పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 126 - 235

శివుం డనుగ్రహించుట

(126) ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న¯ కతన విశ్వాత్మకుండును గమలలోచ¯ నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ¯ జూడ రారైరి మున్ను దక్షుని మఖంబు. (127) అని చెప్పి “సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె. (128) "ఘన తేజోనిధి పురుషుం¯ డనయంబుఁ గృతాపరాధుఁ డయినను దా మ¯ ల్లన ప్రతికారముఁ గావిం¯ చిన జనులకు లోకమందు సేమము గలదే?" (129) అని మఱియు నిట్లనియె. (130) "క్రతుభాగార్హుం డగు పశు¯ పతి నీశ్వరు నభవు శర్వు భర్గుని దూరీ¯ కృత యజ్ఞభాగుఁ జేసిన¯ యతి దోషులు దుష్టమతులు నగు మీ రింకన్. (131) పూని యే దేవుని బొమముడి మాత్రన¯ లోకపాలకులును లోకములును¯ నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురు¯ క్త్యస్త్ర నికాయ విద్ధాంతరంగుఁ¯ డును బ్రియా విరహితుండును నైనవాఁ డమ్మ¯ హాత్మునిఁ ద్రిపుర సంహారకరుని¯ మఖపునస్సంధానమతి నపేక్షించు మీ¯ రలు చేరి శుద్ధాంతరంగు లగుచు (131.1) భక్తినిష్ఠలఁ దత్పాద పద్మ యుగళ¯ ఘన పరిగ్రహ పూర్వంబుగాఁగ నతని¯ శరణ మొందుఁ డతండు ప్రసన్నుఁ డయినఁ¯ దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!" (132) అని మఱియు నిట్లనియె;నద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుండు; యతనిఁ జేరు నుపాయం బెఱింగిపుమంటి రేని, నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వ రేని నమ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగజాల; మతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుం డగు; నయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండు నగు నీశునిఁ జేరం బోవుద;"మని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుఁ డై చనిచని. (133) భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో¯ ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా¯ వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై¯ లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్. (134) ధాతు విచిత్రితోదాత్త రత్నప్రభా¯ సంగ తోజ్జ్వల తుంగ శృంగములును; ¯ గిన్నర గంధర్వ కింపురుషాప్సరో¯ జన నికరాకీర్ణ సానువులును; ¯ మానిత నిఖిల వైమానిక మిథున స¯ ద్విహరణైక శుభ ప్రదేశములును; ¯ గమనీయ నవమల్లికా సుమనోవల్లి¯ కా మతల్లీ లసత్కందరములు; (134.1) నమర సిద్ధాంగనా శోభితాశ్రమములు; ¯ విబుధజన యోగ్య సంపన్నివేశములును¯ గలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు¯ వినుత సుకృతములకు దండ వెండికొండ. (135) అది మఱియును, మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీ షార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాట లాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుట జోదుంబు రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ జంబూ ఖర్జూ రామ్రాతక ప్రియాళు నారికే ళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును, కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, కదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిలకేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగాతరంగణీ సమావృతంబును నైన కైలాసపర్వతంబు వొడగని, యరవిందసంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దార హీర హేమమయ విమాన సంకులంబును, పుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబు గడచి; తత్పుర బాహ్యప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవకామినీ పీనవక్షోజ విలిప్త కుంకుమపంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబు నునై; నందాలకనందాభిధానంబులు గల నదీ ద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజ సంఘృష్ట మలయజ పరిమిళిత మలయపవ నాస్వాదన ముహుర్ముహురు న్ముదిత మానస పుణ్యజనకామినీ కదంబంబును, వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు. (136) ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ¯ వునుఁ బంచసప్తతి యోజనముల¯ పఱపును గల్గి యే పట్టునఁ దఱుగని¯ నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ¯ బర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య¯ ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి¯ కమనీయ సిద్ధయోగక్రియామయ మయి¯ యనఘ ముముక్షు జనాశ్రయంబు (136.1) భూరిసంసార తాప నివారకంబు¯ నగుచుఁ దరురాజ మనఁగఁ బెంపగ్గలించి¯ భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ¯ వలయు సంపద లందు నావటము వటము. (137) ఆ వృక్షమూలతలంబున. (138) ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు¯ శాంతవిగ్రహుని వాత్సల్యగుణునిఁ¯ గమనీయ లోకమంగళదాయకుని శివు¯ విశ్వబంధుని జగద్వినుత యశుని¯ గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కు¯ బేర సేవితుని దుర్వారబలుని¯ నుదిత విద్యాతపోయోగ యుక్తుని బాల¯ చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ (138.1) దాపసాభీష్టకరు భస్మదండలింగ¯ ఘనజటాజిన ధరుని భక్తప్రసన్ను¯ వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న¯ రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని. (139) మఱియును. (140) అంచిత వామపాదాంభోరుహము దక్షి¯ ణోరుతలంబున నొయ్య నునిచి¯ సవ్యజానువుమీఁద భవ్యబాహువు సాఁచి¯ వలపలి ముంజేత సలలితాక్ష¯ మాలిక ధరియించి మహనీయ తర్కము¯ ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన¯ నవ్యయం బయిన బ్రహ్మానందకలిత స¯ మాధి నిష్ఠుఁడు వీతమత్సరుండు (140.1) యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి¯ రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని¯ యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున¯ నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు. (141) అలఘుని నభవుని యోగీం¯ ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియ భా¯ షలు జరుపుచున్న రుద్రుని¯ సలలిత పన్నగ విభూషు సజ్జనపోషున్. (142) కని లోకపాలురును ముని¯ జనులును సద్భక్తి నతని చరణంబులకున్¯ వినతు లయి, రప్పు డబ్జా¯ సనుఁ గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్. (143) "అనఘ! మహాత్ముం డగు వా¯ మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే¯ సినగతి నజునకు నభివం¯ దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్. (144) అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ¯ గణ మహర్షి జనంబులు గని పయోజ¯ గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు¯ శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ. (145) జగములకు నెల్ల యోనిబీజంబు లైన¯ శక్తి శివకారణుండవై జగతి నిర్వి¯ కార బ్రహ్మంబ వగు నిన్నుఁ గడఁగి విశ్వ¯ నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ! (146) సమత నది గాక తావకాంశంబు లైన¯ శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ¯ నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి¯ హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర! (147) అనఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ¯ సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది¯ బలసి మహాజన పరిగృహీతంబులై¯ యఖిల ధర్మార్థదాయకము లైన¯ వేదంబులను మఱి వృద్ధి నొందించుట¯ కొఱకునై నీవ దక్షుని నిమిత్త¯ మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి¯ వటుగాన శుభమూర్తివైన నీవు (147.1) గడఁగి జనముల మంగళకర్ము లయిన¯ వారి ముక్తి, నమంగళాచారు లయిన¯ వారి నరకంబు, నొందింతు భూరిమహిమ¯ భక్తజనపోష! రాజితఫణివిభూష! (148) అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?"యని. (149) "మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల¯ మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ¯ బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ¯ దగిలి మర్మాత్మ భేదకము లయిన¯ బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు¯ నుండు మూఢులను దైవోపహతులఁ¯ గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ¯ వంటి సత్పురుషుఁ డేవలన నైన (149.1) హింసఁ గావింపకుండు సమిద్ధచరిత! ¯ నీలలోహిత! మహితగుణాలవాల! ¯ లోకపాలనకలిత! గంగాకలాప! ¯ హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక. (150) అమర సమస్త దేశము లందు నఖిల కా¯ లములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ¯ డగు పద్మనాభు మాయా మోహితాత్మకు¯ లై భేదదర్శను లైనవారి¯ వలనను ద్రోహంబు గలిగిన నైనను¯ నది దైవకృత మని యన్యదుఃఖ¯ ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు¯ గాని హింసింపఁడు గాన నీవు (150.1) నచ్యుతుని మాయమోహము నందకుంటఁ¯ జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి¯ తాత్ములై కర్మవర్తను లయినవారి¯ వలన ద్రోహంబుగలిగిన వలయుఁ బ్రోవ. (151) అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపు; మీ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక." (152) అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స¯ య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని¯ ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే¯ సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్. (153) అట్లయ్యును. (154) బలియుర దండించుట దు¯ ర్భలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం¯ గలుషాత్ముల నపరాధము¯ కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్." (155) అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;"నని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి. నంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; నంత. (156) శర్వుని యోగక్రమమున¯ సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి¯ గ్గీర్వాణముఖ్య లొప్పిరి¯ పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్. (157) విను దక్షు నంత మేషము¯ ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో¯ ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు¯ కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్. (158) ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వ రుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె. (159) "విను; నీ కపరాధుఁడ నగు¯ నను దండించు టది దండనము గాదు మది¯ న్నను రక్షించుటగా మన¯ మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా! (160) అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును¯ బరికింపఁ బ్రాహ్మణాభాసు లయిన¯ వారల యెడల నెవ్వలన నుపేక్షింప¯ రఁట! దృఢవ్రతచర్యు లైనవారి¯ యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని¯ నామ్నాయ సంప్రదాయప్రవర్త¯ నము నెఱింగించుట కమర విద్యాతపో¯ వ్రత పరాయణులైన బ్రాహ్మణులను (160.1) వరుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ¯ గేల దండంబుఁ బూని గోపాలకుండు¯ బలసి గోవుల రక్షించు పగిది నీవు¯ నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర! (161) తలపోయ నవిదిత తత్త్వవిజ్ఞానుండ¯ నైన నాచేత సభాంతరమున¯ నతి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ¯ తాపరాధము హృదయంబు నందుఁ¯ దలఁపక సుజన నిందాదోషమున నధో¯ గతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ¯ గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార¯ మెఱిఁగి కావింప నే నెంతవాఁడ? (161.1) నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను¯ రూప కార్యంబుచేత నిరూఢమైన¯ తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక; ¯ క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!" (162) అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు. (163) మానిత శ్యామాయమాన శరీర దీ¯ ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ¯ గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ¯ శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ¯ లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున¯ వైజయంతీ ప్రభల్ వన్నెచూప¯ హాటకరత్న కిరీట కోటిప్రభల్¯ బాలార్క రుచులతో మేలమాడ (163.1) లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ ¯ బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ¯ భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప¯ నఖిలలోకైక గురుఁడు నారాయణుండు. (164) సలలిత శంఖ చక్ర జలజాత గదా శర చాప ఖడ్గ ని¯ ర్మల రుచులున్ సువర్ణ రుచిమన్మణి కంకణ ముద్రికా ప్రభా¯ వళులును దేజరిల్లు భుజవర్గ మనర్గళ కాంతియుక్తమై¯ విలసిత కర్ణికార పృథివీరుహముం బురుడింపఁ బిట్టుగన్. (165) సరసోదార సమంచిత¯ దరహాస విలోకనములఁ దగ లోకములం¯ బరితోషము నొందించుచుఁ¯ బరమోత్సవ మొప్ప విశ్వబంధుం డగుచున్. (166) మఱియును రాజహంస రుచిమద్భ్రమణీకృత తాలవృంత చా¯ మరములు వీవఁగా దివిజమానిను లచ్చసుధామరీచి వి¯ స్ఫురణ సితాతపత్ర రుచిపుంజము దిక్కులఁ బిక్కటిల్లఁగాఁ¯ గరివరదుండు వచ్చె సుభగస్తుతి వర్ణ సుపర్ణయానుఁడై.

దక్షాదుల శ్రీహరి స్తవంబు

(167) ఘనరుచి నట్లు వచ్చిన వికారవిదూరు ముకుందుఁ జూచి బో¯ రన నరవిందనందన పురందర చంద్రకళాధ రామృతా¯ శనముఖు లర్థి లేచి యతి సంభ్రమ మొప్ప నమో నమో దయా¯ వననిధయే యటంచు ననివారణ మ్రొక్కిరి భక్తియుక్తులై. (168) అట్లు కృతప్రణాములైన యనంతరంబ. (169) ఆ నళినాయతాక్షుని యనంత పరాక్రమ దుర్నిరీక్ష్య తే¯ జో నిహతస్వదీప్తు లగుచున్నుతిసేయ నశక్తులై భయ¯ గ్లాని వహించి బాష్పములు గ్రమ్మఁగ గద్గదకంఠులై తనుల్¯ మ్రానుపడంగ నవ్విభుని మన్ననఁ గైకొని యెట్టకేలకున్. (170) నిటలతట ఘటిత కరపుటులై యమ్మహాత్ముని యపార మహిమం బెఱిఁగి నుతియింప శక్తులుగాక యుండియుఁ, గృతానుగ్రహవిగ్రహుం డగుటం జేసి తమతమ మతులకు గోచరించిన కొలంది నుతియింపఁ దొడంగి; రందు గృహీతంబు లగు పూజాద్యుపచారంబులు గలిగి బ్రహ్మాదులకు జనకుండును, సునంద నందాది పరమభాగవతజన సేవితుండును, యజ్ఞేశ్వరుండును నగు భగవంతుని శరణ్యునింగాఁ దలంచి దక్షుం డిట్లనియె; “దేవా! నీవు స్వస్వరూపంబునం దున్న యప్పు డుపరతంబులుగాని రాగాద్యఖిలబుద్ధ్యవస్థలచే విముక్తుండవును, నద్వితీయుండవును, జిద్రూపకుండవును, భయరహితుండవును నై మాయం దిరస్కరించి మఱియు నా మాయ ననుసరించుచు లీలామానుషరూపంబుల నంగీకరించి స్వతంత్రుండ వయ్యును, మాయా పరతంత్రుడవై రాగాది యుక్తుండునుం బోలె రామకృష్ణాద్యవతారంబులఁ గానంబడుచుందువు; కావున నీ లోకంబులకు నీవ యీశ్వరుండవనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయా విభూతు లగుటం జేసి లోకంబులకు నీశ్వరులుగా రనియును భేదదృష్టి గల నన్ను రక్షింపుము; ఈ విశ్వకారణు లైన ఫాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకల చరాచర జంతువులును నీవ; భవద్వ్యతిరిక్తంబు జగంబున లే"దని విన్నవించినం దదనంతరంబ ఋత్విగ్గణంబు లిట్లనిరి. (171) "వామదేవుని శాపవశమునఁ జేసి క¯ ర్మానువర్తులము మే మైన కతన¯ బలసి వేదప్రతిపాద్య ధర్మోపల¯ క్ష్యంబైన యట్టి మఖంబునందు¯ దీపింప నింద్రాది దేవతా కలిత రూ¯ పవ్యాజమునఁ బొంది పరఁగ నిన్ను¯ యజ్ఞస్వరూపుండ వని కాని కేవల¯ నిర్గుణుండవు నిత్యనిర్మలుఁడవు (171.1) నరయ ననవద్యమూర్తివి యైన నీదు¯ లలిత తత్త్వస్వరూపంబుఁ దెలియఁజాల¯ మయ్య మాధవ! గోవింద! హరి! ముకుంద! ¯ చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార!" (172) సదస్యు లిట్లనిరి. (173) "శోకదావాగ్ని శిఖాకులితంబు పృ¯ థుక్లేశ ఘన దుర్గదుర్గమంబు¯ దండధరక్రూర కుండలిశ్లిష్టంబు¯ పాపకర్మవ్యాఘ్ర పరివృతంబు¯ గురు సుఖ దుఃఖ కాకోలపూరిత గర్త¯ మగుచు ననాశ్రయ మైన యట్టి¯ సంసార మార్గ సంచారులై మృగతృష్ణి¯ కలఁ బోలు విషయ సంఘము నహమ్మ (173.1) మేతి హేతుక దేహ నికేతనములు¯ నయి మహాభారవహు లైన యట్టి మూఢ¯ జనము లేనాఁట మీ పదాబ్జములు గానఁ¯ జాలు వారలు? భక్తప్రసన్న! దేవ!" (174) రుద్రుం డిట్లనియె. (175) "వరద! నిరీహ యోగిజన వర్గసు పూజిత! నీ పదాబ్జముల్¯ నిరతము నంతరంగమున నిల్పి భవత్సదనుగ్రహాదిక¯ స్ఫురణఁ దనర్చు నన్ను నతిమూఢు లవిద్యులు మున్నమంగళా¯ వరణుఁ డటంచుఁ బల్కిన భవన్మతి నే గణియింప నచ్యుతా!" (176) భృగుం డిట్లనియె. (177) "అరవిందోదర! తావకీన ఘన మాయామోహితస్వాంతులై¯ పరమంబైన భవన్మహామహిమముం బాటించి కానంగ నో¯ పరు బ్రహ్మాది శరీరు లజ్ఞులయి; యో పద్మాక్ష! భక్తార్తిసం¯ హరణాలోకన! నన్నుఁ గావఁదగు నిత్యానందసంధాయివై." (178) బ్రహ్మ యిట్లనియె. (179) "తవిలి పదార్థభేదగ్రాహకము లైన¯ చక్షురింద్రియముల సరవిఁ జూడఁ¯ గలుగు నీ రూపంబు గడఁగి మాయామయం¯ బగు; నసద్వ్యతిరిక్త మగుచు మఱియు ¯ జ్ఞానార్థ కారణ సత్త్వాది గుణముల¯ కాశ్రయభూతమై యలరుచున్న¯ నిరుపమాకారంబు నీకు విలక్షణ¯ మై యుండు ననుచు నే నాత్మఁ దలఁతు (179.1) నిర్వికార! నిరంజన! నిష్కళంక! ¯ నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ! ¯ విశ్వసంబోధ్య! నిరవద్య! వేదవేద్య! ¯ ప్రవిమలానంద! సంసారభయవిదూర! (180) ఇంద్రుఁ డిట్లనియె. (181) "దితి సంతాన వినాశ సాధన సముద్దీప్తాష్ట బాహా సమ¯ న్వితమై యోగిమనోనురాగ పదమై వెల్గొందు నీ దేహ మా¯ యత మైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూతముం గామి శా¯ శ్వతముంగా మదిలోఁ దలంతు హరి! దేవా! దైవచూడామణీ!" (182) ఋత్విక్పత్ను లిట్లనిరి. (183) "కడఁగి భవత్పదార్చనకుఁ గా నిటు దక్షునిచే రచింపఁగాఁ¯ బడి శితికంఠరోషమున భస్మము నొంది పరేతభూమియై¯ చెడి కడు శాంతమేధమునఁ జెన్నఱియున్న మఖంబుఁ జూడు మే¯ ర్పడ జలజాభ నేత్రములఁ బావన మై విలసిల్లు నచ్యుతా!" (184) ఋషు లిట్లనిరి. (185) "అనఘా! మాధవ! నీవు మావలెనె కర్మారంభివై యుండియున్¯ విను తత్కర్మ ఫలంబు నొంద; వితరుల్ విశ్వంబునన్ భూతికై¯ యనయంబున్ భజియించు నిందిర గరం బర్థిన్ నినుం జేరఁ గై¯ కొన; వే మందుము నీ చరిత్రమునకున్ గోవింద! పద్మోదరా!" (186) సిద్ధు లిట్లనిరి. (187) "హరి! భవ దుఃఖ భీషణ దవానల దగ్ధతృషార్త మన్మనో¯ ద్విరదము శోభితంబును బవిత్రము నైన భవత్కథా సుధా¯ సరి దవగాహనంబునను సంసృతి తాపము వాసి క్రమ్మఱం¯ దిరుగదు బ్రహ్మముం గనిన ధీరుని భంగిఁ బయోరుహోదరా!" (188) యజమాని యగు ప్రసూతి యిట్లనియె. (189) "కర చరణాదికాంగములు గల్గియు మస్తము లేని మొండెముం¯ బరువడి నొప్పకున్న గతిఁ బంకజలోచన! నీవు లేని య¯ ధ్వరము ప్రయాజులం గలిగి తద్దయు నొప్పక యున్న దీ యెడన్¯ హరి! యిటు నీదు రాక శుభ మయ్యె రమాధిప! మమ్ముఁ గావవే." (190) లోకపాలకు లిట్లనిరి. (191) "దేవాదిదేవ! యీ దృశ్యరూపంబగు¯ సుమహిత విశ్వంబుఁ జూచు ప్రత్య¯ గాత్మభూతుండ వై నట్టి నీవు నసత్ప్ర¯ కాశ రూపంబులై గలుగు మామ¯ కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ¯ నొందించి పంచభూతోపలక్షి¯ తంబగు దేహి విధంబునఁ గానంగఁ¯ బడుదువు గాని యేర్పడిన శుద్ధ (191.1) సత్త్వగుణ యుక్తమైన భాస్వత్స్వరూప¯ ధరుఁడవై కానఁబడవుగా? పరమపురుష! ¯ యవ్యయానంద! గోవింద! యట్లు గాక¯ యెనయ మా జీవనము లింక నేమి కలవు?" (192) యోగీశ్వరు లిట్లనిరి. (193) "విశ్వాత్మ! నీ యందు వేఱుగా జీవులఁ¯ గనఁ డెవ్వఁ; డటు వానికంటెఁ బ్రియుఁడు¯ నీకు లేఁ; డయినను నిఖిల విశ్వోద్భవ¯ స్థితి విలయంబుల కతన దైవ¯ సంగతి నిర్భిన్న సత్త్వాది గుణవిశి¯ ష్టాత్మీయ మాయచే నజ భవాది¯ వివిధ భేదము లొందుదువు స్వస్వరూపంబు¯ నం దుండుదువు; వినిహత విమోహి (193.1) వగుచు నుందువు గద; ని న్ననన్యభక్తి¯ భృత్యభావంబుఁ దాల్చి సంప్రీతిఁ గొల్చు¯ మమ్ము రక్షింపవే; కృపామయ! రమేశ! ¯ పుండరీకాక్ష! సంతతభువనరక్ష!" (194) శబ్దబ్రహ్మ యిట్లనియె. (195) "హరి! భవదీయ తత్త్వము సమంచితభక్తి నెఱుంగ నేను నా¯ సరసిజ సంభవాదులును జాలము; సత్త్వగుణాశ్రయుండవున్¯ బరుఁడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్డు నిం¯ దఱముఁ జతుర్విధార్థ ఫలదాయక! మ్రొక్కెద మాదరింపవే." (196) అగ్నిదేవుం డిట్లనియె. (197) "హవరక్షా చరణుండ వై నెగడు దీ; వయ్యగ్నిహోత్రాది పం¯ చవిధంబున్ మఱి మంత్రపంచక సుసృష్టంబై తగంబొల్చు నా¯ హవరూపం బగు నీకు మ్రొక్కెదను; నీ యాజ్ఞన్ భువిన్ హవ్యముల్¯ సవనవ్రాతములన్ వహింతు హరి! యుష్మత్తేజముం బూనుచున్." (198) దేవత లిట్లనిరి. (199) "మును కల్పాంతమునందుఁ గుక్షి నఖిలంబున్ దాఁచి యేకాకివై¯ జనలోకోపరి లోకవాసులును యుష్మత్తత్త్వమార్గంబు చిం¯ తనముం జేయఁ బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం¯ చిన నీ రూపము నేఁడు చూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా!" (200) గంధర్వు లిట్లనిరి. (201) "హర పంకేజభ వామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో¯ యరవిందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశ సంభూతులై¯ పరఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్; దేవ! యీ¯ శ్వర! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవాధీశ! రక్షింపుమా." (202) విద్యాధరు లిట్లనిరి. (203) "నళినాక్ష! విను; భవన్మాయా వశంబున¯ దేహంబుఁ దాల్చి తద్దేహమందు¯ నాత్మ నహమ్మ మేత్యభిమానమును బొంది¯ పుత్ర జాయా గృహ క్షేత్ర బంధు¯ ధన పశు ముఖ వస్తుతతుల సంయోగ వి¯ యోగ దుఃఖంబుల నొందుచుండు¯ ధృతి విహీనుఁడు నసద్విషయాతిలాలసుఁ¯ డతి దుష్టమతియు నై నట్టివాఁడు (203.1) దవిలి భవదీయ గుణ సత్కథా విలోలుఁ¯ డయ్యెనేనియు నాత్తమోహంబు వలనఁ¯ బాసి వర్తించు విజ్ఞానపరత దగిలి¯ చిరదయాకార! యిందిరాచిత్తచోర!" (204) బ్రాహ్మణజనంబు లిట్లనిరి "దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భాపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరియించు చందంబున రసాతలగత యైన భూమి నెత్తితి; వట్టి యోగిజనస్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునొందు; నట్టి నీకు నమస్కరింతుము." (205) అని తన్ను సకల జనములు¯ వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం¯ చిన యా దక్షుని యజ్ఞము¯ ఘనముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్. (206) సకలాత్ముఁడు దా నగుటను¯ సకల హవిర్భోక్త యయ్యు జలజాక్షుండుం¯ బ్రకటస్వభాగమున న¯ య్యకళంకుఁడు తృప్తిఁ బొంది యనె దక్షునితోన్. (207) “అనఘా! యేనును బ్రహ్మయు శివుండు నీ జగంబులకుఁ గారణభూతులము; అందు నీశ్వరుఁడును, నుపద్రష్టయు స్వయంప్రకాశుండు నైన నేను గుణమయం బయిన యాత్మీయ మాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్క్రియోచితంబు లయిన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందుచుండు; దట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుం డగువాడు వేఱుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేఱుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపఁడు; కావున మా మువ్వుర నెవ్వండు వేఱు చేయకుండు వాఁడు కృతార్థుం"డని యానతిచ్చిన దక్షుండును. (208) విని విష్ణు దేవతాకం¯ బనఁగాఁ ద్రికపాలకలిత మగు నా యాగం¯ బునఁ దగ నవ్విష్ణుని పద¯ వనజంబులు పూజ చేసి వారని భక్తిన్. (209) మఱియును. (210) అంగప్రధానక యాగంబులను జేసి¯ యమరుల రుద్రుని నర్థిఁ బూజ¯ చేసి విశిష్టేష్ట శిష్టభాగమున ను¯ దవసాన కర్మంబుఁ దవిలి తీర్చి¯ తాను ఋత్త్విక్కులుఁ దగ సోమపులఁ గూడి¯ యవభృథ స్నానంబు లాచరించి¯ కడఁక నవాప్త సకల ఫలకాముఁడై¯ తనరు దక్షునిఁ జూచి ధర్మబుద్ధి (210.1) గలిగి సుఖవృత్తి జీవింతుఁగాక యనుచుఁ¯ బలికి దివిజులు మునులును బ్రాహ్మణులును¯ జనిరి నిజమందిరముల; కా జలజనయన¯ భవులు వేంచేసి రాత్మీయ భవనములకు. (211) అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనక యందు జనియించి విలయకాలంబునం బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరించె నని దక్షాధ్వర ధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన యుద్ధవునకు నెఱింగించె; నతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పి;"తని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె. (212) "ఈ యాఖ్యానముఁ జదివిన¯ ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ¯ ర్యాయుః కీర్తులు గలుగును; ¯ బాయును దురితములు; దొలఁగు భవబంధంబుల్." (213) అని వెండియు నిట్లనియె. (214) "విను సనకాదులు నారదుఁ¯ డును హంసుఁడు నరుణియు ఋభుఁడు యతియుఁ గమలా¯ సనజులు నైష్ఠికు లనికే¯ తను లగుటన్ సాగవయ్యెఁ దద్వంశంబుల్. (215)


అధర్మ శాఖలు
¯ మఱియు నధర్మునకు ‘మృష’ యను భార్య యందు ‘దంభుండు’ను, ‘మాయ’ యను నంగనయుం బుట్టిరి; అధర్మ సంతానం బగుట వారిరువురును మిథునం బైరి; వారిని సంతాన హీనుండగు నిరృతి గైకొనియె; వారలకు ‘లోభుండును’ ‘నికృతి’ యను సతియునుం గలిగి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గ్రోధుండు’ ‘హింస’ యను నంగనయుం బుట్టి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గలి’యు ‘దురుక్తి’ యను నతివయుం జన్మించి దాంపత్యంబు గయికొనిరి; ఆ దంపతులకు ‘భయ’ ‘మృత్యువు’ లను మిథునంబు గలిగె; దాని వలన ‘యాతన’యు ‘నిరయంబు’ను బుట్టిరి; వీరలు సంసార హేతువగు నధర్మ తరుశాఖ లయి నెగడిరి; వీని శ్రేయస్కాముండగు జనుం డీషణ్మాత్రంబు ననువర్తింపం జన; దివ్విధంబునంబ్రతిసర్గంబును సంగ్రహంబున వినిపించితి; నిప్పుణ్యకథ నెవ్వండేని ముమ్మాఱు వినిన నతండు ముమ్మాటికి నిష్పాపుం డగును;"నని చెప్పి; మఱియు నిట్లనియె.

ధ్రువోపాఖ్యానము

(216) "విను నిఖిలభువన పరిపా¯ లనమునకై చంద్రధరకళా కలితుండై¯ వనజజునకు స్వాయంభువ¯ మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్. (217) రూఢి నమ్మనునకు శతరూపవలన¯ భూనుతు లగు ప్రియవ్రతోత్తానపాదు¯ లనఁగ నిద్దఱు పుత్రులై రందులోనఁ¯ భవ్య చారిత్రుఁ డుత్తానపాదునకును. (218) వినుము సునీతియు సురుచియు¯ నను భార్యలు గలరు; వారి యందును ధ్రువునిం¯ గనిన సునీతియు నప్రియ¯ యును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్. (219) ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు¯ నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న¯ కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడుకొని¯ యుపలాలనము చేయుచున్న వేళ¯ నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన¯ ధ్రువునిఁ గనుంగొని తివక నాద¯ రింపకుండుటకు గర్వించి యా సురుచియు¯ సవతి బిడ్డండైన ధ్రువునిఁ జూచి (219.1) "తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ¯ బూని నా గర్భమున నాఁడె పుట్ట కన్య¯ గర్భమునఁ బుట్టి కోరినఁ గలదె నేఁడు¯ జనకు తొడ నెక్కు భాగ్యంబు సవతి కొడుక! (220) అదిగాన నీ వధోక్షజు¯ పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా¯ యుదరమునఁ బుట్టఁ జేయును, ¯ వదలక యట్లయిన ముదము వఱలెడి నీకున్." (221) అని యీ రీతి నసహ్యవ¯ చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినగాఁ¯ దను నాడిన దుర్భాషా¯ ఘనశరములు మనము నాఁటి కాఱియపెట్టన్. (222) తను నట్లుపేక్ష చేసిన¯ జనకునికడఁ బాసి దుఃఖ జలనిధిలోనన్¯ మునుఁగుచును దండతాడిత¯ ఘనభుజగముఁబోలె రోషకలితుం డగుచున్, (223) ఘన రోదనంబు చేయుచుఁ¯ గనుఁగవలను శోకబాష్ప కణములు దొరఁగన్¯ జనని కడ కేగుటయు నిజ¯ తనయునిఁ గని యా సునీతి దద్దయుఁ బ్రేమన్. (224) తొడలపై నిడుకొని. (225) కర మనురక్తిని మోము ని¯ విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః¯ పురవాసులుఁ జెప్పిన విని¯ పఱపుగ నిట్టూర్పు లెసఁగ బా ష్పాకుల యై. (226) సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి¯ కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుందుచుండెఁ¯ దావపావక శిఖలచేఁ దగిలి కాంతి¯ వితతిఁ గందిన మాధవీలతికబోలె. (227) అంత నా సునీతి బాలునిం జూచి "తండ్రీ! దుఃఖింపకు"మని యిట్లనియె. (228) "అనఘా! యీ దుఃఖమునకుఁ¯ బనిలే దన్యులకు సొలయ బలవంతంబై¯ తన పూర్వ జన్మ దుష్కృత¯ ఘనకర్మము వెంటనంటఁగా నెవ్వలనన్. (229) కావున. (230) పెనిమిటి చేతను బెండ్లా¯ మని కాదు నికృష్టదాసి యనియును బిలువం¯ గను జాలని దుర్భగురా¯ లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్. (231) నిను నాడిన యా సురుచి వ¯ చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం¯ డనఁగల హరిచరణంబులు¯ గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్. (232) కావునం బినతల్లి యైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపుము"అని వెండియు నిట్లనియె. (233) "పరికింప నీ విశ్వపరిపాలనమునకై¯ యర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి¯ నారాయణుని పాదనళినముల్ సేవించి¯ తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె; ¯ ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర¯ యామిత్వ మగు నేకమైన దృష్టిఁ¯ జేసి యాగముల యజించి తా భౌమ సు¯ ఖములను దివ్యసుఖముల మోక్ష (233.1) సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని¯ వితత యోగీంద్ర నికర గవేష్యమాణ¯ చరణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు¯ భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని. (234) మఱియును. (235) కరతల గృహీత లీలాం¯ బురుహ యగుచుఁ బద్మగర్భముఖ గీర్వాణుల్¯ పరికింపం గల లక్ష్మీ¯ తరుణీమణిచేత వెదకఁ దగు పరమేశున్.