పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : పంచమ ఉత్తర 77 - 134

భగణ విషయము

(77) కమలజాండ మధ్యగతుఁడైన సూర్యుండు¯ భరితమైన యాతపంబుచేత¯ మూఁడు లోకములను ముంచి తపింపంగఁ¯ జేసి కాంతి నొందఁజేయుచుండు. (78) ఇట్లు భాస్కరుం డుత్తరాయణ దక్షిణాయన విషువు లను నామంబులు గల మాంద్య తీవ్ర సమానగతుల నారోహణావరోహణ స్థానంబుల యందు దీర్ఘ హ్రస్వ సమానంబులుగాఁ జేయుచుండు. (79) మేషతులల యందు మిహిరుం డహోరాత్ర¯ మందుఁ దిరుగు సమవిహారములను; ¯ బరఁగఁగ వృషభాది పంచరాసులను నొ¯ క్కొక్క గడియ రాత్రి దక్కి నడచు. (80) మించి వృశ్చికాది పంచరాసులను నొ¯ క్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు; ¯ దినములందు నెల్ల దిగజారు నొక్కొక్క¯ గడియ నెలకుఁ దత్ప్రకారమునను. (81) మఱియు; నివ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షణాయనంబుల వృద్ధిక్షయంబుల నొంద నొక్క యహోరాత్రంబున నేకపంచాశదుత్తరనవ కోటి యోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర పర్వతంబున సూర్యరథంబు దిరుగుచుండు; నా మానసోత్తరపర్వతంబు నందుఁ దూర్పున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను యమ నగరంబును, పశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను సోముని పుటభేదనం బును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్నా స్తమయ నిశీథంబు లనియెడు కాలభేదంబులను, భూత ప్రవృత్తి నిమిత్తం బచ్చటి జనులకుఁ బుట్టించు చుండు; సూర్యుం డెపు డింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాఁ బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడులక్షల డెబ్బదియైదువేల యోజనంబులు నడచు; నివ్వింధంబున నింద్ర యమ వరుణ సోమ పురంబుల మీఁదఁ జంద్రాది గ్రహ నక్షత్రంబులం గూడి సంచరించుచుం బండ్రెండంచులు, నాఱు గమ్ములును, మూఁడు దొలులుం గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహూర్త మాత్రంబున ముప్పది నాలుగులక్షల నెనమన్నూఱు యోజనంబులు సంచరించు. (82) ఇనురథంబున కున్న యిరుసొక్కటియ మేరు¯ శిఖరంబునందును జేరి యుండు; ¯ నొనరఁ జక్రము మానసోత్తర పర్వతం¯ బందులఁ దిరిగెడు నా రథంబు¯ నిరుసున నున్న రెం డిరుసులు దగులంగఁ¯ బవన పాశంబుల బద్ధ మగుచు ¯ ధ్రువమండలంబు నందుల నంటియుండఁగా¯ సంచరించుచునుండు సంతతంబు; (82.1) నట్టి యరదంబు ముప్పదియాఱులక్ష¯ లందు నంటిన కాడిఁయు నన్ని యోజ¯ నముల విస్తారమై తురంగముల కంధ¯ రములఁ దగులుచు వెలుఁగొందు రమణతోడ. (83) ఆ రథంబునకు గాయత్రీచ్ఛందం బాదిగా సప్తచ్ఛందంబులు నశ్వంబులై సంచరించు; భాస్కరునకు నగ్రభాగంబున నరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు; వెండియు నంగుష్ఠపర్వమాత్ర శరీరంబులుగల యఱువదివేల వాలఖిల్యాఖ్యు లగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మఱియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుస క్రమంబున సేవింపం, దొమ్మిదికోట్ల నేబఁది యొక లక్ష యోజనంబుల పరిమాణంబు గల భూమండలంబు నం దొక క్షణంబున సూర్యుండు రెండువేలయేబది యోజనంబులు సంచరించుచు, నొక యహోరాత్రంబు నందె యీ భూమండలం బంతయు సంచరించు"ననిన శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (84) "మునివర! మేరుధ్రువులకు¯ నొనరఁ బ్రదక్షిణము దిరుగుచుండెడు నజుఁ డా¯ యినుఁ డభిముఖుఁడై రాసుల¯ కనుకూలత నేగు నంటి; వది యెట్లొప్పున్." (85) అని పలికిన భూవరునిం¯ గనుగొని శుకయోగి మిగులఁ గరుణాన్వితుఁడై¯ మనమున శ్రీహరిఁ దలఁచుచు¯ విను మని క్రమ్మఱఁగ నిట్లు వినిపించెఁ దగన్. (86) "నరేంద్రా! యతి వేగంబునఁ దిరుగుచుండు కులాల చక్రంబు నందు జక్ర భ్రమణంబునకు వేఱైన గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలకాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు నెదుర సంచరించు సూర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబుల యందును రాశ్యంతరంబుల యందు నునునికి గలుగుటం జేసి సూర్యాది గ్రహంబులకుఁ జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుండు; మఱియు నా సూర్యుం డాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచేత వేదాం తార్థంబుల ననవరతంబు వితర్క్యమాణం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశ విధంబులుగ విభజించి వసంతాది ఋతువుల నాయా కాలవిశేషంబుల యందుఁ గలుగఁ జేయుచుండు; నట్టి పరమ పురుషుని మహిమ నీ లోకంబున మహాత్ములగు పురుషులు దమతమ వర్ణాశ్రమాచారముల చొప్పున వేదోక్త ప్రకారంబుగా భక్త్యతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజఃపుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాడై ద్వాదశరాసుల యందు నొక సంవత్సరంబున సంచరించుచుండు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన ఋతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించుచుందురు; మఱియు నప్పరమపురుషుం డా రాసుల యందు షష్టాంశ సంచారంబు నొందిన సమయంబును ఋతు వని వ్యవహరింపుదు; రా రాసుల యందు నర్థాంశ సంచారమ్మున రాశిషట్కభోగం బొందిన తఱి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాశుల యందు సంచార మొందిన యెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణ యింపుదు; రట్టి సమగ్రరాశి సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబులవలన వేఱుపడెడు నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరం బని పంచవిధంబులఁ జెప్పుదురు; చంద్రుండు నీ తెఱంగున నా సూర్యమండలంబు మీఁద లక్షయోజనంబుల నుండి సంవత్సర పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్ర గతిం జరించునంత వృద్ధిక్షయరూపంబునం బితృగణంబులకుఁ బూర్వ పక్షాపరపక్షంబులచేత నహోరత్రంబులఁ గలుఁగఁ జేయుచు సకలజీవ ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్మూహూర్తంబు లనుభవించుచు షోడశ కళలు గలిగి మనోమయాన్నమ యామృతమయ దేహుండై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్ప్ర భృతులకుఁ బ్రాణాప్యాయనశీలుం డగుటంజేసి సర్వసముం డనంబడు. (87) చందురునకు మీఁదై యా¯ నందంబున లక్ష యోజనంబులఁ దారల్¯ క్రందుకొని మేరు శైలం¯ బంది ప్రదక్షిణము దిరుగు నభిజిద్భముతోన్. (88) అట మీఁదఁ దారల కన్నిటి కుపరి యై¯ రెండులక్షల శుక్రుఁ డుండి భాస్క¯ రుని ముందఱం బిఱుఁదను సామ్యమృదు శీఘ్ర¯ సంచారములను భాస్కరుని మాడ్కిఁ¯ జరియించుచుండును జనులకు ననుకూలుఁ¯ డై వృష్టి నొసఁగుచు నంతనంతఁ¯ జతురత వృష్టి విష్కంభక గ్రహశాంతి¯ నొనరించువారల కొసఁగు శుభము; (88.1) లుండు నా మీఁద సౌమ్యుండు రెండులక్ష¯ లను జరించుచు రవిమండలంబుఁ బాసి¯ కానఁబడినను జనులకు క్షామ డాంబ¯ రాది భయములఁ బుట్టించు నతుల మహిమ (89) ధరణీతనూజుఁ డంతటిమీఁద రెండుల¯ క్షల నుండి మూఁడు పక్షముల నొక్క¯ రాశి దాఁటుచు నుండుఁ; గ్రమమున ద్వాదశ¯ రాసుల భుజియించు రాజసమున; ¯ వక్రించియైన నవక్రత నైనను¯ దఱచుగాఁ బీడలు నరుల కొసఁగు; ¯ నంగారకుని టెంకి కావల రెండుల¯ క్షల యోజనంబుల ఘనత మించి (89.1) యొక్క రాశినుండి యొక్కొక్క వత్సరం¯ బనుభవించుచుండు నమరగురుఁడు¯ వక్రమందు నైన వసుధామరులకును¯ శుభము నొసఁగు నెపుడు నభినవముగ. (90) సురగురునకు మీఁదై భా¯ స్కరసుతుఁ డిరు లక్షలను జగములకు బీడల్¯ జరపుచుఁ ద్రింశన్మాసము¯ లరుదుగ నొక్కొక్క రాశియందు వసించున్. (91) ప్రాకటముగ రవి సుతునకు¯ నేకాదశలక్షలను మహీసురులకు నీ¯ లోకులకు మేలు గోరుచుఁ¯ జోకగ మునిసప్తకంబు సొంపు వహించున్. (92) మునిసప్తకమున కెగువం¯ దనరుచు నా మీఁదఁ ద్రియుతదశలక్షలఁ బెం¯ పున శింశుమారచక్రం¯ బనఁగా నిన్నిఁటికి నుపరి యగుచుండు నృపా! (93) ఆ శింశుమారాఖ్యమగు చక్రమున భాగ¯ వతుఁడైన ధ్రువుఁ డింద్ర వరుణ కశ్య¯ పప్రజాపతి యమప్రముఖులతోఁ గూడి¯ బహుమానముగ విష్ణుపదముఁ జేరి¯ కణఁక నిచ్చలుఁ బ్రదక్షిణముగాఁ దిరుగుచుఁ¯ జెలఁగి యుండును గల్పజీవి యగుచు; ¯ ననఘుఁ డుత్తాన పాదాత్మజుఁ డార్యుఁడు¯ నయిన యా ధ్రువుని మహత్త్వ మెల్లఁ (93.1) దెలిసి వర్ణింప బ్రహ్మకు నలవిగాదు¯ నే నెఱింగినయంతయు నీకు మున్న¯ తెలియఁ బలికితిఁ; గ్రమ్మఱఁ దలఁచికొనుము¯ జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర! (94) మఱియు నా ధ్రువుండు గాలంబుచేత నిమిషమాత్రం బెడలేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునఁ బశువులకై యేర్పఱిచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగాఁ గల్పింపంబడి ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాది పక్షులును వాయువశంబునం గర్మసారథులై చరించు తెఱంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మనిమిత్తగతి గలిగి వసుంధరం బడకుందురు. (95) పొందుగ జ్యోతిర్గణముల¯ నందఱ నా శింశుమారమందుల నుండం¯ గొందఱు దఱచుగఁ జెప్పుచు¯ నుందురు; వినిపింతు, విను మనూనచరిత్రా! (96) తల క్రిందై వట్రువ యై¯ సలలితమగు శింశుమార చక్రము నందున్¯ నెలకొని పుచ్ఛాగ్రంబున¯ నిలిచి ధ్రువుం డుండు నెపుడు నిర్మల చరితా! (97) మఱియు; నా శింశుమార చక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియు నగ్నీంద్ర ధర్ములును, బుచ్ఛమూలంబున ధాతృవిధాతలును, గటిప్రదేశంబున ఋషిసప్తకంబును, దక్షిణావర్తకుండలీభూతభూత శరీరంబునకు నుదగయన నక్షత్రంబులును, దక్షిణపార్శ్వంబున దక్షిణాయన నక్షత్రంబులును, బృష్టంబున దేవమార్గంబును, నాకాశగంగయు నుత్తర భాగంబునఁ బునర్వసు పుష్యంబులును, దక్షిణభాగంబున నార్ద్రాశ్లేష లును, దక్షిణ వామ పాదంబుల నభిజి దుత్తరాషాఢలును, దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ వామ లోచనంబుల ధనిష్ఠా మూలలును, దక్షిణ వామ కర్ణంబుల మఘాద్యష్ట నక్షత్రంబులును, వామ పార్శ్వంబున దక్షిణాయనంబును, దక్షిణ పార్శ్వంబునఁ గృత్తికాది నక్షత్ర త్రయంబును, నుత్తరాయణంబును, వామ దక్షిణ స్కంధంబుల శతభిషగ్జ్యేష్ఠలును, నుత్తర హనువున నగస్త్యుండును, నపర హనువున యముండును, ముఖంబున నంగారకుండును, గుహ్యంబున శనైశ్చరుండును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున నాదిత్యుండును, నాభిని శుక్రుండును, మనంబునం జంద్రుండును, స్తనంబుల నాశ్వినులును, బ్రాణాపానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులఁ గేతుగ్రహంబును, రోమంబులఁ దారలును నుండు; నది సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము. (98) ఇట్టి దివ్యశరీర మెవ్వఁడు ప్రతిదినం¯ బందు సంధ్యాకాల మతులభక్తి¯ మనమందు నిలిపి యేమఱక మిక్కిలి ప్రయ¯ త్నంబున నియతుఁడై తత్త్వబుద్ధి¯ మౌనవ్రతంబునఁ బూని వీక్షించుచు¯ నీ సంస్తవంబు దానెంతొ ప్రేమ¯ జపియించి కడుఁ బ్రశస్తమును మునీంద్ర సే¯ వ్యమును జ్యోతిస్స్వరూపమున వెలుఁగు (98.1) విపుల శింశుమార విగ్రహంబునకు వం¯ దనము వందనంబు లనుచు నిలిచి¯ సన్నుతించెనేని సకలార్థసిద్ధులఁ¯ బొందు మీఁద ముక్తిఁ జెందు నధిప! (99) ఇనమండలంబునకుఁ గ్రిం¯ దను దశసాహస్ర యోజనంబుల స్వర్భా¯ నుని మండలంబు గ్రహమై¯ ఘనముగ నపసవ్యమార్గగతి నుండు నృపా! (100) అసురాధముఁడగు రాహువు¯ బిసరుహసంభవుని వరము పెంపున నెంతో¯ పసయగు నమరత్వంబున¯ నసమానంబైన గ్రహవిహారముఁ బొందెన్ (101) జననాథ! రాహువు జన్మకర్మంబులు¯ వినిపింతు ముందఱ విస్తరించి¯ యయుత యోజన విస్తృతార్క మండలము ద్వి¯ షట్సహస్ర విశాల చంద్రమండ¯ లముఁ బర్వకాలంబులను ద్రయోదశ సహ¯ స్ర విశాలమై మీఁద రాహు గప్పు¯ నది చూచి యుపరాగ మనుచును బలుకుదు¯ రెల్ల వారును స్వధర్మేచ్ఛు లగుచు; (101.1) నంతలోన నినశశాంక మండలములఁ¯ గరుణఁ బ్రోవఁదలచి హరిసుదర్శ¯ నంబు వచ్చునను భయంబున నై దాఱు¯ గడియలకును రాహు నడిఁకి తొలఁగు. (102) నరవర! యా రాహువునకు¯ సరసత నా క్రింద సిద్ధ చారణ విద్యా¯ ధరు లయుత యోజనంబులఁ¯ దిరముగ వసియించి లీలఁ దిరుగుదు రచటన్. (103) పరికింప సిద్ధ విద్యా¯ ధరులకుఁ బదివేలు క్రింద దరలక యక్షుల్¯ మఱియును భూతప్రేతలు¯ జరియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్. (104) వారి క్రిందఁ దగిలి వాయువశంబున¯ మలయుచుండు మేఘమండలంబు¯ మేఘమండలంబు మీఁ దగుచుండు భూ¯ మండలంబు క్రిందనుండు నధిప!

పాతాళ లోకములు

(105) అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండకటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికిం గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకంబు లుండు; నట్టి బిల స్వర్గంబుల యందు నుపరి స్వర్గంబున కధికం బైన కామ భోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహార స్థానంబు లననుభవించుచు దైత్య దానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తు లగుచుఁ గళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతోఁ జేరుకొని మణిగణ ఖచితంబులగు నతిరమణీయ గృహంబులయందు నీశ్వరునివలనం జేటు లేని కాయంబులు గలిగి వివిధ మాయావిశేష వినిర్మిత నూతన కేళీసదన విహరణమండప విచిత్రోద్యానాదుల యందుఁ గేళీవినోదంబులు సలుపుచుఁ జరియింతు; రంత. (106) అట్టి పాతాళంబులందును మయకల్పి¯ తములగు పుటభేదనముల యందు¯ బహురత్ననిర్మిత ప్రాకార భవన గో¯ పుర సభా చైత్య చత్వరవిశేష¯ ముల యందు నాగాసురుల మిథునములచే¯ శుక పిక శారికానికర సంకు¯ లముల శోభిల్లు కృత్రిమ భూములను గల¯ గృహములచే నలంకృతము లగుచు (106.1) కుసుమచయ సుగంధి కిసలయ స్తబక సం¯ తతులచేత ఫలవితతులచేత¯ నతులరుచిర నవలతాంగనాలింగిత¯ విటపములను గలుగు విభవములను. (107) మఱియు మానసేంద్రియంబుల కానందకరంబులైన నానావిధ జలవిహంగమ మిథునంబులు గలిగి నిర్మలజలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముద కువలయ కహ్లార లోహిత శతపత్రాదికంబులఁ దేజరిల్లెడు సరోవరంబులుగల యుద్యానవనంబుల యందుఁ గృతనికేతనులై స్వర్గభూముల నతిశయించిన వివిధ విహారంబులు గలిగి యహోరాత్రాది కాలవిభాగ భయంబులు లేక మహాహిప్రవరుండయిన శేషుని శిరోమణి దీధితులచే నంధకారోపద్రవంబు లేక యెల్లప్పుడు దివసాయమానంబుగా నుండు; నా లోకంబు నందు నఖిల జనులు దివ్యౌషధి రస రసాయనంబుల ననవరతంబు నన్నపానంబులుగా సేవించుటం జేసి యచ్చటివారలకు నాధివ్యాధులును, వలితపలితంబులును, జరారోగంబులును, శరీరవైవర్ణ్యంబులును, స్వేదదౌర్గంధ్యంబులును, గలుగక పరమకల్యాణమూర్తు లగుచు హరిచక్రభయంబు దక్క నన్యంబగు మృత్యుభయంబు నొందక యుందు; రదియునుం గాక. (108) అట్టి పాతాళలోకంబునందు విష్ణు¯ చక్ర మెప్పుడేనిని బ్రవేశంబు నొందు¯ నప్పుడెల్లను దైత్యకులాంగనలకు¯ గర్భసంపద లందంద కరఁగుచుండు. (109) అతలమునందు నమ్మయుని యాత్మజుఁడైన బలాసురుండు స¯ మ్మతిఁ జరియించు షణ్ణవతి మాయలఁ గూడి వినోద మందుచుం¯ గుతలములందు నేఁడు నొక కొందఱు నచ్చటి మాయఁ జెంది సం¯ తతముఁ జరించుచుండుదురు దప్పక మోహనిబద్ద చిత్తులై. (110) అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చలు లను స్త్రీ గణంబులు జనియించి; రా కామినీ జనంబులు పాతాళంబుఁ బ్రవేశించిన పురుషునికి హాటకరసం బనియెడు సిద్ధరసఘుటిక నిచ్చి రససిద్ధునిం గావించి యతనియందు స్వవిలాసావలోక నానురాగ స్మిత సల్లాపోపగూహ నాదుల నిచ్ఛా విహారంబులు సలుపుచుండ నా పురుషుండు మదాంధుండై తానె సిద్ధుండ ననియును నాగాయుత బలుండ ననియును దలంచి నానావిధ రతిక్రీడలఁ బరమానందంబు నొందుచుండు. (111) హాటకేశ్వరుఁడైన యంబికాధీశుండు¯ వితలంబునందుల వేడ్క నిలిచి¯ తనదు పార్షద భూతతతులతో బ్రహ్మస¯ ర్గోపబృంహణమున నొక్కచోటఁ¯ బార్వతీ సంభోగపరుఁ డగుచుండఁగా¯ వారల వీర్యంబువలనఁ బుట్టి¯ నట్టిది హాటకి యనియెడు నది యని¯ లాగ్నులు భక్షించి యందు నుమియ (111.1) నదియు హాటక మను పేర నతిశయిల్లి¯ వన్నె మీఱుచు శుద్ధ సువర్ణమయ్యె¯ నా సువర్ణంబు నా లోకమందు నున్న¯ జనుల కెల్లను వినుత భూషణము లయ్యె. (112) ఆ క్రింది సుతలంబు నందు మహాపుణ్యుఁ¯ డగు విరోచనపుత్రుఁడైన యట్టి¯ బలిచక్రవర్తి యా పాకశాసనునకు¯ ముద మొసంగఁగఁగోరి, యదితి గర్భ¯ మున వామనాకృతిఁ బుట్టి యంతటఁ ద్రివి¯ క్రమ రూపమునను లోకత్రయంబు¯ నాక్రమించిన దానవారాతిచేత ముం¯ దటన యీఁబడిన యింద్రత్వ మిట్లు (112.1) గలుగువాఁడు పుణ్యకర్మసంధానుండు¯ హరిపదాంబుజార్చ నాభిలాషుఁ¯ డగుచు శ్రీరమేశు నారాధనము చేయు¯ చుండు నెపుడు నతి మహోత్సవమున. (113) నరేంద్రా! సకలభూతాంతర్యామియు దీర్థభూతుండును నయిన వాసుదేవుని యందుఁ జిత్తంబు గలిగి యిచ్ఛిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలం బగుం; గాని పాతాళస్వర్గ రాజ్యంబులు ఫలంబులు గానేర; వయిన నెవ్వరికిని మోక్షంబు సాక్షాత్కృతంబు గాకుండుటంజేసి లోకప్రదర్శనార్థంబు పాతాళ స్వర్గరాజ్యంబుల నిచ్చె; క్షుత పతన ప్రస్ఖలనాదు లందును వివశుండైన యెడల నామస్మరణంబు చేయు పురుషుండు గర్మబంధంబువలన విముక్తుం డగుచు సుజ్ఞానంబునం బొందు; నట్టి వాసుదేవుం డాత్మజ్ఞాన ప్రపోషణంబు జేయు మాయామయంబు లైన భోగైశ్వర్యంబుల నెల్ల నెట్లొసంగు ననవలదు; భగవంతుండు యాచనజేసి సకల సంపదలఁ జేకొని శరీరమాత్రావశిష్టునిం జేసి వారుణ పాశంబులం గట్టి విడిచినప్పుడు బలీంద్రు డిట్లనియె. (114) పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందు¯ దృష్ణ లేకుండుట దెలిసినాఁడ¯ నింద్రాదులెల్ల నుపేంద్రునిఁ బ్రార్థించి¯ యడిగిరి గాని శ్రీహరికిఁ గోరి¯ కలు లేవు; మిక్కిలి గంభీరమగు మహా¯ కాల స్వభావంబు గలుగుచుండు¯ నరయంగ మన్వంతరాధిపత్యమును లో¯ కత్రయంబును నెంత గాన తలప (114.1) మత్పితామహుండు మానవంతుండు ప్ర¯ హ్లాద విభునిఁ జూచి హర్షమంది¯ యెద్ధియైనఁ గోరు మిచ్చెద ననుటకు¯ నంతలోన నీశ్వరాజ్ఞఁ దెలిసి. (115) ఇట్లు కృతార్థుండై ప్రిత్ర్యం బయిన రాజ్యంబు నొల్లక పరమేశ్వరు దాస్యంబ కోరె, నా ప్రహ్లాద చరిత్ర కథనావసరమ్మున నీ తండ్రికిని నీకును విశేషంబుగా నే పురుషుండు భగవదనుగ్రహంబుఁ బొంద నోపు"నని పుండరీకాక్షుం డానతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాణ గ్రంథంబున విస్తరించెద; నా బలిచక్రవర్తి గృహద్వారంబున నఖిలలోకగురుం డయిన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజజనానుకంపితుండును శంఖచక్రాద్యాయుధ ధరుండును, నగుచు నిప్పుడును దేజరిల్లుచుండు; నట్టి బలిద్వారంబున లోకంబుల గెలువ నిచ్చగొన్న దశగ్రీవుం డుల్లంఘిత శాసనుండై ప్రవేశంబు గావింప నయ్యాది పురుషుండు దన పాదాంగుష్ఠంబున యోజనాయు తాయుతంబులం బాఱం జిమ్మె; వినుము. (116) ఆ సుతలమునకుఁ గ్రిందై¯ భాసిల్లుఁ దలాతలంబు; ప్రభు వందు మయుం¯ డా సురపుర నిర్మాతగ¯ వాసిగఁ బొగడొంది యేలు వసుధాధీశా! (117) పురహరుచే రమేశ్వరుఁడు భూతహితార్థముగాఁ బురత్రయం¯ బరుదుగ నీఱు జేసె; శరణాగతు నా మయుఁ గాచి యెంతయుం¯ గరుణఁ దలాతలంబునకుఁ గర్తగ నిల్పిన నున్నవాఁడు శ్రీ¯ ధరుని సుదర్శనంబునకుఁ దప్పి విముక్తభయుండు గాఁ దగన్. (118) తలఁపఁగ నా క్రింద మహా¯ తలమునఁ గద్రువవధూటి తనయులు సర్పం¯ బులు గలవు పెక్కు శిరములు¯ నలరంగాఁ గ్రోధవశగణావళి యనఁగన్. (119) మఱియును గుహక తక్షక కాళియ సుషేణాది ప్రధాను లయిన వార లతుల శరీరంబులు గలిగి యాదిపురుషుని వాహనం బైన పతగరాజ భయంబున ననవరతంబు నుద్వేజితు లగుచు స్వకళత్రా పత్య సుహృద్భాంధవ సమేతు లయి యుండుదు; రా క్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాతకవచ కాలకేయు లను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహా సాహసులును దేజోధికులును నగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబు నందు నడంగి యున్న సర్పంబుల చందంబున నింద్రదూత యగు సరమచేఁ జెప్పబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు చుండుదురు. (120) ఇందుకులోద్భవ! వినుమా¯ క్రిందటి పాతాళమునను గ్రీడించుచు నా¯ నందము నొందుచు నుండును¯ సందడిఁబడి నాగకులము చతురత తోఁడన్. (121) ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖ కుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదు లయిన మహానాగంబు లైదు నేడు పది నూఱు వేయి శిరంబులు గలిగి ఫణామణికాంతులం జేసి పాతాళ తిమిరంబును బాపుచుందురు. (122) పాతాళలోకంబు పాఁతున శేషుండు¯ వెలయంగ ముప్పదివేల యోజ¯ నంబుల వెడలుపునను దోఁకఁ జుట్టగా¯ జుట్టుక యుండు; విష్ణుని మహోగ్ర¯ మైన శరీరంబు; దానై యనంతాఖ్య¯ సంకర్షణుం డుండు సంతతంబు; ¯ నట్టి యనంత నామాభిధానుని మస్త¯ కమున సిద్ధార్థంబు కరణి ధరణి; (122.1) యంత నా విభుండు నఖిలలోకంబుల¯ సంహరింపఁగోరి చండకోప¯ వశత సృజనఁ జేయు వరుస నేకాదశ¯ రుద్రమూర్తు లనెడు రౌద్రమతుల. (123) అట్టి రుద్రమూర్తు లతుల త్రినేత్రులు¯ నఖిలశూల హస్తు లగుచు నుందు; ¯ రందు నున్న ఫణికులాధిపుల్ శేషుని¯ పాదపంకజముల భక్తిఁ జేరి. (124) నమ్రు లగుచు ననుదినంబును మౌళి ర¯ త్నములచేతఁ గడు ముదంబు నొంది¯ కోరికలు దలిర్ప నీరాజనంబుల¯ నిచ్చుచుందు రెపుడు మచ్చికలను. (125) మఱియు; నా సంకర్షణమూర్తిం జేరి నాగకన్యకలు కోరికలు గల వార లగుచు నొప్పెడి శరీర విలాసంబులం జేసి యగరు చందన కుంకుమ పంకంబు లనులేపనంబులు చేయుచు సంకర్షణమూర్తి దర్శన స్పర్శనాదులను నుద్బోధిత మకరధ్వజావేశిత చిత్తంబుల గలిగి చిఱునవ్వు లొలయ నధికాభిలాషం జేసి స్మితావలోకనంబుల సవ్రీడితలై యవలోకించుచుండ ననంత గుణంబులు గల యనంతదేవుం డుపసంహరింపం బడిన క్రోధంబు గలిగి లోకంబులకు క్షేమంబు గోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర ముని గణంబులనవరతంబు ధ్యానంబు జేయ సంతత సంతోషాతిశయంబున మ్రాఁగన్నుబెట్టుచు, సలలిత గీతావాద్యంబుల నానందంబు నొందుచుఁ దన పరిజనంబుల నతిస్నేహంబున నవలోకించుచు నవతులసీగంధ పుష్పరసామోదిత మధుకరవ్రాత మధుర గీతంబులు గల వైజయంతీవనమాలికల ధరియించుచు నీలాంబర ధరుండును హలధరుండును నగుచు నితండు మహేంద్రుండో? హరుండో? యనుచు జనంబులు పలుకుచుండఁ గాంచనాంబర ధరుం డై ముముక్షువులు ధ్యానంబులు చేయ నధ్యాత్మ విద్యా యుక్తం బయిన యానంద హృదయ గ్రంథిని భేదించు నట్టి శేషుని స్వాయంభువుండగు నారదుండు తుంబురు ప్రభ్రుతు లగు ఋషిశ్రేష్ఠులతోఁ జేరుకొని కమలాసనుని సభాస్థానము నందు నిట్లు స్తుతియించుచుండు. (126) ఓలిమై నెవ్వని లీలావినోదముల్¯ జన్మ సంరక్షణ క్షయములకును¯ హేతువు లగుచుండు, నెవ్వని చూపుల¯ జనియించె సత్త్వరజస్తమంబు¯ లెవ్వని రూపంబు లేకమై బహువిధం¯ బులను జగత్తులఁ బ్రోచుచుండు, ¯ నెవ్వని నామంబు లెఱుఁగక తలఁచిన¯ యంతన దురితంబు లఁడఁగుచుండు, (126.1) నట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు¯ నైన శేషుని వినుతి జేయంగఁ దరమె? ¯ తలఁప నెప్పుడు వాఙ్మనంబులకు నింక¯ మూఁడు లోకంబులందును భూతతతికి. (127) మఱియుఁ బెక్కుగతుల మాబోఁటి వారలఁ¯ బ్రోవ దలఁచి శేషమూర్తి సాత్త్వి¯ కస్వభావ మొందెఁ గడఁకతో నట్టి శే¯ షునకు మ్రొక్కుచుందు ననుదినంబు. (128) మఱియు; నా శేషుని నెవ్వండేని నాకస్మికంబుగ నయినను నార్తుం డగుచు నయినను స్మరించినమాత్రన యఖిల పాపంబులం బాసి సకలశ్రేయస్సులం బొందు; నట్టి శేషునినే ముముక్షువు లాశ్రయించి ధ్యానం బొనర్చి భవబంధ నిర్ముక్తు లగుదు; రతని ఫణంబుల యందు భూగోళం బణుమాత్రం బగుచు నుండు; నతని మహామహిమలు గణుతింప సహస్రజిహ్వలు గల పురుషుండైన నోపం డని పలుకు చుందు; రా యనంతుండు పాతాళంబున నుండి సకల లోకహితార్థంబు భూమిని ధరియించు"నని లోకతిర్యఙ్మనుష్య గతులను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి "యింక నేమి వినిపింతు నెఱింగింపు"మనినం బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. (129) "మునివర! లోకచరిత్రం¯ బనుపమము మహావిచిత్ర మగునట్లుగ నా¯ కును వినిపించితి వంతయుఁ¯ బనుపడి నా చిత్తమందుఁ బాయక నిలిచెన్." (130) అనిన శుకయోగీంద్రుం డిట్లనియె. (131) "జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మ¯ కములు గాన వారి కర్మగతుల¯ తారతమ్యములును దగిలి యిన్నియు వివి¯ ధంబు లగుచు సంతతంబు నుండు. (132) నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మం బాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాఁ బ్రవర్తిల్లు నట్టివానికిఁ గలిగెడి కర్మఫలంబును విపరీతంబుగనే యుండుం గావున ననాద్యవిద్యాకామప్రవర్తనల వలనఁ బెక్కు తెఱంగులఁ గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగ నెఱింగించెద"ననిన శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (133) "మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల¯ యందొ? యంతరాళమందొ? వెలినొ? ¯ యదియుఁ గాక దేశమందుండు భూవిశే¯ షముల యందొ? తెలుపు సంతసమున." (134) అనిన శుకయెగీంద్రుం డిట్లనియె.