పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : పంచమ ఉత్తర 135 - సంపూర్ణం

నరక లోక విషయములు

(135) ఎడతెగక ముజ్జగంబుల¯ కడపల నయ్యామ్యదిశను గదలక నిలుచుం¯ గడు ఘోరములుగ నరకము¯ లడరంగా నంతరాళమందుల నధిపా! (136) మఱియును; దక్షిణంబున నగ్నిష్వాత్తాది పితృగణంబులు దమ గోత్రజులకు మేలుగలుగుట కొఱకు సత్యంబులగు నాశీర్వాదంబుల నొసంగుచుండుదు; రచ్చటి పితృపతి యగు శమనుండు దన లోకంబునకుం జనుదెంచు జంతువుల కర్మంబులకుం దగిన ఫలంబుల నిచ్చి శిక్షించుచు నుండు; నందుఁ దామిస్రంబును నంధతామిస్రంబును రౌరవంబును మహారౌరవంబును గుంభీపాకంబును కాలసూత్రంబును నసిపత్రవనంబును సూకర ముఖంబును నంధకూపంబును గ్రిమిభోజనంబును సందంశంబును దప్తోర్మియు వజ్రకంటకశాల్మలియు వైతరణియుఁ బూయోదంబును బ్రాణరోధంబును విశసనంబును లాలాభక్షంబును సారమేయాదనంబును నవీచిరయంబును రేతఃపానంబును నను నేకవిశంతి మహానరకంబులును; మఱియును క్షారకర్దమంబును రక్షోగణభోజనంబును శూలప్రోతంబును దందశూకంబును నవటనిరోధనంబును నపర్యావర్తనంబును సూచీముఖంబును నన సప్తవిధ నరకంబుల తోడం గూడి యష్టావింశతి నరకంబులు గల వని కొందఱు నొడువుదు; రందు. (137) పరపుత్రకళత్రంబులఁ¯ బరికింపక యపహసించు పాపాత్ముఁడు దు¯ ష్కరపాశబద్దుఁడై యమ¯ పురుషులచే నధిక బాధఁ బొందుచు నుండున్. (138) మఱియు; నవ్విధంబున బాధితుం డగుచుఁ దామిస్రనరకంబునం బడి యనశనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలం జెంది కడు భయంబున మూర్ఛలం బొందుచుండు. (139) పరకాంత నెవ్వఁడేనిం¯ బురుషుం డుండంగ మొఱఁగి పొందిన యమకిం¯ కరు లతనిఁ బట్టి వడిఁ ద¯ త్తఱమునఁ బడవైతు రంధతామిస్రమునన్. (140) నరేంద్రా! యెవ్వఁడేనిం గుటుంబపోషణార్థంబు పరులకు ద్రోహంబు జేయు నా నరుండు రౌరవాదినరకంబునం బడు; నెవ్వం డిహలోకంబు నందు స్వేచ్ఛావిహారంబున సంచరించుచుఁ బరోపద్రవ పరాఙ్ముఖంబు లయి యుండు పశుపక్షి మృగాదుల బాధించు నాయా మృగంబులు రురురూపంబులఁ దాల్చి యట్టి పాపజనుల నానావిధ యాతనల బాధించుటం జేసి మహా రౌరవ రౌరవనరకంబు లనంబడు; నెవ్వండేని దేహపోషణార్థంబు మూషకాదుల బిలనిరోధంబు జేసి వధించు, నా నిష్కరుణుం డైన పురుషునిం గుంభీపాకనరకంబుల యందుఁ గల తప్తతైలంబులం బెక్కు బాధలం బొందింతురు. (141) తల్లిదండ్రులకును ధరణిసురులకును¯ నహితంబు జేసిన యట్టివాడు¯ కాలసూత్రం బను కడుఁ దీవ్ర నరకంబు¯ నందును నందంద యయుత యోజ¯ నాయత పాత్రాదు లందుల సూర్యుఁ డా¯ మీఁద గ్రిందను వహ్ని మిగుల మండ¯ నత్యంత క్షుత్పిపాసాదులచేతను¯ బాధితుం డగుచుండుఁ బాయ కెపుడుఁ (141.1) బరువు పెట్టుచున్నఁ బడియున్న నిలిచినఁ¯ గదలకున్నఁ జాల నొదిగి యున్న¯ బాధఁ బొందుచుండఁ బశురోమముల లెక్క¯ వరుస నపరిమేయ వత్సరములు. (142) మఱియు వేదమార్గంబు విడిచి పాషాండమార్గంబు లాచరించు పురుషుని నసిపత్రవనంబు నందు యమకింకరులు తఱట్ల నడచుచుఁ బరిహసించుచుం దోలునెడ నా యసిపత్రంబు లిరుగెలంకుల శరీరంబుఁ ద్రెంచుచుండ నడుగడుగున బిట్టు మొఱపెట్టుచుండ బాధించుచుండుదురు. (143) దండింప దగని వారల¯ దండించిన విప్రవరుల తనువులు ముట్టం¯ దండించిన దుర్మతులం¯ దండింతురు కాలసూత్ర నరకము లందున్. (144) మఱియు నట్టి దుష్టమానవుఁ గింకరుల్¯ విఱిచి చెఱకుఁగోల విఱిచినట్లు¯ బాధపెట్టుచుండఁ బడి మూర్ఛఁ జెందుచు¯ మొఱలు పెట్టుచుండు భూపవర్య! (145) నరేంద్రా! యెవ్వండేని నీశ్వరకల్పితవృత్తి గల జంతువుల హింసించు నట్టివాని నంధకూపం బను నరకంబునం బడ వైచిన నందు నతండు దొల్లి తాను జేసిన భూత ద్రోహంబున నచ్చట వివిధ క్రూర పక్షి మృగ పశు సర్ప మశక మత్కుణ మక్షికాదులచేత హింసంబొందుచు మహాంధకారంబునందు నిద్రానుభవ సుఖలేశంబును లేక కుశరీరంబు నందుల జీవుండునుం బోలె మృతప్రాయుండై యుండు; నంత. (146) తన కలిమి నెవ్వఁడేనియుఁ¯ దన బాంధవవరులఁగూడి తగఁ గుడువక తా¯ నును వాయసంబు భక్షిం¯ చిన మాడ్కిం దిన్నవాని శీఘ్రమె యచటన్. (147) క్రిమిభోజన మనియెడి నర¯ కమునం బడి క్రిములె కూడుగాఁ గుడుచుచుఁ దాఁ¯ గ్రిమి యగుచు లక్ష పరిమా¯ ణముఁ గల క్రిమిగుండ మందు నాఁటుక యుండున్. (148) మఱియు నీ భూలోకంబున నెవ్వఁడేని నవిపన్నుండై చౌర్యవృత్తిచే బ్రాహ్మణాదుల హిరణ్యరత్నాది ద్రవ్యంబుల నపహరించు, నట్టి పురుషుని నగ్ని వర్ణంబులగు నయఃపిండంబుల నగ్ని తప్తంబు లగు శూలంబుల నతని శరీరంబునం దివియుచుండుదురు; మఱియును మదనాతురు లగుచు స్త్రీపురుషు లగమ్యాగమనంబు జేసిరేని నట్టి వారిని యమలోకంబున నతితీక్ష్ణ కశాతాడితులం జేసి యగ్నిమయంబు లయిన యుక్కు ప్రతిమల నాలింగనంబు చేయింతురు. (149) సర్వజంతుజాల సంగమ మొందెడు¯ వానిఁ బట్టి కట్టి వజ్ర దంష్ట్ర¯ కములు గలుగునట్టి ఘనతర శాల్మలీ¯ తరువులందుఁ జేర్చి దంతు రెపుడు. (150) పార్థివేంద్ర! నరుఁడు పాషండదర్శనుఁ¯ డగుచు ధర్మమార్గ మడఁచెనేని¯ వాఁడు నరకమందు వైతరణీనది¯ నుడుగ కెపుడుఁ బొరలి పడుచునుండు. (151) మఱియు నట్టి వైతరణీనది యందు జలగ్రాహంబులు దిగిచి భక్షింపం బ్రాణంబులు నిర్గమింపఁ దన పాపంబు లుచ్ఛరించుచు విణ్మూత్ర పూయ శోణిత కేశ నఖాస్థి మేదోమాంస వసా వాహిని యందుఁ దప్తుం డగుచునుండు; విప్రుండు శూద్రకామినులం బొంది శౌచాచారంబులం బాసి గతలజ్జుండై పశువుంబోలె జరియించెనేని నతండు నరకంబునుం బొంది యందుఁ బూయ విణ్మూత్ర లాలా శ్లేష్మ పూర్ణార్ణవమందు ద్రొబ్బంబడి యతి భీభత్సితంబు లగు నా ద్రవ్యంబుల భుజియించుచుండు. (152) శునకములఁ బెంచి యెవ్వం¯ డనయంబును వేఁట సలిపి యాత్మార్థముగా¯ వనమృగములఁ జంపును నా¯ మనుజాధము నస్త్రములను మర్దింతు రొగిన్. (153) ద్రవ్యలోభమునను దంభార్థమై పశు¯ వులను జంపి జన్నములను జేయు¯ వానిఁబట్టి యమునివారలు గోయుచు¯ నుందు రెపుడు మిగుల సందడిలుచు. (154) కామమోహితుండై యెవ్వండేనిఁ దన భార్యచేత రేతఃపానంబు చేయించు నా పాపాత్ముని రేతోహ్రదంబునం ద్రోచి యా రేతంబునె పానంబు జేయింపుదురు; రాజపుత్రు లైనను జోరు లైనను ధనికుల గ్రామంబులపైఁ బడి యందు గృహదాహంబు జేయువారలను విషాదుల వలన నన్యులఁ జంపెడు వారలను వజ్రదంష్ట్రలు గల వింశత్యుత్తర సప్తశత శునకంబు లెడతెగక తిగిచి భక్షించుచుండు. (155) లంచంబుఁ గొని సాక్షి వంచించి యనృతంబు¯ పలికెడు పాపాత్ముఁ బట్టి కట్టి¯ యంత మానకవీచి యను నరకమునందు¯ శతయోజనోన్నత శైల శిఖర¯ మునఁ దలక్రిందుగా నునిచి యధోముఖం¯ బుగఁ బడద్రొబ్బిన బొబ్బలిడుచుఁ¯ గల్లోలములు లేని కమలాకరముఁబోలెఁ¯ జదరమై యున్న పాషాణ మందుఁ (155.1) బడిన యంతన దేహంబు పగిలి పెక్కు¯ తునకలై పాసి యది గూడుకొనుచునుండ¯ దండి యాకులతను బొందుచుండుఁ గాని¯ చావులేకుండు నా దుష్ట జంతువునకు. (156) సోమయాజి భార్యఁ గామించి పొందిన¯ వానిఁ గపట మద్యపాన సోమ¯ పాన మనుదినంబుఁ బానంబు జేయు వి¯ ట్క్షత్రియులను బట్టి సంభ్రమమున. (157) ఱొమ్ముఁ దొక్కి మోము ఱిమ్మపట్టఁగ మోది¯ యనలముఖమునందు నగ్నివర్ణ¯ ముగను గాఁచి వక్త్రమున నిండఁగా నుక్కు¯ నీరు పోతు రేచి నిష్ఠురముగ. (158) మఱియు; నీచవర్ణుండు నిష్ఠ సలుపుచుఁ దపోదాన విద్యాచారంబులఁ బెద్దల కవమానంబు జేయువాఁడు క్షారకర్దమంబను నరకంబు నందు నధోముఖుం డగుచు బాధలంబొందు; స్త్రీ పురుషు లెవ్వరేని శరీరరక్షణార్థంబు పశువుల మానవుల బలి యిచ్చిరేని; వారల నిరయంబునందు యమకింకరులు సురియలం దునిమి తద్రక్తంబు పానంబు జేయుచుం బాఱాడుచుందురు; గ్రామారణ్యంబులయందు జంతువుల శూలప్రోతంబులం గావించి హింసించుచు హర్షించుచున్న వారలను శూలసూత్రంబను నరకంబు నందు శూలప్రోతులం జేసిన క్షుత్పిపాసా పరవశులగుచుండఁ గంక గృధాదులు దీక్ష్ణతుండాగ్రంబులం దిగిచి భక్షించుచుండు మఱియు ధూర్తస్వభావంబున జంతు పీడనంబుఁ గావించెడు పాపాత్ముల దందశూకం బను నరకంబు నందు వైవ నైదు నేడు ముఖంబుల సర్పంబులు గఱచుచుండు. (159) ఎనయ దొడ్డిలోన నిండ్లలో నైనను¯ బశు పతంగ హరిణ పంక్తి నెల్లఁ¯ బట్టి హింసజేయు పాపాత్ము విషవహ్ని¯ ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల! (160) తన యింటికి వచ్చిన మను¯ జుని నతిథిం గ్రోధదృష్టిఁ జూచిన వానిం¯ గనుఁగవల వజ్రదంష్ట్రలఁ¯ దనరిన యా కంక గృధ్రతతి భక్షించున్. (161) ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకారంబులన్¯ ఘనతం జేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం¯ బను నా దుర్గతిఁ బట్టి త్రోఁచి నిధిగా పై యున్న భూతం బటం¯ చును బాశంబులఁ బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. (162) నరవరేణ్య! యిట్టి నరకముల్ యమలోక¯ మందుఁ గలవు మఱి సహస్ర సంఖ్య; ¯ లందు శమనదూత లనిశంబు బాధింతు¯ రవని ధర్మదూరు లయిన నరుల. (163) ధర్మవంతులెల్ల దప్పక స్వర్గంబు¯ నందు భోగసమితిఁ బొందుచుందు; ¯ రెలమిఁ బుణ్యపాపముల శేషములవల్లఁ¯ బుట్టుచుందు రవనిఁ బుణ్యచరిత. (164) నరేంద్రా! మోక్షమార్గంబు మున్నె వినిపించితి; నిప్పుడు నీ కెఱింగించిన వెల్లను బ్రహ్మాండకోశంబునం జతుర్దశ కోశంబులుఁ గల వని పురాణంబులు పలుకుచుండు; నట్టి బ్రహ్మాండంబు శ్రీ మన్నారాయణుని స్థూలశరీరం బగుటంజేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతు రెవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులుం గలుగు; నీశ్వర స్థూలశరీరంబుఁ దెలిసిన వారికి శ్రద్ధాభక్తులంజేసి సూక్ష్మదేహంబు నెఱుంగవచ్చు; భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ లోకసంస్థితంబైన సకల జీవనికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరప్రకారంబు వినిపించితి"నని

పూర్ణి

(165) జలజభవాది దేవ ముని సన్నుత తీర్థపదాంబుజాత! ని¯ ర్మల నవరత్న నూపుర విరాజిత! కౌస్తుభ భూషణాంగ! యు¯ జ్జ్వల తులసీ కురంగ మదవాసనవాసిత దివ్యదేహ! శ్రీ¯ నిలయ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా! (166) శ్రీ తరుణీ హృదయస్థిత! ¯ పాతకహర! సర్వలోకపావన! భువనా¯ తీతగుణాశ్రయ! యతి వి¯ ఖ్యాత! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ! (167) దండితారిసమూహ! భక్తనిధాన! దాసవిహార! మా¯ ర్తాండమండల మధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసి కో¯ దండ శంఖ సుదర్శనాంక! సుధాకరార్క సునేత్ర! భూ¯ మండలోద్ధరణార్త పోషణ! మత్తదైత్య నివారణా! (168) ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత మహాపురాణంబునందు భరతాత్మజుం డైన సుమతికి రాజ్యాభిషేకంబును, పాషండదర్శనంబును, సుమతి పుత్ర జన్మ విస్తారంబును, గయుని చరిత్రంబును, గయుని సంస్తుతియు, భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ సంస్థితియు నను కథలు గల పంచమస్కంధంబు నందు ద్వితీయాశ్వాసము సమాప్తము.