పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : పంచమ పూర్వ 78 - 138

భరతుని పట్టాభిషేకంబు

(78) ఇట్లు సదాచారు లగు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబు లుపదేశించి మహాత్ముండును బరమసుహృత్తును నగు భగవంతుండు ఋషభాపదేశంబునం గర్మత్యాగంబు చేసి యుపశమశీలురగు మునులకు భక్తిజ్ఞాన వైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మం బుపదేశింపఁ గలవా డగుచుఁ బుత్రశతంబునం దగ్రజుండును బరమభాగవతుండును భగవజ్జన పరాయణుండును నగు భరతుని ధరణీపాలనంబునకుఁ బట్టంబు గట్టి తాను గృహమందె దేహమాత్రావలనంబు చేసి దిగంబరుండై యున్మత్తాకారుం డగుచు బ్రకీర్ణ కేశుండై యగ్నుల నాత్మారోపణంబు చేసి బ్రహ్మావర్తదేశంబును బాసి జడాంధ బధిర మూక పిశాచోన్మాదులుం బోలె నవధూత వేషంబునొంది జనులకు మాఱు పలుకక మౌన వ్రతంబునం బుర గ్రామాకర జనప దారామ శిబిర వ్రజ ఘోష సార్థ గిరి వనాశ్రమాదుల యందు వెంటఁ జనుదెంచు దుర్జన తర్జన తాడనావమాన మేహన నిష్ఠీవన పాషాణ శకృద్రజః ప్రక్షేపణపూతి వాత దురుక్తులం బరిభూతుం డయ్యును గణనం బెట్టక వన మదేభంబు మక్షికాదికృతోపద్రవంబునుంబోలెఁ గైకొనక దేహాభిమానంబునం జిత్తచలనంబు నొందక యేకాకియై చరియించు చుండ నతి సుకుమారంబులగు కరచరణోరస్థ్సలంబులు విపులంబులగు బాహ్వంస కంఠ వదనాద్యవయవ విన్యాసంబులుం గలిగి ప్రకృతి సుందరం బగుచు స్వతస్సిద్ధదరహాసరుచిర ముఖారవిందంబై నవ నళిన దళంబులం బోలి శిశిర కనీనికలం జెలువొంది, యరుణాయతంబు లగు నయనంబులచే నొప్పి యన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచేఁ దేజరిల్లుచు నిగూఢస్మితవదన విభ్రమంబులం బ్రకాశించు తన దివ్యమంగళ విగ్రహంబుచేఁ బురసుందరుల మనంబుల కత్యంత మోహంబు గలుగఁ జేయుచు. (79) ధూళిచేత మిగుల ధూసరితంబునై¯ జడలుగట్టి కడుఁ బిశంగవర్ణ¯ ము నగు కేశపాశమును వెలిఁగించుచు¯ నితరు లెవరుఁ దన్నునెఱుఁగకుండ. (80) అవధూత వేషమున ని¯ ట్లవనిన్ మలినంబు లైన యవయవములతోఁ¯ దవిలి చరించుచు నుండును¯ భువి భూతాక్రాంతుఁ డయిన పురుషుని మాడ్కిన్. (81) జనుల కిట్లు యోగసంచార మెల్ల వి¯ రుద్ధ మనుచు నాత్మ బుద్ధిఁ జూచి¯ యజగరంబు మాడ్కి నవనిపై నుండె బీ¯ భత్సకర్మమునకుఁ బాలుపడుచు. (82) ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం బడియుండి యన్నంబు భుజించుచు నీరు ద్రావుచు మూత్రపురీషంబులు విడుచుచు నవి శరీరంబు నంటం బొరలుచుండు; మఱియుఁ దత్పురీష సౌగంధ్య యుక్తంబగు వాయువు దశదిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపం జేయుచుండ గో మృగ కాక చర్యలం జరించుచు భగవదంశంబైన ఋషభుండు మహానందంబు ననుభవించుచుఁ దనయందు సర్వభూతాంతర్యామి యగు వాసుదేవునిం బ్రత్యక్షంబుగాఁ గనుంగొనుచు సిద్ధిం బొందిన వైహాయస మనోజవ పరకాయప్రవేశాంతర్ధాన దూరగ్రహణ శ్రవణాది యోగసిద్ధులు దమంత వచ్చినం గైకొనక యుండె;" నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షింన్నరేంద్రు డిట్లనియె. (83) "మునివర! యోగజ్ఞానం¯ బునఁ జెఱుపంబడ్డ కర్మములు గల పెద్దల్¯ కని యుండెడి యైశ్వర్యం¯ బును ఋషభుం డెఱిఁగి యేల పొందక యుండెన్?" (84) అనిన శుకుం డిట్లనియె. (85) "ధరణీవల్లభ! నీదు వాక్యములు తథ్యం; బింతయుం దప్ప; దె¯ ట్లరయన్ వన్యమృగంబు పట్టుబడి తా నావేళ నా లుబ్ధకున్¯ ధర వంచించిన మాడ్కి నింద్రియములన్ దండించి చిత్తంబు ని¯ ర్భర కామాదుల కాస యిచ్చుఁ గడు సంరంభంబుతో గ్రమ్మఱన్. (86) చిరకాల తపము నైనను¯ హరియింపఁగ నోపుఁ జిత్త మని పెద్దలు న¯ మ్మరు జారులకున్ జారిణి¯ కరణిని నడరించు మనసు కామాదులకున్. (87) కామక్రోధాదికముల్¯ భూమీశ్వర! కర్మబంధములు మఱియును జే¯ తో మూలము లగుటను దా¯ రీ మహిలో మనసు నమ్మ రెప్పుఁడుఁ బెద్దల్. (88) అదిగాన యెన్నఁడు నైశ్వర్యములను జే¯ పట్టఁ జూడఁడు; లోకభవ్యు లైన¯ వారలచే నభివందనంబులు వొంది¯ వెలయంగ నవధూత వేష భాష¯ ణంబుల నెఱిఁగికొనఁగరాని భగవత్స్వ¯ రూపంబు గలిగి యా రూపమందుఁ¯ బరమ యోగధ్యాన పరులకు నెల్ల దే¯ హత్యాగ సమయంబు నంతలోనఁ (88.1) జూపు చుండియు దేహంబుఁ బాప నిచ్చ¯ గించె; నచ్చట దివ్యయోగీంద్రుఁ డాద్యుఁ¯ డతుల దివ్య ప్రకాశకుఁ డమరగురుడు¯ పరమపురుషుండు ఋషభుండు పార్థివేంద్ర! (89) అంత విముక్త లింగుండు భగవంతుండునగు ఋషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమియింపంబడి విసృష్టంబయ్యు భ్రమించు గతిం బ్రాచీన సంస్కార విశేషం బగు నభిమానాభాసంబున దేహచలనాదికంబుల నొప్పి యుండియు యోగమాయా వాసనచే యుక్తుండయ్యె; మఱియు నా ఋషభుం డొక్క దినంబునం గోంకణ వంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు యదృచ్ఛంజని కుటకాచ లోపవనంబున నిజాస్యకృత శిలాకబళుం డగుచు నున్మత్తుని చందంబున వికీర్ణ కేశుండు, దిగంబరుండునై సంచంరింప వాయువేగ విధూత వేణుసంఘర్షణ సంజాతం బగు నుగ్రదావానలంబు తద్వనంబు దహింప నందు దగ్ధుండయ్యె; నంత నతని కృత్యంబులు తద్దేశవాసులగు జనంబులు చెప్ప నర్హన్నామకుండగు దద్రాష్ట్రాధిపతి విని, నిజధర్మంబులం బరిత్యజించి స్వదేశస్థుల తోడంగూడి, దానా యాచారంబుల నంగీకరించి యధర్మబహుళం బగు కలియుగంబున భవితవ్యతచే విమోహితుండై మనుజుల నసమంజసం బగు పాషండ మతాభినివేశులం జేసె; మఱియును గలియుగంబు నందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛం జేసి దేవతాహేళనంబులు చేయుచు నస్నానానాచమనాశౌచ కేశోల్లుంఛనాది కాపవిత్ర వ్రతంబులం జేయుచు నధర్మ బహుళం బగు కలియుగంబునం జెఱుపంబడ్డ బుద్ధి ధర్మంబులం గలిగి వేద బ్రాహ్మణ యజ్ఞపురుషుల దూషించుచు లోకంబులం దమతమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేదమూలం బగు స్వేచ్ఛం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు చేసి తమంతన యంధతమసంబునం బడుచు నుండుదు; రీ ఋషభుని యవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్షమార్గంబు నుపదేశించుటకు నయ్యె; నదియునుంగాక సప్త సముద్ర పరివృతంబు లగు నీ భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబు లతిశుద్ధంబులునగు నెవ్వని కృత్యంబులు గీర్తింతురు, మఱియు నెవ్వని యశంబున నతికీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగె, నెందు జగదాద్యుండగు పురాణపురుషుం డవతారంబు నొంది కర్మహేతుకంబులు గాని మోక్ష ధర్మంబులం దెలిపె, వెండియు నెవ్వండు యోగమాయా సిద్ధుల నసద్భూతంబు లగుటంజేసి నిరసించె నట్టి ఋషభునితోడఁ దత్సిద్ధికృత ప్రయత్నులగు నితరయోగీశ్వరులు మనోరథంబుననైన నెట్లు సరి యగుదు? రిట్లు సకలవేదలోక దేవ బ్రాహ్మణులకు గోవులకుం బరమగురుండు భగవంతుండు నగు ఋషభుని చరిత్రంబు వినినవారలకు దుశ్చరితంబులు దొలంగు మంగళంబులు సిద్ధించు మిక్కిలి శ్రద్ధతోడ నెవ్వండు విను వినిపించు వానికి హరిభక్తి దృఢంబగు, నట్టి హరి భక్తితాత్పర్యంబునం బెద్దలు భాగవతులగుటంజేసి సంప్రాప్త సర్వపురుషార్థులగుచు వివిధ వృజిన హేతుకంబగు సంసారతాపంబును బాసి యవిరతంబుఁ దద్భక్తియోగామృతస్నానంబు చేసి పరమపురుషార్థం బయిన మోక్షంబును జెందుదు; రని సప్తద్వీపవాసులవారు నేఁడునుం గొనియాడుచుండుదురు. (90) యాదవులకు మీకు నత్యంత కులగురు¯ వైన కృష్ణుఁ డెచట నైనఁ గలఁడు; ¯ కొలుచువారి కెల్ల సులభుఁడై మోక్షంబు¯ నిచ్చుఁ; జింత చేయ నేల నీకు? (91) నిత్యానుభూతమౌ నిజరూపలాభ ని¯ వృత్తమై తగు మహాతృష్ణ గలిగి¯ యతులిత విపుల మాయారచితం బైన¯ లాభంబునకుఁ దగులంబు లేని¯ మతి గల్గి లోకుల నతి వేడ్కఁ గరుణించి¯ యభయదానం బిచ్చి యందఱ కిల¯ నవ్యయంబై దివ్యమై మహానందమై¯ యత్యంత సేవ్యమై యతుల మైన (91.1) తనదు లోకంబు చూపంగఁ దగిన యట్టి¯ మోక్షమార్గంబు నెఱిఁగించి ముక్తదేహుఁ¯ డగుచుఁ దాదాత్మ్య మొందెఁ బ్రత్యక్ష విష్ణు¯ వైన ఋషభుండు జనులకు నద్భుతముగ. (92) భరతుం డంత ధరాతలంబుఁ గడఁకం బాలించుచున్ ధారుణీ¯ శ్వరచంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయై యుండి ని¯ ర్భరకాంతిన్ విలసిల్లు పంచజని పేరం గల్గు కాంతామణిం¯ గర మర్థిన్ ధరఁ బెండ్లియాడె శుభలగ్నంబందు భూవల్లభా! (93) ఇట్లు వివాహితుండై యా పంచజని వలన నహంకారంబునం బంచతన్మాత్రలు జనించిన తెఱంగున సుమతి రాష్ట్రభృక్సుదర్శనాచరణ ధూమ్రకేతువు లను నేవురు పుత్రులం బుట్టించె; నటమున్న యజనాభం బను పేరం బరఁగు వర్షంబు భరతుండు పాలించు కతంబున భారతవర్షంబు నాఁ బరగె; నంత. (94) భరతుఁడు నిజపిత లేలిన¯ కరణిని గర్మముల నెల్లఁ గైకొని ప్రజలన్¯ హరికృప నొందుచు నేలెను¯ ధరణీసురవరులు పొగడ ధరణీనాథా! (95) భగవంతుఁడగు జగద్భరితు నల్పంబులు¯ నధికంబు లైన పె క్కధ్వరముల¯ దర్శపూర్ణిమలచేఁ దగను జాతుర్మాస్య¯ ముల నగ్నిహోత్రమువలనఁ గడఁకఁ¯ బశుసోమములచేతఁ బలుమాఱుఁ బూజించి¯ వేదోక్త మైన యా విమలకర్మ¯ ములఁ గల్గు ధర్మంబుఁ బురుషోత్త మార్పణం¯ బుగఁ జేయుచును మఖంబులను మంత్ర (95.1) ములను బలికెడు నా దైవములను శ్రీశు¯ నవయవంబులు గాఁగ భూధవుఁడు ప్రేమ¯ ననుదినంబును బాయక ఘనతఁ దలఁచి¯ యఖిల రాజ్యానుసంధానుఁ డగుచు నుండె. (96) ఈ రీతిఁ గర్మసిద్ధుల¯ నారయ నత్యంత శుద్ధ మగు చిత్తముతో¯ నా రాచపట్టి భరతుఁడు¯ ధారుణిఁ బాలించె నధిక ధర్మాన్వితుఁడై.

భరతుండు వనంబుఁ జనుట

(97) మఱియు నా భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షితుండును, నిజభక్తజనహృదయారవింద నివాసుండును, బరమపురుషుండును నైన వాసుదేవుని యందు నధికభక్తి ననుదినంబును జేయుచుఁ నేఁబదిలక్షలవేలేండ్లు రాజ్యంబు చేసి పితృ పితామహాద్యాయాతంబగు నా ధనంబును యథార్హంబుగఁ బుత్రులకుఁ బంచియిచ్చి బహువిధ సంపదలుగల గృహంబును బాసి పులహాశ్రమంబున కరిగె; నంత. (98) ఏ యాశ్రమంబున నిందిరాధీశ్వరుఁ¯ డచ్చటి వారల నాదరించి ¯ ప్రత్యక్షమున నుండుఁ బాయక యెప్పుడు¯ నట్టి రమ్యం బైన యాశ్రమమున¯ నిలిచి సాలగ్రామములు గల గండకీ¯ నది యెందు నెంతయుఁ గదిసి యుండు¯ నచ్చోట నేకాకి యగుచును భరతుండు¯ బహువిధ నవపుష్ప పల్లవముల (98.1) నతుల తులసీ దళంబుల నంబువులను¯ గందమూలాది ఫలములఁ గంజములను¯ ఘనత నర్చించి నిచ్చలు దనివిలేక¯ సేవ చేయుచు నుండె నా శ్రీపు హరిని. (99) దానం జేసి విగత విషయాభిలాషుండై శమదమాది గుణంబులు గలిగి యథేచ్ఛంజేసి యెడతెగక పరమపురుషుని పరిచర్యా భక్తిభరంబున శిథిలీకృత హృదయగ్రంథిఁ గలిగి సంతోషాతిశయంబునం బులకితాంగుండు, నానంద బాష్పనిరుద్ధావలోక నయనుండు నగుచు నిజస్వామి యైన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తియోగంబునం బరమానంద గంభీర హృదయంబను నమృతహ్రదంబున నిమగ్నుం డగుచుఁ దానపుడు పూజించు పూజ నెఱుంగక యిట్లు భగవద్వ్రతంబు ధరియించి యేణాజిన వాసస్త్రిషవణ స్నానంబుల నార్ద్రకుటిల కపిశ వర్ణ జటాకలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుం డయిన పరమేశ్వరుని హిరణ్మయ పురుషునింగాఁ దలంచుచు నిట్లనియె. (100) కర్మఫలంబులఁ గడఁక నిచ్చుచు మనో¯ వ్యాపారమున నిట్టి యఖిలలోక¯ ములఁ జేసి యా లోకములకు నంతర్యామి¯ యగుచుఁ బ్రవేశించి యంత మీఁద¯ నానంద రూప మైనట్టి బ్రహ్మముఁ గోరు¯ చున్న జీవునిఁ దనలోని యోగ¯ శక్తిచేఁ దగ ననిశంబుఁ బాలన చేయు¯ చుండి యంతటను మార్తాండమధ్య (100.1) వర్తి యగుచు నిట్లు వఱలుచు జగముల¯ యందు నుండి ప్రకృతిఁ బొంద కంత¯ నతుల దివ్యమూర్తియైన యానంద రూ¯ పమును శరణ మొందె భరతవిభుఁడు. (101) అంత నా భరతుం డొక్కనాఁ డా మహానదిం గృతాభిషేకుండయి ముహూర్తత్రయం బంతర్జలంబులందుఁ బ్రణవోచ్ఛారణంబు చేయుచుండు సమయంబున, నిర్భరగర్భిణియగు నొక్క హరిణి జలార్థినియై యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి, జలపానంబు చేయు నెడ నా సమీపంబున మృగపతి గర్జించి లోకభయంకరంబుగ నాదంబు సేయ నా హరిణి స్వభావంబున భీత యగుటం జేసి బెగ్గడిలి హరి విలోకనవ్యాకుల చిత్తయై దిగ్గన నదిరి గగనంబునకు నెగిరి; యపగత తృష యగుచు నది నుల్లంఘించు నెడ నధిక భయంబునం జేసి యా గర్భంబు యోని ద్వారంబున గళితంబై జలంబులం బడియె; నా హరిణి యుల్లంఘనాది భయంబునం జేసి తత్తీరీరంబున నుండు గిరిదరిం బడి శరీరంబుఁ బాసె; నంత నా హరిణపోతంబు జలంబులం దేలుచున్న భరతుండు గను విచ్చి చూచి కరుణార్ద్ర చిత్తుండై మృతజనని యగు నా హరిణపోతంబును దన యాశ్రమంబునకుం గొంపోయి మిక్కిలి ప్రీతిం జేసి యుపలాలనంబు చేయుచుండఁ బోషణ పాలన ప్రీణన లాలనాను ధ్యానంబుల భరతునకు నాత్మనియమంబు లైన యష్టాంగయోగంబులును బరమపురుష పూజా పరిచర్యాదులు నొక్కొక్కటిగఁ గ్రమక్రమంబునం గొన్ని దినంబులకు సమస్తంబును నుత్సన్నం బయ్యె; నంత. (102) ఘనతపము చలన మొందుట¯ యును భరతుం డెఱుఁగ కాత్మయోగంబునఁ జ¯ య్యనఁ బాసె హరిణపోతముఁ¯ దన మదిలో నిల్పి ప్రీతి దప్పక పలికెన్. (103) అక్కట! తల్లిఁ బాసి హరిణార్భక మాప్తులు లేమిఁజేసి యే¯ దిక్కునులేక యున్న నిటఁ దెచ్చితి; నా యెడ నీ మృగార్భకం¯ బెక్కుడు ప్రేమ చేసి చరియించుచు నున్నది; నాదు సన్నిధిన్¯ మక్కువ చేసి దీనిఁ గడు మన్ననలం దగఁ బ్రోతు నెంతయున్. (104) శరణని వచ్చిన జంతువుఁ¯ గరుణం గను విచ్చి చూచి కాచిన పుణ్యం¯ బరయఁగ నధికం బని ము¯ న్గర మెఱిఁగించిరి మునీంద్రగణములు ప్రేమన్. (105) అని యిట్లు హరిణపోతంబుం దన యాశ్రమంబున నత్యాసక్తిం జేసి యాసన శయనాటన స్నాన సమిత్కుశ కుసుమ ఫల ఫలాశ మూలోదకాహరణ దేవపూజాజపాదుల యెడం దన యొద్దన యునిచి కొనుచు వృక సాలావృకాది క్రూరమృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటం దిరగుచు నధిక ప్రణయభరపరీతహృదయుం డగుచు నతి స్నేహంబునంజేసి కొంతసేపు స్కంధంబుల వహించుచు; మఱికొంతతడ వురంబున నుత్సంగంబున నుంచికొని లాలించుచు సంతసంబు నొందు; మఱియు నా భరతుండు నిత్యనైమిత్తికాది క్రియా కలాపంబు నిర్వర్తించు నెడ నంతనంత లేచి హరిణకుణకంబుఁ జూచుచుఁ గించిత్స్వస్థ హృదయుండై దాని నాశీఃపరంపరల నభినందించుచుఁ జుంబనాదులఁ బ్రీతిచేయుచు నతిమోహంబునం బెంచుచుండు నెడ. (106) గురువులు వాఱి బిట్టుఱికి కొమ్ములఁ జిమ్ముచు నంతనంత డ¯ గ్గఱుచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీఱుచు గాసి చేయుచు¯ న్నొఱగుచు ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి యంతలో¯ నఱకడ మెక్కుచుం బొదిలి యాడుచు నా హరిణంబు లీలతోన్. (107) గరిమ నీ గతి మెల్లన కెరలు వొడిచి¯ చెలఁగి యాడంగ భరతుండు చిత్త మందు¯ సంతసిల్లుచు నుండె నాశ్రమముఁ బాసి¯ హరిణడింభక మంతలో సురిఁగి చనిన. (108) భరతుం డంతం దన్మృగశాబకంబు గానంబడమికి వ్యాకులిత చిత్తుం డగుచు నష్టధనుండునుం బోలె నతిదీనుండై కరుణతోడం గూడి తద్విరహవిహ్వల మతియై దానిన తలంచుచు నతి శోకంబుతో మనంబున దుఃఖించి యిట్లనియె. (109) "హరిణపోతంబ! నీకు వనాంతమందుఁ ¯ గ్రూర మృగబాధ లేకుండఁ గోరుచుండఁ¯ దలఁగి పోయితె" యనుచుఁ జిత్తంబునందు¯ రాజవృషభుండు భరతుఁ డారాట మంది. (110) "తల్లిచచ్చిన హరిణపోతంబు వచ్చి¯ పుణ్యహీనుండ నగు నన్నుఁ బొంది పాసె; ¯ నేమి చేయుదు? నే నింక నెట్లు గందుఁ? ¯ జేరి యే రీతిఁ గాంచి రక్షించుకొందు? (111) కట్టా! యీ యాశ్రమమునఁ¯ బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం¯ బిట్టట్టుఁ దిరుగు చుండఁగఁ¯ బట్టి మృగేంద్రుండు గొట్టి బాధించెనొకో?" (112) ఇట్లు భరతుండు హరిణకుణక క్షేమంబు గోరుచు “నెప్పుడు వచ్చి నన్ను సంతోషపఱచు? నానా ప్రకారంబులైన తన గతులచేత నన్ను నెప్పు డానందంబు నొందించు? ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుఁ గొమ్ముల గోఁకుచు నుండు; నట్టి వినోదంబు లెప్పుడు గనుఁగొందు దేవ పూజాద్రవ్యంబులు ద్రొక్కి మూర్కొనినం గోపించి చూచినం గుమారుడుంబోలె దూరంబునకుం జని నిలిచి మరల నేఁ బిలిచిన వెనుక నిలిచి యుండు; నిట్టి మెలఁకువ స్వభావంబులు గలుగుట యెట్టుు? లీ భూదేవి యెంత తపంబు చేసినదియో? యా హరిణ పాదస్పర్శంబులం బవిత్రయైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్హ యగు నట్టి హరిణపోతంబు నెట్లు గనుఁగొందు? నదియునుంగాక భగవంతుండగు చంద్రుండు మృగపతిభయంబున మృతజననియు, స్వాశ్రమపరిభ్రష్టంబునైన మృగశాబకంబును గొనిపోయి పెంచుచున్నవాఁడో? మున్ను పుత్రవియోగతాపంబునం జంద్రకిరణంబులం బాపుదు; నిప్పుడు హరిణపోతంబు దన శరీర స్పర్శంజేసి చంద్రకిరణంబులకన్న నధికం బగుచుం బుత్ర వియోగతాపంబు నివర్తింపం జేసె” ననుచుం బెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబులచేతం బూర్వకర్మవశంబున యోగభ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంశితుం డగుచు నితరజాతిం బుట్టిన హరిణపోతంబుమీఁది మోహం బగ్గలం బగుచుండ నుండె;” నని పలికి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియ. (113) "జననాథ! మున్ను మోక్షవిరోధ మని పాయఁ¯ గా రాని పుత్రాదికంబు నెల్లఁ¯ బాసి తపస్వియై భరతుండు హరిణ శా¯ బక పోషణంబునఁ బాలనమున¯ నతి లాలనప్రీణనానుషంగంబుల¯ మూషకబిల మతిరోషమునను¯ సర్పంబు చొచ్చిన చందంబునను యోగ¯ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లెఁ (113.1) గాన యెంతవానికైనను గాలంబు¯ గడవ రామి నట్లు గాక పోదు¯ పరమమునుల కైనఁ బాయవు కర్మంబు¯ లొరు లనంగ నెంత? నరవరేణ్య! (114) ఇట్లు భరతుండు మృగవియోగ తాపంబు నొందుచుండు నెడ నా మృగశాబకంబు చనుదెంచిన సంతసిల్లుచుండె; నంత నొక్కనాఁడు.

హరిణీగర్భంబున జనించుట

(115) భరతుం డల్లన యంత్యకాలము వెసం బ్రాపింపఁగా నప్పు డా¯ హరిణంబుం గడు భక్తిఁ బుత్రగతి నత్యాసక్తి వీక్షింప నా ¯ హరిణంబుం దన యాత్మలో నిలిపి దేహం బంతటం బాసి తా¯ హరిణీగర్భమునన్ జనించి హరిణంబై యొప్పెఁ బూర్వస్మృతిన్. (116) ఇట్లు భరతుండు హరిణీగర్భంబునం బుట్టియు భగవదారాధన సామర్థ్యంబునం దన మృగజన్మ కారణంబుఁ దెలిసి కడుం దాపంబు నొందుచు నిట్లనియె. (117) "రాజులు ప్రస్తుతింప సురరాజసమానుఁడనై తనూజులన్¯ రాజులఁ జేసి తాపసులు రాజఋషీంద్రుఁ డటంచుఁ బల్కఁగాఁ¯ దేజము నొంది యా హరిణదేహము నందలి ప్రీతిఁ జేసి నా¯ యోజ చెడంగ నేఁ జెడితి యోగిజనంబులలోన బేలనై. (118) ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తనారాధనానుసరణాభియోగంబులం జేసి యశూన్య సకలయామంబగు కాలంబు గల నాకు హరిణపోతస్మరణంబు కతంబున యోగవిఘ్నంబు ప్రాప్తంబయ్యె; మోక్షదూరుండ నైతి" నని నిగూఢ నిర్వేదుం డగుచుఁ దల్లిం బాసి క్రమ్మఱ నుపశమశీల మునిగణ సేవితంబయి భగవత్క్షేత్రంబైన సాలతరునిబిడతమ గ్రామ సమీప పులస్త్య పులహాశ్రమంబులకుం గాలాంజన పర్వతంబు వలనఁ జనుదెంచి యందు మృగ దేహత్యాగావసానంబు గోరుచు సంగంబు విడిచి యేకాకి యగుచు శుష్క పర్ణ తృణవీరు దాహారుఁడై మృగత్వ నిమిత్తం బగు నా నదీతీర్థంబునందు నవసానంబు గోరుచుఁ దత్తీర్థోదకక్లిన్నం బగుచు నుండు శరీరంబు విడిచె"నని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు వినిపించి మఱియు నిట్లనియె.

విప్రసుతుండై జన్మించుట

(119) "హరిణ దేహముఁ బాసి యంత నాంగిర సాహ్వ¯ యుండు శుద్ధుఁడు పవిత్రుండు ఘనుఁడు¯ శమదమఘనతపస్స్వాధ్యాయ నిరతుండు¯ గుణగరిష్ఠుఁడు నీతికోవిదుండు¯ నైన బ్రాహ్మణునకు నాత్మజుండై పుట్టి¯ సంగంబు వలనను జకితుఁ డగుచుఁ¯ గర్మ బంధంబుల ఖండింపఁజాలు నీ¯ శ్వరుని నచ్యుతు నజు శ్రవణ మనన (119.1) ములను హరిచరణధ్యానములను విఘ్న¯ భయముననుజేసి మనమందుఁ బాయనీక¯ నిలిపి సంస్తుతి చేయుచు నిలిచి యుండె¯ భరితయశుఁడైన భరతుండు పార్థివేంద్ర! (120) ఇట్లాంగిరసుండు ప్రథమభార్య యందుఁ బుత్రనవకంబును, గనిష్ఠభార్య యందు స్త్రీపురుషుల నిద్దఱను గలుగంజేసిన నందుఁ బురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండును నుత్సృష్ట మృగశరీరుండునుం జరమశరీరంబునం బ్రాప్తవిప్రశరీరుండును నగు భరతుండయ్యె; నతం డా జన్మంబున నన్యజన సంగంబు జన్మపరంపరలకుఁ గారణం బని యత్యంత భయంబు నొంది కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణాదుల శ్రీహరి యనుగ్రహంబునం బూర్వజన్మపరంపరల సంస్మరించుచుఁ దన స్వరూపంబు నున్మత్తజడాంధబధిర రూపంబుల లోకులకుం జూపుచుండె; నంత. (121) జనకుం డాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునం బెంచుచుం¯ దనరం జౌలముఖాగ్ర్యకర్మముల చేతన్ సంస్కృతుం జేసి పా¯ యని మోహంబున నిచ్చలుం గడఁక శౌచాచారముల్ చెప్పినన్¯ ఘనుఁ డా భాగవతుం డసమ్మతిని దత్కర్మంబులం గైకొనెన్. (122) ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబుల యందు నిచ్చలేక యుండియును బితృనియోగ నిర్బంధంబునం బితృసన్నిధి యందు యసమీచీనంబుగా వ్యాహృతిప్రణవ శిరస్సహితం బగునట్లు గాయత్రీమంత్రంబు జపియించుచుఁ జైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగ వేదంబుల నధ్యయనంబు చేయుచుండె; జనకుం డాత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలయునను లోకాచారంబు ననువర్తించి యాత్మభూతుండగు నాత్మజునందు నభినివేశిత చిత్తుండగుచు శౌచాచమనాధ్యయన వ్రత నియమగుర్వనల శుశ్రూషణాదికంబు లనభియుక్తంబు లయినం బుత్రునిచే నొనరింపించుచు నప్రాప్తమనోరథుం డయ్యె; నంత. (123) ఈ రీతిని గొడుకున కా¯ చారంబులు గఱపి చింత సద్గృహమున సం¯ సారి యగుచుండి విప్రుఁడు¯ బోరన దేహంబుఁ బాసి పోయిన మీఁదన్. (124) తల్లి తండ్రితోడ దా నగ్నిఁ జొచ్చిన¯ నతని మహిమ లెఱుఁగ కంతలోన¯ సవితి తల్లి కొడుకు లవినీతు లగుచును¯ శాస్త్రవిద్య లతనిఁ జదువనీక. (125) ఇట్లు బ్రహ్మణకుమారుని సవితి తల్లి కొడుకులు వేదవిద్య వలనం బాపి గృహకర్మంబుల నతని నియమించిన. (126) ధరణీసురోత్తముఁడు దా¯ నరుదుగఁ దమవారు చెప్పినవి యెల్లను నే¯ మఱ కందుఁ బ్రీతిచేయక¯ నిరతము గృహకర్మమట్లు నెఱపుచు నుండెన్. (127) ఇట్లు గృహకర్మప్రవర్తనుం డగుచు నుండ మూఢులగు ద్విపాత్పశువులచే నున్మత్త జడ బధిర యని యాహూయమానుం డగు నపుడు తదనురూపంబులగు సంభాషణంబుల నొనర్చుచుఁ బరేచ్ఛాయదృచ్ఛలం జేసి విష్టివేతన యాచ్ఞాదుల వలన నియుక్తకర్మంబులం బ్రవర్తించుచు. (128) అతుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన¯ నెద్ది వెట్టిన జిహ్వకు హితముగానె¯ తలఁచి భక్షించుఁగా; కొండుఁ దలఁచి మిగులఁ ¯ బ్రీతి చేయఁడు రుచులందుఁ బెంపుతోడ. (129) మఱియు నా విప్రుం డాత్మనిత్యానంద సుఖలాభంబు గలిగి ఇహ సుఖదుఃఖంబులయందు దేహాభిమానంబు చేయక శీతోష్ణ వాతవర్షా తపంబులకు నోడి పైచీరగప్పక వృషభంబునుం బోలెఁ బీనుండును గఠినాంగుండు నగుచు స్థండిలశాయియై రజఃపటలంబునం గప్పబడిన దివ్యమాణిక్యంబునుం బోలె ననభివ్యక్త బ్రహ్మవర్చసుం డై మలినాంబర పరీతకటితటుండు నతి మషీలిప్తయజ్ఞోపవీతుండు నగుటం జేసి యజ్ఞ జనంబు లతండు బ్రహ్మణాభాసుండు మందుండు నని పలుక సంచరించుచుండం గర్మమూలంబునం బరులవలన నాహారంబు గొను నపుడు దమవారును వ్యవసాయకర్మంబునందు నియమించిన క్షేత్రవిహిత సమ విషమ న్యూనాధికంబుల నెఱుంగక ప్రవర్తిల్లుచు నూక తవుడు తెలికపిండి పొట్టు మాఁడు ద్రబ్బెడ యాదిగాఁ గల ద్రవ్యంబుల యందు నమృతంబు పగిది రుచిచేసి భక్షించుచుం జేని కావలి యుండు నెడ నొక్కనాఁడు.

విప్రుడు బ్రతికివచ్చుట

(130) పురిలోన వృషలపతి దా¯ నరుదుగ సంతాన కాముఁడై వేడుకతోఁ¯ బురుషుఁడగు పశువుఁ గాళికి¯ దఱుముక గొనిపోవఁ బశువు దలఁగిన భృత్యుల్. (131) అరసి కానలేక యా రాత్రి వీరాస¯ నమునఁ జేని కాఁపు విమల బుద్ధి¯ నెసఁగు విప్రయోగి నొయ్యనఁ బొడగాంచి¯ పశువు మంచి దనుచుఁ బట్టి రతని. (132) ఆ రీతిని భూసురవరు¯ నారయ నా కాళికాగృహమునకు భృత్యుల్¯ బోరనఁ గొని చని సల్పిరి¯ చారుత రాభ్యంజనాది సంస్కారంబుల్. (133) ఇట్లభ్యంజనాది కృత్యంబులు దీర్చి నూతన వసనంబు గట్ట నిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతునిం జేసి మృష్టాన్నంబులు భుజియింపం బెట్టి ధూపదీప మాల్యలాజకిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి పంచమహావాద్య ఘోషంబులతోడ నా పురుషపశువుం గాళికాదేవి సమ్ముఖంబున నాసీనుం గావించి యా వృషలపతి పురుషపశువు రక్తంబున భద్రకాళి సంతోషపెట్టం దలంచి కాళికామంత్రాభిమంత్రితంబు నతికరాళంబు నైన ఖడ్గం బంది నిజాభీష్ట సిద్ధికి హింసింపం దలంచిన. (134) సర్వభూతములకు సఖుఁడును బ్రహ్మభూ¯ తాత్ముఁడు నిర్వైరుఁ డయిన బ్రహ్మ¯ సుతుని తేజం బంతఁ జూడ దుస్సహమైన¯ భయమంది వడఁకుచు భద్రకాళి ¯ క్రోదంబు ముమ్మడిగొనఁగ హుంకారంబు¯ సలుపుచు నట్టహాసంబు చేసి¯ పాపాత్ములును దౌష్ట్యపరులును రాజస¯ తామస కర్మ సంధాను లగుచు (134.1) విప్రవరు నట్లు హింసించు వృషలపతిని¯ భృత్యువర్గంబుఁదోఁ దలల్ పృథ్విఁ గూల్చి¯ యపుడు వృషలాధిపుని శిరమంది లీలఁ¯ బాడి యాడుచు నందంద క్రీడ సలిపె. (135) ధరలోన నెవ్వరేనియు¯ ధరణీసురవరుల కెగ్గు దగఁ దలచిన వా¯ రరయఁగఁ జెడుదురు; నిక్కము¯ హరి ధరణీసురవరేణ్యు లం దుండుటచేన్. (136) మఱియును. (137) అచ్చట విప్రసూనుఁడు భయం బొకయించుకలేక చంపఁగా¯ వచ్చిన వారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా¯ నచ్చుతభావ ముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్¯ మచ్చికతోడ నిల్పి యనుమానము నొందక యుండె నెంతయున్. (138) మఱియు నా విప్రవరుండు చండికాగృహంబు వెలువడి క్రమ్మఱం జేని కావలి యుండు నెడ.