యను కన్యకకు నధిక బలాఢ్యుం డగు విశ్వరూపుండు పుట్టె; నంత నా దేవతలు, బృహస్పతి గోపించి తలంగి పోయినం, దమకు నా విశ్వరూపుని నాచార్యునింగా వరియించి"రని చెప్పిన విని శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

బృహస్పతి తిరస్కారము

(259) "అరయంగ యోగీంద్ర! యద్భుతం బయ్యెడు¯ సురలపై నేటికి సురగురుండు¯ గోపించె? నీతండు గురుభావమున దేవ¯ తల కేమి యాపదఁ దలఁగఁ జేసె? ¯ నెఱిఁగింపు"మనవుడు "నింద్రుండు త్రిభువనై¯ శ్వర్య మదంబున సత్పథంబు¯ గానక వసు రుద్ర గణములు నాదిత్య¯ మరుదశ్వి దేవాది మండలములు(259.1) సిద్ధ చారణ గంధర్వ జిహ్మగాది¯ సురులు మునులును రంభాది సుందరాంగు¯ లాడఁ బాడంగ వినుతి చేయంగఁ గొలువఁ ¯ మ్రొక్క భద్రాసనంబున నుక్కుమీఱి.(260) నిండు పున్నమనాఁడు గండరించిన చంద్ర¯ మండల శ్రీలతో మాఱుమలయ¯ భద్రవిద్యోతాతపత్రంబు గ్రాలుచు¯ మిన్నేటి తరఁగల మేలుకొలుపఁ¯ గలిత దివ్యాంగనా కరతల చాతుర్య¯ చామీరికశ్రేణి జాడపఱుపఁ¯ జింతామణిస్ఫుట కాంత రత్నానేక¯ ఘటిత సింహాసనాగ్రంబు నందు(260.1) నూరుపీఠంబుపై శచి యుండ నుండి¯ వరుస దిక్పాలకాది దేవతలు గొలువ¯ సాటి చెప్పంగరాని రాజసముతోడ¯ నింద్రుఁ డొప్పారె వైభవసాంద్రుఁ డగుచు.(261) అయ్యవసరంబున(262) గురుతర ధర్మక్రియ నయ¯ గురుఁడున్ గురుమంత్ర విషయ గురుఁడు వచశ్శ్రీ¯ గురుఁడు సమస్తామరగణ¯ గురుఁడు గురుం డరుగుదెంచెఁ గొల్వునకు నృపా!(263) అమిత తపఃప్రభావుఁ గరుణాత్ముని గీష్పతిఁ జూచి రాజ్యదు¯ ర్దమ మదరేఖ నింద్రుఁడు వృథా తనగద్దియ లేవకుండె నె¯ య్యమున నెదుర్కొనం జనక యాసన మీయక గౌరవోప చా¯ రములఁ బ్రసన్నుఁ జేయక తిరంబుగ దివ్యసభాంతరంబునన్.(264) అప్పుడు సురపతి గన్నులఁ¯ గప్పిన సురరాజ్య మదవికారంబునకుం¯ జప్పుడు జేయక గృహమున¯ కప్పుణ్యుఁడు దిరిగిపోయె నతిఖిన్నుండై.(265) ఎఱుఁగమిఁ జేసినట్టి గురుహేళన మంత నెఱింగి యింద్రుఁ డ¯ చ్చరుపడి భీతినొంది యతిచింతితుఁడై తలపోసి పల్కె "న¯ ప్పరమపవిత్రు లోకనుతభవ్యచరిత్ర విశేషు పాదపం¯ కరుహముఁ బూజ చేయక యకర్మముఁ జేసితి నల్పబుద్ధి నై.(266) త్రిభువన విభవ మదంబున¯ సభలో మద్గురువునకుఁ బ్రసన్నునకు లస¯ త్ప్రభువునకు నెగ్గు జేసితి¯ శుభములు దొలఁగంగ నే నసురభావమునన్.(267) పారమేష్ఠ్య మయిన పదవి నొందిన భూపు¯ లెట్టివారి కైన లేవవలదు; ¯ విబుధు లిట్లు చెప్పు విధమెన్న వారలు¯ ధర్మవేత్త లనుచుఁ దలఁపబడరు.(268) కుపథవర్తు లగుచుఁ గుత్సిత దుర్వచో¯ నిపుణు లైనవారు నిడివి దెలిసి¯ తొలఁగలేక వా రధోగతిఁ బడుదురు¯ తప్పులేక రాతి తెప్ప భంగి.(269) కావున లోకవందితుని కార్యవిచారుని యింటి కేగి త¯ త్పావన పాదపద్మములపై మకుటంబు ఘటిల్ల మ్రొక్కి త¯ త్సేవ యొనర్చి చిత్తము వశించి ప్రసన్ను నొనర్తు నంచు న¯ ద్దేవవిభుండు పోయె నతితీవ్రగతిన్ గురుధామ సీమకున్.

దేవాసుర యుద్ధము

(270) ఈరీతిఁ దనయింటి కేతెంచు దేవతా¯ పతి రాక యా బృహస్పతి యెఱింగి¯ యధ్యాత్మమాయచే నడఁగి యదృశ్యుఁ డై¯ పోయె నప్పుడు దేవపుంగవుండు¯ సకలంబుఁ బరికించి జాడఁ గానక గురు¯ జింతించి తలపోసి చిన్నపోయెఁ; ¯ బోయిన విధ మెల్ల దాయలు రాక్షస¯ వీరులు వేగులవారివలనఁ(270.1) దెలిసి మిక్కిలి తమలోనఁ దెలివినొంది¯ యందఱును గూడి భార్గవు నాశ్రయించి¯ తత్కృపాదృష్టిఁ దమశక్తి దట్టమైన¯ దేవతలమీఁది దాడికిఁ దెరువు పెట్టి.(271) ధూర్తులు సమస్త కిల్బిష¯ మూర్తులు వర ధర్మ కర్మ మోచిత మార్గా¯ వర్తులు దుర్ణయ నిర్మిత¯ కీర్తులు దానవులు చనిరి గీర్వాణులపై.(272) దండిం గోదండ కాండోద్ధత రథ హయ వేదండ దండంబుతోడన్¯ దండెత్తెన్ మెండుగా నద్దనుజనికరముల్ దైవవర్గంబు మీఁదం¯ జండబ్రహ్మాండ భేదోచ్ఛ్రయ జయరవముల్ సర్వదిక్ క్షోభగా ను¯ ద్దండప్రఖ్యాత లీలం దలపడిరి సురల్ దర్పులై వారితోడన్.(273) మదమున దేవదానవులు మచ్చరముల్గడుఁ బిచ్చలింప సం ¯ పదలను గోరి పోరునెడ భార్గవ మంత్రకళా విశేషులై¯ యెదురులు వాలి నస్త్రమున నేయ మహాసురు లేచియేచి పెం¯ గుదులుగఁ గ్రువ్వ దేవతలు కోల్తల కోర్వక వీఁగి రయ్యెడన్.(274) దనుజవీరు లేయు దారుణ దివ్యాస్త్ర¯ దళితదేహు లగుచుఁ దలలు వీడ¯ నోడి పాఱి రద్భుతోపేత బలులైన ¯ త్రిదశవరులు బిట్టు దిట్టినట్లు.(275) ఒక మొగము గాక దివిజులు¯ తికమక గొని వైరులెల్ల ఢీకొనఁ దమ్ముం¯ బికపిక లై నకనక లై¯ లుకలుకఁ బరువెత్తి రోడి లోగొను భీతిన్.(276) దనుజుల గర్వరేఖయును దానవవీరుల యంపజోకయున్¯ మనుజవిశేష భోజనుల మచ్చరికంబు నిశాటకోటి యే¯ చిన బల శౌర్యముం దమకు సిగ్గును హాని మహాభయంబు ని¯ ర్గుణతను జేయు నుమ్మలికఁ గోల్తల కోర్వక పాఱిరార్తు లై.(277) అమరులు విసృష్ట దానవ¯ సమరులు శరభిన్న దేహ సంతాపగుణ¯ భ్రమరులు దైత్య కిరాతక¯ చమరులు కమలజుని కడఁకుఁ జనిరి భయార్తిన్.(278) ధాతకు దేవతా విభవదాతకుఁ బుణ్యజనానురాగ సం¯ ధాతకు సర్వలోకహితదాతకు వైదిక ధర్మమార్గ ని¯ ర్ణేతకు నుల్లసద్విభవ నేతకు సర్వ జగజ్జయాంగజ¯ భ్రాతకుఁ బుణ్యయోగిజన భావవిజేతకు మ్రొక్కిరయ్యెడన్.(279) ఆఖండలుండు మొదలుగ¯ లేఖానీకముల బ్రహ్మ లేనగవున ని¯ త్యాఖండ సత్కృపారస¯ శేఖర వాక్యముల వారి సేదలు దేర్చెన్.(280) ఇట్లు బ్రహ్మదేవుండు దేవేంద్రప్రముఖు లయిన దేవతల కనుకంపాతిశయ విభవంబున నభయం బొసంగి యిట్లనియె.(281) "నెట్టన పాపకర్మమున నేరమిఁ జేసితి రేమి చెప్ప; మీ¯ పుట్టిన నాఁటనుండియును బుద్ధులు జెప్పి జగంబు లేలఁగాఁ¯ బట్టముఁ గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళావిధిజ్ఞుఁ జే¯ పట్టక గుట్టు జాఱి సిరిపట్టునఁ దొట్టిన పొట్ట క్రొవ్వునన్.(282) బ్రహ్మిష్ఠుం డైన బ్రాహ్మణు నాచార్యుం గైకొనక గురుద్రోహంబు చేసితిరి; తద్దోషం బిపుడు మీఁకుఁ జేసేఁత శత్రుకృతం బై యనుభవింపం జేసె; నతి బలవంతులయిన మిమ్ము నతి క్షీణులైన యారాక్షసులు జయించుట దమ యాచార్యుండైన శుక్రు నారాధించి తన్మంత్ర ప్రభావంబునఁ బునర్లబ్ధ వీర్యు లగుటచేతనే; ఇప్పుడు మదీయంబైన నిలయంబు నాక్రమింపం గలవారై మదోద్రేకంబున నెదురు లేక వర్తిల్లుచున్న రక్షోనాయకులకుం ద్రిదివంబు గొనుట తృణప్రాయంబు; అభేద్య మంత్ర బలంబుగల భార్గవునకు వారు శిష్యులగుటంజేసి విప్ర గోవింద గవేశ్వరానుగ్రహంబు గలవారలకుఁ దక్కం దక్కిన రాజుల కరిష్టంబగుం; గావున మీ రిప్పుడు త్వష్ట యను మను పుత్రుండగు విశ్వరూపుం డను ముని నిశ్చల తపో మహత్త్వ సత్త్వ స్వభావుం డతని నారాధించిన, మీకు నభీష్టార్థంబుల నతండు సంఘటిల్లఁ జేయు; నిట్టి దుర్దశల నతం డడంచు"నని చెప్పిన దిక్పాలకాదులు డెందంబులు డిందుపడి కమలగర్భుని వీడ్కొని విశ్వరూపు కడకుం జని యిట్లనిరి.(283) "అన్న మేలగు నీకు నిన్నడుగఁ గోరి¯ వచ్చినారము భవదీయ వనమునకును; ¯ దండ్రులకు నేఁడు సమయోచితంబు లైన¯ కోర్కు లొడఁగూడఁ జేసి చేకొనుము యశము(284) సుతులకుఁ బితృశుశ్రూషణ¯ మతిపుణ్యము జేయుచుండు నాత్మజులు గుణో¯ న్నతి బ్రహ్మచారు లైనను¯ మతిలో గురుసేవకన్న మఱియుం గలదే?(285) అదియునుం గాక(286) అరయ నాచార్యుండు పరతత్త్వరూపంబు¯ దండ్రి దలంపఁగ ధాతరూపు; ¯ రూపింప భ్రాత మరుత్పతి రూపంబు¯ దెలియంగఁ దల్లి భూదేవిరూపు; ¯ భగిని కరుణరూపు; భావంబు ధర్మ స్వ¯ రూపంబు దా నర్థిరూపు మొదల¯ నభ్యాగతుఁడు మున్న యగ్ని దేవునిరూపు¯ సర్వభూతములుఁ గేశవుని రూపు;(286.1) గాన తండ్రి వేగ కడు నార్తులగు పితృ¯ జనులమైన మమ్ముఁ జల్లఁ జూచి¯ పరభయంబు వాపి నిరుపమం బగు తపో¯ మహిమచేత మెఱసి మనుపవయ్య!(287) ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండ వైన నిన్నాచార్యునింగా వరియించి, భవదీయ తేజోవిశేషంబు చేత వైరివీరులం బరిమార్చెద; మాత్మీయార్థం బైన యవిష్ణ పాదాభివందనంబు నిందితంబు గాదని వేదవాక్యంబు గలదు; గావున నీకు నమస్కరించుచున్న దేవతలం గైకొని పౌరోహిత్యంబు జేయు"మనినఁ బ్రహసితవదనుండై యమ్మునీశ్వరుం డిట్లనియె.(288) "బ్రహ్మతేజంబు పోయెడి ప్రార్థనంబు¯ ధర్మగుణ గర్హితం బని తా నెఱింగి¯ సొరిది ననుబోఁటి తపసి యీ సురలచేతఁ ¯ బ్రకట మధురోక్తి నేఁటికిఁ బలుకఁబడియె.(289) విశేషించి(290) గురుధనముఁ గూర్ప నేటికి¯ గురుశిక్షం దగిలి మంత్రకోవిదులై స¯ ద్గురుధర్మ నిరతు లేనిన్¯ గురువులకును శిష్యవరులె కూర్చిన ధనముల్.(291) అరయ నకించను లై నట్టివారికిఁ¯ దగు శిలోంఛనవృత్తి ధనము సుమ్ము; ¯ దానిచే నిర్వర్తితప్రియసాధు స¯ త్క్రియ గలవారలై ప్రీతినొందె¯ దరు గాన సద్గర్హితాచారమైన యా¯ చార్యత్వ మిపుడు మీ శాసనమునఁ¯ గైకొంటి; గురువుల కామంబు ప్రాణార్థ¯ వంచనములు లేక వడి నొనర్తు"(291.1) ననుచు విశ్వరూపుఁ డనియెడు ముని ప్రతి¯ జ్ఞోక్తిఁ బలికె వారి నూఱడించి¯ మహితమైన తత్సమాధిచే గురుభావ¯ మమరఁ జేసె దేవసమితి కపుడు.(292) భార్గవవిద్యా గుప్త¯ స్వర్గశ్రీ ద్విగుణ దనుజ సమధిక సంప¯ ద్వర్గముల విష్ణుమాయా¯ నర్గళగతిఁ దెచ్చి యింద్రునకు నిచ్చె నృపా!(293) ఏ విద్యచేత రక్షితుఁ¯ డై వజ్రి దురంబులోన నసురలఁ ద్రుంచెన్¯ భావింప నట్టి విద్యను ¯ శ్రీవరమాయామతంబుఁ జెప్పెను హరికిన్. "(294) నావుడు పాండవాన్వయుఁడు నమ్మినభక్తి జగన్నివాసు రా¯ జీవదళాక్షుఁ గృష్ణుఁ దన చిత్తమునన్ భజియించి పల్కె "నో¯ దేవగణార్చితాంఘ్రియుగ! దివ్యమునీశ్వర! విశ్వరూపుఁడ¯ ప్పావనమైన విద్య సురపాలున కే క్రియ నిచ్చెఁ? జెప్పవే.(295) ఎందును రక్షితుం డగుచు నింద్రుఁడు లీలయ పోలె వైరి సే¯ నం దునుమాడి దేవతలు నమ్మి సుఖింపఁగ నిష్ఠసంపదం¯ జెంది సమస్తలోకముల జేకొని యేలె మునీంద్ర! దాని నే¯ విందు సుఖంబుఁ గందు నిఁక వీనులు సంతస మందఁ బల్కవే.

శ్రీమన్నారాయణ కవచము

(296) వర నారాయణ కవచము¯ నరిభీకర వజ్రకవచ మాశ్రిత సంప¯ త్పరిణామ కర్మసువచము¯ పురుహూతున కెట్లు మౌని బోధించె? దగన్. (297) అనినం బరీక్షిజ్జనపాలునకు మునినాథుం డిట్లనియె.(298) "వినవయ్య! నరనాథ! మునినాథుఁ డింద్రున¯ కనువొంద నారాయణాఖ్య మైన¯ కవచంబు విజయ సంకల్పంబు నప్రమే¯ యస్వరూపంబు మహాఫలంబు¯ మంత్రగోప్యము హరిమాయావిశేషంబు¯ సాంగంబుగాఁగ నెఱుంగఁ జేసె; ¯ దాని నే వినిపింతుఁ బూని తదేకాగ్ర¯ చిత్తంబుతోడుతఁ జిత్తగింపు;(298.1) మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు¯ ముఖముగా నుత్తమాసనమున వసించి¯ కృత నిజాంగ కరన్యాస మతిశయిల్ల¯ మహిత నారాయణాఖ్య వర్మము నొనర్చె.(299) ఇట్లు నారాయణకవచంబు ఘటియించి, పాదంబులను, జానువులను, నూరువులను, నుదరంబునను, హృదయంబునను, నురంబునను, ముఖంబునను, శిరంబునను నట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుచేసి ద్వాదశాక్షర విద్యచేతం గరన్యాసంబు చేసి, మంత్రమూఁర్తియై భగవచ్ఛబ్ద వాచ్యం బైన ప్రణవాది యకారాంత మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ పర్వసంధులయం దుపన్యసించి, మఱియు హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబు నందు, ణకారంబు శిఖ యందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వ సంధులయందు మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించె నేని మంత్రమూర్తి యగు; మఱియును "అస్త్రాయఫట్"అను మంత్రంబున దిగ్భంధనంబుచేసి, పరమేశ్వరునిం దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్చక్తి సంయుతం బైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠియించె.(300) గరుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ¯ ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో¯ త్కర నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం¯ భరిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్. (301) ప్రకట మకర వరుణ పాశంబు లందును¯ జలములందు నెందుఁ బొలియ కుండఁ¯ గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డై నట్టి¯ మత్స్యమూర్తి విద్యమానకీర్తి.(302) వటుఁడు సమాశ్రిత మాయా¯ నటుఁడు బలిప్రబల శోభనప్రతిఘటనో¯ ద్భటుడు త్రివిక్రమదేవుఁడు¯ చటులస్థలమందు నన్ను సంరక్షించున్.(303) అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం¯ దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం¯ హుఁడు సురశత్రుయూధప వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ¯ క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.(304) అరయఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో¯ నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా¯ కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో¯ హరుఁడు గృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁగావుతన్.(305) రాముఁడు రాజకులైక వి¯ రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ¯ స్తోముఁడు నను రక్షించును ¯ శ్రీమహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.(306) తాటక మర్దించి తపసి జన్నముఁ గాచి¯ హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి ¯ ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర¯ ఖరదూషణాది రాక్షసులఁ దునిమి¯ వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి¯ జలరాశి గర్వంబుఁ జక్కజేసి¯ సేతువు బంధించి చేరి రావణ కుంభ¯ కర్ణాది వీరులఁ గడిమిఁ ద్రుంచి(306.1) యల విభీషణు లంకకు నధిపుఁ జేసి¯ భూమిసుతఁ గూడి సాకేత పురము నందు¯ రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు¯ వరుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.(307) మఱియు; నఖిల ప్రమాదంబు లైన యభిచార కర్మంబుల వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబువలన యోగనాథుఁ డయిన దత్తాత్రేయుండును, గర్మబంధంబులవలన గణేశుం డైన కపిలుండును, గామదేవునివలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుటవలన శ్రీహయగ్రీవమూర్తి యును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబులవలన నారదుండును, నశేష నిరయంబులవలనఁ గూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుం డైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముం డయిన ఋషభుండును, జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబులవలన శేషుండును, నప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషాండ సమూహంబువలన బుద్ధదేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణపరుం డయిన మహావతారుండు నన్ను రక్షించుంగాత; ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నాపరాహ్ణ సాయంకాలంబులను ప్రదోషార్ధరాత్రాపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను గదాద్యాయుధంబుల ధరియించి, కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తు లను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుంగాక; ప్రళయకాలాన లాతితీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రం బైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు చేయు భంగి, భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము; జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటిసం స్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమనానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణకరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయవైరి దండోపదండంబుల భండనంబునం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక రక్షో భూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదంబు సలుపుము; ధరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణునిఁ నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్శ్వాసాధర వేణు పూరితంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మ త్పరవీరమండ లంబుల గుండియలతోఁ దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబయిన భూరి నాదంబున మోదింపు; మతి తీవ్రధారా దళిత నిశాతకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవయిన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు ఖండములుగ ఖడించి చెండాడుము; నిష్కళంక నిరాంతక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిరతం బవయిన చర్మంబ! దుర్మద మద్వైరిలోకంబులకు భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠుర తమః పటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము; నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు పొందకుండ భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల రక్షించుం గాక; బృహద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయం బడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుఁగాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణంబుల సంరక్షించు; భగవంతుండయిన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు; జగ దైక్యభావంబయిన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయ చేత ధరియించి తేజరిల్లు చుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁగాక; లోకభయంకరాట్టహాస భాసుర వదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుం డగు నప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబు వలన, సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుఁ గాత"మని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాస రూపంబున నింద్రుండు దెలిసికొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించెం; గావున నెవ్వరేని నిర్మలాత్ము లగు వార లే తద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన; నతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వ గ్రహ నిగ్రహ కర్మ మారణకర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి, యవ్యాకుల మనస్కులై, విజయంబు నొందుదురు; మఱియును, సర్వ రోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదు; రదియునుం గాక.(308) అతిభక్తిఁ గౌశికుం డను బ్రాహ్మణుఁడు దొల్లి¯ యీ విద్య ధరియించి యెలమి మించి¯ మరుభూమియందు నిర్మలచిత్తుఁడై యోగ¯ ధారణంబున బిట్టు తనువు విడిచె¯ దానిపై నొకఁడు గంధర్వవరేణ్యుండు¯ చిత్రరథాఖ్యుఁ డజేయుఁ డొంటి¯ చదలఁ జనంగఁ దచ్ఛాయ తదస్థిపైఁ¯ గదసిన నాతఁడు గళవళించి(308.1) యువిద పిండుతోడ నవ విమానముతోడఁ¯ దనదు విద్యతోడ ధరణిఁ ద్రెళ్ళి¯ తిరిగి లేవలేక తికమక గుడువంగ¯ వాలఖిల్యమౌని వానిఁ జూచి.(309) "నారాయణ కవచ సమా¯ ధారణ పుణ్యాస్థి దీని దగ్గఱ నీకుం¯ గూరెడినె? విష్ణుభక్తుల¯ వారక చేరంగ నెట్టివారికిఁ దరమే?(310) సంధించి నీ యంగక సంధులెల్లన్¯ బంధించి తన్మంత్రబలంబు పేర్మి¯ న్నందంబు మాన్పింపఁ దదన్యమేదీ? ¯ సింధుప్రవాహోన్నతిచేతఁ దీరున్.(311) కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండ వై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు జేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన, నీ సర్వాంగబంధనంబు లుడుగు" ననిన నతం డట్ల చేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెఁ; గావున.(312) అనుదినము దీని నెవ్వరు¯ వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్¯ ఘన భూతజాల మెల్లను¯ మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్.(313) విశ్వరూపువలన నైశ్వర్యకరమైన¯ యిట్టి విద్యఁ దాల్చి యింద్రుఁ డపుడు¯ మూఁడులోకములకు ముఖ్యమైనట్టి శ్రీ¯ ననుభవించి మించె నధికమహిమ.(314) భూపాల! యా విశ్వరూపున కరుదైన¯ తలలు మూఁ డనువొందఁ గలిగి యుండు; ¯ సొరిది సురాపాన సోమపానంబులు¯ నన్నాద మనఁగను నమరవరుల¯ తోఁగూడి భుజియించి తూకొని వారితో¯ యజ్ఞభాగంబు ప్రత్యక్ష మొంది¯ కైకొనుచుండి దుష్కర్ముఁడై యా యజ్ఞ¯ భాగంబు రాక్షస ప్రవరులకును(314.1) దల్లిమీఁద గలుగు తాత్పర్యవశమున¯ దివిజవరుల మొఱఁగి తెచ్చి యిచ్చు¯ నది యెఱింగి యింద్రుఁ డతిభీతచిత్తుఁడై¯ తనకుఁగాని యతని తలలు ద్రుంచె.(315) భాసురుఁ డనక మహాత్మా¯ గ్రేసరుఁ డన కతఁడు పూర్వకృత కర్మగతిన్¯ వేసరుఁ డనక మహేంద్రుఁడు¯ భూసురు తల లపుడు రోషమునఁ దెగ నడిచెన్.(316) ఇట్లయ్యింద్రుఁడు క్రోధంబు సహింపంజాలక విశ్వరూపుతలలు ఖడ్గంబునం దెగనడచిన సోమపానంబు చేయు శిరంబు కపింజలం బయ్యె; సురాపానంబు చేయు శిరంబు కలవింకం బయ్యె; అన్నంబు భక్షించు శిరంబు తిత్తిరి యయ్యె; నిట్లు త్రివిధ పక్షిస్వరూపంబు దాల్చి, బ్రహ్మహత్య యేతెం