పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 56-125

సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

(56) దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ¯ సదనమున నుండి జనకుని సవనమహిమ¯ గగన చరులు నుతింప నా కలకలంబు¯ విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ. (57) అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున. (58) తనరారు నవరత్న తాటంక రోచులు¯ చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ; ¯ మహనీయ తపనీయమయ పదకద్యుతు¯ లంసభాగంబుల నావరింప; ¯ నంచిత చీనిచీనాంబర ప్రభలతో¯ మేఖలాకాంతులు మేలమాడఁ; ¯ జంచల సారంగ చారు విలోచన¯ ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ; (58.1) మించు వేడుక భర్తృసమేత లగుచు¯ మానితంబుగ దివ్య విమానయాన¯ లగుచు నాకాశపథమున నరుగుచున్న¯ ఖచర గంధర్వ కిన్నరాంగనలఁ జూచి. (59) సతి దన పతి యగు నా పశు¯ పతిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా¯ పతి మీ మామ మఖము సు¯ వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే; (60) కావున నయ్యజ్ఞమునకు¯ నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో! ¯ దేవ! మన మిప్పు డచటికిఁ¯ బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా! (61) ఆ యజ్ఞముఁ గనుగొనఁగా¯ నా యనుజలు భక్తిఁ బ్రాణనాథుల తోడం¯ బాయక వత్తురు; మనముం¯ బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్. (62) జనకుని మఖమున కర్థిం¯ జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం¯ దనరిన భూషణములఁ గై¯ కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా! (63) నాతోడను స్నేహము గల¯ మాతను దత్సోదరీ సమాజము ఋషి సం¯ ఘాతకృత మఖసమంచిత¯ కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్. (64) అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి"నని వెండియు నిట్లనియె. (65) "ముదమునఁ దన్మఖోద్భవ విభూతిఁ గనుంగొన నన్యకామినుల్¯ పదువులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై¯ మదకలహంస పాండురసమంచిత దివ్య విమానయానలై¯ యదె చనుచున్నవారు గను మభ్రపథంబున నీలకంధరా! (66) అనఘా! విను లోకంబుల ¯ జనకుని గేహమునఁ గలుగు సకల సుఖంబుల్¯ తనయలు చని సంప్రీతిం¯ గనుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా! (67) అనయముఁ బిలువక యుండం¯ జన ననుచిత మంటివేని జనక గురు సుహృ¯ జ్జననాయక గేహములకుఁ¯ జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!" (68) అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్ధంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె. (69) "కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్¯ పిలువకుండినను సంప్రీతిఁ జనుదు¯ రంటి; విదియు లెస్స యైనను దేహాభి¯ మాన మదము ననమర్షమునను¯ గడఁగి యారోపిత ఘన కోపదృష్టులు¯ గారేనిఁ బోఁదగుఁ గాని వినుము¯ వినుత విద్యా తపోవిత్త వయో రూప¯ కులములు సుజనులకును గుణంబు; (69.1) లివియ కుజనులయెడ దోషహేతుకంబు¯ లై వివేకంబు సెఱుచు; మహాత్ములైన¯ వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి¯ జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర! (70) విను; మట్టి కుటిలు లగు దు¯ ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం¯ జనదు; వినీతుల కది గడు¯ ననుచిత మైనట్ల యుండు; నది యెట్లనినన్. (71) కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు¯ నార్యు లేగ, వా రనాదరమున¯ బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై¯ చూతు; రదియుఁ గాక సుదతి! వినుము. (72) సమద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః¯ ఖమును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో! ¯ యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి¯ త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్. (73) విను లోకోత్కృష్టుఁడు ద¯ క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై¯ నను నా సంబంధంబున¯ జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ! (74) అది యెట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁబడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టి దని యంటివేని. (75) నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం¯ దఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా¯ తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా¯ హరితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్. (76) అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత. (77) సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః¯ ఖస్వాంత యగుచు నంగములు వడఁక¯ నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు¯ గండభాగంబులఁ గడలుకొనఁగ¯ నున్నత స్తనమండలోపరిహారముల్¯ వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద¯ నతిశోకరో షాకులాత్యంత దోదూయ¯ మానమై హృదయంబు మలఁగుచుండ (77.1) మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు¯ నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని¯ విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె¯ జనకుఁ జూచెడు వేడుక సందడింప. (78) ఇ ట్లతి శీఘ్రగమనంబున. (79) మానిని చనుచుండ మణిమన్మదాది స¯ హస్ర సంఖ్యాత రుద్రానుచరులు¯ యక్షులు నిర్భయులై వృషభేంద్రుని¯ మున్నిడు కొనుచు నమ్ముదిత దాల్చు¯ కందుకాంబుజ శారికా తాళవృంత ద¯ ర్పణ ధవళాతపత్రప్రసూన¯ మాలికా సౌవర్ణమణివిభూషణ ఘన¯ సార కస్తూరికా చందనాది (79.1) వస్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి¯ శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప¯ మానితంబైన వృషభేంద్రయానఁ జేసి¯ యజ్ఞభూమార్గులై యర్థి నరిగియరిగి. (80) ముందట. (81) మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ¯ త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము¯ న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్¯ మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్. (82) ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన. (83) చనుదెంచిన యమ్మగువను¯ జననియు సోదరులుఁ దక్క సభఁ గల జను లె¯ ల్లను దక్షువలని భయమున¯ ననయము నపు డాదరింపరైరి మహాత్మా! (84) నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ¯ బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్¯ దొరఁగఁగ డగ్గుత్తికతో¯ సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్. (85) జనకుం డవమానించుట¯ యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే¯ సిన పూజల నందక శో¯ భన మరసిన మాఱుమాట పలుకక యుండెన్. (86) ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరు నందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపంబైన తిరస్కారంబును, నరుద్ర భాగంబైన యజ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు చేయంబూనిన తెఱంగున నుద్రేకించి 'రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగు దక్షుని వధియింతు' మనుచు లేచిన భూతగణంబుల నివారించి రోషవ్యక్తభాషణంబుల నిట్లనియె; "లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియులును నధికులును లే; రట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రు నందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు? నదియునుం గాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబు లందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబుల నాపాదింపరు; కొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబుల నైన గుణంబులుగా ననుగ్రహింతురు; మఱియుం గొందఱుత్తమోత్తములు పరుల యందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గైకొందు; రట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి గల్పించితి” వని; వెండియు నిట్లను “మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడ స్వభావంబుగల దేహంబునాత్మ యని పల్కు కుజను లగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గా: దదియు వారి కనుచితం బగు” నని వెండియు నిట్లనియె. (87) "అనయంబు శివ యను నక్షరద్వయ మర్థి¯ వాక్కునఁ బలుక భావమునఁ దలఁప¯ సర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి¯ మహితాత్మునందు నమంగళుండ¯ వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు¯ నందెద; వినుము; నీ వదియుఁ గాక¯ చర్చింప నెవ్వని చరణపద్మంబుల¯ నరసి బ్రహ్మానంద మను మరంద (87.1) మతుల భక్తిని దమ హృదయంబు లనెడి¯ తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు¯ లగుదు రత్యంత విజ్ఞాను; లట్టి దేవు¯ నందు ద్రోహంబు సేసి; తే మందు నిన్ను? (88) మఱియును నమ్మహితాత్ముని¯ చరణ సరోజాత యుగము సకలజగంబుల్¯ నెఱిఁ గొలువఁ గోరు కోర్కులు¯ దరమిడి వర్షించు నతనిఁ దగునే తెగడన్? (89) పరగఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ¯ చరుఁడు పిశాచయుక్తుఁ డని శర్వు నమంగళుగాఁ దలంప రె¯ వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స¯ చ్చరణ సరోజ రేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్. (90) నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న¯ క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁడేని దాఁ¯ బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్¯ బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్. (91) అది గావున. (92) జనుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైన యన్నంబు స¯ య్యన వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్¯ ఘను నిందించిన నీ తనూభవ యనం గా నోర్వ, నీ హేయ భా¯ జన మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్. (93) అదియునుం గాక, దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతల గమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తి లక్షణ కర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రు లయిన సంసారులకు వైరాగ్యయుక్తు లయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదిక కర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటం జేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపం జన; దా యుభయకర్మ శూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రిఁయా శూన్యుం డని నిందించుట పాపం బగు; దండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగిజన సేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబు లగు నైశ్వర్యంబులు ధూమమార్గ ప్రవృత్తులై యాగాన్నభోక్తలైన వారి చేత యజ్ఞశాలయందె చాల నుతింపంబడి యుండుఁ గాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థి ధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జన” దని; వెండియు నిట్లనియె. (94) "నీలగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా? ¯ చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి¯ న్నేల ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్¯ గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్. (95) వర వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా¯ దరపరిహాస వాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ¯ బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం¯ దొఱఁగుదు; నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్." (96) అని యిట్లు యజ్ఞసభా మధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖి యయి జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు చేయం దలంచి. (97) వరుసఁ బ్రాణాపాన వాయునిరోధంబు¯ గావించి వాని నేకముగ నాభి¯ తలమునఁ గూర్చి యంతట నుదానము దాఁక¯ నెగయించి బుద్ధితో హృదయపద్మ¯ మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము¯ నను మఱి భ్రూమధ్యమున వసింపఁ¯ జేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే¯ నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ (97.1) కమ్మహాత్ముని యంక పీఠమ్మునందు¯ నాదరంబున నుండు దేహంబు దక్షు¯ వలని దోషంబునను విడువంగఁ దలఁచి¯ తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు. (98) ఇట్లు ధరియించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితం బయిన వహ్నిచేఁ దత్క్షణంబ దగ్ధ యయ్యె; అంత. (99) అది గనుఁగొని "హాహా"ధ్వని¯ వొదలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు "నీ¯ మదిరాక్షి యకట దేహము¯ వదలెఁ గదా! దక్షుతోడి వైరము కతనన్." (100) మఱియు నిట్లనిరి. (101) "సకల చరాచర జనకుఁ డై నట్టి యీ¯ దక్షుండు దన కూర్మి తనయ మాన¯ వతి పూజనీయ యీ సతి దనచే నవ¯ మానంబు నొంది సమక్ష మందుఁ¯ గాయంబు దొఱఁగంగఁ గనుఁగొను చున్నవాఁ¯ డిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?" ¯ యనుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, ¯ రదియునుఁ గాక యి ట్లనిరి "యిట్టి (101.1) దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన¯ యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు¯ నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక!"¯ యనుచు జనములు పలుకు నయ్యవసరమున. (102) దేహము విడిచిన సతిఁ గని¯ బాహాబల మొప్ప రుద్రపార్షదులును ద¯ ద్ద్రోహిం ద్రుంచుటకై యు¯ త్సాహంబున లేచి రసిగదాపాణులునై. (103) ఆ రవ మపు డీక్షించి మ¯ హారోషముతోడ భృగుమహాముని క్రతు సం¯ హారక మారక మగు ' నభి¯ చారకహోమం ' బొనర్చె సరభసవృత్తిన్. (104) ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల 'ఋభు' నామధేయు లైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్య విమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన 'ప్రమథ' 'గుహ్యక' గణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి; తదనంతరంబ నారదు వలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబునొందుటయుం 'బ్రమథగణంబులు' 'ఋభునామక దేవతల'చేఁ బరాజితు లగుటయు విని.

దక్షాధ్వర ధ్వంసంబు

(105) ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై¯ మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్¯ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చంచజ్జటన్¯ సద్యః క్రోధముతోడఁ బుచ్చివయిచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. (106) ఇట్లు పెఱికి వైచిన రుద్రుని జట యందు. (107) అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ¯ కృన్నీలదీర్ఘ శరీర మమరఁ ¯ బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల¯ జాజ్వల్యమాన కేశములు మెఱయఁ ¯ జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ¯ సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప¯ వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక¯ వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను (107.1) గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ¯ ఘన కపాలాస్థి వనమాలికలును దనర¯ నఖిలలోక భయంకరుఁ డగుచు వీర¯ భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు. (108) వీరభద్రుండు విహత విద్వేషి భద్రుఁ¯ డగుచుఁ దన వేయి చేతులు మొగిచి వినయ¯ మెసఁగ "నే నేమి సేయుదు? నెఱుఁగ నాకు¯ నానతి"మ్మన్న నతని కయ్యభవుఁ డనియె. (109) "గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ¯ వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్¯ బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే¯ నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?" (110) అని కుపిత చిత్తుండై యాజ్ఞాపించిన "నట్లకాక"యని. (111) అనఘుఁడు రుద్రుఁ జేరి ముదమారఁ బ్రదక్షిణ మాచరించి వీ¯ డ్కొని యనివార్య వేగమునఁ గుంభిని గ్రక్కదలన్ ఝళంఝళ¯ ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్¯ దనరఁ గృతాంత కాంతకశితస్ఫుట శూలముఁ బూని చెచ్చెరన్. (112) సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత ధూత ధూళి ధూ¯ సరిత కుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి "యెట్టి భీ¯ కర తమ"మం చనం "దమముగాదు, రజఃపటలం"బటంచు ని¯ వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁ బొంది వెండియున్. (113) ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? ¯ విలయ సమీరమా? పొలయ దిపుడు; ¯ ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్ర¯ శాసనుఁ డిపుడు రాజ్యంబు సేయఁ¯ జోర సంఘములకో రారాదు; మఱి గోగ¯ ణాళి రాకకు సమయంబు గాదు; ¯ కావున నిప్పుడు కల్పావసానంబు¯ గాఁబోలుఁ; గా దటు గాక యున్న (113.1) నిట్టి యౌత్పాతిక రజ మెందేనిఁ గలదె?' ¯ యనుచు మనముల భయమంది రచటి జనులు¯ సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్యు¯ లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు. (114) "తన కూఁతులు సూడఁగ నిజ¯ తనయను సతి ననపరాధఁ దగవఱి యిట్లె¯ గ్గొనరించిన యీ దక్షుని¯ ఘనపాప విపాక మిదియుఁ గాఁదగు ననుచున్." (115) వెండియు నిట్లనిరి "కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు చాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింప జేసె; నమ్మహాత్ముం డెంతటివాఁ డన్నం బ్రళయకాలంబున (116) సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత¯ నిఖిల దిక్కరి రాజనివహుఁ డగుచుఁ¯ జటులోగ్రనిష్ఠుర స్తనిత గంభీరాట్ట¯ హాస నిర్భిన్నాఖిలాశుఁ డగుచు¯ భూరి కరాళవిస్ఫార దంష్ట్రా హతి¯ పతిత తారాగణ ప్రచయుఁ డగుచు¯ వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ¯ మండిత చండ దోర్దండుఁ డగుచు (116.1) వికట రోష భయంకర భ్రుకుటి దుర్ని¯ రీక్ష్య దుస్సహ తేజోమహిమఁ దనర్చి¯ ఘన వికీర్ణ జటాబంధ కలితుఁ డగుచు¯ నఖిల సంహార కారణుఁ డయి నటించు. (117) అట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ¯ జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు¯ మనము రోషింపఁ జేసిన మంగళములఁ¯ బొంద వచ్చునె పద్మగర్భునకునైన?" (118) అని యి వ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్ర సంఖ్యాతంబు లైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడుచుండె; నా సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిల పీత వర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులు నై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులుపెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు చేయుచుం, గొందఱు ప్రాగ్వంశంబును, గొందఱు పత్నీశాలయు, కొందఱు సదస్య శాలయుఁ, గొంద ఱాగ్నీధ్ర శాలయు, కొందఱు యజమాన శాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబుల యందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదికా మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మఱికొందఱు దేవతా నిరోధంబుఁ గావించి; రంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టి; రివ్విధంబున సదస్య దేవ ఋత్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడచియు, గుల్ఫంబులఁ బొడిచియు వివిధ బాధలు పఱచిన వారు కాందిశీకు లై యెక్కడెక్క డేనిం జనిరి; మఱియును. (119) మును దక్షుఁ డభవుఁ బలుకఁ 'గఁ¯ గను గీఁటిన' భగునిఁ బట్టి కన్నులు పెకలిం¯ చెను నందీశ్వరుఁ; డచ్చటి¯ జనములు హాహారవముల సందడి గొలుపన్. (120) కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ¯ 'బరిహసించిన' పూషుని పండ్లు డుల్లఁ¯ గొట్టె బలభద్రుఁ డా కళింగుని రదంబు¯ లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు. (121) తగవేది దక్షుఁ డా సభ¯ నగచాపుఁ దిరస్కరించునాఁ డట 'శ్మశ్రుల్¯ నగుచుం జూపుట' నా భృగు¯ పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు వెఱికెన్. (122) అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు¯ గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి¯ ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు¯ మంత్రసమన్విత మహిత శస్త్ర¯ జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ¯ జంపఁగా లేక విస్మయము నొంది¯ తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి¯ కంఠనిష్పీడనగతిఁ దలంచి (122.1) మస్తకముఁ ద్రుంచి యంచితామర్షణమున¯ దక్షిణానలమున వేల్చెఁ దదనుచరులు¯ హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు¯ లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ. (123) ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున. (124) హరభటకోటిచేత నిశి తాసి గదా కరవాల శూల ము¯ ద్గర ముసలాది సాధనవిదారిత జర్జరితాఖిలాంగులై¯ సురలు భయాకులాత్ము లగుచున్ సరసీరుహజాతుఁ జేరి త¯ చ్చరణ సరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై. (125) తము ధూర్జటి సైనికు లగు ¯ ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స¯ ర్వముఁ జెప్పి"రనుచు మైత్రే¯ య మునీంద్రుఁడు విదురుతోడ ననియెన్; మఱియున్.