పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : షష్ట స్కంధము 1- 59


పోతన తెలుగు భాగవతం
షష్ఠ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల¯ శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ¯ దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా¯ వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్. (2) నిండుమతిం దలంతుఁ గమనీయ భుజంగమరాజమండలీ¯ మండనుఁ జంద్రఖండ పరిమండితమస్తకుఁ దారమల్లికా¯ పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారు కో¯ దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్. (3) హంసతురంగముం బరమహంసము నంచితదేవతా కులో¯ త్తంసము నాగమాంత విదితధ్రువపుణ్యరమావతంసమున్¯ కంసజిఘాంసు నంశమును గర్బురసూత్ర సమావృతాంసమున్¯ హింస నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్. (4) మోదకహస్తునిన్ సమదమూషకవాహను నేకదంతు లం¯ బోదరు నంబికాతనయు నూర్జితపుణ్యు గణేశు దేవతా¯ హ్లాదగరిష్ఠు దంతిముఖు నంచిత భక్తఫలప్రదాయకున్¯ మోదముతోడ హస్తములుమోడ్చి భజించెద నిష్టసిద్ధికిన్. (5) కల్లతనంబు గాక పొడగట్టిన పూర్వపురీతి నేఁడు నా¯ యుల్లమునందు నుండుము సమున్నత తేజముతోడ భక్తి రం¯ జిల్లిన చూపుగూడ విధిఁజెందిన ప్రోడ బుధాళి నీడ మా¯ తల్లి దయామతల్లి ప్రణతద్రుమకల్పకవల్లి భారతీ! (6) విలసత్కంకణరవరవ¯ కలితం బగు నభయ వరద కరముల బెరయం¯ జెలరేఁగి భక్తులకు నల¯ కలుములు దయచేయు జలధికన్యకఁ దలతున్. (7) కాళికి బహుసన్నుత లో¯ కాళికిఁ గమనీయ వలయ కరకీలిత కం¯ కాళికిఁ దాపస మానస¯ కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్. (8) అని యిష్టదేవతాప్రార్థనంబు జేసి. (9) పరమసమాధిధుర్యుఁ బటు పావనకర్మ విధేయు దేవతా¯ వర నర వంద్యు సద్విమలవాక్యు జనార్దనకీర్తనక్రియా¯ భరణ సమర్థు వేద చయ పారగు భవ్యుఁ ద్రికాలవేది భా¯ సురమతిఁ గొల్చుటొప్పు బుధశోభితుఁ బుణ్యుఁ బరాశరాత్మజున్, (10) వ్యాసుని భగవత్పద సం¯ వాసుని నాగమ పురాణ వర విష్ణుకథా¯ వాసుని నిర్మల కవితా¯ భ్యాసుని పదపద్మయుగము భావింతు మదిన్. (11) వరకవిత్వోద్రేకి వాల్మీకిఁ గొనియాడి¯ భాగవతార్థ వైభవముఁ బలుకు¯ శుకమంజులాలాపు శుకయోగిఁ బ్రార్థించి¯ బాణ మయూరుల ప్రతిభ నొడివి¯ భాస సౌమల్లిక భారవి మాఘుల¯ ఘన సుధా మధుర వాక్యములఁ దలఁచి ¯ కాళిదాసుఁ గవీంద్రకల్పవృక్షముఁ గొల్చి¯ నన్నపాచార్యు వర్ణనలఁ బొగడి (11.1) వెలయఁ దిక్కన సోమయాజుల భజించి¯ యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చఁ గొల్చి¯ సుకవిసోముని నాచనసోమునెఱిఁగి¯ కవిమనోనాథు శ్రీనాథు ఘనత మెచ్చి. (12) ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్¯ సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో¯ నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో¯ బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్. (13) అని సకల సుకవి నికరంబులకు ముకుళిత కరకమలుండనై.

కృతిపతి నిర్ణయము

(14) ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం¯ బెయ్యది సన్మునీంద్రులకు నెల్లఁ గవిత్వసమాశ్రయంబు ము¯ న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మి రూ¯ పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్. (15) అని శ్రీమహాభాగవత పురాణంబునందు షష్ఠస్కంధం బాంధ్రభాష రచియింపంబూని యీ కృతికిం బతిగా నద్దేవుండు గలం డని వితర్కించి నాకుం గవిత్వమహత్వంబు సంప్రాప్తంబగు కాలంబు దలంచి నారాయణుండె దైవం బని యెఱింగి మనోరథంబు సఫలంబయ్యె నని యీ కృతిఁ గృష్ణార్పణంబు చేసితిని; అది యెట్లనిన నేను విద్యాభ్యాసంబునం దగిలి కొండొక నై యుండ నొక్కనాఁడు దివంబున. (16) కలిత విశేషవస్త్రములు గట్టి హిమాంబు సుగంధ చందనం¯ బలఁది వినూత్న భూషణము లారఁగఁ దాల్చి వినోదలీల నిం¯ పుల మృదుశయ్య నిద్రఁదగఁ బొందినచోఁ గనుపట్టెఁ బల్మఱుం ¯ దలమునఁ గమ్ము క్రొమ్మెఱుఁగుదండము రూపున నిల్చు పోలికిన్. (17) ఉరవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ¯ కోటిబింబచ్ఛాయ గూడినట్లు¯ హరిహర బ్రహ్మల యాత్మలలో నుబ్బి¯ కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు¯ ఖరకర కర తీవ్ర గతినిఁ గరంగుచు¯ హేమాద్రి చెంతఁ బె ల్లెగసినట్లు¯ ఫణిరాజ ఫణరాజి మణిగణ విస్ఫూర్తి¯ సుషిరంపు వెలిఁదల చూపినట్టు (17.1) లుట్టిపడ్డట్లు కట్టెఱ్ఱ నూఁదినట్లు¯ తేజ మెసఁగంగ నా మ్రోల దివ్యవాణి¯ పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ¯ జూచి యిట్లని పలికె మంజులముగాను (18) "ఆటలుఁ బాటలుం జదువు లద్భుతముల్ విననొప్పు వాద్యముల్ ¯ సాటి దలంపరాని బలుసాములు మున్నగు విద్యలెల్ల నీ¯ కాటఁలు బాట లయ్యె విను మన్నిటికిన్ మెఱుఁగిడ్డభంగి నా¯ చాటునఁ జాటుకారపద సాధుకవిత్వముఁ జెప్పు మింపుగన్" (19) అని యానతిచ్చు జగన్మాతృ కృపావలోకన సుశ్లోకుండనై యే నొక్క శ్లోకంబు నా క్షణంబ నుడివితి; నది యెట్టి దనిన. (20) హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ¯ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ¯ సత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ¯ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తె. (21) ఈ శ్లోకం బద్దేవి యంగీకరించె; నంత మేలుకాంచి యానంద భరితుండ నై నాఁటనుండి, చంద్రానుగత యగు చంద్రికయుం బోలె, నారాయణాంకితం బయిన కవిత్వ తత్త్వజ్ఞానంబు గోచరం బయ్యె; దానికి ఫలంబుగా గోపికావల్లభుని నుల్లంబున నిడికొని. (22) పలుకఁ గలిగె మొదల భాగవతార్థంబు¯ భర్త గృష్ణుఁ డయ్యె భాగ్య మొదవె¯ నమృతరసముఁ గోర నలరు చింతామణి¯ పాత్ర సంభవించు భంగి నిపుడు. (23) భాగవతము దేటపఱుప నెవ్వఁడు జాలు¯ శుకుఁడు దక్క నరుని సకుఁడు దక్క¯ బుద్ధిఁ దోచినంత బుధులచే విన్నంత¯ భక్తి నిగిడినంత పలుకువాఁడ. (24) పుట్టిననాఁటనుండియును, బుట్టద యెట్టియ దట్టు నైనఁ జేఁ¯ పట్టి నుతింపఁ జిత్తము శుభం బగు మద్వరవాక్యసీమకుం¯ బట్టము గట్టినాఁడ హరిఁబాయక తత్కథనామృతంబు నే¯ నుట్టిపడంగఁ జెప్పుదు బుధోత్తము లానుఁడు శ్రోత్రపద్ధతిన్. (25) అని.

గ్రంథకర్త వంశ వర్ణనము

(26) శ్రీవత్స గోత్రుండు శివభక్తి యుక్తుఁ డా¯ పస్తంబ సూత్రుఁ డపార గుణుఁడు¯ నేర్చూరి శాసనుం డెఱ్ఱన ప్రెగ్గడ¯ పుత్రుండు వీరన పుణ్యమూర్తి¯ కాత్మజుం డగు నాదయామాత్యునకుఁ బోల¯ మాంబకు నందను లమితయశులు¯ కసువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి¯ సింగధీమణియు నంచితగుణాఢ్యు (26.1) లుద్భవించిరి తేజంబు లూర్జితముగ¯ సొరది మూర్తి త్రయం బన శుభ్రకీర్తిఁ¯ బరఁగి రందులఁ గసువనప్రభువునకును¯ ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె. (27) ఆడదు భర్తమాట కెదురాడదు వచ్చినవారి వీఁడగా¯ నాడదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా¯ టాడదు మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి యే¯ చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్. (28) ఆ కసువయమంత్రికిఁ బు¯ ణ్యాకల్పశుభాంగి ముమ్మడమ్మ మమున్న¯ వ్యాకుల చిత్తుల నిరువుర ¯ శ్రీకర గుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్. (29) అంగజసమ లావణ్య శు¯ భాంగులు హరి దివ్యపదయుగాంబుజ విలస¯ ద్భృంగాయమాన చిత్తులు¯ సింగయ తెలగయలు మంత్రిశేఖరు లనగన్. (30) అందగ్రజుండ శివపూ¯ జం దనరినవాఁడ విష్ణుచరితామృత ని¯ ష్యంది పటు వాగ్వ్విలాసా¯ నందోచిత మానసుండ నయకోవిదుఁడన్ (31) కావునం గృష్ణపాదారవింద సందర్శ నాదర్శతలాయమాన చిత్తుండ నై.

షష్ఠ్యంతములు

(32) శ్రీపతికి మత్పతికి నుత¯ గోపతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం¯ తాప నివారణ మతికిని ¯ బ్రాపితసనకాది తతికి బహుతర ధృతికిన్, (33) హరికి గురు కలుషకుంజర¯ హరికి బలాభీలహరికి నంతస్థ్సిత గ¯ హ్వరికి నరహరికి రక్షిత¯ కరికిఁ గరాగ్రస్థగిరికి ఘనతరకిరికిన్. (34) గుణికి సమాశ్రిత చింతా¯ మణికి మహేంద్రాది దివిజమండల చూడా¯ మణికిఁ బ్రకల్పితశయ్యా¯ ఫణికి నురోభాగ కౌస్తుభప్రియమణికిన్, (35) కంసాసుర సంహారున¯ కంసాంచిత కర్ణకుండ లాభరణునకున్¯ హింసాపర పరమస్తక¯ మాంసకరాళిత గదాభిమత హస్తునకున్. (36) వర యోగిమాన సాంతః¯ కరణ సుధాంభోధి భావకల్లోల లస¯ త్పరతత్త్వశేషశాయికిఁ¯ జిరదాయికి సకలభక్తచింతామణికిన్

కథా ప్రారంభము

(37) సమర్పింతంబుగా నా యొనర్పం బూనిన షష్ఠస్కంధంబునకుఁ గథాప్రారంభక్రమం బెట్టిదనిన, హరి చరణస్మరణ పరిణామ వినోదులయిన శౌనకాదులకు నిఖిల పురాణేతిహాస నిర్ణయ విఖ్యాతుండైన సూతుం డిట్లనియె. (38) శ్రీరమణీ రమణ కథా¯ పారాయణ చిత్తుఁడగుచుఁ బలికెఁ బరీక్షి¯ ద్భూరమణుఁ డాదరంబున¯ సూరిజనానందసాంద్రు శుకయోగీంద్రున్. (39) "షడ్గుణైశ్వర్య శాశ్వతమూర్తి వయినట్టి¯ మునినాథ! దయతోడ ముక్తిపదము¯ మున్నుగా నేమార్గమున వినిపించితి¯ వారయ నపవర్గ భూరిమహిమఁ ¯ గ్రమయోగసంభవ బ్రహ్మంబుతోఁగూడ¯ ననుబొంద నగు నని వినుతి కెక్క¯ మఱియు సత్త్వరజ స్తమః ప్రభావంబులఁ¯ గడిఁదియై యున్నట్టి కర్మచయము (39.1) నప్పటప్పటి కడఁగని యట్టి ప్రకృతి¯ గలుగు పురుషుని భోగార్థఘటన దేహ¯ కారణా రంభ రూపమార్గంబు మొదలు¯ మాటిమాటికి నన్నియుఁ దేటపడఁగ (40) మఱియు ననేక పాపలక్షణంబులగు నానావిధ నరకంబులును వాని కాద్యంతంబులును, స్వాయంభువ సంబంధి యగు మన్వంతరంబును, బ్రియవ్రతోత్తానపాదుల వంశంబును, దచ్చరిత్రంబును, ద్వీప వర్ష సముద్రాద్రి నద్యుద్యానవనస్పతులును, భూమండల సంస్థాపనంబును, వాని పరిమాణంబును, జ్యోతిశ్చక్రచలన ప్రకారంబును, విభుండయిన పరమేశ్వరుం డెవ్విధంబున నిర్మించె నా విధంబంతయు నెఱింగించినాడ; విప్పుడు. (41) కడిఁది వేదనలకుఁ గారణంబై యుండు¯ గుఱుతులేని నరక కూపరాశి¯ పాలుగాక నరుఁడు బ్రతికెడు మార్గంబు¯ పరమపుణ్య! తెలియఁ బలుకవయ్య!" (42) అనినం బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. (43) "కట్టా! త్రికరణ మెఱుఁగక¯ పుట్టిన దురితముల నపుడ పొలియింపని యా¯ కట్టఁడి దేహం బుడిగినఁ¯ గొట్టాడును బిట్టు నరకకూపంబులలోన్. (44) కావునఁ గాలకింకర వికారము గానకమున్న మృత్యు దు¯ ర్భావనఁ జిత్తమున్ వెడఁగుపాటును జెందకమున్న మేనిలో¯ జీవము వెల్గుచుండఁ దన చెల్వము దప్పకమున్న పన్నుగాఁ¯ బావనచిత్తుఁడై యఘముఁ బాయు తెఱం గొనరింపఁ గాఁదగున్. (45) కాలం బెడగని పాపము¯ మూలముఁ జెఱుపంగవలయు మును రోగములం¯ దేలిన దోషము నెఱుఁగుచు¯ వాలాయము దాని నడఁచు వైద్యుని భంగిన్." (46) అనవుడు నాతని కనియె భూకాంతుండు¯ "కనుకలి వినుకలి గలిగినట్టి¯ పాపము దనకు నొప్పని దని కని చాలఁ¯ బరితప్తుఁడయ్యుఁ గ్రమ్మఱ నొనర్చు¯ మూఢాత్మునకు దోషమోచనం బెయ్యది¯ యారయ నెఱిఁగింపు మదియుఁగాక¯ కలుష మొక్కొకచోటఁ గావించు నొకచోటఁ¯ గావింపకుండుఁ దత్కర్మమెఱిగి (46.1) యిట్టి జనుఁడు పుణ్య మేరీతిఁ జేసిన¯ నది ఫలింపనేర దని తలంతు¯ సలిలమందు మేని మలినంబుఁ బోకుండ¯ గజము గ్రుంకుబెట్టు గతియుఁ బోలె." (47) అనిన శుకుం డిట్లనియె. (48) "కర్మము కర్మముచేతను¯ నిర్మూలము గాదు తెలియనేరక తా నే¯ కర్మము జేసినఁ దత్ప్రతి¯ కర్మం బొనరింప వలయుఁ గలుషవిదూరా! (49) హితవు గల కుడుపు మఱి రు¯ గ్వితతులఁ బొడమంగ నీని విధమున నతి స¯ ద్వ్రతుఁ డైనవాఁడు నిర్మల¯ మతిచే నఘరాశి నెల్ల మట్టము జేయున్. (50) తపమున బ్రహ్మచర్యమున దానమునన్ శమ సద్దమంబులన్¯ జపమున సత్యశౌచముల సన్నియమాది యమంబులం గృపా¯ నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తను వాక్యజంపు పా¯ పపుగురిఁ ద్రుంతు రగ్ని శతపర్వ వనంబుల నేర్చుకైవడిన్. (51) అదియుం గాక. (52) కొందఱు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా¯ నంద మరందపాన కలనారత షట్పదచిత్తు లౌచు గో¯ వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం¯ జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచు కైవడిన్. (53) హరిభక్తిచేతఁ గొందఱు¯ పరిమార్తురు మొదలుముట్ట పాపంబుల ని¯ ష్ఠురతర కరముల సూర్యుం¯ డరుదుగఁ బెనుమంచుఁ బించ మడఁచిన భంగిన్. (54) దంతిపురనాథ! విను మొక¯ మంతన మెఱిఁగింతు శమ దమంబులు నంహో¯ వంతు శుభవంతుఁ జేయవు¯ కంతుని గురుభక్తి ముక్తిఁ గలిగించు గతిన్. (55) హరికి నర్థముఁ బ్రాణ మర్పితంబుగ నుండు¯ వాని కైవల్య మెవ్వనికి లేదు¯ వనజలోచను భక్తపరుల సేవించిన¯ వాని కైవల్య మెవ్వనికి లేదు¯ వైకుంఠ నిర్మల వ్రతపరుండై నట్టి¯ వాని కైవల్య మెవ్వనికి లేదు¯ సరసిజోదరు కథాశ్రవణ లోలుం డైన¯ వాని కైవల్య మెవ్వనికి లేదు (55.1) లేదు తపముల బ్రహ్మచర్యాది నియతి¯ శమ దమాదుల సత్యశౌచముల దాన¯ ధర్మ మఖముల సుస్థిర స్థానమైన¯ వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము. (56) అరయ నెన్నఁడుఁ జేటు లేనట్టి ముక్తి¯ వర్త్మ మీ లోకమందు నెవ్వరికిఁ గలదు? ¯ సాధులును బుణ్యశీలురు సజ్జనులును¯ హరిపరాయణ తత్పరు లయినఁ గాక. (57) అరుదుగ నరహరి భక్తిం¯ బొరయని యా పురుషు సుకృత పుంజంబులు వేఁ¯ మఱుఁ బుణ్యుఁ జేయ నేరవు¯ నరవర మధుఘటముఁ బెక్కు నదులుం బోలెన్. (58) సతతముఁ గృష్ణపాదజలజంబుల యందు మనంబు నిల్పు సు¯ వ్రతులు దదీయ శుద్ధ గుణరాగులుఁ గాలుని యుగ్రపాశ సం¯ హతుల ధరించు తత్సుభటకౌఘములం గలలోనఁ గాన రే¯ గతులను దుష్టకర్మములు గైకొని వారలఁ జెందనేర్చునే? (59) కావున నీ యర్థంబునకుం బురాతనంబగు నొక్క యితిహాసంబు గలదు; అది విష్ణుదూత యమదూత సంవాదం బనంబడు; దాని నెఱింగింతు; ఆకర్ణింపుము