పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ఠ 161 - 245

(161) "శ్రీకృష్ణభటులచేత ని¯

 రాకృతులై యామ్యభటులు యమునకు నాత్మ¯

 స్వీకృత విప్రకథా క్రమ¯

 మీ క్రియ ము న్దెలిపి రదియు నెఱింగింతుఁ దగన్.

(162) "చేరి త్రైవిధ్యమున మించు జీవతతికిఁ¯

 గర్మఫలములఁ దెలిపెడు కారణంబు¯

 లగుచు శిక్షించువార లీ యవనిమీఁద¯

 దేవ! యెందఱు గలరయ్య! తెలియవలయు.

(163) దక్షిణదిశాధినాయక! ¯

 శిక్ష దగం జేయువారు క్షితిఁ బెక్కండ్రే¯

 నీ క్షయమును నక్షయమును¯

 సాక్షాత్తుగ నెందు రెండు సంపన్న మగున్?

(164) దట్టమైనట్టి కర్మబంధముల నెల్ల¯

 నాజ్ఞ బెట్టెడువారు పెక్కైన చోట¯

 నకట! శాస్తృత్వ ముపచార మయ్యెఁ గాదె? ¯

 శూరులై నట్టి మండలేశులకుఁ బోలె.

(165) కావున నీవ యొక్కఁడవ కర్తవు మూఁడు జగంబులందు సం¯

 భావిత భూతకోటిఁ బరిపాకవశంబున శిక్షజేయఁగా¯

 నీ వర శాసనం బఖిలనిర్ణయమై తనరారుచుండ నేఁ¯

 డీవలఁ గ్రమ్మఱింప మఱి యెవ్వఁడు శక్తుఁడు? ధర్మపాలనా!

(166) చండ కర తనయ! యొరులకు¯

 దండధరత్వంబు గలదె? తగ జగమున ను¯

 ద్దండధరవృత్తి నొత్తిలి¯

 దండింతువు నిన్ను దండధరుఁడని పొగడన్.

(167) ఇట్టి నీ దండంబ యీ మూఁడుజగములఁ¯

 దెగువమై నేఁడు వర్తిల్లుచుండ¯

 మనుజలోకంబున మహితాద్భు తాకార¯

 సిద్ధుల మిగులఁ బ్రసిద్ధు లైన¯

 వారు నల్వురు వేగ వచ్చి నిర్దేశంబు¯

 భంగించి మమ్మంత చెంగఁదోలి¯

 నీ శాసనంబున నే మీడ్చి కొనువచ్చు¯

 క్రూరచిత్తునిఁ బుచ్చికొని యదల్చి

(167.1) పాశబంధంబు లీసునఁ బట్టి త్రెంచి¯

 బలిమి మిగులంగ మమ్మును బాఱఁదోలి¯

 యిచ్ఛఁ జనినారు వారు దా మెచటివార¯

 లాదరమ్మున మాకు నేఁ డానతిమ్ము."

(168) అని"రని మఱియు శుకుం డిట్లనియె "నట్లు దూతలు పరితాప సమేతులై పలికిన, దండధరుఁడు పుండరీకాక్షుని చరణకమలంబులు దన మానసంబున సన్నిహితంబుగఁ జేసికొని, వందంనం బాచరించి, పరమ భక్తిపరుండై వారల కిట్లనియె.

(169) "కలఁడు మదన్యుండు ఘనుఁ డొక్కఁ డతఁ డెందు¯

 వెలికిఁ గానఁగరాక విశ్వమెల్లఁ¯

 నతిలీనమై మహాద్భుత సమగ్రస్ఫూర్తి¯

 నుండును గోకఁ నూలున్నభంగి¯

 దామెనఁ బశువులు దగిలి యుండెడు మాడ్కి¯

 నామసంకీర్తన స్థేమగతుల¯

 విహరించు నెవ్వఁడు విలసిత మత్పూజ¯

 లెవ్వని పదముల నివ్వటిల్లుఁ

(169.1) గనుట మనుట చనుట గల్గు నెవ్వని లీల¯

 లందు లోక మెవనియందుఁ బొందు¯

 నెన్నఁబడుచుఁ బుడమి నెవ్వని నామముల్¯

 కర్మబంధనముల పేర్మి నడఁచు.

(170) వినుఁడు నేను మహేంద్రుఁ డప్పతి వీతిహోత్రుఁడు రాక్షసుం¯

 డనిలుఁ డర్కుఁడు చంద్రుఁడుం గమలాసనుండు మరుద్గణం¯

 బును మహేశుఁడు రుద్రవర్గము భూరి సంయమి సిద్ధులున్¯

 మొనసి కన్గొనజాల రెవ్వని మూర్తి విశ్రుతకీర్తిమై.

(171) సత్త్వేతర గుణపాశ వ¯

 శత్త్వంబునఁ బొంద వీరు జలజాక్షు సదై¯

 కత్త్వంబు గాన నోపరు¯

 సత్త్వప్రాధాన్యు లితర జనముల తరమే?

(172) అభవు నమేయు నవ్యయు ననంతు ననారతుఁ బూని మేనిలో¯

 నుభయము నై వెలుంగు పురుషోత్తముఁ గానరు చిత్తకర్మ వా¯

 గ్విభవ గరిష్ఠులై వెదకి వీఱిఁడి ప్రాణులు; సర్వవస్తువుల్¯

 శుభగతిఁ జూడనేర్చి తనుఁ జూడఁగనేరని కంటిపోలికన్.

(173) పరముని భక్తలోక పరిపాలన శీలుని దుష్టలోక సం¯

 హరుని పతంగపుంగవ విహారుని కూరిమిదూత లామనో¯

 హరులు సురేంద్రవందితులు నా హరిరూప గుణస్వభావులై¯

 తిరుగుచునుందు రెల్లడలఁ దిక్కులఁ దేజము పిక్కటిల్లఁగన్.

(174) లెక్కకు నెక్కువై కసటులేని మహాద్భుత తేజ మెల్లెడం¯

 బిక్కటిలం జరింతు రతి భీమబలాఢ్యులు విష్ణుదూత లా¯

 చక్కని ధర్మశాంతు లతిసాహసవంతులు దేవపూజితుల్¯

 గ్రిక్కిఱియన్ జగంబునను గేశవసేవక రక్షణార్థమై.

(175) నా వలనను మీ వలనను¯

 దేవాసుర గణము వలనఁ ద్రిజగంబులలో¯

 నే వగలఁ బొందఁకుండఁగఁ¯

 గావం గలవారు పుడమిఁ గల వైష్ణవులన్.

(176) భగవత్ప్రణిహిత ధర్మం¯

 బగపడ దెవ్వారి మతికి ననిమిష గరుడో¯

 రగ సిద్ధ సాధ్య నర సుర¯

 ఖగ తాపస యక్ష దివిజ ఖచరుల కైనన్.

(177) ఎన్నఁడుఁ దెలియఁగ నేరరు¯

 పన్నగపతిశాయి తత్త్వభావము మేనం¯

 గన్నుల వేల్పును డాపలఁ¯

 జన్నమరిన వేల్పు ముదుక చదువుల వేల్పున్.

(178) వర మహాద్భుత మైన వైష్ణవజ్ఞానంబుఁ¯

 దిరముగా నెవ్వరు దెలియఁగలరు? ¯

 దేవాదిదేవుండు త్రిపురసంహరుఁ డొండెఁ¯

 గమలసంభవుఁ డొండెఁ గార్తికేయ¯

 కపిల నారదు లొండె గంగాత్మజుం డొండె¯

 మను వొండె బలి యొండె జనకుఁ డొండెఁ ¯

 బ్రహ్లాదుఁ డొండె నేర్పాటుగా శుకుఁ డొండె¯

 భాసురతరమతివ్యాసుఁ డొండెఁ

(178.1) గాక యన్యుల తరమె? యీ లోకమందు¯

 నీ సుబోధంబు సద్బోధ మీ పదార్థ¯

 మీ సదానంద చిన్మయ మీ యగమ్య¯

 మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు.

(179) ఈ పన్నిద్దఱు దక్కఁగ¯

 నోపరు తక్కొరులు దెలియ నుపనిష దుచిత¯

 శ్రీపతినామ మహాద్భుత¯

 దీపిత భాగవత ధర్మ దివ్యక్రమమున్.

(180) ఏది జపియింప నమృతమై యెసఁగుచుండు¯

 నేది సద్ధర్మపథ మని యెఱుఁగ దగిన¯

 దదియె సద్భక్తి యోగంబు నావహించు¯

 మూర్తిమంతంబు దా హరికీర్తనంబు.

(181) కంటిరే మీరు సుతులార! కమలనేత్రు¯

 భవ్య మగు నామకీర్తన ఫలము నేఁడు¯

 దవిలి మృత్యువు పాశబంధములవలన¯

 జాణతనమున నూడె నజామిళుండు.

(182) ఏటికి జాలిఁ బొంద? నరులే క్రియఁ గృష్ణుని కీర్తనంబు పా¯

 పాటవులన్ దహింపఁ గల దౌటకు సందియ మేల? యిప్పు డీ¯

 తూఁటరి దోషకారి పెనుదోషి యజామిళుఁ డంతమొందుచుం¯

 బాటిగ విష్ణునామ సుతుఁ బల్కుచుఁ గేవలముక్తి కేగఁడే?

(183) ఇంతయును దథ్య మని మది¯

 నింతయుఁ దెలియంగలేరు హీనాత్ములు దు¯

 ర్దాంతతర ఘటిత మాయా¯

 క్రాంతాత్యంతప్రకాశ గౌరవ జడులై.

(184) ఈ విధమునన్ విబుధు లేకతమ చిత్తముల నేకతము లేక హరి నీశున్¯

 భావమున నిల్పి తగు భాగవత యోగిపరిపాకమున నొందుదురు వారిం¯

 దేవలదు దండన గతిం జనదు మాకు గురితింప నఘముల్ దలగు మీదన్¯

 శ్రీవరుని చక్రము విశేషగతి గాచు సురసేవితులు ముక్తి గడు బెద్దల్.

(185) ఎవ్వరు సిద్ధ సాధ్య ఖచరేశ లసత్పరిగీత గాథలం¯

 దెవ్వరు ముక్తిభోగతల హేమ మనోహర చంద్రశాలలం¯

 దెవ్వరు శంఖచక్ర గురుహేతి గదా రుచిరోగ్రపాణు లా¯

 మవ్వపు రూపవంతు లసమానులు పో ధరలోని వైష్ణవుల్.

(186) శ్రుత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ¯

 భగవత్ప్రసంగతుల్ భాగవతులు; ¯

 సనకాది ముని యోగిజన సదానందైక¯

 పరమ భాగ్యోదయుల్ భాగవతులు; ¯

 కృష్ణపదధ్యాన కేవలామృతపాన¯

 పరిణామ యుతులు శ్రీభాగవతులు; ¯

 బహుపాత కానీక పరిభవ ప్రక్రియా¯

 పరుషోగ్ర మూర్తులు భాగవతులు;

(186.1) భావ తత్త్వార్థవేదులు భాగవతులు; ¯

 బ్రహ్మవా దానువాదులు భాగవతులు; ¯

 సిరులు దనరంగ నెన్నఁడుఁ జేటులేని¯

 పదవి నొప్పారువారు పో భాగవతులు.

(187) అదిగాన విష్ణుభక్తులఁ¯

 గదియఁగఁ జనవలదు మీరు కరివరదు లస¯

 త్పదపద్మ వినతి విముఖులఁ¯

 దుది నంటఁగఁ గట్టి తెండు ధూర్తులు వారల్.

(188) ఎకసక్కెమున కైన నిందిరారమణునిఁ¯

 బలుకంగలేని దుర్భాషితులను¯

 గలలోన నైన శ్రీకాంతుని సత్పాద¯

 కమలముల్ చూడని కర్మరతుల¯

 నవ్వుచు నైనఁ గృష్ణప్రశంసకుఁ జెవిఁ¯

 దార్పనేరని దుష్కథా ప్రవణుల¯

 యాత్రోత్సవంబుల నైన నీశుని గుడి¯

 త్రోవఁ ద్రొక్కఁగలేని దుష్పదులను

(188.1) బరమ భాగవతుల పాదధూళి సమస్త¯

 తీర్థసార మనుచుఁ దెలియలేని¯

 వారి వారివారి వారిఁ జేరినవారిఁ¯

 దొలుతఁ గట్టి తెండు దూతలార!

(189) ఎల్ల పాపములకు నిల్లైన యింటిలో¯

 బద్ధతృష్ణు లగుచు బుద్ధి దలఁగి¯

 పరమహంసకులము గుఱిదప్పి వర్తించు¯

 ధూర్తజనులఁ దెండు దూతలార!

(190) అరయఁ దనదు జిహ్వ హరిపేరు నుడువదు¯

 చిత్త మతని పాదచింతఁ జనదు; ¯

 తలఁపఁ దమకు ముక్తి తంగేటి జున్నొకో¯

 సకల విష్ణు భక్తులకును బోలె?

(191) పద్మనయను మీఁది భక్తి యోగం బెల్ల¯

 ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు¯

 వారి వారివారి వారిఁ జేరినవారి ¯

 త్రోవఁ బోవ వలదు దూతలార!

(192) అని పలికె"నని చెప్పి మఱియు శుకుం డిట్లనియె "శ్రీకృష్ణనామ కీర్తనంబు జగన్మంగళం బనియును, జగన్మోహనం బనియును, జగజ్జేగీయమానం బనియును, నిఖిలపాపైక నిష్కృతి యనియును, నిఖిల దుఃఖ నివారణం బనియును, నిఖిలదారిద్ర్య నిర్మూలనం బనియును, నిఖిల మాయా గుణవిచ్ఛేదకం బనియును, నుద్దామంబు లగు హరి వీర్యంబుల నాకర్ణించు వారల చిత్తంబు లతి నిర్మలంబులగు భంగిం దక్కిన వ్రతాచరణంబులం గావనియును, శ్రీకృష్ణ పదపద్మంబులు హృత్పద్మంబుల నిలుపు వార లన్య పాపకర్మంబు లగు నవిద్యా వ్యసనంబులం బొరయ నేరరనియును, నిజస్వామియైన యమధర్మ రాజుచేతఁ గీర్తింపంబడిన భగవన్మహత్త్వంబు నాకర్ణించి, విస్మితులై కాలకింకరులు నాఁటనుండియు వైష్ణవజనంబులం దేఱిచూడ వెఱతురు; నరేంద్రా! పరమగుహ్యంబగు నీ యితిహాసంబును బూర్వకాలంబున సకల విజ్ఞానగోచరుండైన కుంభసంభవుండు సకలదుఃఖ విలయంబును సకలపుణ్య నిలయంబును నైన మలయంబునఁ బురాణపురుషుండైన పురుషోత్తము నారాధనంబు చేయుచుండి నాకెఱింగించెను;"అని చెప్పిన విని విస్మయానంద హృదయుండై పరీక్షిజ్జనపాలుం డిట్లనియె.</p>

<h3>చంద్రుని ఆమంత్రణంబు</h3> <p style='text-indent: 6%'>(193) స్వాయంభువ మనువేళల&#175;

 నోయయ్య! సురాసు రాండ జోరగ నర వ&#175;

 ర్గాయత సర్గము దెలిపితి&#175;

 పాయక యది విస్తరించి పలుకం గదవే."

(194) ఉత్తర కొడు కిట్లడిగిన&#175;

 నుత్తరమును నమ్మునీంద్రుఁ డుత్తమచేతో&#175;

 వృత్తి ముదమంది పలికెను&#175;

 దత్తఱపా టుడిగి వినుఁడు తాపసవర్యుల్!

(195) "పూని ప్రచేతసుపుత్రులు పదుగురు&#175;

 ప్రాచీనబర్హిష ప్రాఖ్య గలుగు&#175;

 వారు మహాంబోధి వలన వెల్వడి వచ్చి&#175;

 తగ వృక్ష వృతమైన ధరణిఁ జూచి&#175;

 మేదినీజములపై మిక్కిలి కోపించి&#175;

 మదిలోన దీపితమన్యు లగుచు&#175;

 వక్త్రంబులను మహావాయు సంయుతమైన&#175;

 యనలంబుఁ గల్పించి యవనిజములఁ

(195.1) బెల్లువడఁ గాల్పఁ దొడఁగినఁ దల్లడిల్లి&#175;

 వారి కోపంబు వారించువాఁడ పోలెఁ&#175;

 బలికెఁ జందురుఁ డో మహాభాగులార! &#175;

 దీనమగు వృక్షముల మీఁదఁ దెగుట దగునె?

(196) మొదల వర్ధిష్ణు లగు మిమ్ము సదయ హృదయు&#175;

 లగు ప్రజాపతు లనుచు సర్వాత్ముఁ డనియె; &#175;

 నట్టి మీరు ప్రజాసృష్టి కైన వార&#175;

 లీ వనస్పతి తతుల దహింపఁ దగునె?

(197) ఆదికాలంబున నా ప్రజాపతి పతి&#175;

 యైన లోకేశ్వరుం డచ్యుతుండు&#175;

 పద్మనేత్రుఁడు వనస్పతుల నోషధి ముఖ్య&#175;

 జాతంబు నిషము నూర్జంబుఁ గోరి&#175;

 కల్పించె; నందు ముఖ్యంబైన యన్నంబు&#175;

 నచరంబు లై నట్టి యపద మెల్లఁ&#175;

 బాదచారులకును బాల్వెట్టి యిరుగాళ్ళు&#175;

 చేతులు గలిగిన జీవతతికి

(197.1) పాణులొగి లేని యా చతుష్పాత్తు లెల్ల&#175;

 నన్నముగఁ బూని గావించె నదియుఁగాక&#175;

 నా మహాభాగుఁ డచ్యుతుఁ డాదరమున&#175;

 మీకు ననఘాఖ్య విఖ్యాతి జోకపఱిచె.

(198) నిజముగ దేవాధీశ్వరుఁ&#175;

 డజుఁడు ప్రజాసర్గమునకు ననఘుల మిమ్మున్&#175;

 సృజియించె నిట్టివారికిఁ&#175;

 గుజదహనము చేయ నెట్లు గోరిక పొడమెన్?

(199) సతత మహత్త్వ సత్త్వ గుణ సత్పురుషస్మృతిఁ బొందరయ్య! మీ&#175;

 పితరులునుం బితామహులుఁ బెద్దలు నెన్నఁడుఁ బొందనట్టి దు&#175;

 ష్కృతమతమైన కోపమునఁ గిల్బిషభావము మానరయ్య! సం&#175;

 భృత కరుణావలోకమున భీత తరుప్రకరంబు జూచుచున్.

(200) తప్పక యర్భకావళికిఁ దల్లియుఁ దండ్రియు నేత్రపంక్తికిన్&#175;

 ఱెప్పలు నాతికిం బతియు ఱేఁడు ప్రజావళి కెల్ల నర్ధి కిం&#175;

 పొప్ప గృహస్థు మూఢులకు నుత్తము లెన్న సమస్తబాంధవుల్&#175;

 ముప్పునఁ గావలేని కడుమూర్ఖులు గారు నిజాల చుట్టముల్.

(201) అఖిల భూతముల దేహాంతస్థమగునాత్మ&#175;

 యీశుఁ డచ్యుతుఁడని యెఱుఁగవలయు; &#175;

 నెఱిఁగి సర్వం బైన యిందిరారమణు లోఁ&#175;

 జూపులఁ దనివిగాఁ జూడవలయు; &#175;

 జూచిన చిద్రూప శుద్ధాత్ము లగు మిమ్ము&#175;

 నెనసిన వేడ్కతోనిచ్చమెచ్చు; &#175;

 మెచ్చిన సర్వాత్ము మీ రెఱింగినచోటఁ&#175;

 గోపగుణంబులఁ బాపవలయు;

(201.1) బాపి దగ్ధశేష పాదపజాలంబు&#175;

 దియ్య మెసఁగ బ్రతుకనియ్యవలయు; &#175;

 ననఘులార! మీర లస్మదీయప్రార్థ&#175;

 నంబు పరఁగఁ జేకొనంగవలయు.

(202) ఇదె వృక్ష సముద్భవ యగు&#175;

 మదిరేక్షణ నాప్సరసిఁ గుమారిక నిత్తున్&#175;

 వదలక పత్నిఁగఁ జేకొని&#175;

 ముద మందుఁడు పాదపముల మోసమువాయన్."

(203) అని యిట్లామంత్రణంబు జేసి, మారిష యను కన్యకను వారల కిచ్చి చంద్రుండు చనియె; అప్పుడు.

(204) వారలు పర్యాయంబున&#175;

 నీరేజముఖిన్ వరించి నెఱి రమియింపన్&#175;

 ధీరుఁడు ప్రాచేతసుఁడై&#175;

 వారక దక్షుండు పుట్టె వనజజ సముఁడై.

(205) ఎవ్వని సంతానంబులు&#175;

 నివ్వటిలెన్ వసుధ నెల్ల నెఱి నా దక్షుం&#175;

 డెవ్వలన జగము లన్నిటఁ &#175;

 బ్రవ్వ జలము నిలిపినట్లు ప్రజఁ బుట్టించెన్.

(206) వారని వేడ్కతో దుహితృ వత్సలదక్షుఁడు దక్షుఁడాత్మచేఁ&#175;

 గోరి సృజించెఁ గొన్నిటి నకుంఠిత వీర్యముచేతఁ గొన్నిటిన్&#175;

 బోరన ఖేచరంబులను భూచరముఖ్య వనేచరంబులన్&#175;

 నీరచరవ్రజంబు రజనీచరజాల దివాచరంబులన్.

(207) నర సుర గరు డోరగ కి&#175;

 న్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములం&#175;

 దరమిడి సృష్టి యొనర్చెను&#175;

 దిరముగ దక్షప్రజాపతి వితతకీర్తిన్.

(208) బహువిధముల బహుముఖముల&#175;

 బహురూపములైన ప్రజల బహులోకములన్&#175;

 బహుళముగఁ జేసి మదిలో&#175;

 బహుమానము నొందఁ డయ్యె బ్రఖ్యాతముగన్.

(209) ఆ ప్రజాసర్గ బృంహితం బయిన జగము&#175;

 దక్షుఁ డీక్షించి మదిలోనఁ దాప మొంది&#175;

 మఱియు జననంబు నొందించు మతము రోసి&#175;

 పరమపురుషుని నాశ్రయింపంగఁ దలఁచె.

(210) ఇట్లు దక్షప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టస్వాంతుంజేయువాఁడై.

(211) మోదం బై పరిదూషిత&#175;

 ఖేదం బై శాబరీద్ధ కిలికించిత దృ&#175;

 గ్భేదం బై బహుసౌఖ్యా&#175;

 పాదం బై యొప్పు వింధ్యపాదంబునకున్.

(212) అరిగి, యం దఘమర్షణం బను తీర్థంబు సర్వదురితహరం బయి యొప్పుదాని ననుసవనంబు సేవించి, యతి ఘోరం బయిన తపంబు చేయుచు హరిం బ్రసన్నుం జేసి, హంసగుహ్యం బను స్తవరాజంబున నిట్లని స్తుతియించె.</p>

<h3>హంసగుహ్య స్తవరాజము</h3> <p style='text-indent: 6%'>(213) "పరమునికి వందన మొనర్తుఁ బరిఢవించి&#175;

 మున్నవితథానుభూతికి మ్రొక్కికొందు; &#175;

 మెఱయు గుణములఁ దేలు నిమిత్తమాత్ర&#175;

 బంధువై నట్టి వానికిఁ బ్రణతు లిడుదు.

(214) తవిలి గుణుల చేతఁ దత్త్వబుద్ధులచేత&#175;

 నిగిడి కానరాని నెలవువాని&#175;

 మొదలఁ దాన కలిగి ముక్తి మానావధి&#175;

 రూపమైనవాని ప్రాపుఁ గందు.

(215) ఎల్ల తనువులందు నిరవొంది తనతోడఁ&#175;

 బొందు చేసినట్టి పొందుకాని&#175;

 పొందు పొందలేఁడు పురుషుండు గుణము నా&#175;

 గుణినిఁ బోలు నట్టి గుణి భజింతు.

(216) పూని మనంబునుం దనువు భూతములున్ మఱి యింద్రియంబులుం&#175;

 బ్రాణములున్ వివేక గతిఁ బాయక యన్యముఁ దమ్ము నెమ్మెయిం&#175;

 గానఁగనేర వా గుణనికాయములం బరికించునట్టి స&#175;

 ర్వానుగతున్ సమస్తహితు నాదిమపూరుషు నాశ్రయించెదన్.

(217) మఱియు; ననేకవిధ నామ రూప నిరూప్యంబగు మనంబునకు దృష్టస్మృతుల నాశంబువలనఁ గలిగెడు నుపరామం బగు సమాధి యందుఁ గేవల జ్ఞానస్వరూపంబునఁ దోచు నిర్మల ప్రతీతిస్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు; దారువందు నతి గూఢంబైన వీతిహోత్రుని బుద్ధిచేతం బ్రకాశంబు నొందించు భంగి, బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుం డయిన పరమపురుషుని నాత్మశక్తిత్రయంబులచేతం దేజరిల్లఁ జేయుదు; రట్టి దేవుండు, సకల మాయావిచ్ఛేదకం బయిన నిర్వాణ సుఖానుభవంబునం గూడి యుచ్ఛరింపం గొలఁదిగాని శక్తిగల విశ్వరూపుండు నాకుం బ్రసన్నుండగుంగాక; వాగ్భుద్ధీంద్రియ మానసంబులచేతం జెప్పను, నిట్టి దని నిరూపింపను, నలవిగాక యెవ్వని గుణరూపంబులు వర్తించు, నెవ్వండు నిర్గుణుండు, సర్వంబు నెవ్వనివలన నుత్పన్నంబగు, నెవ్వనివలన స్థితిం బొందు, నెవ్వని వలన లయంబగు, నట్టి పరాపరంబులకుం బరమంబై, యనన్యంబై, ప్రాక్ప్రసిద్ధంబై, సర్వవ్యాపకంబై, యాదికారణంబై యున్న తత్త్వంబు నాశ్రయింతు; నెవ్వని ప్రభావంబు మాటలాడెడు వారలకు, వాదంబు చేయువారలకు వివాద సంవాదస్థలంబు లగుచు నప్పటప్పటికి మోహంబు నొందించుచుండు, నట్టి యనంతగుణంబులు గల మహాత్మునకుం బ్రణామంబు చేయు; దస్థి నాస్థి యను వస్తుద్వయ నిష్ఠలం గలిగి, యొక్కటన యుండి విరుద్ధ ధర్మంబులుగఁ గనంబడు నుపాసనా శాస్త్ర సాంఖ్యశాస్త్రంబులకు సమంబై, వీక్షింపఁదగిన పరమంబు నాకు ననుకూలంబగు గాక, యెవ్వఁడు జగదనుగ్రహంబుకొఱకు జన్మ కర్మంబులచేత నామరూపంబు లెఱుంగంబడ కుండియు, నామరూపంబులు గలిగి తేజరిల్లు, నట్టి యనంతుడయిన భగవంతుండు ప్రసన్నుండగుం గాక; యెవ్వండు జనులకుఁ బురాకృత జ్ఞాన పదంబుల చేత నంతర్గతుండై, మేదినిం గలుగు గంధాది గుణంబుల నాశ్రయించిన వాయువు భంగి మెలంగుచుండు నా పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు జేయు గాక"యనుచు భక్తి పరవశుండయి యుక్తి విశేషంబున స్తుతియించుచున్న దక్షునికి భక్తవత్సలుం డైన శ్రీవత్సలాంఛనుండు ప్రాదుర్భావంబు నొందె; నప్పుడు.

(218) భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబునఁ&#175;

 గలిగిన నీలంపు గను లనంగ&#175;

 మొనసి తార్క్ష్యుని యిరుమోపు పై నిడినట్టి&#175;

 పదముల కాంతులు పరిఢవిల్లఁ&#175;

 జండ దిఙ్మండల శుండాల కరముల&#175;

 కైవడి నెనిమిది కరము లమరఁ&#175;

 జక్ర కోదండాసి శంఖ నందక పాశ&#175;

 చర్మ గదాదుల సరవిఁ బూని

(218.1) నల్లమేను మెఱయ నగుమొగం బలరంగఁ&#175;

 జల్ల చూపు విబుధ సమితిఁ బ్రోవ&#175;

 బసిఁడికాసెఁ బూని బహు భూషణ కిరీట&#175;

 కుండలముల కాంతి మెండు కొనఁగ. 

(219) కుండల మణిదీప్తి గండస్థలంబులఁ&#175;

 బూర్ణేందురాగంబుఁ బొందుపఱుప&#175;

 దివ్యకిరీట ప్రదీప్తులంబర రమా&#175;

 సతికి గౌసుంభవస్త్రంబు గాఁగ&#175;

 వక్షస్థలంబుపై వనమాలికాశ్రీలు&#175;

 శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ&#175;

 నీలాద్రిఁ బెనఁగొని నిలిచిన విద్యుల్ల&#175;

 తల భాతిఁ గనకాంగదంబు మెఱయ

(219.1) నఖిలలోక మోహనాకార యుక్తుఁడై&#175;

 నారదాది మునులు జేరి పొగడఁ&#175;

 గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర&#175;

 సిద్ధ గాన రవము చెవుల నలర.

(220) సర్వేశుఁడు సర్వాత్ముఁడు&#175;

 సర్వగతుం డచ్యుతుండు సర్వమయుండై&#175;

 సర్వంబుఁ జేరి కొలువఁగ&#175;

 సర్వగుఁడై దక్షునకుఁ బ్రసన్నుం డయ్యెన్.

(221) ఇట్లు ప్రసన్నుండయిన సర్వేశ్వరుని సర్వంకషంబును మహాశ్చర్యధుర్యంబును నయి తేజరిల్లు దివ్యరూపంబుఁ గాంచి, భయంబును హర్షంబును విస్మయంబును జిత్తంబున ముప్పిరిగొని చొప్పు దప్పింపం దెప్పఱి, కప్పరపాటునం బుడమిపైఁ జాగిలంబడి, దండ ప్రణామంబు లాచరించి, కరకమలంబులు మొగిడ్చి సెలయేఱుల తొట్టునఁ గొట్టుపడి, యిట్టట్టుఁ బట్టుచాలక నిట్టపొడిచి, మున్నీరుదన్ని నిలచిన పెన్నీరునుం బోలె, సర్వాంగంబులుం దొంగిలింపఁ, జిత్తంబు నాత్మాయత్తంబుజేసి, పిక్కటిల్లిన సంతోషంబుచేత భగవంతుం బలుకను, నత్యంత మంగళ సందోహాపాదకంబు లైన తన్నామంబు లుగ్గడింపను, నతి నిర్మలంబులైన తదీయకర్మంబులు దడవను, విబుధ హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడను, నాత్మీయ మనోరథంబు వాక్రువ్వను నోపక ప్రజాకాముండై యూరకున్న ప్రజాపతిం జూచి, సర్వజీవ దయాపరుండును, సర్వసత్త్వ హృదంతరస్థుండును, సర్వ జ్ఞుండునుం, గావున నతని భావంబు దెలిసి, జగన్నాథుం డార్తపోషణంబులైన భాషణంబుల నిట్లనియె.

(222) "మెచ్చితిఁ బ్రాచేతస! తప&#175;

 మిచ్చట ఫలసిద్ధి యయ్యె నిట్లతిభక్తిన్&#175;

 హెచ్చగు మద్వరవిభవము&#175;

 నచ్చుపడం బొంద నెవ్వఁ డర్హుఁడు? జగతిన్.

(223) తపము చాలు నింకఁ దగ భూతతతికి వి&#175;

 భూతు లొనరుఁ గాక పొందుపడఁగ; &#175;

 నిదియ సుమ్ము మాకు నిచ్చలోఁ గల కోర్కి&#175;

 పొసఁగ నీదువలనఁ బొందుపడియె.

(224) వినుము, బ్రహ్మయు, భర్గుండును, బ్రజాపతులును, మనువులును, నింద్రులును, నిఖిల భూతంబులకు భూతిహేతువులయిన మద్భూతి విభవంబులు; మఱియు, నాకు యమ నియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు; సాంగ జపవద్ధ్యానరూపం బగు విద్య శరీరంబు; ధ్యానాది విషయంపు వ్యాపారంబుగా నుండు భావనాది శబ్దవాచ్యంబగు క్రియ యాకృతి; క్రతు జాతంబు లంగంబులు; ధర్మం బాత్మ; దేవతలు ప్రాణంబులు; నిగమంబు మత్స్వరూపంబు; జగదుత్పత్తికి నాది యందు నే నొక్కండన తేజరిల్లుచుంటి; బహిరంతరంబుల వేఱొక్కటి లేక సుషుప్త వ్యవస్థ యందు సర్వంబు లీనం బగుటం జేసి సంజ్ఞామాతృండును, నవ్యక్తుండునుగా నుండు జీవుని భంగి నొక్కఁడన యుండుదు; ననంతుండ నై యనంతగుణంబులు గల మాయా గుణంబువలన గుణ విగ్రహం బగు బ్రహ్మాండంబును, నయోనిజుండు స్వయంభువు నగు బ్రహ్మయును నుదయించిరి; మదీయ వీర్యోపబృంహితుండయి మహా దేవుం డగు నా బ్రహ్మ యసమర్థుండునుంబోలె నకృతార్థమ్మన్యమాన మనస్కుండయి, సృజింప నుద్యమించు తఱి తపం బాచరింపు మని నాచేత బోధితుండై, ఘోరంబైన తపం బాచరించి తొలుత సృష్టికర్తృత్వంబు వహించిన మిమ్ము సృజియించె; నంతఁ బంచజన ప్రజాపతి తనూజయగు యసిక్ని యను పేరిట వినుతినొంది యున్న యిక్కన్యకను నీ కిచ్చితి; దీనిం బత్నిఁగాఁ గైకొని మిథునవ్యవాయ ధర్మంబు గలవాఁడవై మిథునవ్యవాయధర్మంబు గల యీ నాతి యందుఁ బ్రజాసర్గంబు నతి విపులంబుగ గావింపం గలవాఁడవు. మఱియు నీకుఁ బిదప నీ క్రమంబున నిఖిల ప్రజలును మన్మాయా మోహితులై మిథునవ్యవాయధర్మంబునఁ బ్రజావృద్ధి నొందించి మదారాధనపరులై యుండ గలవా"రని పలికి, విశ్వభావనుండైన హరి, స్వప్నోపలబ్ధార్థంబునుం బోలె నంతర్ధానంబు నొందె; నప్పుడు దక్షుండు విష్ణుమాయోపబృంహితుం డై పాంచజని యగు నసక్ని యందు హర్యశ్వసంజ్ఞల వినుతిఁ జెందియున్న యయుతసంఖ్యాపరిగణితు లైన పుత్రులం గాంచె; అప్పుడా ధర్మశీలు రైన దాక్షాయణులు పితృనిర్దేశంబునం బ్రజాసర్గంబు కొఱకుఁ దపంబుచేయువారై పశ్చిమ దిశకుం జని, యచ్చట సింధు సముద్ర సంగమంబున సమస్త దేవ ముని సిద్ధగణ సేవితంబై, దర్శనమాత్రంబున నిర్ధూతకల్మషులను నిర్మలచిత్తులనుం జేయుచున్న నారాయణ సరస్సనం బరగు తీర్థరాజంబున నవగాహనంబు చేసి, నిర్మలాంతరంగులై పరమహంసధర్మంబు నందు నుత్పన్నమతు లై ప్రజాసర్గంబు కొఱకుఁ దండ్రి యనుమతంబున నుగ్రతపంబు చేయుచుండ, వారికడకు నారదుండు వచ్చి, యిట్లనియె.

(225) "మీ రతిమూఢులు మీదఁటి గతి గాన&#175;

 రెన్నంగఁ బసిబిడ్డ లన్నలార! &#175;

 పుడమిఁ దా నింతని కడఁ బరికింపరు&#175;

 ప్రజలఁ బుట్టింప నే ప్రతిభ గలదు? &#175;

 అట్లైన నొక్క మహాత్ముఁడు పురుషుండు&#175;

 బహురూపములు గల భామ యొకతె&#175;

 పుంశ్చలి గర్తంబు బురణింప నుభయ ప్ర&#175;

 వాహంబు గల నది వఱలఁ గదల

(225.1) నంచ యొకటి యిరువదైదింటి మహిమలఁ&#175;

 గలిగియుండు తెరువు గానరాక&#175;

 వజ్రనిబిడ మగుచు వరుసఁ దనంతన&#175;

 తిరుగుఁ గాష్ఠబిలము దేటపడఁగ.

(226) వినుఁ డందుల ననురూపము&#175;

 నను పొందఁగ నెఱుఁగ కాత్మ నాత్మ గురూక్తిం&#175;

 గొనసాగించెద మను మి&#175;

 మ్మన నేమియు లేదు మూఢు లని తెలిసి తగన్. "

(227) అని నారదుండు బోధించిన హర్యశ్వులు సహజబుద్ధిచేత నారద వాక్యంబులఁ దమలోన నిట్లని వితర్కించిరి.

(228) "సొరిది క్షేత్రజ్ఞుఁడన నతిసూక్ష్మ బుద్ధి&#175;

 నరయ నజ్ఞానబంధనం బగుచు లింగ&#175;

 దేహమన నెద్ది గల దది దెలియకున్నఁ&#175;

 గలదె? మోక్షంబు దుష్కర్మ గతులచేత.

(229) కలఁడు జగదేక సన్నుత కారణుండు &#175;

 స్వామి భగవంతుఁ డభవుండు స్వాశ్రయుండు&#175;

 పరముఁ డాతనిఁ జూడక బ్రహ్మ కైనఁ&#175;

 గలుగునే? ముక్తిపదము దుష్కర్మగతుల.

(230) పురుషుఁ డెట్టులేనిఁ బూని బిలస్వర్గ&#175;

 గతుఁడుఁ బోలె వర్తకంబు మాను&#175;

 నట్టి బ్రహ్మ మెఱుఁగు నయ్యకు స్వర్భోగ&#175;

 కర్మగతుల నేమి గానఁబడును?

(231) తన్నిష్ఠాగతి లేనివానికి నసత్కర్మప్రచారంబుచే&#175;

 మున్నే మయ్యెడి నాత్మబుద్ధి గుణ సమ్మోహంబునం దోఁచుచున్&#175;

 వన్నెల్ పెట్టుక వింతబాగుల తఱిన్ వర్తించు దౌర్గుణ్య సం&#175;

 పన్నస్త్రీయును బోలె నెల్లగతులం బ్రఖ్యాతమై యుండగన్.

(232) అనువొంద సృష్టిన వ్యయముగఁ జేయుచుఁ&#175;

 బ్రచుర ప్రవాహ సంపతిత మైన&#175;

 నెఱయఁ గూలం బను నిర్గమ స్థానంబు&#175;

 నందు వేగముగల క్రందు మాయ&#175;

 గదిలి యహంకార గతివశంబునఁ జాల&#175;

 వివశుఁడై బోధకు విపరి యైన&#175;

 వానికి నీరీతి వలవంత కర్మ ప్ర&#175;

 చారంబులను మీఁదఁ జక్కనైన

(232.1) జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతోఁ బాసి&#175;

 నిఖిల సౌఖ్య పదవి నెఱసి కమ్ర&#175;

 మార్గమైనయట్టి మహనీయ ధామంబు&#175;

 జిత్త మార నెట్లు చేరఁ గలడు?

(233) దాని సంసర్గ గుణములు దప్పి నడచు&#175;

 కుచ్చితపు భార్యఁ జేకొన్న కుమతిబోలె&#175;

 దివిరి సుఖదుఃఖములఁ గూడి తిరిగి జీవ &#175;

 రూప మెఱుఁగని వారికిఁ బ్రాపు గలదె?

(234) పంచవింశతి తత్త్వరాశి కపారదర్పణ మయ్యుఁ దాఁ&#175;

 గొంచమై పురుషుండు తత్త్వముఁగోరి పట్టఁగ నేర కే&#175;

 మంచుఁ గించుఁ దలంచువాఁడు కదధ్వ కర్మము జేయఁగా&#175;

 మంచిలోకము వానికేటికి మానుగా సమకూరెడిన్? 

(235) బంధాను మోక్షణక్రమ&#175;

 సంధా నైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర&#175;

 గ్రంథంబు మాను చిద్రూ&#175;

 పాంధునకును గర్మగతుల నగునే శుభముల్.

(236) చూడ నీ జగమంతయున్ వెసఁ జుట్టి పట్టుక లీల నే&#175;

 జోడులేక రయంబునం గుడి సుట్టుపట్టి స్వతంత్రముం&#175;

 గూడి యుండిన కాలచక్రముఁ గోరి చూడని వారి కే&#175;

 జాడఁగల్గును గర్మ సంగతిఁ జారుమోక్షపదం బిలన్.

(237) జన్మ హేతు వైన జనకునిర్దేశంబు&#175;

 తనకుఁ జేయరాని దనుచుఁ దెలిసి&#175;

 గుణమయప్రవృత్తి ఘోరాధ్వ నిశ్శ్వాస&#175;

 నిరతుఁ డగుచుఁ జేయ నేరఁ డతఁడు. "

(238) అని తమలో వితర్కించి యా కుమారు లప్పుడు.

(239) వినవయ్య! భూపాల! మునివరేణ్యుని మాట&#175;

 లనువొందఁ దలపోసి వినయ మలర&#175;

 వలగొని యతనికి వందనంబు లొనర్చి&#175;

 తిరిగి యెన్నఁడు రాని తెరువు పట్టి&#175;

 చయ్యన నేగిరి సహజ సత్త్వబ్రహ్మ&#175;

 మయమైన పంకజనయను పాద&#175;

 పద్మ మరందంబు పానంబు జేయుచు&#175;

 మత్తిల్లి నిలిచిన మానసాళి

(239.1) బరిణమింప విష్ణుఁ బాడుచుఁ దత్కీర్తి&#175;

 సరణి మ్రోయు మహతి సంఘటించి &#175;

 నారదుండు గుణవిశారదుం డెందేనిఁ&#175;

 జనియెఁ దన్ను జగము సన్నుతింప.

(240) అప్పుడు దక్షుఁడు దనయులు&#175;

 దప్పి మహాపథము గనుటఁ దగ నారదుఁడే&#175;

 చెప్పినఁ గప్పిన శోకము&#175;

 ముప్పిరిగొని చిత్తవృత్తి మూరిం బోవన్.

(241) అడలుచు నున్న వచ్చి కమలాసనుఁ డూఱడిలంగఁ బల్కె మున్&#175;

 పడసిన లీలఁ బుత్రుల నపార గుణాఢ్యులఁ గాంచుమన్న నా&#175;

 పడఁతుక యందుఁ బల్వురను బన్నుగఁ దా శబళాశ్వ సంజ్ఞలం&#175;

 బెడఁగగు వారిఁ బుణ్యముల చేర్చినవారి సహస్ర సంఖ్యులన్.

(242) పుట్టించిన జనకుని మదిఁ&#175;

 బుట్టిన తలఁ పెఱిగి వారు పూనికఁ బ్రజలం&#175;

 బుట్టించు వ్రతముఁ గైకొనిఁ&#175;

 గట్టిగఁ దప మాచరింపఁగాఁ జనిరి వెసన్.

(243) ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబు కొఱకుఁ దండ్రి పంపునం దపంబు జేయువారై యే తీర్థంబు తీర్థరాజం బై సకలతీర్థఫలంబు నాలోకన మాత్రంబునన నుగ్రహించుచు సకలపాపంబుల నిగ్రహించు, నే తీర్థ ప్రభావంబున నగ్రజన్ములు ఫలసిద్ధిం బొందుదు, రట్టి నారాయణసర స్సను పుణ్యతీర్థంబునకుం జని, త దుపస్పర్శమాత్రంబున నిర్ధూత మలాశయులై.

(244) బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబుఁ జింతించుచున్&#175;

 బ్రహ్మానందముఁ బొంది జిహ్వికలపై బ్రహ్మణ్యమంత్రంబులన్&#175;

 బ్రహ్మాలోకనవాంఛతో నిలుపుచున్ బ్రహ్మం బితండంచు మున్&#175;

 బ్రహ్మజ్ఞాన గురున్ హరిం దపమునం బాటించి రబ్బాలకుల్.

(245) ఏకపాదాంగుష్ఠ మిలమీఁద సవరించి&#175;

 నిశ్చల కాయులై నిక్కి నిలిచి&#175;

 కరములు గీలించి సరవి మీఁదికి నెత్తి&#175;

 గుఱుతుగాఁ బెనుబయల్ గుట్టిపట్టి&#175;

 నిడివిగాఁ గ్రూరమై నిగిడిన చూడ్కులఁ&#175;

 గఁడు దీవ్రభానునిఁ బొడిచిపట్టి&#175;

 వడిఁ గొంతకాలంబు వాయువు భక్షించి&#175;

 యంతనుండియు నిరాహారు లగుచు

(245.1) సకలలోకములకు సంహారకరమును&#175;

 బేర్చి దేవతలకు భీతికరము&#175;

 గాఁగ ఘోరతపముఁ గావింపఁ దొడఁగిరి&#175;

 మహిత చిత్తు లక్కుమారవరులు.</p>