భాగవతము పారాయణ : పంచమ స్కంధము - ఉత్తరాశ్వాసము 1 - 12
పోతన తెలుగు భాగవతం
పంచమ స్కంధము ఉత్తరాశ్వాసము
ఉపోద్ఘాతము
(1) శ్రీకాంతాహృదయప్రియ! ¯ లోకాలోకప్రచార! లోకేశ్వర! సు¯ శ్లోక! భవభయనివారక! ¯ గోకులమందార! నందగోపకుమారా! (2) సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుం డగు సూతుం డిట్లనియె.
సుమతి వంశ విస్తారము
(3) మునులార! బాదరాయణి¯ యనఘాత్మకుఁడైన యుత్త రాత్మజునకు స¯ ద్వినయోక్తి భరతుచరితము¯ వినిపించుచు మఱియు నిట్లు వినిపించెఁ దగన్. (4) పార్థివేంద్ర! యిట్లు భరతాత్ముజుండైన¯ "సుమతి"ధర్మవర్తనమునఁ దిరుగ¯ నది యెఱింగి దుష్టులైన పాషాండులు¯ తమమతంబు మిగులఁ దలఁచి పొగడి. (5) ధరణీవల్లభ! నిన్నును¯ నిరతంబును బుద్ధదేవునిం గొలిచిన యా¯ తెఱఁగునఁ గొలిచెద మని భా¯ సురమతి బోధించి రపుడు సుమతిం బ్రీతిన్ (6) ఇట్లు పాషాండబోధితుండైన సుమతికి ధ్రువసేన యందు దేవతాజిత్తను పుత్రుండు జనించె; వానికి దేవద్యుమ్నండను సత్పుత్రుం డాసురి యందుదయించె; నమ్మహాత్మునకు ధేనుమతి యందుఁ బరమేష్ఠి జనియించె; నతనికి సువర్చల యందుఁ బ్రతీహుం డనువాఁడు సుతుం డయ్యె; యప్పరమ పురుషుండు సకలజనులకు బ్రహ్మోపదేశంబు జేసి తాను శుద్ధాత్ముండై హరిస్మరణ జేయుచు యజ్ఞకరణ నిపుణు లగు ప్రతిహర్త ప్రస్తోత యుద్గాత యను సత్పుత్రులం గాంచెను; ఆ ప్రతిహర్తకు నుతి యందు వ్యోమ భూమ నామక పుత్రద్వయం బుత్పన్నం బయ్యె; నందు భూమునకు ఋషికుల్య యందు నుద్గీథుం డను సుతుండు జనించె; నతనికి దేవకుల్య యందుఁ బ్రస్తోత గలిగె; యా ప్రస్తోతకు వరరుత్స యందు విభుం డను తనయుం డుద్భవించె; నతనికి భారతి యందుఁ బృథుషేణుం డుదయించె; యతనికి నాకూతి యందు నక్తుండు గలిగె; యా నక్తునకు రాజర్షి శ్రేష్ఠుండగు గయుం డను మహాకీర్తి సంపన్నుం డుదయించె.
గయుని చరిత్రంబు
(7) అట్టి గయునివలన నఖిలజీవులఁ బ్రోవఁ¯ దలఁచి సాత్వికప్రధాన మయిన¯ యట్టి మేను దాల్చి యాత్మతత్త్వజ్ఞానుఁ¯ డగుచు నుండె హరి నిజాంశమునను. (8) ఇట్టి మహనీయ గుణాకరుండగు గయుని గాథానువర్ణనంబు పురావిదులగు మహాత్ములచే నీ తెఱంగున నుతింపంబడుచున్నది; సావధానమనస్కుండవై యాలకింపు"మని యిట్లనియె. (9) "ధర్మమార్గంబున ధారుణీజనులను¯ బ్రేమతోఁ బోషణ ప్రేషణోప¯ లాలనశాసనలక్షణాదులచేతఁ¯ బోషించుచును యజ్ఞములను యజ్ఞ¯ పురుషు నీశ్వరుఁ జిత్తమున నిల్పి సేవించి¯ స్వాంతమందున్న యీశ్వరునిఁ గాంచి¯ యఖిల జీవతతికి నానంద మొసఁగుచు¯ నిరభిమానతమెయి ధరణి నేలె (9.1) సత్యమందు మిగులు సత్సేవయందును¯ ధర్మమందు యజ్ఞకర్మమందు¯ గయుఁడు వసుధలోనఁ గంజాక్షుఁడే కాని¯ మానవుండు గాఁడు మానవేంద్ర! (10) అట్టి మహాపురుషగుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్షకన్యక లగు శ్రద్ధా మైత్రీ దయాదులు దమయంతన వచ్చి కోరిక లొసంగ, నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక, వేదంబులు సకల కామంబుల నిచ్చుచుండ, సంగరంబున భంగంబు నొందిన రాజులప్పనంబు లొసంగ, విప్రులు ధర్మం బాఱవపాలు పంచియిడ, నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తి యోగంబుఁ గలిగి యొనర్చు యజ్ఞంబుల నింద్రాది దేవతలు దృప్తులై యజ్ఞ ఫలంబుల నొసంగ, బ్రహ్మాది తృణగుల్మలతాంతంబుగా సకలలోకంబుల వారినిం దృప్తిం బొందించుచు, శ్రీహరిం దృప్తిఁ బొందఁ జేయుచు, గయుండు పెక్కుకాలంబు రాజ్యంబు జేసె; నట్టి గయునికి జయంతియందుఁ జిత్రరథ స్వాత్యవరోధను లను మువ్వురు గొడుకలు పుట్టిరి; యా చిత్రరథునికి నూర్ణయందు సామ్రాట్టును, వానికి నుత్కళ యందు మరీచియు, నా మేటికి బిందుమతియందు బిందుమంతుండును, నా బిందుమంతునకు సరఘయందు మధువును, మధువునకు సుమనస యనుదాని యందు వీరవ్రతుండును, నా వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువు లను నిరువురును, నందు మన్యువునకు సత్యయందు భువనుండును, నతనికి దోషయందుఁ ద్వష్టయు, నా త్వష్టకు విరోచనయందు విరజుం డను వాఁడును జనియించి; రంత. (11) ఆ విరజున కుదయించిరి¯ భూవినుత! విషూచియందుఁ బుత్ర శతంబున్¯ ఆవల నొక కన్యకయున్¯ నావేళ సమస్త జనులు హర్షం బందన్ (12) ఘనుఁడు ప్రియవ్రతు వంశం¯ బునకుం దుదయై విరజుఁడు భూపతివంశం¯ బును దా నలంకరించెను¯ విను మింద్రావరజుఁ డయిన విష్ణుని మాడ్కిన్.