పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : పంచమ స్కంధము - పూర్వాశ్వాశము 1 - 77


పోతన తెలుగు భాగవతం
పంచమ స్కంధము పూర్వాశ్వాసము

ఉపోద్ఘాతము

(1) శ్రీకర కరుణా సాగర! ¯ ప్రాకటలక్ష్మీ కళత్ర! భవ్యచరిత్రా! ¯ లోకాతీతగుణాశ్రయ! ¯ గోకులవిస్తార! నందగోపకుమారా!(2) సకలపురాణార్థ జ్ఞాన విఖ్యాతుండగు సూతుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

ప్రియవ్రతుని బ్రహ్మదర్శనంబు

(3) "భూనాథుఁ డుత్తరాత్మజుఁ¯ డైన పరీక్షిన్నరేంద్రుఁ డభిమన్యు సుతుం¯ డానందమంది ఘన సు¯ జ్ఞానుండగు శుకునిఁ గాంచి సరసతఁ బలికెన్.(4) "మునీంద్రా! పరమభాగవతుండు నాత్మారాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుండి యెట్లు రమించె? కర్మబంధంబు లయిన పరాభవంబులు గల గృహంబుల యందు ముక్తసంబంధు లైన పురుషులకు సంతోషంబు గానేర; దుత్తమశ్లోకుం డైన పుండరీకాక్షుని పాదచ్ఛాయం జేసి నిర్వృతచిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహత చేయుదురు; గానఁ బ్రియవ్రతునికి సంసారంబునందుఁ దగులంబు గలుగు టెట్లు? దారాగారసుతాదు లందుఁ దగులంబు గలుగ వానికి నెట్లు సిద్ధి గలుగు? శ్రీహరియం దస్ఖలితమతి యెట్లు గలుగు? నీ సంశయంబుఁ దేట పఱపు"మని పరీక్షిన్నరేంద్రు డడిగిన శుకయోగీంద్రుం డిట్లనియె.(5) "హరి చరణాంబుజ మకరం¯ ద రసావేశిత మనః ప్రధానుండగు స¯ త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ¯ బొరసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్(6) ధరణీవల్లభ! విను మా¯ నరవరుఁడు ప్రియవ్రతుండు నారదముని స¯ చ్చరణోపసేవఁ జెందుచు¯ నరుదుగ నధ్యాత్మ సత్రయాగంబందున్.(7) దీక్షితుండై ధరిత్రీపాలనముఁ దండ్రి¯ పనిచిన సుజ్ఞాన భంగ మనుచు¯ నంగీకరింపమి నంతయుఁ దెలిసి ప¯ ద్మాసనుఁ డతనికి నతుల రాజ్య¯ మందుల మిక్కిలి యాసక్తిఁ బుట్టింతు¯ ననుచును దన చిత్తమందుఁ దలఁచి¯ తారకాపరివృతతారాధిపుని మాడ్కి¯ శ్రుతులతోఁ గూడి యచ్యుత విభూతి(7.1) హంసవాహనుఁ డగుచు నింద్రాదు లెల్లఁ¯ గదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి¯ సన్మునీంద్రులు దన్నుఁ బ్రశంసచేయ¯ నల్లనల్లన యుడువీథి నరుగు దెంచె.(8) మఱియు నయ్యై మార్గంబుల యందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషు లిరుదెసల స్తోత్రంబులు చేయుచుండ గంధమాదనద్రోణులం బ్రకాశంబు నొందించుచు జనుదెంచిన పద్మాసనునకు నారదుండు స్వాయంభువ ప్రియవ్రతులతోఁ గూడి ముకుళిత కరకమలుండై యెదురు చనుదెంచి సంస్తుతి స్తబకంబులం బూజించిరి; విరించి సంతసించి ప్రియవ్రతునిం జూచి నవ్వుచు నిట్లనియె.(9) "హరి నా ముఖమున నీకును¯ గర మెఱిఁగింపంగఁ బనిచెఁ గావున నిదె సు¯ స్థిర మతి విను మంతయు శ్రీ¯ హరి వాక్యముగా నెఱింగి యవనీనాథా!(10) కోరి వేడ్క నీవు నారదుండును నేను¯ నందఱమును నీశ్వరాజ్ఞఁ బూని¯ యుడుగ కెపుడు జేయనున్నవారము గాన¯ నతని యాజ్ఞఁ దప్ప నలవి గాదు.(11) మఱియు శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను యోగ వీర్య జ్ఞానార్థ ధర్మంబులను దనచేత నొరులచేతం దప్పింప సమర్థుండు గాఁ; డుత్పత్తి స్థితి నాశంబులకు శోకమోహభయసుఖదుఃఖంబులకు నీశ్వరాధీనుండెకాని జీవుండు స్వతంత్రుండు గాఁడు; శ్రీహరి వాగ్రూపంబు లయిన శ్రుతులందు గుణత్రయం బను రజ్జువున బంధింపంబడిన యస్మదాదులము ముకుఁద్రాటిచేఁ బశువు మనుష్యులకు వశంబయిన చందంబున నీశ్వరాజ్ఞం బ్రవర్తించుచుందుము; నరుండు సుఖదుఃఖానుభవంబులకు నీశ్వరాధీనుండు; నేత్రంబులు గలవాని చేతఁ దివియంబడిన యంధుండును బోలె నీశ్వరుం డిచ్చిన సుఖదుఃఖంబు లనుభవించుచున్నవారము; స్వప్నంబునం గన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగాఁ దలంచిన చందంబున మోక్షార్థియైన సుజ్ఞానవంతుండు ప్రారబ్ధ సుఖదుఃఖంబు లనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులం బాయనొల్లఁడు; వనవాసి యైనను జితేంద్రియుండు గాకుండెనేనిఁ గామాది సహితుం డగుటంజేసి సంసారబంధంబులు గలుగు; గృహస్థాశ్రమంబందును జితేంద్రియుండై యాత్మ జ్ఞానంబుగల పురుషునకు మోక్షంబు సిద్ధించు; శత్రువుల గెలువ నిశ్చయించిన పురుషుండు దుర్గం బాశ్రయించి శత్రువుల జయించిన మాడ్కిని మోక్షార్థి యగు నీవును గృహాశ్రయుండ వగుచు శ్రీనారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి యరిషడ్వర్గంబు జయించి ముక్తసంగుండవై యీశ్వర కల్పితంబు లగు భోగంబు లననుభవించి ముక్తింజెందు; మనినఁ ప్రియవ్రతుండు త్రిభువన గురుండయిన చతురానను వాక్యంబు లవనతమస్తకుం డై బహుమాన పూర్వకంబుగ నంగీకరించె; నంత.(12) సరసిజాసనుండు స్వాయంభువుని చేత¯ నధికమైన పూజలంది నార¯ దుండు నా ప్రియవ్రతుండును జూడంగఁ¯ జనియెఁ దనదు పూర్వ సదనమునకు.(13) సత్యసంధుఁడైన స్వాయంభువుం డను¯ మనువు బ్రహ్మచేత మన్ననఁ దగ¯ నంది యంత నారదానుమతంబునఁ¯ దనదు సుతుని రాజ్యమునను నిలిపె. (14) ఇట్లు స్వాయంభువమనువు భూచక్ర పరిపాలనంబునకుఁ బ్రియ వ్రతునిఁ బట్టంబు గట్టి విషమంబులగు విషయంబుల వలన విముక్తుండై వనంబునకుం జనియె; నంత.(15) ధరణీవల్లభుఁ డా ప్రియవ్రతుఁడు మోదం బందుచున్ లీల నీ¯ శ్వరవాక్యంబునఁ గర్మతంత్ర పరుఁడై సంగంబులం బాపు శ్రీ¯ హరిపాదాంబుజ చింతనం దగిలి నిత్యానందముం బొంది దు¯ ర్భర రాగాదులఁ బాఱఁదోలి ప్రజలం బాలించె నత్యున్నతిన్.

ఆగ్నీధ్రాదుల జన్మంబు

(16) ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు చేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక యగు బర్హిష్మతి యనుదానిం బత్నిగాఁ బడసి, యా సతివలన శీల వృత్త గుణ రూప వీర్యౌదార్యంబులం దనకు సమానులైన యాగ్నీధ్రే ధ్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతపృష్ట, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవు లను నామంబులు గల పుత్రదశకంబును; నూర్జస్వతి యను నొక్క కన్యకను గాంచె; నందుఁ గవి మహావీర సవనులు బాలకులయ్యు నూర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యానిష్ణాతులై యుపశమనశీలు రగుచుం బారమహంస్యయోగం బాశ్రయించి, సర్వజీవనికా యావాసుండును, భవభీతజనశరణ్యుండును, సర్వాంతర్యామియు, భగవంతుండు నగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమ భక్తియోగానుభావంబున విశోధితాంతఃకరణు లగుచు నీశ్వరుతాదాత్మ్యంబుఁ బొందిరి; అంత.(17) వసుధేశ! యా ప్రియవ్రతుఁ డొండు కాంత యం¯ దధికుల మన్వంతరాధిపతుల¯ మఱియు నుత్తముఁడు తామసుఁడు రైవతుఁ డను¯ సుతులను బుట్టించె సుమహితులను; ¯ మున్ను జన్మించిన మువ్వురు పుత్రులు¯ నవ్యయ పదవికి నరుగుటయును¯ నంతఁ బ్రియవ్రతుఁ డఖిల శాత్రవకోటిఁ¯ దన బాహుబలముచేతను జయించి(17.1) యతఁడు బర్హిష్మతీ కాంతయందుఁ బ్రీతి¯ గలిగి యౌవన లీలా వికాస హాస¯ హేలనాదులఁ జిత్తంబు గీలుకొల్పి¯ గత వివేకుండుబోలె భోగములఁ బొందె.(18) ఇట్లు ప్రియవ్రతుం డేకాదశార్బుద పరివత్సరంబులు రాజ్యంబు చేసి యొక్కనాడు మేరునగ ప్రదక్షిణంబు చేయు సూర్యునకు నపరభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపంబూని భగవదుపాసనా జనితాతిపురుష ప్రభావుండై సవితృ రథసదృక్ష వేగంబు గలిగి తేజోమయం బైన రథంబు నారోహణంబు చేసి రాత్రుల నెల్ల దినంబు లొనర్తు నని సప్తరాత్రంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు పఱపుటయు నా రథనేమి మార్గంబులు సప్తసముద్రంబులును, నా మధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె; నందు.(19) సరస జంబూ ప్లక్ష శాల్మలిద్వీప కు¯ శ క్రౌంచ శాక పుష్కరము లనఁగ¯ నలరు నా ద్వీపంబులందు జంబూద్వీప¯ మొనరంగ లక్షయోజనము లయ్యె; ¯ నట యుత్తరోత్తరాయత సంఖ్యఁ దాద్విగు¯ ణిత మయి యొండొంటి కతిశయిల్లు ¯ క్షారేక్షురస సు రాజ్యక్షీర దధ్యుద¯ కంబులు గలుగు సాగరము లేడు(19.1) ద్వీప పరిమాణములు గల్గి విస్తరిల్లు¯ సంధి సంధిని బరిఖల చందమునను ¯ గ్రమము దప్పక యొండొంటిఁ గలయకుండు¯ సకల జీవుల కెల్ల నాశ్చర్యముగను.(20) అట్టి ద్వీపంబుల యందుఁ బరిపాలనంబునకుం బ్రియవ్రతుం డాత్మభవులు నాత్మసమాన శీలురునైన యాగ్నీధ్రేధ్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్రుల నొక్కొక్కని నొక్కొక ద్వీపంబునకుం బట్టంబుగట్టి యూర్జస్వతి యను కన్యకను భార్గవున కిచ్చిన, నా భార్గవునకు నూర్జస్వతి యందు దేవయాని యను కన్యారత్నంబు జనించె; నట్టి బలపరాక్రమవంతుం డైన ప్రియవ్రతుండు విరక్తుండై యొక్కనాఁడు నిజ గురువగు నారదుని చరణానుసేవాను పతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుఁ దలంచి యిట్లనియె.

వనంబునకుఁ జనుట

(21) "అక్కట! యే నింద్రియములచేఁ గట్టంగఁ¯ బడియుండి యందులఁ బాయలేక¯ యజ్ఞాన విరచితం బగు సర్వవిషయము¯ లను నంధకూపంబులందు నడఁగి¯ తరుణుల కే వినోదమృగంబనై యుంటి¯ యవి యెల్ల నే నొల్ల"ననుచు రోసి¯ హరికృపచే నప్పు డబ్బిన యాత్మ వి¯ ద్యను గల్గి తనవెంట నరుగుదెంచు(21.1) కొడుకులకు నెల్ల రాజ్యము గుదురు పఱచి¯ తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి¯ హరివిహారంబు చిత్తంబునందు నిలిపి¯ పరఁగ నల్లన నారదపదవి కరిగె.(22) ఇట్లు దన రథమార్గంబులు సప్త ద్వీపసాగరంబులుగాఁ జేసి సూర్యునకుఁ బ్రతిసూర్యుండై సరిద్గిరివనాదులచే భూత నిర్వృత్తికొఱకుఁ బ్రతి ద్వీపంబునకు నవధులు గల్పించి ద్వీపవర్ష నిర్ణయంబులం బుట్టించి పాతాళ భూ స్వర్గాది సుఖంబులు నరకసమానంబులుగాఁ దలంచి విరక్తింబొంది నిరంతర భగవద్ధ్యాన విమలీకృతాశయుం డగుచు హరిభక్తి ప్రియుండయిన ప్రియవ్రతుని చరిత్రంబు లీశ్వరునకుఁ దక్క నన్యుల కెఱుంగఁ దరంబుగా; దతని మహిమంబులు నేడుఁనుం గొనియాడుదు"రని శుకుండు మఱియు నిట్లనియె.(23) "హరిసేవనా ప్రియవ్రతుఁ¯ డరయఁగఁ గైవల్యపదవి నందుట యరుదే? ¯ ధరఁ జండాలుం డైనను¯ హరి నామస్మరణఁ జెందు నవ్యయపదమున్."(24) అని పలికి శుకుండు మఱియు నిట్లనియె

వర్షాధిపతుల జన్మంబు

(25) "జనకుం డిట్లు విరక్తుఁడైనను దదాజ్ఞం జేసి యాగ్నీధ్రుఁ డే¯ పున ధర్మప్రతిపాలనుం డగుచు జంబూ ద్వీపమున్నేలుచుం¯ దన సత్పుత్రులమాడ్కి నెల్ల ప్రజలం దాత్పర్య చిత్తంబునన్¯ ఘనతం బ్రోచె ననేకకాల మిలఁ బ్రఖ్యాతంబుగా భూవరా!(26) ఇట్లగ్నీధ్రుండు రాజ్యంబు చేయుచు నొక్కనాఁడు పుత్రకాముండై మందరాద్రి సమీపంబున నఖిలోపచారంబుల నేకాగ్రచిత్తుండై యర్చించినం గమలసంభవుండు సంతసిల్లి తన సమ్ముఖంబున సంగీతంబు చేయు పూర్వచిత్తి యను నప్సరోంగనం బంపుటయు నా యప్సరాంగన చనుదెంచి రమణీయ వివిధ నిబిడ విటపి విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూఢస్థల విహంగమ మిథునోచ్ఛార్యమాణ షడ్జాది స్వరంబులచే బోధ్యమాన సలిలకుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబు లయిన నిర్మలోదక కమలాకరంబులు గల తదాశ్రమోపవనంబు నందు విహరించుచు విలాస విభ్రమ గతివిశేషంబులం జలనంబు నొందు స్వర్ణ చరణాభరణస్వనం బన్నరదేవకుమారుం డాలించి యోగసమాధిం జేసి ముకుళితనేత్రుండై యుండి యల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మధుకరాంగనయుంబోలెఁ బుష్పాఘ్రాణంబు చేయుచు దేవమానవుల మనోనయనంబుల కాహ్లాదంబు బుట్టించుచున్నగతి విహార వినయావలోకన సుస్వరావయవంబుల మన్మథ శరపరంపరంల నొందించుచు ముఖకమల విగళితామృత సమానహాసభాషణామోదమదాంధంబు లయిన మధుకర మిథునంబుల వంచించి, శీఘ్ర గమనంబునం జలించు కుచ కచమేఖలలు గల దేవిం గనుంగొని చిత్తచలనంబు నొంది మన్మథపరవశుండై జడుని చందంబున నిట్లనియె.(27) "సతి నీ వెవ్వతె వీ ప¯ ర్వతమున కేమైనఁ గోరివచ్చిన వనదే¯ వతవో? శారదవో? రతి¯ పతి పంచిన మాయవో? తపస్సారమవో?(28) అంగజుఁ డెక్కుడించిన శరాసనమున్ ధరియించి యంత నా¯ యంగజు వేఁట మానవమృగావళి సూటిగఁ నేచు దానవో? ¯ రంగగు నీ నిజాకృతి తెఱం గెఱుఁగంగ నిజంబు పల్కుమా¯ యంగన నిన్నుఁ గన్గొనిన యంత ననంగుఁడు సందడించెడున్.(29) పొలుపగుచున్న విలాసం¯ బుల నంగజు బాణములను బోలెడి నీ చం¯ చల సత్కటాక్షవీక్షణ¯ ముల నెవ్వని నింతి చిత్తమునఁ గలఁచెదవే?(30) చెదరఁగ వేదముల్ చదువు శిష్యులపైఁ దగఁ బుష్పవృష్టి స¯ మ్మదమున నంతలోఁ గురియు మాడ్కిని మన్మథసామగానముల్¯ చదివెడు శిష్యులో యనఁగ షట్పదపంక్తులు చేరి మ్రోయఁగాఁ¯ బదపడి మీఁద రాలుఁ గచభారము నందుల జాఱు క్రొవ్విరుల్.(31) అందియలు టిట్టిభంబుల¯ చందమునం బాదపంకజంబుల యందున్¯ యందంద మ్రోయుచును నా¯ డెందంబునఁ దగిలి సందడించెడిఁ దరుణీ!(32) పాయక కదంబ పుష్ప¯ చ్ఛాయం గల వస్త్రకాంతి చల్లెడుఁ గంటే¯ యా యెడ నితంబరోచులు¯ గాయుచు నెడతెగక తఱిమి కప్పెడుఁ దన్వీ!(33) నిరతము నీ తనుమధ్యముఁ¯ గర మరుదుగ నరసి చూడఁ గానంబడ; దీ¯ కరికుంభంబులఁ బోలెడి¯ గురు కుచముల నెట్లు నిలుపు కొంటి లతాంగీ!(34) పొంకములగు కుచములపైఁ¯ గుంకుమ పంకంబుఁ బూసికొని వాసనలం¯ గొంకక వెదచల్లెడు నీ¯ బింకం బగు చన్నుదోయి పెంపో! సొంపో!(35) ఏ లోకంబున నుండి వచ్చితివి? నీ విచ్చోటికిన్ మున్ను నే¯ నే లోకంబునఁ జెప్పఁ జూప నెఱుఁగన్నీ సుందరాకారము¯ న్నీ లాలిత్యము లీ వినోదములు నీ కిట్లొప్పునే? కామినీ! ¯ భూలోకంబున కెట్లు వచ్చితివి నా పుణ్యం బగణ్యంబుగన్?(36) హాసావలోకనంబుల¯ భాసిల్లెడు నీ ముఖంబు పలుమఱు నిపుడే¯ యాసలు పుట్టింపఁగ నే¯ నాసగొనెద నిన్నుఁ జూచి యంబుజనేత్రా!(37) కందులేని యిందుకళ మించి నెమ్మోము¯ కాంతి యుక్త మగుచుఁ గానుపించెఁ¯ గాన విష్ణుకళయుఁ గాఁబోలు నని నా మ¯ నంబునందుఁ దోఁచె నళిననేత్ర!(38) పటుతాటంక రథాంగ యుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్¯ నటనం బందెడు గండుమీనములతో నాసన్న నీలాలకో¯ త్కట భృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా¯ ఱట కాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్.(39) కరువలిఁ బాయు వస్త్రమును గట్ట నెఱుంగవు; చూడ్కి దిక్కులం¯ బఱపుచుఁ జంచరీకముల భాతిఁ జెలంగెడు కంధరంబునం¯ బొరలెడు ముక్తకేశభరముం దుఱుమంగఁ దలంప; విప్పు డి¯ ట్లరుదుగ రత్నకందుక విహారము సల్పెడు సంభ్రమంబునన్."(40) మఱియు నిట్లనుఁ "దపోధనులగు వారల తపంబులను నీ రూపంబున నపహ్నవించిన దాన; వీ చక్కదనం బేమి తపంబున సంపాదించితివి? నా తోడంగూడి తపంబు చేయుము; సంసారంబు వృద్ధిఁ బొందం జేయుము; పద్మాసనుండు నాకుం బ్రత్యక్షంబై నిన్ను నిచ్చినవాఁడుఁ; గావున నిన్ను విడువంజాలను; నీ సఖీజనంబులు నా వాక్యంబులకు ననుకూలింతురుగాక; నీవు చనుచోటికి నన్నుం దోడ్కొని చను"మని స్త్రీలకు ననుకూలంబుగాఁ బలుకనేర్చిన యాగ్నీధ్రుండు పెక్కుభంగులం బలికిన నా పూర్వచిత్తియు నతని యనునయ వాక్యంబులకు సమ్మతించి వీరశ్రేష్ఠుండగు నా రాజవర్యుని బుద్ధి రూప శీలౌదార్య విద్యా వయశ్శ్రీలచేఁ బరాధీనచిత్త యగుచు జంబూద్వీపాధిపతి యగు నా రాజశ్రేష్ఠుని తోడంగూడి శతసహస్ర సంవత్సరంబులు భూస్వర్గ భోగంబు లనుభవించె; నంత నాగ్నీధ్రుం డా పూర్వచిత్తివలన నాభి కింపురుష హరివర్షేలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞలు గల కుమారులఁ బ్రతిసంవత్సరంబు నొక్కొక్కనిఁగఁ దొమ్మండ్రం గాంచె; నంత నా పూర్వచిత్తి యా యర్భకుల గృహంబున విడిచి యాగ్నీధ్రుం బాసి బ్రహ్మలోకంబునకుం జనిన నా యాగ్నీధ్ర పుత్రులు మాతృసామర్థ్యంబునం జేసి స్వభావంబునన శరీరబలయుక్తు లగుచుఁ దండ్రిచేత ననుజ్ఞాతులై తమ నామంబులఁ బ్రసిద్ధంబు లయిన జంబూద్వీపాది వర్షంబులం బాలించుచుండి; రంత నాగ్నీధ్రుండు నా పూర్వచిత్తి వలనం గామోపభోగంబులం దృప్తిం బొందక పూర్వచిత్తిం దలంచుచు వేదోక్తంబులగు కర్మంబులంజేసి తత్సలోకంబగు బ్రహ్మ లోకంబునకుం జనియె; నిట్లు దండ్రి పరలోకంబునకుం జనిన నాభి ప్రముఖులగు నాగ్నీధ్రకుమారులు దొమ్మండ్రును మేరుదేవియుఁ, బ్రతిరూపయు, నుగ్రదంష్ట్రయు, లతయు, రమ్యయు, శ్యామయు, నారియు, భద్రయు, దేవవతియు నను నామంబులు గల మేరు పుత్రికలగు తొమ్మండ్రు కన్యకలను వివాహం బై; రంత.

ఋషభుని జన్మంబు

(41) నరవరేణ్యుఁడైన నాభి సంతానార్థ¯ మంగనయును దాను యజ్ఞపురుషుఁ¯ డయిన వాసుదేవు నతుల భక్తిశ్రద్ధ¯ లను జెలంగి పూజ లొనరఁ జేసి.(42) మఱియుం బ్రవర్గ్య సంజ్ఞికంబు లగు కర్మంబులు శ్రద్ధా విశుద్ధద్రవ్య దేశ కాల మంత్రర్త్విగ్దక్షిణా విధాన యోగంబులం బరమేశ్వరుని మెప్పించిన నెవ్వరికిం బ్రసన్నుండు గాని పుండరీకాక్షుండు భక్తవత్సలుం డై సురుచిరావయవంబులతో యజనశీలం బయిన యాతని హృదయంబు నందుఁ బాయని రూపంబు గలిగి మనోనయనానందకరావయవంబులు గల తన స్వరూపం బాతనికిఁ జూపం దలంచి.(43) అంత నావిష్కృత కాంత చతుర్భుజం¯ బులును బీతాంబరంబును వెలుంగ ¯ శ్రీవత్సకౌస్తుభ శ్రీరమా చిహ్నంబు¯ లురమందురమ్యమై యిరవు పడఁగ¯ శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది ది¯ వ్యాయుధంబులు చేతులందు మెఱయ¯ నతులిత నవరత్నహాట కాంకిత నూత్న¯ ఘనకిరీటద్యుతు ల్గడలుకొనఁగఁ(43.1) గర్ణ కుండల కటిసూత్ర కనకరత్న¯ హార కేయూర వరనూపురాది భూష¯ ణముల భూషితుఁడైన శ్రీనాయకుండు¯ దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె. (44) ఇట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకుఁ¯ బెన్నిధానంబుఁ గనుఁగొన్న పేద మాడ్కి¯ హర్షమున ఋత్విగాదికు లవనతాస్యు¯ లగుచు నభినుతి చేసి రిట్లనుచు నపుడు.(45) "పరిపూర్ణుఁడ వై యుండియ¯ మఱువక మా పూజ లెల్ల మన్నింతువు; నీ¯ చరణార వింద సేవయు¯ ధరఁ బెద్దలు వినిచి నటుల దగఁ జేసెదమౌ.(46) ఏ మిపుడు చేయు సంస్తుతి¯ నీ మహిమ నెఱింగి కాదు; నిరతముఁ బెద్దల్¯ దా మెది యుపదేశించిరొ¯ యా మతమునఁ బ్రస్తుతింతు మయ్య! మహాత్మా!(47) మఱియు నీవు సంసారాసక్తమతి గలిగిన వారికి వశ్యుండవుగావు; యీశ్వరుండవును బ్రకృతి పురుష వ్యతిరిక్తుండవును బరమ పురుషుండవును నయిన నిన్నుఁ బొందని ప్రపంచాంతర్గతంబు లయిన నామరూపంబులు గల యస్మదాదులచేత నిరూపింప నశక్యంబగు; సర్వజీవులం జెందిన దురిత సంఘంబుల నిరసించు స్వభావంబు గల నీ యుత్తమ గుణంబులందు నేకదేశంబ గాని సర్వగుణనిరూపణంబు చేయ శక్యంబుగానేరదు; నీ భక్తులు మిక్కిలి భక్తింజేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను సలిల శుద్ధ పల్లవ తులసీదళ దుర్వాంకురంబులను సంపాదించిన పూజను సంతసిల్లెడి నీకు బహువిధ ద్రవ్య సంపాదనంబు గలిగి విభవ యుక్తంబు లయిన యశ్వమేధాదులును దృప్తికరంబులు గానేరవు స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి యతిశయంబై వర్తించుచు నశేషపురుషార్థ స్వరూపంబుఁ బరమానంద రూపంబు నైనవాఁడ వగుటం జేసి యజ్ఞాదుల యందు నీకుఁ దృప్తి లేక యున్న నస్మదాదుల కోరికల కుపచరించు కతంబున యజ్ఞాదుల నొనరింతు; మని మఱియు నిట్లనిరి.(48) "బాలిశుల మగుచు మిక్కిలి¯ మే లెఱుగని మమ్ము నీదు మించిన దయచేఁ¯ బాలింతు విత్తు వెప్పుడుఁ¯ జాలఁగ నిహపరములందు సకల సుఖములున్.(49) ఇపుడు మేము నీకు నిష్టంబు లగు పూజ¯ లాచరింపకున్న నైన నధిక¯ మయిన నీ కృపాకటాక్ష వీక్షణములఁ¯ జక్కఁ జూచి తగఁ బ్రసన్నుఁ డగుచు.(50) వర మీయఁ దలఁచి మమ్ముం¯ గరుణించితి గాక; నిన్నుఁ గనుగొనుటకునై¯ యరసి నుతింపఁగ మాకుం¯ దర మగునే? వరద! నీరదశ్యామాంగా!(51) మఱియు, నిస్సంగులై నిశితజ్ఞానంబునంజేసి దోషరహితులై భగవత్స్వభావులు నాత్మారాములు నగు మునులకు స్తుతియింపఁ దగిన గుణంబులు గలవాడ వగుచుండియుఁ బ్రసన్నుండవు; స్ఖలన క్షుత పతన జృంభణాది దురవస్థ లందును జరామరణాది దుర్దశలందును వివశుల మగు మాకుఁ గల్మష నాశకరంబులయిన భవద్దివ్యనామంబులు మా వచనగోచరంబులగుం గాక; మఱియు నీ రాజర్షి పుత్రకాముండై నీ తోడ సమానుండయిన కుమారునిం గోరి కామంబుల స్వర్గాపవర్గంబుల నీనోపిన నినుం బూజించి ధనకాముం డైనవాఁడు ధనవంతునిం జేరి తుషమాత్రం బడిగిన చందంబున మోక్షనాథుండ వైన నీవలన సంతానంబు గోరుచున్నవాఁడు; జయింపరాని నీ మాయ చేత నెవ్వండు మోహంబు నొంది విషయాసక్తుండు గాక యుండు? నర్థకాములము మదాంధులము నగు మేము నిన్ను నాహ్వానంబు చేసిన యపరాధంబు సర్వాత్మకుండ వగుటం జేసి సామ్యంబుచే మన్నింప దగుదువు; మమ్ము దయఁ జూడు"మని ప్రణమిల్లిన సర్వేశ్వరుండు వర్షాధిపతి యగు నాభిచేతను, ఋత్విక్కులచేతను, వంద్యమానుండై దయాకలితుం డగుచు యిట్లనియె.(52) "మునులార! వేదవాక్యము¯ లను బ్రస్తుతి చేసి సర్వలక్షణముల నా¯ కెన యగు పుత్రుని నిమ్మని¯ వినఁ బలికితి రిపుడు మిగుల వేడుకతోడన్(53) నాకాది లోకములలో¯ నాకున్ సరివచ్చు నట్టి నందను నెటు నా¯ లోకింప లేరు; గావున¯ నాకున్ సరి నేన కా మనమున నెఱుఁగుఁడీ.(54) అదియునుం గాక భూసురోత్తములు నా ముఖంబగుటం జేసి విప్రవాక్యంబు దప్పింపరాదు; మీరు నా యీడు కుమారు నడిగితిరి గావున నాభిపత్ని యగు మేరుదేవి యందు నేన పుత్రుండనై జనియించెద"నని పలికి పరమేశ్వరుం డాగ్నీధ్రీయపత్ని యగు మేరుదేవి చూచుచుండ నా యజ్ఞంబున నంతర్ధానంబు నొంది యా నాభిమీఁది దయం జేసి దిగంబరులును దపస్వులును జ్ఞానులును నూర్ధ్వరేతస్కులును నగునైష్ఠికులకు యోగధర్మంబుల నెఱింగింపం దలంచి పుండరీకాక్షుండు నాభిపత్నియగు మేరుదేవి గర్భాగారంబునం బ్రవేశించె; నంత.(55) మేరుదేవియందు మేరుధీరుం డగు¯ హరి సమస్త లక్షణాన్వితుండు¯ శమదమాదిగుణ విశారదుం డుదయించె¯ సకలజనుల కపుడు సంతసముగ.(56) ధవళ కాంతియుక్తిఁ దనరు దేహంబును¯ మహిత బలపరాక్రమంబు వీర్య¯ మును దలంచి చూచి జనకుండు పేరిడె¯ సుతుని ఋషభుఁ డనుచు సొంపుతోడ.

ఋషభుని రాజ్యాభిషేకము

(57) ధరణీసురులును మంత్రులుఁ¯ బరివారము హితులుఁ బ్రజలు బాంధవులును సు¯ స్థిరమతి నా బాలకునిం¯ గర మనురాగమున రాజుగాఁ జూచి రిలన్.(58) పురుహూతుఁ డతని మహిమలు¯ సరగున విని చిత్తమునకు సహ్యము గామిం¯ బరికించి ఋషభఁ డేలెడి¯ ధరణి ననావృష్టి మిగుల దట్టము చేసెన్.(59) అది యెఱింగి ఋషభుఁ డంతట యోగ మా¯ యా బలంబు కతన నఖిల రాజ్య¯ మందుఁ గురియఁ జేసె నత్యంత సంపూర్ణ¯ వృష్టి దినదినంబు వృద్ధిఁ బొంద.(60) ఇట్లు ఋషభుండు పురందరుండు చేయు దౌష్ట్యంబునకు నవ్వి యజనాభం బను తన మండలంబు సుభిక్షంబుగాఁ జేసె; నాభియుం దన కోరిన చందంబునం బుత్రుండు జనియించి వర్థిల్లుటకు సంతసిల్లి తనచేత నంగీకరింపంబడు నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుని మాయా విలసితంబునం జేసి "బాలకా! నా తండ్రి!"యని మోహంబున నుపలాలించుచుఁ బ్రజానురాగంబున సర్వసమ్మతుం డయిన పుత్రుని సమయసేతు రక్షణంబునకుఁ బూజ్యంబయిన రాజ్యంబునం దభిషిక్తుం జేసి భూసురులకుఁ బ్రధానవర్గంబునకు నప్పగించి మేరుదేవిం గూడి నరనారాయణ స్థానం బయిన బదరికాశ్రమంబునకుం జని యచ్చట మహాయోగసమాధిచే నరనారాయణాఖ్యుండుఁ బురుషోత్తముండు నగు వాసుదేవు నారాధించి క్షీణదేహుండై యా నాభి హరి తాదాత్మ్యంబు నొందె; నంత.(61) సరసత నే నృపాలకుని జన్మమునందును భూసురోత్తముల్¯ సరసిజనాభునిం దగఁ బ్రసన్నతఁ బెట్టిన నంత మెచ్చి యీ¯ శ్వరుఁడు దనంత గర్భమున వచ్చి తనూభవుఁడై జనించె, నా¯ నరపతి నాభికిన్ సరి యనం దగునే నరనాథ! యన్యులన్.(62) అంత.

భరతుని జన్మంబు

(63) భూవరుఁ డగు ఋషభుఁడు దన రాజ్యంబుఁ¯ గర్మభూమిఁగ నాత్మఁ గాంచి జనుల¯ కందఱకును బ్రియం బగునట్లు కర్మ తం¯ త్రంబెల్లఁ దెలుపంగఁ దలఁచి కర్మ¯ ములు చేయుటకు గురువులయొద్ద వేదంబు¯ చదివి వారల యనుజ్ఞను వహించి¯ శతమన్యుఁ డిచ్చిన సతి జయంతీ కన్యఁ¯ బరిణయంబై యట్టి పడఁతి వలన(63.1) భరతుఁ డాదిగ సుతుల నూర్వురను గాంచె¯ నట్టి భరతుని పేరను నవనితలము¯ పురవరాశ్రమ గిరితరుపూర్ణ మగుచు¯ నమరి భారత వర్ష నామమున మించె.(64) ఆ మహాభారతవర్షంబునందుఁ దమతమ పేరంబరఁగు భూములకుఁ గుశావర్తేలావర్త బ్రహ్మావర్తార్యావర్త మలయకేతు భద్రసేనేంద్రస్పృగ్వి దర్భ కీకటులను తొమ్మండ్రు కుమారులను దక్కుంగల తొమ్మండ్రు పుత్రులకుఁ బ్రధానులం జేసె; నంతం గవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమీఢ చమస కరభాజను లనువారు తొమ్మండ్రును భాగవత ధర్మప్రకాశకు లైరి; భగవన్మహి మోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముంద రెఱింగించెదఁ; దక్కిన యెనుబదియొక్క కుమారులు పిత్రాదేశకరులు నతి వినీతులు మహాశ్రోత్రియులు యజ్ఞశీలురుఁ గర్మనిష్ఠులు నయిన బ్రాహ్మణోత్తము లైరి; ఋషభుండు స్వతంత్రుండై సంసారధర్మంబులం బొరయక కేవలానందానుభవుం డయిన యీశ్వరుండై యుండియు బ్రాకృతుండునుం బోలెఁ గాలానుగతంబు లగు ధర్మంబుల నాచరించుచు ధర్మప్రవర్తకులకు సముండును నుపశాంతుండును మైత్రుండును గారుణికుండును నై ధర్మార్థ యశః ప్రజానందామృతావరోధంబుచే గృహస్థాశ్రమంబులం బ్రజల నియమించుచుఁ గొంత కాలంబు నీతిమార్గంబు దప్పక ప్రజాపాలనంబు చేయుచు వేదరహస్యంబు లగు సకల ధర్మంబులును స్వవిదితంబు లయినను బ్రాహ్మణోపదేశ పూర్వకంబుగా ద్రవ్య దేశ కాల వయశ్శ్రద్ధర్త్విగ్వి ధోద్దేశోపచితంబులుగ నొక్కక్క క్రతువును శతవారంబు యథావిధిగఁ జేసి సుఖం బుండె; నంత.(65) జనవర ఋషభుని రాజ్యం¯ బున నైహిక ఫలముఁ గోరు పురుషుని నొకనిం¯ గనుఁగొన నెఱుంగ మెన్నఁడు¯ నినతేజుం డతనిమహిమ లేమని చెప్పన్.

ఋషభుని తపంబు

(66) ఆ ఋషభుండు రాజ్యంబు చేయుచు నుండి¯ యంతట నొక్కనాఁ డాత్మయందుఁ¯ దలపోసి భూలోక ఫల మపేక్షింపక¯ మోహంబు దిగనాడి పుత్రులకును¯ దనరాజ్య మెల్ల నప్పన చేసి వెనువెంటఁ¯ గొడుకులు మంత్రులుఁ గొలిచిరాఁగ¯ నల్లన యరిగి బ్రహ్మావర్త దేశంబు¯ నందుల నపుడు మహాత్ములయిన(66.1) యట్టి మునిజన సమ్ముఖంబందుఁ జేరి¯ తనదు పుత్రుల నందఱ డాయఁ బిలిచి¯ పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయ మొప్ప¯ హర్ష మందుచు నప్పు డిట్లనుచుఁ బలికె.(67) "తనయులార! వినుఁడు ధరలోనఁ బుట్టిన¯ పురుషులకును శునకములకు లేని¯ కష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల¯ వలన బుద్ధి చేయవలదు మీరు(68) నరులకు నే తపంబు నననంత సుఖంబులు గల్గుచుండు, శ్రీ¯ కరమతి నా తపంబుఁ దగఁ గైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం¯ దిరముగఁ గల్గు; వృద్ధులను దీనులఁ బ్రోవుఁడు; దుష్ట వర్తనన్¯ జరుగుచునుండు కాముకుల సంగతిఁ బోకుఁడు; మీఁద మేలగున్.(69) మఱియు నంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపం బయిన సంసారంబగు; మహత్సంగంబు మోక్షద్వారం బగు; నట్టి మహాత్ము లెవ్వ రనిన శత్రు మిత్ర వివేకంబు లేక సమచిత్తులును శాంతులును గ్రోధరహితులును సకలభూత దయాపరులును సాధువులును నగువారలు మహాత్ము లనందగుదు; రట్టి మహాత్ములు నా యందలి స్నేహంబె ప్రయోజనంబుగాఁ గలిగి యుండుటం జేసి విషయ వార్తాప్రవృత్తు లగు కుజనులందుఁ దమ దేహ గృహ మిత్ర దారాత్మజాదులందుఁ బ్రీతిలేక యుండుదురు; విషయాసక్తుఁ డయినవాఁడు వ్యర్థకర్మంబులం జేయు నట్టి దుష్కృత కర్మంబులం జేయువాఁ డెప్పుడును బాపకర్ముం డగుచుం గ్లేశదంబగు దేహంబు నొందుచుండుఁ; గావునఁ బాపమూలంబు లయిన కామంబులు గోరకుఁ; డీ జ్ఞానం బెంత కాలంబుఁ లేకయుండు నంతకాలంబు నాత్మతత్త్వం బెఱుంగంబడ; దా తత్త్వం బెఱుంగకుండుటజేసి దేహికి దుఃఖం బధికంబై యుండు; లింగదేహం బెంత దడ వుండు నంత దడవును మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబుగాక యవిద్యం బాయకుండు; శరీరంబు గర్మమూలం బగుట వలనఁ గర్మంబులు చేయఁజనదు; వాసుదేవుం డగు నా యందుఁ బ్రీతి యెంత తడవు లేక యుండు నంతదడవును దేహధర్మంబులు బాధించు; విద్వాంసు డైనను దేహేంద్రియాదుల యందుఁ బ్రీతిచేసిన మిథునీభావ సుఖప్రధానం బగు గృహస్థాశ్రమంబు నంగీకరించి స్వరూప స్మృతి శూన్యుండై మూఢుం డగుచు, నందు సంసారతాపంబులఁ బొందుఁ; బురుషుండు స్త్రీతోడం గూడి యేకీభావంబు నొందుట దనకు హృదయ గ్రంథియై యుండు; నందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు "నేను నాయది"యనియెడి మోహంబు గలుగు; నట్టి స్త్రీపురుష మిథునీ భావంబుచే సంతానంబు గలుగు; నా సంతాన కారణంబున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపంబడు; నందు మోహం బధికం బగుటంజేసి మోక్షమార్గంబు దవ్వగు; నిట్లు సంసారంబునం దుండియు మనంబున నెపుడు ముక్తిచింతం జేయు నప్పుడు సంసారంబును బాయు; మోక్షోపాయంబులు పరమగురుండనైన నా యందుల భక్తి చేయుటయు, విగతతృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబు లందుల జంతు వ్యసనావగతియు, నీశ్వరవిషయక జ్ఞానాపేక్షయుఁ, దపంబును, విగతేచ్ఛయు, మత్కృతకర్మంబులు మత్కథలు వినుటయు, నన్నె దైవంబు గా నెఱుంగుటయు, నస్మద్గుణ కీర్తనంబులును, నిర్వైరత్వసామ్యోపశ మంబులును, దేహగేహంబులందు నాత్మబుద్ధి జిహాసయు, నధ్యాత్మ యోగంబును, నేకాంతసేవయుఁ, బ్రాణేంద్రియాత్మలఁ గెలుచుటయుఁ, గర్తవ్యాపరిత్యాగంబును, సచ్ఛ్రద్ధయు, బ్రహ్మచర్యంబును, గర్తవ్యకృత్యంబు లందుల నప్రమత్తుండగుటయు, వాజ్ఞియమనంబును, సర్వంబు నన్నకా దలంచుటయు, జ్ఞానంబును, విజ్ఞాన విజృంభితంబైన యోగంబును, ధృత్యుద్యమంబును, సాత్త్వికంబును నాదిగాఁ గల తెఱంగుల చేత లింగదేహంబు జయించి దేహి కుశలుం డగుచు నుండవలయు.(70) అరయఁ గర్మరూప మగు నవిద్యాజన్మ¯ మైన హృదయబంధనాది లతల¯ నప్రమత్తయోగ మను మహాఛురికచేఁ¯ ద్రెంపవలయు నంతఁ దెంపుతోడ.(71) ఒనర నిట్లు యోగయుక్తుండు గురుఁ డైన¯ భూపుఁ డైన శిష్యపుత్ర వరుల¯ యోగయుతులఁ జేయ నొప్పు గావలయును¯ గర్మపరులఁ జేయఁ గాదుకాదు.(72) జనులెల్ల నర్థ వాంఛలఁ జేసి యత్యంత; ¯ మూఢులై యైహికంబులు మనంబు¯ లందును గోరుదు; రల్ప సౌఖ్యములకు¯ నన్యోన్యవైరంబు లంది దుఃఖ¯ ములఁ బొందుదురు; గాన మునుకొని గురుఁ డైన¯ వాఁడు మాయామోహవశుఁడు నెంత¯ జడుఁడు నైనట్టి యా జంతువునందును¯ దయ గల్గి మిక్కిలి ధర్మబుద్ధిఁ(72.1) గన్ను లున్నవాఁడు గానని వానికి¯ దెరువుఁ జూపి నట్లు దెలియఁ బలికి¯ యతుల మగుచు దివ్యమైన యా మోక్ష మా¯ ర్గంబుఁ జూప వలయు రమణతోడ.(73) మఱియుఁ బితృ గురు జననీ బంధు పతి దైవతంబులలో నెవ్వరైనను సంసార రూప మృత్యు రహితం బైన మోక్షమార్గంబుం జూపకుండిరేని వారెవ్వరును హితులు గా నేరరు; నాదు శరీరంబు దుర్విభావ్యంబు; నాదు మనంబు సత్త్వయుక్తంబును, ధర్మసమేతంబును, బాపరహితంబు నగుటంజేసి పెద్దలు నన్ను ఋషభు డండ్రు; గావున శుద్ధ సత్త్వమయం బైన శరీరంబునం బుట్టిన కుమారులైన మీర లందఱును సోదరుండును మహాత్ముండును నగ్రజుండును నైన భరతు నన్నెకాఁ జూచి యక్లిష్టబుద్ధిచే భజింపుం; డదియ నాకు శుశ్రూషణంబు; ప్రజాపాలనంబు చేయుట మీకును బరమధర్మం"బని మఱియు నిట్లనియె.(74) భూతజాలములందు భూజముల్ వర్యముల్¯ భూరుహముల కంటె భోగి కులము¯ భోగి సంతతి కన్న బోధనిష్ఠులు బోధ¯ మాన్యుల కన్నను మనుజవరులు¯ వీరికన్నను సిద్ధ విబుధ గంధర్వులు¯ వారి కన్న నసురుల్ వారి కన్న¯ నింద్రాది దేవత లిందఱి కన్నను¯ దక్షాది సన్మును ల్దలఁప నెక్కు(74.1) డంతకన్నను భర్గుఁ డా యభవు కన్నఁ¯ గమలభఁవుఁ డెక్కుఁ; డాతని కంటె విష్ణుఁ¯ డధికుఁ; డాతఁడు విప్రుల నాదరించుఁ¯ గాన విప్రుండు దైవంబు మానవులకు.(75) భూసురులకు సరి దైవం¯ బీ సచరాచరమునందు నెఱుఁగను; నాకున్¯ భూసురులు గుడుచు నప్పటి¯ యా సంతోషంబు దోఁప దగ్నులయందున్.(76) మంగళం బైన బ్రహ్మస్వరూపంబును¯ వేదరూపంబు ననాది రూప¯ మగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్¯ ధరియింతు రెప్పుడుఁ దత్త్వబుద్ధి¯ శమదమానుగ్రహ సత్యతపస్తితి¯ క్షలు గల్గు విప్రుండు సద్గురుండు; ¯ గాన మిక్కిలి భక్తిగల్గి యకించను¯ లైన భూసురుల దేహముల వలన(76.1) నందుచుండును నాదు దేహంబు గాఁగ¯ నెఱిఁగి వరులగు విప్రుల నెల్ల భక్తిఁ¯ బూజ చేయుటయే నన్నుఁ బూజ చేయు¯ టనుచు వినిపించి మఱియు నిట్లనుచుఁ బలికె.(77) ఈ తెఱఁగుఁ దెలిసి భూసుర¯ జాతిం బూజించునట్టి జనుఁడును మాయా¯ తీతుండై నిక్కంబుగ¯ భూతలమున మోక్షమార్గమును బొడగాంచున్.